Wednesday, August 31, 2011

సినీ, సాహితీలోకంలో చెరగని ముద్ర వేసిన ఆరుద్ర



సాహిత్యం అర్ణవమైతే...
ఆరుద్ర మధించలేని లోతుల్లేవు...
సాహిత్యం అంబరమైతే.....
ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు..
జ్యోతి బుక్స్ వారు ప్రచురించిన ఆరుద్రగారి "కూనలమ్మ
పదాలు" పుస్తకం(1964) అట్టవెనుక ఆయన గురించివ్రాసిన ఈ
ఆణిముత్యాలు అక్షర సత్యాలు.
అంతు చూసేవరకు
అకట! ఆంధ్రుల చురుకు
నిలువ వుండని సరుకు
ఓ కూనలమ్మ అంటూ మన తెలుగు వాళ్ళగురించి ఎంత
చక్కగా చెప్పారు
ఆయన కొండగాలి వీచిందన్నా, పచ్చాబొట్టూ చెరిగిపోదన్నా, ముద్దంటే
చేదా అన్నా దేనికదీ ప్రత్యేకమే. ఆయన వ్రాసిన ఇంటింటి పజ్యాలు
గురించి ఏమి వ్రాయగలం ! చదివి ఆనందించడమే! ఎన్నిసార్లు చదివినా
తనివితీరుతుందా?! మచ్చుకి
నాకు తెలిసిన ఒకానొక నాస్తికుడు
లేదంటాడు ఆబ్దీకాలవల్ల జాస్తీ చెడు
ఏవంటే ఆయనకు అసయ్యమే తద్దినాలు
అయినా ఎంతో ఇష్టం ఆ బోయినాలు

ఆరుద్రగారు మాటల చమత్కారి. జనవరి ఇరవైఆరు 1964 లో ముళ్లపూడి
వెంకటరమణగారి పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళివారింట్లో గుమ్మాలు పొట్టిగా
వుండటం వల్ల వంగి వేళ్ళాల్సి వస్తే " చూశారా! పెళ్ళి వారు మనకు తలవంపులు
తెస్తున్నారు" అన్నారట. రమణగారి పెళ్ళికానుకగా ఆరుద్ర తన కూనలమ్మ
పదాలు కానుకగా ఇచ్చారు.
ఆరుద్ర రచన కవితలు పేరిట 1942 నుండి 1985 వరకు ఆయన కవితలు
పుస్తకంగా వచ్చింది. అందులో ఆగష్టు 15 పేరిట ఆయన వ్రాసిన (ఆనందవాణి
1948) ఓ మచ్చుతునక మీకోసం...
మూలపడి విరిగిన చరఖా
గాంధీజీ పేరు అనే బురఖా
ధరించి వచ్చిన ఈ తారీఖు
మా చెడ్డ నిషా చేసే అరఖు

నట్టనడి సముద్రం హంగరు
ఎత్తరేం జీవితం లంగరు
ఎలా వుందో పీపిల్స్ పల్సు
ఏ నాయకుడి కయ్యా తెల్సు? ............
ఇట్లా సాగిపోతుంది ఆరుద్ర కలం
ఆరుద్ర జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జోహార్లు.

Sunday, August 28, 2011

అందాల తెలుగు




ఈ రోజు తెలుగు భాషాదినోత్సవం. ఈ తరం మన తెలుగును మరచిపోతున్న ఈ
సమయంలో ప్రతి ఒక్కరు మన భాషను బ్రతికించేటట్లు చేసుకోవలసిన భాధ్యత
ప్రతి తెలుగువాడు గుర్తుంచుకోవాలి. నందమూరి తారక రామారావు గారు మన
ముఖ్యమంత్రిగా తెలుగు భాషాభి వృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆనాడు మన
తెలుగువాళ్ళే తెలుగు తెగులు అంటూ వేళాకోళం చేశారు. ఆయన బాపు రమణల
చేత తెలుగు వీడియో పాఠాలు తయారు చేయించారు. ప్రస్తుతం అవి ఎక్కడ
వున్నాయో?! వాటిని సిడీలుగా తయారు చేయించి అమ్మకానికి వుంచితే తెలుగు
రాని ఈనాటి యువతరానికీ ఎంతో ఉపయోగకరంగా వుంటుందనటంలో ఏ మాత్రం
సందేహం లేదు.


శ్రీ బాపు తయారు చేసిన అందాల అ ఆలు అనే పుస్తకాన్ని అందంగా మాకు తెలుగు
రాదుగా అనకుండా మాస్కోలోని "రాదుగా ప్రచురుణాలయం , మాస్కో వారు ప్రచు
రించారు. ఇప్పుడు విశాలాంధ్రా వారు ముద్రించి ప్రచురించిన ఈ పుస్తకం దొరుకుతున్నది.
శ్రీ బాపు మన తెలుగు వాళ్ళ తెగులు గురించి ఓ బహు చక్కని చక్కిలిగింతలు పెట్టే
ఓ కార్టూన్ స్వాతి వార పత్రికలో గీశారు.మరో సారి చూసి నవ్వుకోండి.
తెలుగు భాష పండుగ రోజు మనం తెలుగులోనే మాట్లాడతామనీ, మన పిల్లలకు తెలుగు
కూడా నేర్పుదామని , తెలుగులోని మంచి పిల్లల సాహిత్యాన్నివాళ్ళకి పరిచయం చేద్దామని
ప్రతిన బూనుదాం !!

Tuesday, August 23, 2011

కొందరికి డబ్బు చేస్తుంటుంది !!

