Wednesday, April 24, 2013

పుస్తకాలే మంచి నేస్తాలు

              ఈ రోజు ప్రపంచ పుస్తక  ప్రేమికులంతా పుస్తకదినోత్సవాన్ని
జరుపుకుంటున్నారు. ఈ సమయంలో మన పుస్తకాల చరిత్ర
కధలను మరోసారి నెమరు వేసు కుందాం. కొన్ని వేల ఏళ్లనాటి
నుంచి నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశపురాణాలు
ఈనాటికీ సజీవంగా వున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
ముద్రణాసౌకర్యాలు లేని ఆకాలంలో ఒకరి నుంచి ఒకరు నేర్చు
కుంటూ ధారణ శక్తి ద్వారా వీటిని సజీవంగా నిలుపుకుంటూ
వచ్చారు.

 ఇలా వేదాలు చెప్పేవారిని వేదంవారనీ,  రెండు వేదాలు వల్లె
వేసేవారిని ద్వివేదులనీ, మూడు వేదాలపై పట్టుగల వారిని
త్రివేదులనీ, నాలుగు వేదాల దిట్టలను చతుర్వేదులనీ
వ్య్వహరించే వారు. అట్లాగే పురాణాలను ప్రజలకు తెలియజేసే
వారు ’పురాణం’వారుగా వాడుకలోకి వచ్చారు. అటుతరువాత 
వాటిని లిఖిత రూపంగా రాళ్ళమీద, రాగి రేకుల పైనా, తాళ
పత్రాలమీద, ఆ తరువాత కాగితం కనుగొన్నాక దానిపై అచ్చొత్తి
నిక్షిప్తం చేయటం జరిగింది. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో
డిజిటల్ రూపంలో మన సాహిత్యమంతా నిక్షిప్తమవుతున్నది.

 పుస్తక ముద్రణ మొదలయ్యాక ఎందరో మేధావులు, రచయితలు
వెలుగులోకి వచ్చి పాఠకులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ
సాహిత్య సేవ చేస్తున్నారు. వేలాది సంవత్సరాల చరిత్ర, నాగరికత
లోకమంతా వ్యాప్తి చెందడానికి ఈ గ్రంధ ముద్రణ పక్రియ ఎంత
గానో తోడ్పడింది. చరిత్ర ఒకసారి తిరగ వేస్తే అశోక చక్రవర్తి ,
విలియంకారీ లాటి మహా వ్యక్తులను మనం తప్పక తలచుకోవాలి.
అశోకుడు పాళి లిపిని అభివృర్ధి పరచి భౌధ్ధమత ప్రచారం కోసం
శాసనాలు వ్రాయించి లిపిని ప్రచారంలోకి తెచ్చాడు. బైబిల్ 
ప్రచారం కోసం తెలుగులో 1746-47 లో జర్మనీలో బ్లాక్స్ (BLOCKS)
సాయంతో అచ్చు వేయటం జరిగింది. 1901లో విలియం కేరీ
కలకత్తా దగ్గరలోని శ్రీరాంపూర్ లో అచ్చు యంత్రంలొ కదిలే అచ్చు
అక్షరాలు తయారు చేసి సీసంతో పోత పోయించాడు. అలా ఆ
అక్షరాలతో చేతితో కంపోజింగ్ మొదలయింది.

 మన వేదాలను, పురాణాలను వావిళ్ల రామస్వామి , వెంకట్రామా&కో,
రామా &కో లాటి సంస్థలు ప్రచురించి సాహిత్య ప్రచారానికి అపార
సేవలు కలిగించాయి. అటుతరువాత రాజమండ్రిలో అద్దేపల్లి వారిచే
సరస్వతీ పవర్ ప్రెస్ ప్రారంభించ బడింది. మేము చదువుకునే
రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ వారి పాఠ్యపుస్తకాలు ఈ ప్రెస్ లోనే
అచ్చయేవి.కొండపల్లి వీర వెంకయ్య & సన్స్ వారు భమిడిపాటి
మొ" ప్రముఖుల హాస్య రచనలు, కధలు ప్రచురించారు. అటు
తరువాత విజయవాడలో విశాలాంధ్ర, నవోదయ, యం.శేషాచలం
& కో సంస్థలు ఎన్నొ రకాల ప్రచురణలు ప్రచురిస్తున్నారు.



