Thursday, October 07, 2010

న్యూసు-న్యూసెన్సు!!


"ఏమండీ,సలహాల్రావు గారూ! వార్తలు తెలుసుకోడానికి
టీవీయా, వార్తా పత్రికా ,ఏది మంచిదంటారూ" అంటూ
సందేహరావు అడిగాడు.
"వార్తాపత్రికే నయమండి! ఏమంటే కరెంటు పోతే మీరు
టీవీ చూడలేరు. అదే న్యూస్ పేపరనుకోండీ హాయిగా
విసనకర్రలా విసురుకోవచ్చు" అన్నాడు సలహాల్రావు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఏదుపుకొట్టుడు సీరియల్సు చూడటం మాని చాలా
కాలమయింది.ఇక వార్తలు చూడ్డానికి ఏటీవీ,ఈటీవీ,
నాలుగో టీవీ,ఐదో టీవీ,తొమ్మిదోటీవీ అంటూ ఎన్నెన్నో
టీవీలున్నాయి. ఇక వాటిలో ఎక్కడో ఏ ప్రమాదమో
జరిగితే మన టీవీ వాళ్లకు అది ప్రమోదమే! మావిలేఖరి
నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంటూ
న్యూస్ రీడరమ్మ "హలో నామాట వినబడుతుందా?
లారీ గుద్దుకొని క్రిందబడ్డ ఆయన స్పందన తెలుసు
కోండి" అనగానే ఆ హలో"న్యుస్ రీడరమ్మాయి!ఇప్పూడె
అడిగా, తనకు నరకం కనిపిస్తున్నదని చెప్పాడు!"
అంటాడు. తరువాత "పరీక్షల్లో గోల్ద్ మెడలు సాధించిన
విద్యావతి తల్లిదండ్రుల స్పందన ఏమిటో కనుక్కొని
చెప్పండి" అని రీడరమ్మ అనగానే " ఫెయిలయితే
బాగుండేది.ఇప్పుడు బోల్డు డబ్బుతగలేసి పై చదువులు
చదివించాలని" అంటున్నారని జవాబు! ఈలా వుంటుంటాయి
మన వర్తా చానల్ల తీరుతెన్నులు. అమ్మాయి పరీక్ష పాసయితే
అమ్మానాన్నలు సంతోషిస్తారు, దానికి వాళ్ళ స్పందన ఏమిటో
అడగాలా! ఇక ఏదైనా సంఘటన జరిగితే ఆ రోజంతా అదే
గొడవ,ఇక మరే న్యూస్ లేనట్టు. మరో గమ్మత్తు! ప్రతి చానలు
ఎక్స్క్లూజివ్ అంటూ అదే వార్త కొన్ని నిముషాలతేడాలో
చూపిస్తుంటారు. దేశంలో మోసగాళ్ళు, మోసాలు పెరిగి
పోతున్నాయని సాక్ష్యాలతొ సహా చూపించే వీళ్ళే కొన్ని
మోసాల ప్రకటనలు ప్రతి అరగంటకూ చూపిస్తుంటారు.
ఈ ప్రకటన నిజానిజాలతో మాకు సంబంధంలేదని ముందు
చూపిస్తున్నారనుకోండి.దాన్ని చదివే ఓపిక మనలో ఎందరికి
వుంది. కూరలు తరిగే ఓ సాధనం ఖరీదు 1999/- రూపాయలని
మరో రెండొందలు ప్యాకేజీ చార్జీలని ఓ ప్రకటన తో చానల్లలో
ఊదరగొట్టే వస్తువు మా రాజమండ్రి మార్కెట్లో 380/-లకే
దొరుకుతున్నది! న్యూస్ చానల్ల వల్ల అసలు ఉపయోగం లేనే
లేదనీ అనలేం. రాజకీయనాయకులు, కొందరు లంచగొండి
ఉద్యోగుల గురించి బయటపెడుతుంటూనే ఇన్ని అవినీతి
పనులు జరుగుతుంటే ,ఈ చానల్లే లేకుంటే వీళ్ళ ఆగడాలకు
అడ్డేవుండేది కాదేమో అని ఊక్కోసారి అనిపిస్తుంటుంది!
పైన నే వేసిన కార్టూన్ 1963 లో "నవ్వులు పువ్వులు"
అనే హాస్య పత్రికలో వేసినది. అప్పటికింకా టీవీలు రాలేదు
కాబట్టి రేడియో స్టేషన్లో వార్తలు చదువుతున్నట్లు వేశాను.
మరో విషయం.ఇన్నేసి చానల్లు పుట్టుకోస్తున్నా, మన వార్తా
పత్రికల సర్కులేషను తగ్గక పోవడం, ఓ శుభసూచకమే!
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
గత కొద్దిరోజులనుంచి డిస్కవరీ చానల్ తెలుగులో కూడా ప్రసారం
అవుతున్నది.కాని అనువాదకులు కాస్త శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని
పించింది.మొన్న గుజరాత్ సింహాల గురించి కధనం ప్రసారంచేస్తూ
"సింహాల జనాభా" అన్నపదం వాడారు. మనుషులను లెక్కించేటప్పుడు
ఆ మాటను వాడటం సమంజసం అనుకుంటాను. "సింహాల సంఖ్య"
అంటే బాగుంటుందని నా భావన.ఏ మైనా మన తెలుగులో ప్రసారం
చేయటం వల్ల ఇంగ్లీషు రాని వారికి సౌలభ్యంగా వుంటుంది.

