Sunday, April 24, 2011

శ్రీ సత్యసాయి భగవాన్



సత్య సాయి బాబా మానవ సేవే మాధవ సేవ అని నిరూపించారు.
బాబా నిరంతర భక్తి గురించి ఇలా అన్నారు.
" భక్తి ఉండవలసినది ఒక్క భజన సమయంలోనే కాదు,
ఎల్లప్పుడు నుండవలెను. గురువారము సాయంకాలం
తగిలించుకొని భజనకు వచ్చి, భజన ముగిసి ఇంటికి
వెళ్ళుటతోనే తీసి దూరంగా పడవేయుటకు అది "యూని
ఫామ్" కాదు: మానసిక సంస్కారముఎడతెగక యుండ
వలెను.భక్తివలన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వయో
ధికులు మొదలగు పూజ్యులయెడ నుండవలసిన గౌరవము,
నమ్రభావము వృద్ధి కావలెను. దేహమునకు ఆహారమెట్లు
పోషక పదార్ధమో హృదయమునకు భక్తి అట్లు పోషక
పదార్ధము. దిక్సూచి యంత్రములోని ముల్లు ఎల్లప్పుడు
ఉత్తర దిక్కునే చూపుచుండును: మరియొక దిక్కుకు
మరలనే మరలదు. మనము మరలించినను అది వెంటనే
తన దృష్టిని మరల ఉత్తరమునకే తిప్పును. అట్లే, భక్తుడు
ఎల్లప్పుడును భగవంతునకు అభిముఖుడై ఉండవలెను.
అట్లు ఉండినప్పుడే అతడానందమును పొందగలడు."


ప్రభుత్వాలు చేయలేని ప్రజోపయోగమైన పనులను శ్రీ సత్యసాయి
ప్రజలకు అందించారు. చెన్నై పౌరులకోసం శ్రీ సత్యసాయి గంగ కాలువ,
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, నీటిని శుద్ధి
చేసే ప్లాంటులను విద్యాలయాలను ఎన్నో ప్రజలకు అందజేసారు. మంచి
పనులు చేసేవారిని, కష్టకాలంలో ఆదుకొని సహాయ సహకారాలను
అందించేవారిని మనము దేముడు అంటాము. మరి సత్యసాయిని దేముడని
అనటంలో ఏమాత్రం అసమంజసంకాదు కదా!
WORLD PACIFIC (AMERICA) ప్రసాంతి నిలయంలో బాబా
ప్రసంగాన్ని, భజనలను LP రికార్డుగా 1960 లో విడుదలచేసింది




Saturday, April 23, 2011

సరస్వతీ నమస్త్యుభ్యం






ఈ రోజు పుస్తకప్రియులకు అసలైన పండుగ రోజు .పుస్తకాలను ఆరాధించే వారికి
పుస్తకాలయాలు , అవి గ్రంధాలయాలయినా , పుస్తక విక్రయ కేంద్రాలయినా
నిజమైన దేవాళయాలు! 23 ఏప్రియల్ "వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ డే" గా ప్రపంచ
వ్యాప్త పుస్తకాబిమానులు జరుపుకుంటారు. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే
విపరీతమైన ఇష్టం. ఈ అభిరుచి నాకు మా నాన్నగారు నేర్పారు. అలా మానాన్న
గారు కొన్న పుస్తకాలు , నాకు పుట్టిన రోజు కానుకలుగా మా పిల్లలు ఇచ్చే పుస్తకాలతో
బాటు,నేను కొన్నవాటితో నా దగ్గర చాలా మంచి లైబ్రరీ వుంది. మా ఇంట్లోకి ప్రవేశించగానే
మొట్టమొదట అగుపించేవి నా పుస్తకాలే. .


83ఏళ్ళ చరిత్ర గల న్యూయార్కులోని స్ట్రాండ్ బుక్ స్టోర్ ఐదంతస్తుల భవనంలో
ఎటుచూసినా పుస్తకాలే అగుపిస్తాయట! ఈ పుస్తక దుకాణాన్ని రోజూ ఆరువేల పైగా
పుస్తకప్రియులు సందర్శిస్తారట!! పెద్దనగరాల్లో "పేజెస్" లాంటి పెద్ద పుస్తక విక్రయ
కేంద్రాలు వివిధరకాల పుస్తకాలను పాఠకులకు అందిస్తున్నాయి.
పుస్తకాల గురించి ఆరుద్ర గారు ఇంటింటి పజ్యాలలో ఇలా చెప్పారు:
ఎరువిచ్చిన పుస్తకాలు
ఎప్పుడూ తిరిగే త్రిపాది నక్షత్రాలు
ఆనందమూర్తి దగ్గర్నుంచి రాంబాబు పట్టుకెళితే
ఆయన దగ్గర నుంచి రంగయ్య తీసుకొన్నది
అక్షరాలా ఆదిలో నువ్వు కొన్నది
ఆ బుక్కు వాళ్ళింట్లో చూసినప్పుడు
నువ్వేం బాధపడకు
అయిదు నిముషాలసేపైనా కళ్ళారా
చూడగలిగావు కడకు
ఎరువిచ్చిన బుక్కు
మళ్ళీ చూడ్డంకూడా గొప్ప లక్కు !
<><><><><><><><><><><><><><><>


విజయవాడలో జరిగిన ఓ పుస్తకాల పండుగలో శ్రీ ముళ్లపూడి వెంకట రమణ చేసిన
మాటల ముత్యాల ప్రసంగంలో రాలిన కొన్ని ఆణిముత్యాలు.............
కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధానులు చదువుకోసమని తన కొడుక్కి
డబ్బులిస్తాడు ఆ వెంకటేశం ఆ డబ్బుతో పుస్తకాలు కొందాం అన్నాడు.
దాంతో గిరీశం షాకైపోయాడు.
"మైగాడ్ ! బయింగ్ బుక్సా! పుస్తకాలు కొనడమా?? ధిక్ ధిక్! ఇటీజ్ వర్స్ దాన్
సెల్లింగ్ గరళ్స్-అనగా పిల్లనమ్ముకోడంకన్నా కనిష్టం" అన్నాడు.
అదే గిరీశం చేత రమణగారు ఇల్లాను చెప్పించారు!
బుక్ రీడింగ్ పెరిగినది-మంచి బుక్స్ వల్లనే కాదు. ఈనాటి టీవీల్లో బంకజోళ్ళ
సీరియళ్ళ దయవళ్ళ..ట్ట!
పూర్వం బస్సొచ్చి బళ్ళను కొట్టింది.రైళ్ళొచ్చి బస్సులను కొట్టాయి. నాటకాన్ని
సినిమా కొట్టింది సినిమాని టీవీ కొట్టింది.కానీ బుక్స్ ని ఏదీ కొట్టలేదు.కొట్టబోదు
నా చిన్నప్పుడూ-నేను వయసు మీదున్నప్పుడూ-నేడు వయసు నా మీదున్నప్పుడూ-
ఎప్పుడూ ఆ దృశ్యాలు నా మనసులో పటంకట్టి వుంటాయి.ఒక దృశ్యం-ఒక బాపు బొమ్మ
గుమ్మంలో ముగ్గు వేస్తున్నది.రెండోది, ఒక చదువరి పుస్తకం చదువుతున్న చిత్రం.రెండుకి
రెండూ ఎంత చూసినా తనివితీరని గొప్ప చిత్రాలు. బంతిపూల రధంలాంటి బాపుబొమ్మ
గొబ్బెమ్మ దగ్గర మోకరిల్లి ముగ్గులు రచిస్తుంది. ఆ సొగసు చూడతరమా! వహవ్ వా!!
ఇంతకన్నా ఆనందమేమి? ..ఉంది..మహప్రభో..ఉంది.దీనిన మించిన భువన మోహన
దృశ్యం మరొక్కటి వుంది. అది ఒక చదువరి -చేతిలో తెరచిన పుస్తకం !
అప్పట్లో పబ్లిషర్లను కృతిభర్తలు అనేవారు..నన్నయ తర్వాత మధురకవి పోతన్నగారిని
ఒక రాజు అడిగాడు కాని ఆయన వద్దన్నారు. పోతన తన భాగవతానికి శ్రీరామచంద్రుడినే
పబ్లిషరుగా ఎన్నుకొన్నాడు.
దరిమిలా తాటాకులదశ దాటాక,యంత్రాలు వచ్చాక పబ్లిషర్ల సంఖ్య పెరిగింది.
ఆంధ్రప్రచారిణి,ఆంధ్ర గ్రంధమాల,వావిళ్ళ,విజయనగర,పిఠాపుర సంస్థానాలు,త్రివేణి,విశాలాంధ్ర,
ప్రజాశక్తి,ఎమెస్కో, నవోదయ-1 & 2, నవభారత్, న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్,నవజ్యోతి,
కొండపల్లి, కాళహస్తి,రామా, వెంకటరామా,అశోక్,ఠాగూర్,సాహిత్య అకాడమీలు...ఇలా ఎన్నెన్నో,
ఈ అఖండ పుస్తకజ్యోతికి...
ఇదే ఈ అక్షర నీరాజనం.
శ్రీ ముళ్లపూడి ప్రసంగ పాఠం నుండి
<><><><><><><><>
" E" అక్షరం ఉపయోగించకుండా నవలా రచన !!
ఎర్నెస్ట్ విన్సెంట్ కాల్పనిక నవల, "గాడ్విబ్" ను ఇంగ్లీషు అక్షరం "E" ని
ఉపయోగించకుండా 50,110 మాటలతో రచించాడు. "E" అనే అక్షరం
లేకుండా రాసిన ఈ నవల వ్రాయడానికి రచయితకు 165 రోజులు పట్టిందట!
మొదట 1939లో అమెరికాలో ప్రచురించినప్పుడు ఈ పుస్తకం ధర 3 డాలర్లు.
ఇప్పుడు ఈ పుస్తకం ధర $1000 !!
( మనమీదేనర్రోయ్! కార్టూన్ మితృలు శ్రీ సరసి గారి సౌజన్యంతో,
బాపూగారి బొమ్మాయిల బొమ్మకర్టసీ: బాపు చిత్రకళా ప్రదర్శన (1974)సావనీర్)

