Wednesday, June 29, 2011

నేనంటే ఎంత ప్రేమండి రమణగారూ!

నిన్నటి బ్లాగులో శ్రీ ముళ్లఫూడి వెంకటరమణగారి పుట్టిన రోజు అని వ్రాస్తే కొందరు
మితృలు తప్పుగా వ్రాశావు, జయంతి అని వ్రాయాలి అన్నారు. కానీ నా దృష్టిలోనే
కాదు రమణగారి అశేష అభిమానుల దృష్టిలో రమణగారు మన మధ్యే వున్నారు.
తన చమత్కారాల మాటలతో మనలను నవ్విస్తూ పలకిరిస్తూనే వున్నారు. అది
నిజమని నిన్ననే రుజువయింది !



బెంగుళూరు నుంచి మితృలు శ్రీ బి.విజయవర్ధన్ వారం రోజులక్రితం నాకు కొరియర్
చేసిన బాపు బొమ్మలకొలువు ప్రత్యేక సంచిక, మార్చి 6న మద్రాసులో జరిగిన బాపు
గారింట్లో జరిగిన సభ సిడీ , చికాగో నుంచి నా కజిన్ డాక్టర్ యం.యల్.హనుమదాస్
యం.డిపంపిన రమణగారి కోతికొమ్మచ్చిఆడియో సిడీ నిన్ననే ఆయన పుట్టిన రోజునే
నాకు చేరడం శ్రీ రమణగార్కి నా పై ఉన్న అపారమైన అభిమానానికి గుర్తు కాదా!
గత జనవరి 26న ఆయన పెళ్ళి రోజు శుభాకాంక్షలు పంపితే " నామీద మీకెంత
ప్రేమండీ ?" అంటూ ఫోనులో రమణగారు అన్న మాటలు ఇంకా నా చెవుల్లో విని
పిస్తూనే వున్నాయి. అవును, అందుకే ఆయన తన పుట్టిన రోజుకు తన అభిమాన
అభిమానినైన నాకు ఈ కానుకలను పంపించారు. ధన్యుణ్ణి రమణగారు.
( శ్రీ రమణగారి నవ్వుల తలపులు పంచుకుంటూ శ్రీ చంద్రశేఖర్, నేను, శ్రీ బాపు,
ప్రఖ్యాత కన్నడ చిత్ర నిర్మాత శ్రీ భక్త-- ఫొటొ శ్రీ బి.విజయవర్ధన్ , నిన్ననే
విడుదలయిన రమణగారి "ముక్కోతి కొమ్మచ్చి")

Tuesday, June 28, 2011

ఈ రోజు మన బుడుగు గారి పుట్టిన రోజు !!




అవునండి ! ఈ రోజు మన బుడుగు వెంకట(రావు)రమణగారి పుట్టినరోజు పండుగ!
రమణగారి గురించి ఎన్ని సార్లు చెప్పుకున్నా అది నిత్య నూతనమే ! రమణగారు
తన కధను చిన్ననాటి నుంచి జరిగిన విశేషాలను కష్టాలను నష్టాలను కోతికొమ్మచ్చి
లాడినంత అందంగా ఆనందంగా చెప్పారు.ఆయన అంటారు--
"రెండు వందలు ఖర్చుపెట్టిన మేడలోంచి రెండు రూపాయల అద్దెకి ఒక మెట్ల
గదిలాటి దాంట్లో దిగాం....మెట్లమీద సామానులు సద్ది మెట్ల దారి మీదే పడు
కొనే వాళ్ళం. నలుగురు పడుకుంటే ఈ గోడనించి ఆ గోడకి సరిగ్గా సరిపోయేది"
అలా చిన్న మెట్లగదిలో పడుకున్న ఆయన పెద్ద విశాలమైనపాలరాతి మెట్లున్న భవంతిలో
తన మితృడు బాపుగారి ఇంటి పైన ఇల్లుకట్టుకొని వున్నారు.వాళ్ళిద్దరు ఒకరి గుండెల్లో
ఒకరు ఎలాగోఇళ్ళు కట్టుకున్నారు కదా!
రమణగారి మొదటి కధ "ఆకలి-ఆనందరావు ". 1953 లో ఆంధ్రప్రభ వార పత్రికలో అచ్చయిన
ఆ కధలో మద్రాసు నగరంలో ఓ నిరుద్యోగ యువకుడు ఓ కప్పు టీ కోసం, నీళ్ళకోసం చేసిన
సాహసాల ఇతివృత్తం !. ఆ కధతో శ్రీముళ్ళపూడి రచయితగా ఆరితేరారు. తరువాత 1954లొ
ఆంధ్రపత్రికలో చేరారు. ఆ రోజుల్లో ఆయన వ్రాసిన కధలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి.
" ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు", "ఏకలవ్యుడు", "రాధాగోపాళం", "ఋణానందలహరి",
"విక్రమార్కుడిమార్కు సింహాసనం", కధలు యాభైయ్యో దశకంలో ఆంధ్రవారపత్రికలో వచ్చి
అశేష పాఠకులకు రమణగారు అభిమాన రచయిత అయ్యారు.





