Sunday, July 31, 2011

సినీమాల ప్రత్యేక పత్రికలు-పుస్తకాలు



ఇంతకుముందు తెలుగులో కూడా నటులకు ( చిరంజీవి ) ప్రత్యేకంగా ఒక
పత్రిక కొతకాలం క్రితం వచ్చేది. ఇంగ్లీషులో ఇలా నటుల మీద, అలానే కొన్ని
సినిమాల మీద పత్రికలు వచ్చాయి. THE BEST OF STALLONE
పేర ఓ పత్రిక వెలువడింది. ఇందులో స్టాలోన్ నటించిన రాకీ , స్టేయింగ్
అలైవ్, రాంబో మొదలైన చిత్రాల లోని స్టిల్స్, చిత్ర నిర్మాణ విశేషాలు
ఉన్నాయి.

అలానే A VIEW TO A KILL జేమ్స్ బాండ్ సినిమా గురించి ఆ చిత్ర
విశేషాలతో, హీరో హీరోయిన్స్, సాంకేతిక నిపుణల గురించి కధనాలతో
ఓ పత్రిక వచ్చింది.ఈ సినిమాదృశ్యాల స్టోరీ బోర్డు (మన బాపు గారిలా)
ఇందులో వేశారు.
అఫీషియల్ మూవీ మాగజైన్ పేరిట STAR TREK IV the voyage
home పేరిట ఓ పత్రిక ఆ చిత్రం విడుదలైన రోజుల్లో వచ్చింది. ఆ చిత్రం
లోని అద్భుతమైన రంగుల ఫొటోలతోప్రతి పేజీ ఆకర్షనీయంగా తారల
చిత్ర పరిచయాలతొ వెలువరించారు
STAR TREK II, the wrath of khan చిత్రం ఫొటొ స్టోరీ పేరిట, ఫోటో
నావల్ పేరిట CLOSE ENCOUNTERS of the third kind చిత్రం
పాకెట్ పుస్తకాల రూపాన విడుదలయ్యాయి. వీటి ప్రత్యేకత ఈ పుస్తకాల్లో
ఆ చిత్రాల స్టిల్స్(ఫొటోలు) వరుసగా వేసి బొమ్మల కధలాగ ప్రచురించటం!.
ఇలాటి ప్రయత్నాన్ని మగధీర, శక్తి మొదలయిన తెలుగు చిత్రాలతో మన
నిర్మాతలు కూడా చేస్తే బాగుంటుంది.

Saturday, July 30, 2011

మల్లియలారా మాలికలారా చూ "సినారె" ! ఎంత బాగా రా "సినరె"! ఘల్లు ఘల్లున గుండె ఝల్లున !!

"రస హృదయ వశిష్టుడు" సినారె నిన్ననే ( 29 ) తేదిన 81 వ జన్మదినం
జరుపుకున్నారు.ఆచార్యుడు,ప్రముఖకవి,సినీ గేయ రచయిత శ్రీ సి.నారాయణ
రెడ్డిగారు తెలంగాణాలోని హనుమాజీపేట అనే చిన్న గ్రామంలో 1931లోజన్మించారు.
సినారెగా పేరు గాంచిన ఆయన హైదరాబదు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు
ప్రొఫెసరుగా పని చేస్తూనే తెలుగు సినీరంగంలోకి 1961లో గీత రచయితగా
ఎన్.టి.ఆర్ "గులేబకావళి కధ" తో ప్రవేశించారు. మద్రాసులో నివాసం వుండకుండా
హైదరాబాదులోనే వుంటూ శ్రీ శ్రీ, ఆత్రేయ, ఆరుద్ర లాంటి దిగ్గజాల మధ్య నిలబడి
పాటల రచయితగా అసమాన ఖ్యాతి పొందారంటే సామాన్య విషయం కాదు. సినారె
ప్రభంధక మాటలను తన సినీగేయ రచనలో పరిచయం చేశారు. ఆయన స్వయంగా
మధురంగా పాడగలగటం మరో ప్లస్ పాయింట్ అయింది. "కర్పూర వసంతరాయలు"
ఆయన మధుర స్వరంతో ఆలపించగా అమెరికాలోని ఆయన అభిమానులద్వారా
లాంగ్ ప్లేయింగ్ రికార్డుగా అమెరికాలో తయారయి విడుదలచేయబడింది.ఆLP
రికార్డు స్లీవ్ మీద ఆయన ఆటోగ్రాఫు తీసుకొనే అదృష్టం నాకు కలిగింది.
సినారె లలిత గీతాలు, గేయ కావ్యాలు వ్రాశారు." ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు
దాగెనో, "సాగుమా ఓ నీల మేఘమా" మొదలయిన గీతాలు సినిమాకోసం వ్రాసినవి
కావు. తరువాత వాటిని వివిధ సినిమాలలో ఉపయోగించడం జరిగింది. ఎన్.టి.ఆర్
ద్వారానే సినిమా గేయ రచనా వ్యాసంగంలోకి ప్రవేశం జరిగిందని సినారె అన్నారు.
1961లో "గులాబికావళి"చిత్రానికి అన్ని పాటలూ వ్రాశారు. శనివారం సాయంత్రం
హైదరాబాదు నుండి మద్రాసుకు బయలుదేరి పాటలు వ్రాసి సోమవారం ఉదయం
ఫ్లైట్ లోతిరిగి వచ్చి యునివర్సిటీలో ఆయన క్లాసులకు హాజరయ్యే వారంటే సినారె
కార్య దీక్షత, సమయ పాలన అర్ధం చేసుకోవచ్చు. ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు.
రచయిత గాయకుడే కాదు, మంచి వక్త. ఘజల్స్ అద్భుతంగా గానం చేసిన ఘనుడు.
మొదటిసారిగా " మాయదారి చిన్నోడు నామనసే లాగేసిండు" పాటలో తెలంగాణా
మాండలికాన్ని సినిమా గీతాలలో ప్రవేశపెట్టీ ప్రశంసలందుకున్నారు.


ఆయన రాసిన ప్రఖ్యాత కావ్యరచనలు "కర్ఫూర వసంతరాయలు", "నాగార్జునసాగరం",
"జాతిరత్నం", "ఋతుచక్రం" ,"విశ్వంభర", గేయ నాటికలు -"నవ్వని పువ్వు","అజంతా
సుందరి", "వెన్నెలవాడ" మొదలయినవి. జ్ఞానపీఠ ఎవార్డు, పద్మవిభూషన్ అందుకున్నారు.
సినారె చణుకులు
1990 లో తూర్పు గోదావరి జిల్లా రామవరంలో శ్రీ సినారెకి సన్మానంఏర్పాటు చేశారు. ఆనాడు బ్రహ్మాండమైన ఏర్పాట్లను విశేష జనవాహినినీ
చూసిన ఓ వక్త "ఈ సభ మయసభను గుర్తు చేస్తున్నది" అని అన్నాడు.
"మయసభ" అంటే ఉన్నవి లేనట్లుగాను,లేనివి ఉన్నట్లుగానూ చూపించేది.
కాబట్టి ఈ సభను మయసభ అనవద్దు. "వాఞ్మయ సభ" అందాం అన్నారు
సినారె !
మరొక చణుకు......
సినారె ఇంటికి ఒక నియోగి ప్రముఖుడు, ఆయనతో ఓ వ్యాకరణ వేత్త
వచ్చారు.ఇద్దరు సినారెకు అత్యంత ఆత్మీయులు. సెలవు తీసుకొని వెడుతూ
ఇద్దరూ స్కూటర్ మీద కూర్చున్నారు. మిత్రులకు వీడ్కోలు చెబుతూ
సినారె " బాగుంది! ఈ జంట !! ముందు కరణం, వెనుక వ్యాకరణం అంటూ
ప్రేమగా చలోక్తి విసిరారు.
ఒకటి పిడికిలెత్తేది !
సినారె కవితలు
ఉన్నాయి నాకు రెండు చేతులు
ఈ దేశంలో అందరికున్నట్లే
ఒకటి బిచ్చమెత్తేది
ఒకటి పిడికిలెత్తేది !
ఏర్పాటు చేశారు. ఆనాడు బ్రహ్మాండమైన ఏర్పాట్లను విశేష జనవాహినినీ
చూసిన ఓ వక్త "ఈ సభ మయసభను గుర్తు చేస్తున్నది" అని అన్నాడు.
"మయసభ" అంటే ఉన్నవి లేనట్లుగాను,లేనివి ఉన్నట్లుగానూ చూపించేది.
కాబట్టి ఈ సభను మయసభ అనవద్దు. "వాఞ్మయ సభ" అందాం అన్నారు
సినారె !
మరొక చణుకు......
సినారె ఇంటికి ఒక నియోగి ప్రముఖుడు, ఆయనతో ఓ వ్యాకరణ వేత్త
వచ్చారు.ఇద్దరు సినారెకు అత్యంత ఆత్మీయులు. సెలవు తీసుకొని వెడుతూ
ఇద్దరూ స్కూటర్ మీద కూర్చున్నారు. మిత్రులకు వీడ్కోలు చెబుతూ
సినారె " బాగుంది! ఈ జంట !! ముందు కరణం, వెనుక వ్యాకరణం అంటూ
ప్రేమగా చలోక్తి విసిరారు.
ఒకటి పిడికిలెత్తేది !
సినారె కవితలు
ఉన్నాయి నాకు రెండు చేతులు
ఈ దేశంలో అందరికున్నట్లే
ఒకటి బిచ్చమెత్తేది
ఒకటి పిడికిలెత్తేది !

