Wednesday, March 31, 2010

గుళ్ళూ-గోపురాలు: ర్యాలి




తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కోనసీమలోని
కొత్తపేటకు పది మైళ్ళ దూరానగల ర్యాలి అనే ఊర్లో జగన్మోహినీ కేశవస్వామి తప్పక చూడ
దగ్గ గుడి. అధ్యాత్మక చింతనకు కళ తోడైతే ఎంత అద్భుతంగా వుంటుందో అన్నదానికి ఈ
ఆలయమే సాక్షి.
ఐదు అడుగుల ఎత్తుగల జగన్మోహినీ విగ్రహం నిగనిగ లాడుతూ నల్లటి శిలతో చెక్క
బడింది.ఆ శిల్ప సౌందర్యం స్వయంగా చూడవలసినదే గాని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు.
కేశవస్వామి చేతులు,పాదాలు,ప్రతి అవయవము ఎంతో సహజముగా చెక్కడం చూస్తే ముగ్ధు
లవుతాము.అరచేతుల్లోని రేఖలు, మెడ మీది మడతలు,చేతి గోళ్ళూ,ఒకటెమిటి ప్రతిదీ ఓ
అద్భుతమే!ఇక ఆ మూర్తి పాదాలనుంచి ఉద్భవించే జలం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.
నిత్యం కొంచెం కొచెంగా చెమరించే స్వామి పాదోదకం గంగా తీర్ధంగా భావిస్తారు.మరో విశేషమేమంటే
విగ్రహం వెనుక భాగం మోహినీ రూపంగా చెక్కబడింది!ఆమె సిగ అలంకారాలు నిజమా అన్నట్లు
చెక్కిన శిల్పి చాతుర్యం అమోఘం.పద్మినీ జాతి స్త్రీకి ఉండే పుట్టుమచ్చ కాలి పిక్క మీద మనం
చూడవచ్చు.
కొత్తపేటకు వెళ్ళాలంటె రాజమండ్రి స్టేషన్లో దిగి అక్కడే ఆగే బస్సుల ద్వారా సులువుగా వెళ్ళొచ్చు.
మరో విశేషం విగ్రహంలోని ప్రతి భాగాన్నీ పూజారులు మనకు దీపం వెలుగులో శ్రద్ధగా చూపిస్తారు.

Tuesday, March 30, 2010

జ్ణాపకాలు-"తోకచుక్క"




1953 నవంబర్ చందమామ దీపావళి ప్రత్యేక సంచికలో 'పొట్టి పిల్ల' అనే కధ
మొట్టమొదటి సారిగా రంగుల్లో ప్రచురించారు.చందమామ బొమ్మలను రెండు రంగుల్లో
చూసే మాకు, అలా ఆ కధ బొమ్మలను రంగుల్లో చూడటం ఎంతో సంతోషం కలిగించింది.
1954 జనవరి నెల సంపాదకీయంలో 'తోకచుక్క' రంగుల్లో వేయగలిగాం అని వ్రాసినప్పుడు
మా ఆనందానికి హద్దులు లేవు.ఆ సీరియలుకు ఆర్టిస్ట్ 'చిత్రా' అద్భుతమైన బొమ్మలు
వేశారు.ఆయన చందమామ ప్రారంభించినప్పటి నుంచి (1947 జూలై) బొమ్మలు వేసారు.
1975లో ఆయన కీర్తిశేషులయ్యారు.ఇక ఈ సీరియలును రచించినది శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం.
తరువాత శ్రీ దాసరి చందమామలో అనేక సీరియలు కధలు రచించారు.

చిత్రా గారి బొమ్మలు చూస్తుంటే నిజంగా ఆ దృశ్యాలు మన కల్లెదుట ఉన్నట్లుగానే ఉంటుంది.
అలానే శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనా నైపుణ్యానికి 'చిత్ర'బొమ్మలు వన్నె తెచ్చాయి.
ఆ ఇద్దరు మహానుభావులు ఈ నాడు మన మధ్య లేక పోవటం బాధాకరం.ఈ కారణ జన్ములు
ఏ నాటికి చిరంజీవులే!


Monday, March 29, 2010

ఆ నాడు--ఈనాడు






ఈనాడు తెలుగు దేశం అవిర్భావ దినోత్సవమని పేపర్లలో చదివి మొదటి సారి
తెలుగు దేశం గెలిచినప్పటి "ఈనాడు" పేపర్ను బయటికి తీసాను.ఆనాడు
పేపర్ మూడు కేంద్రాలనుంచే ప్రచురించబడేది.అప్పటికే (1983) అత్యధిక
సర్కులేషన్ గల పత్రికగా పేరు పొందింది.ఖరీదు 50 పైసలు. ఆనాటి
జ్ణాపకాలను మీతో పంచుకోవాలని ఆనాటి "ఈనాడు" ను ఈనాడు మీ ముందుకు
తెచ్చే ప్రయత్నం చేశాను.అదండీ సంగతి.

హనుమత్ జయంతి-మార్ఛి 29,30? జూన్ 7 ?!



హనుమత్ జయంతి పంచాంగాలలో చూస్తుంటే రకరకాల తేదీలు అగుపిస్తున్నాయి.
భగవంతుడికి భక్తుల దృష్టిలో నిత్యం జన్మదినాలే!ఆంజనేయుని జయంతి ఎప్పుడైనా
ఆయన కరుణా కటాక్షాలు మన అందరిపైనా సదా ఉండాలని కోరుకుందాం.
ఈ సంధర్భంలో హైదరాబాదు పాత బస్తీలో గొడవలు చెలరేగటం బాధాకరం.ఎందుకో
నాకు గతంలో ఓ ముఖ్య మంత్రిని దింపటానికి జరిపిన ప్రయత్నాలే మరో సారి మరో
కుతంత్రం జరుగుతుందోమోనని సందేహం కలౌగుతున్నది.ఇది నిజం కాకూడదని మన
రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని హనుమాన్ దేవుని ప్రార్ధిద్దాం.