రమణగారి చేత మొదటి సినిమా స్క్రిప్టు రాయించిన వారు శ్రీ డి.బీ.నారాయణ. " దాగుడు
మూతలు" చిత్రానికి ఆయన మాటలు వ్రాశారు. కాని ఆయన మాటలు వ్రాసిన రెండో చిత్రం
" గుడిగంటలు " ముందుగా విడుదలయింది. విషాద కధా చిత్రానికి ముళ్ళపూడి మాటలు
వ్రాయడమేమిటని విమర్శించినవాళ్ళే చిత్రంలోని ఆ సంభాషణలు చూసి ఆశ్చర్యపోయారు
మితృడు శ్రీ బాపుతో కలసి పూర్తి ఔట్ డోర్లో "సాక్షి" సినిమాతీశారు. ఆయన వ్రాసిన "బుడుగు-
చిచ్చుల పిడుగు" తొ పెద్దల,పిల్లల అభిమానాన్ని పొందారు. ఈటీవీలో శ్రీ రామోజీరావుగారు
బాపు దర్శకత్వంలో నిర్మాణమైన శ్రీ భాగవతం నకు సంభాషణలు, కొన్ని పాటలు సమకూర్చారు.
త్వరలొ రాబోయే "శ్రీరామరాజ్యం" చిత్రానికి స్కిప్ట్ అందించారు. శ్రీ రమణగారిని 2005 నుంచి
ఏడాదికి రెండు సార్లు కలిసే అదృష్టం నాకు కలిగింది. కనీసం నెలకు రెండు సార్లయినా ఆయన
నాకు ఫోను చేస్తుండేవారు. శ్రీ రమణగారు మంచి మనసుకు ఎన్నో ఉదాహరణలు. " హాసం"
పత్రికాధిపతులు పత్రికను వారికి పంపితే , ఉచితంగా వద్దంటూ చందాను పత్రికకు పంపారు.
రాజమండ్రి నుంచి వెలువడే ఓ పత్రిక సంపాదకుడు తన పత్రిక కాపీలను పంపితే మనీ
ఆర్డరు పంపుతూ M.O.ఫారం మీద ఇలా వ్రాశారు.
" భక్తి ప్రచారం కోసం మీరు చేస్తున్న కృషి పట్ల గౌరవంతో రెండు ఉద్ధరిణెలు@
పంపిస్తున్నాను. ఒకటిగానే భావించి ఒక్క కాపీయే పంపండి.ఇద్దరికీ చాలు"
ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే ! రమణగారు నాలాటి ఎందరో అభిమానుల గుండెల్లో
చిరంజీవిగా కలకాలం నిలచి ఉంటారు.
( @ ఉద్ధరిణె అంటే ఆయన దృష్టిలో సంచిక చందా 120 రూపాయలు !!)

Friday, June 24, 2011

ఏమీ "పాలు" బోక ఇలా క్షీరాభిషేకం చేశాను !!

మనకు పాలిస్తున్న వాళ్ళు, ఆవు , గేదెలతో బాటు రాజకీయ నాయకులూ వున్నారు !!
. అందుకే కాబోలు వాళ్ళళ్ళో కొంతమంది గడ్డి తింటుంటారు ! అలానే వాళ్ళకి పాలు
బాగా అందుబాటులో వుండటం వల్ల వీధికి ఒక్కటి వున్న వాళ్ళ నాయకుల విగ్రహాలకు
ఏదో ఒంకన పాలాభిషేకం చేసి కాకిరెట్టలను కడుగుతుంటారు.