డబ్బంటే ఆశ అందరికీ వుంటుంది. తన ప్రతిభతో తను చేసే ఉద్యోగంలో కష్టపడి
సంపాదించవచ్చు. కానీ కష్టపడకుండా చెడుమార్గాలద్వారా సంపాదించే పాపిష్టి
డబ్బుతో తాత్కాలిక సుఖము వుండవచ్చునేమో కానీ అలాటి డబ్బు బాగా చేస్తే
ఆ డబ్బు జబ్బు కుటుంబాన్ని తరతరాలు పట్టి పీడించక మానదు.సుఖసంతోషాలు
ఇవ్వదు.
కొందరు డబ్బు సన్మార్గంలో సంపాదిస్తారుకానీ ,మరీ పిసినారులుగా వ్యవహరిస్తూ
కనీస సుఖాలను అనుభవించరు. పైగా దానికి పొదుపు అని పేరెట్టి ఆటోలో వేళితే
ఖర్చవుతుందని మొత్తం తమ కుటుంబాన్ని బైకు మీద తీసుకు వెళుతుంటారు!
ఓ వేళ ఏ ప్రమాదమైనా జరిగితే ఎంత క్షోభ ! ఈ పొదుపు అంతా హాస్పటల్లకు
సమర్పించుకోవాలి కదా?! ఆటోల్లో రిక్షాల్లో పది మంది పిల్లల్ని కూరి స్కూళ్ళకు
పంపుతారు. ఆ స్కూళ్ళకు డొనేషనులు పేరిట వేలకు వేలు సమర్పిస్తారు కాని
పిల్లల క్షేమం గురించి ఆలోచించరు.
పాపం డబ్బు సంపాదనకోసం ఈ వృద్ధున్ని చూడండి బక్కచిక్కి ఈ వయసులో
కూడా వెదురును కత్తితో చీల్చి బుట్టలు మండుటెండలో అల్లుతున్నాడు.జీవితం
వెళ్ళబుచ్చడానికి వీరు ఇలా శ్రమించకతప్పదు.


డబ్బుకోసం ఏ గడ్డైనా తినడానికి మన వాళ్ళు సందేహించరు. తినే ప్రతి ఆహారం
కల్తీ ! పకృతి అందించే ఫలాలనైనా తినాలన్నా భయమే. ఇక్కడ చూడండి !!
అరటి పళ్ళు త్వరగా పండటానికి హానికరమైన రసాయనాలను కొడుతున్నారు!
అందుకే ఈ పండ్లు నిలవ వుండగానే తొక్కతీయగానే నురుగులు కక్కుతుంటాయి.
మన దౌర్భాగ్యం లంచగొండులకే మనం ఆహ్వానం పలుకుతున్నాం! వాళ్ళు మన
దగ్గరకు వూరేగుతూ రాగానే వెర్రివాళ్ళలా వాళ్ళ పాపపంకిల హస్తాలను తాకడానికి
ఒకరితో ఒకరం పోటీపడుతున్నాం!! భగవంతుడా కాపాడు ఈ జనాల్ని, ఈ దేశాన్ని.
మరో అవతారం ఎత్తైనా !!


లోభులపై ముళ్ళపూడి వారి జోకులు కొన్ని:

ఒక లక్షాధికారి కోటికి పడగెత్తాడని తెలిసి అతని జీవిత విశేషాలు అడగబోయాడు
ఒక పత్రికా విలేఖరి.
" మీరు ఇంత డబ్బు ఎలా కూడబెట్టారో చెప్పండి ముందు-అసలు కీలక
మైన కారణం కావాలి" అన్నాడు.
"అబ్బో అదంతా ఓ పెద్ద కధ. అడిగారు కాబట్టి చెబుతా. అన్నట్లు మనం
మాట్లాడుకుంటున్నప్పుడు దీపం ఎందుకు? నూనె దండుగ. ఆర్ఫేసి వస్తా
నుండండి" అంటూ లేచాడు కోటీశ్వరుడు.
" ఇహ మీరేం చప్పనక్కరలేదండి. అంతా బోధపడింది. వస్తా " అంటూ
లేచాడు విలేఖరి.
<><><><><><><><>
"ఏవే ఏవేయ్, నేను ఇవాళ బస్సు వెనకే పరుగెత్తు కొచ్చేసి బేడ్డబ్బులు
ఆదా చేశాను చూసుకో !" అన్నాడు ఆఫీసు నుంచి వచ్చిన భర్త గర్వంగా
వగరుస్తూ.
ఆవిడ మూతి విరుచుకుంది. " నిక్షేపంలా టాక్సీ వెనక పరిగెడితే
మూడు రూపాయలు ఆదా అయేది గదా ?" అంది.
ఫొటోలు "ది హిందూ" సౌజన్యంతో

