Thursday, June 28, 2012

ఈ రోజు మన బుడుగు పుట్టినర్రోజురోయ్ !!


               


                             హాస్యమందు అఋణ
                             అందెవేసిన కరుణ
                             బుడుగు వెంకటరమణ
ఓ కూనలమ్మా !! అంటూ తమ కూనలమ్మ పదాలలో ఆరుద్ర అన్నారు. అంతేకాదు రమణగారికి పెళ్ళి కానుకగా, శ్రీదేవి గారికి తోడుగా అందించారు.
  
రమణగారికి గోదావరి అంటే ఎంతో ఇష్టం. అందుకే బాపురమణలు  తమ సినిమాల్లో గోదావరిని మరింత అందంగా చూపిస్తారు.1956 నవంబరు నుండి 1957 ఏప్రియల్ వరకు ఆంధ్ర సచిత్ర వార పత్రిక ప్రచురించిన ఆయన " బుడుగు-చిచ్చుల పిడుగు" ధారావాహికగా వచ్చినప్పుడు నా వయసు 15 ఏళ్ళు ! ఆనాటివేలాది పాఠకులతో బాటు వారం వారం బుడుగు చేసే అల్లరి కోసం ఎదురుచూసే వారం బుడుగు అమ్మ,నాన్న రాధాగోపాలం, గర్ల్ ఫ్రెండు సీగానపెసూనాంబ, బాబాయి, రెండు జెళ్ళసీత,లావుపాటి పిన్నిగారు, ఆవిడ మొగుడు, ప్రైవేటు మాస్టారులు , మధ్యలో వచ్చే డికిస్టీ వాడు ఇలా ఎన్నేన్నో పాత్రలు !


 బుడుగు వీక్లీలో వచ్చే రోజుల్లో రచయిత ఎవరో మాలాటి వాళ్ళకి చివరివరకూ తెలియలేదు. చివరాఖరికి బుడుగు చెబుతాడు "ఇది రాసి పెట్టినవాడు ముళ్లపూడి వెంకటరమణ , బొమ్మలు వేసినవాడు బాపు " అని ! ఆనాటి నుంచే బాపు రమణ గార్లంటే విపరీతమైన అభిమానం. ఆరాధన.! తరువాత దాదాపు  50 ఏళ్ల తరువాత  2005లో బాపురమణ గార్లను కలిసే అదృష్టం కలిగింది. 2008 లో వచ్చిన నా "సురేఖార్టూన్స్ " పుస్తకానికి నా అభిమాన రచయిత శ్రీ ముళ్లపూడి జుబ్లీబాయ్ జిందాబాద్ అంటూ ముందు మాట వ్రాసారంటే అది నాకు వారిద్దరి ఆరాధ్యదైవం శ్రీరాముడి కృపే !

                              
ఆయన రచనలు ఎన్నని చెప్పగలం ! ప్రతిదీ అద్భుతమే ! రాధా గోపాలం, ఇద్దరమ్మాయిలూ -ముగ్గురబ్బాయిలూ ,ఋణాలందలహరి, విక్రమార్కు సింహాసనం లతో బాటు ఎన్నో పిటీ 109 లాటి అనువాదాలు వున్నాయ్. శ్రీ ముళ్ళపూడి సాహితీ సర్వస్వం ఎనిమిది సంపుటాలుగా  శ్రీ యమ్భీయస్ ప్రసాద్ గారి సంపాదకత్వంలో వెలువడి వీశేష ఆదరణ పొందింది. ఋణానందలహరిలో ఆయన పంచతంత్రంలోలా జంతువుల చేత తెలుగు మాట్లాడిస్తారు! కాకులు ఆవులించవు, కావులిస్తాయి., కావు కేకలు పెడతాయి. బావురమని ఏడవవు ! కావురమని ఏడుస్తాయి.
 అవి "రెక్కా"డితేగాని డొక్కాడనవి ! ఒకరితో ఒకరు  కాకమ్మ కబుర్లు చెప్పుకుంటాయి. ఇలా ఎన్నో చమత్కార ప్రయోగాలు చేశారు.

