Saturday, April 24, 2010

యాడ్స్ ! యాడ్స్ !! యాడ్స్ !!!




ప్రకటనలు ! ప్రకటనలు !
ఈ రోజు పత్రికలలోను, టీవీ, రేడియోలలో ,రోడ్డు పై పెద్ద పెద్ద హోర్డింగులలోను
మనకు ప్రకటనలు అడుగడుగునా అగుపిస్తున్నాయి. ఇక సినిమాలహాళ్ళలో
సినిమాకు ముందర చూస్తున్నాం. ఇలా వ్యాపార ప్రకటనలు ఓ పత్రికలో మనం
చూసినప్పుడు మేటర్ తక్కువ యాడ్స్ ఎక్కువ అని అనుకుంటుంటాము.
ఎక్కువ మంది చదివే పత్రికలకు ఈ ప్రకటనలు ఎక్కువగా వుండటం సహజమే.
ఆ మాటకు వస్తే పత్రికల మనుగడకు ప్రకటనలే మూలాధారం అన్నది నూరు
పాళ్ళ నిజం. పూర్వానికి ఇప్పటికి పత్రికలలో వచ్చే ప్రకటనలకు మనకు చాలా
తేడా అగుపిస్తుంది. ముద్రణలో వచ్చిన సాంకేతిక మార్పులు ,ప్రజలలో కలిగిన
వివిధ వస్తువులపై వస్తున్న ఆకర్షణ, వ్యాపారంలో పెరిగిన పోటీ దీనికి తప్పని
కారణాలు. ఈ పేజీలో మీరు చూస్తున్న లక్స్ సబ్బు ప్రకటన 1954 ఆంధ్ర సచిత్ర
వార పత్రిక దసరా సంచికలోనిది. అదే లక్స్ సబ్బుకు ఈనాటి ప్రకటన మీరు చూసే
ఉంటారు. ఓ వయలెట్ రంగు కమలంలో వయ్యారంగా పడుకుని కవ్విస్తున్న కత్రినా
కైఫ్ అగుపిస్తుంది.! కానీ విచిత్ర మేమిటంటే కొన్ని ప్రకటనలు మరీ అసంధర్భంగా
సెక్సీగా వుంటున్నాయి. ముఖ్యంగా టీవీల్లొ వచ్చే ప్రకటనలను చూసే చిన్నారులు
"అవి" ఏమిటని అడిగినప్పుడు జవాబు చెప్పటానికి అమ్మలూ నాన్నలూ పడే ఇబ్బంది
కొందరికైనా అనుభవం అయివుంటుంది. అన్ని ప్రకటనలు బాగుండటం లేదనీ చెప్పలేం.
కొన్ని ప్రకటనలు కళాత్మకంగా ఆలోచింపజేసేవిగా కూడా వుంటాయి. ఓ కేబుల్ (వైర్)
కంపెనీ ప్రకటనలో తల్లి కట్టెల పొయ్యి మీద రోటీలు చేస్తూ చేత్తో ఆ వేడి రోటీలను
కదుపుటుండటం చూసిన కొడుకు అక్కడే వున్న వైరును పటకారులా వంచి తల్లికి
ఇస్తాడు.తల్లి ముఖంలో తన పిల్లవాడి తెలివికి, ఆప్యాయతకీ ఓవెలుగు కనిపిస్తుంది.
అలానే మా స్టేట్ బ్యాంక్ ఇటివల తమ ప్రకటనలలో భారతదేశ ప్రముఖుల బొమ్మలు
వేసి ,వీరంతా మా కస్టమర్సు అంటూ ప్రకటనలు ఇచ్చింది. ఇక సెల్ ఫోన్ ప్రకటనలు
బాగుంటున్నా కొన్ని మాత్రం యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయి. ఓ ప్రకటనలో
"టక్ అండ్ వాక్ " అంటూ ప్రచారం చెయ్యడం ఎంతవరకు సమంజసం ! ఈ మధ్య ఏ టీవీ
చానల్ పెట్టినా "దేముడి తాయెత్తులు", "దిష్టి తాయెత్తులు" అంటూ ఊదరగొడుతున్నారు.
అవికూడా ఖరీదు చూస్తే వేలకు వేలు! ఇవన్నీ ప్రజల బలహీనతల మీద సొమ్ము చేసుకొనేవే.
మాయ బాబాలు, తాయెత్తులూ-మంత్రాలూ అంటూ ప్రతి న్యూస్లోనూ చూపించే ఈ చానళ్ళు
ఇలాటి మోసపూరిత ప్రకటనలకు ఎందుకు చోటు కల్పిస్తున్నారో ? ! ఇక ఆడవాళ్ళను ,ఆ
ప్రకటనలో వచ్చే వస్తువుకు సంభంధం లేక పోయినా ప్రముఖంగా చూపిస్తారు. మొగవాళ్ళ
లో దుస్తుల ప్రకటనలలో మనకు ఈ వికృత చేష్టలు కనిపిస్తాయి ! ప్రతి పత్రికకు, టీవీలకు
ప్రకటనలు తమ మనుగడకు తప్పక వుండితీరాలి.. కాని అవి ప్రజలకు చెడు చేసేవిగా వుండ
కుండా చూడాలి. అన్నిటికన్నా ప్రమాదకరమైనవి రోడ్డు కూడలిలో ఉన్న ప్రకటనల హోర్డింగ్స్.
వేగంగా డ్రైవ్ చేస్తూ వాటివేపు చూస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.! నాకు ఇటీవల బాగా
నచ్చిన యాడ్ ’బిగ్ బబూల్". అందులో కాకి అబ్బాయిపై రెట్ట వేసి గర్వంగా చెయ్యి గుప్పిలి
బిగించడం, తరువాత అబ్బాయి పేస్ట్ మీద వేస్తే కాకి తల కొమ్మకు కొట్టుకోవడం చాలా తమాషాగా
వుంది.

No comments:

Post a Comment