Sunday, August 21, 2011

కృష్ణ లీలలు

శ్రీ కృష్ణ లీలలు ఆబాలగోపాలానికి ఆనంద దాయకం.ఆ కృష్ణభగవానుని జయంతి
అందరికీ పండుగే ! శ్రీ బాపు బాలకృష్ణుణ్ణి ముద్దులు మూటగట్టేట్టుగా చిత్రీకరించిన
ఈ అందాల ముద్దుల నాట్య కృష్ణుణ్ణి చూడండి ! 777 పేజీల శ్రీ ముళ్లపూడి వారు
వ్రాసిన "రమణీయ భాగవత కధలు" పుస్తకానికి అలంకరణగా నృత్యం చేస్తూ మురళి
పై ఓం కార నాదం చేస్తూ అలరిస్తాడు.
ఇక బాల కృష్ణుని పై బాపు ఎన్ని చమత్కార గీత(తా)లు రచించారో ! అలనాటి
"జ్యోతి" మాస పత్రికలో కృష్ణజన్మాష్ఠి వేసిన ఈ కార్టూన్ లో యశోద భర్తతో తను
ఆ రోజు పచ్చడి చేయక పోవడానికి కారణం చిన్ని కృష్ణుడి పైకి తోసేయడం ఎంత
బాగా చూపించారో చూడండి!
పెద్ద పర్వతాన్నే ఎత్తి గోకులాన్ని కాపాడిన కృష్ణుడికి వానొస్తే ఓ కొండనే గొడుగ్గా
ఉపయోగించడం ఓ లెక్కా అన్నట్లు బాపు వేశారు.
ముద్దుల కృష్ణుడికి వెన్నముద్దలంటే ఇష్టం కదా! ఒకవైపు వెన్న దొంగిలిస్తున్న
ఈ నల్లనయ్య మరో వైపు బుద్ధిమంతుడిలా అమ్మను వెన్నకోసం వేడుకుంటున్నాడు!
బాపుగారూ , మిమ్మల్ని ఎలా ఎలా అభినందించాలి?!! అదిగో మీకు కోపం వస్తున్నది.
పొగిడితే మీరు ఆ దేవదేవునికే నమస్కరిస్తారు.



బాలకృష్ణుడు బండి రూపంలో వచ్చిన శకటాసురిడిని సంహరించాడు. అప్పటి నుంచి
తమ బళ్ళ వైపు కృష్ణుడు వెళితే బండి వాళ్ళు ఎంత భయపడతారో శ్రీ బాపు ఈ బొమ్మ
ద్వారా చూపిస్తూ నవ్వించారు.
అందరికీ శ్రీకృష్ణాష్ఠమి శుభాకాంక్షలు.

ఈ బొమ్మలు శ్రీ బాపు గారు, "జ్యొతి" రసికజన మనోభిరామం సౌజన్యంతో

Friday, August 19, 2011

నేడే ప్రపంచ ఛాయా చిత్ర దినోత్సవం

1827లో ఫొటొలు తీయడానికి ఆనాటి శాస్త్రవేత్త జోసెఫ్ నెప్పర్ నీప్సే చేసిన
ప్రయత్నమే ఈ నాటి ఫొటొగ్రఫికీ మూలమైంది. ఆనాడు అతను పావురాలను
ఫొటో తీయడానికి దాదాపు ఎనిమిది గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.
డాగ్రే అనే మరొ శాస్త్రవేత్తతొ కలసి ఎనిమిది గంటలనుంచి గంటలో తీయడానికి
ప్రయత్నించి విజయం సాధించ గలిగారు. 19 ఆగష్టు 1839 తమ ప్రయోగానికి
వారు పేటెంటు ఫ్రెంచి ప్రభుత్వం నుంచి పొందారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది
ఆగష్టు 19 ను ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది.
పకృతిలోని సుందర దృశ్యాలను మన కమేరాలో బంధిస్తే అవి మధుర దృశ్యాలుగా
కల కాలం నిలచి పోతాయి. ఈ ఫొటో సూర్యాస్తమయ సమయంలో గోదావరి, రెండు
వంతెనల మధ్య వెలిగి పోతున్న సూర్యభగవానుడిని నేను తీసినది.


అలానే మన ఇంట్లో చిన్నపిల్లల బాల్యాన్ని ఫోటోలుగా తీసి పదిలపరిస్తే వాళ్ళు
పెద్దయ్యాక చూసుకుంటే అది వాళ్ళకు మధురానిభూతే కదా! ఈ ఫొటోలో మా
మనవడు చిII నృపేష్ ను ఉదయం పేపరు మార్నింగ్ కాఫీ త్రాగుతూ చూస్తున్నట్లు
తీశాను
ఈ ఫొటో చిII నృపేష్ తమ్ముడు చిII హ్రితేష్ మా అమ్మాయి మాధురి మొదటిసారి
స్కూలుకు(చెన్నై) తీసికు వెళుతున్నప్పుడు తీసినది.
మా రెండో అమ్మాయి లక్ష్మీమాధవి (ముంబాయి) పాప అక్కడే వున్న ముంబాయి
మిర్రర్ పట్టుకుంటే సరదాగా తీసిన ఫొటో


చిన్నపిల్లలు అమాయకంగా పెద్దవాళ్ళను అనుకరిస్తూ చేసే ప్రతి పనీ ముచ్చటగా
వుంటుంది. మా అబ్బాయి కృష్ణసాయి (ముంబాయి) బాబు చిII కౌస్తుభ్ ఫోనుతో
ఆడు కుంటుటున్నప్పుడు తీసిన ఫొటో..
వరల్డ్ ఫొటోగ్రఫీ రోజున ఛాయాచిత్రకారులందరికీ శుభాకాంక్షలు.

