Sunday, January 31, 2010

ముత్యాల ముగ్గు కంట్రాక్టర్ గారి ఆహ్వానం



బాపు రమణ గార్లు ముత్యాల ముగ్గు ఎంత అందంగా తీసారో అంత
ముచ్చట గా వంద రోజుల ఆహ్వానం వేసారు! కాంట్రాక్టర్ వంద రోజుల
పండక్కి తన భాషలో పిల్చాడు . మిరే చిత్తగించండి!!

Thursday, January 28, 2010

కినిమా పజిల్



1963 అంటే 47 ఏళ్ళక్రితం నేను మద్రాసు నుంచి మధుమూర్తి
గారి సంపాదకత్వం లో వారపత్రికగా వెలువడిన "కినిమా" అనే
పత్రికలో వారం వారం సినిమా పజిల్స్ వేసేవాడిని.ఆ నాటి నా
పజిల్స్ రెంటిని ఇక్కడ ఇస్తున్నాను.అందులో ఒకటి సినీ నటి
శ్రీమతి జమున పూర్తీ చేసి జవాబు పంపారు.



రెండో పజిల్ చూడండి.ఇందులో మొదటి బొమ్మలో అక్కినేని,తరువాత లక్ష్మిదేవి వరాలు పొందుతున్న
భక్తుడు,ఆఖరి బొమ్మలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఎంబ్లం ఉన్నాయి.
ఈ బొమ్మకు జవాబు : అక్కినేని లక్ష్మి వర ప్రసాద్
అన్నమాట!(దర్శకుడు యల్వీ.ప్రసాద్)
అవండి,ఆ నాటి నా జ్ఞాపకాలు.

Wednesday, January 27, 2010

పద్మశ్రీలు





ఈ ఏడాది ప్రదానం చేసిన పద్మ అవార్డులు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చాలా నిరాశాజనకంగా ఉన్నాయి.అన్యధా భావించకపోతే ప్రభుత్వం దృష్టిలో చొక్కాలు విప్పుకొని అర్ధనగ్న ప్రదర్శన చేసే హీరోలే (ఈ మధ్య ఆందోళన లలో కూడా అర్ధనగ్న ప్రదర్శన కూడా ఓ ఫాషనై పోయింది) ఈ బిరుదులకు అర్హులేమో!నిన్న దిగవంతులైన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వీళ్ళ దృస్టికి రాక పొవడం మన తెలుగువాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం కాక మరేమిటి? పౌరాణిక,జానపద,సాంఘిక చిత్రాల్లో ఆయన విభిన్న పాత్రలు పోషించారు. అలానె విదేశాల్లో సాంకేతికంగా పేరు ప్రఖ్యాతులు పొందిన సీతా కళ్యాణం లాంటి చిత్రాలను తీసిన బాపు రమణ గార్లను ఈ అవార్డ్లకు గుర్తించకపోవడం నిజంగా భాధాకరం.ఐనా మనం ఇలాటి విషయాల్లో స్పందించం.తెలుగు వాళ్ళు చాలా విశాల హృదయులు కదా మరి. ఏదో గుడ్డిలో మెల్ల. గాయకులు నూకలచిన సత్యనారాయణ గారికి, శొభారాజ్ గారికి ఇచ్చినందుకు సంతోషిద్దాము.

Tuesday, January 26, 2010

Happy Annivarsary Ramana garu



ఈ రోజు 26-01-2010 న 46వ వివాహ వార్షికోత్సవం
జరుపుకుంటున్న శ్రీ ముళ్లపూడి వెంకట రమణ,శ్రీమతి
శ్రీదేవి దంపతులకు మన బ్లాగర్లందరి తరఫున హృదయ
పూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నాను.