Friday, July 29, 2011

కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి,ముక్కోతి కొమ్మచ్చి

ఆత్మకధలు వ్రాయటం, ఇంకొకరి కధలను వేరొకరు వ్రాయటం సులువు
కాదు. తన గురించి వ్రాసుకోవడంలో నిజాలు వున్నా అవి ఆత్మ స్తుతిలా
చదివే వాళ్ళకు అగుపించవచ్చు..అలానే మరొకరి కధ వ్రాస్తుంటే వాళ్లకధ
వ్రాసే అవకాశం వచ్చినందుకు పొగుడుతున్నాడనిపించవచ్చు. రమణగారు
తన కధను కోతికొమ్మచ్చిగానూ, అక్కినేని జీవిత చరిత్ర "కధానాయకుడి
కధ"గా చెప్పినప్పుడూ పాఠకులను విశేషంగా మెప్పించారు.కోతికొమ్మచ్చి
మొదటి భాగం ఏడు ప్రచురణలు, రెండవ భాగం నాలుగు ప్రచురణలు అచ్చ
యింది రమణగారు అక్షరాలతో అక్షరాలా ఆడుకుంటారు. ప్రతి పదం పద
విన్యాసం చేస్తుంది. ఆక్కినేని జీవిత కధను ముఖస్తుతి అంటూ ప్రారంభిస్తూ
"ప్రతిభాశాలి జీవితంలా కళకళలాడుతుంది బెజవాడ రైల్వే స్టేషన్" అంటారు.
ఇక పుస్తకాన్ని ముగింపుకు మొదటి ప్రకరణం అని పేరుపెట్టి " ప్రతిభాశాలి
జీవితంలా కళకళ లాడుతుంది విజయవాడ రైల్వే స్టేషన్......"అంటూ వ్రాశారు.
మీరు గమనించారా ఈ వాక్యాలు ఒకేలా వున్నా ఓ తేడా వుంది.అదేమిటంటే
"బెజవాడ" తరువాత వచ్చిన మార్పుతో "విజయవాడ" అయింది! దటీజ్ రమణ
గారు


ముక్కోతి కొమ్మచ్చిలో అందాలరాముడు చిత్ర నిర్మాణంలో ఎదురైన కష్టనష్టాలు,
"ముత్యాలముగ్గు","సీతాకళ్యాణం","భక్త కన్నప్ప","వంశవృక్షం", " త్యాగయ్య ",
"గోరంతదీపం", "పెళ్ళిపుస్తకం" చిత్రాల అనుభవాలతో బాటు తన సన్నిహితుల
గురించి, యన్టీయార్ తయారుచేయించిన పిల్లల వీడియో పాఠాలు, చిల్డ్రన్ ఫిలిం
సొసైటీలోని బ్యూరాక్రసీ గురించి చెప్పారు. హిందీ చిత్ర నిర్మాణ విశేషాలు చెప్పారు
ఆయనకు ఎంతో ఇష్టమైన శ్రీరాముడి కధను "శ్రీ రామరాజ్యం" రచనను మొదలు
పెట్టడం వల్ల "ముక్కోతి కొమ్మచ్చి" సంపూర్ణంగా అందించలేకపోయారు.రమణగారి
శైలి పుస్తకాన్ని చివరిదాకా వదలకుండా చదివిస్తుంది. ఇందులో ఆయన అక్కడక్కడ
వ్రాసిన "అడ్డమైన వ్రాతలు" ( చూడండి! రమణగారు ఎంత చక్కటి పేరు పెట్టారో)
అలరిస్తాయి. మచ్చుకు కొన్ని...
తినడం కోసం బతికితే
బతుకంతా దండగే
బతకడం కోసం తింటే
బతుకంతా ఒక పండుగే ... మరో అడ్డమైన రాత
స్తానం చేశాక మీరేం చేస్తారు ?
-ఏముంది-చీర కట్టుకుంటాను-
అనుభవం అంటే-
జుట్టు రాలిపోయాక దొరికిన దువ్వెన..
హాసం బుక్స్ వారు ప్రచురించిన "ముక్కోతి కొమ్మచ్చి" నేడే కొనండిరేపు దొరక్కపోవచ్చు.
అన్నట్టు కోతికొమ్మచ్చి మొదటి భాగం మీరు చదవటమే కాదు హాయిగా కళ్ళు మూసుకొని
వినొచ్చు. ఈ ఆడియో స్వంతం చేసుకోవాలంటే www.kothikommachi.com చూడండి.
సర్వశ్రీ యస్పీ.బాలు, వరప్రసాద్ రెడ్డి, యమ్బీయస్.ప్రసాద్, అనంత శ్రీరామ్, జొన్నవిత్తుల,
ముళ్లపూడి వర స్వరాలతో మీకు వీనుల విందుగా వినిపిస్తారు.

Tuesday, July 26, 2011

ఐస్ క్రీమ్ !! అవునవును, I SCREAM FOR ICE CREAM !!