హనుమంతుడు మొదటి సారిగా శ్రీ రాముణ్ణి కలసి మాటలాడినప్పుడు, రాముడు
లక్ష్మణునితో ఇలా అంటాడు." హనుమంతుడు వాక్యజ్ణుడుగా కనపడుతున్నాడు.
నీవు ఇతనితో మధురముగా మాట్లాడవలెను. ఋగ్యజుస్సాను వేదాలు మూడింటినీ
అధ్యయనము చేయనివాడు ఇతనివలె మాట్లాడలేడు. ఇతడు వ్యాకరణాన్ని అంతా
అనేకసార్లు తప్పకుండా చదివి ఉంటాడు.అందువల్లనే ఇతడు ఇంతసేపు మాట్లాడినా
నోటివెంట ఒక్క అపశబ్దమూ రాలేదు.ఆపి ఆపి మాట్లాడలేదు. గబగబా మాట్లాడలేదు.
సందిగ్ధముగా మాట్లాడలేదు.హృదయములోనుంచి కంఠగతము అయిన మాటలను
మధ్యమ స్వరములో అన్నాడు.వ్యాకరణ సంస్కారముతో అక్షరక్రమముగా దబదబ
కాకుండాను, జాగుచేయకుండాను మనోహరముగా మాటలు ఉచ్చరించినాడు. హృదయములో
ఏ దోషమూ లేకుండానూ,కంఠము కంపించకుండాను,తల ఆడించకుండానూ ఎంత చిత్రముగా
మాట్లాడినాడు! ఇట్లా మాట్లాడితే శత్రుత్వముతో చంపవలెను అని కత్తి ఎత్తినవాడు సయితము
సంతోషించి వదలిపెట్టుతాడు.ఇటువంటి గుణవంతులూ,కార్యసాధకులూ అయిన దూతలవల్లనే
ఏ రాజుకు అయినా సర్వార్ధాలూ సమకూడుతవి"అన్నాడు
( శ్రీ శ్రినివాస శిరోమణి వచన రచన వాల్మీకి రామాయణం నుండి )
హనుమంతుడు ఎంతటి విజ్ణాణ వంతుడో వాల్మీకి అద్భుతంగా తెలియచేశాడు.
హనుమత్ స్తుతి
బుద్దిర్బలం యశోధైర్యం
నిర్భయత్వం మరోగతా
అజాడ్యం వాక్పటుత్వంచ
హనుమత్ స్మరణాధ్బవేత్

Sunday, March 28, 2010

దేశ విదేశీ నవ్వుల పత్రికలు-పుస్తకాలు


" నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు...
పువ్వుల వోలె ప్రేమ రసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే నవ్వులు సర్వ దు:ఖ
దమనంబులు వ్యాధులకున్ మహౌషధములు" అన్నారు జాషువా.
మన తెలుగు వాళ్ళం నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్నాం.చిలకమర్తి,మొక్కపాటి,
భమిడిపాటి కామేశ్వరరావు,వాళ్ళబ్బాయి రాధాకృష్ణ,మన ముళ్లపూడి వెంకట రమణ,
ఎవరు పెట్టినా పెట్టక పోయినా ఇబ్బంది లేకుండా పేరుకు ముందే "శ్రీ" చేర్చుకున్న
శ్రీ రమణ,నండూరి,రావి కొండలరావు ఇలా ఎందరో మహానుభావులు! కానీ మనకు
హాస్య పత్రికల కొరత ఇంకా తీరలేదు. గతంలో మా రాజమండ్రి నుంచి "నవ్వులు-పువ్వులు",
"జోకర్"," హాస్యం", ఆవతలి ఒడ్డు కొవ్వూరు నుంచి "పకపకలు" వెలువడెవి.ఇటీవల
వరకు విజయవాడ నుంచి "హస్యానందం' వచ్చేది.ఎందుకో కనుమరుగైంది. గతంలో ఆంధ్ర
వార పత్రిక వినాయక చవితికి హాస్య ప్రత్యేక సంచిక ప్రచురించేది.1963లో బాపు రమణల
మిత్ర బృందం "జ్యోతి" మాస పత్రికను కధలతో బాటు ప్రతి పేజీలోనూ మంచి మంచి కార్టూన్లు,
జోకులు,ఆరుద్ర అచ్చు తుప్పులు,పఠాభి పంచాంగం ( పంచాంగం అంటే జ్ణాపకం వచ్చింది.ఓ
ఉగాదికి నవ్వుల పంచాంగం అనుభంధంగా వేశారు).1964లో "జ్యోతి"లో జోకులూ,కార్టూన్లు
గట్రా చోటు చేసుకున్న "రసికజన మనోభిరామము" అను యన్టూవో అన్న పుస్తకాన్ని అచ్చు
వేసి అభిమానుల మీదికి వదిలారు. 88 పెజీల పైగా వున్న ఆ పుస్తకం ధర 1964లో ఒకే
ఒక్క రూపాయి !! తమిళంలో "ఆనంద వికటన్" అనే పత్రిక ఇప్పటికీ వస్తున్నది.భాష రాక
పోయినా అందులోని గోపులు గారి కార్టూన్లు చూసి ఆనందించే వాళ్ళం. తమిళ హాస్య నటుడు
చో రాజకీయ పత్రిక "తుగ్లక్" కూడా తమిళనాడు లో ప్రాచుర్యం పొందింది.ఇంగ్లీష్ లో "మాడ్"
(బ్రిటిష్)పత్రిక పారడీ కార్టూన్లతో ,పేజీలు మడత పెడితే బొమ్మల భావాలు మారి పోయే బొమ్మల
(వి)చిత్రాలతో వెలువడుతుంది.ఈ పత్రికను అనుకరిస్తూ ఢిల్లీ నుంచి "దివానా" అనే పేరుతో ఇంగ్లీష్,
హిందీలలో ఓ పత్రిక కొంత కాలం వెలువడింది.అలాగే అమెరికా నుంచి "పంచ్" పేరుతో హాస్య
పత్రిక వస్తున్నది
"జ్యోతి" నుంచి ఆనాటి బాపు కార్టూన్, 'మాడ్' ,'పంచ్' పత్రికల బొమ్మలు చూడండి.
మరి ఈ రోజుకు ఉంటాటాటాటా టా టా టా...........మరునాడు కలుసుకుందామా మరి.!!