Wednesday, April 20, 2011

నిజమైన ఉక్కుమనిషి సర్దార్ పటేల్ !!


కోర్టులో ఓ న్యాయవాది అనర్గలంగా వాదిస్తున్నాడు. అదే సమయంలో ఆయన
ఓ టెలిగ్రాం అందుకొని చదివి జేబులో పెట్టుకొని తన వాదనను తిరిగి ప్రారంభించాడు.
వాదన ముగిశాక ఆ టెలిగ్రాం చూసిన మితృలు ఆశ్చర్యపోయారు. ఏమంటే ఆ
టెలిగ్రాములో వున్న విషయం సామాన్యమైన విషయమేమీ కాదు. ఆ న్యాయవాది భార్య
మరణ వార్త ఆ టెలిగ్ర్రాములో వుంది.! ఆ న్యాయవాదే ఉక్కుమనిషిగా పేరు పొందిన
సర్దార్ వల్లభాయ్ పటేల్! వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావానికి అదో ఉదాహరణ.
మన దేశానికి ఒక స్పష్టమైన రూపాన్ని సృష్టించిన శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్.
రాజ సంస్థాలలను భారతదేశంలో కలిపి, లొంగని హైద్రాబాద్ నవాబు మెడలు వంచి
అంగీకరింప జేసిన గొప్ప వ్యక్తి. లేకుంటే హైద్రాబాదు ఇంకా కాష్మీర్ సమస్యలాగే వుండేది.
శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశ తొలి హోమ్ మంత్రిగా నియమింప
బడటం మన దేశం చేసుకున్న అదృష్టం. గుజరాత్ లో అక్టోబరు 31, 1875లో జన్మించిన
పటేల్ పేరు వల్లభాయ్ ఝవేర్భాయ్ పటేల్. ఆయన ఆలస్యంగా స్వాతంత్ర పోరాటంలో
ప్రవేశించినా, ముందు తరాలవారందరికీ ఆదర్శంగా నిలిచాడు. మహత్మా గాంధీ
నాయకత్వం పై ప్రభావితుడైన ఆయన తన న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్ర
ఉద్యమం లోకి ప్రవేశించాడు. రైతు సమస్యల పట్ల ఆసక్తితో చంపారన్ రైతుల కోసం
గాంధీజీ చేసిన ఉద్యమంలో పాల్గొన్నాడు. సహాయనిరాకరణ ఉద్యమాన్ని ముందుండి
నడిపించాడు. బ్రిటిష్ వారు గాంధీని అరెస్టు చేస్తే తన తరఫున సత్యాగ్రహం కొనసాగించాడానికి
గాంధి పటేల్ ను నియమించాడు. 1942లో పటేల్ చేసిన "విజయమో-వీరస్వర్గమో" అన్న
ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజపరచింది. 1931 లో పటేల్ కాంగ్రెస్ అద్యక్షుడయ్యాడు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రధాని కావలని కాంగ్రెస్ కార్యకర్తల కోరిక. కానీ గాంధీ
ఆ పదవిని నెహ్రూకి కట్టబెట్టాడు. గాంధీజీకి ఎదురు చెప్పనని పటేల్ తప్పుకున్నాడు.
ఆయనే ప్రధాని అయి వుండినట్టయితే కాష్మీర్ సమస్య ఇంతకాలం పరిష్కారంకాకుండా
వుండేది కాదు. మన దేశచరిత్ర మరో విధంగా వుండేది. విధిని తప్పించలేము కదా? !
ఇలాటి ధృఢచిత్తంగల నాయకులు ఇప్పుడు మనకేరి?
.

Monday, April 18, 2011

జై హనుమాన్


స్వామి భక్తికి, కార్యనిర్వహణకు హనుమంతునికి మించిన వారు లేరు.
వాల్మీకి రామాయణం ఆంజనేయుని ప్రవేశంతోనే పాఠకులను భక్తి
పారవశ్యంలోనికి తీసుకొని వెళుతుంది. ఆంజనేయ స్వామి తొమ్మిది
అవతారాలను ధరించాడు.
1. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి
2.శ్రీ వీరాంజనేయ స్వామి
3.శ్రీ వింశతిభుజాంజనేయ స్వామి
4. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి
5. శ్రీ అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి
6. శ్రీ సువర్చలాంజనేయ స్వామి
7..శ్రీ చతుర్భుజాంజనేయస్వామి
8.శ్రీ ద్వాత్రింశధ్భుజాంజనేయస్వామి
9.శ్రీ వానరాకార ఆంజనేయస్వామి
హనుమంతుడు కార్యశీలి. సీతాన్వేషణకు లంకకు వెళ్ళివచ్చిన తరువాత
"సీతాదేవిని ఛూశాను" అన్న ఏక వాక్యం చెబుతాడే కాని తను ఎంతటి
సాహసం చేసి సముద్రలంఖణతో లంకను చేరిన సంగతి ప్రస్తావించడు.
ఆ మాటను విన్న శ్రీరామచంద్రుడు వెంటనే లేచి హనుమంతుని గాఢంగా
కౌగలించుకుంటాడు. ప్రాజ్ఞుడైనవాడు తన కార్యసాధనలో తను చేసిన గొప్పలు
చెప్పుకోడు. హనుమంతునికి తన స్వామి ఆనందమే కావాలి. అందుకే ఒకే
ఒక వాఖ్యంతో " దృష్టా సీతా" అన్నాడు.
హనుమత్ స్తుతి
<><><><><><><>
బుద్ధిర్బలం యశోధైర్యం
నిర్భయత్వం మరోగతాI
అజాడ్యం వాక్పటుత్వంచ
హనుమత్ స్మరణాద్భవేత్II
బుద్ధి,బలం,కీర్తి,ధైర్యం,నిర్భయత్వం,అనారోగ్యం వంటి జాడ్యాలు తొలగడం
వాక్పటుత్వం మొదలైనవన్నీ హనుమంతుని స్మరణతో లభిస్తాయి. ఈ నాటి
యువత తెలుసుకోవలిసిన ఎన్నో విషయాలు మనకు సుందరకాండలో
కనిపిస్తాయి.
హనుమానుని జయంతి శుభ దినాన అందరికీ ఆయన శుభాశీస్సులు
కలగాలని కోరుకుంటూ...
( శ్రీబాపు గీసిన ఈ సుందర హనుమానుని చిత్రం శ్రీ ముళ్లపూడి రచనతో
వెలువడిన "రామాయణం" పుస్తకం (సంస్కృతి ఇంటర్నేషనల్ మద్రాసు)
సౌజన్యంతో)

కార్టూన్ శ్రీ రామ కధ !!




