Wednesday, August 25, 2010

అధిరోహిణి అను నిచ్చెన కధ !



మనం పైకి ,అదేనండి ఎత్తైన చోట్లకు వెళ్ళాలంటె ఒక్కొక్క మెట్టు
ఎక్కుతూ పైకి వెళ్ళాలి. చదువైనా , ఉద్యోగమయినా ఒక్కొ మెట్టు
అందుకుంటూ ఉన్నత స్థానాలకు చేరవలసివుంటుంది .మామూలుగా
ఎత్తుకు తీసుకు వెళ్ళే సాధనంనిచ్చెనే.పాత రోజుల్లో ప్రతి ఇంట్లో ఓ
నిచ్చెన తప్పక వుండెది. పాత సామాను, బామ్మలు మడిగా పెట్టే
ఆవకాయ జాడీలు , పెద్ద బోషాణాలు అటక మీదే వుండేవి. వాటిని
తీసుకోవడానికి ఓ నిచ్చెన అవసరం కనుక ఆ రోజుల్లో నిచ్చెన ఓ
నెచ్చెలిలా నిత్యావసర వస్తువయింది. మరో గమ్మత్తైన విషయం,
అటక అంటె గుర్తొచ్చింది. ఇంగ్లీష్ లో ATTIC అంటే అటక అనే
అర్ధం. ఈ రెండు భాషలకు సామీప్యం భలే గా వుంటుంది కదండీ !
గోడలకు సున్నాలు వేయాలన్నా నిచ్చెనే ఆధారం. ఇప్పుడు కూడా
ఇళ్ళల్లో అటకలు వున్నా చాలా అందంగా ఫాషన్గా వుంటున్నాయి.
వాటిని అందుకోడానికి ఫాష నబుల్ ఫోల్డింగ్ స్టెప్ లాడర్లు వచ్చాయి.
ఫుర్వం కాలంలో కూడా మన పౌరాణికాల్లో శశిరేఖను మేడమీద
నుంచి రహస్యంగా క్రిందికి దింపడానికి అభిమన్యుడు బాణాలతో
నిచ్చెన కట్టడం మీరు మాయాబజారులో చూశారుగా ! షిర్దీ సాయి
బాబా సచ్చరిత్రలో కూడా బాబా ఓ నిచ్చెన తెప్పించి ఒక ఇంటి మీద
ఎక్కి మరో ఇంటి పై నుంచి క్రిందికి దిగిన లీల కూడా మీరు చదివే
వుంటారు. అలా నిచ్చెన కు ప్రతి సంధర్భంలోనూ ప్రాముఖ్యత వుంటూ
వస్తున్నది. ఇందాకే మా హాసం మితృడు హనుమంతరావు మాటల
సంధర్భంలో చెప్పారు. నిచ్చెన , ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు ఒకటె
అని. ఎలా అంటే నిచ్చెన పాపం అక్కడే వుండి మనని పైకి తీసుకొని
వెల్తుంది. మాస్టారు కూడా మనని ఒకటో క్లాసునుంచి రెండో క్లాసుకి
చేర్చి ఆయన మాత్రం ఒకటో క్లాసులోనే ఉంటాడట. నిచ్చెనలపై
కార్టూనులు కూడా చాలానే వచ్చాయి. శ్రి బాపు నిచ్చెన మీద చాలా
మంచి కార్టూనులు వేశారు. నేను BLITZ NEWS WEEKLY లో
WORD PLAY శీర్షిక లో నిచ్చెన పై 1977 , MAY 7th సంచికలో
కార్టూన్ వేశాను. ఈ బొమ్మలో LADDER అనె ఇంగ్లీష్ అక్షరాలు
అగుపిస్తాయి. 1983 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో కూడా ఓ కార్టూన్
నిచ్చెనపై , అదేనండి "నిచ్చెన" సబ్జెక్ట్ పైన వేశాను. ఇప్పటికీ సినీమా
పోస్టర్లను అంటించే ( అశ్లీల పోస్ట్ర్లను మహిళా సంఘాలు కూడా మరోలా
అంటిస్తారనుకోండి) కుర్రాళ్ళు సైకిల్ మీద పొడవైన నిచ్చెనను పెట్టుకొని
బయలుదేరుతారు. మా చిన్నప్పుడు ఇలా రాత్రిపూట పోస్ట్ర్లను అంటించడం
ప్రారంభీచగానే అక్కయ్య చెవులకు జిగురు గమ్ము బకెట్ చప్పుడు ఎలా
విన్బడేదో నన్ను నిద్ర లేపేసేది. మేడ మీద నుంచి చూచే వాళ్ళం ఏ దో
వింతగా. నిచ్చెన ఆటల్లో కూడా కనిపిస్తుంది. వైకుంఠపాళీ లో పాములూ
నిచ్చెనలూ వుంటాయి. ఆ ఆటనే SNAKES & LADDERS అని
అంటారు. మన పాత కాలం సినిమాల్లో నిచ్చెన స్టంట్ సీన్లలో ముఖ్యపాత్ర
వహించిన విషయం కొందరికైనా గుర్తుండే వుంటుంది. విలన్ మెడకు
నిచ్చెన ఓ చివర వుంచి హీరో స్టంట్ చేయడం అదో వెరైటీ ! ఇక కరెంట్
స్ధంబాలపై ఎక్కి రెపరు చేయడానికి కూడా నిచ్చెనే. పెద్ద ఊర్లలో ఆ నిచ్చెనలు
అమర్చిన వెహికల్స్ వుంటాయి. అంటె మన నిచ్చెనకు కూడా వాహన
యోగం కలిగిందన్న మాట !!

