Tuesday, November 29, 2011

నాకూ మనసున్నాది ....



"నాకూ మనసున్నాది " అంటూ కవితల పుస్తకం వ్రాసి ప్రశంసలందుకున్న ఈయన పేరు మహమ్మద్
ఖాదర్ ఖాన్. నిజంగా ఈయన మనసున్న మనిషి! రాజమండ్రి, దానవాయిపేట పోస్టాఫీసులో పోస్ట్
మాస్టారుగా పనిచేసి ఆ శాఖలో నాలుగుసార్లు ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెరెన్స్ అవార్డును అందుకున్న
పనిమంతుడు. తెలుగు సాహిత్య ప్రేమికుడైన ఖాన్ తెలుగును మన తెలుగు వాళ్లకంటే అద్భుతంగా
మాట్లాడతాడు. స్నేహానికి ప్రాణమిచ్చే ఖాన్ మెచ్చిన వాఖ్య:" జిస్ పల్ డే మే తులె మొహబ్బత్, ఉస్మే
చాందీ నహీ తోల్ నా"(ప్రేమాభిమానాలు తూచిన త్రాసులో వెండి బంగారాలను తూచవద్దు) ఆయన
తన పుస్తకంలో ఇలా అంటారు." ఈ గ్రంధ విక్రయంలో సింహభాగాన్ని నిజమైన ఆర్ధికావసరం కలిగిన
విద్యావైద్య సహాయార్ధులకు వినియొగించ నిశ్చయించాము.కావున దయతో మీరు కుడా ఈ పుస్తకాన్ని
కొని మీ వంతు సాయంగా సమాజానికి ఉపయోగించండి !!"


ఖాదర్ ఖాన్ ప్రతి ఆదివారం స్థానిక దినపత్రిక "సమాచారం"లో కవితలు వ్రాసేవారు. వాటిలో ముఖ్యంగా
నన్ను శాంతి కపోతాలు, రాక్షసజన్మ ప్రసాదించవూ అన్న కవితలు నన్ను ఆలోచింపజేశాయి. ఈనాటి
మానవులకన్నా ఆనాటి దానవుడు రావణుడే మిన్న అని రాక్షసజన్మ... అన్న కవితలో ఖాన్ చెప్పారు.
ఆయన్ని స్వయంగా కలసి అభినందనలు చెప్పాలి అని అనుకుంటుండగానే ఆయన దగ్గర నుంచి ఓ
ఉత్తరం వచ్చింది." ఈ వయసులో ఎవరికీ ప్రియుణ్ణి కాలేను కాబట్టి మీ "హాసం క్లబ్ " కు ప్రియుణ్ణి
కావాలని వుంది" అన్నది ఆ లేఖాంశం. వెంటనే ఆయన్ని పోస్టాఫీసుకు వెళ్ళి కలవటం, "స్నేహమేరా
జీవితం,స్నేహమేరా శాశ్వతం, అల్లా సాక్షిగా" అన్నట్లు ఆయన మాకు ఆనాటినుంచి మా "అహ"లకు
(అప్పారావు, హనుమంతరావు ,హాసం క్లబ్ ) తోడై మాతో పాలు పంచుకుంటున్నారు.