1983లో నేను ఆంధ్రజ్యోతి, సచిత్ర వార పత్రికలో శ్రీరాముని మీద వేసిన
కార్టూన్ చూసిన కార్టూనిస్ట్ మితృలు శ్రీ రామశేషు ఆ నాటి నా
కార్టూనును, ఆనాటి రేడియో యుగం నుంచి నేటి కంప్యూటర్ యుగానికి
తీసుకొని వెళ్ళారు. శ్రీరామశేషు చేసిన మార్పును చూసిన మితృలు డాక్టర్
జయదేవ్ బాబు గారు మరో కొత్త కార్టూన్ను సృష్టించారు. ఇలా 28 ఏళ్ళ
క్రితం నేను గీసిన నా కార్టూనుకు ఇంతటి ప్రత్యేకతను కలుగచేసిన ఆ
ఇద్దరు మితృలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ కార్టూన్ గురించి మరో విషయం మీతో పంచుకోవాలి. ఆంధ్ర
జ్యోతి వీక్లీలో ఆ కార్టూన్ పూర్తిగా ప్రకటనలతో నిండిన పేజీలో ఓ మూల
వేశారు. లేఔటు చేసిన ఆ ప్రకటనల మధ్య ఓ మూల వుండటం
వల్ల ఆ కార్టూన్ చాలా మంది పాఠకుల దృష్టిలో పడలేదు. నేనే వీక్లీ
చూస్తూ ఆపేజీని స్కిప్ చేయడం జరిగింది. తరువాత ఈ విషయం
క్రోక్విల్; హాస్య పత్రిక నిర్వహిస్తున్న శ్రీ శంకు గారికి తెలియజేస్తే, ఆయన
వెంటనే రెస్పాండ్ అయి పత్రిక వాళ్ళతో మాట్లాడి ఇలాటి అన్యాయం ఇక
ముందు ఏ కార్టూనిస్ట్ కు ఎదురుకాకుండా చూస్తానని చెప్పారు. అదీ
ఆ శ్రీరాముని కార్టూన్ కధ! ఈ నాటికి మళ్ళీ మన కార్టూనిస్టు మితృలు
నా కార్టూన్ కు గుర్తింపును తీసుకొచ్చారు. అంతా ఆ శ్రీరాముని దయ!!
<><><><><><><><><>
తెలుగు కార్టూనిస్టులు, వాళ్ళ కార్టూన్లు, విశేషాలు తెలుసుకొనడానికి
telugucartoon.com చూడండి.
<><><><><><><><><><><>

Saturday, April 16, 2011

ఆమ్యామ్యా!!



బాపురమణల అందాలరాముడులో రాజబాబుతో రమణగారు పలికించిన
డైలాగు గుర్తుందా! లంచానికి బహు చక్కని నామకరణం చేసి అమ్యామ్యా
పదాన్ని పాప్యులర్ చేసారు, రమణగారు. అంతకుముందు లంచానికి బరువు
పెట్టడం అనీ, దక్షిణ ఇవ్వడమనీ,( చూశారా గమ్మత్తు ఇక్కడ "మనీ" అన్న
మాట చేరింది!),చేయి తడపడమనీ, ఫార్మాలటీస్ అనీ ఎన్నెన్నో నామధేయాలు
వుండేవి. ఇక లంచాలపై భారతీయుడు, ఠాకూర్ లాంటి సినిమాలూ వచ్చాయి.
లంచావతారాలు కూడా సకుటుంబ సమేతంగా ఆ సినిమాలు చూసి చప్పట్లు
కొట్టేశారు. లేక పోతే ఆ సిన్మాలు అంత విజయవంత మయ్యేవా? ఐనా ఆ
లంచావతారాలు కూడా "లంచం" ద్వారానే ఆ సినిమాలు చూసి వుంటారు.
అంటే టిక్కెట్టు కొనకుండా అన్నమాట. అన్నాహజారే దీక్షతో మరోసారి
అవినీతి పై జనాల్లో కదలిక వచ్చింది. కొందరి దృష్టిలో అవినీతిపనులు
అవి నీతి పనులుగానే కనిపిస్తాయి. ప్రతి రోజూ ఏసీబీ వాళ్ళు వల వేసి పట్టు
కున్నారు అని పేపర్లలో, టీవీల్లో చదువుతూ చూస్తుంటాము కానీ, అసలు
అవినీతిని పట్టుకోడానికి ఇలా వలలూ గట్రా వెయ్యాలంటారా? ఏ గవర్నమెంటు
ఆఫీసుకెళ్ళి నుంచున్నాకోకొల్లలుగా అవినీతి కనిపిస్తూనే వుంటుంది.
(అ)ధర్మాసుపత్రుల్లో గేటులోంచి లోపలికి వెళ్ళడానికి దగ్గర నుంచి రోగి
మంచానికీ లంచం ఇవ్వాల్సిందే! పొరబాటున బాగుపడి బయటికి వెళ్లడానికి,
లేకపోతే "పోతే"బయటకు తీసుకువెళ్ళడానికీ లంచాలు ఇవ్వాల్సిందే!
దేముడినీ మన వాళ్ళు వదలిపెట్టడం లేదు. పెద్దపెద్ద గుళ్లల్లో క్యూలో
ముందరిగా దర్శనం చేసుకోవాలంటే ముందు గుడి ఉద్యోగులకు ముడుపులు
చెల్లించుకోవాలి. ఆ తరువాతే దేముడి ముడుపులు. పాలిటిక్స్ కోసం అనడం
లేదు కాని ఇంతకుముందు ప్రభుత్వంలో సింహాద్రి సత్యనారాయణ అనే మంత్రి
గారు వుండే వారు. ఆయన స్వయంగా ఓ సామాన్యుడిలా తిరుమల క్యూలదగ్గరికి
వెళ్ళితే ఆయన్నీ లంచం అడిగాట ఓ ఉద్యోగి. రాజమండ్రిలో 2003లో పుష్కరాలు
జరిగినప్పుడు ఆయన స్వయంగా క్యూల దగ్గర నిలబడి ప్రజలకు సహకారాన్ని
అందించారు. ఇప్పుడు అలాటి నాయకులు ఎంతమంది అగుపిస్తున్నారు.ఇప్పుడు
దేవాదాయ శాఖకు మంత్రేలేడట!!
అసలు ఉద్యోగులకు లంచాలు నేర్పింది మనమే నేమో అనిపిస్తుంది.
ఫోలీసువాళ్ళు లైసెన్సులు చెక్ చేస్తున్నప్పుడు మన దగ్గర అవి వుండవు.
వెంటనే కేసు రాయకుండా మనమే వాళ్లకు లంచం ఆఫర్ చేస్తుంటాము. అలా
లంచం ఇచ్చే బదులు ఆ కాగితాలు దగ్గర వుంచుకోవచ్చుగదా! వుంచుకోరు.!
కొతమందికి అదో ప్రెస్టేజ్! బైకులకు నెంబరు ప్లేటుండదు! దానిమీదఏవేవో
నానా రాతలూ వ్రాసివుంటాయి. అన్నహాజరేకు మద్దతు తెలుపుతూ రాలీలు
జరపడం కాదు. ముందు ఇటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా చూడాలి.
అప్పుడే అవినీతి లేని సమాజం మనకు వస్తుంది. మన పిల్లలను ఏదైనా
పని చేసి పెట్టమని అడుగుతూ ఆ పని చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా అనడం కూడా
వాళ్ళకు చిన్నప్పటి నుంచే లంచాలు నేర్పడమేనన్నమాట. చెప్పిన మాట
వింటె శ్రీరాముడు, హనుమంతుడు లాంటి మంచి పేరొస్తుంది అని చెప్పాలి.
ఆ దేముళ్ళ బొమ్మల కధలు చూపిస్తూ వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళో చెప్పాలి.
అప్పుడే భావితరంలో నీతిమంతుల రాజ్యం వస్తుంది. లేకపొతే మనకివచ్చేది
అంతా "రాజా"ల రాజ్యమే!!

Friday, April 15, 2011

సిరా చుక్కల సినిమా!