Saturday, March 27, 2010

అర్ధాంగిని అర్ధం చేసుకోవడం ఎలాగో బ్నిం చెప్పారు !




శ్రీ " బ్నిమ్ " గారిని కార్టూనిస్ట్ గా తెలుసు.అలానే మంచి రచయితగా,హ్యూమరిస్ట్ గా కూడా
తెలుసు కదా?! గత ఆగస్ట్ లో నేను శ్రీ బాపు రమణ గార్లను కలిసినప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ డే
శుభాకాంక్షలు అని వ్రాసి సంతకం చేసి ఓ పుస్తకం కానుకగా ఇచ్చారు. నిజంగా అది ఓ అద్భుతమైన
కానుక.ఇంతకీ ఆ పుస్తకమే శ్రీ బ్నిమ్ వ్రాసిన మిసెస్ అండర్ స్టాండింగ్. అర్ధాంగిని అర్ధంచేసుకున్న
సంసారాలు సరసంగా సాగిపోతాయో బ్నిమ్ అధ్భుతంగా చెప్పారు.ఇందులో సంకురాత్తుళ్ళు తో మొదలెట్టి
గుడ్నైట్ తో ముగించారు.ఒక్కోటి రెండు మూడు పేజీలకన్న వుండవు. అప్పుడే ఐపోయిందే అనిపిస్తుంటాయి.
ప్రతి అధ్యాయానికి బాపు గారి బొమ్మలు బోనస్! ఆయన గీసిన ముఖ చిత్రం కొసరు! చిన్న మచ్చు తునక.
' దసరా చీర '.అర్ధాంగులు ఏ చీరను ఏ బీరువాలో అట్టడుగున దాస్తారో భర్తలు ఎంక్వయిరీ చేయకూడదు.
ఫలానా చీరే కట్టుకో మని అడగకూడదట. ఎందుకంటే ఒక్కో చీరకు ఒక్కో ఫ్లాష్ బాక్ వుంటుందట! ఇలాటివి
తెలుసుకోవాలంటే మీరీ పుస్తకం కొనేసుకొని చదివేసుకొని దాచేసుకోండి. విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలోను ఈ
నవ్వుల పుస్తకం నవ్వుతూ మిమ్మల్ని పలకరిస్తుంది.

Friday, March 26, 2010

కార్టూనా? కళాఖండమా?!!



స్వాతి సపరివార పత్రిక వారం వారం బాపు గారి పంచ(వర్ణ)రత్నాల
కార్టూన్లను ప్రచురిస్తుంది. ఈ వారం ( 2-4-2010) సంఛికలో
ఐదు కార్టూన్లు దేనికదే బాగున్నా ఇక్కడ మీరు ఛూస్తున్న కార్టూన్
చూస్తే అందులో మీకు ఓ చక్కని కార్టూనే కాకుండా ఓ రంగుల వర్ణ
చిత్రం అగుపిస్తుంది. సినీమాల్లో చిన్న వేషాలేసి చిన్న ఊర్లో విశ్రాంతి
తీసుకోంటున్న ఓ పెద్దాయన మంఛంమీద దర్జాగా చుట్ట లాగిస్తూ,కాలు
మీద కాలు వేసుకుని పదుకుంటే ఆయనగారి ఇల్లాలు మాత్రం సిటీ
లైఫే బాగుందని అంటున్నది. ఇక బొమ్మ చూడండి. గోదారొడ్డూ,ఓ
రాదారి పడవ, దూరాన కొండలు, నదిలో వాటి నీడలు, ఒడ్డున
ఏసీ లాంటి చక్కని కుటీరం,ముందర ముత్యాల ముగ్గులు,అరటి చెట్లు,
చల్లని నీడనిచ్చే వృక్షాలు, ఒరల బావి, ప్రక్కనే పందిరీ,దానిపై అల్లుకున్న
పాదూ,క్రింద హాయిగా నెమరవేస్తున్న ఆవు,పైన ఓ అందాల నెమిలి,
జింక పిల్ల, పావురాలు, ప్రక్క చిన్న చిన్న పూల మొక్కలు,కొందల
చాటున సూర్యుడు ( ఇంకా నేనేమైనా మర్ఛి పోతే మీరు చెప్పాలి),ఓహ్
నిజం మర్ఛే పోయా, కాలు జాపుకుని పిండి విసురుతున్న ఇల్లాలు.
ఈ బొమ్మకు వాడిన వివిధ రంగుల శొయగాలు! ఆ బొమ్మలోని ఇల్లాలన్నట్లు
ఎన్ని చెప్పండి, బాపు గారి బొమ్మలకు లెదు లేదు సరి సాటి.!!
మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? మీరు మాంఛి టేస్టున్నవారు.
అవునే అంటారు!
ఇంత మంచి కార్టూన్ స్వాతి ద్వారా అందించినందుకు స్వాతి బలరాం
గారికి కృతజ్ణలతో...

Thursday, March 25, 2010

నలభై ఏళ్ల క్రితం కార్టూన్ ముఖచిత్రంగా వేసిన ఆంధ్ర వార పత్రిక




ఇప్పుడు ఏ వార పత్రిక చూసినా అట్టమీది బొమ్మ గ్లామరస్ హీరోయిన్ బొమ్మే
అగుపిస్తుంది. అదీ సాధ్యమైనంతవరకూ సెక్సీగా వుంటుంటుంది.ఈ పోటీ ప్రపంచంలో
నెగ్గుకు రావటానికి ఇదో మార్గం గా అగుపించక తప్పడం లేదు. పత్రికలోపలి
అంశాల కంటే పై బొమ్మను చూసే కొనే పాఠకులు ఎక్కువయ్యారు. పాటలు ఎలా
వున్నా కవరు పై హీరో బొమ్మ చూసి కాసెట్ట్స్,సీడీలు కొంటున్నట్లు !
ఈ కవరు పేజీ దాదాపు నలభై ఏళ్ళ క్రితం ఆంధ్ర సచిత్ర వార పత్రికది.బొమ్మ గీసింది
మన బాపూ గారు. సన్నగా బక్కగా వున్న పెళ్ళికొడుకు మెళ్ళో పెళ్ళి కూతురు దండ
వేస్తే అది వరుడి భుజాల మీంచి జారి క్రింద పడిపొతే వధువు వింతగా చూస్తున్నది !!
ఇలా కార్టూన్లను ముఖ చిత్రాలుగా ఇల్లస్త్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రిక కూడా వేసే
ఆనవాయితీ వుండేది. మేరియో మిరాన్డా, ఆర్కే.లక్ష్మన్ కార్టూన్లను ముఖచిత్రాలుగా
ప్రచురించారు.కార్టూనిస్ట్ బి.వీ.సత్యమూర్తి గారి కార్టూన్ ముఖఛిత్రాలుగా ఆంధ్ర వార
పత్రిక ప్రచురించింది.. మళ్ళీ ఈ వరవడిని స్వాతి లాంటి పత్రికలు ప్రారంభిస్తాయని
ఆశిద్దాం.