మా మితృడు హనుమంతరావుతో బాటు నేను, ఖాను కొన్ని స్కిట్స్ తయారుచేసి "హాసం క్లబ్"లో
ప్రదర్శించాము. అందులో "డాక్టర్-పేషెంట్" స్కిట్ హాస్యప్రియుల ప్రశంసలు అందుకొంది. ఆయన
పోస్టాఫీసులొ జరిగిన ఓ సంఘటన చెప్పారు. తిరుపతి వెళ్ళివచ్చిన ఒకాయన లడ్డూ ప్రసాదం స్టాఫ్
అందరికీ పంచుతూ ఈయన దగ్గరకు ఓ పెద్ద లడ్డూ తెచ్చి" మీరు ముస్లింలు, మీకభ్యంతరం లేక పొతే
మీకు ఇవ్వాలనుకుంటున్నాను" అన్నాడట. వెంటనే ఖాన్ " ఆ వెంకన్నబాబు మా ఆడబడుచు
బీబీనాంచారమ్మ కూ భర్తే కదా! అందుకే చూశారా ఆయన నాకు పూర్తి లడ్డు మీ చెత పంపించాడు.
మిగతా మా స్టాఫుకు చిన్న ముక్కలే ఇచ్చాడు"అంటూ కళ్లకద్దుకొని తీసుకున్నారట. చూశారా ఖాన్
మనసు౧ వినాయకుడి పై కార్టూన్లు అలా మరీ విపరీతంగా మీ కార్టూనిస్టులు వేయడం బాగాలేదు అని
ఆయన నొచ్చుకుంటూ నాతో అన్నారు. ఆయన కవితలో కొన్ని మచ్చుతునకలు మీ కోసం ’
1 తెలుగు
మా తెలుగు తీయనిది
మానుండి ఎవరూ విడతీయనిది
తెలుగును వాడుదాం
తెలుగులో ఆడిపాడుదాం
తెలుగును కాపాడుదాం
2 శాంతి కపోతాలు
నీకు శాంతి కపోతాలు బోలెడు
ప్రేమతో ఆనందంగా అందించాలని
చాలా ఆశగా వుంది భాయీ
మసాలా రుచులు మరిగినవాడివి
వండుకొని తినవని
నమ్మకంఏమిటి ? (ఎవరిని ఉద్దేసించి ఈ కవిత వ్రాశారో మీరు గ్రహించే వుంటారు)
గత ఆదివారం 27-11-11న మక్కాయాత్ర పలుమార్లు చేసివచ్చిన మా ఖాన్ బాయికి మితృలు సత్కారం
ఏర్పాటు చేశారు. ఆ రోజు ముంబాయి ప్రయాణంలో వున్న నేను మితృడు ఖాన్ కు ఇలా మీ అందరి ద్వారా
అభినందనలు అంద జేస్తున్నాను.

Monday, November 21, 2011

ఈనా"డే" వరల్డ్ టీవీ డే ! ట !!

టీవీ వె(క)తలు !!

నాడు వారం వారం పత్రికల్లో సీరియల్ కధలు !
ఆరుద్ర గళ్ళనుడికట్లు ,కవుల కవితలు !
నేడు ఏరీ మరోవారం వాటి కోసం ఎదురుచూసే ఆనాటి పఠితలు ?!
గంట గంటకు సీరియస్గా సీరియల్ గా ఏడిపించే
టీవీ వనితలు ఠీవిగా వచ్చేస్తున్నారు పిలవని
పేరంటంగా ఇంటిఇంటికి !
దూరమవుతున్నారు మన వనితలు వంటింటికి !!
అమ్మో !! ఓ రోజు కేబుల్ బందే !
మన జనాలకు తీరని ఇబ్బందే !!

Saturday, November 19, 2011

ఆనాటి "లవకుశ" -ఈనాటి "శ్రీరామరాజ్యం"



1963 మార్చి 29 వతేదీన విడుదలయిన లలితాశివజ్యోతి ఫిల్మ్స్ వారి
" లవకుశ " నిర్మాణానికి నాలుగేళ్ళ పైగా సమయం పట్టింది. ఆర్ధిక
ఇబ్బందులతోబాటు నిర్మాణంలో వుండగా దర్శకులు సి.పుల్లయ్య
దివంగతులుకాగా ఆయన కుమారుడు సి.యస్.రావు పూర్తిచేశారు.
కధా, మాటలు సదాశివబ్రహ్మం వ్రాయగా పాటలను సముద్రాల,సదా
శివబ్రహ్మం, కొసరాజు అందించారు. ఘంటసాల కూర్చిన సంగీతం
అత్యంత ప్రజాదరణ పొందింది. లవకుశ పాత్రధారులు వివిధ సీన్లలో
ఆకారాల్లో వయసు తెచ్చిన మార్పులతో ఒక్కోసారి ముందు సీన్లలో
తరువాత దృశ్యాలలో కనిపించినా పెక్షకులు అవేవీ పట్టించుకోకుండా
చిత్రానికి అఖండ విజయాన్ని చేకూర్చారు. టిక్కెట్టు ధర రూపాయి
పావలా (పై తరగతి) వున్న నాడే "లవకుశ" కోటిరూపాయలు పైగా
వసూలు చేసి చరిత్ర సృష్టించింది పూర్తి గేవాకలర్ లో "లవకుశ "
చిత్రీకరణను కమెరామెన్ పి.యల్.రాయ్ నిర్వహించారు.