శ్రీ తనికెళ్ళ భరణి ఎన్నో విజయవంతమైన చిత్రాల సంభాషణల రచయితగా,
కధ, స్కీన్ ప్లే రచయితగానే కాకుండా మంచి నటుడుగా కూడా ప్రేక్షకుల
అభిమానాన్ని చూరగొన్నారు." శివ "చిత్రంలో నటన ద్వారా తన విశ్వరూపాన్ని
చూపించిన భరణి శివభక్తుడు.శివుని మీద ఎన్నో అధ్యాత్మిక రచనలు చేయడమే
కాకుండా ఎన్నో భక్తి పూర్వక ప్రసంగాలు చేశారు. నటుడిగా విభిన్న పాత్రలనూ
శ్రీ భరణి పోషిస్తున్నారు ఆయన "సిరా" అన్న పేరుతో 28 నిముషాల లఘు
చిత్రాన్ని నిర్మించి దేశవిదేశవిమర్శకుల ప్రశంశలను అందుకొన్నారు.
ఈ చిత్రంలో కవిగా భరణి, కవి భార్యగా ప్రఖ్యాత టీవీ యాంకర్ ఝాన్సీ నటించారు.
బొట్టుబొట్టుగా రాలిపోతున్న కాలం, గడియారం చేసే టిక్కుటిక్కు మనే గుండె
స్పందనలాంటి శబ్దం, ఇంటికి తలుపులేగాని పై కప్పులేని గృహాలు, ఏవేవో కృత్రిమ
మానవ మొహాలు ఇలా ప్రారంభమవుతుంది భరణిగారి "సిరా"
చరిత్ర పొరల్ని తవ్వుకుంటూ వేళ్తాడు కవి. రక్తపాతాలూ, యుద్ధాలు,
శిధిలాలు కనిపిస్తాయి. జనాలు వున్న చోటనే వుండిపోయారనుకుంటాడు కవి.
ఇంకా ఇందులో కవి భార్య కలాల్ని రోట్లో దంచి పొడిచేస్తూ మొదటిరాత్రి భర్త
గురొస్తే భర్తకి బదులు మానవ కపాళం కనిపిస్తుంది. పగలిన భూగోళం నెత్తురోడు
తుంది. మండుతున్న కలంతో కవి పగలిన భూమిని అతికించే ప్రయత్నంలోనే
కవి వృద్ధాప్యంలొకి చేరుకొని తీవ్రవాదాన్ని ఎదుర్కొని బలైపోతాడు. నిప్పులు
కురిపిస్తున్న కవి కలం పాళీతో తీవ్రవాదమనే దిష్టి బొమ్మను తగలబెడుతుంది
కవి భార్య. "సిరా" లోని ఒక్కోదృశ్యం వందరకాలుగా మాట్లాడుతుంది.. మన భూమి
పచ్చగా వుండాలి-" జ్ఞానం భయంలేకుండా సాగిపోవాలి" .ఈ ప్రపంచంలోని ప్రజలంతా
సుఖసౌఖ్యాలతో జీవించాలనే సందేశాన్ని భరణి తన "సిరా" ద్వారా చూపించారు.
ఈ సినిమా ఓ తెలుగువాడు తీశాడు కాబట్టి ప్రపంచంమంతా కొనియాడినా మన
తెలుగువాళ్ళందరి దృష్టికి ఇంకా పూర్తిగా చేరివుండకపోవచ్చు. అవకాశం వస్తే
ఈ చిత్రం సిడీని చూడడానికి ప్రయత్నించండి.

Thursday, April 14, 2011

ఎడ్రెస్సులు లేని డ్రెస్సులు !!





ఆడైనా మొగైనా వాళ్ళు ధరించిన దుస్తులనుబట్టి ప్రాంతం,ఆచార వ్యవహారాలు
మొదలైన విషయాలు తెలిసేది. ఈకాలంలో వేసుకొంటున్న డ్రెస్సును బట్టి వాళ్ళ ఎడ్రెస్సు
(ప్రాంతం) తెలుసుకోవడం కష్టమే. మన అమ్మాయిలంతా కుమారి, శ్రీమతులు కూడా
పంజాబీ డ్రెస్సులేవేసుకుంటున్నారు. లంగాలూ,ఓణీలూ ఎప్పుడో మర్చి పోయారు.కానీ
పంజాబీ అమ్మాయిలు మాత్రం వాళ్ళ పంజాబీ డ్రెస్సునే వేసుకుంటారు. మరో విశేష
మేమిటంటె వాటిపై వేసుకొనే మాచింగ్ చున్నీలను గొంతు మీద వేసుకోవడం ఓ ఫాషన్!
మళ్ళీ అదెందుకు దండగ, చెప్పండి. ఆ చున్నీ కొనకపోతే హాయిగా డబ్బులు కలసి
వస్తాయి కదూ?! అలాటి డ్రెస్సే ఇప్పుడు అబ్బాయిలూ వేసుకోవడం లేటెస్ట్ ఫాషన్. కానీ
అబ్బాయిలు మాత్రం చున్నీ( ఇంకేదైనా పేరుందేమో) పూర్తిగా ఉత్తరీయం లాగ వేసు
కుంటున్నారు. రోజురోజుకూ ఫాషన్లు మారిపోతున్నాయి. మా చిన్నతనంలో బుష్కోట్లు
ఫాషన్. అదే తరువాత పాంటుతో కలిపి సఫారీలు అంటూ వచ్చాయి.కొంతకాలం బెల్
బాటమ్ పాంట్లు వచ్చాయి. బాగా పూర్వం పాంట్లకు చివర ఫోల్డింగ్ వుండెది. మొగవాళ్లకు,
ఆడవాళ్ళను డ్రెస్సును బట్టి గుర్తుపట్టడం ఈ రోజుల్లో కష్టం.అమ్మాయిలు జుట్టు కట్ చేసు
కొని షర్టులు, జీన్స్ పాంట్లు వేసుకుంటున్నారు. అలా టప్పుడు వెనకనుంచి ఆడో, మొగో
ఎలా చెప్తాం చెప్పండి. ముళ్లపూడివారి బుడుగు రెండు జడలమ్మాయిల గురించి ఇలా
అంటాడు."ఈ జడలమ్మాయీ అంతే. రెండుజడలు కదూ. ఓటి ముందుకీ ఓటి వెనక్కీ
వేసుకుంటుంది.అందుకని వొస్తుందో పోతుందో తెలీదుగదా దూరానికి" అంచేత వెనక
నుంచి చెప్పడం చాలా ఇబ్బందే!! పూర్వం ముస్లిమ్ సోదరులు లాంగ్ కోటూ, తలకు
ఎర్రని టోపీ పెట్టుకొనే వారు. కాని ఇప్పుడు అలా సాంప్రదాయ దుస్తులు ధరించేవారు
చాలా తక్కువ.కానీ ఈ స్పీడ్ యుగంలో లంగా ఓణీలూ, చీరలకన్నా ఈ పంజాబీ డ్రెస్సులే
నయమనిపిస్తుంది. బయటకు వెడితే స్త్రీలవి ఉరుకులూ పరుగుల జీవితాలే. వేగంగా
పరిగెట్టి బస్సో, లోకల్ రైలో ఎక్కాలంటే చీరలతో ఇబ్బంది. అలానే టూ వీలర్స్ పై వెళ్ళే
అమ్మాయిలకీ ఈ డ్రెస్సే సౌకర్యంగా వుంటుంది. కానీ గుళ్ళకో, పేరంటానికో వెళ్ళేటప్పుడు
మాత్రం వయసుకు తగ్గట్టు చీరో, పరికిణీ, ఓణీయో కట్టుకుంటేనే బాగుంటుంది..
లంగా ఓణీల్లోని ఈ అందాల బొమ్మాయిలు బాపు గారి నుంచి అప్పుతెచ్చేసు
కున్నాను.ఇంకా ఆయనకు తెలియదనుకోండి!!

