Monday, July 11, 2011

టూకీగా కొన్ని టాకీ కబుర్లు

ఇప్పుడు సినిమాలు రంగులు హంగులు వేసుకొని వచ్చాయి కానీ ఆ రోజుల్లో పాపం
సినిమాలకు మాటలే రా(లే)వు. తరువాత అలంఅరా సినిమా టాకీగా విడుదలయితే
జనం వింతగా విరగబడి చూశారు. అప్పుడు పర్మినెంటు ధియేటర్లు ఉండేవికావు.
అన్నీ తాత్కాలిక టెంటు సినిమాలే. టాకీలు వచ్చాక అవి ఆడి పాడే సినిమా హాళ్ళకు
"టాకీస్" లని పిలిచేవారు. తరువాత కాలంలో సినిమా హాళ్లకు టాకీస్ అని చేర్చటం పోయి
ఫలానా మహల్ అని, మందిర్లనీ పేర్లొచ్చాయి. ఇప్పుడేమోఅన్నీ మల్టీ ప్లెక్స్లూ, కాంప్లెక్సులూ!
మన దేశంలో మొట్టమొదటి మూకీ సినిమా 1913లో డి.జీ.ఫాల్కే నిర్మించారు.
ఇక దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా మూకీ తీసిన నిర్మాత నటరాజ మొదలియార్.
ఇండియాలో మొట్టమొదటి సినిమా ధియేటర్ "ఎలిఫిన్టన్ పిక్చర్ ప్యాలెస్" 1929లో
కలకత్తాలో నిర్మించారు. బొంబాయి ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ, ఖాన్ బహదూర్ అర్దేషిర్
ఇరానీ 1931లో మొదటి సారిగా "అలంఅరా" అనే హిందీ చిత్రం నిర్మించారు. పూర్తి వర్ణ
చిత్రం కూడా ఇరానీయే 1938 లో "కిసాన్ కన్య" నిర్మించారు. 1949వ సంవత్సరంలో
జెమినీ స్టూడియోస్ అధినేత ఎస్.ఎస్.వాసన్ "చంద్రలేఖ" చిత్రాన్ని హిందీలో నిర్మించారు!
దానితో దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు అక్కడ ఒక స్థానం ఏర్పాటయింది.ఈ సినిమాలో
పెద్ద పెద్ద డ్రమ్స్ పై చిత్రీకరించిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకొనేవారు !!


1937లో వెనీస్ లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా "తుకారాం"
బహుమతి పొందింది. తెలుగుదేశంలో మొట్టమొదటి డిస్ట్రిబ్యూషన్ సంస్థను జికె.మంగరాజు
1934లో క్యాలిటి పిక్చర్స్ పేరిట ప్రారంభించారు. మద్రాసులో మొట్టమొడటి ధియేటర్లు
క్రౌన్, గైటీ,గ్లోబ్. వీటి అధిపతి ఆర్.వెంకయ్య. ఆంధ్రదేశంలో విజయవాడలో పి.శ్రీనివాసరావు
మారుతీ సినిమా నిర్మించారు. మొట్టమొదటి ఏ.సి ధియేటర్ మద్రాసులోని మినర్వా (1949).
అందరూ పిల్లలే నటించిన సినిమా "ధృవ, అనసూయ" సి.పుల్లయ్య 1937 లో నిర్మించారు.
1956లో మోడరన్ ధియేటర్స్ ఎమ్జీయార్,భానుమతులతో నిర్మించిన మొదటి పూర్తి గేవా
కలర్ చిత్రం " ఆలీబాబావుం,నాప్పదు తిరుడర్ గళుం"
ఎక్కువ కేంద్రాలలో విడుదలయిన మొదటి దక్షిణ భారత చిత్రం "ప్రపంచం". తెలుగు,
తమిళ భాషల్లో 1953లో 101 ధియేటర్లలో విడుదలచేశారు. దక్షిణ భారత దేశంలో లక్ష
రూపాయల పారితోషికం తీసుకొన్న మొదటి నటీమణి- కె.బి.సుందరాంబాళ్.(నందనార్
1935) . ఆంధ్రలో నిర్మించిన మొదటి ఫిల్మ్ స్టూడియో ఎక్కడో తెలుసా? రాజమండ్రిలో!
నిడమర్తి వారు దుర్గాసినీటోన్ పేరిట నిర్మించారు. అందులో సంపూర్ణ రామాయణం
నిర్మించబడింది. ఆ చిత్రంలో విశేష మేమిటంటే ఔట్ డోరులో షూటింగ్ జరిపినప్పుడు
దూరంగా గోదావరీ రైల్వే బ్రిడ్జి, దానిపై పోతున్న రైలు అగుపిస్తాయట !
చివరిగా ఓ జోకు !
మొదటి ఆట ముగియగానే జనం హాళ్ళోంచి బయటకు రాగానే జోరున వర్షం
మొదలయి ఎంతకీ తగ్గలేదు. జనం పిల్లా పాపలతో అలానే లోపలే నిలబడి
పోయారు. చివరికి ధియేటర్ మేనేజర్ "ఈవర్షం ఇప్పట్లో తగ్గేట్టు లేదు. లోపలికి
రండి. ఫ్రీగా మళ్ళీ సినిమా వేస్తాం" అన్నాడు. అంతటి జోరువానలోను జనం
బయటకు ఒక్కసారిగా పరిగెత్తారు.
ఆ సినిమా అంత ఘోరంగా వుందన్న మాట !!

