Friday, August 06, 2010

కాకమ్మ కబుర్లు



కాకమ్మ కబుర్లు
మనకు మన ఇంటికి రోజూ వచ్చే కాకి సంతతికి ఎంతో అవినాభ
సంబంధం వుంది. నిత్య జీవితంలో కాకిని తలచుకోని రోజుంటుందా?
సామెతలగా , కధలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. అంతెందుకు మన
పితృదేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తాం. భోజనానికి కూర్చోబొయే
ముందు మొదటి ముద్దను కాకికి పెట్టి నోట్లో వేసుకోని వాళ్ళు చాలా
మంది ఉంటారు. వాల్మీకి రామాయణంలో కూడా కాకి గురించి ఓ
కధ వుంది.సీతమ్మ తల్లికి హాని తలపెట్టిన కాకాసురిడిని ధర్భాస్రం
ప్రయోగించి క్షమించమని వేడుకొంటే ఒక కన్ను పోగొట్టీ ఆ ఏకాకిని
ఏకాక్షిగా చేశాడు రామచంద్రుడు. అందుకే ఆ నాటి నుంచి ఓ కన్ను
పోయి తలవంచి ఒకే కన్నుతో చూస్తుంటుంది పాపం కాకి. ఆ కాకా
సురిడి పేరును తమ పనులకోసం పొగిడే వాళ్ళను వాడొట్టి కాకా
సురుడు అని పిలవటం పరిపాటి అయింది. పూర్వం కోడి కూయగానే
లేచే వారు. ఈ కాలంలో కాంక్రీట్ జంగిల్గా మారిన పట్టణాలలో కోళ్ళు
పాపం తలక్రిందులుగా వేలాడుతూ ఏ సైకిల్ హాండిల్ పైనో , లేక పోతే
వాటి మాంసం అమ్మే దుకాణాల్లోనో మనం చూస్తున్నాం. ఇప్పుడు
మనం లేపటానికి వెలుగు రాగానే "ప్రేమనగర్" సిన్మాలో జ్యోతిలక్శ్మిలా
"లేవనంటావా,నన్ను లేప మంటావా" అంటూకాకులు కావుగీతాలు ఆలపిస్తు
న్నాయి. అసలు ఉదయాన్నే ఇలా కాకులు కావు కావుమని అరవ
టానికి కారణం ఏమిటీ అన్న దానికి చాలాఏళ్ళక్రితం చందమామలో
ఓ చక్కని కధ పడింది. (చూడండి:kappagantu SivaramaPrasad గారు
నిర్వహిస్తున్న manateluguchandamama.blogspot.com ) ఆ
కధలో తమ్ముడు తన పదహారేళ్ళ అక్కను "అక్కా, పొద్దున్నే కాకులు
ఎందుకు అలా గోలగా అరుస్తాయి " అని. అడిగితే అక్క "చీకటిని తన
కిరణాలతో నశింపజేస్తూ ఉదయిస్తున్న సూర్యుడు నల్లగా ఉన్న తమనీ
చీకటి అని భ్రమించి దహిస్తాడేమోనని " మేం చీకటిని కాము, కాకులం
కావు, కావు (రక్షించు,రక్షించు) అని అరుస్తాయి" అని జవాబిచ్చిందట.
ఇంత మంచి కధలను అందించగల పత్రికలు ఇప్పుడేవి? మన ఇంటికి
చుట్టాలొస్తుంటే ఇంటి పైకి వచ్చి కాకి అరుస్తుందనే వాళ్ళు.. ఇద్దరికి
విరోధమొస్తే "ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలదు" అంటారు.
ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా వుండే వాడిని "ఏకాకి" అంటారు.
ఊరికే పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళను వాళ్ళవి "కాకమ్మ
కబుర్లు లేరా" అని కొట్టి పడేస్తాం. ఇక కాకికి కధలూ ఎన్నో. కుండ అడుగున
ఉన్న నీటిని అందులో గులకరాళ్ళు పడేసి తాగి చక్కా ఎగిరిపోయిన కాకి
కధ మనందరికీ తెలుసు. కాకమ్మ-నక్కబావ కధకు ఎన్నో సీక్వెల్స్
వచ్చాయి. "నువ్వు లతాలా పాడుతావంటే నోటిలోని రొట్టెను కాలిక్రింద
పదిలంగా ఉంచుకొని పాడిన కాకి, ఇలా లాభం లేదనుకొని నువ్వు అద్భుతంగా
డాన్స్ చేస్తావని పొగిడితే నోట్లో పెట్టుకొని డాన్స్ చేసిన కాకి, ఈ సారి ఇలా
కాదని నువ్వు ఆటా, పాటా కలసి బాగా చేస్తావని నక్క బావ అంటే రొట్టెను
గుటుక్కున్న మింగి ఆటాపాట ప్రదర్శించిన కాకి కధలు సీక్వెల్స్ గా
వచ్చాయి. పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నా పట్టించుకోని వాళ్ళను, "అవును
కాకి పిల్ల కాకికి ముద్దంటారు." కొందరు మాత్రం అలా అల్లరి చేస్తూ కేకలేసే
బుడుగుల్ని " ఇక ఆపుతారా ఆ కాకి గోల అని వీళ్ళూ కేకలేస్తారు! తన
ప్రతాపం ఎదుటి వాడికి తెలియదని చెప్పటానికి " పిల్ల కాకికేం తెలుసు
ఉండేలు దెబ్బ" అంటారు. సడన్ గా మాయమై పోయే వాళను , "ఇంకెక్కడ
కనిపిస్తాడు. వాడెప్పుడో ఉష్ కాకి అనడం వినే ఉంటారు. హాస్యబ్రహ్మ జంధ్యాల
సినిమాలో ఈ డైలాగు విన్నారు కదూ. "కాకీక కాకికి కాక కుక్కకా? "ఇందులో
అన్నీ " కా " లే !. ఒకే పండు మన దగ్గర ఉంటే చొక్కాలో ఉంచి కొరికి స్నేహితుడి
తో తినటానికి " కాకి ఎంగిలి" అంటాము. నలుపు అని చెప్పటానికి కాకి నలుపు
అంటూ వర్ణిస్తాము. అన్నట్లు తెల్ల కాకులూ ఉంటాయి సుమా. . ఇక మా తూర్పు
గోదవరి జిల్లా కేంద్రం పేరు తెలుసుగా ! " కాకి " నాడ.. , కీకారణ్యం అని చెప్పటానికి
కాకులుదూరని కారడవి చీమలు దూరని చిట్టడవి అంటారు. అతి అల్పం అనడానికి
ఏముంది సముద్రంలో కాకి రెట్ట అంటారు. నకిలీ బంగారాన్ని కాకి బంగారం
అంటారు. ఏమని వివరించను ఎన్నని చెప్పను ఈ కాకమ్మ కబుర్లు.
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఇటీవలదాకా ఎన్నో కార్టూన్లు గీసిన పద్మభూషన్
శ్రీ ఆర్కే లక్శ్మన్ గారికి కాకులంటే ఎంతో ఇష్టం. ఆయన కాకుల్ని జీవకళ
ఉట్టిబడేటట్లు చిత్రరచన చేశారు. ఇక్కడ మీరు చూస్తున్న కాకుల బొమ్మలు ఆయన
కుంచె నుంచి తయారయినవే !( Courtesy : Times Of India )

