Tuesday, October 19, 2010

జంధ్యాల సినిమా మాటలు-నవ్వుల ముత్యాల మూటలు !!


"నవ్వించడం ఒక యోగం
నవ్వడం ఒక భోగం
నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల.
అసలు సిసలు తెలుగు హాస్యానికి నిర్వచనం
చెప్పిన జంధ్యాల మనల్ని వదలి దేముళ్ళను
నవ్వించడానికి మనల్ని ఏడిపిస్తూ స్వర్గానికి
వెళ్ళిపోయారు. తెలుగు తెర మీద సకుటుంబంగా
నవ్వుల హస్యం ఆయనతోబాటే మనకూ దూరమై
పోయింది. ఆయన చిత్రాలలోని కొన్ని నవ్వుల
మాటల ముత్యాలను ప్రోగుచేసి ఏరుకుందాం!
>>>>>>>>>>>>>>>>>>>>>>>>
"చూపులు కలిసిన శుభవేళ" చిత్రంలో శ్రీకోట
గ్రాంధికంలో మాట్లాడతారు.
"మోహన్ నాకు తెలుగు సంస్కృతి అన్న ఇష్టము.
తెలుగు ప్రజలన్న ప్రాణము. తెలుగు భాషయందు
మక్కువ ఎక్కువ. ఎందులకో తెలియునా..తెలుగు
భాషలో అక్షరముల సంఖ్య ఎక్కువ. ఆ యాబది
ఆరు అక్షరములు సఖ్యతతో, స్నేహశిలతతో కలిసి
యున్నవి. ఒక కుటుంబమనిన తెలుగు భాషవలె
తాత,తండ్రి,బిడ్డ,మనుమలు,మునిమనువలు అందరూ
కలిసి ఏక కుటుంబముగా ఒకే నీడన వుండవలెనని
నా ఉద్దేశ్యము" కొన్ని ఇంగ్లీషు పదాలకు ఆయన
చెప్పిన తెలుగు పదాలు !!
బస్టాండ్ : చతుశ్చక్రశకట నివాసస్ఠానము
కాఫీ : నిశివరోస్తూతకం
పోస్ట్ మాన్ : ఉత్తర కుమారుడు
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
"వివాహ భోజనంబు" లో సుత్తి వీరభద్రరావు పాత్ర
సంభాషణలు మనల్ని నవ్వుల్లో ముంచెత్తుతాయి.
"తెర లేవంగానే హీరో ఓ కాఫీ హోటల్ కెలతాడు.
సర్వర్ రాగానే హీరో ఏమున్నాయ్ అని అడిగాడు.
అప్పుడు సర్వర్ ఇడ్లీ,రవ్వడ్లీ,గారె,మసాలాగారె,ఉప్మా,
కిచిడీ,పెసరట్టు,మినపట్టు,రవ్వట్టు,మసాలా అట్టు,
బాతు,టమాటోబాతు,బొండా,బజ్జీ,మైసూర్ బజ్జీ,
మిరపకాయ బజ్జీ,అరటికాయ బజ్జీ,తమలపాకు బజ్జీ,
లడ్డు, బందరు లడ్డు, రవ్వలడ్డు,మిఠాయి,పీచు మిఠాయి,
బందరు మిఠాయి,బొంబాయి మిఠాయి,కలకత్తా మిఠాయి,
జాంగ్రీ,పాలకోవా,హల్వా,మైసూర్ పాకు,అమలాపురం
కాజా,భీమవరం బాజా,పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు.
అప్పుడు హీరో అట్టు తెమ్మంటాడు. అప్పుడు సర్వర్ ఏ అట్టూ..
పెసరట్టా,మినపట్టా,రవ్వట్టా,మసాలాఅట్టా,సెవెంటీఎమ్మేమ్ము
అట్టా, ఎంఎల్.ఏ.అట్టా,నూనేసి కాల్చాలా,నెయ్యేసి కాల్చాలా
నీళ్ళొసి కాల్చాలా,పెట్రోలుపోసి కాల్చాలా,కిరసనాయిలుపోసి
కాల్చాలా,డీజిలేసికాల్చాలా,అసలు కాల్చాలా వద్దా అని
అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్చమన్నాడు,
కాఫీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు..ఏ కాఫీ..మామూలు
కాఫీయా,స్పెషలు కాఫీయా,బుర్రూకాఫీయా, నెస్సు కాఫీయా,
బ్లాక్ కాఫియా,వైటు కాఫియా,హాటు కాఫియా,కోల్డ్ కాఫియా,
నురగ కావాలా, వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు కావాలి అని
అడిగాడు.అప్పుడు హీరో మామూలు కాఫి తెమ్మన్నాడు.
అప్పుడు సర్వరు నీలగిరి కాఫీయా,హిమగిరి కాఫీయా,సిమలా
కాఫియా..." అని ఇలా వీరభద్రరావు అనర్గలంగా చెబుతుంటే
బ్రహ్మానందం ":ఆపండి మహాప్రభో..ఆపండి.తమలో ఇంత
ఊహా శక్తి ఉందని ఊహించలేకపోయాను.ఈ కధే సినిమా
తీసుకోండి పదివేల రోజులాడుతుంది "అంటాడు.
మరో సారి ఊర్ల పేరు చెబుతూ, " హైదరాబాదు,అదిలాబాదు,
సికిందరాబాదు,అహ్మదాబాదు,ఫకీరాబాదు,అలహాబాదు,
ఫరీదాబాదు,ఔరంగాబాదు,దన్ బాదు,సింధ్ బాదు,ముస్తాబాబాదు,
పైసలాబాదు,ఘజియాబాదు,అబ్దుల్లాబాదు,చపాలాబాదు,హుస్సేను
బాదు అంటుంటే, బ్రహ్మానందం,"నా బొందబాదు, శ్రార్ధం బాదు..
నా పిండాకూడుబాదు అంటాడు.
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
"రెందు రెళ్ళు ఆరు" సినిమాలో వీరభద్రరావుగారి ఈ డైలాగులు
మరోసారి గుర్తు చేసుకోండి.
"నేను ఇంట్లో వంట చేస్తానని చెప్పిన ఆ శుంఠ ఎవడు?"
"మీ ఏరియా ముష్ఠివాడు సార్"
"ఎవరూ..మా ఏరియా ముష్ఠివాడా..వాడి మాటలు నమ్మి
మీ గైండర్ కంపెనీ పబ్లిసిటీలో నా ఫొటో వేసుకుంటావా..
ఇలా నాతో మాట్లాడటానికి ఎన్ని గుండెలురా రాస్కేల్..
ఇంకోసారి ఇటు వచ్చి కనబడు..నిన్ను రోట్లోవేసి రుబ్బుతా
గైండర్ వెధవా"
వీరభద్రరావు భార్య శ్రీలక్ష్మి తో "ఇవాళ నేను నీకున్నాను.
వండి పెడుతున్నాను. రేపు అటో ఇటో అయితే నీకు తిండి
ఎలా చెప్పు?"
" నా అదృష్టం ఇంతే అనుకొని హోటల్ నుంచి క్యారియర్
తెప్పించుకొంటాను" అని తాపీగా జవాబిస్తుంది శ్రీలక్ష్మి.
ఇలా జంధ్యాల నవ్వుల మాటలు ఆయన సినిమాల్లో కోకొల్లలు.
జంధ్యాల వ్రాసిన మంచి జోకులు రెండు వాల్యుములుగా
ఎమెస్కో వారు ప్రచురించారు. ఒక్కో వాల్యూమ్ పాతిక
రూపాయలే! కడుపారా తృప్తిగా పదేపదే నవ్వుకోవచ్చు.

