Friday, October 22, 2010

పొట్ట మీద పొట్టి కధ


మితృడు హనుమంతరావు తన హాస్యవల్లరి లో తన
పొట్టగురించి మన పొట్ట చెక్కలయేటట్లు వ్రాసింది చదివిన
తరువాత నాకూ పొట్ట గురించి కొన్ని కబుర్లు మీతో
చెప్పాలనిపించింది. ఐనా పొట్టగురించి ఎంతైనా వ్రాయ
వచ్చు. పెద్ద పొట్టగలవారికి ఏదైనా చిరుతిండ్లు తినాలంటే
వాళ్ళ పొట్టే ఓ చిన్నరకం టేబుల్లా ఉపయోగపడుతుందని
హనుమంతరావు చెప్పారు.నేను మాత్రం ఆయన అలా
తనపొట్టను టేబుల్ గా ఉపయోగించడం చూడలేదు కానీ
అప్పుడప్పుడూ ఆయన తన కళ్ళజోడును తీసి తన బొజ్జ
(పొట్టకు ముద్దు పేరు) మీద వుంచుకోవడం మాత్రం
చూశాను. లావుగా వున్న వాళ్ళందరికీ పెద్ద పొట్ట వుండటం
ఏమీ వింత కాదు. ఒక డాక్టరుగారు లావాటి పేషెంటును
లావు తగ్గడానికి వాకింగ్ చేయమంటే ,ఇంత ఒంటి బరువుతో
నడవలేను, వళ్ళు తగ్గాక నడవటం మొదలు పెడతానన్నాడట.
ఐనా లావుగా వున్నంత మాత్రాన అందం గా వుండరా? మహా
నటి సావిత్రి అద్భుతనటన ముందు ఆమె లావుగా వుందన్న
విషయాన్నిఎవ్వరూ పట్టించుకోలేదు. అలనాటి హాస్యజంట
లారెల్, హార్డీలలో హార్డీకీపెద్ద పొట్ట లేదా? పూర్వకాలంనాటి తెలుగు
సినిమాల్లో బొడ్దపాటి లాంటి బొద్దుగా వుండే హాస్యనటులుండే
వారు. "కీలుగుర్రం" సినిమాలో అనుకుంటాను అతనిచేత "నా
వళ్ళు బరువుకూ నే ఏడ్వవలెగాని పరులెందుకేడ్తురోరన్నా"
పాటా పాడించారు. ఇప్పుడు లావుగా పెద్దబొజ్జతో నున్నకృష్ణుడు
హీరోగా సినిమాలు వచ్చాయి. ఇక పొట్ట పొడిస్తే వాడికి
అక్షరం ముక్క రాదని చదువులో వెనకబడిన వాడిని అంటారు.
అలానే ఉద్యోగం లేని వాళ్లని పొట్టచేతబట్టుకు వచ్చాడంటారు.
ఇక తప్పుచేసిన వాళ్ళని వాడి పొట్టకొట్టడం ఎందుకని ఊరుకున్నా
అంటారు. శ్రీ జనార్ధనమహర్షి తన వెన్నముద్దలు పుస్తకంలో పొట్ట
పైఇలా చమత్కరించారు:
మార్నింగ్ వాక్ లు
తక్కువై అతనికి
ఈవినింగ్ వాక్ లు
ఎక్కువై ఆమెకి
.......
*కడుపొచ్చింది.!!
మరో చోట ఇలా అంటారు..
ఆవిడ అదోరకం
అన్నీ *కడుపులోనే
దాచుకుంటుంది
పిల్లాడికి ప్లేస్ లేక
గొడ్రాలు అయ్యింది.
అంటె పొట్ట (*కడుపు) మీద అందమైన కవిత్వాలు చెప్పొచ్చన్నమాట.
మనం చేసే ఉద్యోగమైనా, సినిమాల్లో తారలు,తారడులూ, స్టంట్ చేసే
వాళ్ళు అందరూ పొట్ట కూటి కోసమే కదా! పొట్టలు పెంచని రాజకీయ
నాయకులూ, పోలీసు వాళ్ళు (దొంగలు ఈజీగా తప్పించు
కోడానికి వాళ్ళ పొట్టలే ఎంతో మేలు చేస్తున్నాయి! ,అమెరికా పోలీసులూ
తక్కువ తిన లేదు!పెద్దపొట్టలే వుంటాయి) మనకి ఎక్కడా కనిపించరుకదా?!
సర్జనులు కూడా పేషెంట్ల పొట్టలు కోసి(వాళ్ళ రోగం కుదర్చడానికే) తమను,
వారి హాస్పటలు ఉద్యొగుల పొట్టలను పోషించుకుంటారు. ఎదుటి వాడు
పైకొస్తుంటే కొందరికి కడుపు మంటగా వుంటుంది. ఒంట్లో గాస్ ట్రబులున్నా
పొట్ట మండుతుంది. ఇంట్లో,వంటింట్లో గాస్ట్రబుల్ వచ్చినా ఆకలితో పొట్ట నక
నక లాడుతుంది కదా. ఇక తల్లులకు పిల్లలు ఎలాటి వాళ్ళయినా కడుపు
తీపి తప్పక వుంటుంది. పాపాయికి బువ్వ పెట్టి అమ్మ అనురాగంతో పొట్ట
నిమిరి " చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష " అని దీవెనలు అందిస్తుంది. పొట్టమీద
పొట్టి కధను ప్రారంభించిన నా చేత పెద్ద పొట్ట కధ రాయించిన నా ప్రియ
మితృడు మా హాసం హనుమంతరావుకు శుభాభినందనలతో.
.

2 comments:

  1. మితృలు శ్రీ సురేఖాప్పారావు గార్కి,
    నమోనమః
    నా బ్లాగులో నేను కడుపుచించుకుంటే మీ బ్లాగుమీద పడిందన్నమాట.
    దాంతో మీలో ఆలోచనలు పొటమరించాయి..నా పొట్టమరచాయి..పొట్టికథ
    మీబ్లాగులో గట్టిగా కుదురుకుంది...మీ బొమ్మలూ, మీ కార్టూనులూ, మీ
    బ్లాగుకి కలిపిన అందం...(మీ అంటే ...సేకరించిన, ...గీసిన,...యొక్క అని,
    తర్వాత added beauty అని అన్వయాలు) ఆ చేత్తోనే నా బ్లాగులో
    (dvhrao.blogspot.com) మీ వ్యాఖ్య నమోదు చేయిస్తే....నా యే
    రచనకైనా సరే.....పొట్టనిండా గాలి పీల్చుకుని కడుపారా నవ్వుకుంటాను...
    నలుగురికీ చెప్పుకుంటాను. ఆలోచించగలరు.........శలవు....దినవహి.

    ReplyDelete
  2. బానపొట్ట వాళ్ళందరూ బాధలో వున్నా హాయిగా నవ్వుకునే విధంగా బాగా రాసారండి!

    ReplyDelete