పూర్వం పాలు ఆవు పాలని, గేదె పాలని వుండేవి. ఇప్పుడేమో సైకిల్ (మోటార్ బైక్ ) పాలు,
పాకెట్ పాలూ వస్తున్నాయ్. ఒకాయన చమత్కరించాడు. "మీరు ఆవు పాలా, గేదె పాలా
ఏది వాడుతారు అంటే తెలియదు, మేం సైకిల్ పాలు వాడుతున్నాము" అన్నాడు.
ఈ మధ్య ఒకరు మీరు అలా డైరీ పాకెట్ పాలు కొనకండి. అందులో నానా రకాల పాలు
కలుస్తాయి.అందుకే మేం సైకిల్ పాలు కొంటున్నాం అన్నాడు. పాపం ఆ అమాయకుడికి
తెలియదు. సైకిల్ పాల వాళ్ళు డైరీ పాలమ్మే షాపుల దగ్గర పాకేట్లు కొనేసి వాటిని బిందెల్లో
నింపేసుసుకొని అక్కడే వున్న కార్పొరేషన్ కొళాయి నీళ్ళు సగం కలిపి అమ్మేస్తున్నారని.!! ఇలా
మోసాల "పాల" బడుతున్నట్లు వాళ్ళకు తెలియదు కదా!!
మనని "పాలి"స్తున్నవారికి తెల్లావుల కంటే నల్లావులే ఇష్టం! నల్లావులయితేనేం తెల్లపాలే
ఇస్తాయికదా. ఆ విషయం మన నాయకులకు ఉగ్గు "పాల"తోనే బాగా ఒంట పట్టించుకున్నారు!
ఈనాడు శ్రీ శ్రీధర్ తెల్లావును నల్లావుగా మార్చుతున్న రాజకీయుణ్ణి తన కార్టూన్లో భలేగా
ఛూపించారు.

తెల్లనివన్నీ పాలనుకోకోయ్ అన్నారు. అందుకే అందులో కాస్త గులాబి సిరప్ కలిపేసి మా ఊర్లో
రోజ్ మిల్క్ పేరీట నడి రోడ్లో యమ బిసినెస్ చేస్తున్నాడో వ్యాపారి. ఆడ మొగా పిల్లల్తో సహా రోడ్డు
కడ్డంగా నిలబడి ఆ పాలు ఎగబడి కొని తాగేస్తుంటారు. అలానే మిల్క్ షేకులు ! రంగు మారితే
తెల్ల పాలకు అదో ప్రత్యేకత వస్తుంది.

హంసలు పాలను నీళ్ళను వేరు చేస్తాయని చెబుతారు. అంటే పాలు తాగేసి నీళ్ళు మనకు
మిగులుస్తాయన్నమాట! ప్రతి చోట నీళ్ల కొరతవున్న చోట్ల ఇలా హంసలను పెంచుకుంటే
ఇక నీళ్ళకొరత వుండదు కదా ? !అలా కాకుండా నీళ్ళన్ని తాగేసి పాలను వుంచితే అదో చిక్కు !
విష్ణుమూర్తి పాలసముద్రం మీద పవలిస్తాడట. మేం చిన్నప్పుడు గోదావరి అంతా అలా పాలుగా
మారిపొతే హాయిగా పంపుల్లోంచి పాలొస్తాయి కదా అని. ఏం రాయాలో "పాలు"బోక ఈ సోదిలో
మిమ్మల్నీ "పాలు" పంచుకొనేటట్లు చేశాను. క్షమించండి ! నీళ్ల ముంచినా పాల ముంచినా
మీదే భారం !!
కార్టూన్లు ఈనాడు శ్రీ శ్రీధర్, కొంటెబొమ్మల బాపు-2 సౌజన్యంతో

Wednesday, June 22, 2011

త్రీ రోజెస్ టీ

మా హాసంక్లబ్ లో నేను, మితృడు ఖాదర్ ఖాన్ కలసి రూపకల్పన చేసిన ఈ స్కిట్ హాస్య ప్రియుల
మన్నన పొందింది. ఆ స్కిట్ ను మీతో పంచుకుంటున్నాను.
ఖాన్ : హల్లో రావుగారు, మీరు మద్రాసు, బొంబాయిలకు వెళ్ళారని తెలిసింది, ఎప్పూడొచ్చారు ?
రావు: నవ్వేనండి !
ఖాన్ : నవ్వడం కాదు బాబూ! ఊరినుంచి ఎప్పుడు వచ్చారనడుగుతున్నాను.
రావు: చెప్పా కదా, నవ్వేనని !
ఖాన్: చత్ ! మళ్ళీ అదే కూత ! నీ పని , నాపని ,మన హనుమంతరావు పని హాసంక్లబ్లో ప్రతి
ఒక్కరిపని నవ్వడం ,నవ్వించడం అని అందరికీ తెలుసు! ఊరినుంచి ఎప్పుడు వచ్చావో
ఆ సంగతి చెప్పవయ్యా!
రావు: ఎన్నిసార్లు చెప్పాలి. అసలు నీకు ఆంగ్లభాషా పరిజ్ఞాణం అసలు లేనట్లే వుందే! నవ్వంటే
ఇప్పుడే అన్న తెలుగు అర్ధం తెలియదనుకోలేదు! అవునూ ఊర్లో అందరికీ మీ తాతగారి
గురించి గొప్పలు చెబుతున్నావట!



