Tuesday, August 31, 2010

నేడు ప్రాసానంద మహర్షి ఆరుద్ర జయంతి



ప్రాసానంద మహర్షి ఆరుద్ర
ఆంధ్రుల అభిమాన రచయిత ఆరుద్ర !
ఆయన కూనలమ్మపదాలు అభిమానులపై వేశాయి చెరగని ముద్ర !
ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు
అలరించాయి పాఠకుల హృదయ సామ్రాజ్యాలు !!
భాగవతుల శివ శంకర శాస్త్రి అనే ఆరుద్ర 1925 ఆగష్టు 31 వ తేదీన
విశాఖపట్టణంలో జన్మించారు. కవితలే కాదు, అపరాధ పరిశోధన కధలు
నవలలు, రాముడికి సీత ఏమవుతుంది లాటి విమర్శనా గ్రంధాలు వ్రాసారు.
ఆయన కలం నుంచి జాలువారిన కూనలమ్మ పదాలు, అమెరికా ఇంటింటి
పజ్యాలు పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి. విజయవాడలో బాపు,
రమణ, నండూరి రామ్మోహనరావు, రావి కొండలరావు, లతో కలసి "జ్యోతి"
మాస పత్రికకు సారధ్యం వహిస్తూ ఆయన కూనలమ్మపదాలు వ్రాసారు.
కూనలమ్మ పదాలు '64లో పుస్తకరూపంలో వెలువడినప్పుడు శ్రీ ముళ్లపూడి
కి పెళ్ళి కానుకగా అందించారు.
తాగుచుండే బుడ్డి
తరగుచుండే కొద్ది
మెదడు మేయును గడ్డి
ఓ కూనలమ్మా
******
మితృడు బాపుని,
" కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె వుయ్యెల నూపు
ఓ కూనలమ్మా" అంటూ పలకిరించారు.
ఇక ఆయన వ్రాసిన అమెరికా ఇంటింటి పజ్యాలలో అమెరికాలో వున్నా
తెలుగు వాళ్ళకు ఐకమత్యం వుండదని చెబుతూ ఇలా వ్రాసారు !
అట్టేకాలం నిలిచేది కాదు ఆంధ్రులలో ఐకమత్యం
ఇట్టే ఋజువు చేయవచ్చునంటారు ఇందులో సత్యం
ఇద్దరు తెలుగువాళ్ళున్నచోట మూడు సంఘాలు
విడివిడిగా ఉండాలి వాళ్ళవాళ్ళ రంగాలు
ఒకటి సాగుతూ ఉంటే సవ్యంగా
ఇంకోటి పుట్టుకు రావాలి నవ్యంగా
అధికస్య అధికం ఫలం
అందరూ ఎక్కొచ్చు అందలం
ఆయన వ్రాసిన మంచి సినిమా పాటల్లో ఎన్నని చెప్పగలం?
ఉయ్యాల జంపాల చిత్రం లోని ఈ పాట సాహిత్యం చూడండి.

కొండగాలి తిరిగింది గుండె వూసు లాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది "
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది "
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది
నాగమల్లె పూలతో నల్లని జడ నవ్వింది "
పడుచు దనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవసాగి పోయింది "
ప్రేమికుల గుండెల లోతులను తెలిసిన వారు శ్రీ ఆరుద్ర.. ఆత్మగౌరవం
సినిమాలో "ప్రేమించి పెళ్ళి చేసుకో-నీ మనసంతా హాయి నింపుకో"
అనే పాటతో ప్రేమ వివాహాలను ప్రోత్సహించారు ఇలా ఎన్నేన్నో!
ఆరుద్ర సహిత్యలోకంలో చిరంజీవి. ఈనాడు అయన 85వ జయంతి!
* * * * * * *
ఆరుద్రా
శక్తి సముద్రా!
చైతన్యానికి వ్రాలుముద్రా!
సాహిత్య ఋషి
నీ కలం పేరు కృషి
నీ బలం పేరు కుషి
జోహార్
వ్యాసానందా
వాక్యాక్షర శబ్ద భావ-వి-న్యాసానందా
ప్రాసానందా
అంత్య ప్రాసాంతకానందా
జోహార్...........శ్రీ బాపు రమణ

1 comment:

  1. ఆరుద్ర గారి గురించి తల్చుకోవటం అంటే,ఒక "కొండ గాలి తిరిగింది", ఒక "ఏటి లోని కెరటాలు" ఇలా ఎన్నో.

    సమగ్రాంద్ర సాహిత్యం వ్రాయగలిగిన ధీశాలి సినిమా పాట వ్రాస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి ఆ పాటలు.

    మీ ప్రయత్నం అద్భుతం. క్రుతఙ్ఞతలు.

    ReplyDelete