Thursday, July 14, 2011

కదలని బొమ్మలు చెప్పే కదిలే బొమ్మల కధలు !

ఇందులో మాయేం లేదండి ! అంతా సినీ మాయ ! తెరపై కదలే బొమ్మలు నిజానికి
ఓ వరుసలో వున్న కదలని బొమ్మలే !మనం కన్నుమూసి తెరచేలోపల ఒక బొమ్మ
తరువాత మరొబొమ్మ వచ్చేస్తూ మన కన్నుల్ని మోసం చేయడమే సినిమా(వి) చిత్రం !

మన సినిమాలకు మాటలాడటం రానప్పుడు వాటిని మూకీలు అని పిల్చేవారు.1929
లో మూకీ చిత్రాలను ప్రదర్శిస్తూ, ఆ కధలు ప్రేక్షకులకు అర్ధమవడానికి-ధియేటర్లలో
హార్మోనియం, తబలాలతో కధకుల్ని ఏర్పాటు చేసేవారట! ఆనాటి సుప్రసిద్ధ అగ్రశ్రేణి
హాస్యనటుడు కస్తూరి శివరావు సినిమాల్లో నటుడిగా రావటానికి ముందు అలా కొన్ని
మూకీ చిత్రాలకుకధలు చెప్పేవాడట! మా చిన్నతనంలో హిందీ సినిమాలకు తెలుగు
అనువాదం ఓ వ్యక్తి పెద్ద గొంతుతో అరుస్తూ చెప్పేవాడు.


దర్శకులు శ్రీ సి.పుల్లయ్య 1930లో చిత్రప్రదర్శనలో ప్రవేశపెట్టిన మరో విధానం, విరామ
సమయంలో- బొంబాయినుంచి వచ్చిన నాట్యకత్తెలచే నాట్య ప్రదర్శన! అప్పుడు ఆర్క్
లైట్ల వేడిని ప్రొజక్టర్లు తట్టుకోడానికి విరామాలు ఎక్కువ వుండటం, ఈ ఏర్పాటుకు మరో
కారణం. ఇది అదనపు ఆకర్షణగా ఆనాటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది మొట్టమొదటి
టాకీ "అలంఅరా" దక్షిణాదిన ప్రదర్శించినప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరిగాయి. ఆ
సంఘటనలను 1956 లో ఇండియన్ టాకీ సిల్వర్ జుబిలీ వేడుకలలో "ఫిల్మ్ ఫెడరేషన్
ఆఫ్ ఇండియా" వారు ప్రచురించిన సావనీర్ లో వ్యాస రూపంలో ప్రచురించారు.ఆ టూరింగ్
టాకీ బృందంలో ఆపరేటరు,మేనేజరు, అసిస్టెంట్, వాళ్ళ సొంత సామానుకాక, ప్రొజెక్టరు,
ఆంప్లిఫయరు,స్పీకరూ ఉండేవి. ఆ టూరింగు టాకీస్ పేరు "సెలెక్ట్ టూరింగ్ టాకీస్" మాట్లాడే
సినిమా చూపిస్తున్న వీరికి ప్రజలే కాకుండా రైల్వే వారు కూడా సదుపాయాలు కలగజేసే
వారు. ఇంటర్ క్లాసు కొనుక్కుంటే సెకండ్ క్లాసులో ప్రయాణం చేయడానికి , లగేజీనీ ఫ్రీగా
తీసుకెళ్ళడానికి అనుమతించేవారు. ఈ రోజుల్లో సినిమా తారల చుట్టూ జనం పోగైనట్లు ఆ
రోజుల్లో వాళ్ళ చుట్టూ చేరి దేవతల్లా చూసే వారట. అంతకు ముందు మాటలు రాని బొమ్మలు
తెరపై చూసిన వాళ్లకు బొమ్మలు మాట్లాతుంటే వాళ్ళకు విచిత్రంగా వుండెది.
ఫ్రాన్స్ దేశానికి చెందిన అగస్థిలూమియర్ (1862-1954), లూయీ లుమ్రియర్ (1864-
1948), ఇంగ్లాండులోని ఫ్రెయిసీ గ్రీన్, పాల్; అమెరికాకు చెందిన ధామస్ అల్వా ఎడిసన్
వీల్లందరూ సినిమాను సృష్టించడానికి పోటీ పడ్డారు. కెనెటోస్కోప్ సూత్రాన్ని,పాతకాలం
మేజిక్ లాంతరు సూత్రాన్ని కలిపి సిసలైన సినిమాను మొట్టమొదట 1895లో జనాలకు
పరిచయం చేసిన ఖ్యాతి లుమియర్ బ్రదర్స్ కే స్వంతమయింది.
ముళ్లపూడి వెంకట రమణగారు నాగేశ్వరరావు, రామారావులపై చెప్పిన జోకు
నవ్వితే నవ్వండి నుండి...........
తారలపై మోజు విచిత్రమైనది.
"పాతాళభైరవి" చిత్రం విడుదలై బ్రహ్మాండంగా నడుస్తున్న రోజులవి.
అప్పటికింకా ఎన్.టి.రామారావుకు నాగేశ్వర్రావుకున్నంత పేరు
రాలేదు. నాగేశ్వర్రావు జానపద చిత్రాల హీరోగా బాగా పేరు మోశాడు.
చిత్రం చూసిన ఇద్దరు ప్రేక్షకులు ఇవతలకి రాగానే " ఆ మొసలితో
పోరాటం ఉంది చూశావ్ ? అబ్బ...ఎంతసేపు పోరాడాడయ్యా ఆ రామా
రావు?" అన్నాడు ఒకడు.
"అంతేలే, రామారావు కొత్తగదా.అంచేత అరగంట పట్టింది.అదే మన
నాగేశ్వర్రావైతేనా చిటికెలో చంపేసి ఉండును" అన్నాడు మిత్రుడు.
ఆయనదే మరో జోకు...
"మీ పిక్చరు కామెడీయా, ట్రాజిడీయా?"
"డబ్బొస్తే కామెడీ, రాకపోతే ట్రాజిడీ"
భశుం అదేనండి శుభం

3 comments:

  1. ఆసక్తికరంగా వుంది. ధన్యవాదాలు.

    "1956 లో ఇండియన్ టాకీ సిల్వర్ జుబిలీ వేడుకలలో "ఫిల్మ్ ఫెడరేషన్
    ఆఫ్ ఇండియా" వారు ప్రచురించిన సావనీర్ లో వ్యాస రూపంలో ప్రచురించారు."

    ఈ సావనీర్ ఇప్పుడు అందుబాట్లో వుందాండి?

    ReplyDelete
  2. .ఫుట్పాతు మీద పుస్తకాలమ్మే చోట హైద్రాబాదులో కొన్నాను. నేను అరువిచ్చిపోగొట్టుకొన్న చాలా మంచి పుస్తకాల్లో ఇదొకటి. ఓక సారి బాపుగారితో చెబితే, గట్టిగా "ఎందుకిస్తారు,ఇవ్వకండి"
    అంటూ కోప్పడినంతగా అన్నారు. .

    ReplyDelete