Thursday, August 18, 2011

కెమెరా కధ



సరిగ్గా 123 ఏళ్ళక్రితం జార్జి ఈస్ట్మన్ తను సృష్టించిన కోడక్ కమేరాను మొట్తమొదటి
సారిగా జనాలకు పరిచయం చేశాడు. ఈ నాడు ఫిల్మ్ అవసరంలేని డిజిటల్ కమేరాలను,
సెల్ ఫోను కమేరాలను ఉపయోగిస్తున్నాం కాని ఆరోజుల్లో (1888)లో కమేరాలో లోడ్
చేసిన ఫిల్మ్ తోనే కమేరాలు వచ్చేవి. వాటితో ఓ వంద వరకు ఫొటోలను తీసుకొనే సదు
పాయం వుండేది. వంద ఫొటోలు తీసిన తరువాత కంపెనీకి కమెరాను పంపిస్తే తిరిగి
ఫిల్మ్ లోడ్ చేసి ఇచ్చేవారు. అటు తరువాట రోల్ ఫిల్ములు వచ్చాయి.
1900 సంవత్సరంలో ఈస్ట్మన్ బ్రౌనీ బాక్స్ కమేరాను విడుదలచేశాడు. 1950 లో మా
నాన్నగారు కొన్న బ్రౌనీ కోడక్ బాక్స్ కమెరా ఇప్పుడు నాదగ్గర గుర్తుగా వుంది..
ఆగ్ఫా,కనాన్ మొII లైన కంపెనీలు రకరకాల కమేరాలను విడుదలచేశాయి రోల్ ఫిలిమ్
కనొక్కోక ముందు గ్లాస్ ప్లేట్స్లను ఫొటోలు తీయడానికి ఉపయోగించేవారు. మా రోజుల్లో
స్కూలు గ్రూప్ ఫొటో తీసుకోవడం అదో పెద్ద తతంగంలా వుండేది. సాయంత్రం వెలుగు తగ్గే
లోపలే తీయాల్సి వచ్చేది. స్టాండ్ మీద ఓ పెద్ద పెట్టెలా వుండే కమెరా పెట్టి ఫొటోగ్రాఫర్
కమెరా లెన్సు బయటకు వుంచి , కమెరాకు నల్లని గుడ్డ కప్పిఅందులో దూరి నానా
తంటాలు పడుతూ ఫొటోలు తీసేవాడు. ఇప్పుడు అంతా మారిపోయింది


ఫిల్ము బదులు చిప్స్ వచ్చాయి. మనము తీసిన ఫొటోలు ఎలా వచ్చాయో అప్పుడే
ఆ క్షణంలోనే చూడొచ్చు. నచ్చనివి చెరిపేసుకోవచ్చు. ఫిల్మ్ తో తీసినప్పుడు స్టూడియోకు
వెళ్ళి డెవలప్ చేసుకోవలసి వచ్చేది.ఇక చీకట్లో తీయడానికి పూర్వం రోజుల్లో ఫ్లాష్ పెద్ద
అల్యూమినియం డోమ్ తో వుండేది. ఫొటో తీసిన ప్రతిసారి బల్బును మార్చాల్సి
వచ్చేది. ఒక ఫొటో తరువాత ఆ బల్బు పనిచేయదు. ఎడిసన్ మూవీ కమెరాను
కనుగొనడానికి ముందు 1895లో LUMIERE BROTHERS మొదటి మూవీ
కమెరాను తయారు చేశారు. ఇప్పుడు అతి చిన్న వీడియో కమెరాలు, డిజిటల్
కమేరాలు వచ్చేశాయ్.ఇప్పుడు ప్రతిదీ అతి సులువుగా మారిపోయింది !

Monday, August 15, 2011

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి...........


మనకు స్వాతంత్ర్యం వచ్చి 64 ఏళ్లయింది. ఈ అరవై నాలుగేళ్ళల్లో ఎన్నెన్నో
సాధించాం. దేశం ప్రగతి వైపు వేగంగా సాగుతున్నది. కానీ విచారించదగ్గ
విషయం, అంతే వేగంగా అవినీతి , హత్యలు, ఘొరాలు, రోడ్డు ప్రమాదాలు
ఎక్కువయ్యాయి. కారణం ప్రతి ఒక్కరికీ ఫ్రీడం అన్ని విషయాలలోను సులువు
గా దొరకటమే! ఎంతమంది డ్రయివింగ్ లైసెన్సు సక్రమంగా తీసుకున్న వాళ్ళు
వున్నారు. రోడ్డు మీద ఎడమవైపు నుంచితమ బైకులతో క్రాస్ చేసే వాళ్ళల్లో ,
యువకులే కాదున్యాయాన్ని కాపాడవలసిన న్యాయవాదులూ వుండటం
విచారించ వలసిన విషయం. అంతేకాదు ఈనాటి యువతరానికి సుభాష్
చంద్ర బోస్ ఎవరో, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరో ఎంతమందికి తెలుసు.
ఈనాడు హైద్రాబాదు మాదంటే మాదని మన తెలుగు వాళ్ళం తగవులాడు
కుంటున్నాం కాని ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహస నిర్ణయాన్ని తీసు
కొని వుండకపొతే హైద్రాబాదు పరిస్థితి ఎలా వుండేదో తలచుకోవడానికే భయం
వేస్తుంది. ఏవీ ఆ మహాను భావుల విగ్రహాలు మన తరానికి చూపించి చెప్ప
టానికి.? ఇప్పుడు ప్రతి అడగుడుగునా ఈనాటి స్వార్ధపరుల విగ్రహాలే!


50 ఏళ్ళ క్రితం అన్నపూర్ణావారి "వెలుగు నీడలు" చిత్రానికి శ్రీశ్రీ వ్రాసిన గీతం
వింటుంటే అప్పటికి ఇప్పటికీ ఏమీ మార్పు లేదనిపిస్తుంది.
పాడవోయి భారతీయుడా
ఆడిపాడవోయి విజయ గీతికా II
నేడే స్వాతంత్ర్యదినం, వీరుల త్యాగఫలం II
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరబాటోయి
ఆగకోయి భారతీయుడా ;
కలసి సాగవోయి ప్రగతిదారులా !
ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు
అలముకొన్న నీదేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదురించవోయి ఈ పరిస్థితి.
పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనేవాడే!
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే !
స్వార్ధ మీ అనర్ధదాయకం !
అది చంపుకొనుటె క్షేమదాయకం !
నవ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం !
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం !
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే -----
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం !
అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు !!



