Tuesday, April 13, 2010

మా ఊరి కధ





రాజమహేంద్రవరం ఆంగ్లేయుల కాలంలో రాజమండ్రిగా రూపాంతం చెందింది.
ఒక నాడు వేంగి చాళుక్యుల రాజధాని నగరంగా వెలిగి రాజరాజనరేంద్రుని
పాలనలో కళలకు పుట్టినిల్లుగా కీర్తిని పొందింది. కవిసార్వభౌమ్యుడు శ్రీనాధుడు
ఈ నగరంలో కొంతకాలం నివాసముండి తన సారస్వత కార్యక్రమాన్ని కొనసాగించాడు.
వేదశాస్త్రాలకు,కళాకారులకు జన్మస్తానమిది. శ్రీనాధుడు ఈ నగరాన్ని కొనియాడుతూ
పద్యాలు వ్రాసాడు. రాజులూ,వారి రాజ్యాలకే కాకుండా సంఘసంస్కరణలకు ఇది
జన్మభూమి. కందుకూరి వీరేశలింగం సాంఘిక దురాచారలను ఎదురించి కొత్త శకానికి
మార్గాలను చూపించింది ఇక్కడనే. ఆది కవి నన్నయ భారత రచన చేసింది ఈ నగరంలోనే!
సర్ ఆర్ధర్ కాటన్ గోదావరికి ఆనకట్టను ధవళేశ్వరం వద్ద నిర్మించాడు. దామెర్లరామారావు
లాంటి గొప్ప చిత్రకారులు,స్వాతంత్ర సమరంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ పద్యాలు వ్రాసిన
చిలకమర్తి, నిన్న మనం చెప్పుకున్న కాశీమజిలీ కధలను తెలుగుదేశానికి అందించిన
సుబ్బయ్య దీక్శితులు ఇక్కడివారే! ప్రఖ్యాత కధకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి,కవికొండల
వెంకటరావు,’హాస్యబ్రహ్మ’ భమిడిపాటి కామేశ్వరరావు, రాజమండ్రి నగరానికి ఎనలేని
ఖ్యాతిని తెచ్చారు. ప్రఖ్యాత సంగీత విద్వాంశులు యమ్మెస్.సుబ్రహ్మణ్య శర్మ, మ్రుదంగ
విద్వాంసులు కమలాకరరావు ఈ నగరం వారే. మొట్టమొదటి సారిగా గోదావరి అందాలను
తన ’మూగమనసులు’ చిత్రమ్ ద్వారా పూర్తి ఔట్ డోర్లో చూపించిన ఆదుర్తి ఈ ఊరి వాడే.
గత పుష్కరాలకు "ఆనాటి" ప్రభుత్వం రాజమండ్రికి ఎన్నో కొత్త అందాలను కూర్చింది. గౌతమీ
ఘాట్లో దేవాలయ సముదాయానికి అవకాశం కల్పించింది. ఇస్కాన్ అతి పెద్ద శ్రి క్రిష్ణ దేవాలయాన్ని
నిర్మించింది. అంతే కాదు వ్యాపారానికి,ముఖ్యంగా వస్త్రవ్యాపారానికి ప్రసిద్ధి. ఈనాడు రాష్త్ర వ్యాప్తంగా
విస్తరించిన బొమ్మన,చందన వ్యపార సంస్తలు ఇక్కడివే !
ఆరుద్ర ఈ నగరం గురించి ఇలా అనారు--
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంగా శోబిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం

No comments:

Post a Comment