 రమణగారి చేత మొట్టమొదటి సినిమా స్క్రిప్ట్ "దాగుడు మూతలు" చిత్రానికి శ్రీ డి.బి.నారాయయణ వ్రాయించారు. కాని రమణగారు వ్రాసిన రెండో చిత్రం " గుడిగంటలు" మొదట విడుదలయింది. హాస్యం వ్రాసే రమణ ఇలాటి బరువైన కధా చిత్రానికి.మాటలు రాయడమా అని  విమర్శించిన వారే సినిమా విడుదలయాక ముళ్ళపూడిని మెచ్చుకున్నారు.అందాలరాముడు,బుద్ధిమంతుడు, ముత్యాల ముగ్గు, సీతాకళ్యాణం ( ఈ చిత్రం అంతర్జాతీయ ప్రశంసలందుకొంది ).లాటి ఆణిముత్యాలు తెలుగు తెరకు అందించారు. చిన్నతెరకు ఆయన వ్రాసి బాపు అందించిన శ్రీ భాగవతం 100 ఎపిసోడ్స్ ఈటీవీ ద్వరా శ్రీ రామోజీరావు సమర్పించారు..


శ్రీ భాగవతం లో ఒక పాటకు ఆయన మాటల గారడీ ఇలా ఓ నదిలా సాగిపోతుంది.
                                         గలగల పారెడు నది యిది
                                         కిలకిల నవ్వించు"నది"  ఈ
                                         వలపుల కౌగిలి మ"నది"-చలి
                                         గిలగిలగిలల నలిగి "నది".......
  శ్రీ రమణగారు "సాహితీ సర్వస్వం " పుస్తకం నాకు కానుకగా సంతకం చేసి ఇస్తూ క్రింద బాపు అని కూడా వ్రాసి బ్రాకెట్లో "ఆధరైజ్డ్ ఫోర్జరీ" అని చేర్చటం ఆయన అక్షరాలతో ఆటలాడుకుంటారనడానికో మచ్చుతునక. ఆయన అక్కినేని జీవితాన్ని కధానాయకుడు కధ పేరిట వ్రాశారు. ఆయన తన ఆత్మ కధ కాని కధను రమణీయంగా "కోతి
 కొమ్మచ్చి" పేరుతో స్వాతిలో వ్రాశారు. ఈ కధ మామూలు ఆత్మకధ కాదు. ఈనాటి యువతరానికి వాళ్ళు ఎదుర్కొనే కష్టాలను, నష్టాలను ఇష్టాలుగా మార్చుకొని ధైర్యంగా ముందుకు సాగించేందుకు తోడ్పడే అద్భుత టానిక్ ! ’కోతికొమ్మచ్చిమీరు తెలుగు తెలిసి చదవటం రాక పోయినా హాయిగా బాలుగారి గొంతులో వినొచ్చు. వివరాలకు www.kothikommachi.com కు వెళితే సరి !! రమణగారూ మీరు నెలకొకసారైనా ఫోన్లో పలకరించేవారు. ఇప్పడు నాలాటి వేలాది గుండెల్లో నిత్యం  నిలచి పలకరిస్తున్నారు !! మీ నవ్వితే నవ్వండి జోకులు గుర్తుచేస్తూ నవ్విస్తున్నారు. మీరు చిరంజీవి !!
           
                         
                   
                           
                           
                          

Thursday, June 21, 2012

ఆలాపన


                                              సరాగమాల శ్రీ విఏకె. రంగారావుగారు

శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు చెప్పిన సంగీతం జోకు:  న్యాయమూర్తి ఒక కేసులో ముద్దాయికి శిక్ష విధించబోతూ  "నిన్నెక్కడో చూచినట్టుందే, ఎక్కడ చెప్మా" అన్నాడు. "చిత్తం, మీరు ప్లీడరుగా వున్నప్పుడు మీ రెండో అమ్మాయికి  సంగీతం చెప్పడాని కొచ్చే వాడినండి...." "అలాగా! అయితే యిరవై ఏళ్ళు ఖైదు విధిస్తున్నాను."

 సంగీత ప్రియులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు  తన కుంచెతో అందంగా "గీతా"లాపన చేసిన మా బాపుగారికి కృతజ్ఞతలతో 

Tuesday, June 19, 2012

జంధ్యా వందనం

        నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు
        జంధ్యాల. తెలుగు సినిమా ప్రేక్షకులకు అసలు సిసలైన
        నూరుపాళ్ళ హాస్య సంభాషణలను అందించిన దర్శక
        రచయిత ఆయన. తెలుగువారి సంబరాల సంక్రాంతి
        పండుగ రోజున పుట్టిన (1951) జంధ్యాల మనల్ని
        వదలి ఈ రోజుతో అప్పుడే పదకొండేళ్ళయింది..


        పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించిన
        ఆయన తొలి రచన "దేవుడు చేసిన బొమ్మలు"
         1976  నుంచి 1981 వరకు దాదాపు 200
        సినిమాలకు రచనలు అందించారు. రచయితగా
        శంకరాభరణం, సప్తపది,సాగరసంగమం, వేటగాడు,
        జగదేకవీరుడు-అతిలోకసుందరి అయనకు, 
        ప్రేక్షకులకు న(మె)చ్చిన చిత్రాలుగా మిగిలిపోయాయి.       
    
        అసభ్యత లేకుండా.ఆయన సినిమాల్లోని మాటలు
        ఇప్పటికీ మనకు జ్ఞాపకం వచ్చినప్పుడలా చిరు
        నవ్వులు చిందిస్తాయి. వాటిలోని కొన్ని ఆణిముత్యాలు
        ఏరి మీ ముందు పోస్తున్నాను. తనివితీరా చదివి మీ
        జ్ఞాపకపొరల్లో కలకాలం దాచేసుకోండి.
               ***************
       "హలో సుబ్బారావు గారూ కులాసా?"
       "కు లేదు బాబూ...అంతా లాసే"
           *****************
       పన్నేండేళ్ళ దాకా ఆడది ఇండియా లాంటిది
       అందరూ ఎత్తుకొని ముద్దుపెట్టాలనుకుంటారు!
       12 నుంచి 18 దాకా ఆడది అమెరికాలాంటిది
        ప్రతివాడు ఆ అందాన్ని అందుకోవాలని, పొందాల్ని చూస్తారు!
        18 నుంచి 40 దాకా ఆడది ఇంగ్లాండ్ లాంటిది
        దూరం నుంచి చూస్తూ ఆనందిస్తుంటారు!
        40 నుంచి 60 దాకా ఆడది ఆఫ్రికా లాంటిది
        చూడగానే జడుసుకుని పారిపోతారు !
            *****************
        నేను ఇంట్లో వంట చేస్తానని చెప్పిన ఆ శుంఠ ఎవరు ?
        మీ ఏరియా ముష్ఠివాడు సార్.
        ఎవరూ..మాఏరియా ముష్థివాడా.. వాడి మాటలు నమ్మి
        మీ గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో నా ఫొటో వేసుకుంటావా..
        ఇలా నాతో మాట్లాడటానికి ఎన్ని గుండెలురా రాస్కెల్...
        ఓసారి ఇటు వచ్చి కనబడు...నిన్ను రోట్లో వేసి రుబ్బుతా
        గ్రైండర్ వెధవా...
     
        First is the first of the first and last is the first
          of the last, in between two zeros అంటే ఏమిటో
        చెప్పండి.
        ఫస్ట్  లో మొదటి అక్షరం ఎఫ్, లాస్టులో మొదటి
       అక్షరం ఎల్. ఇన్ బిట్వీన్ టూ జీరోస్... అంటే FOOL.
                  ******************
        హీరో ఓ కాఫీ హోటల్ కెల్తాడు.సర్వర్ రాగానే హీరో
        ఏమున్నాయ్ అని అడిగాడు.
        అప్పుడు సర్వర్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మసాలా గారె
        ఉప్మా, , కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మసాలా
        అట్టు, బాతు, టమాటో బాతు, బోండా, బజ్జీ, మైసూర్ 
        బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు,రవ్వలడ్డు,
       మిఠాయి, ఫీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి
       మిఠాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా, హల్వా,
       మైసూరుపాకు, అమలాపురం కాజా,భీమవరం బాజా,
       పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు.
       అప్పుడు హీరో అట్టు తెమ్మంటాడు.
       అప్పుడు సర్వర్ ఏ అట్టు...పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా,
       మసాలా అట్టా,  70 MM అట్టా, నూనేసి  కాల్చాలా,
       నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి
       కాల్చాలా, కిరసనాయిలు పోసి కాల్చాలా, డిజిలేసి
       కాల్చాలా, అసలు కాల్చాలా, వద్దా అని అడిగాడు.
       అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్చమన్నాడు,
       కాఫీ కూడా తెమ్మన్నాడు.
       అప్పుడు సర్వర్...ఏ కాఫీ...మామూలు కాఫీయా,
       స్పెషలు కాఫీయా, బ్రూ కాఫీయా, నెస్సు కాఫీయా,
       బ్లాక్ కాఫీయా, వైటు కాఫీయా, హాటు కాఫియా, కోల్డ్
       కాఫీయా, నురగ కావాలా, వద్దా, కావాలంటే ఎన్ని
       చెంచాలు కావాలి అని అడిగాడు.
       అప్పుడు హీరో మామూలు కాఫీ తెమ్మన్నాడు.
       అప్పుడు సర్వరు నీలగిరి కాఫీయా, హిమగిరి కాఫీయా
      ,సిమలా కాఫీయా....
       ఆపండి మహాప్రభో...ఆపండి.తమలో ఇంత ఊహాశక్తి
      ఉందని ఊహించలేకపోయాను. ఈ కధే సినిమా
      తీసుకోంది. పదివేల రోజులాడుతుంది. 
           