4 comments:

  1. "...దూరంగా గోదావరీ రైల్వే బ్రిడ్జి, దానిపై పోతున్న రైలు అగుపిస్తాయట !..."

    అవును అప్పారావుగారూ. ఈ సినిమాని నేను ఫిలిం సొసైటీ పుణ్యామా అని విజయవాడలో 1990లలో చూశాను. అందులో మీరు చెప్పినట్టుగా రామాయణంలో రైల్వే బ్రిడ్జ్ కనబడుతుంది.

    Last joke is superb.

    ReplyDelete
  2. శివరామ ప్రసాద్ గారు, మీకు ఆనాటి సంపూర్ణరామాయణం చూసే అదృష్టం కలిగింది. కొన్ని పాత చిత్రాలు , గోవిందరాజుల సుబ్బారావు, అక్కినేని
    నటించిన పల్నాటి యుద్ధం సిడీలు దొరకటంలేదు. కొన్ని మంచి పాత చిత్రాల సిడిలు విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తె బాగుండును.ఎవరికి ఆ
    ఆశక్తి వుంటుంది?!

    ReplyDelete
  3. నిజమే అప్పారావుగారూ. అలనాటి ఆణిముత్యం "పల్నాటి యుద్ధం" కన్నాంబ నాగమ్మగా, బ్రహ్మనాయుడుగా గోవిందరాజుల సుబ్బారావు, బాలచంద్రుడుగా అక్కినేని. అద్భుత చిత్రం. ఆ సి డి కాని డి వి డి కాని దొరకటం లేదు. ఈ మధ్య ఒక ఫైలు దొరికింది కాని, బాగా నలిగిపోయిన రీళ్ల నుండి చేసిన కాపీ, చూసి పెద్దగా ఆనందించలేము. ఎప్పుడో దూరదర్శన్ వచ్చినప్పుడు చూడటమే. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, దూరదర్శన్ లో పాత సినిమాలు చక్కటి కాపీలు (చుక్కలు, గీతలు, కట్లు లేకుండా) సంపాయించి వేశేవారు. ఆ కాపీల నుండి డి వి డి లు చేసి అమ్మితే బాగుండును.

    ఏ పాత సినిమా సి డి కొనాలన్నా భయమే, ఏ పాట కట్ అయి ఉంటుందో, ఏ సన్నివేశం ఎగిరిపోయి ఉంటుంది, సినిమా అంతా గీతలు, ఆడియో ఘోరంగా ఉండటం (చక్రపాణి అలాగే ఉన్నది), బొమ్మ క్లియర్ గా లేకపోవటం వంటి వాటి గురించి తలుచుకుంటూ వణుకుతూ కొనటం,ఇంటికి తెచ్చి చూసి హతాశులవటం గా ఉన్నది మన పరిస్థితి .

    సినిమాల్లోకి వచ్చి ఎన్నో కోట్లు సంపాయించుకున్న పెద్దలు ఒక పదిమంది కలిసి తలా ఒక కోటి రూపాయలు నిదిగా కలిపి, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, వచ్చే వడ్డీతో, అలనాటి కళా ఖండాలన్నీ సంపాయించి ఇప్పటి తరాలకు, కళాఖండాలను సేకరించే వారికి అందుబాటులోకి (లాభం కాని నష్టం రాని పద్ధతిలో ధర ఉంచి) తీసుకు వస్తే బాగుండును.

    సినీ పెద్దలకు అటువంటి అభిరుచి కలిగించాలని దైవ ప్రార్ధన చెయ్యటం కన్నా మనం ఏమి చెయ్యగలం.

    ReplyDelete