Tuesday, April 12, 2011

శ్రీరామ కధ





తెలుగువాళ్ళ ఆరాధ్యదైవం శ్రీరాముడు. ఎంత చిన్న ఊరైనా రామాలయం
తప్పక వుండి తీరుతుంది. ఈ కాలంలో ఎక్కువమంది సాయి భక్తులున్నా
వారుకూడా సాయిరాం అని ఒకరినొకరు పలకరించుకుంటూనే వుంటారు.
అదే రాముని పేరులోని మహిమ. మనం కూడా ఏది వ్రాయటం మొదలు
పెట్టినా శ్రీరామ చుట్టకుండా ప్రారంభించం! బాపు రమణ గార్లు శ్రీరామ
భక్తులని తెలుసుగా. రమణగారైతే కవరు మీద వ్రాసే ఎడ్రెస్ పైభాగాన
కూడా శ్రీరామ అని తప్పక వ్రాస్తారు. శ్రీ బాపు ఆయన ఇష్టదైవం రాముడు
చిత్రాలు ఎన్నోగీశారు. అందులో శ్రీరాముడు సీత పాదాలకు పారాణి అద్దుతున్న
అపురూప చిత్రంలో తానే రంగులను రాముడికి అందిస్తున్నట్లుగా ,తనను
ఆంజనేయస్వామిగా ఊహించుకొని గీసిన చిత్రం ఎన్నిసారు చూచినా తనివి
తీరదు. ఇక రమణగారు రాసి, బాపుగారు తీసిన ప్రతి సాంఘికచిత్రంలోనూ
రామాయణ చాయలు తప్పక కనిపించి తీరుతాయి. ఇందుకు ముత్యాల
ముగ్గు, కలియుగ రావణాసురుడు,రాంబంటు,అందాలరాముడు,సుందరకాండ
చిత్రాలే ఉదాహరణ. ఇక రాముడిపై సంపూర్ణరామాయణం,సీతాకళ్యాణం,
శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాలను నిర్మించారు. ఈటీవీ సీరియల్
శ్రీభాగవతం లో రామాయణ గాధను అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీరామ
భక్తుడైన త్యాగయ్య బాపు దర్శకత్వంలోవచ్చింది. స్వయంగా మంచి
చిత్రకారుడైనందువల్ల శ్రీ బాపు తీసిన శ్రీరామగాధలు కన్నులపండుగగా
వుంటాయి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారన్నట్లు శ్రీ బాపు బొమ్మ
గీ(తీ)సేటప్పుడు ఋషిగా మారిపోతారన్నది నిజం!
శీరామనవమి మంచి వేసవికాలంలో వస్తుంది. అందుచేతనేనేమో మన
పెద్దలు భక్తులకు చల్లగా చలువ పందిళ్ళు వేసి (ఇప్పటిలా షామియానాలు
కాకుండా), చలువచేసే వడపప్పూ, పానకం ప్రసాదంగా అందించే సాంప్రదాయం
ఏర్పాటుచేశారు.శ్రీరామచంద్రుని రామభద్రుడనికూడా పిలుస్తారు.
రామాయ రామభద్రాయ
రామచంద్రాయ వేధసే
రఘునాధాయ నాధాయ సీతాయా:
పతయే నమ:11
ఎవరికి ఎలాటి ఆపద కలిగినా తనపై నమ్మకంతో వేడుకొనే భక్తునికి దాసుణ్ణి
అన్నాడు శ్రీరాముడు.రామదాసు శ్రీరామునికి దాసుడవడమేకాదు.ఆ శ్రీరాముడే
రామదాసుకు దాసుడైనాడు!! శ్రీరాముడు తన ఎదుటబడినవారిని నగుమోముతో
తానే పలుకరించేవాడట. సకలగుణాభి రాముడు అందరికీ ఈ శ్రీరామనవమినాడు
శుభాశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను.
జై శ్రీరామ్

Monday, April 11, 2011

రాజమండ్రి నవ్వుల రాజు మా అప్పలరాజు!!





ఎవరీ అప్పలరాజనుకుంటున్నారా? ఇంకెవరండీ, బాపురమణల "అందాలరాముడు"
లో అల్లు రామలింగయ్యగారిని "తీతా, తీతా" అంటూ అల్లరి పెట్టే అప్పుల అప్పారావు,
రాజబాబు. రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. సినిమాల్లోకి వచ్చాక
రాజబాబుగా పేరెట్టేసుకొని టాప్ కమేడియన్ గా ఎదిగిపోయి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో
చోటు సంపాదించేసుకొన్నాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బుతో డబ్బు చేసుకోకుండా
మా రాజమండ్రి సమీపంలోని కోరుకొండలో జూనియర్ కాలేజీ స్థాపనకు భూరి విరాళాన్ని
అంద జేశాడు. ఇప్పుడక్కడ ఆయన పేర రాజబాబు జూనియర్ కాలేజీ వుంది. రాజమండ్రి
లోని పారిశుద్ధశ్రామికుల కోసం గృహాలు నిర్మించాడు.ఇంకా ఎన్నెన్నో గుప్త దానాలు
చేసిన ఈ మంచి నవ్వులరాజు 75 వ పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ "మా" అద్యక్షులు
శ్రీ మురళీమోహన్ కృషితో ఈ నెల 9 తేదీ రాజబాబు విగ్రహాన్ని గోదవరి ఒడ్డునగల గౌతమీ
నందనవనంలో శ్రి దాసరి నారాయణ్రావుగారి చేత అవిష్కరించబడింది. ఆరోజు సాయంత్రం
ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్సులో "హాస్యస్వర్ణోత్సవం" పేరిట 75 మంది తెలుగు చిత్రసీమ హాస్యనటీ
నటులకు సత్కారం జరిగింది. ఒకే చోట ఇంతమంది సినీహాస్య నటులు, నటీమణులు చేరి
తమ స్కిట్స్ తో అభిమానులను మూడు గంటల సేపు నవ్వులజల్లులలో తడిపారు.
అంతకు ముందు వరుణదేముడు తన స్నేహితుడు పవనుడితో సహా వచ్చి హడావిడీ
చేసి "ఇక మీరు నవ్వుల్లో తడవండి "అంటూ వెళ్ళాడు. మల్లికార్జున్, మనో "వేదంలా ఘోషించే
గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి" అన్న పాటను, సరదా సరదా సిగరెట్టు అనే
హాస్య గీతాన్ని ఖుషీ మురళి ,అంజనా సౌమ్య పాడగా , ప్రార్ధనా గీతాన్నిగోపికాపూర్ణిమ
భక్తిరసంగా ఆలపించారు." చినుకు చినుకు అందెలతో చిటపటమని" అంటూ ఆశాసైనీతో
శ్రీ బాబూ మోహన్ నాట్యం చేసి అబిమానులని ఆశ్చర్యంతో ముంచారు. శ్రీ ఏవీయస్ సభను
ఆద్యంతం నవ్వులతొ తన ప్రతిభను జోడించి నిర్వహించారు.
చివరగా ఇంతటి హాస్యోత్సవాన్ని భారీగా ఏర్పాటు చేసిన శ్రీ మురళీ మోహన్ గారిని
మా "హాసం క్లబ్" తరఫున నేనూ, మితృడు హనుమంతరావు మొమెన్టో, శాలువాతో
సత్కరించాము. ఈ కార్యక్రమాన్ని "మాటీవీ" వారు చిత్రీకరించారు కాబట్టి త్వరలో అందరూ
చూసే అవకాశం కలుగుతుంది.

Sunday, April 10, 2011

నా ఆ పాత (ట) మధురాలు !!




