Saturday, December 31, 2011

నేనూ-నా కార్టూన్ల పుస్తకం


 నేను కార్టూన్లు గీయటం నా SSLC క్లాసు నుంచే మొదలయినా పత్రికలో
                 మొట్టమొదటిసారి అచ్చయింది ఆంధ్రసచిత్రవార పత్రికలో 1958 లో.అంతకు
                  ముందు పట్టువదలని విక్రమార్కునిలా పంపేవాడినికానీ అంతే వేగంగా
                తిరుగు టపాలో తిరిగి వచ్చేవి. కార్టునిష్టులకు ప్రొత్సాహాన్నిచ్చిన మొదటి
                తెలుగు పత్రిక ఆంధ్రపత్రిక వీక్లీ. ఆ సంస్థ ప్రచురించే భారతి సాహిత్య మాస
                పత్రికలో మొట్టమొదటి తెలుగు కార్టూనిష్టు శ్రీ తలిశెట్టీ రామారావు గారి
                కార్టూన్లు 1931 నుంచే ప్రచురించే వారు . 1954లో ఆంధ్రవారపత్రిక దసరా
                సంచికకోసం పిల్లలకు బొమ్మల పోటీ పెడితే నేనూ, మా చెల్లి (కస్తూరి),
                అప్పుడు దాని వయసు పదేళ్ళు, బొమ్మలు పంపాము. "నేనూ, మాసంగీతం
                మాష్టారు" అన్న అది గీసిన బొమ్మకు ప్రధమ బహుమతి వచ్చింది, నా బొమ్మ
                తిరిగి వచ్చింది. చివరకు 1958 లో " నిశ్శబ్దం" అన్న నా సైలెంట్ కార్టూన్
                అచ్చయి ముచ్చటగా మూడు  రూపాయలు పారితోషికం వచ్చింది.
 అటు తరువాత  ఆంధ్ర వారపత్రికతో బాటు ఆంధ్రప్రభ , స్వాతి,ఆంధ్రజ్యోతి,
                ఆంధ్రభూమి పత్రికలలో నా కార్టూన్లు రావడం మొదలయింది. బాపు రమణ
                గారి రచనలు ఆంధ్రపత్రిక వీక్లీలో ఎక్కువ వచ్చేవి. శ్రీ బాపు అప్పుడప్పుడు
                "రేఖ" అనే పేరుతో కూడా వేసేవారు. ఆపేరుకు నేను "సు" చేర్చి సురేఖ
                కలం పేరుతో వేయడం మొదలెట్టాను. ఆ రోజుల్లో ఇండియన్ ఇంకుతో
                మాత్రమే బొమ్మలు వేయాలని నియమం వుండేది. ఎంతో కష్టపడి బొమ్మ
                వేసి, సన్నని క్రొక్విల్ పాళీ ఇంకులో ముంచి బొమ్మను దిద్దగానే ఇంకు
                ఒక్కసారిగా బొమ్మమీద ముద్దలా పడేది. నిజంగా ఏడుపొచ్చినంత
                పనయేది. నవ్వులు-పువ్వులు అనే హాస్య పత్రికలో నా కార్టూన్లు,
                పజిల్స్ రెగ్యులరుగా అచ్చయేవి. అటుతరువాత  మద్రాసు నుంచి ప్రచురించే
                "కినీమా" అనే సినిమా వార పత్రికలో ప్రతి వారం నేను సినిమా పజిల్
                నిర్వహించే వాడిని.



                2008లో మా ఇద్దరమ్మయిలు, అబ్బాయి నా కార్టూన్లతో ఓ పుస్తకం వేద్దామని
                నన్ను ఒప్పించారు. మా హాసం క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో హాసం పత్రిక
                స్థాపకులు, శాంతా బయో యండీ పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డిగారు నా
                "సురేఖార్టూన్స్" పుస్తకాన్ని అవిష్కరించారు. ఆ పుస్తకానికి ఆభరణం
                శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు వ్రాసిన "జూబిలీబాయ్" జిందాబాద్ అంటూ
                వ్రాసిన ముందు పలుకులు. నా పుస్తకంలో రమణగారి ముందుమాట చదివిన
                మితృలు, ప్రముఖ కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ ఇలా అన్నారు" ముళ్ళపూడి
                వారి చేత ముందు మాట రాయించారు. ఎంత ముచ్చటగా పొందికగా వ్రాశారో.
                కార్టూన్ పుస్తకాలకి ముందుమాట రాయగలిగిన ఏకైక రచయిత ఆయనే.
                ఆ విధంగా మీరు చాలా అదృష్టవంతులు" ఈనాడు కార్టూన్ ఎడిటర్ శ్రీ శ్రీధర్
                గారు నా పుస్తకం ఆసాంతం శ్రర్ధగా చూశారు.మితృలు కార్టూనిస్ట్ సరసిగారు
                నా కార్టూన్ల పుస్తకం అందుకొని తన ఉత్తరంలో ఇలా అన్నారు"....ఈ సంవత్సరం
                నా రెండో పుస్తకం తెచ్చేప్రయత్నంలో ఉన్నాను. దానికి శ్రీ ముళ్లపూడివారి
                చేత ముందు మాట రాయిద్దాం అనుకున్నా, అయితే మీ పుస్తకం గడపకే
                రమణగారి తోరణాలు కట్టేసున్నాయి. ’ఆరిమీ’ అనుకున్నాను" ఇందరు
                ప్రముఖుల ఆదరాభిమానాలు అందుకున్న ఓ సామాన్యునిగా నేను దన్యుణ్ణి.