ఖాన్ : గొప్పలు కాదు.ఉన్నమాటే! మా తాతగారు వీదిలోకి వస్తే జనం అలా దూరంగా జరిగి
నిలబడేడేవారట!
రావు : అంటే మీ తాతగారు నెలకో, రెండు నెలలకో స్నానం చేసేవారన్న మాట !
ఖాన్ : మా తాతగారు ఎన్నో మేడలు, భూములు, ఆస్తులూ వదలి పరలోకానికి పోయారు
తెలుసా? !
రావు: ఓస్! ఇంతేనా ?! మా తాతగారు ఈ భూప్రపంచాన్నే వదలి పరలోకానికి పోయారు !
అంటే మీ తాతకన్నా మా తాతే గొప్పకదా?!
ఖాన్ : (తనలో) మా తాతగారిగురించి ఏం చెప్పినా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు..వీడి
రోగం కుదర్చాలి. (పైకి) , చాలా కాలం తరువాత ఇంటికి వచ్చావు. టీ త్రాగి
వెళ్ళు !
రావు: (టీ కప్పు అందుకుంటూ) ఇదేమి టీ , కొత్త గోదారి బురద నీళ్ళలా వుంది ?!
ఖాన్ : మంచి రంగు ! త్రీ రోజెస్ టీ తాగు!
రావు: ఇదేమిటీ ,ఏదో కంపు కొడుతుంది ?!
ఖాన్: కంపు కాదు, వాసన అనాలి. త్రీ రోజెస్ టీ తాగు , బాగుంటుంది.
రావు: ( డోక్కుంటూ) అమ్మో! యాక్ ! వాంతొస్తుంది!
ఖాన్ : మొన్న శుక్రవారం మా శ్రీమతి ఊరెళుతూ, మీ దగ్గరకు అడ్డమైన సన్నాసులు
వస్తుంటారు, వాళ్ళకి ఇవ్వచ్చునంటూ టీ కలిపి ఫ్లాస్కులో పోసింది, శుక్రవారం,శనివారం,
ఈ రోజు ఆదివారం, అంటే మొత్తం మూడు రోజులు, అదే "త్రీ రోజ్సు" టీ అన్నమాట !!
రావు : బాబోయ్ ( బయటకు పరిగెడతాడు)
ఖాన్ : లేకపోతే నా ఇంగ్లీషును, మా తాతగారిని తక్కువ చేసి మాట్లాడతాడా?! రోగం కుదిరింది !

Tuesday, June 21, 2011

తొలి తెలుగు వ్యంగ్య చిత్రాల పుస్తకం!

తెలుగులో ఇప్పటికే ఎన్నో బాపుగారితో సహా ఎన్నొ కార్టూన్ల పుస్తకాలు వచ్చాయి కదా
అని అనుకుంటున్నారా! తెలుగు వ్యంగ్య చిత్రాకారుల్లో ఆద్యుడైన శ్రీ తలిశెట్టి రామారావు
( 1906-1960) గారి కార్టూన్ చిత్రాలతో " తొలి వ్యంగ్య చిత్రాలు" పేరిట పుస్తకం వెలువడిన.
ఈ పుస్తకం కార్టూనిస్టులకు , కార్టూనిష్టులకుఎంతో అపురూపమైనది.
ఆంధ్రపత్రిక రచయితలకు, చిత్రకారులకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిన మొదటి పత్రిక. విశ్వదాత
కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు తలిశెట్టి రామారావు గారి వ్యంగ్య చిత్రాలను, రేఖా
చిత్రాలను ఆంధ్రపత్రిక సంచికలలోనూ, ఉగాది ప్రత్యేక సంచికలలోనూ ప్రచురించారు. ఆనాటి
ఆంధ్రపత్రిక ఉగాది సంచికలలో రామారావు గారి చిత్రాలు పాఠకులను విశేషంగా అలరించాయి.
( ఇటీవలే మితృలు ఫణి నాగేశ్వరరావుగారు నాకు 1932 నాటి ఆంధ్రపత్రిక ఉగాది సంచికను
కానుకగా ఇచ్చారు) 1930 లో శ్రీ రామారావు రచించిన "బారతీయ చిత్రకళ" అనే 208 పేజీల
గ్రంధం ఆంధ్రగ్రంధమాల వారు ప్రచురించారు.
ఈతరం కార్టూనిస్టులందరికి పునాది ఆంధ్రసచిత్రవారపత్రికే. తెలుగు పాఠకులకు కార్టూన్లను
పరిచయం చేసింది మళ్ళీ( సంపాదకులు శ్రీ శివలెంక శంభుప్రసాద్) ఆంద్రపత్రికే! ఈ పుస్తకంలో
డాక్టర్ అవసరాల రామకృష్ణారావుగారు, ప్రముఖ కార్టూనిస్టులు సర్వశ్రీ బాబు,జయదేవ్,బాలి,మోహన్,
బ్నిం,ఈనాడుశ్రీధర్, ది హిందూ సురేంద్ర,ఆంధ్రజ్యోతి శేఖర్, శంకర్, కళాసాగర్, హాస్యరచయిత శ్రీరమణ
తొలి , తుది పలుకులున్నాయి ఈ పుస్తకం స్వంతం చేసు "కొన"డానికి సేకరణ కర్త శ్రీ ముల్లంగి వెంకట
రమణారెడ్డి, 39-18-1, సాయిసూర్య రెసిడెన్సీ, స్టేట్ ఎక్సైజ్ ఆఫీసు ఎదుట,మాధవధార,విశాఖపట్నం
-520 002 వారి వద్ద కాని, ప్రముఖ పుస్తక షాపుల్లోనూ దొరుకుతుంది. నా "సురేఖార్టూన్స్" పుస్తకంలో
తలిశెట్టి రామారావు గారి" ప్రభంధకన్య" కార్టూన్ "రచన శాయి" గారి సహకారంతో వేసే అదృష్టం నాకు
కలిగింది. ఆల్రేడీ ఈ పుస్తకం మీ దగ్గర లేకపోతే ఈ రొజే స్వంతం చేసు "కొనండి". ,.