కొత్తో వింత , పాతో రోత అంటారు మనవాళ్ళు ! కానీ అది తప్పని ఎన్నో విషయాల్లో
నిజమయింది. పాత పాటలు, పాత మనుషులు వాళ్ల మమతలూ, పాత సినిమాల్లో
నటులు, శ్రావ్యమైన వారి స్వరం, నాటి చిత్రాల్లోని పాటలూ, మాటలూ, హాస్యం, ఆనాటి
చిత్రకారులు ( ఉ: రవివర్మ) అన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఆ స్వర్ణయుగం ఎప్పటికీ నూతనమే!
రాతి రోట్లో చేసిన కందిపచ్చడి రుచి మిక్సీలో చేసిన పచ్చడితో ఏనాటికైనా సాటి వస్తుందా?
రాచ్చిప్పలో చేసిన పులుసు రుచి, బొగ్గుల కుంపటి పై మెల్లగా గోధుమరంగులో కాగిన పాల
రుచి ఓ సారి గుర్తు చేసుకోండి. లేక పొతే అమ్మనో, అమ్మమ్మనో ఓ సారి అడిగి చూడండి.
ఇలా ఎన్నేన్నో!
అప్పటి మనుషుల ఆప్యాయత ఇప్పుడు చూడగలుగుతున్నామా? అంతా కుత్రిమం!
ఎదుటపడినప్పుడు ఓ వెర్రి నవ్వు నవ్వుతాడు లేక పొతే మనల్ని ఎప్పుడూ చూడనట్లు
నటిస్తారు. నాకు ఈ మధ్యనే అలాటి అనుభవమే ఎదురయింది! ఓ హాస్య పత్రిక సంపాదకుడు
నా కార్టూన్లు వేసుకున్నడు, తన పత్రికలోస్వయంగావచ్చి నా పరిచయం వేశాడు. ఈ మధ్య
రాజమండ్రిలో ఓ ఆధ్యాత్మిక సభలో అగుపిస్తే నే పలకరిస్తే నన్నెప్పుడూ చూడనట్టు తెలియనట్టు
ప్రవర్తించాడు. అదే బాపురమణగార్లను మొట్టమొదటిసారిగా 2005లో నేను కలసినప్పుడు
వారితో ఎంతో కాలం నుంచి పరిచయం వున్నట్లు మాట్లాడారు!
. రమణగారైతే నెలకు రెండు సార్లయినా తప్పక ఫోను చేసేవారు!!
. ఆ సంస్కారం ఇప్పటి వాళ్ళు కొందరికి మాత్రమేలేదు.
ఈ కొత్త తరం వాళ్ళంతా అలాటి వాళ్ళేఅనలేం. ఇంకా కొందరున్నారు. స్నేహానికి విలువ
నిచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు వేసవి సెలవులకు ఐఎల్టీడీ కంపెనీనీలో ఉన్నతోద్యోగం
చేస్తున్న మా మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బంగళాలో వున్న ఐస్ మిషన్
( మేమప్పుడు ప్రిజ్ ను అలానే పిలిచేవాళ్ళం.) కరెంటుతో కాకుండా ఓ చిన్న కిరసనాయిల్
దీపంతో పనిచేసేది. ప్ర్రిడ్జ్ అడుగున ఓ డ్రాయరు వుండేది.దాన్ని బయటకు లాగి అందులో
వున్న ఒత్తి దీపం వెలిగించి లోపలికి త్రోసేవారు. లోపల వున్న ఆ దీపం వెలుగు తున్నదీ
లేనిదీ అగుపించడానికి ముందు భాగంలో ఓ అద్దముండేది.అందులో ఆ దీపం ప్రతిబింబం
అగుపించేటట్లు ఏర్పాటు చేశారు. ఆ విషయం గుర్తుకొస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది. మా పిల్లలకు
ఆ సంగతి చెబితే నమ్మేవారు కాదు. ఈనాడు పాటలు వినడానికి కాంపాక్ట్ డిస్కులూ ,అవీ
వచ్చాయికాని అంతకుముందు పెద్ద స్పూల్స్ ఉన్న టేప్ రికార్డుప్లేయర్లుండేవి. తరువాత
చిన్న కాసెట్ టేపులొచ్చాయి. వీటన్నిటికన్నా పూర్వం కరెంటుతో పనిలేకుండా కీ తో
తిరిగే గ్రామఫోనులు ( వీటి పై 78 RPM రికార్డులు ఒక వైపు ఒకపాట, రెండవ వైపు మరో
పాట వుండేవి) వుండేవి. చక్కని శబ్దంతో పాటలు వినిపిస్తుంటే అదో విచిత్రం! ఇప్పుడు
మా ఇంటికి వచ్చే పిల్లలకు ఆ గ్రామఫోను వినిపిస్తే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. బాలన్నయ్య
బాలానందం రికార్డు "పొట్టిబావ-చిట్టి మరదలు" పాట ఆ గ్రామఫోనులో విని ఎంతో
ఆనందిస్తారు. ఆ గ్రామఫోనుల తరువాత ఎలక్ట్రానిక్ రికార్డ్ ప్లేయర్సు వచ్చాయి. ఇందులో
దాదాపు ఓ అరడజను పైగా పాటలను ( LP RECORDS) స్టీరియోలో వినవచ్చు.
టైపు రైటర్సు పోయి ఇప్పుడు అంతా కంప్యూటర్సు ద్వారానె టైపు చేసుకుంటున్నాం.
అంతకు ముందు వీధికి ఒకటైనా టైపు నేర్పే ఇన్సి స్టీట్యూట్ లు వుండేవి! ఇక సినిమాలు
తెలుపు నలుపు నుంచి రంగులు, సినిమాస్కోప్, 70 ఏమ్మేమ్ము, 3 D, DTS ఇలా
ఎన్నెన్నో మార్పులు. ఫిల్మ్ కెమేరాలు పోయి డిజిటల్ కెమేరాలోచ్చాయి సెల్ ఫోనులొచ్చాయి.
ఐనా లాండ్ ఫోను లో మాట్లాడుతున్న హాయి నాకు ఆ సెల్ఫోనులో కనిపించదు.
మార్పు మనకు అవసరమే కానీ ఆ నాటి పాత వస్తువులనూ మనం మర్చిపోకూడదు.
మన ముందు తరం వాళ్ళకి గతం గురించి కూడా గుర్తు చేయాలిసిన భాధ్యత మన మీద
కూడా వున్నదని నేను నమ్ముతాను.అందుకే ఆనాటి గుర్తుగా ఇంకా కొన్ని వస్తువులు
నా దగ్గర పదిలంగా, పనిచేస్తూనే వున్నాయి!.ఇక్కడ మీరు చూస్తున్న ఆస్ట్రిచ్ (నిప్పుకోడి
బొమ్మ) నిజానికి ఒక సిరాబుడ్డి. ఆ బొమ్మ రెక్క పైకి తీస్తే సిరాపోసుకోడానికి గిన్నెలాటిది
ఉంది. కలం పెట్టుకోడానికి క్రింద చిన్న స్టాండు కూడావుంది.

Friday, April 08, 2011

ఊడల మర్రి-2 అను నేటి ఎస్బీఐ చరిత్ర!!





మొన్నటి నా ఊడలమర్రి కధనంలో స్టేట్ బ్యాంకు పూర్వపు గుర్తు మర్రి
చెట్టని చెబుతూ ఆ గుర్తు నా దగ్గర లేక పోవడం వల్ల జ్ఞాపకం చేసుకొని
బొమ్మ గీశాను. మన బ్లాగరు మితృలు ( సాహిత్యాభిమాని, మన తెలుగు
చందమామ) శ్రీ శివరామ ప్రసాద్ తమ దగ్గర వున్న స్టేట్ బ్యాంక్ పోస్టల్
స్టాంపు ఫొటో నాకు పంపారు. అందులో బ్యాంకు మర్రి చెట్టు గుర్తు
వుంది. నా స్టాంపు కలెక్షన్ లో కూడా ఆ స్టాంపు లేదు. ప్రసాద్ గారికి
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ స్టాంపు చిత్రాన్ని ఇక్కడ ఇస్తూ
బ్యాంకు గురించి మరికొంత సమాచారాన్ని ఇస్తున్నాను.
మొట్టమొదటి సారిగా 1806 బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా ప్రారంభించి
అటు తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చబడింది.ఆ కాలంలో
అప్పటి ప్రెసిడెన్సీ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బాంబే (1840), బ్యాంక్ ఆఫ్
మెడ్రాస్ (1843) లతో బాటు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ వాటిలోఒకటిగా పేరుపొందింది.,
1921 జనవరి 27న ఈ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను కలపి ఇంపీరియల్
బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు పెట్టారు. అప్పటి నుంచి ప్రజల బ్యాంకింగ్
అవసరాలకు,ఇతర బ్యాంకులన్నిటికి పెద్ద బ్యాంకుగా , ప్రభుత్వానికి బ్యాంకరు
గా వివిధ విధాలుగా బ్యాంకు తన కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చింది.
ఇంపీరియల్ బ్యాంకులొ బ్రాంచి మేనేజర్లుగా ( అప్పుడు ఈ పదవికి ఏజెంట్
(ప్రతినిధి) అనే వారు) బ్రిటిష్ దేశీయులే వుండేవారు. ఇక్కడ మీరు చూస్తున్న
గ్రూప్ ఫొటో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గుంటూరు (1924).ఇందులో
నిలబడిన వారిలోమొదటి వరుసలో కుడి నుంచి రెండవవారు మా నాన్న
గారు శ్రీ యమ్.వీ.సుబ్బారావు. ఆయన అప్పుడు ఏజెంట్ పెర్సనల్ టైపిస్టుగా
పని చేసేవారట. ఈ బ్యాంక్ బిల్డింగులు అప్పటి బ్యాంక్ ఆఫ్ బెంగాల్,బ్యాంక్
ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ లవి.జూలై 1, 1955లో ఇంపీరియల్ బ్యాంక్
స్టేట్ బ్యాంకుగా మార్పు చెందింది.