గడచిన శనివారం ప్రపంచ ఐస్ క్రీమ్ దినోత్సవమట. వైజాగులో బహు వేడుకగా
జరుపుకున్నారని వార్తలొచ్చాయి. నాకూ ఇష్టమైన ఐస్క్రీమ్ కూ ఇలా ఓ పండగ
రోజు వున్నందుకు చాలా సంతోషించాను కాని వెంటనే బాధా కలిగింది. కారణం
ఐస్ క్రీమ్ తినటమే కాకుండా ముఖానికి, ఒంటికి అదేదో కోల్డ్ క్రీమ్ లా పూసు
కోవటం చూసి రోత పుట్టింది ! పాపం ఎంత మంది బీద పిల్లలు ఐస్ క్రీమ్ రుచి
చూచి వుంటారు.?! ఆ రోజు అలా తమ ముఖారవిందాలకు వ్రాసుకొని వృధా
చేయకుండా బీద పిల్లలకు అందిస్తే చాలా బాగుటుంది కదా! ఏడాదికి ఒక్క
రోజైనా వాళ్ళకు ఐస్క్రీమ్ రుచి తెలిసేది!మన లడ్డూలకు, పులిహోరలకు,
ఆవకాయలకు ఇలా ఏడాదికో పండగ చేసుకుంటే బాగుంటుంది కదా?! ఒక్కటి
మాత్రం నిజం. ఆవకాయను మాత్రం ముఖానికి, ఒంటికి పూసుకోరు !!
ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ కు సీజన్ తో పనిలేదు.ఎండాకాలం, వానాకాలం,చలికాలం
ఇలా అన్నీ కాలాల్లో పాప్యులరే! విందుల్లో ఆఖర్లో ఐస్ క్రీమ్ తప్పక సెర్వ్ చేస్తు
న్నారు. అసలు ఐస్ క్రీమ్ ఈనాటిది కాదట! ఏ నాడో అలెగ్జాంజడర్ ఐస్క్రీమ్ రుచి
తెలుసుకున్నాడట!తన యాత్రలో ఆసియామైనర్ లో వున్నప్పుడు తన బానిసలను
మెస్డోనియా పర్వత ప్రాంతాలకు పంపి అక్కడినుంచి ఐస్ తెప్పించి అందులో పాలు,
తేనె, పళ్ళరసాలు కలిపి ఐస్ క్రీమ్ ( అప్పటికి ఆ పేరుతో పిలవక పోవచ్చు) తయారు
చేయించేవాడు. 14వ శతాబ్దంలో మార్కోపొలో గడ్డకట్టిన పాలను చైనా దేశంనగరాలలో
అమ్మటం చూడటమే కాకుండా ఇటలీకి వచ్చాక అక్కడ ప్రచారం చేశాడు.అక్కడినుంచి
ఆ ఐస్ క్రీమ్ ఇంగ్లాండుకు అటు తరువాత యునైటెడ్ స్టేట్స్ కు చేరుకుంది. ఇక ఐస్
క్రీముల్లో ఎన్ని రుచులో!!
రీడర్స్ డైజెస్ట్ పత్రిక ప్రచురించిన The Inventions that changed the world అనే
పుస్తకంలో 1686 లోనే ఐస్ క్రీమ్ కనుక్కున్నారని, జనం దాన్ని కొనుక్కున్నారని
వ్రాసారు.
ఇక్కడి ఐస్క్రీమ్ కార్టూన్ శ్రీ బాపు 14 ఏళ్ళ వయసులో రేడియో అన్నయ్య,
అక్కయ్యల పిల్లల పత్రిక "బాల"లో వేసినది. "బాల" కు, రచన శాయిగారికి కృతజ్ఞతలతో.

Monday, July 25, 2011

ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్

యుద్ధవాతావరణం మీద తీసిన ఈ సినిమా నిజంగా జరిగిన కొన్ని
సంఘటనలను కొన్ని మార్పులు చేసి "ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్"
పేరిట 1957 డిసెంబరు 18 న విడుదలయింది. ఎనిమిది అస్కార్
అవార్డులకు నామినేట్ అయిన ఈ చిత్రం, ఏడు అవార్డులు కైవసం
చేసుకొని ఈ నాటికీ మేటి చిత్రంగా నిలచింది. ఉత్తమ సినిమా,ఇందులో
నటించిన అలెక్ గిన్నెస్ ఉత్తమ నటుడిగా, ఇంకా ఉత్తమ దర్శకుడు,
ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఫొటోగ్రఫీ, ఉత్తమ సంగీతం,ఉత్తమ కూర్పు,
విభాగాలలో బహుమతులొచ్చాయి.
ఈ చిత్ర కధ నిజానికి ధాయిలాండ్-బర్మా దేశాల సరిహద్దుల్లో అడవుల్లో
జరిగినా నిర్మాణమంతా సిలోన్లోనే(శ్రీ లంక) జరిగింది.ఇంకా ఇందులో నటించే
నటుల ఎన్నిక పూర్తవకముందే ఇందులో అగుపించే బ్రిడ్జి నిర్మాణాన్ని
సినిమా సెట్ కార్మికులచేత, వారికి సహాయ సహకారాలను అందించే
ఇంజనీర్లచేత నిర్మాత శామ్ స్పీగల్ మొదలుపెట్టించటం ఓ విశేషం !!


క్వాయ్ నది మీద అసలు బ్రిడ్జిని ఆ కాలంలో ఎలా నిర్మించారో ఆ
ప్లాన్ ప్రకారమే బ్రిడ్జ్ నిర్మించారు.ఈ సినిమా వంతెన నిర్మాణానికి
500 మంది కార్మికులతో, 35 ఏనుగుల సాయంతో అసలు బ్రిడ్జ్ లాగా
కట్టారు.ఈ చిత్రంలో ఈ బ్రిడ్జ్ పేల్చివేసే దృశ్యంలో దానిపై నుంచి వెళ్ళే
రైలును ప్రత్యేకించి భారతదేశంలోని ఓ మహారాజు దగ్గరవున్న నిజం
రైలుకొని ఉపయోగించారు. చిత్రంలో బ్రిటిష్ ఆఫీసరుగా నికొల్సన్
పాత్రను అలెక్ గిన్నెస్ నటించగా, జపనీస్ కమాండర్ పాత్రను సయితోగా
హయకోవా నటించారు.

Sunday, July 24, 2011

మన తెలుగు పుస్తకానికి అపూర్వ గౌరవం !!

అవునండీ ! నిఝం !! మన తెలుగు వాడు గీసి వ్రాసిన "మరపురాని మాణిక్యాలు"
పుస్తకానికి "ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ " గా ప్రశంస వచ్చింది ! ఆ గీతకారుడు,
రాతకారుడు మరెవరో కాదు! ప్రఖ్యాత కార్టూనిస్ట్ , "మిసెస్ అండర్ స్టాండింగ్"లాంటి
మంచి మంచి హాస్యరచనలు చేసిన, చేస్తున్న మిత్రులు శ్రీ బ్నిం. ఇటీవలే జరిగిన
బాపు బొమ్మల కొలువు ప్రత్యేక సంచిక ఆయన సంపాదకత్వంలో వెలువడింది.
ఈ మంచి పుస్తకం గురించి శ్రీ బ్నిం ఇలా అన్నారు"
" ఆర్టిస్టు మిత్రులు కేరికేచర్ ఆర్ట్ కి ఏవేవో గ్రామర్లు
చెప్తారు. నేనేసిన ఈ బొమ్మలు ఎవరి గ్రామరూ కాదేమో.
ఇవి కేరికేచర్లు కావు..భావ చిత్రాలే-
ఆ పెద్దవాళ్ళ ఫొటోని కూడా గుర్తుపట్టలేని
నేటి తరానికి ఓ జ్ఞాపకంగా ఈ పుస్తకం
రూపొందించాను.........."
ఇది నూరుపాళ్ళ నిజం ఇందులో మనం పొరబాటున మర్చిపోయిన ఎందరో
మాణిక్యాల చిత్రగీతలతో బాటు శ్రీబ్నిం గారు అందంగా భావగీతాలను
జోడించారు. ఆయన అన్నట్టు తెలుగు కూడా మర్చిపోయిన తెలుగు వాళ్ళ
కోసం ఇంగ్లీషు లో కూడా ఆ మహనీయుల గురించి ఇందులో వుంది
ఈ పుస్తక మాణిక్యానికి శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు తన అక్షర
చమత్కారాలతో ఆశీర్వాదాలందించడం మరో అలంకారం!ఆయన మాటల్లో
" మరపురాని మాణిక్యాలు ధగ ధగ లాడుతున్నాయి. ఎవరి గ్రామరూ
కాకపోవడమే "స్వయం ప్రకాశ" లక్షణం.
నిజానికి గ్రామరస్ గా వుండేవి-గ్లామరస్ గా వుండవు.
మీ చిత్రలేఖిని వేయి రేకల పూవై గుబాళించాలని
కోరుకుంటూ" ... దటీజ్ రమణగారు!!
మీ దగ్గర ఇంకా ఈ మరపురాని మాణిక్యాలు లేకపోతే ఈరోజే
తీసు"కొని" మీ స్వంతం చేసుకోండి.
శ్రీ బ్నిం గారికి అభిమానులందరి తరుఫున అభినందనలు!