తెలుగునాట హాస్య రచయితలకు కొదువలేదు. శ్రీ మొక్కపాటి
నరసింహశాస్త్రిగారి "బారిస్టర్ పార్వతీశం" పాఠకుల వీశేష
ఆదరణ ఈనాటికీ పొందుతూనే వుంది. అలానే శ్రీ ముణిమాణిక్యం
నరసింహారావు గారి కాంతం కధల ద్వారా ప్రశిద్ధి పొందారు.
శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం "గణపతి" హాస్య రచన రేడియో
నాటకంగా కూడా ప్రశిద్ధి పొందింది. ఇక్కడో విశేష మేమిటంటే
ఈ ప్రముఖ హాస్యరచయితల పేర్లలో "నరసింహ" వుండటం 
 హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు తమ నాటికలు,
రచనల ద్వారా హాస్యాన్ని పండించారు. ఆయన తనయుడు
శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ గారు రాజమండ్రి సిటీ హై స్కూల్లో
మా గురువు గారు. ఆయనచాలా హాస్యనాటికలు రచించారు.
బ్రహ్మచారి, మొ"చిత్రాలకు కధ మాటలు సమకూర్చారు.
1959-60 లలో శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు   " ఇద్దరు
అమ్మాయిలు-ముగ్గురు అబ్బాయిలు","ఋణానందలహరి",
"విక్రమార్కు మార్కు సింహాసనం" "బుడుగు-చిచ్చులపిడుగు"
లాటి ఎన్నో హాస్య రచనలు చేశారు. ఆయన కూర్చిన "నవ్వితే
నవ్వండి-మాకభ్యంతరం లేదు" జోకుల పుస్తకం ఈనాటికీ
పాఠకులకు తనివితీరని పుస్తకంగా నిలిచిపోయింది.


టీవీ సీరియల్స్ వచ్చాక  పుస్తకపఠనం తగ్గిపోయింది. కానీ
ఇటీవల పుస్తకపఠనంపై పాఠకులు శ్రర్ధచూపించడం శుభ
సూచకం. స్నేహితులకూ, ఆత్మీయులకు మనం అనేక
సంధర్బాలలో ఇచ్చే కానుకలకోసం గిఫ్ట్ హౌస్ లకు పరుగు
తీయకుండా ఓ మంచి పుస్తకాన్ని కానుకగా అందించడం
అలవాటు చేసుకోవాలి .
        నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను-అవిప్పుడు
        మీకు పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి కనుక.....
        అలానే నా పాత పుస్తకాలూ ఎవ్వరికీ ఇవ్వను-
        అవిప్పుడు నాకు ఎక్కడా  దొరకవు కనుక !!
              ఇదే నా పుస్తకాల గురించి నేను చెప్పే సుభాషితం.
నా పుస్తకాల గదిలోకి ఓ దొంగ ప్రవేశిస్తున్నట్లు ప్రముఖ  నా
కార్టూనిస్ట్ మిత్రులు డా" జయదేవ్ బాబు గారు తయారు
చేసిన ఫొటో కార్టూన్.

Monday, April 15, 2013

శ్రీని "వాయిస్"మూగపోయింది

            ప్రముఖగాయకుడు, రచయిత,స్వరకర్త ఇక లేరన్న
వార్త  అభిమానులకు పెనువిషాదం.పిబియస్ అని 
పిలిచే ఆయన పూర్తి పేరు ప్రతివాద భయంకర
శ్రీనివాస్. గోదావరి తీరాన వెలిసిన మరో ఆణిముత్యం
మన శ్రీనివాస్. భక్తి గీతం నుంచి, హాస్యగీతం వరకూ
ఎటువంటి పాటనైనా పాడగల మధుర గాయకుడు
శ్రీ పిబియస్.


ఆయన పుట్టింది కాకినాడ ఐనా అనేక భాషలలో
వేల పాటలు పాడి అన్ని ప్రాంతాల శ్రోతల 
హృదయాలలో ఎనలేని స్ఠానాన్ని సంపాదించు
కున్నారు. అక్కినేని, రామారావులకు ఘంటసాల
పాడే రోజుల్లో ఆఇద్దరు హీరోలకీ తన గాత్రాన్ని
అందిచారు. అలానే ఆ రోజుల్లో కాంతారావు,జగ్గయ్య,
హరనాధ్ లకు అనేక మధురమైన పాటలు పాడారు.
ఓహో గులాబి బాలా (మంచిమనిషి), మదనకామ
రాజు చిత్రంలో నీలి మేఘాలలో, మనసే మందిరం
చిత్రంలో తలచినదే జరిగినదా పాట,ఎవరికి ఎవరు
కాపలా (ఇంటికి దీపం ఇల్లాలే) కొన్ని మరువలేని
గీతాలు. మైభీ లడ్కీ హూ( నాదీ ఆడజన్మ హిందీ
వర్షన్)లో లతా మంగేష్కర్ తో కలసి పాడారు.ఆయన
పాడిన సంస్కృత భక్తిగీతాలు LP Record గా 1973లో
విడుదలయింది. తమిళనాడు ప్రభుత్వం ఆయనకు
కళైమణి బిరుదునిచ్చి తనను తాను గౌరవించుకుంది. 
ఆయనను సత్కరించుకొనే అదృష్టం మన తెలుగు
వాళ్ళు నోచుకోలేదు.
(శ్రీ పి.బియస్. పెన్సిల్ స్కెచ్ శ్రీ యస్.శంకరనారాయణ
గారి సౌజన్యంతో)