Thursday, April 07, 2011

గొడుగుల గొడవ






ఈ రోజుల్లో రాజకీయనాయకులు పరిస్థితులను బట్టి ఏ ఎండకా గొడుగు పట్టే
వాళ్ళే ఎక్కువయ్యారు. ఎండలు మండి పోతున్నప్పుడు నీ గొడుగుల గొడవ
ఏవి టని కోప్పడకండి. గొడుగుకు ఎండైతే నేమి వానైతే నేమి. తల చుర్రుమంటే
కాస్త నీడనిచ్చేది పాపం ఆ గొడుగే కదండీ. ఇంగ్లీషులో గొడుగును అంబ్రెల్లా
అంటారు. ఈ నాటి కాన్వెంట్ పిల్లలకు అంబ్రెల్లా అంటేనే తెలుస్తుంది. లాటిన్ భాషలో
అంబెల్లా అంటే గుండ్రటి ఆకారంలోనున్న పువ్వు అని అర్ధం అంబ్రా అంటే నీడ
అని అర్ధం, ఇలా రెండు మాటలు చెట్టాపట్టాలేసుకొని అంబ్రెల్లా అయిందన్నమాట!
అసలు కొందరికి గొడుగు హస్తభూషణం. అంతెందుకు స్కూలు మాస్టారు వేషం
వెయ్యాలంటే ఓ నల్లకోటు, నెత్తినో తలపాగా, చంకనో గొడుగు ఉండాల్సిందే!
చూడుడు: "ప్రేమించి చూడు" చిత్రములో తెలుగు మాస్టారిగా శ్రీరావి కొండలరావు
పాత్ర.. ఇక గొడుగుకు పౌరాణిక కాలం నుంచి ప్రాముఖ్యం వుంది. దశావతారాలలో
వామనావతారంలో వామనుడు గొడుగేసుకునే వస్తాడు.భుజాన గొడుగుతో ముద్దొ
స్తుంటాడు బాపు గారి శ్రీ భాగవతం సీరియల్లో లాగ. కాని అది తాటాకు తో చేసిన
చత్రం అన్న మాట. దేముళ్ళకు గొడుగులుంటాయి. విష్ణుమూర్తికి ఆదిశేషుడు
నీడనిస్తూ పడగ పడుతాడు తను తల్పంగా మారుతూ. బాలకృష్ణున్ని గంపలో
పెట్టుకొని వసుదేవుడు వానలో నదిని దాటుతున్నప్పుడు ఆ ఆదిశేషుడు తన
పడగతో గొడుగు పట్టాడు. పెళ్ళిల్లల్లో వరుడు కాశీ యాత్రకు వెలుతున్నప్పుడు
గొడుగు వుండాల్సిందే.ఇప్పుడు ఎన్నెన్నో రకాల గొడుగులు.రంగురంగులివీ,
బటన్ నొక్కగానే తెరుచుకొనేవి, మడత పెట్టి హాండ్ బ్యాగుల్లో.పెట్టుకొనేవి,
హాండిల్లేకుండా తలకు తగిలించుకొనేవి, గుండ్రంగా కాకుండా నలుపలకలవి
ఎన్ని రకాలో! మొట్టమొదట గొడుగులను తయారుచేసే ఈ కళను గుర్తించినది
చైనావాళ్ళే..వెదురు, మల్బరీ కాగితంతో మొట్టమొదట చైనా వాళ్ళు తయారు
చేశారు. చైనా, జపాన్, ధాయిలాండ్ దేశాల్లో ఈ గొడుగుల తయారీ ఓ అందమైన
హస్తకళ. సర్కస్ లలో తీగ మీద నడిచే అమ్మాయిల చేతుల్లో ఈ రకం గొడుగులే
చూస్తాం. మహాభారత కాలం లో రధాలకు పైన గొడుగులు వుండేవి. అంబ్రెల్లాకు
పారాసాల్స్ అనే పేరు కూడా వుంది. లాటిన్ భాషలో సాల్ అంటే సూర్యుడు
అని అర్ధం. యూరొపియన్లు ఎండకు వాడే వాటిని పారాసాల్స్ అని, వానకు వాడే
వాటిని అంబ్రెల్లా లని పిలుస్తారట! సినిమాల్లో వానపాటలున్నట్లే గొడుగు పాటలూ
చూపించిన ఘనత రాజకపూర్ కు దక్కుతుంది."ప్యార్ హువా...ఇకరార్ హువా"
అన్న పాట విన్నప్పుడల్లా నర్గీస్, రాజ్ కపూర్ లే గుర్తొస్తారు. ధాయిలాండ్ లో ఏటా
గొడుగుల పండుగ జరుగు తుందట. అన్ని దేశాల్లో కన్నా ఇంగ్లాండులొనే గొడుగుల
వాడకం ఎక్కువట. బ్రిటిష్ వాళ్ళు ఇంట్లో గొడుగు తెరిస్తే అపశకునంగా భావిస్తారట.
కుక్క గొడుగులని విపరితంగా పెరుగుతాయి. వాటినే ముష్రూమ్స్ అంటారు. వాటిలో
ఆహారంగా తినతగ్గవి కూడా వున్నాయి.వృక్షశాస్త్రంలో వీటిని లైఖెన్స్ గా విభజించారు.
గొడుగు ఆకారంలో వుండటంవల్ల గొడుగులనొచ్చుకాని ముందర "కుక్క" అన్న పదాన్ని
ఎందుకు చేర్చారో?! వివిధ గ్రూపుల వ్యక్తుల్ని ఒకే చోటకు చేర్చడాన్ని ఒకే గొడుగు క్రిందకు
తేవడమని అంటారు.గొడుగుల్లో ఆడగొడుగులు, మొగ గొడుగులూ వుంటాయి! బుల్లి
ఆడ పిల్ల గొడుగులు, బుడుగు గొడుగులూ వుంటాయి.
చివరగా గొడుగు మీద కురుస్తున్న రెండు జోకులు::
" ఒకే గొడుగులో ఐదుగురు కుర్రాలు వెడుతున్నారు. అందులో ఎవరు
తడుస్తారు?"
"ఎవ్వరూ తడవరు?"
"ఏం ?"
" అప్పుడు వాన కురవటంలేదు!"
<><><><><><>
"నీ గొడుగు పోయిందని నీకెప్పుడు తెలిసింది?"
"వాన వెలిసింది కదా గొడుగు మూద్దామని చూస్తే
చేతిలోగొడుగు లెదు!"
:) :)<><><><><><>:):):):)
UMBRELLA Shop కార్టూన్ 62 ఏళ్ళ నాటి బ్రిటిష్ వార పత్రిక TIT-BITS
లోనిది. బుడుగు తలకి గుండు వాడి గొడుగు తగిలితే వాడి బుర్రకి ప్రవేటు
చెప్పడానికి పాపం వాడు " అయ్యో బుడుగూ దెబ్బతగిలిందా" అంటూ బుడుగును
ఎత్తుకొని ముద్దులాడితే వాడి బుర్ర మీద ఓ జెల్లకాయ ఇచ్చుకొన్న బుడుగు
కధను రమణగారు అందంగా చెబితే మరింత అందంగా బాపు గారు బొమ్మ
గీశారు.ఈ బొమ్మ "బుడుగు" సౌజన్యంతో.

Tuesday, April 05, 2011

ఊడల మర్రి కధ !!




