Wednesday, January 05, 2011

బై బై , మై డియర్ పావలా !!



మరో ఆరు నెలల్లో పాపం మన ప్రియమైన {ధరలన్నీ ప్రియమై
పావలా ( 25 పై )కు విలువ తగ్గిపోయింది} పావలాకు మన
ప్రభుత్వం వీడుకోలు చెప్పేస్తూ మన పావలాను (మన దగ్గర
ఇంకా వుంటే ) గుర్తుగా దాచుకోవాలనే కోరిక కలిగిస్తూ ఆ
పావలాకు విలువనూ పెంచింది. అమ్మో జూన్ నుంచి పావలా
ఎందుకూ మారదట ( ఇప్పుడు ఏదో మారుతున్నట్లు ) అనుకొని
దానాలు చేసో ( ఎవడు తీసుకుంటాడు?!), ఏ దేముడి హుండీ
లోనూ వేసో పుణ్యం దక్కించు కోవాలనుకొనే కొందరు,
ఇక అగుపించని పావలాను గుర్తుగా పదిలపరచుకొనాలనుకొనేవారు
"ఏమండీ, మీ దగ్గర ఓ పాత పావలా వుంటే ఇద్దురూ !" అని అడిగే
వారూ వుంటారు.
ఈ రోజుల్లో పావలాకు వచ్చేది ఏదీ లేక పోవచ్చు కానీ మా రోజుల్లో
ఆ పావలాకే మేము ఆంధ్రవారపత్రికలో హకల్బెరీఫిన్, టామ్సాయర్
లాంటి కధలు చదువుకున్నాం. మా అమ్మగారు అలెగ్జాందర్
డ్యూమాస్ వ్రాసిన "కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో" చదువుకున్నారు.
"చందమామ" ఇంకో రెండణాలు పెడితే వచ్చేది. "పాపాయి"అనే
పిల్లల పత్రిక పావలాకే వచ్చేది. అన్నట్లుశ్రి గణేశ్ పాత్రో "పావలా" పేరుతో
వ్రాసిన ఓ నాటిక చాలా ప్రాచూర్యం పొందింది. అందులో నటించిన సరోజిని
అనే నటి "పావలా" సరోజినిగా పేరు పొంది కొన్నిసినిమాల్లోనూ నటించారు
అప్పటికాలానికి ఇప్పటికాలానికి డబ్బు విలువ గురించి తెలుసు
కోవాలంటే రమణగారి కోతికొమ్మచ్చి మొదటి భాగం 98 వ పేజీ చూడండి.
" 1937 లో నా చిన్నప్పుడు ధవళేశ్వరం లో రూపాయికి 64 ఇడ్లీలు
ఇచ్చేవారు పచ్చడీ కారప్పొడీ నెయ్యితో. 1950 లో మెడ్రాసులో
రూపాయికి 32 ఇడ్లీలు + చారులాటి చిక్కని కొబ్బరి పచ్చడి ..."
ఈ కాలం వాళ్ళకి వింటానికి వింతగా వుంటుంది!
రూపాయి దండకం
ఈ అణాలు ఈ తరం వారికి వింతగా వుండవచ్చు. ఇప్పుడు రూపాయి
దానికి 100 పైసలూ, గుణకారాలూ,భాగారాలూ-పదోఎక్కంతో లాగించెయ్య
వచ్చు. అప్పుడు 16వ ఎక్కం, 12వ ఎక్కం-లెక్కలికి తప్పని సరి.పూర్వం ఈ
చిల్లర దండకం చాలా పెద్దది. రూపాయికి -
2 అర్ధలు, 4 పావలాలు, 8 బేడలు, 16 అణాలు,
32 అర్ధణాలు, 64 కాణీలు, 128 ఏగాణీలు, 192
దమ్మిడీలు
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
పావలా( నాలుగు అణాలు) పై రమణగారు చెప్పిన మరో కో.కొ కధ
ఇంకో అ " ణా " వేస్తే పావలా
ఆంధ్ర పత్రికలో రమణగారు పని చేస్తున్నప్పుడు ప్రకాశం పంతులుగారి
ప్రసంగ సారాంశం కి హెడ్డింగు పెట్టే భాధ్యత రమణగారు తీసుకొన్నారట.
" గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమానికి కంకణధారణ చేదాం " అని హెడ్డింగు
రాశారు. ఆయన వెనుకనే వుండి గమనిస్తున్న మద్దాలి శర్మగారు, " మూడు
అణాలు పడ్డాయి-ఇంకో అణా వేస్తే పావలా అయిపోతుంది అన్నారు చిరు
నవ్వుతో! మూడు అణాలు అంటే- ఆ టైటిల్లో " ణ " లు మూడు సార్లువచ్చాయ్!
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
పై ఫొటోల్లోని పాత పావలాలు ( మా నాన్నగారి సేకరణ నుండి) : కుడి నుంచి
1. 1862 విక్టోరియా రాణి 2. 1908 ఎడ్వర్డ్ 7th 3. 1919 జార్జి V
4..1929 జార్జి V 5. 1988 25 పైసలు

5 comments:

  1. పావలా నాటికలోని నటి పేరు సరోజిని కాదనుకుంటానండీ,శ్యామల అని గుర్తు. ఆవిడ ఆ నాటికతో పావలా శ్యామల గా పేరు తెచ్చుకున్నారని ఎక్కడో చదివాను.

    నేను ఇప్పటికే నా దగ్గరున్న పావలాలన్ని వెతికి పోగేసాను, నా తరవాత తరాల వాళ్లకి చూపించేందుకు :)

    ReplyDelete
  2. మా చిన్నప్పుడు 5 పైసలు మినిమం డినామినేషన్‌గా ఉండేది.

    ReplyDelete
  3. కలెక్షన్ బాగుందండి.పావలాయే కాదండి,ఐదు,పది పైసలు ,రూపాయి,రెండు రూపాయిల కాగితాలు తో పాటు ఐదు రూపాయల కాగితం అన్నీ దాచేను. పిల్లలకు చూపించడానికి.

    ReplyDelete
  4. పావలా నాటికలో వేసింది శ్యామలే! ఇప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తోంది. ఆ నాటికలో ఒక బుడ్డోడికి రోడ్డు మీద ఒక పావలా దొరుకుతుంది. పూటగడవని ఆ ఇంట్లో ఆ పావలాతో ప్రతి ఒక్కరికీ అవసరం పడుతుంది. చివరికి ఆ పావలాని దక్కించుకోవడంలో ఎవరో చనిపోవడంతో ముగుస్తుందని గుర్తుంది. ఆకాశవాణి విజయవాడ నాటికల్లో ఇదొక మంచి నాటిక!

    మొత్తానికి పావలాకి సంతాపం!

    ReplyDelete
  5. !నిజమేనండి. ఆ నటి పేరు శ్యామలే! పొరబడ్డాను!

    ReplyDelete