              

Sunday, June 17, 2012

నాన్న మనసు



                  గురువు తల్లితండ్రులతో సమానమంటారు. కానీ ఒక గురువు తన
                  శిష్యుడి బొటనవేలు గురుదక్షిణగా తీసుకున్నాడు. మరి నాన్న
                  తన చూపుడి వేలు అందించి జీవితంలో ప్రతి అడుగుకూ దారి
                  చూపిస్తాడు. ఆనాడు మాకు బడిలో విద్యార్ధులుగా అక్కా,నేనూ,
                  చెల్లీ నేర్చుకున్నదానికంటే నాన్న మాకు ఎన్నో నేర్పారు. బొమ్మలు
                  గీయటం  నేర్పించారు. ఆరోజుల్లోనే నన్ను ఇంగ్లీషు సినిమాలకు
                  తీసుకు వెళ్ళి మధ్యలో చూపించే కార్టూన్ సినిమాల గురించి,
                  వాటిని బొమ్మలు గీస్తూ ఎట్లా కదిలే బొమ్మలుగా అగుపించేటట్లు
                  చేస్తారో చెప్పేవారు.

                  ఒకసారి బడిలో, నేను సెకండ్ ఫారం చదివే రోజుల్లో మా తెలుగు
                  మాస్టారు " మీరు బ్రాహ్మలేనా " అని అడిగారు. నేను అవునన్నాను.
                  తరువాత ఆయన " మీరు వైదీకులా, నియోగులా " అని మరో ప్రశ్న
                  వేశారు. నేను తెలియదని చెప్పాను. తరువాత నాన్నగారు ఇంటికి
                  రాత్రి వచ్చాక ( ఆ రోజుల్లో నాన్నగారు బ్యాంకు నుంచి ఇంటికి
                  వచ్చేటప్పటికి చాలా పొద్దుపోయేది) మేస్టారు అడిగిన ప్రశ్నను
                  అడిగాను. దానికి ఆయన చెప్పిన సమాధానం " మనం మనుషులం".
                  ఇట్లా నాన్నగారు చాలా అభ్యుదయ భావాలతో వుండేవారు. అమ్మకు
                  మాకు ఇలాటి. భావాల్నే మాకు నేర్పారు.



                  నాన్నగారికి పుస్తకాలంటే అమిత ఇష్టం. రాత్రి ఎంత పొద్దుపోయి
                  వచ్చినా ఏదో ఒక పుస్తకం చదివికాని పడుకొనే వారు కాదు. అదే
                  అలవాటు అమ్మకీ, మాకూ వచ్చింది. ఆయన కొన్న పుస్తకాలతో
                  నా లైబ్రరీ సగం నిండింది. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, శంకర్స్
                  వీక్లీ, బ్రిటిష్ వార పత్రిక టిట్ బిట్స్, కొనే వారు. ఇలస్ట్రేటేడ్ వీక్లీలోని
                  ప్రఖ్యాత చిత్రకారుల పెయింటింగ్స్ తో ఆల్బమ్ తయారు చేశారు.
                  నాణేలు, స్టాంపులూ సేకరించారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ దిన
                  పత్రిక ఆ రోజుల్లో ఆదివారం సన్డేస్టాండర్డ్ పేరుతో వచ్చేది. అందులోని
                  కామిక్స్ చదివి చెప్పేవారు. మాతో ఒక స్నేహితుడిగా మెలిగేవారు.