రాజమండ్రిలోని మా మితృలు డా"జోగేశ్వరరావుగారు వారి అమ్మాయి దగ్గరకు
                అమెరికా వెళుతూ వెంట నా సురేఖార్టూన్స్ పుస్తకాలు తీసుకొని వెళ్ళి అక్కడి
                స్నేహితులకు నా పుస్తకాలు అందజేశారు. ఏవిటీ వీడి సొంత గోల అనుకోకండి.
                నా అనుభూతులను ఆత్మీయులైన మీ అందరితో పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ
                కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పంచుకుంటున్నాను.

Thursday, December 29, 2011

శ్రీరామరాజ్యం చూశారా !

 నిన్న మాటినీకి "శ్రీరామరాజ్యం" చూడటానికి నేనూ,నా శ్రీమతి మా
                     సన్నిహిత మితృలతో వెళ్ళాము. అక్కడ నాకు పరిచయం వున్న
                     ఒక ఆయన సకుటుంబంగా ఎదురుపడ్డాడు. సాధారణంగా సినిమా
                     హాల్లో కనిపించగానే " సినిమాకేనా ?" అనే షరా మామూలు ప్రశ్న
                     కాకుండా   "శ్రీరామరాజ్యం" సినిమాకేనా ?"   అన్నా,ఏమంటే ఆ
                     ధియేటర్ కాంప్లెక్స్లో ఇంకా రెండు మాస్ మసాలా సినిమాలు ఆడు
                     తున్నాయి. ఆయన సమాధానం నాకు ఆశ్చర్యం, మరింత బాధ
                     కలిగించింది. " ఎబ్బే, ఇంకా ఈ పౌరాణికాలేం చూస్తాం. మాకే ఇష్టం
                     లేనప్పుడు ఈ పిల్లలు ( వాళ్ళకు 9,11 ఏళ్ళ వయసుంటుంది )
                     చూస్తారటండీ. అసలే ఇవి కంప్యూటరు రోజులు! స్టంట్లూ,డాన్సులూ
                     అసలు మజా లేక పోతే అస్సలు చూడరు " అన్నాడు. ఇలాటి
                     మహానుభావులున్నప్పుడు పిల్లలకు మన పౌరాణిక కధల గురించి
                     మంచి ప్రవర్తన, కుటుంబ అనుబంధాల గురించి ఎలా తెలుస్తుంది.
                     ఏదైనా పిల్లలు నేర్చుకొనేది అమ్మా నాన్నల నుంచే కదా ?


శ్రీరామరాజ్యం సినిమా చూడకుండానే మరికొందరు " అబ్బే, నయన
                     తార సీతేమిటండీ, అవ్వ !"అనీ "సింహా" లాటి సినిమాల్లో వేసిన బాల
                     కృష్ణ రాముడా ? "అన్న వాళ్ళూ చాలామంది ఉన్నారు. అలా అన్న
                     ఒకాయనే సినిమా చూసివచ్చి "ఏదో అనుకున్నా సుమాండీ ! బాపూ
                     గారు ఆ నయనతారను సీతగా ఎంత చక్కగా చూపించాడో, అయోధ్య
                     ఇలా వుండేదా అన్నట్లు ఆ సెట్టింగులూ కన్నుల పండుగచేశాయి!
                     బాలకృష్ణ కూడా కొన్ని చోట్ల వాళ్ల నాన్న రామారావుని  గుర్తోచ్చాలా
                     చేశాడు సుమా " అని అన్నాడు.


