Sunday, October 17, 2010

పండుగలు- సరదాలు!!





ఇప్పుడు పండుగలొస్తున్నాయంటే హడావిడీ తప్ప ఆనాటి సరదాలు
సంబరాలు అగుపించవు. అబ్బాయిలూ అమ్మాయిలూ ఎక్కడో దూరంగా
వుంటున్నారు. అందరూ కలవాలంటే వీలుబడదు. ఓ వేళ శలవులు ఒకే
సారి దొరికినా, ప్రయాణానికి రిజర్వేషన్స్ దొరకవు. ఇక సందడి ఎక్కడ
చెప్పండి. ఇదివరలో పండగలొస్తున్నాయంటే ఓ నెల రోజుల ముందు నుంచే
ఇంట్లో పెళ్లి జరుగుతున్నంత సందడి! మా అమ్మగారు తెల్లవారుజామున
మూడింటికే లేచి పిండివంటలు చేసేవారు. ఇప్పుడా ఓపికలూ, టైమూ లేవు.
దసరా వస్తుందంటే బడి పిల్లల్ని వెంట బెట్టుకొని మాస్టార్లు పాటలు పాడిస్తూ
ఇంటింటికీ తిరిగేవారు. పిల్లలచేతిలో రంగు రంగుల విల్లంబులుండేవి. ఓ నెల
ముందే షాపుల్లో వాటిని వేళ్ళాడగట్టి అమ్మేవారు. ఇప్పుడవి ఎక్కడా
కనిపించడం లేదు. కొందరు బాగా ధనవంతుల పిల్లలు వెండి విల్లంబులతో
వచ్చేవారు. పాటలతో బాటు టీచర్లు ఈ దసరాకు పద్యాలూ నేర్పేవారు.
"పార్వతీపతి తెలుపు,పాలసముద్రం తెలుపు, కారుమేఘము నలుపు,
కర్రావు నలుపు,నీలి మేఘము నలుపు,నింగి నలుపు"అంటూ ఇలా పకృతిని,
ఆ పకృతిని సృష్ఠించిన భగవంతుని గురించి ప్రభోధించే వారు.
ఇక దీపావళి వస్తుందంటే ఓ నెల రోజులముందుగానే టపాకాయలమోత
ప్రతి రోజూ మోగిపోతూవుండెది. మా చిన్నప్పడు ప్రతి కుర్రవాళ్ల దగ్గర రోలు
రోకలి అనే వస్తువుండేది. చాలా మందికి తెలిసే వుంటుంది. చూడని వాళ్లకోసం
బొమ్మ గీసి చూపిస్తున్నాను. అందులో గంధకం వేసి నేలపై కొడితే ఢాం అని
పేలేది. అలానే కప్పగంతులు అని చిన్న అట్టపెట్టెలలో వచ్చేవి. కుంకుమ
స్టిక్కర్ల లాంటి వాటిని నేలపై గీసి వదిలితే ఆ రాపిడికి నిప్పంటుకొని అచ్చు
కప్పల్లా గెంతులేసేవి.తరువాత వాటిని బాన్ చేశారు.
పండుగలొచ్చాయంటే తెలుగు పత్రికలు కూడా ఆ సంబరాలలో
ప్రత్యేక సంచికల ద్వారా పాలు పంచుకొనేవి. ఆంధ్ర వారపత్రిక పండుగులకు
బాపూ గారిచేత అందమైన ముఖచిత్రాలు వేయించేది.దసరాకు పిల్లలకు
చిత్రరచన పోటీలు ఏర్పాటు చేసేది. ఇక్కడ మీరు చూస్తున్న రెండు చిత్రాలు
1954 దసరా సంచికలోనివి. దీపావళి వచ్చిందంటే "చందమామ" దీపావళి
సంచికకోసం ఆతృతతో ఎదురు చూసే వాళ్ళం. 1953 దీపావళికి మొదటి
సారిగా చందమామ లో "పొట్టిపిల్ల" అనే రంగుల బొమ్మలతో కధ వచ్చింది.
ఆంధ్రపత్రిక వీక్లీ పండుగ సంచిక "మరికొళొందు" అనే సెంటును పూసుకొని
సువాసనలు వెదజల్లుతూ వచ్చేది. ప్చ్! వెనుకటి రోజులు తలచుకొంటేనే
మనసు ఆనందంతో నిండిపోతుంది. మీ అందరికీ మా ఇంటిల్లిపాది దసరా
శుభాకాంక్షలు !!రాజమండ్రి దేవీచౌక్ లొ నవరాత్రి ఉత్సవాల దీపాలంకరణ
ఫొటో నిన్న రాత్రి నా కమేరాలో బంధించాను.

4 comments:

  1. విజయదశమి శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. ఈ విజయదశమికి ఆ జగజ్జనని మీకు సకల శుభాలు అందించాలని కోరుకుంటూ............

    - SRRao

    శిరాకదంబం

    ReplyDelete
  3. దసరా శుభాకాంక్షలు .

    ReplyDelete