అతడు గీసిన గీత బొమ్మై
అతడు పలికిన పలుకు పాటై
అతని హృదయములోని మెత్తన
అర్ధవత్కృతియై
అతడు చూపిన చూపు మెరుపై
అతడు తలచిన తలపు వెలుగై
అతని జీవికలోని తియ్యన
అమృత రసధినియై...
చిత్రకారుడు కవి అడవి బాపిరాజుగారి గురించి శ్రీ విశ్వనాధ
సత్యనారాయణగారు అన్న మాటలివి.
చిత్రకళలో, కవిత్వం, గీత రచన, నవలా రచన, కళాదర్శకత్వం
ఇలా అనేక రంగాలలో అసమాన ప్రజ్ఞను చాటిన ఆడవి బాపిరాజు,
పశ్చిమగోదావరిజిల్లా భీమవరానికి సమీపంలోని సారేపల్లి గ్రామంలో
అక్టోబరు 8, 1895లో క్రిష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.
ప్రాధమిక విద్యను భీమవరంలోను, ఉన్నత విద్యను నరసాపురం ,
రాజమండ్రిలోను పూర్తి చేశారు. అజంతా,హంపీ లాంటి కళాత్మక
ప్రదేశాలను సందర్శించి అక్కడి శిల్పకళను చూసి కళలపై ఆసక్తిని
పెంచుకొన్నారు.
తొలకరి,గోధూలి వంటి గేయాలు, ఏలేయాల,ఏలేయాల, వేపచెట్టు పూత
జూడు, కనులు గంటి-చనులు గంటి, రావోయి సిన్న వాడా-డూడూ
యెంకన్నా, ఉప్పొంగి పోయింది గోదావరి,దీపావళి,విశ్వరూపావళి,లేపాక్షి
బసవయ్య లేచి రావయ్య లాంటి ఎన్నో గేయాలు వ్రాసారు. కూల్డ్రే దొర,
ప్రమోద కుమార్ చటర్జీ శిష్యరికంలో చిత్రకళను నేర్చుకొని సంప్రదాయ
చిత్రకళలో ఆరితేరారు. విశ్వనాధవారి "కిన్నెరసానికి" ముఖచిత్రాన్ని,
చిత్రాలను గీశారు. సాహిత్య మాసపత్రిక "భారతి"లోను, ఆంధ్రపత్రిక
సంవత్సరాది సంచికలలోనూ అనేక చిత్రాలను వేశారు.ఆయన చిత్రాలలో
మాస్టర్ పీస్ అన తగ్గ చిత్రం "ధనుర్దాసు".శివుడు, శివపార్వతులు, కృష్ణుడు,
రాధాకృష్ణులు, రాముడు సముద్రునిపై ఆగ్రహంతో వింటిని సారించిన చిత్రం
ఇలా ఎన్నో చిత్రాలు డెన్మార్కులో సహితం పేరుగాంచాయి. నారాయణరావు,
గోన గన్నారెడ్డి,కోనంగి, హిమబిందు ,తుపాను వంటి రచనలు ఆయన
చిత్రాల లాగే ఆయన ప్రతిభను చాటాయి. ఆయన కొంతకాలం న్యాయ
వాదిగా, కొన్నాళ్ళు మచిలీపట్నం లోని జాతీయ కళాశాలలో ప్రిన్సిపాల్
గానూ పని చేశారు చిత్ర పరిశ్రమలో కళాదర్శకుడిగా, ధృవవిజయం, మీరా
బాయ్, అనసూయ చిత్రాలకు దర్శకుడిగానూ పనిచేశారు. 1952 లో
శ్రీ అడవి బాపిరాజు తనువు చాలించారు.
చాలా చక్కటి వ్యాసం రాశారు, అప్పారావు గారూ! ధన్యవాదాలు.
ReplyDeleteనా చిన్నప్పుడు, బహుశ 3-4 తరగతుల్లో ఉండగా అనుకుంటాను, మా తెలుగు వాచకంలో "ఉప్పొంగి పోయింది గోదావరి" గేయం చదువుకున్నాము. నాకు చాలా చాలా నచ్చిన గేయం అది. తర్వాత కూడా చాలా సంవత్సరాలు మొత్తం గుర్తుండేది. ప్రస్తుతం మాత్రం మొదటి రెండు పంక్తులే గుర్తున్నాయి...
ఉప్పొంగిపోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి...
చివరలో "శంకరాభరణ రాగాలాపకంఠియై...." అని వస్తుందని చూచాయిగా గుర్తు. దయచేసి ఆ గేయం మొత్తం మీ దగ్గర ఉంటే కాస్త పంపించగలరు.
భవదీయుడు,
వర్మ
వర్మగారు, ధన్యవాదాలు. నాదగ్గర బాపిరాజు గారి గేయాలు లేవు. ఆయన గేయాల పుస్తకం దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను.
ReplyDelete