Friday, July 22, 2011

( సరదా కధ) ఆయ్! బాబోయ్!!

అసలే అమావాస్యరాత్రి ! చినుకులు మొదలయ్యాయి. మొండిగా ఒంటరిగా బయలుదేరా!!
హైవేలో హటాత్తుగా స్కూటరు చెడిపోయింది.చుట్టూ కటిక చీకటి. మెరపు మెరిసినప్పుడు
గాలికి ఊగుతున్న చెట్లు జుట్టువిరబూసుకున్న దెయ్యాల్లా భయపెడుతూ అసలే తడిసిన
ఒళ్ళేమో విపరీతంగా వణుకు మొదలయింది. ఇంతలో మరో మెరుపు మెరిసిన కాంతిలో
దూరంగా ఓ ఇల్లు కనిపించింది. అంత భయంలోనూ ఏదో చెప్పలేని ధైర్యం వచ్చింది.స్కూటర్
లాగుకుంటూ ఆ ఇంటికి చేరాను.ఇక్కడ ఈ రాత్రి గడిపి పొద్దున్నే ఎలాగోలాగ ఇంటికి చేరొచ్చని
అనుకున్నాను. పెద్ద కాంపౌండులో దూరంగా పెద్ద ఇల్లు.ఇనుప గేటు తోసాను. హర్రర్ సినిమాల్లో
లాగ కిర్రు మని శబ్దం చేయకుండానే గేటు తెరుచుకుంది. ధైర్యం చేసి తలుపు తట్టాను.
"ఈ దారిని వస్తుంటే సడెన్గా స్కూటర్ ట్రబులిచ్చింది" అన్నాను.తలుపు తీసిన పెద్దాయనతో.
తలుపు తీయగానే ఆ హాలంతా దీపాలకాంతితో వెలిగి పోతున్నది. అంతా చీకటిగా గుయ్యారంగా
వున్నా ఇంట్లో మాత్రం దీపాలు వెలుగుతుండటం వింతగా తోచినా డబ్బున్న వాళ్ళకు ఇన్వర్టర్
వుండి వుంటుందిలే అని సమాధాన పర్చుకున్నాను.
"అలానా?! రండి రండి! విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళుదురుగాని, నేనూ ఇక్కడ ఒంటరి
గానే వుంటున్నా! ఈ రాత్రికి మీరు నాకు తోడన్నమాట! నా పేరు దయానందరావు" అన్నాడు
పెద్దగా నవ్వుతూ.
"ఊరికి ఇంత దూరంగా ఒంటరిగా లంకంత ఇంట్లో వుంటున్నారు! భయం వేయదా?"అన్నాను
భయ భయంగా.
"భలేవారే! ఎందుకండీ భయం?! ఇంత దూరంలో ఇల్లు కట్టుకున్నాను కాబట్టే మీ లాటి
అనుకోని అతిధులకు సాయం చేసే భాగ్యం కలుగుతున్నది.ఉండండి, ఓ కప్పు వేడి వేడి టీ త్రాగి
రిలాక్సవుదురుగాని" అన్నాడు.
" ధాంక్సండి! ఈ వయసులోనూ, ఒంటరిగా వుంటూ ఆరోగ్యంగా, హుషారుగా గాలిలో
తేలిపోతున్నట్లు నడుస్తున్నారు. మీరు మా "హాసంక్లబ్" కర్యక్రమాలకు క్రమం తప్పకుండా
వస్తుంటారనుకుంటా" అన్నాను గొప్పగా "హాసంక్లబ్" కూ నేనూ ఒక కన్వీనర్నని చెప్పుకో
వాలని, మా జోకులు వినటం వల్లే ఆయన ఇంత హుషారుగా వున్నాడని అనుకోవాలనీ..
" మళ్ళీ నన్నోసారి చంపేశారండోయ్! మీ "హాసంక్లబ్" ప్రారంభించి ఏడేళ్ళేగా అయింది!!
నేను మీలానే ఈ హైవేపై వస్తూ లారీ గుద్దేసి పదేళ్లక్రితమే పోయా" అన్నాడు హీహీ అని
నవ్వుతూ. అప్పుడే చూశా అతని నొట్లో రెండు కోరపళ్ళు!
ఉదయాన్నే చెట్టుక్రింద పడివున్న నాకు వేగంగా అటు ఇటూ తిరుగుతున్న బస్సులూ,
లారీల శబ్దంతోకొద్దిగా మెలుకవ వస్తున్నది. ఎవరో అంటున్నారు. "ఈ మధ్య ఎక్కడ చూసినా
తాగుబోతు వెధవలే! పొద్దున్నే పీకల్దాకా తాగేసునట్టున్నాడు.వళ్ళు తెలియకుండా ఈ బురదలో
పందిలా దొర్లుతున్నాడు" నాకనిపించింది. అంటే నే రాత్రి గడిపింది దయానందరావుతో
కాదు, దయ్యానంద రావుతో నన్నమాట అని !!
( మా "హాసం క్లబ్" కార్యక్రమాలలో మా ఎస్బీఐ మానేజర్ శ్రీ సుబ్బారావుగారితో నే వ్రాసి
వేసిన సరదా స్కిట్ కు కధారూపం !!)

Wednesday, July 20, 2011

ఆడవి బాపిరాజు గారి చిత్రకళా వైభవం

అతడు గీసిన గీత బొమ్మై
అతడు పలికిన పలుకు పాటై
అతని హృదయములోని మెత్తన
అర్ధవత్కృతియై
అతడు చూపిన చూపు మెరుపై
అతడు తలచిన తలపు వెలుగై
అతని జీవికలోని తియ్యన
అమృత రసధినియై...
చిత్రకారుడు కవి అడవి బాపిరాజుగారి గురించి శ్రీ విశ్వనాధ
సత్యనారాయణగారు అన్న మాటలివి.


చిత్రకళలో, కవిత్వం, గీత రచన, నవలా రచన, కళాదర్శకత్వం
ఇలా అనేక రంగాలలో అసమాన ప్రజ్ఞను చాటిన ఆడవి బాపిరాజు,
పశ్చిమగోదావరిజిల్లా భీమవరానికి సమీపంలోని సారేపల్లి గ్రామంలో
అక్టోబరు 8, 1895లో క్రిష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.
ప్రాధమిక విద్యను భీమవరంలోను, ఉన్నత విద్యను నరసాపురం ,
రాజమండ్రిలోను పూర్తి చేశారు. అజంతా,హంపీ లాంటి కళాత్మక
ప్రదేశాలను సందర్శించి అక్కడి శిల్పకళను చూసి కళలపై ఆసక్తిని
పెంచుకొన్నారు.