                     ఎందుకోగానీ మన తెలుగు వాళ్ళు కొంతమంది పనిగట్టుకొని బాపూ
                     రమణల ఈ సినిమాపై  మొదటినుంచీ కావాలనే నెగటివె టాక్ ను
                     ప్రచారం చేశారేమోనని అనిపించింది. ఇదే సినిమాను ఏ హిందీ
                     నిర్మాతో తీసివుంటే మన వాళ్ళు " ఆహా ! ఓహో ! " అంటూ పొగిడే
                     వారన్నది నిజం !     వాల్మీకి మహర్షి లవకుశులను రామాయణం
                     నుంచి    ఏమి తెలుసుకున్నారని ప్రశ్నించి వారి చేత రామాయణ
                     కావ్య  అనౌత్యాన్ని చెప్పించిన తీరు ప్రశంశనీయం. శ్రీ ముళ్ళపూడి
                     బాపులకు శ్రీ రాముడన్నా, రామాయణ మన్నా ఎంతో ఇష్టం. కవరు
                     మీద ఎడ్రస్ వ్రాసినా ,   ఓ పుస్తకం మీద సంతకం చేసినా  శ్రీ రామ
                     అని వ్రాయకుండా వుండరు. ఈ చిత్రాన్ని అందించిన శ్రీ యలమంచిలి
                     సాయిబాబా, సంగీత దర్శకుడు ఇలయరాజా, గేయరచయిత జొన్న
                     విత్తుల , కమేరామేన్ రాజు, కళాదర్శకులు ఇతర సాంకేతిక నిపుణులు
                     తెలుగుతెరకు  ఒక కమణీయ క్లాసిక్ ను అందించి   ధన్యులయ్యారు.
                     ఇలాటి చిత్రాలను ఆదరించి ఇలాటి మరిన్ని మంచి చిత్రాలనిర్మాణానికి
                     పొత్సాహాన్ని అందించడం మన తెలుగు వారి ప్రతి ఒక్కరి కర్తవ్యం.

Tuesday, December 27, 2011

ముద్దు-ముచ్చట

 కొన్నిటిని చూడగానే ముద్దొస్తుంటాయి. చిట్టి చిట్టి పాపాయిలే కాదు, బుజ్జి బుజ్జి
            కుక్కపిల్లలు కూడా ముద్దొస్తాయి!. కాకి పిల్ల కాకికి ముద్దంటారు. మా చిన్న
           తనంలో ఇంగ్లీషు సినిమాల్లో తప్పక ముద్దుల దృశ్యాలుండేవి. ఆ సీన్లొచ్చి
           నప్పుడల్లా ముందు క్లాసుల నుంచి ఈలలు గోలలూ ! ఇప్పుడు వాటిల్లో
           కన్నా మన సినిమాల్లోనే ముద్దులు అంతకన్నా ఘోరంగా శృంగార దృశ్యాలు
           ఉంటున్నాయి. ఇదివరలో మన సినిమాల్లో నాయకీనాయకుల మధ్య ముద్దు
           లను చూపాలంటే సింబాలిగ్గా రెండుపూలు గాలికి కదలి రెండూ దగ్గరైనట్లు
           చూపించే వారు. "పెళ్ళికానుక" సినిమాలో హీరో హీరోయిన్ల స్టాండ్ వేసిన
           సైకిల్ హ్యాండిల్స్  కదలి రెండు ముందు చక్రాలు కలసినట్లు చూపించారు.
            కలవరి డి పాటతో పాప్యులరయిన "త్రీ" చిత్రంలో నటిస్తున హీరో ధనుష్
           భార్య ఐశ్వర్య  హీరో హీరోయిన్ శృతిఃహాసన్ల మధ్య ముద్దు ముచ్చట్లను
           స్వయంగా దర్శకత్వం వహించడం ఇప్పుడో పెద్ద వార్త. ఇప్పుడు ముద్దుల పై
          మన ఆంధ్రప్రదేశ్ మంత్రులకు మోజు ఎక్కువయిందనడానికి ఇటీవల ఓ
          సభలో ఇద్దరు మంత్రులు ఒకరినొకరు ముద్దులతో ముంచెత్తుకున్నారని
          పత్రికలలో వార్తలతో బాటూ ఫొటోలూ చూశాం. అదృష్టవశాత్తు వాళ్ళిద్దరు
          మగ మహారాజులే !!.ఈ విషయంపై ఈనాడు శ్రీధర్ ఓ మంచి కార్టూన్ కూడా
          వేశారు.ఓ దివంగత ముఖ్య మంత్రి ప్రజలకు ఫైయింగ్ కిస్సులిచ్చేవాడు!