Monday, January 25, 2010

ఆ నాటి కుర్చీ కబుర్లు



ఇక్కడ మీరు చూసే ఈ కుర్ఛి ఆ కుర్ఛీ మీద దర్జాగా కూర్చున్న
ఫొటోకి ఓ కధ వుంది. ఇప్పుడా ఫొటోలో వున్న కుర్చీయే ఆ
కుర్చి. ఇక ఆ ఫొటోలో వున్నది మా నాన్నగారు,అమ్మగారు,
అక్కయ్య వరలక్ష్మి సరోజిని. ఇప్పుడు వైజాగ్లో వుంది.ఆ ఫోటో
మా అక్కయ్య కు మూడేళ్ళ వయస్సప్పుడు తీసింది. విచిత్రం
ఏమిటంటే ఇంకా ఆ కుర్ఛీ మా ఇంట్లో క్షేమంగా ఉంది.మొన్న
ఆదివారం (17-01-10) న మన సాహిత్యాభిమాని బ్లాగర్
శ్రీ శివరామప్రసాద్ గారు బెంగళూర్ నుంచి నన్ను కలవటానికి
రాజమండ్రి వచ్చి అలా అలనాటి ఆ కుర్చీ పై ఆ ఫొటోను పెట్టి
ఫొటో తీసారు. మీరు ఫొటొను జాగ్రత్తగా చూస్తే ఆ కుర్ఛీ కనిపిస్తుంది.
ఇదో మరపురాని అనుభూతి. మీతో పంచుకుంటున్నాను.
ఆ ఫొటో తీసిన సంవత్సరం 1939! అంటే 71 సంవత్సరాలయింది!!

Saturday, January 23, 2010

కుడి ఎడమైతే పొరబాటు కలదోయ్!





ఏమిటీ అలనాటి దేవదాసు తాగకుండా పాడేస్తున్నాడేమో నని ఆశ్సర్య
పడుతున్నారా?! అసలు కధ ఏమిటంటే 1950 ప్రాంతాలలో పోస్టల్ శాఖ
చేత విడుదలయిన ఒక అణా (నేటి విలువ ఆరు పైసలు) భొధిస్వతుని
బొమ్మతో వచ్చిన స్టాంప్ ఒక సారి కుడి వైపు తిరిగి కూర్చున్నట్లు మరో
సారి ఎడమవైపు కూర్చున్నట్లు వచ్చింది. అటు తరువాత తప్పును కనుక్కొని
ఎడమవైపుగా వున్న స్టాంపును పోస్టల్ శాఖ తొలగించిందట. అలా కుడి
ఎడమలతో విడుదలయిన రెండు తపాలా బిల్లలు నా స్టాంప్ కలెక్షన్స్ లో
వున్నాయి.వీటిని సేకరించింది మా నాన్న గారు. ఆ స్టాంపుల బొమ్మలను
ఇక్కడ మీ కోసం.

Thursday, January 21, 2010

సుస్వర నాట్య నటీమణి టంగుటూరి సూర్యకుమారి


మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి భరతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం "మాదీ" వింధ్య హిమవత్ శ్రీ నీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి గంగా గోదావరీస హ్యాజా తుంగతరింగిత హృదయాల్ మావి "మాదీ" ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూత నేతిహాసం "మాదీ" అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర.... ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధి గౌతముల సువాక్కులు "మాదీ" స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు జననీ ఓ స్వతంత్ర దేవీ కొను మా నివాళులు మావి "మాదీ"