                  ఆయన 1944 లో రాజమండ్రి వచ్చినప్పుడు మొదటిసారిగా కొన్న
                  రీడర్స్ డైజస్ట్ పత్రిక ఇంకా నా దగ్గర వుంది. అప్పటి నుంచి ప్రతి
                  సంచికను ఆయన మిస్సవలేదు. నే నిప్పటికీ డైజెస్ట్ కు చందా
                  దారున్ని. ఇప్పుడయితే డెబిట్ కార్డులూ, క్రెడిట్ కార్డూలూ వచ్చాయి.
                  మా నాన్నగారు ఎప్పుడూ కాష్ ఉపయోగించేవారు కాదు. చెక్
                  లీవ్స్ ఒకటి రెండు దగ్గర వుంచుకొని కొన్న వాటికి చెక్కే ఇచ్చేవారు.
                  మా నాన్నగారి పేరు మట్టెగుంట వేంకట సుబ్బారావుగారు.1925
                  లో  ఇంపీరియల్ బ్యాంకులో క్లర్కుగా చేరి 1959 లో స్టేట్ బ్యాంకులో
                  ఆఫీసరుగా రిటైరయ్యారు.1955 లో ఇంపీరియల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్
                  గా మారింది. నాన్నను అనుదినం తలచుకుంటూ, నాన్నల పండుగ
                  రోజు అన్ని వయసుల నాన్నలందరికీ నా శుభాభినందనలు

Thursday, June 07, 2012

గుండక్కకు 50 ఏళ్ళు !!

జూన్ 1962, 7వ తేదీన విడుదలయిన విజయా వారి  గుండమ్మ కధకు నేటితో 50 ఏళ్ళు  ఆనాడు విడుదలయి అఖండ విజయం సాధించిన ఈ సినిమా నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్నదానికి తార్కాణం ఈ రోజు ప్రతి చానల్ ఆ చిత్రం గురించిన విశేషాలు ప్రసారం చేయటమే. ఈటీవీ ఉదయం చిత్రం ప్రసారం చేసి అభిమానులను మరోసారి అలరించింది. అగ్రనటులు నాయకులుగా నటించిన ఈ చిత్రానికి "గుండమ్మకధ" అని  పేరుంచడమే   చిత్రానికి ఒక ప్రత్యేకతను ఇచ్చింది. ఈ సినిమా నిర్మాణసమయంలో చక్రపాణిగారిని మీ గుండమ్మకధ ఎంతవరకూ వచ్చింది అంటూ అడుగుతుంటే చివరకు ఆయన చిత్రానికి "గుండమ్మకధ" పేరునే ఖాయంచేశారు. ఇక గుండమ్మ(క్క)గా సూర్యకాంతం అసమాన నటన ప్రదర్శించారు

విజయాచిత్ర రధసారధులు శ్రీ నాగిరెడ్డి చక్రపాణి మంచి మిత్రులు. బాపురమణలలా దేహాలు వేరయినా మనసులు, భావాలు ఒకటే. తెలుగు చిత్రానికి  శ్రీ కమలాకర కామేశ్వరరావు  దర్శకత్వం వహిస్తే తమిళ చిత్రానికి శ్రీ చక్రపాణి దర్శకత్వం వహించారు.

శ్రీ రామారావుకు "గుండమ్మకధ" వందవ చిత్రం కావడం మరో విశేషం. ఇది చిత్రం వందోరోజు నాటి ఆంధ్రపత్రిక దినపత్రికలో వచ్చిన అప్పటి ప్రకటన !
 "గుండమ్మకధ" నాగేశ్వరరావు గారి 99 చిత్రం కావడం మరో వీశేషం!! ఆనాటి "గుండమ్మకధ" ప్రకటనలో అక్కినేని ఇలా అన్నారు "19 సంవత్సరాల నా చలన చిత్ర యాత్రలో "{గుండమ్మ  కధ" నా 99 వ మజిలీ. తెలుగుచిత్ర చరిత్రలోనే అపూర్వం అనతగ్గ ఘనవిజయం సాధించి ఆబాలగోపాలాన్ని ఆనందపరుస్తున్న ఈ చిత్రం,తెలుగు సినిమా కధలోనూ కూడా ఒక  మైలురాయి కావడం నాకెంతో సంతోషకరమైన విషయం."

మరోవిశేషం "గుండమ్మకధ" తమిళ వర్షన్ "మనిదన్ మారవిల్లై " (మనిషి మారలేదు)అక్కినేనికి వందవ చిత్రం!!. ఇందులో NTR పాత్రను జెమినీగణేశన్ ధరించారు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో ప్రతిపాటా ఈనాటికీ నిత్యనూతనమే.

