Friday, December 03, 2010

ఓ "రేపు" కధ !!



మన పెద్దలంటారు. ఈ రోజు గురించి కాదు, రేపటి గురించి ఆలోచించమని.
రేపు అన్న పదానికి ఈ రోజుల్లో మహ చెడ్డపేరొచ్చింది ! న్యూస్ పేపర్లలో,
ఎలట్రానిక్ మీడియాల్లో ప్రతి రోజు రేపు అగుపిస్తూ అసలు "రేపు" కు
అర్ధాన్ని మార్చి పారేసింది. అసలు పేపర్లలో ఈనాడు మనం చదివే
రేపు వార్తలు నిజానికి నిన్నటివే! ఇక అసలు రేపు గురించే చెప్పుకుందాం!
ప్రతి వాళ్ళు రోజులు మారుతాయేమో నని రేపటి రేపు గురించి ఆత్రంగా
ఎదురు చూస్తుంటారు. రేపటి కోసం తను అనుభవించకుండా విపరీతంగా
పొదుపులు చేసే పిసినారులూ వున్నారు. రేపటికోసం కొంత దాచుకోవటం
మంచిదే కానీ అందుకోసం అన్ని అడ్డదారుల్లొ సంపాదించుకోవడం అవసరమా?
రేపు మాటను వ్యాపారస్తులు అరువులడిగే తమ ఖాతాదారులు ఇబ్బంది
పడకుండా కొట్టు బయట పెద్ద అక్షరాలతో " అరువు రేపు" అన్న బోర్డు తగిలిస్తారు.
రేపైనా మంత్రి పదవులు రాక పోతాయా అని ఆశావహులు ఆ రేపటి కోసం గుంట
నక్కల్లా ఎదురుచూస్తుంటారు. పదవి వచ్చాక మంచి పోర్టుఫోలియో గురించి
మరో రేపు కోసం ఎదురుచూస్తారు. ఎవడైనా "గాలి" లోంచి డబ్బులు ఎగరేయ
బోతాడా అని శాఖలు నచ్చని మంత్రులు ఆ రేపటి కోసం ఎదురు చూస్తుంటారు.
ఇక సామాన్యుడు రేపైనా మంచి రోజులొస్తాయేమోనని ఆశగా రాబోయే రేపటి
కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటాడు. ఇల్లాటి రేపులను గురించి
తలచుకుంటుంటే నిజంగా భయమేస్తుంది. మన భావితరాలవారికైనా ఓ మంచి
రేపు ఉదయించాలని కోరుకుందాం!
>>>>>>>>>>>>>>>>>>>oOo<<<<<<<<<<<<<<<<<<<<<<<

1957 లో " రేపు నీదే " అనే సినిమా , షావుకారు జానకి ,జగ్గయ్య నాయకీ
నాయకులుగా భాస్కరరావు దర్శకుడిగా విడుదలయింది. ఆ చిత్రం విజయం
సాధించలేదు. అందుకు కారణాన్ని ఒకాయన ఇలా చమత్కరించాడు." రేపు
నీదే" అన్నారుగా నిర్మాతలు, ప్రేక్షకులు కూడా రేపు మనదే గదా రేపు చూద్దాంలే
అనుకున్నారు!"
>>>>>>>>>>>>>>>>>>oOo>>>>>>>>>>>>>>>
బ్లాగులో రేపు ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఏం రాయాలో తోచక ఆ "రేపు"
గురించే రాయాలని డిసైడ్ చేసేసా! ఇక రేపటి సంగతి రేపు ఆలోచించొచ్చు!!



No comments:

Post a Comment