Sunday, June 19, 2011

మా మంచి నాన్న !

ఈ రోజు నాన్నల రోజు ! ఎంత మంచి రోజు !! మమ్మల్ని పెంచి పెద్ద
చేసి మాకెన్నోమంచి అభిరుచులు నేర్పిన మా నాన్నగారు శ్రీ యమ్వీ
సుబ్బారావు పాతికేళ్ళ వయసులో స్టూడెంట్ గా వున్నప్పటిది ఈ ఫొటో.
ఈ ఫొటో మా నాన్నగారు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఇప్పుడు
స్టేట్ బ్యాంక్ ) లొ 1925 లో ఉద్యోగంలో చేరినప్పటిది .
1936లో మా అక్కయ్య వరలక్ష్మి సరోజినితో 36 ఏళ్ళ వయసులో.
ఇప్పుడు అక్కయ్య వైజాగ్ లో వుంది.
1948 లో అమ్మ, నాన్నలతో నేను, అక్కయ్య సరోజిని, చెల్లి కస్తూరి
(హైద్రాబాద్) రాజమండ్రిలో తీయించుకొన్న ఫొటో.
మా నాన్నగారికి పుస్తకాలంటే అమిత ఇష్టం. బ్యాంకు నుంచి రాగానే
(రాత్రి తొమ్మిది గంటలు దాటేది) పెర్రిమాసన్ లాంటి ఇంగ్లీషు నావల్స్
(ఆ రోజుల్లో అమెరికన్ పాకెట్ బుక్స్ వచ్చేవి), రీడర్స్ డైజెస్ట్ కండెన్స్డ్
బుక్స్ చదివేవారు. ఈ నాటి నా లైబ్రరీలో చాలా పుస్తకాలు నాన్నగారు
కొన్నవే. రీడర్స్ డైజెస్ట్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, టిట్ బిట్స్, పంచ్ లాంటి ఎన్నో
మాగజైన్స్ తొ బాటు ఆంద్రవారపత్రిక, చందమామ, బాల , గృహలక్ష్మిమొ"
పత్రికలు తెప్పించేవారు. చందమామలను ఏడాది కాగానే బైండ్ చేయించే
వారు మాకు పత్రికలలోని వీశేషాలు ప్రతి ఆదివారం చెప్పేవారు. గ్రామ
ఫోను పై పాటలు వినిపించే వారు. స్టాంపులు, నాణేలు కలెక్ట్ చేసేవారు.
ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ప్రఖ్యాత ఆర్టిస్టులు వేసిన చిత్రాలు కట్ చేసి ఆల్బమ్
తయారుచేశారు. ఆయన అభిరుచులు, అలవాట్లు నాకూ వచ్చాయి.
మాతో ఓ స్నేహితుడిలా కబుర్లు చెప్పేవారు. ఆదివారం మార్నింగ్ షోలకు
(ఆ రోజుల్లో ఇంగ్లీషు సినిమాలు ఉదయం ఆటలే వేసేవారు) నన్ను తనతో
తీసుకొని వెళ్ళేవారు. ఆయన కు బొమ్మలు గీయటం కూడా వచ్చు.
గుర్రం బొమ్మ చాలా బాగా వేసేవారు. ఇంతటి మంచి నాన్న తన 81వ ఏట
మమ్మల్ని ఒదలి వెళ్ళారు. ఆయన పుస్తకాలు, ఆర్ట్ కలెక్షన్స్ రోజూ చూసినప్పుడు
నాన్న నా ఎదుటే వున్నట్లు వుంటుంది. నాన్నల రోజున నాన్నలందరికీ నా
జేజేలు.