అరవైఏళ్ల క్రితం రాజమండ్రి గోదావరి గట్టు శ్రర్ధానంద ఘాట్ లో బోస్ విగ్రహం,.వరదలో
మునిగినప్పుడు, అప్పటి నా కోడక్ బాక్స్ కమెరాతో నే తీసిన ఫొటో.!
స్వాతంత్ర్యోద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో విదేశీ వస్తు బహిష్కరణ
దేశమంతా సాగుతున్నది. ఆ ఉద్యమంలో పాల్గొంటున్న ఓ నాయకుడు
విదేశీ సిగరెట్లు తాగుతుంటే అది గమనించిన ఓ మితృడు " ఏమిటీ పని ?"
అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. " నేను చేస్తున్నదీ అదేగా ! విదేశీ సిగరెట్లను
కసిదీరా కాల్చి పారేస్తున్నాను" అని నవ్వుతూ జవాబిచ్చాడు.

Saturday, August 13, 2011

చల్ చల్ గుర్రం ! చలాకి గుర్రం !!


నాకు చిన్ననాటి నుంచి జంతువులన్నిటిలోకీ గుర్రమంటే చాలా ఇష్టం!
మా చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళాలన్నా, మరో చోటికి వెళ్ళాలన్నా
ఒంటెద్దు బళ్ళు ,గుర్రపు బళ్ళూ వుండేవి. గుర్రపు బళ్ళను జట్కాలనే
వారు. ఒంటెద్దుబండి కంటే జట్కా క్లాసన్నమాట! మా రాజమండ్రి
నుంచి ధవళేశ్వరం వెళ్ళటాన్కి జట్కాలే వుండేవి. నాకు బాగా గుర్తు
బండి ముందు నుంచొని ధవిళేశ్వర, ధవిళేశ్వర అంటూ అరుస్తుండే
వాళ్ళు బండి తోలే వాళ్ళు. వెనుక బరువెక్కవై బండి ముందు తేలు
తుంటే ముందుకు జరగమనే వాడు. జట్కా చక్రంలో చమ్కీ కర్ర పెడితే
వచ్చే ఓ విధమైన సౌండు వింతగా వుండేది. ఆదో రకమైన హారన్ అన్న
మాట. ముళ్ళపూడి వారి బుడుగుకు అలా జట్కా తోలడం భలే సరదా!
ఈకాలంలో కార్లున్నట్టే ఆ రోజుల్లో కొందరికి స్వంత గుర్రపు బండ్లుండేవి.
ఆ జట్కాలోపల మెత్తని పరుపు ఆనుకోడానికి అటూఇటూ మెత్తని
దిండ్లూవుండేవి.ఉండవిల్లి కోటేశ్వరరావుగారనే మా నాన్నగారి స్నేహితుడు
తన స్వంత బండిలో వచ్చేవారు. మనుషులు లాగే రిక్షాలు, అటు తరువాత
సైకిల్ రిక్షాలు వచ్చి బండ్లకు డిమాండు తగ్గింది.

గుర్రపు పందేలు, గుర్రాలతో ఆడే పోలో , ఇలా చాలా జూదాలు, క్రీడలూ
వున్నాయి. మా చిన్నతనంలో వచ్చిన "కీలుగుర్రం" సినిమా ఆ రోజుల్లో
చాలా పాప్యులర్ మూవీ. ఈ కాలం గ్రాఫిక్ యుగంపిల్లలకు గుర్రం ఎగరటం
వింతగా వుండకపోవచ్చుగాని మాకు మాత్రం అలా నాగేశ్వరరావు గుర్రం
మీద ఎగురుతుంటే భలే సరదాగా వింతగా వుండేది. మన సూర్య దేవుడి
రధానికి ఏడు గుర్రాలుంటాయని మన పౌరాణికాలు చెబుతాయి. అలానే
గుర్రం ముఖంతో వుండే తుంబురుడు మంచి గాయకుడు. ఇక హయగ్రీవ
అవతారం గురించి మీరు వినే వుంటారు. ఇక్కడ శ్రీబాపు గీసిన హయ
గ్రీవుని చిత్రం చూడండి. ఈ రోజు హయగ్రీవ జయంతి .స్కందపురాణంలో
ఇలా గుర్రపుతలతో వున్న విష్ణుమూర్తి గాధ మనం చదవుతాం.


గుర్రాలు మన ఫౌరాణిక, చారిత్రక కాలాల నుంచే ప్రశిద్ధి పొందాయి.
రామాయణకాలంలో సంతానం కోసం ఆశ్వమేధయాగం చేసినట్లు మనం
చదువుకున్నాం. అలానే మన చరిత్రలో చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్,
, వీర వనిత ఝాన్సీరాణి గుర్రాల మీదే యుద్ధాలు చేసి శత్రువు
లను చీల్చి చెండాడారు. రాణా ప్రతాప్ గుర్రం పెరే చేతక్. ఈ
పేరుమీదే బజాజ్ కంపెనీ "చేతక్" పేరిట స్కూటర్లను ప్రవేశపెట్టింది !!
ఉత్తరభారత దేశంలో పెళ్ళిళ్ళల్లో వరుడు గుర్రంమీదే ఊరేగుతాడు..