7 comments:

  1. ఆనందభైరవిలో సుత్తివీరభద్రరావుగారు 'క'లు,'న'లరతో వదిలే టంగ్ట్విష్టర్స్ - జంధ్యాల తప్పితే ఎవ్వరూ రాయలేరు.

    http://gsnaveen.wordpress.com/2006/10/12/jandhyala_meccutunakalu/

    ఇక జంధ్యాల ఇతర దర్శకులకి చేసిన ముత్యాలు మరువగలమా - శంకరాభరణం, జగదేకవీరుడు-అతిలోకసుందరి, ఆదిత్య369, వేటగాడు, మొ॥

    ReplyDelete
  2. నిషివర్ణోష్ణొదకం -- నిషి వర్ణ ఉష్ణ వుదకం ...

    ReplyDelete
  3. ee book tappakunda konaalandi.....evarimeedaina kopam vahcinapudu ee book chaduvukuntee hayigaa navvukovachemo !! :))

    ReplyDelete
  4. ఒక డిశెంబర్ 31 న నెక్లస్‌రోడ్ లో జరిగిన ఫంక్షన్‌లో జంధ్యాల గారు ఆయనకు నచ్చిన జోక్ చెప్పారు. ఒక జంటకు పెళ్ళి అయి 50 సం: పూర్తి అయిన సందర్భంగా జరిగిన ఫంక్షన్ లో స్నేహితులు అడుగుతారు మీ success ఫొర్ములా ఏమిటని . పిల్లలకు ఏమి చదువు చెప్పించాలి, పెళ్ళి సంబంధాలు , ఎక్కడ పెట్టుబడులు పెట్టాలు లాంటి చిన్న చిన్న విషయాలు మా ఆవిడ చూసుకొంటుంది , ఇండియా అమెరికా సంబంధాలు , కాశ్మీర్ వ్యవహారం , గ్లోబల్ వార్మింగ్ లాంటి పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ నేను చూసుకుంటా . ఒకొళ్ళ వ్యవహారాల్లో ఒకళ్ళు తల దూర్చం . అదే మా ఈ సఫల జీవన యాత్రకు కారణం అన్నాడట.

    ReplyDelete
  5. జంధ్యాల గారి సినిమాల ను గురించి జంధ్యామారుతం అనే వరస పుస్తకాలు హాసం పబ్లికేషన్స్ వారు కొన్ని తెచ్చారు కదండీ!జంధ్యాల తెలుగువాడవటం మన అదృష్టం.సినిమాలు తీయటం వల్ల చాలామందికి దగ్గరయ్యారు.అతి పిన్న వయసులోనే పోవటంమన దురదృష్టం .మీ వ్యసం చాలా బాగుంది.

    ReplyDelete
  6. @హనుమంతరావుగారు: జంధ్యామారుతం పుస్తకాలు వారి సినిమాల గురించి చాలా విషయాలు బాగా రాశారు, నాకిష్టమండీ. నాకు తెలిసి రెండుభాగాలు తెచ్చారు. ఇంకా, కొత్త సంచికలు ఏమన్నా వచ్చాయా?

    ReplyDelete