Thursday, June 16, 2011

రాజమహేంద్రి పురమందిరం

కందుకూరి వీరేశలిగంగారు 1891లో రాజమండ్రి నడిబొడ్డున పురమందిరం (Town Hall )
నిర్మించారు. ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్నిచేరువ చేయడానికి తన
స్వంత ధనాన్ని వెచ్చించి గ్రంధాలయాన్నిఏర్పరిచారు.
ఇక్కడి గ్రంధాలయంలో పాత పత్రికలు, రీసెర్చ్ పుస్తకాలు, 1912 నుంచి ఆంధ్రపత్రికలు,
1920 నుంచి కృష్ణాపత్రికలు ఇక్కడ వుండెవి. ఇప్పుడో, ఈ పురమందిరం దీన స్థితి చూస్తే
తీరని బాధకలుగుతుంది. ఇక్కడ మన లిపి క్రీస్తు పూర్వం ఎలా వుందో తెలియజేస్తూ
గోడమీద వ్రాయబడి వుంది.
ఇప్పుడు ఇక్కడ శునకాలు విశ్రాంతి తీసుకుంటున్నాయంటే ఈ పురమందిరం నిర్వహణ
ఎంత గొప్పగా వుందో తెలుస్తుంది. మన ప్రజా ప్రతినిధులు, వారి భజనపరులు పదవుల
కోసం ప్రాకులాడటమే తప్ప వీరేశలింగం లాంటి మహనీయులు తమ ధనాన్ని వెచ్చించి
నిర్మించిన ఇలాటి నిర్మాణాలను రక్షించే ఆలోచనను చేయరు. మీ ఊరికి ఎయిర్ పోర్ట్
తెప్పించాం అంటూ గొప్పలు సభలు పెట్టి ఊదరగొడతారు తప్ప ఇలాటి పురాతన చిహ్నాలను
పదికాలాలబాటు భద్రపరచాలనే తలపే రాదు. భగవంతుడు మన రాజకీయనాయకులకు
మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ , కందుకూరి పురమందిరానికి పూర్వపు వైభవం
కలగడానికి పుర ప్రముఖులు కృషి చేస్తారని ఆశిస్తాను.
( చిత్రాలు ఈనాడు తూర్పుగోదావరి సౌజన్యంతో )

Wednesday, June 15, 2011

ప్ర శ్నలు = జవాబులు

ప్రజలమైన మనకు నిత్య జీవితంలో ఎన్నో ప్రశ్నలు! కొన్నిటికి జవాబులు దొరుకుతాయి !
మరికొన్నిటికేమో జవాబే దొరకక పోవచ్చు. చదువుకొనే రోజుల్లో పరీక్షల్లో ప్రశ్నలు, తరువాత
ఉద్యోగంలో చేరేటానికి ఇంటర్వూ పేరిట ప్రశ్నలు ! ప్రశ్నలను సందేహాలనికూడా అంటారు.
అసలు ఈ ప్రశ్నలు ఇప్పటివా ? పురాణాల్లోకూడా యక్ష ప్రశ్నల పేరున అగుపిస్తాయి. ఇక
మనం చందమామలో చదివిన భేతాళ కధల్లోని ప్రశ్నలు తెలుసుగా. అందులో శవంలోని
భేతాళుడు విక్రమాదిత్యుడికి కధలు చెబుతూ చివరో ప్రశ్న వేసి జవాబు తెలిసీ చెప్పక
పోయావో నీ బుర్ర వెయ్యి చెక్కలవుతుందంటూ బ్లాక్మయిల్ కూడా చేస్తుంటాడు.
మన నిజ జీవితంలో కూడా ఇలా ప్రశ్నలు వేసి మన ప్రాణాలు తీసే భేతాళులు ఎదరవుతూ
వుంటారు. వాళ్ళకు అన్నీ సందేహాలే.! ఒకాయన అగుపించి నప్పుడళ్ళా "ఏవిటీ! రిటైరయి
పోయారా? " అంటూ అదుగుతుంటాడు. నేనూ " రెటైరయ్యా, కానీ ఇంకా పొలే " అంటూ
జవాబిస్తుంటాను. మనం రైల్లోనో , బస్సులోనో బయలుదేరగానే మన ముక్కూ మొఖం
తెలియని వాడుకూడా మనం ఎక్కడికి ఎందుకు వెళుతున్నామో అక్కడ ఎన్ని రోజులు
అఘోరిస్తామో ఇలా అన్ని విషయాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఇలాటి వాళ్ల నుంచి
తప్పించుకోడానికి వెంటనే రీడర్స్ డైజెస్ట్ తీసుకొని ( ఇదైతే సాధారణంగా ఎవరూ అడగరు)
అందులో మునిగి పోతాను.