Wednesday, March 24, 2010

SRI RAMA KADHA







మన బ్లాగర్లందరకీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు. నిన్ననే మన బ్లాగరు శ్రీమతి జ్యోతి గారు
శ్రీ రామ నవమి సంధర్భంలో రామచంద్రుడి గురించి, సీతమ్మ తల్లి గురించి ఎన్నో మంచి
విషయాలు చెప్పారు. శ్రీ జేసుదాసు పాడిన రాముడి పాటలు వినిపించడమే కాకుండా
చూపించారు. ఈ రోజు నేనూ శ్రీ రాముడిని తలచుకుంటూ కొన్ని విషయాలు చెబుతాను.
శ్రీ రాముడు తెలుగువాళ్ళ ఆరాధ్య దైవం.మా చిన్నతనంలో వెంకట్రామా అండ్ కో వారి తెలుగు
వాచకం మొదటి పేజీ లో ఈ పద్యం వుండేది.

శ్రీ రామ జయ రామ శృంగార రామ
కారుణ్య గుణధామ కల్యాణ రామ
కౌశల్య వర పుత్ర కమనీయ గాత్ర
కరునించి మమ్మేలు దశరధ రామ.

ఎన్నో ఏళ్ళయినా ఇంకా నాకా పద్యం గుర్తుండి పోయింది. మన బాపు రమణ గార్లకు రాముడంటె
ఎంతో భక్తి. సీతా కల్యాణం, సంపూర్ణ రామాయణం,లాంటి పౌరాణిక చిత్రాలే కాకుండా రాముణ్ణి
ఆయన కధ్నాల్నీ సంఘిక చిత్రాల్లోనూ చూపించారు. ముత్యాలముగ్గు,అందాలరాముడు,రామబంటు,
సుందరకాండ మొదలయినవి. బాపు రమణ గార్లు శ్రీరామ అని వ్రాయకుండా కలం పెట్టరు.శ్రీ బాపు
నాకు వ్రాసిన ఓ ఉత్తరం లో శ్రీరాముడి బొమ్మ అలవోకగా బాల్ పెన్నుతో గీసింది ఈ పేజీలో మీరు
చూస్తారు. ఇక రాముడి పాత్రను యన్టీయార్ కన్న ముందే అక్కినేని 1944 వచ్చిన సీతారామ జననం
చిత్రంలో నటించారు. ఆ ఫొటొ చూడండి. శ్రీ బాపు కుంచె నుంచి వెలువడిన మరి రెండు బొమ్మలు
మీ కోసం.

Tuesday, March 23, 2010

హాసం క్లబ్ లో విరిసిన నవ్వులు



మా హాసం క్లబ్ గురించి ఇదివరలో చెప్పాను.2004 ఉగాది నాడు నేనూ ,నా బ్యాంకు కొలీగ్
మా ఫామిలీ మితృడు దినవహి వెంకట హనుమంతరావు కలసి హాసం క్లబ్ ప్రారంభించాము. మా ఇద్దరకీ హాస్య మంటే ఎంతో
ఇస్టం. నాకు కార్టూన్లు గీయడం పవృత్తి ఐతే ,హనుమంతరావుకి హాస్య ప్రసంగాలు,రచనలు
చేయటం అభిలాష. హాసం క్లబ్ నిర్వహణలో సహకరించే మరో మితృడు రెటైర్డ్ పోస్ట్మాస్టారు
ఖాదర్ఖాన్. రాజమండ్రిలో నెలలో మూడో ఆదివారం వచ్చిందంటే హాస్య ప్రియులందరికీ నవ్వుల
మూడోచ్చేస్తుంది.ఎందుకంటే ఆ రోజు హాసం క్లబ్ కార్యక్రమాలు జరిగే రోజు !ఈ కార్యక్రమాల్లో
వయసుతో సంభంధంలేకుండా అన్ని వయసులవారు, స్త్రీలు,పురుషులు పాల్గొని జోకులతో
నవ్విస్తారు, పాటలతో మెప్పిస్తారు. రాస్ష్ట్ర వ్యాప్తంగా వున్న హాసం క్లబ్ లలో స్కిట్స్ రాజమండ్రి
ప్రత్యేకత. హనుమంతరావు సతీమణి శ్రీమతి విజయలక్ష్మి స్వయంగా పాటలు పాడటమే కాకుండా
తన శ్రీవారితో కలిసి స్కిట్స్ లో ఉత్సాహంగా నటిస్తారు. హనుమంతరావు స్వయంగా వ్రాసి వాళ్ళిద్దరూ
నటించిన "మొబైల్ నర్సరీ" మీ కోసం...
భార్య: ఏమండీ-కూర ఏం చేయమంటారు ?
భర్త ; ఎందుకు నన్ను అడుగుతావు- నీ కిస్టమైనది చెయ్యి.
భార్య: ఏమిటండి అలా అంటారు?
భర్త : అవును.నువ్వు అనుకున్న కూర తరగవు.తరిగిన కూర వండవు-వండిన కూర పెట్టవ్.
భార్య: వండిన కూర పెట్టనా?
భర్త ; అవును, అది రాత్రి సావకాశంగా తింటారని చేశాను.ఈ పూటకి పచ్చడితో సర్దుకోండని
ఎన్ని సార్లు నువ్వు అనలేదు.ఎన్ని సార్లు నేను సర్దుకోలేదు.
భార్య: మీరెప్పుడూ ఇంతే !
భర్త : సర్లే , నే స్నానం చేసేస్తాను.తలకు కొంచెం నూనె రాస్తావా?
భార్య: నూనా?
భర్త : అదేమిటీ నూనె రాయమంటే అంత పెద్ద ఎక్స్పెరెషన్ ఇచ్చావు.
భార్య: ఈ రోజు తలకు నూనొద్దండి, ప్లీజ్.
భర్త : అదేం !ఇప్పటికే పెళ్ళాం చేత ఏ పనీ చేయించుకోలేవు,తెలివి తక్కువ దద్దమ్మ-పెళ్ళానికి
తెలివిగాఅ సమాధానం కూడా చెప్పలేవు,మట్టి బుర్ర వెధవా, అని మా అమ్మ అస్తమానం
తిడుతుంది తెలుసా?
భార్య: అత్తగారు మిమ్మల్ని మట్టి బుర్ర వెధవా ( లెంపలు వేసుకుంటూ) అంటున్నారు కదా ?
అందుకే మీరు రాత్రి పడూకున్నాక ధనియాలు చెప్పుతో నూరి మీ బుర్ర మీద చల్లి పైన నీళ్ళు
చల్లాఅ.
భర్త : అలా ఎందుకే ?
భార్య: మీది మట్టీ బుర్ర ఐతే కొత్తిమీర మొలకలు రావాలి కదా! అలా రావు.ఎంచక్కాఅ మీది మట్టీ బుర్రా
కాదని తేలిపోతుంది.
భర్త : నిజమే అనుకో.కొంపతీసి ఒక వేళ మొలకలొచ్చేస్తేనో?!
భార్య: వచ్చేస్తే ఇంత చింత పండేసి పచ్చడీ చేసేస్తాను. తరువాత మీ బుర్ర మీద చెరువు మట్టి వేసి తూగో జిల్లాఅ
మంచి నర్సరీ పెట్టేస్తా! మొబైల్ నర్సరీ! పేరు బాగుందీ కదండీ.ఏ సెంటర్లో నుంచున్నా డబ్బులే డబ్బులు !!
భర్త : ఓసి నీ అసాధ్యం కూలా!
భార్య: ఐనా నా పిచ్చి కానీ, నాఅ కంత అదృస్టం కూడానా?!