శ్రి బలాంత్రపు రజనీకాంతరావు గారు వ్రాసిన ఈ పాట టంగుటూరి సూర్యకుమారి గాత్రంలో దేశప్రజలను ఉత్తేజపరిచింది.తెల్లవారి తుపాకీలకు ధైర్యంగా గుండెలు చూపిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం తమ్ముడి కుమార్తె 1925లో విజయవాడలో జన్మించింది. సంగీతం,నృత్యంలో శిక్షణ పొందిన ఈమె కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేసింది. సూర్యకుమారి మిస్ మద్రాసుగా సౌందర్య పోటీలోఎన్నికయింది.1937 లో విప్రనారాయణ తమిళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిఛయమైంది.ఆమె తెలుగులో జయప్రద,రైతుబిడ్డ, చంద్రహాస,దేవత,దీనబంధు,భాగ్యలక్ష్మి,రామదాసు తమిళంలో విప్రనారాయణ,కటకం,సంసార నౌక కన్నడంలో భారతి హిందీలో వతన్,ఉడన్ఖటోలా(ఉత్తమనటి గా ఫిల్మ్ఫేర్ అవార్డ్).ఆమె మరదలుపెళ్ళి చిత్రంలో కధానాయకిగా కాకుండా నాగయ్య గారితో సంగీత దర్శకత్వం కూడా నిర్వహించింది.ఈ చిత్రానికి విలన్గా ప్రసిద్దికెక్కిన ముక్కామల దర్శకుడు.ఈ తరం వాళ్ళు ఆయణ్ణి ముత్యాలముగ్గు లో ఎంతటి సరసడువో తెలిసెరా అన్న పాటలో చూశారు.నాగయ్య గారిని అభిమానించే ఈమె "భక్తపోతన" చిత్రంలో సరస్వతిగా నటించింది.(ఫొటో చూడండి) కృష్ణప్రేమ చిత్రంలో నారదుడిగా చొక్కా వేసుకొని నటించీంది!





సూర్యకుమారి పాడిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. 1939లో నిర్మించిన రైతుబిడ్డ చిత్రం (పోస్ట్ కార్డు) వెనుక ప్రింటెడ్ ఇన్ జపాన్ అని వుండటం విశేషం.ఈ బొమ్మను నాకు ఫణి నాగేశ్వరరావు గారనే మితృలు ఇచ్చారు.మరో కలర్ బొమ్మ శ్రీ బాపు వేసినది. సూర్యకుమారి పై క్రియేటివ్ లింక్స్ పుస్తకం ప్రచురించారు.ఖరీదు రూ.3,990/-!

Monday, January 18, 2010

ఇద్దరు మితృలు యన్టీఆర్,ఏయన్నార్ కధ





జనవరి 18 వ తేది నందమూరి తారక రామారావు గారి 14 వ వర్ద్హంతి.తెలుగు సినీ పరిశ్రమలో యన్టీఆర్,ఏయన్నార్ ఒకరికి ఒకరు పోటీగా వివిధ పాత్రలలో నటించి తెలుగు సినిమాకు రెండు కళ్ళుగా ఈ నాటికి పరిశ్రమ చేత ,అశేష ప్రేక్షక అభిమానులచేత ప్రశంసలు పొందారు. శ్రీ రామారావు శ్రి కృష్ణుడు,శ్రీ రాముడి పాత్రల్లో దేముడి రూపం ఇంత సౌందర్యంగా వుంటుందనే భావన ప్రెక్షకుల్లో నిలచిపోయింది.ఇక అక్కినేని మొదట్లో బాలరాజు,కీలుగుర్రం లాంటి ఎన్నో జానపద చిత్రాల్లో,చెంచులక్ష్మి ,మాయాబజార్ లాంటి విజయవంతమైన పౌరాణిక చితాల్లో నటించారు.ఆ రొజుల్లో శ్రీ ముళ్లపూడి తన "నవ్వితే నవ్వండి" లో వీళిద్దరి పై ఈ క్రింది జోక్ వ్రాసారు. పాతాళ భైరవి చిత్రం విడుదలై బ్రహ్మాండంగా నడుస్తున్న రోజులవి.అప్పటికింకా ఎన్.టి. రామారావుకు నాగేశ్వర్రావుకున్నంత పేరు రాలేదు.నాగేశ్వర్రావు జానపదాల హీరోగా బాగా పేరు మోశాడు.చితం చూసిన ఇద్దరు ప్రేక్షకులు ఇవతలికి రాగానే " ఆ మొసలి పోరాటం ఉంది చూశావ్? అబ్బ...ఎంత సేపు పోరడాడయ్యా ఆ రామారావు?" అన్నాడు ఒకడు. "అంతేలే.రామారావు కొత్త గదా.అంచేత అరగంట పట్టింది.అదే మన నాగేశ్వర్రావైతేనా- చిటికలో చంపేసి ఊండును" అన్నాడు మితృడు.