ప్రశ్నలు, జవాబులూ అన్నవీ అన్నివేళాలా ఇబ్బందికరం అనలేము. పత్రికలలో ఇంతకు
ముందు ఈ శీర్షిక తప్పక వుండేది. బాబూరావ్ పటేల్ సంపాదకత్వంలో చాలా ఏళ్ళక్రితం
వెలువడిన ఇంగ్లీషు సినిమా పత్రిక లో ఆయన నిర్వహించిన ప్రశ్నలు-జవాబులు పాఠకుల
విశేష ఆదరణ పొందింది. ఆయన చమత్కార జవాబుల కోసమే ఆ పత్రికను కొనేవారు. నాకు
బాగా గుర్తు. what is family planning ? అని ఒక పాఠకుడు అడిగిన ఓ ప్రశ్నకు బాబూరావ్
పటేల్ జవాబు : Heating the stove without cooking ! అని. ఇలానే ఫిల్మ్ ఫేర్ పత్రికలో
ఐ.యస్.జోహర్ జవాబులిచ్చేవారు. అటుతరువాత శతృఘ్నసిన్హా జావాబులిచ్చారు. మన తెలుగు
పత్రిక సినిమారంగంలో జీవీజీ ( గడియారం వేణుగోపాలకృష్ణ) , ఆంధ్రప్రభ వీక్లీలో మాలతీ చందూర్
ప్రశ్నలు-సమాధానాలు వీశేష ఆదరణ పొందాయి. ప్రఖ్యాత నాటక రచయిత కీ.శే. ఎన్నార్ నంది
నవ్వులు పువ్వులు హాస్య పత్రికలో జవాబులు బాగుండేవి. ఒక పాఠకుడు " మిమ్మల్ని కాల్చేసి
పార్టీ చేద్దామనుకుంటున్నాను " అని వ్రాస్తే నందిగారి జవాబు " ఎప్పుడు, మండేనాడా ! " అని !!


శ్రీ జంధ్యాల "బావా బావా పన్నీరు" సిన్మాలో ప్రశ్నలు జవాబులతో హాస్యాన్ని పండించారు.
చిత్తగించండి :
అయ్యా ! తాగడానికేమన్నా తీసుకురమ్మంటారా ?
ఆ..తీసుకురా..
కాఫీ తీసుకురానాండయ్యా.. టీ తీసుకురానా ?
కాఫీ తీసుకురారా.
ఒహొ....స్ట్రాంగా ఉండాలయ్యా..లైట్ గానా ?
స్ట్రాంగాన్నే తీసుకురా
ఒహొ..షుగరు ఉండాలంటారా, వద్దంటారా ?
వద్దురా..తండ్రీ వద్దురా..నువ్వెళ్లరా
ఓహొ..గ్లాసులో తీసుకురానండయ్యా, కప్పులోనా ?
గంగాళంలో తీసుకురారా దరిద్రపు కుంకా, అందులో స్నానం చేస్తా., అహాహా..ఓహొహొ
అంటూ సబ్బురుద్దుకుంటూ స్నానం చేస్తా, కుమ్మరి పురుగు టైపులో నా బుర్ర తొలి
చేస్తున్నావు కదరా నువ్వు. ఫో ఇక్కణ్ణించి.
ఒహొ..బయటకు వెళ్ళమంటారయ్యా...లోపలికా...?
ఒరే వెళ్ళు...వెళ్ళు

ఇలా ప్రశ్నలనుంచీ హాస్యం పుట్టించారు హాస్య బ్రహ్మ జంధ్యాల.
ఇక్కడి బొమ్మలు శ్రీ సురేంద్ర ( ది హిండూ ), చందమామ శంకర్ శౌజన్యంతో...

Monday, June 06, 2011

జాగిలాలొస్తున్నాయ్ జాగ్రత్త !!