పాత గుర్రపు నాడా మనకు దారిలో దొరికితే దాన్ని గుమ్మానికి పెట్టుకుంటే
అదృష్టం కలిసి వస్తుందని కొందరు నమ్ముతారు. కొందరు అమ్మాయిలు
అబ్బాయిలు రబ్బరు బాండుతో వేసుకొనే జడలని పోనీ టైల్స్ అంటారు.
ఇప్పుడు అంతగా కనిపించడం లేదు కాని చిన్న ప్పిల్లలున్న ఇళ్లల్లో ఊగే
చెక్క గుర్రాలుండేవి, ఇప్పటి రాకింగ్ చైర్లలాగ. అవిలేకపోతే పిల్లలు తాతల,
నాన్నల వీపుమీదెక్కి చల్ చల్ గుర్రం అంటూ ఇల్లంతా దేకించేవారు.
ఇప్పటిలా నడుము నొప్పులు లేవు కాబట్టి వాళ్ళు కూడా పిల్లల్ని అలాఓపిగ్గా
ఆడించే వాళ్ళు. యంత్రాల శక్తిని హార్స్ పవర్ తో గుర్తిస్తారు ఇప్పటికీ
బొంబాయి లాంటి నగరాల్లో బీచ్ దగ్గర గుర్రపు బగ్గీలు అగుపిస్తాయి. కేదార్నాధ్
లాంటి యాత్రల్లో యాత్రికులను తీసుకువెళ్లడానికి గుర్రాలను ఉపయోగిస్తారు.
. 1953 లో చందమామ లో వచ్చిన "విచిత్రకవలలు" సీరియల్
కు శ్రీచిత్రా కందకం మీద నుంచి దూకుతున్న గుర్రాల చిత్రాలు ఎంత బాగా
వేశారో చూడండి. అరబ్బీ దేశం, రాజస్ఠానీ గుర్రాలు జాతి గుర్రాలుగా పేరుపొందాయి.
.


ఇక చివరగా ముళ్లపూడి వెంకటరమణగారి నవ్వితే నవ్వండి గుర్రం కధ::
రాజుగారు పరివారంతొ సహా అడవికి వేటకు బయల్దేరారు.చాలా
దూరం పోయాక వున్నట్టుండి ఆయన గుర్రానికి జబ్బు చేసి కూల
బడిపోయింది. ఆ దగ్గర్లో వున్న గ్రామంలో వాకబు చేయగా ఇద్దరు
పెద్దరైతులకి చెరో గుర్రం ఉన్నట్టు తెలిసింది. రాజుగారు వాళ్ళకి కబురు
చేయగా వాళ్ళు గుర్రాలతో సహా వచ్చారు. కాని, అవి వట్టి దండగమారి
గుర్రాలని, పరిగెత్తలేవనీ వాళ్ళు మనవి చేసుకున్నారు.
గుర్రాలివ్వటం ఇష్టం లేకనే వాళ్ళు సాకు చెబుతున్నారని రాజుగారు
గ్రహించారు..రెండుగుర్రాలకి పందెం పెట్టి ఏది బాగా పరుగెడితే అది తీసు
కుంటామన్నారు.
"లాభంలేదు ప్రభూ! వాళ్ళు గుర్రాల్ని సరిగా పరిగెత్తనివ్వరు"అన్నాడు
సేనాని రాజుగారి చెవిలో.
" మా బాగా పరిగెత్తనిస్తారు.ఒకళ్ళ గుర్రాన్ని మరొకళ్ళని ఎక్కమను"
అన్నాడు రాజు.
<<><><><><>>
అన్నట్టు ఇంకో గుర్రం మాటండోయ్ ! ప్రసిద్ధ కవి శ్రీ జషూవా గారి పూర్తి
పేరు తెలుసుగా! ఆయన పేరు శ్రీ గుర్రం జాషూవా. మన తెలుగులో
గుర్రాలపై నానుడులూ స్వారీ చేసాయి. అందులో కొన్ని..........
రౌతు కొద్దీ గుర్రం
గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదు
గుర్రాన్ని నీళ్ల దగ్గరకు తీసుకు వెళ్ళగలమేగానీ తాగించగలమా?!!



Tuesday, August 09, 2011

పుస్తకాలు-పత్రికలు



ఎవరు చెప్పినా వినకు !
ఫేపరు మాత్రం కొనకు !!
పక్కవాడింట్లో వుందిగా మనకు !!!

పుస్తకాలు "కొని"
చదివే వాళ్ళకన్నా
తీసు "కొని" చదివే వాళ్ళే ఎక్కువ కదన్నా !!


పుస్తకాలు "కొని"
చదివే వాళ్ళకన్నా
తీసు "కొని" చదివే వాళ్ళే ఎక్కువ కదన్నా !!

నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను !
అవిఇప్పుడు మీకు బుక్ షాపుల్లో దొరుకుతున్నాయి కనుక !!
నా పాత పుస్తకాలూ ఎవ్వరికీ ఇవ్వను !!
అవిప్పుడు నాకు ఎక్కాడా దొరకవు కనుక !!
మంచి పుస్తకం కొన్నప్పుడు
నలుగురికీ చూపించు !!
నలుగురి చేతా కొనిపించు !!
పుస్తకాన్ని కలకాలం బ్రతికించు !!
<><><> నా సురేఖార్ట్యూన్ల నుంచి

Sunday, August 07, 2011

స్నేహానికి ఏడాదికి ఒక "రోజా" ?!!


