Saturday, October 30, 2010

సుందరకాండ సుభాషితాలు




ఒక్కసారిగా సినిమాలనుంచి ఆధ్యాత్మిక విషయాలలోకి
దూకానని అనుకోకండి. రామాయణం ,ముఖ్యంగా సుందర
కాండ చదువుతుంటే ఈ నాటి యువతీయువకులు
తెలుసుకోవలిసిన పెర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలు
ఎన్నో ఎదురుపడతాయి! మా నాన్నగారి చిన్ననాటి
మితృలు శ్రీ శ్రినివాస శిరోమణి గారు రామాయణాన్ని
తేట తెలుగులోకి అనువదించారు. ఆంధ్రపత్రిక దిన
పత్రిక ఆదివారం అనుబంధమ్ లో వారం వారం ధారా
వాహికగా వెలువడేది.తరువాత పుస్తక రూపంలో
అనేక సార్లు ప్రచురించబడింది. నాకు నచ్చిన కొన్ని
సుందరకాండలోని మంచి మాటలను మీ ముందు
వుంచుతున్నాను
<<<<<<<<<<<<<<<<<<<<<

* ఏ పని చేయవలసిన పని, ఆ సమయంలో ఆ పని
చేయకపోయినట్లయితే సత్పురుషులకు కోపం
వస్తుంది.
* ఉపకారికి ప్రత్యుపకారం చేయడము సనాతన ధర్మము.
* ధర్మజ్ఞులకు, ధర్మజిజ్ఞాసువులకు అతిధి ప్రాకృతుడు
అయినప్పిటికిన్నీ పూజార్హుడు.
* హనుమంతునికి ఉన్నట్లు ధైర్యమూ, దూరదృష్ఠి,
మేధస్సూ,కార్యసాధన, సామర్ధ్యమూ ఎవడికి
ఉంటవో, వాడి పనులు ఏవీ చెడవు.
* ఆలోచనలేని దూతలు దేశకాల విరుద్ధముగా
ప్రవర్తిస్తే సూర్యోదయవేళ చీకట్లు పటాపంచలు
అయినట్లు, కాబోతున్న పనులు కూడా నాశనము
అయిపోతవి.
* శుభాశుభ స్థితులలో ఇంద్రియాల ప్రవర్తనకు మనస్సే
కారణము. మనస్సును బట్టే దేహేంద్రియాలు ప్రవర్తిస్తూ
వుంటవి.
* ఉత్సాహమే సర్వశుభాలకూ ఆధారము. ఉత్సాహమే
సర్వకార్యాలకు సాధనము. ఉత్సాహమువల్లే ఏ పని
అయినా సమకూరుతుంది.
* చనిపోవడం వలన (ఆత్మహత్య) అనేక దోషాలు వస్తవి.
జీవించి వుంటే ఎప్పటికైనా శుభాలు సంప్రాప్తము
అవుతవి.
* స్త్రీలకు ఆభరణాలకన్నా ఆభరణమైన వాడు భర్త.
* ప్రవాహములో కొట్టుకుపోయిన నీళ్ళు తిరిగి రావు.
అట్లాగే గడిచిపోయిన యౌవ్వనము తిరిగి రాదు.
*కృతఘ్నులు మాత్రమే స్నేహాన్ని విస్మరిస్తారు.
* బ్రతికి వుంటే నూరు సంవత్సరాలు అయిపోయిన
తరువాతను అయినా సంతోషము అనుభవించ వచ్చును.
* జఠరాగ్ని దీపనము ఎంత వున్నపటికినీ విషము
కలిపిన అన్నము తిని, జీర్ణము చేసుకొని జీవించి
వుండటము అశక్యము.
* కోపము రేగినప్పుడు నిప్పును నీళ్ళతోవలె కోపాన్ని
తన బుద్ధిబలముతో చల్లార్చుకోవలయును.
ఈ రోజు శనివారం.హనుమంతునికి ఎంతో ప్రీతి
పాత్రమైన రోజు. హనుమానుని వేషంలో వున్న
ఈ చిన్న వాడు మా దౌహితృడు చిరంజీవి కౌస్తుభ్
(ముంబాయి).బాపు గారు గీసిన హనుమంతుని బొమ్మలు
Inter Culture Asociates,Thompson,Connecticut,
U.S.A వారి కోసం సంస్కృతి ఇంటర్నేషనల్ ,మద్రాసు
వారు ఇంగ్లీషు,ఫ్రెంచి,శ్పానిష్ భాషలలో ప్రచురించిన
రామాయణం పుస్తకం సౌజన్యంతో. శ్రీ ముళ్ళపూడి
వెంకటరమణ గారు ఈ రామాయణాన్ని తెలుగులో
వ్రాశారు.శ్రీ బాపు అసలు సిసలు తెలుగు చిత్రకళ అయిన
కలంకారీ రీతుల్లో బొమ్మలు వేశారు.

1 comment:

  1. శ్రీ సురేఖగారూ,
    ఇప్పుడే హనుమయ్యను చూసా....బాగా వ్రాసారు. గాయత్రీమంత్ర
    భూయిష్టమైన రామాయణంలో ప్రతిపాత్రా పత్యేకమైనదే...
    హనుమది మరీ విశేషం...మీరు ప్రస్తావించినట్టు వ్యక్తిత్వ
    వికాసానికి...అదే సమయంలో ఆధ్యాత్మిక సాధనలో వున్న
    వారికి పాఠాలు చెప్తాడు మారుతాత్మజుడు. అతన్ని పట్టుకుంటే
    శ్రీ రామచంద్రుడు అందుతాడు...అలా అనుభవం పొందినవారు
    తులసీదాసు మొదలైనవారు....బంటు రీతి కొలువిమ్మన్నాడు
    త్యాగయ్యగారు...హనుమ స్మరణ....చాలా సంతోషం......దినవహి.

    ReplyDelete