ఇక్కడ మీరు చూసే యంటీఆర్,ఏయన్నార్ ఫొటో ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక 20-3-1970 (నలభై ఏళ్ళ నాడు) వేసిన ముఖచిత్రం!

Sunday, January 17, 2010

అలా కలిశాం

నాకు ఇవ్వాళ ఆనందకరమైన రోజు. ప్రియ (బ్లాగు) మిత్రుడు శ్రీ శివరామ ప్రసాదు గారు మా ఇంటికి వచ్చారు . ఇంతకాలం బ్లాగుద్వారా మాత్రమె పరిచయమే కాని కలుసుకున్నది లేదు. ఈ రోజు మాత్రం శివ గారు మా ఇంటికి వచ్చి నన్ను కలుసుకుని ఆయన ఆనందించారు, నాకు ఆనందాన్ని ఇచ్చారు. మేము కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలమే తెలియలేదు. అలాఅలా చాల సమయం గడిచిపోయి, అరె ఇంతసేపు మాట్లాడేసు కున్నామా అని ఇద్దరం కూడా ఆశ్చర్య పోయాము. నా దగ్గర ఉన్న పాత కాలపు కీ గ్రామ ఫోను చూసి అబ్బురపడి, అది తిప్పి అందులో పాట వినేంతవరకు వదలలేదు. చివరకు, ఆ గ్రామఫోను సూది వెతికి వెతికి, పదును పెట్టి, పాతకాలపు 78 RPM రికార్డు తిప్పి బాలానందం పాటలు విన్నాము. నేను ఆ రికార్డును మోగించటం తీసాము, అది ఈ కిందే ఉన్నది.

గ్రామఫోను అంటే తెలియని ఈ రోజులలో, కరెంటు అవసరం లేకుండా పూర్తీ యాంత్రిక శక్తితో (గడియారం లాగ కీ ఇస్తే పని చేస్తుంది) నడిచే ఈ వినోద పరికరం తెలియని వారు చూడటానికి ఇక్కడ ఇస్తున్నాను.

Wednesday, January 13, 2010

ఆకట్టుకొనే కట్టు కధ (మీరు నమ్మాలి!)




















ఈ ఫొటోలు చూస్తున్నారు గదా! ఇదేమిటి ఈ మనిషి ఫొటో పుతిన్ తన మీటింగ్ హాల్లో ఎలా పెట్టుకున్నాడా అని ఆశ్చర్య పడకండి.ఆ కధ చెబుతా.2003లో మా రాజమండ్రి లో జరిగిన గోదావరి పుష్క రాలకి పుతిన్ రహస్యంగా వచ్చి గోదావరిలో స్నానం చేస్తూ జారి పడ్డాడు.ఆయన పెట్టిన కేకలు విని నే ధైర్యంగా వెళ్ళి బయటకు లాగాను.
"నేను రష్యన్లో అరిస్తే ఎలా అర్ధమయింది?" అని పుతిన్ అడిగాడు.
"నాకు మీ అరుపులు అమ్మోయ్,నాయనోయ్ అన్నట్లు వినిపించింది" అన్నాను.
పుతిన్ ఎంతో ఆనందించి తన విషయం ఎవరికీ చెప్పొద్దని నా ఫొటో తీసుకుని వెళ్ళాడు.కృతజ్ణతగా నా ఫొటో తన ఆఫీస్లోనే కాకుండా వీధుల్లో .స్కూళ్ళల్లో బ్లాకు బోర్డుల మీద, ఎగ్జిబిషన్లో, టీకప్పుల మీద,ఇంటి కప్పుల మీద ,కాలెందర్లు వేయించాడు.ఇది చూసి అమెరికా వాళ్ళు కూడా వాళ్ళ డాలర్ల మీద,మాగజై న్స్ మీద కూడా వేసారు. నేను తెలుగువాణ్ణి కాబట్టి ఒక్క తెలుగు పత్రిక కూడా ఈ విషయం బయట పెట్టలేదు.నాకు పబ్లిసిటీ ఇస్టం లేక పోయినా మీ కొక్కరికే ఈ సంగతి చెప్పా! ఈ ఆకట్టు కొనే కట్టు కధ మీరు నమ్మాలి!!

