ఆ నాటి రోజులు గుర్తుకొస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిన్న నా
బ్యాంకు పైలు చూస్తుంటే నేను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శ్రీకాకుళం
లో క్యాషియరుగా చేరినప్పటి అపాయ్ట్మెంట్ లెటరు అగుపించింది.
అప్పుడు బ్యాంకులో క్యాషియరుగా నా జీతం 120/- రూపాయలు.
డిఏ రూ.25-20 పైసలు. ఈ ఉత్తరం నాకు ఇచ్చిన తేదీ 17 జూలై 1963,
అంటే ఇప్పటికి 48 ఏళ్ళయిందన్నమాట. ఇప్పటి జీతాలకు అప్పటి
జీతాలకు ఎంత తేడా?! ఇక ఉద్యోగమిస్తూ వ్రాసిన ఉత్తరం కూడా ఎంతో
కటువుగా ఉంది. ఆ రోజుల్లో ఉత్తరం రూపంలో కాక MEMORANDUM
అని వుండేది. ఆ మెమొ ఆఖరి రెండు లైన్లు చూడండి ఏమని వ్రాశారో.
In case your work and conduct are not satisfactory and upto
the Bank's required standard, your services will be terminated
without notice during the period of probation.
కాని ఆ జీతం ఆ రోజుల్లో మాకు తక్కువనిపించలేదు. ఆ జీతానికి తగ్గట్టే
ధరలూ వుండేవి.న్యూస్ పేపరు 12 పైసలకే వచ్చేది. వారపత్రికలు 25
పైసలు. హోటల్లో భోజనం టిక్కెట్లు 30, 40 రూపాయలకే నెలకు ఇచ్చే
వాళ్ళు ! మా నాన్నగారు బ్యాంకులో క్లర్కుగా చేరినప్పుడు ( 1924 )
ఆయన జీతం రూ.30/- లట! ఇక్కడ మీరు చూస్తున్న రంగూన్ టీక్
వుడ్ అల్మయిరా ఖరీదు ఎంతో తెలుసా! మీరు నమ్మక పోవచ్చు. దాని
ఖరీదు అక్షరాలా పది రూపాయలు! ఆ రోజుల్లో బ్యాంక్ ( అప్పుడు
బ్యాంకు పేరు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , 1955లో స్టేట్
బ్యాంకు గా మారింది) బ్రాంచి మేనేజర్లను ఏజెంట్ అనే వారు. ఆ రోజుల్లో
ఆ పదవిలో అంతా బ్రిటిషర్స్ ఏజెంట్లగా వుండేవారు. అలా మానాన్న
గారు ఏజెంట్ టైపిస్టుగా(గుంటూరు) పనిచేస్తున్నప్పుడు ఏజెంట్ ఇంగ్లాండు
తిరిగి వెడుతూ తన అల్మయిరాని మా నాన్నగారికి పది రూపాయలకు
అమ్మాడట.10 రూపాయలకు కొనడానికి నాన్నగారు చాలా రోజులు
ఆలోచించారట. ఇప్పుడు మా కార్పెంటరును అడిగితే ఆ బీరువా
చేయించడానికి రూ.35,000/- పైగా అవుతుందని చెప్పాడు.!
వైజాగులో వున్న మా బావగారు శ్రీ ఎమ్వీఎల్లెస్ ప్రసాదరావుగారు
(ఆయనా ఎస్బీఐ లోనే రిటైరయ్యారు) నువ్వు ఇంకా రూ.125/- జీతంతో
ఉద్యొగంలో చేరావు, నేను చేరినప్పుడు నా జీతం రూ.91/-రూపాయలే
అంటూ, ఇప్పటి కన్నా అప్పుడే(1956) హాయిగా వుండే వాళ్ళం అన్నారు.
అప్పుడు మంచి సదుపాయాలున్న ఇల్లు నెలకు 20 రూపాయలకే అద్దెకు
దొరికేదట !. పత్రికల పిచ్చి వున్న నాకు డైలీ పేపరు, చందమామ, జ్యోతి
మాసపత్రిక, విజయచిత్ర మొదలైన పత్రికలకు నెల బిల్లు ఇరవై రూపాయల
లోపే అయ్యేది.ఇప్పుడు నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, హిందూ లకే 265రూ.బిల్లు
అవుతున్నది. ఆ రోజుల్లో మనుషుల్లో ఆప్యాయత వుండేది. అప్పటి వరకు
అమ్మానాన్నలను విడిచిపెట్టి ఎప్పూడూ వుండని నేను కొత్త వూర్లో (శ్రీకాకుళం) లో
ఒంటరిగా ఉద్యొగం లో చేరినా తోటి ఉద్యోగులు, మా కాష్ ఆఫీసర్ శ్రి కోట కామేశ్వర
రావు, ఏజెంట్ శ్రి ఎమ్వీయస్ గౌరీనాధ శస్రిగారుఆనాడు చూపిన ప్రేమాభిమానాలు
ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఏమైనా ఇప్పుడు ఆత్మీయత లోపించిదేమో
అనిపిస్తుంది. అదండీ ఆ రోజుల్లో నా ఉద్యోగపర్వం కధ.
అప్పుడంతే...ఇప్పుడింతే :)
ReplyDeleteఇప్పుడు నూట ఇరవై పెడితే దోసిలి నిండా కూరగాయలు వస్తున్నాయి కదండీ :)