          1961లో న్ను కొన్న KISS ME , YOU FOOL  అన్న కార్టూన్ పుస్తకం
          నుంచి కొన్ని కార్టూన్లు మీ కోసం. ఈ పుస్తకం అట్ట మీద లిప్స్ బొమ్మ ప్లాస్టిక్
          ప్లేట్ మీద వుండేది. పుస్తకాన్ని కదిపితే ఆ అధరాలు ముద్దుకు రెడీ అన్నట్లు
          కదిలేవి. ఆ పుస్తకాన్ని ఎరువు తీసుకొన్న ఓ పెద్ద మనిషి ఆ లిప్స్ బొమ్మను
          ఊడగొట్టి ఇచ్చాడు. ఇక సినిమా పాటల్లో " అడగక ఇచ్చిన మనసే ముద్దు
          (దాగుడు మూతలు,) "ము ము ము ముద్దంటే చేదా" (అదృష్టవంతులు),
          " ఇవ్వు ఇవ్వు ఒక ముద్దు " (ప్రేమ) ఇలా ముద్దులపై పాటలూ వచ్చాయి.
          ముక్తాయింపుగా ఓ ముద్దు జోకు:
             "చూడండి! ఆ ఎదురింటాయన ఆఫీసుకు వెల్తూ భార్యకు ఓ ముద్దిచ్చి
              వెళ్తాడు.  మీరూ వున్నారు " అంది భార్యామణి రాగాలు పోతూ.
            " నాకభ్యంతరం లెదే ! వాళ్ళాయన చూస్తే బాగుండదేమో" అన్నాడు
              భార్యతో.
               ఈ ముద్దోచ్చే కార్టూన్ బాపు గారికి కృతజ్ఞతలతో.

Monday, December 26, 2011

వడ్దాది పాపయ్య రంగుల చిత్రాల హరివిల్లు

 శ్రీ వడ్డాది పాపయ్య  19వ వర్ధంతి నేడు.

            వపాగా ప్రఖ్యాతి పొందిన శ్రీ వడ్డాది పాపయ్య అలనాటి" బాల" పిల్లల పత్రికలో
            లటుకు చిటుకు శీర్షికకు బొమ్మలు వేశారు చందమామ పత్రికలో 1960నుంచి
             1991 వరకూ దాదాపు 470 పైగా ముఖచిత్రాలను చిత్రించి చందమామకు
           ఆకర్షణగా నిలిచారు. చక్రపాణి గారి సంపాదకత్వాన హైద్రాబాదునుండి వెలువడిన
           "యువ" మాసపత్రికలో ఎన్నో చిత్రాలను ముఖచిత్రాలుగా, లోపలి కవరు పేజీలలో
           చిత్రించారు




Saturday, December 24, 2011

బాపూ రమణీయం !!




ఈ బాపూరమణీయం రెండు దశాబ్దాలక్రితం నవో (వ్వో)దయ వారు , ఏప్రియల్
1990 లో అచ్చోసి అభిమానులపైకి వదిలారు. యాభైలనాటి సినిమా రివ్యూలు
కార్టూన్లు, కార్ట్యూన్లు, జోకులు, మకతికలు, వగైరా కలిపి పాఠకులను రంజింప
చేసింది అపురూప పుస్తకం. దీని ఖరీదు మామూలు ఎడిషన్ అరవై రూపాయలు,
మేలు ప్రతి ధర ( గట్టి అట్టతో బైండింగు చేసినది) ఎనభైఐదు రూపాయలు. ఆ నాటి
శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు వ్రాసిన అద్భుత చనత్కారాల సమీక్షలు,జోకులు,
బాపు గారి కార్ట్యూన్లు,కార్టూన్లు ఎన్నెన్నో!

పుస్తకం వెనుక కవరు పై బాపుగారు, రమణగారు ఇలా వ్రాసారు :
నలభై ఏళ్లనాటి రాతలూ గీతలూ
దులిపి బజార్లో ఆరెయ్యడం
కల్తీలేని అహంకారం
-కొందరు
కాదులే పాపం !-మమకారం
-మరి కొందరు
అలా మాట సవిరించడం
అదోరకం చమత్కారం
-ఇంకొందరు
నిజానికిది ఏకారమో నిర్ణయించే
పాఠకులకి (వాళ్లది
యమ టేస్టు లెండి )
మా నమస్కారం
--బాపు
రమణ
(ప్రమోదూత)



ఇక ఈ బాపురమణీయం పుస్తకం మీద తెలుగు మాస్టారు, అదేనండి
హాస్యనటులు శ్రీ రావి కొండలరావు అవిష్కణ సభలో చేసిన అల్లరి ప్రసంగ
పాఠం సంక్షిప్తంగా మీ కోసం :