ఇప్పుడు 48 ఏళ్ళ తరువాత నిర్మాత శ్రీ యలమంచిలి సాయిబాబా
అదే కధను" శ్రీరామరాజ్యం " పేరిట శ్రీ బాపు దర్శకత్వంలో, శ్రీ ముళ్లపూడి
వెంకట రమణ కధ మాటలతో 22-11-2010 ఉదయం 10 గంటలకు
నాచారమ్ రామకృష్ణా స్టూడియోస్ లో పూజతో ప్రారంభించి ఏడాదిలోగా
చిత్ర నిర్మాణం పూర్తిచేసి విడుదల చేయటం విశేషం. శ్రీ బాపు చిత్రాన్ని
అద్భుత కళాఖండంగా మలచారు. నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ
చిత్రం మరపురాని గుర్తుగా నిలచిపోతుంది.

ఇళయరాజా , జొన్నవిత్తులగీతాలకు కూర్చిన సంగీతం, హంగేరియన్ వాద్య
బృందంతో కూర్చిన నేపధ్యసంగీతం శ్రీరామరాజ్యం కి మరింత విలువను
పెంచింది. సీత పాత్రలో నయనతార నటన నయనానందకరంగా వుంది.
ఆమెకు గాత్రధారణ చేసిన సునీత నయనతార నటనకు నిండుతానాన్ని
ఇచ్చింది. బాలకృష్ణ శ్రీరాముడిగా కొన్ని దృశ్యాలలో శ్రీ రామారావులా
అగుపించారు. అక్కినేని వాల్మీకిగా నటనలోనూ, సంభాషణలు పలికే
తీరులోనూ తనకు తానే సాటి అని మరో సారి నిరూపించు కున్నారు.
రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్టింగులు, సాంకేతికపరంగా వాడిన
గ్రాఫిక్స్ చాలాబాగున్నాయి శ్రీ రామారావు భుజం పై నిజం పుట్టుమచ్చ
వుంటే ఇందులో బాలకృష్ణ భుజంపై పెట్టుమచ్చను వుంచడం ఓ విశేషం!
లవకుశలు చిన్న పాపాయిలుగా వున్నప్పుడు ఊయలగా తీగలతో
ఊయల తయారుచేయించడం, ఆశ్రమ దృశ్యాలు, జలపాతాలు, అందమైన
ముని కుటీరాలు, గ్రాఫిక్ లో చూపించిన లేళ్ళు, నెమళ్ళు ఒకటేమిటి
అన్నీ కమనీయ దృశ్యాలే. వాల్మీకి లవకుశలతో రామాయణం గురించి
ఏమి తెలుసుకున్నారని ప్రశ్నించడం వాళ్ళు రామాయణ పాత్రల గొప్పతనం
చెప్పటం ఈతరం పిల్లలకు రామాయణం గురించి తెలుసుకొనడానికి
మంచి సదావకాశం. తెలుగువారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఇలాటి
మంచి చిత్రం చూపించాల్సిన అవసరం ఎంతైనావుంది. ఒకటే తీరని లోటు.
రమణగారు ఈచిత్రాన్ని చూసివుంటే ఎంత ఆనందించేవారో అని తలచు
కుంటే ఏదో చెప్పరాని బాధ. ఆయన ఆశీస్సులు ఈ చిత్రానికి, నిర్మించిన
నిర్మాత, సాంకేతకనిపుణలకు, నటీనటులకు సర్వదా తప్పక వుంటాయి.

