Monday, January 31, 2011

మొట్టమొదటి తెలుగు కార్టూనిస్ట్ శ్రీ తలిశెట్టి రామారావు


మన తెలుగు పత్రికలలో వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడటం 80 ఏళ్ళ
క్రితమే మొదలయింది. ఇందుకు ఆద్యులు శ్రీ తలిశెట్టి రామారావుగారు.
ఆయన ఆంధ్రపత్రిక, భారతి పత్రికలలో వ్యంగ్య చిత్రాలు గీయటం మొదలు
పెట్టారు. ఇందుకు ఆంధ్రపత్రిక వారు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు.
మన కార్టూనిస్టులలో చాల మంది ఆంధ్ర పత్రిక ద్వారానే వెలుగులోనికి
వచ్చారన్నది నిజం. తరువాత మిగిలిన పత్రికలు కూడా కార్టూన్లను
గుర్తించడం మొదలు పెట్టాయి. బాపు గారి ఎప్పుడూ ఇంతే, సత్యమూర్తి
గారి చదువుల్రావు, ప్రియ మితృలు జయదేవ్ గారి కార్టూన్లు ఆంధ్ర వార
పత్రికలో చూసే ఎంతో మంది కార్టూనిస్టులు పుట్టుకొచ్చారు. నా మొదటి
కార్టూన్ కూడా ఆంధ్రవారపత్రికలో 1958 లో అచ్చయింది. ఆంధ్ర వార
పత్రికలో బాబుగారి కార్టున్లు కూడా ఎక్కువగా వచ్చేవి. చీకటి కార్టూన్ల
పేర బొమ్మ అంతా నల్లగా వేసి బెలూన్లో మాటలుండేవి. నాకు అలాటి
ఒక చీకటి కార్టూన్ గుర్తుంది. చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నావని అడిగితే
చీకటి కార్టూన్ గీస్తున్నా అన్న జవాబుతో ఒక కార్టూన్ వచ్చింది. ఇదో
కొత్త ప్రక్రియ ! పులిచెర్ల అనే ఆయన కూడా ప్రతి వారం కార్టూన్లు వేసే
వారు.
ఈ పై కార్టూన్ "గొప్పవారిని నాటకానికి పిలచినయేడల" అన్న
పేరుతో శ్రీ తలిశెట్టి రామారావు గారు 1932 ఆంధ్రపత్రికలో వేసినది.

Sunday, January 30, 2011

ఆంధ్రపత్రిక అంగీరస సంవత్సరాది సంచిక ( 1932 )