సైలెన్స్ ! ఎవడక్కడ నీకు తెలుసా?..బాపూరమణీయము అని పుస్తకం చూశాను.
ఏదో బిల్హణీయము,స్వారోచిషమను సంభవము అన్నట్లుగా,బాపూరమణీయము,
అనగా, ఆ కోవకు చెందిన ప్రబంధమో, గ్రంధమో అనుకున్నాను.తీరా చూస్తే
ఎప్పుడో వచ్చిన సినిమాల మీద సమీక్షలు ఇప్పుడెందుకయ్యా బాబ్జీ !దేనికి?
సైలెన్స్! ఇప్పుడా సమీక్షలు చదివి ఆ సినిమాలు ఎవడు చూస్తాడోయ్! అసలు
చూడ్డానికి అవేవి,ఎక్కడున్నాయి గనక? నిన్న వచ్చిన సినిమాయే నేడుంటం
లేదు-అలాటిది ఎప్పుడో 1950 ఆ ప్రాంతాల వచ్చిన స్నిమాలు ఇప్పుడు ఎక్కడ
వుంటాయి ఆ పాతతరం సినిమా సమీక్షలతో ఓ పెద్ద పుస్తకం! దేనికి? ఏమి
ప్రయోజనం ? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. అన్ని పేజీలు,అంత పుస్తకం
పైగా 60 రూపాయలా? " మేలు ప్రతి 85, ఫిమేలు ప్రతి 60?"అని, అతనెవరూ,
శ్రీ రమణా- శ్రీ రమణ అని అతని చమత్కారం ఒకటి !సైలెన్స్! తన పేరు ముందు
ఎవడైనా శ్రీ పెడతాడో పెట్టడో అని, ముందే తగిలించేసుకున్నాడు."శ్రీ రమణ"అని.
ఇందులో ఓ కధ. "రామారావు రోడ్డుమీద నడుస్తున్నాడు" రామారావు రోడ్డు
మీద నడవక, నా బుర్ర మీద నడుస్తాడ్రా రాస్కేల్!.... ఈ పుస్తకంలో "కార్ట్యూన్లు"
అని వున్నాయి.అదేమిటా మాట? నాకు తెలీకడుగుతున్నాను.కార్టూను, ట్యూను
కలిపిన మాటా? అలా కలిపితే "కార్టూన్ల్యూను" అవాలి.. మరి కార్ట్యూన్ ఏమిటయ్యా-
ఎవడివా తెలివితేటలు?ఐనా ఇంగ్లీషు అనబడే ఆంగ్ల భాషలో,సంధులెక్కడ
వున్నాయోయ్ ! సైలెన్స్! అరవై రూపాయలు పెట్టిన ఈ పుస్తకంలో అచ్చుతప్పులు
దిద్దేవాడే లేకుండా పోయాడు! అన్నీ అలా వదిలేశారు ! "దాఋణం"."హెచ్చెరుక",
"నెస్ట్ పిశ్చర్", "తప్పులో కాలేయడం,"జానపధ బాటసారి","కధాశివబ్రహ్మం",
"రేలంగిరిజ", "కధోచితంగా," ఇలా అక్షరాల తప్పులు కోకొల్లలు! మరోసారి ప్రిటింగ్ గా
వున్నప్పుడైనా ఇవన్నీ దిద్దుకోమను! అతనెవరు-బాపు, కార్టూన్లు అని వేశాడు.అన్నీ
వంకరటింకర బొమ్మలే, అలాటివి నేను మాత్రం వెయ్యలేనా-ఎవడైనా వేస్తాడు-
నీకు శక్తి వున్నప్పుడు "శ్రీరామ పట్టాభిషేకము","దమయంతీ స్వయంవరము" లాటివి
వెయ్యి.ఇవెందుకూ-ఈగీతలబొమ్మలు !ఓ బొమ్మలో ఆ పిల్లెవరో మేకప్ తుడుచు
కుందిట-ముక్కూ,కళ్ళూ పోయాయట! అదెలాగది? ముఖంమీద రంగు పోతుంది
గాని,అవెలా పోతాయి వోయ్ ! మరో బొమ్మలో భార్య "ఏ సినిమాకెళ్ళారూ" అని
అడిగింది. "బుడ్డిమంతుడు" అన్నాడు.అలాంటి ఎక్కడుందోయ్? "బుద్ధిమంతుడు"
అనుకుంటాను!.......ఇలా సరదాగా చేసిన ఆయన ప్రసంగం విని నవ్వుల్లో మునిగారు
అభిమానులంతా!!




బాపూగారు గీసిన నటి గిరిజ చిత్రం...