Friday, November 18, 2011

మిక్కీమౌస్ పుట్టిన రోజు

ఎన్ని కార్టూన్ పాత్రలున్నా మిక్కీమౌస్ ఎన్నో ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల
హృదయాలలో నిలచిపోయింది. "స్టీమ్ బోట్ విల్లీ" పేరున మిక్కీమౌస్ పాత్రతో వాల్ట్ డిస్నీ
నిర్మించిన కార్టూన్ చిత్రం మొదటిసారిగా నవంబర్ 18, 1928 లో విడుదలయింది. ఆనాటి
నుంచి నవంబరు 18వతేదీన అభిమానులు మిక్కీకి పుట్టిన రోజు పండుగ జరుపుకుంటున్నారు.
మొదటిసారిగా వాల్ట్ డిస్నీ సృష్ఠించినపాత్రకు మార్టిమర్ మౌస్ అని పేరు పెట్టాడు.కానీ ఆయన
భార్యకు ఆ పేరు నచ్చలేదు. ఆమే ఈ పాత్రకు మిక్కీ మౌస్ అనే పేరును సూచించింది. మొదటి
సారిగా మిక్కీ పాత్రకు డిస్నీ తన గొంతునే నేపధ్యంగా వాడేడు. మిక్కీ మౌస్ 1932 లో వాల్ట్
డిస్నీకి ఎకాడమీ అవార్డును సంపాదించిపెట్టింది. మిక్కీ రంగుల్లో తెరపైకి ఫిబ్రవరి 23 ,1935 న
అగుపించిన రెండు నెలల తరువాత "మీక్కీస్ కంగారూ" అనే తెలుపు నలుపు చిత్రం ఆలస్యంగా
విడుదల అవటం మరో విశేషం !83 ఏళ్ళ మిక్కీమౌస్ ఇంకా పెద్దలనీ చిన్నారులనీ అలరిస్తూనే వుంది.
మిక్కీ మౌస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేద్దాం.

Tuesday, November 15, 2011

చర్మాన్నీ మార్చేయొచ్చు !!



ఈ నెల నాలుగవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పై శీర్షికతో ఒక వార్త వచ్చింది.
ఇదేదో ఫేస్ క్రీముల ప్రకటనలా వుందే అని అనుకుంటూనే చదివాను. చాలా
సంతోషం కలిగింది. ఆ వార్తలో "ఉత్తర అమెరికాలో స్థిరపడిన ప్రముఖ ప్లాస్టిక్
సర్జన్ డాక్టర్ హనుమదాస్ మారెళ్ల దీనికి రూప కల్పన చేశారు" అని వుంది.
ఈ ఏడాదే డాక్టర్ దాసు పిల్లల కాలిన గాయాల చికిత్స పై వ్రాసిన పుస్తకం
చెన్నైలో అవిష్కరించారు. ఆనాటి సభలో మా దాసుబావ ఫొటో.
ఈ ఫొటోలో ఎడమవైపు కూర్చున్నది దాసు, కుడి ప్రక్కన నేను ! దాసు మా
మేనమామ గారి అబ్బాయి. చిన్ననాటి నుంచి మాకు స్కూలు సెలవలివ్వగానే
గుంటూరు వెళ్ళే వాళ్ళం. మా మావయ్య గుంటూరు దగ్గర తాడికొండ లో
ఐ ఎల్ టీ డీ లో ఉన్నతోద్యోగం చేసే వారు. కంపెనీ పెద్ద బంగళా ఇచ్చారు.
మేమిద్దరం కొబ్బరి చీపురు పుల్లలతో పెద్ద పెద్ద గదుల్లో కత్తి యుద్ధాలు
చేసే వాళ్ళం. అట్టపెట్టెకు భూతద్దం పెట్టి ఎత్తుగావుండే వెంటిలేటర్సు నుంచి
వచ్చే ఎండకు అద్దంపెట్టి మరోవైపు ఫిల్మ్ పెట్టి సినిమా ఆటలు ఆడుకొనే
వాళ్ళం. ఇంకొంచెం పెద్దయ్యాక మాకు సినిమా ప్రొజెక్టర్ కొనుక్కోవాలనే
తీరని కోరిక వుండేది. పత్రికల్లో సినిమా ప్రొజెక్టర్ల ప్రకటనలు చూసి సంబర
పడేవాళ్ళం.ఎలా ఐనా తెప్పించుకోవాలనుకొనే వాళ్లం !!