ఆంధ్రపత్రిక దిన పత్రిక ప్రతి ఏడాది ఉగాదికి దాదాపు 265 పేజీలలో ఇప్పటి
వార పత్రికల సైజులో వార్షిక సంచికను ప్రకటించేది.నిన్ననే నా మితృలు
ఫణి నాగేశ్వరరావు గారు 1932 నాటి ఆంద్రపత్రిక ప్రత్యేక సంచికను నాకు
చూపించారు. పాత పత్రికలంటే అమిత ఇస్ఠపడే నేను ఆశ్చర్యపడి, లేచి
"79 ఏళ్ళ నాటి పత్రిక ఎక్కడ సంపాదించారండీ?" అంటూ అడిగాను.
ఆయన పాత న్యూస్ పెపర్లు అమ్మే అతను తన మెడికల్ షాపుకు మందుల
కోసం పేపర్ల తోపుడు బండితో సహా వచ్చి మందులు కొనుక్కున్నాడట. బిల్లు
అమౌంటు చెప్పి ఆ బండి వైపు చూడగానే బౌండు చేసి వున్న మూడు
పుస్తకాలు కనిపించాయట. ఏమిటా పుస్తకాలు చూపించమని అడిగితే
అవి ఆంధ్రపత్రిక , భారతి పత్రికలట! "వాటిని నాకుఇచ్చేయ్, నువ్వు మందులకు
డబ్బు ఇవ్వసరం లేదు" అనగానే ఇచ్చేసాడట! అలా ఆ పుస్తకాలు దొరికాయని
చెప్పారు. 1932 సంచికలో శ్రీశ్రీ, సముద్రాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి,,దీపాల
పిచ్చయ్య శాస్త్రి, సామవేదం జానకీ రామ శర్మ, చిత్రకారుడు, రచయిత బసవరాజు
అప్పారావు మొదలయిన ప్రముఖుల రచనలు, తెలుగులో మొట్టమొదటి
కార్టూనిస్టు శ్రీ తలిసెట్టి రామారావు గారి కార్టూన్లు, మంత్రవాది వెంకటరత్నం,
డి.పాపారావు, చామకూర సత్యనారాయణ గార్ల గీసినచిత్రాలు వున్నాయి.
ముందరి పేజీలోని ప్రస్తావనలో "చీనా-జపాను పోరాటము గురించి ఇలా
వుంది: ’ఎవరును నూహింపనిరీతిని చీనా-జపాను పోరాటము ప్రజోత్పత్తి
సంవత్సరమునందు ప్రారంభమయ్యెను.ప్రపంచమునందిది మిగుల ఆశ్చర్యము
గలిగించియుండుట వింత గాదు."......... అందులోనే నూతనసంవత్సరము గురించి
వ్రాస్తూ, "నూతనసంవత్సరము శుభదాయక మగునా, లేక అనిష్టహేతు వగునా
యని వితర్కించుట ప్రజలకు పరిపాటి యయినది. కాని,శుభాశుభములుగాని,
లాభనష్టములుగాని, మానవులవైఖరి ననుసరించి యుండును."
ఈ సంచికలోని శ్రీశ్రీ రచించిన " దివ్యాను భూతి" మీ కోసం
సంకులపయోధరచ్చటాపంకిలనిబి
డాంధకారనిర్జనవీధికాంతరముల
నా చరించెడువేళ ప్రోన్మత్తరీతి,
అవశ మొనరించు దివ్యతేజోనుభూతి
సరసియై చల్లనై నన్ను జలకమార్చె;
నందనవనీలతాంత కాంతస్రజమ్ము
గా నొకక్షణమ్ము నా మెడ కౌగిలించె.
కాలభటులు తొందరగా వినీలదీర్ఘ
సూత్రహస్తులు నను డాసి సుమదళీప
రీమళావృతమద్గళసీమకాంచి
తలకి తలయూచి ఇరులకై తరలినారు.
ఇపుడు మేఘముల్ విచ్చిపోయినవి నాకు
గగనమందె కలదు తారకాస్రజమ్ము,
ఇంక నే నిత్యరాకాశశాంకమూర్తి
నై నభో రాజ్యపాళిక లావరింతు !
--శ్రీరంగం శ్రీనివాసరావు గారు,బి.ఏ.,
<><><><><><><><><><>
ఆ కాలం లో (1932) ధరలు ఎలా వుండేవో ఈ హోటల్
ప్రకటన చూడండి !!

ది న్యూ నేషనల్ హిందూ హోటల్
స్పెషల్ బోర్డింగ్ అండు లాడ్జింగ్
ఆచారము గల బ్రహ్మణులవలన వంటచేయబడి,రుచికరమగు భోజనము
పెట్టబడును. మంచి గాలి వచ్చు రూములు ఎలక్ట్రిక్ దీపములతో నివ్వబడును.
వేడినీళ్ళు స్నానమునకు ఇవ్వబడును. దినము 1-కి మనిషి 1-కి స్పెషల్
బోర్డింగ్ రు.1-8-0, ఆర్డనరీ రు.1-0-0
యస్.యం. రంగనాధ అయ్యర్, ప్రొప్రయిటర్, 153, మింటు వీధి,మద్రాసు
Two Meals, two tiffins, bath per day charges Rs.1-8-0 (Special)
Ordinary: Two meals, bath per day charge.Rs.1-0-0
<><><><><><><><><><><><><><><><><><><><><><><><>
ఇక్కడి చిత్రాలు: ఉగాది 1910 సంచిక మొదటి పేజీ, ఆంధ్రపత్రిక వ్యవస్ఠాపకులు
విశ్వదాత కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు, తలిసెట్టి రామారావు గీసిన
చిత్రం, మరో చిత్రకారుడు వేసిన చిత్రం ( పేరు తెలియలేదు)



Saturday, January 29, 2011

ఈ దినం , దిన పత్రికల దినం !


