ఇదిగో నేనేరా! చాలా బోల్డురోజులయింది మిమ్మల్ని చూసి, బ్లాగు బుడుగులూ
సీగానపెసూనాంబలూ ! ఈ రోజు బుడుగు పెళ్ళి రోజంటే నా పెళ్ళిరోజనుకున్నారా!
నాది కాదురా, నా కధను రాసిపెట్టిన వాడి పెళ్ళిరోజన్నమాట. వాడి పేరే ముళ్లపూడి
వెంకటరమణగారు. గారంటే నాకూ తెలియదనుకో, మన కన్నా ఎత్తుగా వున్నవాళ్ళని,
పెద్దవాళ్ళంటారట, ఆ పేద్ద వాళ్ళ పేర్ల ప్రక్కన గారు అని తగిలించి పిలవాలని అమ్మ
చెప్పింది. మా అమ్మ రాద మీకు తెలుసుగా, మా అమ్మ చాలా మంచిది. అసలు ఈ
రమణగారి నిఝం పెళ్ళి రోజు 26-1-1964 అన్నమాట. రమణ గారు తన పెళ్ళికి
నన్నూ, సీగానపెసూనాంబని కూడా పిలవలేదు. తన ఫ్రెండ్స్ ను మాత్రమే పిలిచాడట.
పిలిస్తే ఝామ్మని జట్కాతోలుకుంటూ మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. ఐనా నేనంటే ఆయనకు
కొంచెం బయంలే!
ఆరుద్రగారు రమణగారి పెళ్ళికి ఆయన వ్రాసిన "కూనలమ్మపదాలు" బుక్కును కానుకగా
ఇచ్చాడట. ఈ విషయం మా బాబాయి చెప్పాడులే! హాయిగా ఏ చేగోడీలో ,పకోడీలో ఇవ్వాలి
గాని ప్రయివేటు మాస్టర్లదగ్గరుండే ఈ బుక్కెందుకు చెప్పండి. ఇక్కడ మీరు చూస్తున్న
మొదటి కుఠో ( కుఠో అంటే ఫొటొ అనర్ధం నా బోల్డు మాటలు తెలియాలంటే మీరు నా
బుడుగు పుస్తకం చదవాలి) పెళ్ళప్పటిది. అప్పుడు పదో పదకొండో కుఠోలు కుఠోలవాడు
తీసాడు., కాని నా దగ్గర ఈ కుఠోనె వుంది. రెండో కుఠో తీసిన వాడి పేరు మీతో కబుర్లు
చెప్పే ఫనిబా(బాయ్)బు ట !
రమణగారి సీగానపెసూనాంబ పేరు సీదేవి గారు.వాళ్ళిద్దరికీ బోల్డన్ని చేగోడీలు,
పకోడీలు ఇస్తూ మీ పేర్లుకూడా చెబుతాన్లే!
మీ బుడుగు.
<><><><><><><><><><><><><><><
రమణగారు చెప్పిన పెళ్ళి కబుర్లు
"నండూరి రామ్మోహనరావుగారి చెల్లెలు శ్రీదేవితో నాకు పెళ్ళి నిశ్చయించారు.పిల్లని
బాపు చూసి బాగుందని చెప్పాడు- నేను పాదాలు చూసి బాగున్నాయని అనుకున్నాను.
చిన్నప్పుడు మేమిద్దరం ఏ అమ్మాయేనా ఎదురొస్తే ముందు పాదాలు చూసి బాగుంటేనే
తల పైకెత్తేవాళ్ళం.
నా పెళ్ళికి చుట్టాలెవర్నీ పిలవలేదు. అందరూ స్నేహితులు. చాలామంది రచయితలు-
శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, దాశరధి, రావి కొండలరావు, విఏకె రంగారావు, నిర్మాత డూండీ,
నవోదయ రాంమ్మోహనరావుగారు, జ్యోతి రాఘవయ్యగారు..ఇలా అందరూ స్నేహితులే.
నా పెళ్ళి పెద్ద బాపు అమ్మగారే.
తనకు చెప్పకుండా పెళ్ళి నిశ్చయించినందుకు మా అమ్మ కోప్పడలేదు కాని నాకు
అయిష్టులూ,తనకిష్టులూ అయిన ఒక చుట్టాలింటికి మాత్రం బలవంతాన తీసుకెళ్ళి వాళ్ళని
పెళ్ళికి పిలవనందుకు క్షమాపణలు చెప్పించి కాళ్ళకు దండం పెట్టించింది."
--కోతి కొమ్మచ్చి నుంచి
శ్రీ ముళ్లపూడి వెంకటరమణ, శ్రీమతి దంపతులకు 47 వ వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు.
MANY MANY HAPPY RETURNS OF THE DAY TO
ReplyDeleteSRI RAMANA-SRIDEVI GARU..
అదేంటో! నా పెళ్ళికి మా అబ్బాయిని కూడా పిలవలేదు. చిన్నప్పుడు మా బాబు అడిగేడు "అదేంటీ ఈ ఫుటోల్లో నేను లేనేంటి?" ఇలాంటి బుడుగుల్ని కళ్ళరా చూపించిన గ్రేట్ రచయిత ముళ్ళఫూడి గారికి శుభాకాంక్షలు. (బుడుగు హీరోగా ఓ సినిమా తీస్తే చూడాలని వుంది, కానీ మనకా అదృష్టం లేదేమో.)
ReplyDelete@VOLETI,
ReplyDelete"......బుడుగు హీరోగా ఓ సినిమా తీస్తే చూడాలని వుంది, కానీ మనకా అదృష్టం లేదేమో....."
You are right. I too share your frustration.
గురువు గారూ,
ReplyDeleteనేను తీసిన కుఠో కి అంత గొప్ప స్థానం ఇచ్చినందుకు, ఏం వ్రాయాలో తెలియడం లేదు.ఇప్పుడే శ్రీదేవి గారికీ,రమణ గారికీ ఫోను చేసి,శుభాకాంక్షలు చెప్పే అదృష్టం కలిగింది.
రమణ దంపతులకి శుభాకాంక్షలు.
ReplyDeleteశ్రీ భాగవతంలో బుడుగుకి బాలకృష్ణుడి వేషం వేసి చూపించారు కదండీ బాపూరమణలు.