గుండమ్మ ఇంట్లో ఏఎన్నార్, యమ్టీయార్ కలసుకున్న సంధర్భంలో వాళ్ళిద్దరి మధ్య  సంభాషణలను  విజిల్ రూపంలో చూపించడం కొత్తగా వుండి అభిమానులను విశేషంగా ఆకర్షించింది. "గుండమ్మకధ" ప్రివ్యూ చూసి చక్రపాణిగారితో బాగా పరిచయం ఉన్న ఒకాయన  " ఈ సినిమాలో విజయలక్ష్మి డాన్సు ఎందుకు పెట్టినట్టు ?" అన్నాడు" చూట్టానికి " అన్నారు చక్రపాణి గారు కూల్ గా పేపరు చదువుతూ తలెత్తకుండానే !అడిగినాయన మారు మాట్లాడకుండా వెళ్ళి పోయాడు. మరో చక్రపాణిగారి చురుక్కుమనే చమక్కు. చిత్తగించం "గుండమ్మకధ" సినిమా చూసిన ఒకాయన, " ఈ సినిమాలో మెసేజ్ ఏమీ లేదే ?" అంటే "మెసేజ్ ఇవ్వడానికి సినిమా ఎందుకు ? టెలిగ్రామ్ ( ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవుగా) ఇస్తే పోలా" అన్నారట శ్రీ చక్రపాణి.

Tuesday, June 05, 2012

హటు హాటుగా




                     మనకు కావాలి టీ, కాఫీ హాటు హాటుగా !
                     ఉండాలి పేపర్ టీవీల్లో వార్తలూ హాటు హాటుగా !!
                     ఇక సినిమల్లో సీన్లూ కనిపించాలి హాటు హాటుగా!!
                     అదేమిటో సూరీడు మాత్రం తన ప్రతాపం చూపకూడదు హాటు  హాటుగా !!
 మన చూట్టూ ఈనాడు వాతావరణం వేడి వేడిగా మారిపోయింది.
                     ఇక రాజకీయాలు రోజురోజుకూ వేడేక్కిపోతున్నాయి. దోచుకొని
                     దాచుకొనే నాయకులు ఎక్కువైనట్లే ఇటువంటి రాజకీయ(చ)కుల్ని
                     వెనకేసుకొని వచ్చే జనాలూ ఎక్కువయ్యారు. మొన్న బజారులో
                     మా మిత్రుడి షాపులో ఒక కస్టమర్" ఐనా ఈ రోజుల్లో అందరూ
                     అవినీతిపరులే, పాపం చిన్న కుర్రవాడు పైకొస్తుంటే కొందరు
                     ఏడుస్తున్నారు " అన్నాడు. ఇక ఈ దోపిడీదారుల చేతుల్లో చిక్కి
                     న్యాయం చెప్పాల్సిన జడ్జీలే బోనెక్కాల్సిన హాటు వార్తలు మరింత
                     వేడిని పుట్టిస్తున్నాయి. బాపుగారి కార్టూన్ చూడండి, ఇప్పటి
                     వార్తలకు ఎంతగా సరిపోతున్నదో.

ఎప్పూడూ లేనిది మా రాజమండ్రి వేడి వేడిగా మారిపోతున్నది.
                      మొన్న 2 వతేదీ శనివారం ఒక్క సారిగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత
                      రికార్డయింది. దీనికితోడు కరెంటు కటింగులు. కానీ ఎన్నికలు
                      జరుగుతున్న చోట్ల మాత్రం కటింగులు లేవుట ! ఇక్కడ మాత్రం
                      ఎన్నికల నియమావళి ఎన్నికల అధికారులకు కనిపించదు!
                      అపార్ట్మేంటాలిటీ పెరిగాక ఎక్కడా  మట్టి అగుపించదు. ఎండ
                      వేడికి సిమెంటు జనారణ్యాలు వేగి కాగిపోతూ, ఏసీలు వదిలే
                      వేడికి తోడై జనం మండిపోతున్నారు. ఇక ప్రతీ రోజూ, ప్రతివారం
                      "మండేనే" !!

Monday, June 04, 2012

పాటలరాజు పుట్టినరోజు



  ఘంటసాల లాంటి మధురగానం
  మళ్ళీ మనం ఇక వినలేం,వినం
  అనుకుంటే సంగీత సరస్వతి అందించింది
  "పాట" లాడే ఈ చిన్నారి "బాలు"ణ్ణి !!
  ఏ పాటైనా ఏ భాషైనా పాటలతో ఫుట్ "బాలు"
  ఆడుతాడు ఈ పాటల "బాలు"డు !!
  బాలు బహుపాత్రలకు  గాత్రధారి !!
  ఎన్నో చిత్రాలలో పాత్రధారి !!
  చిన్నతెరలో సూత్రధారి !!