తొలకరి,గోధూలి వంటి గేయాలు, ఏలేయాల,ఏలేయాల, వేపచెట్టు పూత
జూడు, కనులు గంటి-చనులు గంటి, రావోయి సిన్న వాడా-డూడూ
యెంకన్నా, ఉప్పొంగి పోయింది గోదావరి,దీపావళి,విశ్వరూపావళి,లేపాక్షి
బసవయ్య లేచి రావయ్య లాంటి ఎన్నో గేయాలు వ్రాసారు. కూల్డ్రే దొర,
ప్రమోద కుమార్ చటర్జీ శిష్యరికంలో చిత్రకళను నేర్చుకొని సంప్రదాయ
చిత్రకళలో ఆరితేరారు. విశ్వనాధవారి "కిన్నెరసానికి" ముఖచిత్రాన్ని,
చిత్రాలను గీశారు. సాహిత్య మాసపత్రిక "భారతి"లోను, ఆంధ్రపత్రిక
సంవత్సరాది సంచికలలోనూ అనేక చిత్రాలను వేశారు.ఆయన చిత్రాలలో
మాస్టర్ పీస్ అన తగ్గ చిత్రం "ధనుర్దాసు".శివుడు, శివపార్వతులు, కృష్ణుడు,
రాధాకృష్ణులు, రాముడు సముద్రునిపై ఆగ్రహంతో వింటిని సారించిన చిత్రం
ఇలా ఎన్నో చిత్రాలు డెన్మార్కులో సహితం పేరుగాంచాయి. నారాయణరావు,
గోన గన్నారెడ్డి,కోనంగి, హిమబిందు ,తుపాను వంటి రచనలు ఆయన
చిత్రాల లాగే ఆయన ప్రతిభను చాటాయి. ఆయన కొంతకాలం న్యాయ
వాదిగా, కొన్నాళ్ళు మచిలీపట్నం లోని జాతీయ కళాశాలలో ప్రిన్సిపాల్
గానూ పని చేశారు చిత్ర పరిశ్రమలో కళాదర్శకుడిగా, ధృవవిజయం, మీరా
బాయ్, అనసూయ చిత్రాలకు దర్శకుడిగానూ పనిచేశారు. 1952 లో
శ్రీ అడవి బాపిరాజు తనువు చాలించారు.

Thursday, July 14, 2011

కదలని బొమ్మలు చెప్పే కదిలే బొమ్మల కధలు !

ఇందులో మాయేం లేదండి ! అంతా సినీ మాయ ! తెరపై కదలే బొమ్మలు నిజానికి
ఓ వరుసలో వున్న కదలని బొమ్మలే !మనం కన్నుమూసి తెరచేలోపల ఒక బొమ్మ
తరువాత మరొబొమ్మ వచ్చేస్తూ మన కన్నుల్ని మోసం చేయడమే సినిమా(వి) చిత్రం !

మన సినిమాలకు మాటలాడటం రానప్పుడు వాటిని మూకీలు అని పిల్చేవారు.1929
లో మూకీ చిత్రాలను ప్రదర్శిస్తూ, ఆ కధలు ప్రేక్షకులకు అర్ధమవడానికి-ధియేటర్లలో
హార్మోనియం, తబలాలతో కధకుల్ని ఏర్పాటు చేసేవారట! ఆనాటి సుప్రసిద్ధ అగ్రశ్రేణి
హాస్యనటుడు కస్తూరి శివరావు సినిమాల్లో నటుడిగా రావటానికి ముందు అలా కొన్ని
మూకీ చిత్రాలకుకధలు చెప్పేవాడట! మా చిన్నతనంలో హిందీ సినిమాలకు తెలుగు
అనువాదం ఓ వ్యక్తి పెద్ద గొంతుతో అరుస్తూ చెప్పేవాడు.


దర్శకులు శ్రీ సి.పుల్లయ్య 1930లో చిత్రప్రదర్శనలో ప్రవేశపెట్టిన మరో విధానం, విరామ
సమయంలో- బొంబాయినుంచి వచ్చిన నాట్యకత్తెలచే నాట్య ప్రదర్శన! అప్పుడు ఆర్క్
లైట్ల వేడిని ప్రొజక్టర్లు తట్టుకోడానికి విరామాలు ఎక్కువ వుండటం, ఈ ఏర్పాటుకు మరో
కారణం. ఇది అదనపు ఆకర్షణగా ఆనాటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది మొట్టమొదటి
టాకీ "అలంఅరా" దక్షిణాదిన ప్రదర్శించినప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరిగాయి. ఆ
సంఘటనలను 1956 లో ఇండియన్ టాకీ సిల్వర్ జుబిలీ వేడుకలలో "ఫిల్మ్ ఫెడరేషన్
ఆఫ్ ఇండియా" వారు ప్రచురించిన సావనీర్ లో వ్యాస రూపంలో ప్రచురించారు.ఆ టూరింగ్
టాకీ బృందంలో ఆపరేటరు,మేనేజరు, అసిస్టెంట్, వాళ్ళ సొంత సామానుకాక, ప్రొజెక్టరు,
ఆంప్లిఫయరు,స్పీకరూ ఉండేవి. ఆ టూరింగు టాకీస్ పేరు "సెలెక్ట్ టూరింగ్ టాకీస్" మాట్లాడే
సినిమా చూపిస్తున్న వీరికి ప్రజలే కాకుండా రైల్వే వారు కూడా సదుపాయాలు కలగజేసే
వారు. ఇంటర్ క్లాసు కొనుక్కుంటే సెకండ్ క్లాసులో ప్రయాణం చేయడానికి , లగేజీనీ ఫ్రీగా
తీసుకెళ్ళడానికి అనుమతించేవారు. ఈ రోజుల్లో సినిమా తారల చుట్టూ జనం పోగైనట్లు ఆ
రోజుల్లో వాళ్ళ చుట్టూ చేరి దేవతల్లా చూసే వారట. అంతకు ముందు మాటలు రాని బొమ్మలు
తెరపై చూసిన వాళ్లకు బొమ్మలు మాట్లాతుంటే వాళ్ళకు విచిత్రంగా వుండెది.
ఫ్రాన్స్ దేశానికి చెందిన అగస్థిలూమియర్ (1862-1954), లూయీ లుమ్రియర్ (1864-
1948), ఇంగ్లాండులోని ఫ్రెయిసీ గ్రీన్, పాల్; అమెరికాకు చెందిన ధామస్ అల్వా ఎడిసన్
వీల్లందరూ సినిమాను సృష్టించడానికి పోటీ పడ్డారు. కెనెటోస్కోప్ సూత్రాన్ని,పాతకాలం
మేజిక్ లాంతరు సూత్రాన్ని కలిపి సిసలైన సినిమాను మొట్టమొదట 1895లో జనాలకు
పరిచయం చేసిన ఖ్యాతి లుమియర్ బ్రదర్స్ కే స్వంతమయింది.
ముళ్లపూడి వెంకట రమణగారు నాగేశ్వరరావు, రామారావులపై చెప్పిన జోకు
నవ్వితే నవ్వండి నుండి...........
తారలపై మోజు విచిత్రమైనది.
"పాతాళభైరవి" చిత్రం విడుదలై బ్రహ్మాండంగా నడుస్తున్న రోజులవి.
అప్పటికింకా ఎన్.టి.రామారావుకు నాగేశ్వర్రావుకున్నంత పేరు
రాలేదు. నాగేశ్వర్రావు జానపద చిత్రాల హీరోగా బాగా పేరు మోశాడు.
చిత్రం చూసిన ఇద్దరు ప్రేక్షకులు ఇవతలకి రాగానే " ఆ మొసలితో
పోరాటం ఉంది చూశావ్ ? అబ్బ...ఎంతసేపు పోరాడాడయ్యా ఆ రామా
రావు?" అన్నాడు ఒకడు.
"అంతేలే, రామారావు కొత్తగదా.అంచేత అరగంట పట్టింది.అదే మన
నాగేశ్వర్రావైతేనా చిటికెలో చంపేసి ఉండును" అన్నాడు మిత్రుడు.
ఆయనదే మరో జోకు...
"మీ పిక్చరు కామెడీయా, ట్రాజిడీయా?"
"డబ్బొస్తే కామెడీ, రాకపోతే ట్రాజిడీ"
భశుం అదేనండి శుభం

Tuesday, July 12, 2011

అమ్మగారు !!