Monday, March 22, 2010

తెలుగోడి గోడు






తెలుగోడి గోడు

అదేమిటొ గాని తెలుగంటే మన తెలుగువాళ్లకే చిన్న చూపు.ఎవరైనా తెలుగులో మాట్లాడుతున్నాడంటే
అతను ఎంత ఉన్నత చదువులు చదివిన వాడైనా ఏవీ రాని అనాముకుడిక్రిందే లెక్క కడతారు మన
తెలుగు వాళ్ళు. ఈ మధ్య మనం వార్తల్లో చదువుతూ,వింటూ వున్నాం. బడిలో తెలుగు మాట్లాడారని
పిల్లల్ని ఘోరంగా శిక్షిస్తున్నారట ఉపాధ్యాయులు. ఇక ఇంట్లో అమ్మా, నాన్నలకు మమ్మీ, డాడీ అని
పిలిపించుకోవడమే ఎంతో గొప్ప. మా చిన్నప్పుడు మా నాన్నగారి స్నేహితులను మావయ్య గారు, అత్తయ్య
గారూ అని పిలిచే వాళ్ళం. ఇప్పుడొ మరోలా అనుకోకపోతే , ముష్టి వాళ్లను కూడా అంకుల్ అని పిలుస్తున్నారు
ఈ కాలం పిల్లలు ! నాకొక తృప్తి ఏమిటంటే మా మనవళ్ళు (చెన్నై), మనవరాలు (ముంబాయి) వాళ్ల
అమ్మా నాన్నలను అలానే పిలుస్తారు. గత కొద్ది నెలలుగా "ఈనాడు" జిల్లా సంచికలలో రోజుకో తెలుగక్షరం
చొప్పున బొమ్మల ఆకారంతో వేస్తున్నారు. వాటిని జాగ్రత్తగా కత్తిరించి పుస్తకంలో అంటించి పెడుతున్నాను.
వేసవి సెలవులకు పిల్లలు వచ్చినప్పుడు వాటిని చూపించి తెలుగక్షరాలు వాళ్ళకి నేర్పాలని నా ఆశ !
టీవీల్లో మన తెలుగు వాళ్ళను పరిచయం చేస్తున్నప్పుడు అదేమిటో వాళ్ళు సాధ్యమైనంత ఎక్కువగా
ఇంగ్లీషే మాట్లాడుతుంటారు. తెలుగు మాట్లాడిన కొద్ది సేపు అండ్ అన్న మాట తరచు ఉపయోగిస్తుంటారు!

ఏనుగు బొమ్మను ఏ , ను , గు , అనే అక్షరాలతో ఏనుగు ఆకారంలో వేస్తే కాన్వెంట్ కుర్రాడు తెలుగులో
వుండబట్టి ఆ బొమ్మ ఏమిటొ కనుక్కోలేక పోతున్నాడని ఓ కార్టూన్ గీశాను. ఎలాఅ వుందో మీరే చెప్పాలి.
అదండీ సంగతి !!

Sunday, March 21, 2010

అలనాటి ( 1966 ) నా కార్టూన్ జ్ణాపకాలు




44 ఏళ్ళ క్రితం నేను బాపట్ల స్టేట్ బ్యాంక్ లో కాషియర్ గా పనిచేస్తున్న రోజుల్లో
నేను వేసిన ఈ కార్టూన్ ఆంధ్రప్రభ వీక్లీలో పడింది. ఈ కార్టూన్ 2008 లో అచ్చయిన
" సురేఖార్టూన్స్" పుస్తకంలో మరోసారి చూసిన మితృలు శ్రీ జయదేవ్ చాల మెచ్చుకున్నారు.
ఆ నాడు అచ్చయినప్పటి కంటే శ్రీ జయదేవ్ బాగుంది అన్నప్పుడు ఎన్నో రెట్లు ఆనందించా .
నాకు కాప్షన్ లేకుండా వుండే కార్టూన్లంటే చాలా ఇస్టం. వీటిని సైలెంట్ కార్టూన్లంటారు. శ్రీ
జయదేవ్ గారి సైలెంట్కార్టూన్ వెబ్ ఛూడండి.