తీయనిదీ, విడతీయనిదీ స్నేహం !
ఆ స్నేహానికి ఏడాదికి ఒక రోజా ? !
బంధాలతో ఏర్పడేది బంధుత్వాల అనుబంధం !!
కష్టాల్లో, నష్టాల్లో కలకాలం నిలిచేదే స్నేహం!!
( నా సురేఖార్ట్యూన్ల నుంచి)
మనకు బంధువులను ఎంచుకొనే అవకాశం లేదు, కాని మనకు
స్నేహితుల్ని ఎంచుకొనే అవాకాశం వుందని ఇంగ్లీషులో ఓ సామెత.
సృష్టిలో అన్నింటికన్నాతీయనిది స్నేహమని చెబుతారు. అలాటి
స్నేహం గుర్తుకు తెచ్చే జంటలు నాగిరెడ్డి-చక్రపాణి, బాపు-రమణలు!
ప్రతి సంధర్భానికి ఏడాదికి ఒకరోజును నిర్ణయించడం ఈ రోజుల్లో అదో
ఆనవాయితీగా మారింది. అసలు స్నేహానికి ఒక రోజేమిటి? ప్రతి రోజూ
మన స్నేహితులతో గడిపిన ప్రతి క్షణం పండుగే, వేడుకే! మనకు మంచి
సలహాలనిచ్చేది , ఇబ్బందుల్లో ధైర్యాన్ని ఇచ్చేది స్నేహితులే! ఇప్పుడు
రిటైరై బ్లాగు రాయటం మొదలు పెట్టాక ఎందరొ కొత స్నేహితులు
కలిశారు
. కొందరు నాపై అభిమానంతొ మా యింటికి వచ్చి కలిశారు.
. మరికొందరు మైల్స్ ద్వారా దగ్గరయ్యారు.
. శ్రీ కప్పగంతు శివరామ ప్రసాద్, భమిడిపాటి ఫణిబాబు, విజయ
వర్ధన్, శ్రీమతి వల్లబోజు జ్యోతి, రాధేశ్యాం, హిండూ కార్టూనిస్ట్ సురేంద్ర,
సుధామ, కర్లపాలెం హనుమంతరావు, చందమామ సంపాదకులు రాజ
శేఖర రాజు, శిష్ట్లా రామచంద్ర రావు ఇలా ఎందరో మహానుభావులు.
బాపు రమణలు నన్నూ ఓ స్నేహితుడిగా గుర్తించారంటే అంతకంటే
అదృష్టమేముంది చెప్పండి.నిన్ననే USA నుంచి వచ్చిన వర్మ అల్లూరి
శ్రీ ఫణిబాబుగారి ద్వారా నా ఎడ్రెస్ కనుక్కొని మా యింటికి వచ్చారు.
ఫ్రెండ్షిప్ డేకి ఒకరోజు ముందర ఆయన రావటం నిజంగా కాకతాళీయమే!
"Animals are such agreeable friends-they ask no
questions, they pass no criticisms- George Eliot
చివరిగా మితృలందరికీ ఫ్రెండ్షిప్డే శుభాకాంక్షలు తెలియ జేసుకుంటూ
శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారి "నవ్వితే నవ్వండి- మా కభ్యంతరం
లేదు" నుంచి ఓ జోకు :
"నాకో రూపాయి అప్పుకావాలనుకోండి ప్రాణం పోయినా
సరే స్నేహితుణ్ణి మాత్రం ఎన్నడూ అడగను.అది నామతం"
అన్నాడు అప్పారావు.
"ఒట్టు ?... ... అయితే యీ క్షణం నించి నన్ను మీ ఆప్తమిత్రులలో
ఒకడిగా చేర్చుకోండి"అన్నాడో పరిచితుడు భక్తిగౌరవాలతో.
<><><><><><><><><><>

Saturday, August 06, 2011

ఫాటలూ, మాటలూ అన్నీ రమణీయమే !!