ఈ హెడ్డింగ్ చూసి ఇదేదో హర్రర్ కధనుకోకండి! అన్ని వయసుల వారు చదవొచ్చు!!
రహదారులను వెడల్పు చేయడం మొదలు పెట్టాక రోడ్డుకు ఇరువైపులా బారులు
తీరిన మర్రి చెట్లు మనకు కనుమరుగయి పొయాయి. పూర్వం రహదారులపై
ప్రయాణం చేస్తుంటే ఈ చెట్లు చల్లని నీడనిస్తూ వుండేవి. ఆ చెట్ల నీడనే ఎడ్ల బండ్లను
ఆపు చేసి ప్రయాణికులు , ఎడ్లు సేదతీరేవి. గ్రామీణ ప్రాంతాలలో మర్రి చెట్లను దేవతలుగా
భావిస్తారు. ఈ చెట్టు వందలాది ఏండ్లు జీవిస్తుంది. ఈ చెట్లక్రిందే పూర్వం మునులు
తపస్సు చేసేవారు. మర్రిచెట్ల వూడలనే ఉయ్యాలలుగామార్చిఅమ్మాయిలు ఉయ్యాల
లూగుతుండేవారు. మన చిన్నతనంలో పాఠ్యపుస్తకాలలో చదివిన కధ మీకు గుర్తుండే
వుంటుంది. పక్క వూరికి ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని
ఓ మర్రి చెట్టు నీడన పడుకుంటాడు. ఆ చెట్టుకు ఎదురుగా ఓ గుమ్మడి పాదు, దానికి
పెద్ద పెద్ద గుమ్మడి కాయలు విరగ కాసి అగుపిస్తాయి. అప్పుడు అతను, " దేముడు ఎంతటి
తెలివి తక్కువగా సృష్టించాడు. సన్నని బలహీనమైన తీగకు బరువైన పెద్ద కాయలుంచాడు.
ఈ మహావృక్షానికి చిన్నచిన్న కాయలుంచాడు " అనుకుంటూ కునుకు తీశాడు. కాసేపటికి
మెలకువ వచ్చి చూచేటప్పటికి అతని ఒంటిపై వేలాది మర్రి కాయలు రాలిపడివుంటాయి.
"నేను తొందరపడి భగవంతుణ్ణి నిందించాను. ఆ గుమ్మడి కాయలే ఈ చెట్టుకే వుండి వుంటే
ఈ సరికి నా ప్రాణాలు ఆ దేముడి దగ్గరకే చేరి వుండేవి" అని అనుకున్నాడట !మర్రిచెట్టుకు
చుట్టూ విస్తరించిన ఊడలు అంతటి మహావృక్షాన్ని గాలి వానలకు తట్టుకొని నిలబడేటట్లు చేస్తాయి.
ఈ చెట్టు శాస్త్రీయనామం పైకస్ బెగ్లెన్సిస్.
మర్రిచెట్టు కలపను చెక్కరోళ్ళుగా చెక్కేవారు.గ్రామాల్లో ఇప్పటికీ ఈ రకం చెక్క రోళ్ళు
అగుపిస్తుంటాయి.. ఔషధంగా లేతమర్రి ఊడలు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. స్టేట్ బ్యాంకు
చిహ్నంగా కొంతకాలంవరకు మర్రిచెట్టు వుండేది. శాఖోపశాఖలుగా మర్రిచెట్టులా బ్యాంకు
విస్తరిస్తుందనీ , అన్ని వర్గాల వారికి మర్రిచెట్టులా సేవలందిస్తుందనీ ఆ గుర్తు తెలియజేస్తుంది.
కాలక్రమేనా ఆ గుర్తుకు బదులు ఇప్పటి కీ హొల్ గుర్తును ఏర్పరిచారు. నాకు మాత్రం ఆ పాత
మర్రిచెట్టు గుర్తే బాగున్నదనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు గుర్తును మీకు చూపించాలని ప్రయత్నిస్తే
నా బ్యాంకు ఫైల్సు లోనూ దొరకలేదు. చివరకు నాకు గుర్తున్నంతవరకు ఊహించి బొమ్మ గీశాను.
ఎక్కడైనా పొరబాటు వుంటే ఇది చదివిన బ్యాంకు మితృలు తెలియజేస్తారని తలుస్తాను.

రెండు రూపాయి నోట్ల కధ !!





ఈ రోజుల్లో రూపాయంటే అసలు విలువే లేదు కానీ ఆ రోజుల్లో రూపాయంటే
ఎంతో విలువ వుండేది. ఒక రూపాయి నోట్ల కొత్త సెక్షన్ కోసం బ్యాంకులో
కస్టమర్సు అడుగుతూ వుండే వారు. రిజర్వు బ్యాంకు నుంచి మా స్టేట్ బ్యాంకుకు
రెమిటెన్సు రాగానే కొత్త రూపాయినోట్ల కోసం మేమే ఆత్రంగా తీసుకొనే వాళ్ళం.
ఇప్పుడు ఆ ఒకరూపాయి నోట్లు రావటం లేదు వచ్చినా ఎవరూ ఆడిగే వాళ్ళూ
వుండరు!
మన దేశంలో క్రీస్తు పూర్వం 600 నుండే వెండి నాణేలను పురాణాలు,కర్ష పణాలు,
పణాలు అని పిలిచే వారట. రూపాయి అనే పేరు వెండి నాణెం నుంచే వచ్చింది.
సంస్కృతంలో "రూప్యకం" అంటే వెండి నాణెం అని అర్ధం. ఢిల్లీని 1540 నుండి
1545 వరకు పాలించిన షేర్షా వెండి నాణేన్ని రూపాయి పేరుతో విడుదల చేశాడు.
షేర్షా విడుదల చేసిన వెండి నాణెం బరువు సుమారు మ్11.34 గ్రాములుండేదట.
ఆప్పుడు రూపాయికి పదహారు అణాలు.1957 లో (నయా) పైసలు ప్రవేశపెట్టాక
రూపాయికి వంద పైసలుగా విభజించారు. మన దేశంలో మొదటిసారిగా కాగితం
నోట్లను బ్యాంక్ ఆఫ్ హిందుస్తాన్ (1770-1832), ది జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్
అండ్ బీహార్ (1773-75),బెంగాల్ బ్యాంకు (1784-91) ముద్రించాయి. బ్యాంకు
ఆఫ్ బెంగాలు నోట్లు మొదట ఒక వైపునే అచ్చయ్యేవి! అటు తరువాత రెండు
వైపులా ముద్రించడం ప్రారంభించారు. బ్యాంకుల స్థానంలో ప్రభుత్వమే కరెన్సీ
నోట్లను విడుదలచేయడం 1861 లో మొదలయింది. బ్రిటిష్ పాలనలో మొదటి
నోటు విక్టోరియా రాణి బొమ్మతో పది రూపాయల నోటు వచ్చింది.
మన దేశంలో మొట్టమొదటి కరెన్సీ నోట్లు ముద్రించే ప్రెస్ 1928 లో నాసిక్
లో నిర్మించారు. నాణేలను తయారు చేసే టంకశాలలు (మింట్) ముంబై,కోల్ కత్తా,
హైదరాబాదు, నోయిడాల్లో వున్నాయి. కలకత్తా మింట్ 1959లో ప్రారంభించగా
హైదరాబదు మింట్ 1903 ప్రారంభించారు.
మీరు ఇక్కడ చూస్తున్న రూపాయి నోట్లు 1917, 1935,1986 సంవత్సరాలవి.
1917, 1935 రూపాయి నోట్లు మా నాన్నగారు సేకరించినవి. ఈ నోట్ల గురించి ఒక
సంఘటన మీతో పంచుకుంటున్నాను. ఒకసారి ఈ రెండు నోట్లను బ్యాంకుకు
తీసుకొని వెళ్ళి మా బ్రాంచి మేనేజరుకు గొప్పగా చూపించాను. తరువాత ఆ రెండు
నోట్లు ఆయన టేబిల్ దగ్గర మిస్సయ్యాయి. ఎంత వెదికినా అగుపించలేదు. నా
కంటె ఆయనే ఎక్కువ బాధ పడ్డారు. ఇంటికి వేళ్లాక నాన్నగారికి ఎలా చెప్పాలో
తెలియలేదు. ఉదయం బ్యాంకుకు తీసుకు వెల్తునప్పుడే జాగ్రత్త అని మరి మరీ
చెప్పారు. నా అదృష్టం కొద్దీ ఆయన ఆ విషయం ఆడగలేదు. అలా రెండేళ్ళు
గడిచాయి .ఒక రోజు ఓచెక్కు కలెక్షన్ వివరాలకోసం రికార్డు రూము నుంచి
పాత రిజిస్టర్ తెప్పించి చూస్తుండగా ఆ పుస్తకంలో ఆ రెండు నోట్లూ ప్రత్యక్షమయ్యాయి.
అంటే ఆ రోజున బి.యమ్ టేబుల్ పై నున్న ఆ పుస్తకంలో ఆ రెండు నోట్లు పొరబాటున
వుండిపోయాయన్నమాట. ఆ విషయం తెలుసుకొన్న మా బ్రాంచి మేనేజరు "మీ
నాన్నగారి కష్టార్జితం కాబట్టి ఇంతకాలమైన తరువాత తిరిగి మళ్ళీ నీకే దొరికాయి"
అన్నారు. ఆ రాత్రి బ్యాంక్ నుంచి ఇంటికి వేళ్ళాక నాన్న గారికి ఈ వింత కధ
చెప్పాను. ఆయన ఓ చిరు నవ్వు నవ్వారు. ఆయనా మా .స్టేట్ బ్యాంకులో ఆఫీసరుగా
పని చేసి రిటైరయ్యారు. ఇలాటి సంఘటనలతోనే దేముడు న్నాడని నేను నమ్ము
తాను. ఇదండీ నా రూపాయి నోట్ల కధ!