Tuesday, April 20, 2010

"హాస్యబ్రహ్మ" శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు



’హాస్యబ్రహ్మ’ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు 1897 ఏప్రియల్ ౩౦వ తేదిన
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు లో జన్మించారు. బి.ఏ గణిత శాస్త్రం చదివి రాజమండ్రి
కందుకూరి వీరేశలింగం హైస్కూల్లో లెక్కల మాస్టారుగా,ప్రధానోపాధ్యాయుడిగా పని
చేసి 1953 లో ఉద్యోగవిరమణ చేశారు. ఎన్నో హాస్య రచనలు, నాటకాలే కాకుండా
ఆంధ్రనాటక పద్య పఠనం,త్యాగరాజు ఆత్మవిచారం మొదలైన పరిశోదాత్మక రచనలు
చేసారు. ఆయన తన రచనల్లో సగటు మనిషిలోని మోతాదుకుమించిన ఈర్ష్య,అవినీతి ,
దురాశ,భోజన ప్రియత్వం వంటి చెడ్డ అలవాట్లను హాస్యాన్ని జోడించి సున్నితంగా
వ్రాసారు. తాము తెలుగువాళ్ళైనా తాము తెలుగు వాళ్ళమే కానట్లు మాట్లాడే కొంతమంది
వింతపోకడలను తన రచనల్లో ఎత్తి చూపి కనువిప్పు కలిగించారు. ఆయన కలం నుంచి
వెలువడిన ’ఎప్పుడూ ఇంతే’, ’కచటతపలు’, ’పెళ్ళి ట్రైనింగు’,’ఘటన’,’బాగు బాగు’,
’అన్నీ తగాదాలే’,’అప్పుడూ ఇప్పుడూ’,’కాలక్షేపం’,’గుసగుసల పెళ్ళి’వంటి హాస్య
రచనలు చేసారు.మాలియర్, మేటర్లింక్ మొదలైనవారి నాటకాలను తెలుగులోనికి
అనువందించారు. ఈసప్ కధలు,టాల్స్టాయ్ కధలు అనువందించారు. ఐదువేల ఏళ్ళ
కాలెండరును సృష్టించిన ,ప్రఖ్యాత సినీ,నాటక రచయిత భమిడిపాటి రాధాకృష్ణ ఈయన
కుమారులు.
కామేశ్వరరావుగారి హస్య చతురతకు మచ్చుతునక ఆయన హాస్య నాటిక’బాగు
బాగు’లోని తమాషా సంఘటన :
’బాగు బాగు’ లో భోగయ్య అనే పాత్రకు ఉత్తరం వస్తుంది.చింతామణి చదివాడు.
" ఈ మధ్య మా పిల్లకి జ్వరము వచ్చిపోయినది........"
శాంతమ్మ గొల్లుమని ఏడిచింది. " మా పిల్లే మా పిల్లే ! మంచివాళ్ళు బతకర్రా !
మంచిగా వుండకే అమ్మా అంటే వింది గాదండోయ్ ! బంగారు బ్బొమ్మ కూరొండితే
ఒక్కతికే సరిపోయేదిగాదు."
చింతామణి : - మీరు పొరబడుతున్నారు.ఇక్కడ పిల్ల -’ కి ’ష స్ఠీ విభక్తి.జ్వరము
ప్రధమా విభక్తి. జ్వరమే కర్త.పోయిందీ జ్వరమే. పిల్ల కాదు..
* * * * * * * * * *
అలానే "ఎప్పుడూ ఇంతే" నాటకంలోని మరో మచ్చుతునక !
పానకాలు సావిట్లో కూచుని ఉండగా పర్వతాలు గొల్లున ఏడుస్తూ పరుగున వచ్చాడు.
పాన :_ అదేమిటిరా - ఏమొచ్చి పడిందిరా?
పర్వ :_ పానకాలూ - ఓ పానకాలూ
పాన : _ చెప్పరా - ఎందుకు శోకాలు
పర్వ :_ మొన్నీ మధ్యనేరా_
పాన : _ ఆ ! ఏవిటేమిటీ ? ఎప్పుడు పోయాడూ_
పర్వ :_ ఒకడు కాదురా -చాలా మందిరా.
పాన : _ ఆ ! ఎలారా ! ఏమయ్యార్రా ? పడవ గల్లంతా? లారీ బోల్తావా? ఎందరు చచ్చార్రా?
పర్వ : _ చావులు కాదురా _ గొప్పవాళ్ళయి పోయార్రా_
పాన్ :_ హూ
పర్వ:_ పైకొచ్చార్రా
పాన : _ ఇంతకీ నీ ఏడుపేమిటి ? మనం కూడా పైకి రాలేదనేగా
పర్వ :- కాదురా
పాన:- మరి ?
aపర్వ :- వాళ్ళు పైకొచ్చేస్తున్నారనేరా-
ఇలా మానవ బలహీనతలను తన నాటకాల్లో సున్నితంగా ఎత్తి చూపారు శ్రీ భమిడిపాటి..
ఆంధ్ర పాఠకుల్ని తన రచనలతో నవ్వించిన ఈ "హాస్యబ్రహ్మ" 28 -8-1958 రాజమండ్రిలో
పరమందించారు. ఆయన రచనలను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ఏడు సంపుటాలుగా
ఈతరం వారికి పరిచయం చేస్తున్నారు.

3 comments:

  1. ఆ ఏడు సంపుటాలలో ఒకటి మాత్రమే బయటకు వచ్చింది, అది నెను ఈ మధ్యనే బెంగుళూరు పుస్తకాల ప్రదర్శనలో కొన్నాను. మిగిలిన ఆరు సంపుటాలు కూడ బయటకు వచ్చినాయా, వివరాలు తెలియచేయగలరు.

    ఆసక్తి గలవారు శ్రీ భమిడిపాటి వారి పుస్తకాలలో కొన్నిటిని (పాత కాపీలు) ఈ కింది లింకులనుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు


    http://www.archive.org/details/lokobhinnarichi021012mbp
    http://www.archive.org/details/MayalaMaaLokam
    http://www.archive.org/details/manatelugu021183mbp
    http://www.archive.org/details/mejuvani021410mbp
    http://www.archive.org/details/matavarasa021316mbp
    http://www.archive.org/details/kalakshapam2020570mbp

    ReplyDelete
  2. ' సురేఖ ' గారూ !
    హాస్యబ్రహ్మ భమిడిపాటి వారి గురించి, ఆయన హాస్యగుళికల్ని చక్కగా అందించారు. ఒక చిన్న సవరణ. కామేశ్వరరావు గారి జన్మదినం ఏప్రిల్ 28, 1897. గమనించగలరు. వికిపీడీయా లో చూడండి.

    ReplyDelete