ఈ మధ్య "అమ్మగారు" అన్న మాట తరచు వినిపిస్తున్నది. ఎక్కడ ?ఇంకెక్కడ? పేపర్లలోనూ,
టీవీల్లోను. మన రాజకీయనాయకుడొకాయన మాట్లాడుతున్నపుడల్లా "అమ్మగారు" అంటూ
ఏదో పని వాడిలా అంటుంటే "అమ్మ" అనే మంచి మాటకూడా చిరాగ్గా అనిపిస్తుంది. ఈ రోజుల్లో
యస్సెమ్ములు ( అదే నండి సర్వెంట్ మెయిడ్స్ ) కూడా అమ్మగారు అనటం మానేశారు. "ఆంటీ"
అని, ఆవిడగారి మొగుడుగారిని "అంకుల్" అనీ పిలుస్తున్నారు. తప్పేముంది? రోజులు మారాయి.
మా చిన్నప్పుడు మ ఇంటి ప్రక్క అత్తయ్యగారు ( మాకు ఇప్పటిలా ఆంటీ అని పిలవటం తెలియదు)
వాళ్ళ పనిమనిషిని దాసీది అని చెప్పేది. ఇప్పుడలా ధైర్యంగా ఎవరైనా ఆమాట అనగలరా?మా అమ్మ
మాత్రం పేరుపెట్టే పిలిచేది.
అదేమిటో పనిమనిషి రాక పోతే ఇల్లాళ్ళ పనైపొతుందట ! ఈ రోజు అర్చన రాదట ( ఆపేరు మా S. M
పేరులెండి) ఇక నా పనైపోయినట్లే అంది శ్రీమతి. ఇంకేం పనైపోతే మంచిదేగదా అన్నాను హిందూ
లో సురేంద్ర ,ఈనాడులో శ్రీధర్ కార్టూన్లను ఆల్బమ్స్ లో అంటించడానికి కట్ చేస్తూ! నా మాటను కట్
చేస్తూ మీకన్నీఎడా-పెడార్ధాల నవ్వులాటగానే వుంటాయి! మీరు చిన్నపిల్లల్లా చింపిపోసే ఈ పేపర్ల
ముక్కలు ఎత్తిపోయడానికే నాకు సగం పనైపోతుంది అంటుంది.ఒక్కోసారి "ఇదేనయం రోజూ వచ్చే
న్యూస్ పేపర్లను నెలకొకటి చొప్పున బైండు చేయించటం లేదు"అని సంతోషపడుతుంటుంది.
పనిమనుషుల సబ్జెక్ట్ మీద, మా కార్టూనిష్టులు నవ్వుల బొమ్మలు వేశారు,వేస్తున్నారు.
. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంటుంది. మన ఇంట్లో మన పని చేసుకోవడానికే ఎంతో కష్టంగా వుంటుంది.
. అలాటప్పుడు ప్రతి రోజూ ఆదివారంతో సహా పాపం అలా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారే అని
జాలికలుగుతుంటుంది. అంతకన్నా ఏం చేయగలం చెప్పండి. అమెరికాలో వాళ్ళకంచాలు, గిన్నెలూ వాళ్ళే
తోముకుంటారట ! self help is best help కదా!

చివరగా జోకులు చెప్పుకుందాం !
సుబ్బారావుగారు పకపక నవ్వి " ఏవయ్యా,ఇదెప్పట్నించి? నీ కంచం నువ్వే
కడుక్కోడం ? " అన్నాడు.
" అబ్బే ఎన్నడూ లేదు ! " అన్నాడు చక్రవర్తి.
" ఆ, ఇందాక నా కళ్ళతో నే చూస్తినే "
" పిచ్చివాడా, అది నాదికాదోయ్, మా ఆవిడ తిన్న కంచం" అన్నాడు చక్రవర్తి
విరగబడి నవ్వుతూ. (ముళ్లపూడి నవ్వితే నవ్వండి నుంచి)
*కార్టూన్లు శ్రీ బాపు, శ్రీ జయదేవ్ లకు కృతజ్ఞతలతో*

Monday, July 11, 2011

టూకీగా కొన్ని టాకీ కబుర్లు

ఇప్పుడు సినిమాలు రంగులు హంగులు వేసుకొని వచ్చాయి కానీ ఆ రోజుల్లో పాపం
సినిమాలకు మాటలే రా(లే)వు. తరువాత అలంఅరా సినిమా టాకీగా విడుదలయితే
జనం వింతగా విరగబడి చూశారు. అప్పుడు పర్మినెంటు ధియేటర్లు ఉండేవికావు.
అన్నీ తాత్కాలిక టెంటు సినిమాలే. టాకీలు వచ్చాక అవి ఆడి పాడే సినిమా హాళ్ళకు
"టాకీస్" లని పిలిచేవారు. తరువాత కాలంలో సినిమా హాళ్లకు టాకీస్ అని చేర్చటం పోయి
ఫలానా మహల్ అని, మందిర్లనీ పేర్లొచ్చాయి. ఇప్పుడేమోఅన్నీ మల్టీ ప్లెక్స్లూ, కాంప్లెక్సులూ!
మన దేశంలో మొట్టమొదటి మూకీ సినిమా 1913లో డి.జీ.ఫాల్కే నిర్మించారు.
ఇక దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా మూకీ తీసిన నిర్మాత నటరాజ మొదలియార్.
ఇండియాలో మొట్టమొదటి సినిమా ధియేటర్ "ఎలిఫిన్టన్ పిక్చర్ ప్యాలెస్" 1929లో
కలకత్తాలో నిర్మించారు. బొంబాయి ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ, ఖాన్ బహదూర్ అర్దేషిర్
ఇరానీ 1931లో మొదటి సారిగా "అలంఅరా" అనే హిందీ చిత్రం నిర్మించారు. పూర్తి వర్ణ
చిత్రం కూడా ఇరానీయే 1938 లో "కిసాన్ కన్య" నిర్మించారు. 1949వ సంవత్సరంలో
జెమినీ స్టూడియోస్ అధినేత ఎస్.ఎస్.వాసన్ "చంద్రలేఖ" చిత్రాన్ని హిందీలో నిర్మించారు!
దానితో దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు అక్కడ ఒక స్థానం ఏర్పాటయింది.ఈ సినిమాలో
పెద్ద పెద్ద డ్రమ్స్ పై చిత్రీకరించిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకొనేవారు !!


1937లో వెనీస్ లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా "తుకారాం"
బహుమతి పొందింది. తెలుగుదేశంలో మొట్టమొదటి డిస్ట్రిబ్యూషన్ సంస్థను జికె.మంగరాజు
1934లో క్యాలిటి పిక్చర్స్ పేరిట ప్రారంభించారు. మద్రాసులో మొట్టమొడటి ధియేటర్లు
క్రౌన్, గైటీ,గ్లోబ్. వీటి అధిపతి ఆర్.వెంకయ్య. ఆంధ్రదేశంలో విజయవాడలో పి.శ్రీనివాసరావు
మారుతీ సినిమా నిర్మించారు. మొట్టమొదటి ఏ.సి ధియేటర్ మద్రాసులోని మినర్వా (1949).
అందరూ పిల్లలే నటించిన సినిమా "ధృవ, అనసూయ" సి.పుల్లయ్య 1937 లో నిర్మించారు.
1956లో మోడరన్ ధియేటర్స్ ఎమ్జీయార్,భానుమతులతో నిర్మించిన మొదటి పూర్తి గేవా
కలర్ చిత్రం " ఆలీబాబావుం,నాప్పదు తిరుడర్ గళుం"
ఎక్కువ కేంద్రాలలో విడుదలయిన మొదటి దక్షిణ భారత చిత్రం "ప్రపంచం". తెలుగు,
తమిళ భాషల్లో 1953లో 101 ధియేటర్లలో విడుదలచేశారు. దక్షిణ భారత దేశంలో లక్ష
రూపాయల పారితోషికం తీసుకొన్న మొదటి నటీమణి- కె.బి.సుందరాంబాళ్.(నందనార్
1935) . ఆంధ్రలో నిర్మించిన మొదటి ఫిల్మ్ స్టూడియో ఎక్కడో తెలుసా? రాజమండ్రిలో!
నిడమర్తి వారు దుర్గాసినీటోన్ పేరిట నిర్మించారు. అందులో సంపూర్ణ రామాయణం
నిర్మించబడింది. ఆ చిత్రంలో విశేష మేమిటంటే ఔట్ డోరులో షూటింగ్ జరిపినప్పుడు
దూరంగా గోదావరీ రైల్వే బ్రిడ్జి, దానిపై పోతున్న రైలు అగుపిస్తాయట !
చివరిగా ఓ జోకు !
మొదటి ఆట ముగియగానే జనం హాళ్ళోంచి బయటకు రాగానే జోరున వర్షం
మొదలయి ఎంతకీ తగ్గలేదు. జనం పిల్లా పాపలతో అలానే లోపలే నిలబడి
పోయారు. చివరికి ధియేటర్ మేనేజర్ "ఈవర్షం ఇప్పట్లో తగ్గేట్టు లేదు. లోపలికి
రండి. ఫ్రీగా మళ్ళీ సినిమా వేస్తాం" అన్నాడు. అంతటి జోరువానలోను జనం
బయటకు ఒక్కసారిగా పరిగెత్తారు.
ఆ సినిమా అంత ఘోరంగా వుందన్న మాట !!

