గత యాభైయారేళ్లనుంచి ప్రచురితమవుతున్న "జగతి" మాస
పత్రిక సంపాదకులు , ప్రఖ్యాత రచయిత శ్రీ ఎన్నార్.చందూర్
ఈ నెల 11 వతేదీన తన 95 ఏట అస్తమించారన్న వార్త వారి
అభిమానులకు విషాదం కలిగించింది. కొంతకాలం ఆకాశవాణి
లో పని చేసిన ఆయన "మాలి" అనే పత్రికను ప్రారంభించి అటు
తరువాత "జగతి" ని స్థాపించి ఇప్పటివరకూ విజయవంతంగా
నడిపారు. ఆయన అసలు పేరు చందూరి నాగేశ్వరరావు. తన
సోదరి కుమార్తె మాలతిని వివాహం చేసుకున్నారు. శ్రీమతి
మాలతీ చందూర్ తమ రచనలతో తెలుగువారందరికీ అభిమాన
పాత్రులయ్యారు. ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో చాలా కాలం
"ప్రమదావనం" శ్రీర్షిక నిర్వహించారు. ఆమె వ్రాసిన వంటలూ-
పిండివంటలూ పుస్తకం లేని తెలుగు లోగిలి లేదేమో!
జగతి పత్రిక మొదటి పేజీలో ఓ భతృహరి సుభాషితమో,
తిక్కన , పోతన పద్యమో తప్పక వుంటుంది. నిమ్మతొనలు
శిర్షికలో జోకులు, డైరీ లో నగరంలో జరుగుతున్న సభలూ
సమావేశాలగురించి వివరాలు వుంటాయి.పసిడి పలుకులులో
పెద్దలు చెప్పిన మంచి మాటలు వుంటాయి. ఇలా ఆ చిన్న
పత్రికలో ప్రతిదీ అమూల్యమే! శ్రీ చందూర్ కాఫీ మానేయడం,
అన్యాయం, ఎక్కడికి కమలా?,రాధ నవ్వింది, మొదలయిన
కధానికలు, ఏంటినా, భానుమూర్తి భార్య, కలడో లేడో మొ"
నవలలు వ్రాశారు. ఇంగ్లీషునుండి అనువాదలూ చేశారు.
వారి శ్రీమతి మాలతీ చందూర్ "స్వాతి" మాస పత్రికలో "పాత
కెరటాలు" , "స్వాతి" వార పత్రికలో "నన్ను అడగండి" శీర్షికను
దశాబ్దం పైగా నిర్వహిస్తున్నారు.
" జగతి’కి ఏదైనా వ్రాయాలనే కోరిక వుండేదికాని, వేస్తారో
లేదోననే సందేహంతో పంపే సాహసం చేయలేదు. 2009 ,
అక్టోబరులో శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారు నాకు ఫోను
చేసి "మీరు నా పుట్టిన రోజుకు వేసిన బొమ్మ , జగతి సంచికలో
పడింది, మీకు కాపీ పంపుతున్నా"నని చెబితే ఆశ్చర్యపడ్డాను.
నేను స్థానిక దినపత్రిక "సమాచారం" పత్రికకు శ్రీ ముళ్లపూడి
పుట్టిన రోజు సంధర్భంగా వ్రాసిన వ్యాసానికి నే వేసిన బొమ్మను
శ్రీ చందూరు గారు తమ జగతి పత్రికలో వేశారు. అలా నా కోరికను
శ్రీ చందూర్ తీర్చారు. ఈ దు:ఖసమయంలో శ్రీమతి మాలతీ చందూర్
గారికి భగవానుడు తోడుగా వుండి చందూర్ గారి ఆశయాన్ని
మరింత ముందుకు తీసుకొని వెళ్ళే శక్తిని అందించాలని కోరుకుంటూ
ఆయన అశేష అభిమానుల తరఫున శ్రర్ధాంజలి ఘటిస్తున్నాను.
No comments:
Post a Comment