రెండు బొమ్మలేసి పైన హాస్య సంభాషణ వ్రాసే కార్టూన్లే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి.
కనీసం ఆ హాస్యానికి సంభందించినది ఆ బొమ్మలో మనకు కనిపింఛాలి. ఇలాటి కార్టూన్ల
లో మన బాపు గారు, జయదేవ్ గారు, సరసి గారు ముందుంటారని వేరే చెప్పలా ?

Saturday, March 20, 2010

పిచ్చుకమ్మా రావమ్మా




పిచ్చుకమ్మా రావమ్మా
ఓ నాడు ప్రతి ఇంట్లో సందడిగా కిచ కిచారావాలతో అద్దమ్ ముందు కూర్చొని తన
అందాలను చూసుకుంటూ సంబరపడే పిచ్చుకమ్మ ఇప్పుడు అగుపించడమే లేదు.
పెరిగిపోయిన కాలుష్యం, సెల్ టవర్లు, బహుళ అంతస్తుల నివాసాలు వాటిని మన
నగరాలనుంచి దూరం చేశాయి. ఇక గ్రామాలలో పైరులకు వాడే క్రిమి సంహారక
మందులు కూడా వాటి సంతతి తగ్గిపోవడానికి మరో కారణం. కానీ విచిత్ర మేమిటంటే
ఎప్పుడూ బిజీగా వుండే ముంబాయిలో (ముఖ్యంగా నవీ ముంబాయిలో) పిచ్చుకలను
చూసాను.ఈ రోజు ( పిచ్చుకల రోజు ) మా అబ్బాయి శాయి కి ఫోన్ చేస్తే ,పిచ్చుకలు
ఉన్నా యని చెప్పాడు.ఆ పిచ్చుకల మీద నేనో బుల్లి కవితను వ్రాసాను. నా గురించి
కాకపోయినా ఆ చిన్నారి పిచ్చుకల కోసమైనా భరిస్తారని తలుస్తాను.

మన ఊర్లో మచ్చుకైనా అగుపించని చిన్నారి పిచ్చుక !
ముంబాయి మహా నగరంలో హుషారుగా గెంతులేస్తున్నది పిచ్చుక !!
ఓ పిచ్చుకమ్మా ! మా ఊరికి ఓ సారి వలస రావమ్మా !!
ఫాన్ రెక్కలతో నీ రెక్కలకు అపాయమని కాబోలు నీకు భయం !!
కరెంట్ కోతతో తిరగని ఫాన్ రెక్కలు నీ కిస్తాయిలే అభయం !!
మా ఊరికి ఓ సారి రావమ్మా!! ఓ పిచ్చుకమా !!!



పిచ్చుకమ్మా రావమ్మా

Friday, March 19, 2010

నవయుగ వైతాలికుడు కందుకూరి






నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం

వేదంలాంటి గోదావరి తీరంలో ఎందరో పండితులూ, కవులూ, కళాకారులూ, కధానాయకులూ
జన్మించారు. అలానే ఈ గోదావరి ఒడ్డునున్న రాజమహేంద్రవరం(రాజమంద్రి)లోనే రాజరాజ
నరేంద్రుడు ఆదికవి నన్నయ చేత మహాభారత రచనకు శ్రీకారం చుట్టించాడు. అలాటి ఈ
సాహిత్య నగరంలో 16-4-1848 లొ ఈ యుగపు సంఘసంస్క్రర్త కందుకూరి వీరేశలింగం
జన్మించారు. 1919 లో మరణించే వరకూ కందుకూరి కలం,గలం తోటి మానవ హితం గురించే
సాగిపోయింది. ఆ రోజుల్లో ముక్కుపచ్చలారని బాలికలను పమ్డు ముసలి వాళ్ళకి భార్యలుగా
కట్టబెట్టడం, బలవంతపు వితంతు దుర్దశలకు గురిచేయడం,చదువుకొనే అవకాశాలు కలుగ చేయక
పోవడం లాంటి దుర్మార్గపు పనులతో స్త్రీలోకం ఆహుతి అయ్యేవారు. కందుకూరి గోదవరి గడ్డపై
జన్మించేవరకు స్త్రీలగురించి పత్తించుకొనే నాధుడే లేకపోయాడు.తల్లి,చెల్లి,ఆలి ఐనా స్త్రీ పురిషుని
ఆధీనంలో వుండవలసిన వస్తువుగా తలచేవారు.ఆ రోజుల్లో స్త్రీ వంటింట్లో,పడకటింట్లో పనిచేసే ఓ
యంత్రంగా భావించేవారు.ఇలాటి మూఢాచారాలకు అడ్డుకట్ట వేసిన సాహసి కందుకూరి వీరేశలింగం.