Saturday, July 09, 2011

కామిక్కులకు, మాజిక్కులకు రెడీ అనే రమణారెడ్డి !

నెల్లూరులో శానిటరీ ఇన్స్పెక్టరుగా ఉద్యోగం చేసిన తిక్కవరపు రమణారెడ్డి
1951 లో సినిమారంగ ప్రవేశం చేశారు. సన్నగా పొడుగ్గా పొడుగుపాటి
కర్రల మీద నడుస్తున్నాడా అనే టట్లు వుండే ఈ రమణారెడ్డి సంభాషణలలో
నెల్లూరి యాసను జోడించి సంభాషణలు చెబుతూహాస్యనటుడిగా ప్రేక్షకుల
అబిమానాన్ని పొందారు. సన్నగా వుండే వాళ్ళను రమణారెడ్డితో జనాలు
పోల్చేవారు,.
ఇల్లరికం సినిమాలో మామా అళ్ళుల్లగా రమణారెడ్డి నటన మరచిపోలేము.
పల్లెటూరు,రోజులు మారాయి,సువర్ణసుందరి,మిస్సమ్మ,మాయాబజార్,
వరుడుకావాలి, అత్తా ఒకింటి కోడలే, అంతస్తులు, ఆరాధన, రాముడు భీముడు
గుండమ్మ కధ,సత్య హరిశ్చంద్ర ఇలా ఎన్నేన్నో చిత్రాలలో తన అఫూర్వ హాస్య
నటనతో కొన్ని చోట్ల విలనీ ప్రదర్శించి ప్రేక్షకుల గుండెల్లో నిలచిపోయారు.
ఆయన మిస్సమ్మ చిత్రంలో పోషించిన డేవిడ్ పాత్రలో వంకర్లు తిరుగుతూ
సావిత్రిని పెళ్ళిచేసుకోవాలనుకొనే పాత్ర ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది.
మన పౌరాణిక చిత్రాలలో నాగేశ్వరరావు, రేలంగి ,కాంతారావు మొ"వాళ్ళు
నారద పాత్ర ధరించారు. 1960 ప్రాంతాలలో వచ్చిన "రేణుకాదేవి మహాత్మ్యం"
లో ఆయన ధరించిన నారద పాత్రకు ఓ ప్రత్యేకత వుంది. ఇందులో అయన
లాల్చి లాటి దుస్తులు వేసుకుంటాడు ! మరీ బక్కగా వున్న ఆయన చొక్కా
విప్పితే బొమికలు దర్శనమిస్తాయి. అందుకే అలా పై చొక్కాతో ఆ చిత్రంలో
అగుపిస్తారు. రమణారెడ్డి సౌమ్యుడు. ఆయన సీరియస్ గా వుంటూ, నవ్వించే
వారట. ఓ చిత్రంలో మ్యాజీష్యన్ పాత్ర ధరిస్తూ మ్యాజిక్ నేర్చుకొని ప్రదర్శనలు
ఇచ్చే స్థాయికి ఎదిగారు. పంచె కట్టి అందులో ఇన్షర్టు చేసి పైన ఓ బెల్టు పెట్టు
కొన్న ఆయన వేషధారణ చూడగానే నవ్వు తెప్పించేది. లివరు వ్యాధితో
అస్వస్థులై అస్తమించారు. ఈ నాడు తెలుగుతెరపై హాస్యం అపహాస్యమై వెగటు
పుట్టిస్తుంటే రమణారెడ్డిగారి లాంటి మహానుభావుల హాస్య నటనను ఆనాటి
చిత్రాలను చూస్తూ మరో సారి గత రోజుల వైభవాన్ని తలచుకొని మురిసిఫోవడం
కన్న మనమింకేం చేయగలం ?!
( చిత్రాలు బాపు కార్ట్యూనులు, బాపు సోదరులు S.శంకరనారాయణ పెన్సిల్ స్కెచ్
సౌజన్యంతో)

Sunday, July 03, 2011

సరదా సరదాగా !!

రాబోయే కొత్త సినిమా !!
లేదు లేదు పెరిగిన పెట్రో ధరలతొ, కారు కన్నా ఇదే కరుచౌక అని......!!

మా నూరుగురు సోదరులకు వాహనములు సమకూర్చితిని !!పత్రికలలో వచ్చే ఫొటోలకు సరదా కామెంట్స్ జోడించి నే తయారుచేసిన
కొన్ని బొమ్మలు. ఇవి సరదాగా నవ్వుకోడానికి మాత్రమే !!

Saturday, July 02, 2011

ఈ కాలం పిల్లలు

మొన్న ముఫైవతేదీన మితృడు దినవహి వి.హనుమంతరావు అద్యక్షుడిగా
ఉన్నభారత్ వికాస్ పరిషత్, వివేకానంద శాఖ (రాజమండ్రి)వారు బాలవికాస శిబిరం
స్థానిక మహావీర్ విద్యానికేతన్ లో ఏర్పాటు చేస్తూ , ఎనిమిది, తొమ్మిది తరగతి
విద్యార్ధులకు కార్టూన్ల గురించి చెప్పమన్నారు. నాకు ఇష్టమైన విషయం కాబట్టి
సంతోషంగా వెళ్ళాను. అక్కడి ఆడ మగ పిల్లల క్రమశిక్షణ చూడగానే ముచ్చట
వేసింది. పెద్దలపై వాళ్ళు చూపించిన గౌరవం అది నేర్పిన ఆ స్కూలు బొధనా
సిబ్బంది కృషిని మెచ్చుకోకుండా వుండలేకపోయాను. ఇక అసలు విషయానికి
వస్తాను. మంచి బొమ్మలు, నవ్వించే కార్టూన్లు గీసే బాపుగారు తెలుసా అంటే
తెలియదన్నారు. "బుడుగు" అనే పుస్తకం చదివారా, చూశారా అంటే తెలియదన్నారు.
ఆకాలం పుస్తకమైనా ఈకాలంలోనూ "బుడుగు" దొరుకుతున్నది కదా?!నా మనస్సు
చివుక్కుమంది.