Thursday, January 07, 2010

మితృలు డాక్టర్ జయదేవ్ గారి నూతన సంవత్సర శుభాకాంక్షలు!




ప్రముఖ కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ గారి కార్టూన్లు చక్కని గీతల్తో అద్భుతంగా ఉంటాయని వేరే చెప్పాలా!కొత్త సంవత్సరానికి మంచి సందేశంతో ఆయన మితృలకు పంపిన కార్టూన్ మీ అందరితో పంచు కోవాలనే కోరికతో ఇక్కడ వుంఛాను.గతంలో ఆయన తన సంతకంతొ అమ్మాయి జడతో గీసిన బొమ్మ చూసేవుంటారు. ఈ సారి శ్రీ జయదేవ్ 2010ని తన బొమ్మలో చూపించారు.రీడర్స్ డైజెస్ట్ లాంటి అంతర్జాతీయ పత్రికలో ఆయన చిత్రాలు చోటు చేసుకున్నాయంటే ప్రతి తెలుగు వాడు గర్వించాలి.ఏమంటారు.?

Friday, January 01, 2010

చెత్త కబుర్లు

తెలుగు బ్లాగర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .. సంవత్సరపు మొదటి రోజు ఈ చెత్త కబుర్లేంటా? అని అనుకుంటున్నారా?

ఒక్కోసారి చెత్త కబుర్లు కూడా వింటానికి బాగానే ఉంటాయి! నిజమండి!! ఏమిటీ చెత్త కబుర్లను కుంటున్నారా? ఈ నాటి సినిమాల్లోని హాస్యం చూడండి! చెత్త గా ఉండటములే! ఆ చెత్త చూసి మన జనాలు పడీ పడీ నవ్విపోటంలే! ఇల్లరికం సినిమాలో రేలంగి మామ రమణారెడ్డి తొ ఏదోలే మామయ్యా, రెండు రాత్రులుండి పోవాలని వచ్చా అంటాడు.అప్పుడు అత్తగారు అదేమిటి నాయనా,రెండు రోజులేనా? అంటుంది. అప్పుడు రేలంగి "అదే అత్తయ్యా! శివరాత్రి నుంచి సంకురాత్రి దాకా" అని అంటాడు.ఈ జోకు ఈ కాలం కుర్రవాళ్ళకు చాలామందికి అర్ధం కాకపోవచ్చు.అదే రెండర్థాల చెత్త జోకనుకోండి వెంటనే నవ్వు కుంటారు.

సరే చెత్తకబుర్లలోకి వచ్చేస్తున్నాను.నేను మా ఆవిడా దీపావళికి మా అక్కయ్య,బావ దగ్గరికి వైజాగ్ వెళ్ళాము.ఉదయాన్నే "చెత్తమ్మగారు,మీ చెత్త! చెత్త తల్లీ! చెత్త" అంటూ స్పీకర్లో కేకలు వినిపింఛాయి.ఇదేమిటి పొద్దున్నే ఇలా లౌడ్ స్పీకరెట్టుకొని మరీ తిడుతున్నాడని ఆశ్చర్యపడి లేవగానే మా మేనల్లుడు విజయభాస్కర్ "కంగారు పడకు మావయ్యా " పిలిచేది,మా వైజాగ్ కార్పొరేషన్ చెత్త కలెక్ట్ చేసే వ్యాన్ వాళ్ళు!" అన్నాడు.ఎందుకోగాని "చెత్తమ్మగారు,చెత్త తల్లి" అన్నమాటలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు నవ్వాగదు! ఇదండీ నే చెప్పాలను కున్న చెత్త కబుర్లు! మరీ చెత్తగా ఉంటే క్షమించి పారేయండి!


సురేఖ