ఆయన తెచ్చిన సంఘసంస్కరణలు చీకటిలో మగ్గే స్త్రీమూర్తులకు వెలుగు దారిలో నడిపించింది.
కందుకూరి చిన్నతనంలోనే అన్యాయాలపై,అవినీతిపై తిరుగుబాటు చేసే ధైర్యం అబ్బింది.న్యాయం కోసం
తను నమ్మే మంచికోసం బడిలో గురువులనే ఎదురించేవాడు.టీచరుగా ఉద్యోగంలో చేరటానికి మంచి
రోజు చూడకుండా అమావాస్యనాడు చేరాడు.చిన్నతనంలోనే కవిత్వంపై ఆశక్తి చూపించి మార్కండేయ
శతకం,గోపాలశతకమ్ చాలా చిన్న వయసులోనే రచించారు.సంస్కృతం నుంచి కాళిదాసు నాటకాలను
అనువందించారు.భారతగాధ "దక్షిణగోగ్రహణం" 1885లో తొలిసారిగా రచించారు.స్త్రీలకు అకాలంగా
ప్రాప్తిస్తున్న బాల వైధవ్యాలకు కారణం చదువులేకపోవడమేనని భావించి మొదటిసాఅరిగా బాలికల
పాఠశాల ధవళేశ్వరంలో ప్రారంభించారు.1874 లో స్త్రీల ప్రయోజనం కోసం " వివేక వర్ధని "అనే
పత్రికను ప్రారంభించారు.1881లో మొదటి వితంతు వివాహం జరిపించారు.పునర్వివాహం అవకాశం
లేని వారి కోసం వితంతుశరణాలయం స్థాపించారు.యువకులు,పెద్దలు సమావేశమై చర్ఛించుకోవడానికి
పురమందిరం స్థాపించారు.వీటి అన్నిటి నిర్మాణానికి తన ఆస్తిపాస్తులను వెచ్చించారు.ఆయన రచీంచిన
నవల " రాజశేఖర చరిత్ర" దూరదర్శన్ సప్తగిరిలో వచ్చింది.ఆ నవల అత్యంత ప్రజాదరణ పొందింది.
ఆయన పేరిట రాజమండ్రిలో వీరేశలీంగ ఆస్తికోన్నత పాఠశాల నిర్మింపబడ్డది.ఇలా ప్రజలకోసం,ముఖ్యంగా
స్త్రీల కోసం పాటుబడిన మహావ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు.ఈ ఫొటోలలో మీరు చూస్తున్న
గృహం హితకారిణి సమాజం ప్రార్ధనామందిరం.ఆయన నిర్మించిన పురమందిరంలో ఓ గ్రంధాలయం వుంది.
"కాళాగౌతమి" లాంటి సాహిత్య సభలు జరుగుతూ వుంటాయి.

Thursday, March 18, 2010

ఎవరీ బాల ? ఏమా కధ ? పందొమ్మిది వందల నలభై ఏడు, ఏప్రియల్ "బాల" సంచికలోని "తెనుగు దేశం" సంపాదకీయం (తెలుగువారికి ప్రత్యేక రాస్ట్రం) గురించి




ఎవరీ బాల ? ఏమా కధ ?

పందొమ్మిది వందల నలభై ఏడు, ఏప్రియల్ "బాల" సంచికలోని "తెనుగు దేశం"
సంపాదకీయం (తెలుగువారికి ప్రత్యేక రాస్ట్రం) గురించి చెఫ్ఫాను. అసలీ "బాల" పత్రిక
గురించి ఈనాటి తరం వారికి కొందరికి తెలియక పోవచ్చు. "చందమామ" కు ముందు
"బాల" పత్రిక పందొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో పిల్లలకోసం శ్రీ న్యాయపతి
రాఘవరావు, శ్రీమతి న్యాయపతి కామేస్వరి గార్లచే ప్రారంభించబడింది. వీళ్ళెవరో తెలియని
వాళ్ళుండవచ్చోమోగాని బాలన్నయ్య,బాలక్కయ్య (రేడియో అన్నయ్య,ఆక్క్యయ్య) అంటె
ఆ తరం వాళ్ళమైన మాకు ముఖతా పరిచయంలేకపోయినా "బాల" ద్వారా, "బాలానందం"
రేడియో ప్రొగ్రాముల ద్వారా బాగా తెలుసు. ఆదివారం వచ్చిందంటే భాలానందం ప్రొగ్రాముల
కోసం ఎదురుచూసే వాళ్ళం.. ఆ రేడియో కర్యక్రమాలలో "పొట్టిబావ-చిట్టి మరదలు","మొద్దబ్బాయి"
లంటే చెవి కోసుకొనేవాళ్ళం. శ్రీ బాపు గారు గీసిన మొదటి బొమ్మ, శ్రీ ముళ్లపూడి గారి మొదటి
రచన "బాల " మొదటి సంచిక ( పందొమ్మిది వందల నలభై ఐదు) లో ప్రచురించారు !! " బాల"
లో రచనలన్నీ దేనికదే ప్రత్యేకత !! తెలుగుని ఇంగ్లీష్లో ఇప్పుడు వ్రాస్తున్నాం. యాభైరెండు జూన్
సంచిక సంపాదకీయం "ఆంగ్లం అక్షరాలలో తెలుగు " ఆ రోజుల్లోనే ప్రయోగం చేశారు. వడ్డాది
పాపయ్య గారు " లటుకు-చిటుకు " శిర్షికకు బొమ్మలేసేవారు..ఇక రాము-సోము "," సరళ-
విమల" లాంటి శీర్షికలు ఎంతో బాగుండేవి. ఆ బాల పత్రికలు చందమామ పత్రికలలా జాగ్రత్త
చేసుకోలేదే అని బాధ పడుతుండెవాడిని. "రచన" శాయి గారు ఆ లోటును తీర్చారు, "బాల ":
అభిమానులకోసం నాలుగు సంపుటాలుగా " బాల విహంగ వీక్షణ సంపుటి" ని ఆనాటి బాల
పేజీలు ఎలా వుండెవో అలాగే విడుదల చేశారు. మీరు తప్పక కొని చదివి ఆనందించండి.