ఈ ఫొటో గుంటూరు అరండల్పేట లోని మా మావయ్య ఇల్లు "ప్రభాతనిలయం"
లో తీసింది. అప్పుడు దాసు గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు.
మెడికోగా ఆనాటి ఫొటో.ఇప్పుడు ఆ ప్రభాత నిలయం బిల్డింగ్ పెద్ద షాపింగ్
కాంప్లెక్స్ గా మారిందట!

గత జనవరిలో డా"దాసు, తన శ్రీమతి డా"పంకజతో రాజమండ్రి మా ఇంటికి
వచ్చినప్పటి ఫొటో. డా"పంకజ మా దాసుకు గుంటూరు మెడికల్ కాలేజీలో
సహాధ్యాయిని. చిన్ననాటి మా ఆటలు, అల్లర్లు, సినిమా ప్రొజెక్టర్ కోసం మేం
పడిన ఆరాటం తలచుకొని ఆనందించాం. తను చదివిన గుంటూరు నగరంలో
అత్యాధునిక తొలి హ్యూమన్ స్కిన్ మార్పిడి యూనిట్ కు రూపకల్పన చేసిన
మా దాసు బావకు మీ అందరి తరుఫున అభినందనలు తెలియజేస్తున్నాను.

Monday, November 14, 2011

పుస్తకాలే మంచి నేస్తాలు !!

కొన్నివేల సంవత్సరాల పైగా నాలుగు వేదాలు, ఉపనిషత్తులు,అష్టాదశ
పురాణాలు ఈ నాటికీ సజీవంగా ఉన్నాయన్న విషయం అందరికీ
తెలిసిందే. ముద్రణా సౌకర్యాలు లేని ఆ కాలంలో ఒకరి నుంచి మరొకరు
నేర్చుకుంటూ ధారణ శక్తి ద్వారా వీటిని సజీవంగా నిలుపుకుంటూ
వచ్చారు. ఇలా వేదాలు చెప్పేవారిని వేదంవారని, రెండు వేదాలు చెప్పే
వారిని ద్వివేదులవారనీ, మూడు వేదాలపై పట్టుగలవారిని త్రివేదులనీ,
నాలుగు వేదాలు చదివిన వారిని చతుర్వేదులనీ పిలిచేవారు. అలాగే
పురాణాలను ప్రజలకు తెలియజెప్పేవారు పురాణం వారుగా వాడుకలోకి
వచ్చారు. అటుతరువాత వాటిని లిఖితరూపంగా రాళ్లమీద, రాగి రేకుల
పైనా, తాటాకుల మీద, అటు తరువాత కాగితం మీద వ్రాయటం ,ముద్రణా
యంత్రాలు వచ్చాక పుస్తక ప్రచురణ మొదలయింది. ఇప్పుడు డిజిటల్
రూపంలో మన సాహిత్యమంతా నిక్షిప్తమవుతున్నది.
ముద్రణ ప్రారంభమయ్యాక ఎందరో మేధావులు, రచయితలు వెలుగులొకి
వచ్చి పాఠకులకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు. వేలాది
సంవత్సరాలనాటి చరిత్ర, నాగరికత ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి ఈ
గ్రంధ ముద్రణ ఎంతగానో తోడ్పడింది. చరిత్రను ఒకసారి చూస్తే అశోకచక్రవర్తి,
విలియం కేరీ లాంటి మహా వ్యక్తులను మనం తప్పక తలచుకోవాలి. ఆశోకుడు
పాళి లిపిని అభివృద్ధి పరచి బౌద్ధమత ప్రచారం కోసం, అహింసా ధర్మాన్ని
చాటటంకోసం శాసనాలు వ్రాయించి లిపిని ప్రచారంలోకి తెచ్చాడు. బైబిల్
ప్రచారంకోసం తెలుగులో 1746-47లో జర్మనీలో బ్లాక్సు సాయంతో అచ్చు
వేయటం జరిగింది. 1901లో విలియం కెరీ కలకత్తా దగ్గరలోని శ్రీరాంపూర్
లో మిషన్లో కూర్చే అచ్చు అక్షరాలు తయారు చేసి సీసంతో పోత పోయించాడు.
అలా ఆనాడు చేతి కంపోజింగు మొదలయింది. మొట్టమొదట బైబిల్ అచ్చయినా
అటుతరువాత వ్యాకరణం, కధల పుస్తకాలు, వాచకాల ముద్రణ మొదలయింది.
19వ శతాబ్దం నుంచి తెలుగు పుస్తకాల ప్రచురణ ప్రారంభమయింది. వావిళ్ళ,
వెంకట్రామా అండ్ కో, రామా అండ్ కో మొదలయిన సంస్థలు పుస్తక ప్రచురుణ
ద్వారా అపార సేవలు అందించాయి. దాదాపు అదే కాలంలో అద్దేపల్లి వారిచే
రాజమండ్రిలో సరస్వతీ పవర్ ప్రెస్ స్థాపించ బడింది. చాలా కాలం వరకు ఆ
ప్రెస్ లో ఆంధ్రా యూనివర్సిటీ వారి పాఠ్య పుస్తకాలు అచ్చయేవి. విశాలాంధ్ర,
నవయుగ, , నవోదయ, యం.శేషాచలం & కో వారు వారి ప్రచురణలతో పాఠకుల
అభిరుచిని పెంచారు. ఎమెస్కో సంస్థ ఇంటింటా గ్రంధాలయం అనే స్కీమును
ప్రారంభించి , "పుస్తక ప్రపంచం" అనే పత్రికనుకూడా ప్రారంభించింది. ఈ బుక్
క్లబ్ లో చేరి అతి తక్కువ ధరకు పుస్తకాలు పొంది పాఠకులు ఇంటింటా స్వంత
గ్రంధాలయాన్ని ఏర్పరుచుకొన్నారు.

టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాక పాఠకుల్లో పఠనాశక్తి తగ్గింది. కానీ ఈ మధ్య
పుస్తకాలు, పత్రికలపై ఆదరణ పెరుగుతుండటం శుభసూచకం. స్నేహితులకు,
ఆప్తులకు వివిధ సంధర్బాలలో పుస్తకాలనే కానుకగా ఇచ్చే అలవాటును చేసు
కోవాలి. పిల్లలకు మంచి పుస్తకాలు కొని చదివే అలవాటును కలిగించాలి.
ఈ రోజు నుండే గ్రంధాలయ వారోత్సవాలు మొదలవుతున్నాయి. ఈ రోజు ఓ
మంచి పుస్తకం తీసి "కొని" చదువుదాం !!
పుస్తకాల కార్టూన్ మితృలు శ్రీ సరసిగారి ( నవ్య వార పత్రిక) సౌజన్యంతో.
ఈ పుస్తకాలయం నాకున్న అతి ఇష్టమైన విలువైన ఆస్ఠి. ఈ పుస్తకాల
మధ్య గడుపుతుంటే నాకు కాలమే తెలియదు.

Friday, November 11, 2011

శివనామాలు- ఈనాటి తారీఖు !!




శివనామాలు మీకు తెలుసుగదా! ఈ మాసం అంతా శివనామ స్తోత్రాలతో
భక్తులు పరవశిస్తారు. ఈ రోజు ప్రత్యేకత ఏమంటే , ఈ రోజు తేదీని చూశారుగా!
11౦11౦11 . ఈ తారీఖు అంకెలను నిలువుగా త్రిప్పి చూడండి. శివనామాలుగా
అ(క)నిపిస్తాయి !




