
మన తెలుగు పత్రికలలో వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడటం 80 ఏళ్ళ
క్రితమే మొదలయింది. ఇందుకు ఆద్యులు శ్రీ తలిశెట్టి రామారావుగారు.
ఆయన ఆంధ్రపత్రిక, భారతి పత్రికలలో వ్యంగ్య చిత్రాలు గీయటం మొదలు
పెట్టారు. ఇందుకు ఆంధ్రపత్రిక వారు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు.
మన కార్టూనిస్టులలో చాల మంది ఆంధ్ర పత్రిక ద్వారానే వెలుగులోనికి
వచ్చారన్నది నిజం. తరువాత మిగిలిన పత్రికలు కూడా కార్టూన్లను
గుర్తించడం మొదలు పెట్టాయి. బాపు గారి ఎప్పుడూ ఇంతే, సత్యమూర్తి
గారి చదువుల్రావు, ప్రియ మితృలు జయదేవ్ గారి కార్టూన్లు ఆంధ్ర వార
పత్రికలో చూసే ఎంతో మంది కార్టూనిస్టులు పుట్టుకొచ్చారు. నా మొదటి
కార్టూన్ కూడా ఆంధ్రవారపత్రికలో 1958 లో అచ్చయింది. ఆంధ్ర వార
పత్రికలో బాబుగారి కార్టున్లు కూడా ఎక్కువగా వచ్చేవి. చీకటి కార్టూన్ల
పేర బొమ్మ అంతా నల్లగా వేసి బెలూన్లో మాటలుండేవి. నాకు అలాటి
ఒక చీకటి కార్టూన్ గుర్తుంది. చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నావని అడిగితే
చీకటి కార్టూన్ గీస్తున్నా అన్న జవాబుతో ఒక కార్టూన్ వచ్చింది. ఇదో
కొత్త ప్రక్రియ ! పులిచెర్ల అనే ఆయన కూడా ప్రతి వారం కార్టూన్లు వేసే
వారు.
ఈ పై కార్టూన్ "గొప్పవారిని నాటకానికి పిలచినయేడల" అన్న
పేరుతో శ్రీ తలిశెట్టి రామారావు గారు 1932 ఆంధ్రపత్రికలో వేసినది.