Friday, July 22, 2011

( సరదా కధ) ఆయ్! బాబోయ్!!

అసలే అమావాస్యరాత్రి ! చినుకులు మొదలయ్యాయి. మొండిగా ఒంటరిగా బయలుదేరా!!
హైవేలో హటాత్తుగా స్కూటరు చెడిపోయింది.చుట్టూ కటిక చీకటి. మెరపు మెరిసినప్పుడు
గాలికి ఊగుతున్న చెట్లు జుట్టువిరబూసుకున్న దెయ్యాల్లా భయపెడుతూ అసలే తడిసిన
ఒళ్ళేమో విపరీతంగా వణుకు మొదలయింది. ఇంతలో మరో మెరుపు మెరిసిన కాంతిలో
దూరంగా ఓ ఇల్లు కనిపించింది. అంత భయంలోనూ ఏదో చెప్పలేని ధైర్యం వచ్చింది.స్కూటర్
లాగుకుంటూ ఆ ఇంటికి చేరాను.ఇక్కడ ఈ రాత్రి గడిపి పొద్దున్నే ఎలాగోలాగ ఇంటికి చేరొచ్చని
అనుకున్నాను. పెద్ద కాంపౌండులో దూరంగా పెద్ద ఇల్లు.ఇనుప గేటు తోసాను. హర్రర్ సినిమాల్లో
లాగ కిర్రు మని శబ్దం చేయకుండానే గేటు తెరుచుకుంది. ధైర్యం చేసి తలుపు తట్టాను.
"ఈ దారిని వస్తుంటే సడెన్గా స్కూటర్ ట్రబులిచ్చింది" అన్నాను.తలుపు తీసిన పెద్దాయనతో.
తలుపు తీయగానే ఆ హాలంతా దీపాలకాంతితో వెలిగి పోతున్నది. అంతా చీకటిగా గుయ్యారంగా
వున్నా ఇంట్లో మాత్రం దీపాలు వెలుగుతుండటం వింతగా తోచినా డబ్బున్న వాళ్ళకు ఇన్వర్టర్
వుండి వుంటుందిలే అని సమాధాన పర్చుకున్నాను.
"అలానా?! రండి రండి! విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళుదురుగాని, నేనూ ఇక్కడ ఒంటరి
గానే వుంటున్నా! ఈ రాత్రికి మీరు నాకు తోడన్నమాట! నా పేరు దయానందరావు" అన్నాడు
పెద్దగా నవ్వుతూ.
"ఊరికి ఇంత దూరంగా ఒంటరిగా లంకంత ఇంట్లో వుంటున్నారు! భయం వేయదా?"అన్నాను
భయ భయంగా.
"భలేవారే! ఎందుకండీ భయం?! ఇంత దూరంలో ఇల్లు కట్టుకున్నాను కాబట్టే మీ లాటి
అనుకోని అతిధులకు సాయం చేసే భాగ్యం కలుగుతున్నది.ఉండండి, ఓ కప్పు వేడి వేడి టీ త్రాగి
రిలాక్సవుదురుగాని" అన్నాడు.
" ధాంక్సండి! ఈ వయసులోనూ, ఒంటరిగా వుంటూ ఆరోగ్యంగా, హుషారుగా గాలిలో
తేలిపోతున్నట్లు నడుస్తున్నారు. మీరు మా "హాసంక్లబ్" కర్యక్రమాలకు క్రమం తప్పకుండా
వస్తుంటారనుకుంటా" అన్నాను గొప్పగా "హాసంక్లబ్" కూ నేనూ ఒక కన్వీనర్నని చెప్పుకో
వాలని, మా జోకులు వినటం వల్లే ఆయన ఇంత హుషారుగా వున్నాడని అనుకోవాలనీ..
" మళ్ళీ నన్నోసారి చంపేశారండోయ్! మీ "హాసంక్లబ్" ప్రారంభించి ఏడేళ్ళేగా అయింది!!
నేను మీలానే ఈ హైవేపై వస్తూ లారీ గుద్దేసి పదేళ్లక్రితమే పోయా" అన్నాడు హీహీ అని
నవ్వుతూ. అప్పుడే చూశా అతని నొట్లో రెండు కోరపళ్ళు!
ఉదయాన్నే చెట్టుక్రింద పడివున్న నాకు వేగంగా అటు ఇటూ తిరుగుతున్న బస్సులూ,
లారీల శబ్దంతోకొద్దిగా మెలుకవ వస్తున్నది. ఎవరో అంటున్నారు. "ఈ మధ్య ఎక్కడ చూసినా
తాగుబోతు వెధవలే! పొద్దున్నే పీకల్దాకా తాగేసునట్టున్నాడు.వళ్ళు తెలియకుండా ఈ బురదలో
పందిలా దొర్లుతున్నాడు" నాకనిపించింది. అంటే నే రాత్రి గడిపింది దయానందరావుతో
కాదు, దయ్యానంద రావుతో నన్నమాట అని !!
( మా "హాసం క్లబ్" కార్యక్రమాలలో మా ఎస్బీఐ మానేజర్ శ్రీ సుబ్బారావుగారితో నే వ్రాసి
వేసిన సరదా స్కిట్ కు కధారూపం !!)

No comments:

Post a Comment