అవునండీ ! నిఝం !! మన తెలుగు వాడు గీసి వ్రాసిన "మరపురాని మాణిక్యాలు"
పుస్తకానికి "ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ " గా ప్రశంస వచ్చింది ! ఆ గీతకారుడు,
రాతకారుడు మరెవరో కాదు! ప్రఖ్యాత కార్టూనిస్ట్ , "మిసెస్ అండర్ స్టాండింగ్"లాంటి
మంచి మంచి హాస్యరచనలు చేసిన, చేస్తున్న మిత్రులు శ్రీ బ్నిం. ఇటీవలే జరిగిన
బాపు బొమ్మల కొలువు ప్రత్యేక సంచిక ఆయన సంపాదకత్వంలో వెలువడింది.
ఈ మంచి పుస్తకం గురించి శ్రీ బ్నిం ఇలా అన్నారు"
" ఆర్టిస్టు మిత్రులు కేరికేచర్ ఆర్ట్ కి ఏవేవో గ్రామర్లు
చెప్తారు. నేనేసిన ఈ బొమ్మలు ఎవరి గ్రామరూ కాదేమో.
ఇవి కేరికేచర్లు కావు..భావ చిత్రాలే-
ఆ పెద్దవాళ్ళ ఫొటోని కూడా గుర్తుపట్టలేని
నేటి తరానికి ఓ జ్ఞాపకంగా ఈ పుస్తకం
రూపొందించాను.........."
ఇది నూరుపాళ్ళ నిజం ఇందులో మనం పొరబాటున మర్చిపోయిన ఎందరో
మాణిక్యాల చిత్రగీతలతో బాటు శ్రీబ్నిం గారు అందంగా భావగీతాలను
జోడించారు. ఆయన అన్నట్టు తెలుగు కూడా మర్చిపోయిన తెలుగు వాళ్ళ
కోసం ఇంగ్లీషు లో కూడా ఆ మహనీయుల గురించి ఇందులో వుంది
ఈ పుస్తక మాణిక్యానికి శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు తన అక్షర
చమత్కారాలతో ఆశీర్వాదాలందించడం మరో అలంకారం!ఆయన మాటల్లో
" మరపురాని మాణిక్యాలు ధగ ధగ లాడుతున్నాయి. ఎవరి గ్రామరూ
కాకపోవడమే "స్వయం ప్రకాశ" లక్షణం.
నిజానికి గ్రామరస్ గా వుండేవి-గ్లామరస్ గా వుండవు.
మీ చిత్రలేఖిని వేయి రేకల పూవై గుబాళించాలని
కోరుకుంటూ" ... దటీజ్ రమణగారు!!
మీ దగ్గర ఇంకా ఈ మరపురాని మాణిక్యాలు లేకపోతే ఈరోజే
తీసు"కొని" మీ స్వంతం చేసుకోండి.
శ్రీ బ్నిం గారికి అభిమానులందరి తరుఫున అభినందనలు!
No comments:
Post a Comment