అరిచే కుక్కలు కరవవు అని అంటారుగాని ఆ నానుడిమీద విశ్వాసం
లేక కంగారు పడవలసి వస్తున్నది. ఇప్పుడు శునకరాజులు, రాణులు
రోడ్లమీదే కాదు టీవీ ఆన్ చేయగానే గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయ్ !
కుక్కలు అనకుండా జాగిలాలు , శునకాలు అంటూ పెద్ద మాటలు వ్రాయ
టానికి కారణం, వాటిని కుక్కలు అంటే వాటికి కోపమొస్తుందో లేదో
తెలియదుకానీ పెంచుకొనేవాళ్ళకు తప్పక కోపం వస్తుంది. మా ఇంట్లో
కూడా వళ్లంతా జుట్టుతో టిబెటెన్ జాతి కుక్క (సారీ దాని పేరు " నిక్కీ " )
వుండేది. దాన్ని ఎవరైనా కుక్క అంటే మా పెద్దమ్మాయి మాధురికి
కోపం వచ్చేది. అలాటప్పుడు, రోజులు బాగాలేనప్పుడు వాటిని కుక్కలు
అని పిలిస్తే కోపం వచ్చి పీకి పెట్టవూ?! ఆ డాగులు కరిస్తే ఇక వళ్లంతా
గాయాల డాగులే !
కుక్కలు కరిస్తే సర్కారీ ఆసుపత్రుల్లో మందులు లేవుట ! కుక్కకాటుకి
చెప్పుదెబ్బ అన్నారు కాబట్టి ఆ ఆసుపత్రుల దగ్గర మందులు లేకున్నా
ఓ చెప్పుల దుకాణం అస్మదీయులచేత తెరిపిస్తే వ్యాపారం భేషుగ్గా వుంటుంది!
కొందరు రాజకీయనాయకులు మేము కాపలా కుక్కలం వాసన పట్టేస్తాం
అంటుంటారు. బహుశ అవి డబ్బుల మూటల వాసన కావొచ్చు. కుక్కలకన్నా
ఇలాటి వాళ్ళుంటేనే అసలు ప్రమాదం!
ఇక కొందరు కుక్కల్ని పెంచుకుంటారు కాని వాటి పై శ్రర్ధ చూపించరు.
సకాలంలో వాటికి వాక్సిన్ వేయించాలి. మన ఇంటికి కొత్తవాళ్ళు, పిల్లలు
వచ్చినప్పుడు వాటిని కట్టి వుంచాలి. పిల్లలకు లాగానే వాటికీ డిసిప్లిన్
నేర్పాలి. మనం వళ్ళొ ఎక్కించుకుంటున్నాం కదా అని అతిధుల వళ్ళొకి
చేరకుండా ఛూడాలి. భయపడుతున్న వాళ్ళను అదేం చేయదు అంటూ
చెప్పటం కన్నా అలాటివి జరగకుండా ఛూడాలి. ఇక వీధుల్లోకి వెళ్ళేటప్పుడు
పిల్లల్ని చేయ్యి పట్టుకొని దగ్గరగా నడిపించుకొని తీసుకుని వెళ్ళాలి.

కుక్క బతుకు అంటారుకాని చాలా కుక్కలు రాజభోగాలు అనుభవిస్తాయి.
ఓ అమెరికా ప్రెసిడెంటు గారి కుక్కలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో
విమానంలో వెళుతుండేవి ! మరో విషయం, ప్రఖ్యాత గ్రామఫోన్ కంపెనీకి
వ్యాపార చిహ్నంగా నిప్పర్ అన్న పేరుగల కుక్క ప్రఖ్యాతి పొందింది. ఫ్రాన్సిస్
బర్రాడ్ అనే చిత్రకారుడు 1900 లో గ్రామఫోనులో వస్తున్నగాత్రాన్ని ఆత్యంత
శ్రర్ధతో వింటున్న నిప్పర్ అనే కుక్క ను ఓసారి గమనించి రంగుల
చిత్రంగా కాన్వాస్ మీద సృష్టించాడు. కుక్కలు తమ యజమానులపై చూపించే
విశ్వాసం మీద ఎన్నెన్నొ కధలున్నాయి. వాటికీ బ్యూటీ పార్లర్లు వెలుస్తున్నాయి.
రోడ్ల మీద నానా చెత్తా పడేయటం వల్లే వీధుల వెంట ఇలా స్ట్రే డాగ్స్ ఎక్కువవు
తున్నాయి. వాటికి స్టెరిలైజేషన్ చేయించాలి. అలా వాటి సంఖ్యను నిరోధించాలి..
ప్రభుత్వ హాస్పటల్స్ లో వాక్సిన్ అందుబాటులో వుండేటట్లు ప్రభుత్వం శ్రర్ధ
తీసుకోవాలి. ఇప్పటి రాజకీయనాయకులకు నువ్వు కుక్కవి, కాదు నువ్వే
పిచ్చికుక్కవి అని ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రజాపాలనను కుక్కలు చింపిన
విస్తరిగా మార్చకుండా వుంటే కుక్కలకే కాదు జనాలకు మంచిరోజులొస్తాయి.