రమణగారు సిన్మాలకు మాటలు వ్రాసినా పాటలు వ్రాసినా ఆసిన్మాలకు
పత్రికలకు సమీక్షలు వ్రాసినా అంతా రమణీయమే ! వెండితెర నవల
తనే వ్రాసినా అందులోనూ ఘాటైన చమత్కార బాణాలు సంధించడంలో
రమణగారికి సాటి లేరు. "వెలుగు నీడలు’ సిన్మా నవల వ్రాస్తూ చిత్రం
క్లైమాక్సులో వచ్చే పోట్లాట అతికించి వున్నట్టుందని విమర్శించారు
రమణ గారు.
"తీరా పోలీసువాళ్ళొచ్చేసరికి వాళ్ళు అణచడానికి దొమ్మీ లేకపోతే
బాగుండదు. వాళ్ళు చిన్నబుచ్చుకోవచ్చు.అందుకని రావుబహదర్ గారి
"అనధికార సాయుధబలగం"లోని అసభ్యులు-గిట్టనివాళ్ళు వీళ్ళని గూండా
లంటారు-నెమ్మదిగా , గుట్టుగా వర్కర్లలో కలిసిపోయి ఒక పాత వర్కర్ని
కొట్టారు."
మన తెలుగు సినిమాల్లో చివరలోఇలా ఫైటింగులుండి అంతా అయ్యాక
పోలీసులు రావటాన్ని పై వాఖ్యాల్లో రమణగారు సున్నితంగా ఎత్తి చూపించారు.
ప్రేమించి చూడు సినిమాలో ఆయన వ్రాసిన బుచ్చబ్బాయ్ పనికావాలోయ్
పాటలో రమణగారి మాటల చమత్కారం అగుపిస్తుంది చక్కని తెలుగు నుడి
కారం "కాసె పోసి" అనే పదం వాడుతూ అంత్యప్రాసలతో రమణీయంగా సాగి
పోతుంది.
మేడమీద మేడకట్టి
కోట్లు కూడబెట్టినట్టి కామందూ
కమాన్-కమవుట్ రాముందూ....
ఆడపిల్ల మాట మీద
ఉద్యోగాలూడగొట్టు
ఆకతాయి కామందూ-
మీసకట్టు తీసివేసి
కాసెపోసి కోకచుట్టి
గాజులేసుకొమ్మందూ.
ఇలాగే "పక్కలో బల్లెం" జానపదచిత్రంలో ఓ పాటకు ఆయన
వాడిన పదాల అందాలు చూడండి :
చినదానా-
వలచినదానా" అంటూ తన మార్కును చూపించారు.
రమణగారు మాటలు వ్రాసిన మొదటి చిత్రం "దాగుడు మూతలు" ఐనా
ముందు విడుదలయింది, "రక్తసంభంధం"! దాగుడుమూతలు సినిమాలో
పద్మనాభం పాత్ర పేరు పాపాయి. ఉన్న కొద్ది తెలివితేటలు గయ్యాలి
తల్లి సూరమ్మ కేకలతో హరీ మని అతనికి బడి పుస్తకాల్లోని పాఠాల
భాషే ఒంట బట్టింది.ఆ పాపాయికి రమణగారు వ్రాసిన మాటలు :
"తాతయ్యలకు బోల్డు ఆస్తివుండును. దాన్ని వాళ్ళు మనుమలకు
ఇచ్చెదరు. అంతవరకు మనము అమ్మడిని పెళ్ళిచేసుకోరాదు అని
అమ్మ చెప్పును" ఈ ముద్దు మాటలతోనే ఆ పాత్రను పరిచయం
చేస్తారు రమణ.
ఈ సిన్మాలో సూర్యకాంతానికి జ్వరమొస్తుంది. ఈ హాస్య సన్ని
వేశానికి రమణ గారు వ్రాసిన మాటలు పక్కున నవ్విస్తాయి.
అమ్మడు ,పాపాయి కలసి సూరమ్మకి దర్మామీటరుతో జ్వరం
చూస్తూ. "అమ్మబాబోయ్. బెజవాడంత వచ్చేసింది".
సూరమ్మ: బెజవాడేమిటే ?
అమ్మడు: అవునత్తయ్యా 118 డిగ్రీలుంది !
సూరమ్మ: అమ్మో! అయిసు బాబోయ్ అయిసు, అయినా 118 డిగ్రీలుంటే
మనుషులు బ్రతుకుతారుటే ?!
అమ్మడు " ఆ ( ! బెజవాడలో మనుషులు బతకటం లేదా ?
( ఆ రోజుల్లో బెజవాడలో ఎండాకాలం మండిపోయేదట! బెజవాడను
BLAZE WADA అని చమత్కరించేవారు)
1957 లో ఆంజలీ వారి సువర్ణసుందరి చిత్రానికి రమణగారు వ్రాసిన
సమీక్ష ఎంత చమత్కారంగా వుందో చూడండి.:
"అంజలీపిక్చర్సు వారి "సువర్ణ సుందరి" చిత్రాన్ని బాక్సాఫీసు సూత్రాల
పెద్దబాలశిక్ష అనవచ్చు! అలా అని, ఈ చిత్రాన్ని చూడవచ్చు. ఈ సూత్రాల
కూర్పులో దర్శక నిర్మాతలు చూపిన నేర్పును మెచ్చుకోనూ వచ్చు.ఎందు
కంటే మూడున్నర మైళ్ళు పొడుగున్న ఈ చిత్రగాధలో నడుస్తున్నప్పుడు
శ్రమ,విసుగు లేకుండా దారిలో బోలుడు మజిలీలున్నాయి. భారతీయ
నృత్యాలు, బొంబాయిడాన్సులు, తెలుగు పాటలు, హిందీగీత్ లు, హాస్యం,
దేశవాళీ రెడ్ ఇండియన్ కోయవాళ్ళూ, కొట్లాటలు, అట్టల బండలూ,వెదురు
బుట్ట కొండలూ, ఇ.వి.సరోజ వేషంలో పార్వతీదేవీ,ఇంకా సురలు,అసురులూ
ఇత్యాదయః"( బాపూరమణీయం పేరిట 1990 లో బాపురమణలు ప్రచురించిన
పుస్తకం నుంచి)


"బుద్ధిమంతుడు" సినిమాలో కులాలూ గోత్రాలు గురించి తన వాదనను ప్రతి
ఒక్కరికీ అర్ధమయేటట్లు వ్రాశారు.
మాధవయ్య తన తమ్ముడు గోపి,రాధను చేసుకోవడం కులాంతర వివాహం
అవుతుందని అనుకుంటే కృష్ణుని పాత్ర చేతే జవాబు చెప్పించారు. "నువ్వు చెయ్య
టంలే వర్ణసంకరం!నా నైవేద్యం కళ్ళకద్దుకొని తింటున్నావు. నేను క్షత్రియుల
యింట పుట్టానని, గోపాలకుల యింట పెరిగానని, యెరుగవా ? మరచిపోయావా?"
ఇలాటి రమణీయాలు ఎన్నో ఎన్నెన్నో! రా(తీ)సిన కొద్దీ అంతులేని మాణిక్యాల
వాక్యాలు దొరుకుతూనే వుంటాయి !