Monday, January 03, 2011

శత దినోత్సవాలు-జత దినోత్సవాలు !




ఒకప్పుడు ( చాలా ఏళ్ళ క్రితం) సినిమాలు శత దినోత్సవం జరుపు
కోవడమంటే అదో పండుగ. ముఖ్య కేంద్రాలకు సినిమా తారలు
వచ్చేవారు. ఆ నాటి మొదటి ఆట ఇంటర్వల్లో తెర ముందుకు వచ్చి
ప్రేక్షకులకు కనువిందు కలిగించేవారు. తారలను ప్రత్యక్షంగా చూసే
అవకాశం అప్పుడే కలిగేది. ఇప్పట్లా ఔట్ డోర్ షూటింగులుండేవి
కావు. ఇప్పుడంతా బట్టబయలు ! తారలూ ఒళ్ళు దాచుకోకుండా
పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో ఇప్పటిలా దొంగ శతదినోత్సవాలు,
లాగించడాలూ వుండేవి కావు. ఆ రోజుల్లో సినిమా ఫ్లాపయితే
రెండు మూడు వారాలకే తీసేసే వారు. "కాడెద్దులు-ఎకరానేల"
అన్న సినిమా మా రాజమండ్రిలో రెండే రోజులాడింది. జత
దినోత్సవం జరుపుకొన్నది అని సరదాగా చెప్పుకొనేవారు.
ఆ రోజుల్లో శతదినోత్సవ వేడుకులలో తారలు ఊరూరూ
తిరిగితే ఇప్పుడేమో రెండో రోజునుంచే విజయ యాత్రలు చేస్తున్నారు!.
బాపు రమణగార్లు తాము తీసిన సినిమాలు ఫట్మంటే వాళ్ళకు
వాళ్ళే జోకులు, కార్టూనులు వేసుకొనే వారు. పబ్లిసిటీలూ గమ్మత్తుగా
దిన పత్రికలలో వేసే వారు. "అందాలరాముడు" మొదట సారి బాగా
ఆడకపోతే "తీసిన వారికీ చూసినవారికీ అంచనాలు తలకిందులు
చేసిన" అందాలరాముడు" అంటూ ప్రకటనలు ఇచ్చారు. మరో ప్రకటన:
"అందాలరాముడు" 70వ రోజు అన్న ప్రకటన చూసి "ఏడ?" అని
అడుగుతున్న ప్రేక్షకుడితో మునుగుతున్న పడవలో కూర్చున్న
నిర్మాత(?) "ఏడా లేదు బేడాలేదు.రిలీజైన రోజునుంచి యివాల్టికి
70వ రోజు !" అంటాడు. ఇలాటి డేరింగ్ ప్రకటన స్పోర్టివ్ గా ఇవ్వగల
నిర్మాతలను ఇప్పుడు మనం చూడగలమా? ఈ ప్రకటన చూసిన
అక్కినేని "అబద్ధాలు చెప్పి కోతలు కోసి-సత్తురూపాయల్లాంటి
నకిలీ ప్రకటనలు వెయ్యకుండా ధైర్యంగా పొగరుగా నిజం చెప్పారు"
అని అన్నారుట ( చూ: కోతికొమ్మచ్చి స్వాతి సపరి వార పత్రిక
18-12-2009) ఇప్పుడేమో తలతోకాలేని పాటలకు ప్లాటినం
డిస్కులంటూ ప్రోగ్రాములు మరప్పుడో, ఎన్నెన్నో మంచి మంచి పాటలు
విడుదలయినా ఇలాటి కార్యక్రమం వుండేదికాదు. 2010లో మన
తెలుగు సినిమా దాదాపు చావు దెబ్బ తిన్నా దిన పత్రికలలో
మీరు ప్రకటనలు చూస్తున్నారుగా, అన్నీ డూపర్ సూపర్ హిట్లే!
57 ఏళ్ళ క్రితం విడుదలైన "మూగమనసులు" శత దినోత్సవ
ఆహ్వాన పత్రం నే దాచుకొన్నది దొరికితే దానితో బాటు "ముత్యాల
ముగ్గు"కు బాపు గీసిన వందరోజుల పండుగ కార్డు, "మూగమనసులు"
చిత్రానికి శ్రీ బాపూ చిత్రంలోని ఏఎన్నార్, సావిత్రి, జమున పాత్రలను
చూపిస్తూ గీసిన అద్భుతమైన లోగో మీకు చూపిస్తున్నాను.

No comments:

Post a Comment