ఇలా తారీఖుల తమాషా గతనెలలోనూ జరిగింది. అదే 9-10-11 .
ఆ రోజునాటికి నేను విశాఖపట్నం లోవున్నాను. నేను వస్తున్నట్లు
కార్టూనిష్టు మితృలు శ్రీ పుక్కెళ్ళ రామకృష్ణ గారికి తెలియజేస్తే ఆయన
నన్ను కలిసి ఆయన గ్రాఫిక్స్ లో తయారు చేసిన నా బొమ్మను కానుకగా
అందజేశారు. ఈ రోజు 11-11-11 న ఆయన రాజమండ్రికి మా ఇంటికి
సతీసమేతంగా రావలిసి వున్నా అనుకోని పని వత్తిడి వల్ల రాలేకపోతున్నట్లు
చెప్పారు. ఈ రోజు మేము కలిసి వుంటే మరో విశేషంగా వుండేది.

Wednesday, November 09, 2011

కత్తిరింపులతో ఇంపైన చిత్రాలు.

ఇక్కడి వివిధ జంతువుల బొమ్మలను చూశారుగా ! జీవం ఉట్టిపడుతూ
అగుపిస్తున్నాయికదూ ! నిజానికి వీటిని వేయడానికి ఆ చిత్రకారుడు
సన్నని క్రోక్విల్ కలాన్ని కానీ, బ్లాకింకును గానీ ఉపయోగించలేదంటే
మనం నమ్మ గలమా ? !


ఈ బొమ్మలు వేయడానికి ఉపయోగించినది సన్నని పదునైన చాకుని
అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
నల్లని కాగితాన్ని తీసుకొని తను వేయదలచిన బొమ్మను స్కెచ్ గా గీసి
అటుతరువాత అతి నేర్పుగా , ఓపికగా కత్తిరించేవాడు!!.



ఇంతకీ ఈ అద్భుత చిత్రకారుని పేరు యుగోమోచీ . ఇటలీలో జన్మించిన
ఈయన తన నాలుగవ ఏటి నుంచే ఇలా ఈ కత్తిరింపుల బొమ్మలను
తయారుచేయడం మొదలెట్టాడట ! ఆ వయసు పిల్లలు కాగితాలు చింపి
పోస్తే ఈ అబ్బాయి కాగితాలు చింపి అద్బుత చిత్రాలు సృష్టించాడు.

" Hoofed Mammals Of The World" పేరుతో T.Donald Carter
వ్రాసిన గ్రంధంలో యుగోమోచీ సృష్టించిన అధ్బుత కత్తిరింపుల చిత్రాలతో
ప్రచురించబడింది. ఆ పుస్తకం ప్రచురించినప్పుడు యుగోమోచీ వయసు
63 సంవత్సరాలు. ఇది 61 ఏళ్ళ క్రితం నాటి మాట. మానాన్నగారు
తయారు చేసిన 195౦ నాటి ఆల్బమ్ తిరగేస్తుంటే ఈ బొమ్మలు
కనిపించాయి. అమెరికెన్ పత్రిక LIFE లో ఈ బొమ్మలు ప్రచురించారు.
మన తెలుగు వాళ్ళల్లో వెల్లటూరు పూర్ణానంద శర్మ గారు ఇలాటి
కత్తిరింపు చిత్రాలు వేయగా ఆనాటి ఆంధ్రవార పత్రికలో ప్రచురించబడ్డాయి.

Tuesday, November 08, 2011

బిక్కవోలు శ్రీ లక్ష్మీగణపతి స్వామి

ఈ దేవాలయం కాకినాడ, రాజమండ్రి కెనాలురోడ్డు లో అనపర్తికి 10 కిలో
మీటర్ల దూరంలో ఉన్న బిక్కవోలులో వుంది. 1100 సంవత్సరాల చరిత్రగల
దేవాలయంలో స్వయంభువుగా వెలసిన అతి పెద్ద వినాయకుని శిలాప్రత్రిమ
భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది.
తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు ఒకనాడు బిరుదాంకినవోలు. తూర్పు
చాణుక్యులు 849-892 ప్రాంతంలో పలు దేవాలయాలు నిర్మించారు. ఈ
దేవాలయంలోని అతి పెద్ద విగ్రహం భూమి అడుగున ఎన్ని అడుగుల లోతు
వరకు వున్నదో తెలియదు శ్రీ లక్ష్మీగణపతి నిజరూపంలో నాగాభరణం, నాగ
యజ్ఞోపవీతం, నాగ మొలత్రాడు తోసుఖాసనం మీద కూర్చొని భక్తులకు
దర్శనమిస్తారు. ఈ విగ్రహం నిత్యం పెరుగుతూ వుందని చెబుతారు. స్వామికి
ప్రతీనెల అమావాస్య వెళ్ళిన నాలుగవరోజున శుద్ధ చవితినాడు లక్షపత్రి పూజ
నిర్వహిస్తారు. భక్తులు తమ కోర్కెలను స్వామి వారి చెవిలో చెప్పుకుంటే ఆ
కోరికలు తప్పక తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