తెనుగు దేశం

తెనుగు దేశం-- తొలి ముఖ్య మంత్రి టంగుటూరి ప్రకాశం
ఈ బాల లోనే ఇంకోచోట "తెలంగాణాలో కోటి మంది ఆంధ్రులు" అన్న రచన పడింది. అది చదివితే నైజాం
సంస్తానంలో మన తెనుగు వారు పడుతున్న కస్టాలు తెలుస్తాయి. అలాగే మన తెలుగు దేశం కొంత భాగం
ఒరిస్సా రాస్ట్రంలో కలసిపోయి,అక్కడ మనతెనుగువారు చాలా కస్టాలు పదుతున్నారు. మైసూరు రాజ్యంలో
కొన్నిభాగాలు తెనుగువారివి. ఈ "బాల" పుట్టిన ఈ చెన్నపట్టణం కూడా తెలుగువారిదే. ఇలాగ మన తెలుగు
దేశం అంతా ఒక రాస్ట్రంగా లేక ముక్కలు ముక్కలుగా వేరు వేరు రాజ్యాలలో వుంది. ఈ చెన్నపట్టణంలో
చూస్తే మన తెనుగువారు సుమారు అయిదారు లక్షలమంది వున్నారు. తెనుగు పిల్లలు చదువుకోవాలంటే
అరవం నేర్పే బడులలో చదువుకోవాలి. తెనుగు నేర్పే బడులు చాలా తక్కువ. మన రాజ్యం ఇతరుల చేతులలో
వున్నంతకాలం మనకు ఈ కస్టాలు తప్పవు. చీలిపోయిన మన తెనుగు సీమలన్నీ కలిపి ఒక రాస్ట్రంగా ఏర్పడితే
మన దేశం,మన భాష, మన వర్తకం అభివ్రుద్ధిజెంది మనం హాయిగా వుంటాం. తెనుగు బాల బాలికలందరూ
"మాకు ప్రత్యేక రాస్ట్రం కావాలి" అని సభలు చేసి, అలజడి చేయాలి. మనకి ప్రత్యేక రాస్ట్రం వచ్చేవరకు ఊరుకోకూడదు.
ఇదంతా పందొమ్మిది వందల నలభై ఏడు,ఏప్రియల్ నెల "బాల" పిల్లల సంచికలో బాలన్నయ్య వ్రాసిన
సంపాదకీయం అంటే మీరు నమ్ముతారా?! ఇప్పుడు మళ్ళి ప్రత్యేక రాస్ట్రమంటూ గొడవలు మొదలెట్టారు. మనకు
మొదటి ముఖ్యమంత్రిగా చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన యావదాస్తిని దేశం కోసం ఖర్చు చేశారు.
ఇంకో విషయం. ఆయన మా రాజమండ్రి మునిసిపాలిటీలో చైర్మన్ గా పనిచేశారు.

దేముడే దిగివచ్చిన వేళ !!








సాధారణంగా వివాహాలు దేముడి సన్నిధిలో చేయలని కొందరు నిర్నయిస్తుంటారు.
ఏ అన్నవరం సత్యనారయణ స్వామి వారి గుడిలోనో,తిరుమలలో ఏడుకొండలవాడి
సన్నిధిలోనో చేస్తుంటారు. మా రాజమండ్రి లోని ఓ ప్రముఖులు తమ ఇంటిలోని
పెళ్ళికి సాక్షాత్తూ ఆ ఏడుకొందలస్వామి దేవాలయాన్నే రాజమండ్రి లో ప్రతి సృష్టి
చేశారు ! ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గుడి సెట్టింగ్ వేసి కళ్యాణం జరిపారు. ఆ తరువాత
ప్రజలు వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలు కల్పించారు. ఓ ఐదు రోజుల పాటు టిటిడీ
అధ్వర్యంలో పూజలు ,అన్నమాచార్యుడి కీర్తనలు,హరి కధలు ఏర్పాటు చేసారు. ఓ పెళ్ళిని
ఇలా ప్రజలందరూ ఆనందించేటట్లు చేయడం అభినందనీయం.ఏమంటారు.

Wednesday, March 17, 2010

లక్ష్మణ రేఖలు






ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ పూర్తి పేరు రాసిపురం క్రిష్ణస్వామి లక్ష్మణ్.
ఆయన పుట్టిన మైసూర్ లోనే విద్యాభ్యాసము చేశారు. విద్యా పూర్తయిన తరువాత
బొంబాయిలోని ఫ్రీప్రెస్ జర్నల్ వార్తా పత్రికకు కార్టూనులు గీయటం ప్రారంభించారు.
తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు కార్టూన్ ఎడిటరు గా ఉద్యోగంలో చేరారు.
శ్రీ లక్షణ్ తన సోదరుడు ఆర్కే నారాయణ్ లాగే ఎన్నో కధలు, వ్యాసాలు, టూరిజం
పై వ్యాసాలు రచించారు. "హోటల్ రివిరియా","ది మెసెంజర్" అనే నవలలు వ్రాసారు.
" ది టనల్ ఆఫ్ టైమ్ " పేరుతో ఆత్మ కధ రచించారు. పద్మభూషన్ ఎవార్డ్ ఆయన్ని
వరించింది. మరట్వాడా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ తో సత్కరించింది.
ఇంకా ఏసియన్ టాప్ జర్నలిజం ఎవార్డ్, రొమొన్ మెగసెస్ ఎవార్డ్ పొందారు !!
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆయన అనుదినం గీసే పాకెట్ కార్టూన్లలో తప్పని సరిగా
కామన్ మాన్ పాత్ర ఏదో ఒక చోట తప్పక అగుపిస్తుంది. ఆ పాత్ర విగ్రహాన్ని అవిష్కరించారంటె
ఆయన పాఠకుల హ్రుదయాల్లో ఎంతగా చొచ్చుకు పోయాడొ తెలుస్తుంది.

Tuesday, March 16, 2010

వ్యంగ చిత్ర మారార్ఠీ మాంత్రికుడు శ్రీ యస్.ఫడ్నీస్








వ్యంగ చిత్ర మారార్ఠీ మాంత్రికుడు శ్రీ యస్.ఫడ్నీస్
మహరాషట్రకు చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ యస్.ఫడ్నీస్ గీసిన వ్యంగ చిత్రాలు
చూసి ఆనందించాలంటే మనకు మరార్ఠీ భాష రానవసరం లేదు. ఆయన బొమ్మల్ని
ఏ దేశం వాళ్ళాయినా ఏ భాష మాట్లాడే వారైనా చూసి నవ్వకుండా ఉండలేరు!
ఏ మంటే ఆయన బొమ్మలన్నీ మూకీలే ! అంటే బొమ్మల్ని చూడగానే అందులోని
వ్యంగ్యం అర్ధమైపోతుంది. ప్రముఖ సినీ దర్శకులు శ్రీ సింగీతం శ్రినివాసరావు గారు
ఇలాటి కార్టూన్ చిత్రాల పుస్తకన్నీ చూసి, మాటల్లేకుండా సినిమా ఎందుకు తీయ
కోడదనే ఆలోచన వచ్చి"పుష్పక విమానం" సినిమా తీశారట. నిజానికి వ్యంగ్య
చిత్రలంటె ఇలానే ఉండాలని మీరు ఫడ్నీస్ బొమ్మలు చూశాక తప్పక అనుకుంటారు !!