2 comments:

  1. సురేఖ గారూ! నమస్తే!
    మీ నిచ్చెనాధిరోహిణి చూసాక దాని మెట్లకి ముగ్గులు పెడదామని నిచ్చెనెక్కా.
    క్రింద చంటి కొమ్మలు కొట్టేస్తున్నాడు. కరెంటు పోతే--- అప్పుడే మనం లిఫ్టులో వుంటే---
    యేకబిగిన యెలా పడతామో.... అలా పడే ప్రమాదం పొంచి వున్నట్టుగా కనపడుతోంది.అయినా
    మీ అధిరోహిణిలో రవ్వంత చోటూ నాకూ యిచ్చారుగా...మహాపండితులు శ్రీ వెంపరాల సూర్యనారాయణ
    శాస్త్రి గారు అప్పుడప్పుడు మా నాన్నగారి దగ్గరకి వచ్చేవారు. అలాంటి ఓ సందర్భంలో
    వారు చెప్పిన గుర్తు. టీచరు, పడవ, నిచ్చెన దాటిస్తారు కాని దాటరుట. అర్థవంతమైన
    మాట. కాదేదీ కవితకనర్హమన్నట్టు నిచ్చెన మీదా బొచ్చెన మీదా..... కాకి మీదా కోకిల మీదా
    కూడా వ్రాసేస్తున్నారు. మీ స్పీడు అందుకొందామని నిచ్చెన యెక్కినా ప్రక్కనేవున్న
    పాముల నోళ్ళలో ఢాం...మళ్ళీ కథ మొదటికి...మేం మొదటి గడికి....శలవు...దినవహి

    ReplyDelete
  2. హనుమంత రావ్ జీ ! మీరు మరీ నా "నిచ్చెన" మీద నుంచి నన్ను
    ములగ చెట్టు ఎక్కించేస్తున్నారండీ బాబూ !.నిజానికి నాకు ఏదో
    లైన్లేయటం ( మీ మాటలోనే) తప్ప మీలా రాయటం రాదు. ఐనా
    మీ అభినందన మరింత బలాన్నిచ్చింది !

    ReplyDelete