శ్రీ లక్ష్మీగణపతి దేవాలయానికి సమీపంలోనే గోలింగేశ్వర స్వామి ఆలయం
వుంది.ఇందులో శ్రీ సుబ్రహ్మన్యేశ్వర ఆలయంలో పుట్ట వున్నది. ఆ పుట్ట
మన్నును భక్తులు మహిమగలదని స్వీకరిస్తారు.ఈ దేవాలయ ప్రాంతంలో పెద్ద
సొరంగ మార్గం వుండేదనీ ఆ మార్గాన్ని అప్పటి బ్రిటిష్ పాలకులు "బిగ్ హోల్"
అని పిలిచేవారనీ, ఆ ఆంగ్ల పదాన్ని స్థానిక ప్రజలు బిక్కవోల్ అని పలికేవారనీ ,
అప్పటి నుండి ఆ ప్రాంతం బిక్కవోలుగా పిలవబడుతున్నదనీ కొందరు చెబుతారు.

Saturday, November 05, 2011

గొల్లలమామిడాడలో అద్దాల రాముడు !!


తూర్పుగోదావరి జిల్లాలో గల గొల్లలమామిడాడ అనే ఊర్లో 1889 లో
శ్రీ సీతామహాలక్ష్మి, శ్రీరామచంద్రమూర్తి అనే చిన్న కోవెలలను ద్వారపూడి
వంశస్థులు నిర్మాణం చేశారు. అటుతరువాత ఆలయానికి తూర్పు వైపున
160 అడుగుల ఎత్తు గోపురం, ఆ తరువాత పశ్చిమాన 200 అడుగుల
ఎత్తుగల గోపురం 1969లో నిర్మించబడింది. సిమెంటు స్లాబులతొ తొమ్మిది
అంతస్తులతో చక్కని శిల్పాలతో నిర్మించిన ప్రతి అంతస్థుకు బాల్కనీతో
మెట్లద్వారా పైకి వెళ్ళగలిగే సౌకర్యంతొ నిర్మించబడింది.
గోపురం పైన సిమెంటుతో తయారుచేసిన దేవతామూర్తుల శిల్పాలు
కనులవిందు కలిగిస్తాయి.


శ్రీ కోదండరామచంద్రమూర్తిని దర్శించుకోడానికి వచ్చిన భక్తులు స్నానం
చేయడానికి, స్వామివారి వసంతోత్సవ సమయాన చక్రస్నానమునకు,
క్షీరాబ్దిద్వాదశినాడు తెప్పోత్సవం జరపడానికి శ్రీరామ పుష్కరిణి నిర్మాణం
జరిగింది
ఇక ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ స్వామివారి అద్దాలమేడ. ! ఇందులో
పెద్దహాలులో వివిధ కోణాలలో అమర్చిన అద్దాల ద్వారా శ్రీరామ పట్టాభిషేక
శిల్పాలు వివిధ దృశ్యాలుగా అగుపిస్తాయి. ఒక చోట నిలబడిన హనుమ
కనిపిస్తే మరో కోణంలో కూర్చున్న హనుమ అగుపిస్తారు. ఈ అనుభూతిని
ప్రత్యక్షంగా చూసి ఆనందించాలేగని వివరించలేము. ఈసారి మీరు అవకాశం
దొరికినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక దర్శింఛండి.