6 comments:

  1. మహ బాగా సెలవిచ్హారు మాష్టారూ !

    ReplyDelete
  2. బాగా చెప్పారండి. న్యూసు జ్ఞానంతో న్యూ-సెన్సు తెచ్చేబదులు న్యూసెన్సు తెస్తున్నాయి నేటి పత్రికలూ, ఛానెళ్ళు.

    >>> పోన్లేండి, తొమ్మిదో టీవీవారిలాగా సింహాల పాపులేషన్ అనలేదు.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. సింహాల జనాభా, ఈ మాటలు తర్జుమా చేసిన వారు "జనాభా" లొ ఉన్న "జన" అంటే ఏమనుకున్నారో. కాని ఆంగ్లంలో అన్నిటికి సెన్సస్ అనే కదా అంటారు. ఈ మాటకి తెలుగు తర్జుమా జనాభా లెక్కింపుగా భావించి ఉంటారు. ఏమైనా సెన్సస్ అన్నఆంగ్ల పదానికి సరైన తెలుగు పదం తయారు చెయ్యాలి. మన డ్రాయింగ్ రూం తెలుగు పండితులు, మరా మాట గ్రాంధికంగా అంటారో, వ్యావహారికంగా అంటారో లేదా శిష్ట వ్యావహారికంగా అంటారో వేచి చూడాలి.

    న్యూస్-న్యూసెన్స్ అద్భుతమైన శీర్షిక మాష్టారూ. ఈ శీర్షికతో ఒక బ్లాగు తెరిచి, ప్రతిరోజూ న్యూస్‌లో వచ్చే అపభ్రంశాలన్ని కడిగిపారెయ్యాలన్న ఆవేశంగా ఉన్నది కాని, ఈ కారణంగా నా ఆరోగ్యం చెడుతుందేమో అని శ్రేయోభిలాషులు చెప్పటం వల్ల వెనక్కి తగ్గాను.మీరు చెప్పిన ఆంగ్ల శీర్షికకు సరైన తెలుగు మాత్రం వార్తలా?-వాంతులా??.

    లేని వార్తలను అదేదో ఉన్నట్టుగా కక్కుకుని, కక్కుకుని చెప్తారు కదా అందుకని వాంతి సరైన పదమని నా భావం.

    ReplyDelete
  5. సింహాల జనాభా అనేది సరైన అనువాదమే. పొఱపాటేమీ లేదు. జన శబ్దం సంస్కృతంలో వ్యక్తివాచకం. అంటే స్త్రీలింగంలోను వాడవచ్చు, పుల్లింగంలోను వాడవచ్చు. ాలాగే నపుంసకలింగంలో కూడా వాడవచ్చు. "వ్యక్తిస్తు పృథగాత్మికా" అనే శ్లోకభాగాన్ని బట్టి individual అయినదేదైనా వ్యక్తే అవుతుంది. అంటే అది కేవలం మానుషవ్యక్తే కానక్కఱలేదు. కనుక సింహాలక్కూడా జనశబ్దాన్ని, వ్యక్తిశబ్దాన్ని అనువర్తించవచ్చు.

    ఈ విచికిత్స తెలుగు అనువాదం గుఱించే కాదు. మూల ఆంగ్లపదమైన Lions' population అనేదాని గుఱించి కూడా చెయ్యడానికి అవకాశముంది. ఎందుకంటే population అనే పదానికి అసలు మూలం populus అనే లాటిన్ పదం. దానికి మానవప్రజలని అర్థం. కానీ ఇంగ్లీషువారు ఈ విచికిత్సకు దిగరు. ఎందుకంటే పదాల అర్థాల్ని వివిధ ఇతరేతర నూతన సందర్భాలకు విస్తరింపజేయడం ఆ భాషేయుల సత్సంస్కారం. మనవలె వారు సరికొత్త దేశి్పదాల కల్పననూ, వాటి కొత్త అర్థాలనూ మహోగ్రంగా రెసిస్ట్ చేయరు.. అలాంటి అభ్యుదయకరమైన మానసిక ధోరణిలోంచే వారి భాష ఎదిగింది.

    ReplyDelete
  6. సంఖ్య, జనాభా - ఈ రెండూ ఒకటి కావు.

    ReplyDelete