4 comments:

  1. కాకేదీ కాదు బ్లాగు కనర్హం అన్నట్టు, కాకిమీద ఒక పెద్ద ఉద్గ్రంధమే బ్లాగారుగా.

    ReplyDelete
  2. హమ్మో "కాకి భారతం" రాసేసారుగా....రోజులో ఇన్నిసార్లు మనం కాకులని తలుచుకుంటామా...భలే!

    జంధ్యల గారు ష్ గప్‌చుప్ సినిమాలో ఇంకో ప్రయోగం చేసారు కాకితో..."ఏకాకి కాకీక" వి.

    అలాగే కోకిల గుడ్డు కాకి గూటిలో పెట్టినా కాకి కాకే, కోకిల కోకిలే అన్న నానుడి కూడా తరచూ వినిపిస్తూ ఉంటుంది.

    చిన్నప్పుడు ఇంకో కథ ఉండేది. నెమళ్ళని చూసి కాకి ముచ్చటపడి, అదీ అంత అందంగా తయారవ్వాలని అనుకుని కింద పడిన నెమలి ఈకలను ఏరి తనకి తోక గా కుట్టుకుందిట. ఆహా నేను అందంగా తయారయ్యాను అనే సంబరంలో నెమలి గుంపులోకి వెళ్ళి ఆడిందిట. ఈకలు పెట్టుకున్నంత మాత్రాన నడకలు మారతాయా? కాకి పిచ్చి గంతులు చూసి నెమళ్లన్నీ నవ్వాయిట. వేషాలు మారినా నడతలు మారవు అని చెప్పడం కోసం ఈ కథ చెబుతారు.

    చందమామ లో రాసిన కాకి కథ అద్భుతం...మంచి ఆలోచన.

    ReplyDelete
  3. సురేఖగారు కాకి రేఖ మార్చేసారు. పంచమస్వరంలో గానమాలాపించే కోకిలమ్మను లోకానికి పరిచయం చేసిన ఘన చరిత్ర.......లఘుపతనకుడుగా పంచతంత్రంలో ప్రధాన పాత్ర........కనుమనాడు తప్పక స్నానమాడి సంప్రదాయం మరువని సంస్కారి.....శ్రీరాముణ్ణి చేరడానికి నాలా శతృత్వంవల్ల కూడా సాధ్యమన్న యోగి...కాకి కాక యింకెవరు.........సురేఖ గారూ.........మీ కాకాలూకీయం చదివి టోపీలు తీసేసామ్........మీ బ్లాగులన్నీ బాగున్నాయ్.........నా ఈ స్పందన మీకందితే యింకా యింకా వ్రాయగలుగుతాను. ప్రస్తుతానికి శలవు........దినవహి.

    ReplyDelete
  4. బ్లాగరు మితృలకు , నా కాకి గోలకూడా మీకు కోకిల
    స్వరంలా( కోకిల పుట్టిల్లు, కాకి గూడేకదా)! బ్లాగున్నందుకు
    ధన్యవాదాలు. మా హాసం క్లబ్ దినవహి కొత్త బ్లాగుకు
    స్వాగతం
    . --- మీ సురేఖప్పారావు యమ్వీ

    .

    ReplyDelete