ఈ పిల్లలంతా చదువులో చాలా చురుగ్గా వున్నారు. ఆ సభకే వచ్చిన ఫిజిక్స్
లెక్చరర్ శ్రీ చాగంటి శరత్ కుమార్ గారు లైట్, సౌండు గురించి, మన మాటతీరును
బట్టి ఎదుటవారి ప్రవర్తన ఎలా వుంటుందో చిన్న కధలద్వారా చెప్పినప్పుడు అటు
తరువాత వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు బహు చక్కగా
జవాబులు చెప్పారు. అంటే లోపం ఎక్కడ వుంది. వాళ్ళకు చదువుతో బాటు,తెలుగు
సాహిత్యం గురించి, మన తెలుగువారిలో వున్న బాపులాటి ప్రముఖ చిత్రకారుల
గురించి అవగాహన కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన కూడా వుంది. దీనికి
కారణం ఈ కాలం తల్లిదండ్రులు చాలా బిజీ. వాళ్ళకే చాలా సంగతులు తెలియవు.
ఇక పిల్లలకేం చెబుతారు. తాతలు అమ్మమ్మలూ ఎక్కడో దూరంగా వుంటారు,
మరొకటి పిల్లలు తెలుగులో మాట్లాడినా, తెలుగు పుస్తకాలు చదివినా నామోషీగా
భావిస్తారు.
ఈ టీవీలో ప్రతి ఆదివారం పంచతంత్రం పప్పెట్ షో ప్రసారం చేసేముందు కర్టెన్ రైజరుగా
మన రాజధాని వీధుల్లో యువకులను పెద్దలను కలసి పంచతంత్రం అంటే
తెలుసా అని అడిగితే చలా మంది తెలియదన్నారు. మా రోజుల్లో పరవస్తు చిన్నయ
సూరి రచించిన పంచతంత్రం తెలుగు పాఠ్యాశ్యంగా వుండేది. బొమ్మల కధగా ఆంధ్ర
వారపత్రికలో శ్రీ విశ్వాత్ముల నరసింహమూర్తి, అటుతరువాత శ్రీ బాపు చిత్రాలతో
వచ్చేది. ఈప్పుడు కార్టూన్ చానళ్ళు వచ్చి హనుమంతుడిని ఇండియన్ సూపర్
మాన్ అని పిల్లలకు చెబుతున్నారు. ఇక విఘ్నేశ్వరుణ్ణి జీన్స్ పాంట్ తో చూపించే
దౌర్భాగ్యం వచ్చింది. ఇలాటివి చిన్నారి మనసులపై ఎలాటి ముద్రను వేస్తాయో మన
పెద్దలు ఆలోచించాలి. పిల్లలకు హారీపాటర్ లాంటి ఇంగ్లీషు కధలతో బాటు మన
సాహిత్యంలోని కాశీమజిలీ కధలు, భట్టివిక్రమార్కుడి కధలు చదివించాలి,చెప్పాలి
మనం ఒకరి ఇంటికి పిల్లల్తో వెళ్ళి నప్పుడు ఎలా వుండాలో నేర్పాలి. పుస్తకాలను,
వస్తువులను ముట్టుకోకూడదనీ, చూడాలంటే అడిగి చూడాలనీ చెప్పాలి. పిల్లలు
ఏ విలువైన గాజు బొమ్మనో తీస్తుంటే వాళ్ళ తల్లులు ఏమనుకుంటారో అని మొహ
మాట పడుతుంటారు. ఈ విషయంలో తలకు బాగా బొప్పెలు కట్టించుకున్న నేను
మాత్రం నిర్మొహమాటంగా తియ్యకు బాబూ అని చెబితే అది తప్పని పిల్లలకు చెప్పక
బోగా వాళ్ళే కోపగించుకుంటారు. పిల్లలకు మనం చెప్పే, నేర్పే రీతిని బట్టి వాళ్ళలో
మార్పు వస్తుంది. మన భాషపై మనమే చులకనగా వాళ్ళ ఎదుట మాట్లాడితే అది
పిల్లల మనసుపై ప్రభావం తప్పక చూపిస్తుంది. మన తెలుగులో వున్న సాహిత్యం
గురించి, హాస్యం గురించి రచయితలు, చిత్రకారుల గురించి చదువుతో సమానంగా
చెప్పాలి. మనమూ ఇంగ్లీషుతో బాటు మంచి తెలుగు సాహిత్యం చదవటం అలవాటు
చేసుకోవాలి.
"కదలకుండా కూర్చొని చూసే టెలివిజన్
కన్నా మంచి పుస్తకం నీకిస్తుంది "తెలి"విజన్ !!"
( నా సురేఖార్ట్యూన్స్ నుంచి)
ఇక్కడి కార్టూన్ బాపు స్వాతి కార్టూన్స్ సౌజన్యంతో, లెక్కల మాస్టారు కార్టూన్ నేను
1960 లో ఆంధ్రవార పత్రికలో వేసినది.మిగతావి ఇటీవలవి.

Friday, July 01, 2011

జో జో జోకులానంద



ఈ రోజు ప్రపంచ జోకుల దినోత్సవంట ! ఇంకేం జోకులాడుకోటానికి ఇదో అవకాశం వచ్చింది.
మా "హాసం క్లబ్" లో నేనూ, మితృడు హనుమంతరావు కల్సి వే(చే)సిన ఈ చిన్న జోకులాంటి
స్కిట్ !
అలో అలో సలహాల్రావ్ ! ఎన్నాళ్ళకు దొరికావోయ్ ! నా దేహానికి వచ్చిన ఈ
సందేహాన్ని నువ్వే తీర్చాలి!
ఈ సలహాల్రావ్ పనే అది ! ఇంతకీ ఏమిటి నీ సందేహం ?
స్కూటర్లు, బైకుల ధరలు కార్ల కంటే తక్కువ కదా ?
అవునూ, తక్కువే, ఐతే ఏమిటంటావు ?
అలాటప్పూడూ తక్కువ ధరలున్న స్కూటర్లకూ, బైకులకు స్టాండు పెట్టి
లక్షలుపెట్టి కొన్న కార్లకు స్టాండు పెట్టక పోవటం అన్యాయం, పరమ మోసం
కాదా?
ఓస్ ! అదా నీ బాధ ! ఇలా చూడు సందేహాల్రావ్ ! స్కూటర్ బరువు కారుకన్నా
తక్కువకదా ?! ! ఎత్తి స్టాండు వేయటం తేలిక. అదే కారయితే బరువు వల్ల ఎత్తి
స్టాండు వేయటంకష్టం కదా! అందుకే పెట్టలేదు. ఇందులో ఏ మోసమూ లేదు. బెంగ
. పడకు !
నిజమేనోయ్ ! ఎలా ఐనా నీ బుర్రే బుర్ర ! నీ తెలివి అమోఘమనుకో ! వస్తా !



మరో కొత్త మొఖం జోకు
ఏయ్ ఎవరు నువ్వు? నా జేబులో చెయ్యి పెడుతున్నా వేమిటి ?
సారీ సార్ ! నా జేబనుకున్నా !
మరి కొంత సేపటికి..
అరే ! మళ్ళీ నా జేబులో చెయ్యి పెడుతున్నావ్ ! ?
మరేం లేదు సార్ ! అగ్గి పెట్టె కోసమండీ !!కోప్పడకండి !
ఐతే నన్నడగవచ్చుకదా ! ముక్కూ మొఖం తెలియని వాడివి, నా జేబులో
చెయ్యి పెడుతున్నావ్ !!నా కేదో అనుమానంగా వుంది నీ తీరు చూస్తుంటే!
మరీ అంత అనుమానించి అవమానించకండి సార్ ! మీరెవరో నాకు తెలియదు
కదా ! అదే వచ్చిన చిక్కు! నాకు కొత్త ముఖాలతో మాట్లాడాలి అంటే అమిత
సిగ్గండీ ! అందుకనీ !!
ఆ ( !!
ఆ( అనమని మనల్ని డాక్టర్ దగ్గరకేళ్ళి నప్పుడు అంటారు! అన్నట్టు ఈ రోజు
డాక్టర్స్ డే కూడా! వైద్యంతో బాటు తమ పేషెంట్లని జోకులు చెబుతూ నవ్వించే
డాక్టర్లు కూడా చాలా మంది వున్నారు. వారికీ జోకుల నవ్వుల పువ్వుల మందార
మాలలు.

నవ్వే జనా సుఖినో భవంతు !!