ఇప్పుడు న్యూస్ చానళ్ళు కుప్పలు తెప్పలుగా వచ్చినా, అనుక్షణం పగలు కొట్టే
వార్తలు ( అదే నండి, బ్రేకింగ్ న్యూస్ ) అందిస్తున్నా, ఉదయం లేవ గానే వార్తా
పత్రికల కోసం ఆతృతతో ఎదురు చూసే పాఠకులు మాత్రం తగ్గలేదు. 1780
జనవరి 29 న హికీస్ బెంగాల్ గెజిట్ విడుదలయింది. ఆ జనవరి29ని వార్తా పత్రిక
దినోత్సవంగా గుర్తించడం జరిగింది.1851 లో దాదాభాయ్ నౌరోజీ ఒక రాజకీయ
పత్రికను ప్రారంభించారు. ఇప్పుడు భారత దేశంలో దాదాపు డజను ఆంగ్ల దిన
పత్రికలు ప్రచురించబడుతున్నాయి. బ్రిటిష్ వారు పయనీర్, టైమ్స్ ఆఫ్ ఇండియా,
స్టేట్స్ మన్ పత్రికలను ప్రచురించారు. అటు తరువాత ది హిందు, ఇండియన్
ఎక్స్ ప్రెస్, హిందుస్తాన్ టైమ్స్, అమృతబజార్ పత్రిక, నేషనల్ హెరాల్డ్,ది మెయిల్ పత్రికలు
మొదలయ్యాయి. తెలుగులో ఆంధ్ర పత్రికను విశ్వదాత కాశీనాధుని నాగేశ్వరరావు
ప్రారంభించారు. ఎక్స్ ప్రెస్స్ గ్రూప్ నుండి ఆంధ్రప్రభ మొదలయింది. అటుతరువాత
ఆంద్రజ్యోతి, నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో వచ్చింది. రామోజీరావు
"ఈనాడు" పత్రికను 5000ల కాపీలతో ప్రారంభించి అనతి కాలంలోనే అత్యధిక
సర్కులేషన్ కలిగిన దిన పత్రికగా మలిచారు.
ఇప్పుడు తెలుగు దిన పత్రికలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆదివారం అనుబంధం పుస్తక రూపంలో రావటం, జిల్లావారిగా జిల్లా అనుబంధాలు
ప్రతి రోజూ ప్రచురించడం, ఆదివారం మాత్రమే ఇదివరలో ప్రచురించే సినిమా శిర్షికను,
స్త్రీల శిర్షికను ప్రతి రోజూ ప్రచురించడమే కాకుండా రంగుల్లో దిన పత్రికలను ముద్రించడం
మొదలయింది. దిన పత్రికలలో మరొ ఆకర్షణ రాజకీయ కార్టూన్లు. ముఖ్యంగా
ప్రతి రోజూ మొదటి పేజీ క్రింద వచ్చే పాకెట్ కార్టూన్ పాఠకుల దృష్టిని ఆకర్షిస్తుంది.
ఈనాడు లో శ్రీధర్ కార్టూన్, కోసమే పత్రికను కొనే వాళ్ళున్నారు!! పూర్వం ఇంగ్లీష్
బాగా నేర్చుకోవాలంటే హిందూ పత్రికను చదివే అలవాటు చేసుకోమనే వారు.
ఈ రోజు దిన పత్రికలరోజే కాదు ప్రతి రోజూ దినపత్రికల రోజే!! ఎమర్జన్సీ చీకటి
రోజుల్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ సాహసోపేతంగా అనాటి అక్రమాలను ధైర్యంగా
పాఠకులముందుంచింది. అలానే హిందూ పత్రిక బోఫర్సు కుంభకోణాన్ని
డాక్యుమెంట్లతో సహ ప్రచురించింది.
మన వర్తాపత్రికలకు జేజేలు తెలియచేద్దాం !!
ఇక్కడి కార్టూన్ శ్రీ బాపు గారి సౌజన్యంతో.

Thursday, January 27, 2011

కళారత్న-మన మహిళా కార్టూనిస్ట్





ఎంత చక్కని వార్త. తెలుగుమహిళా కార్టూనిస్టులు చాలా తక్కువ
మంది. వారిలో అశేష కార్టూన్ ఇష్టుల అభిమానాన్ని చూరగొన్న
ఏకైక కార్టూనిస్ట్ రాగతి పండరి గారు. ఆమె కార్టూనిస్టుగా మొదటి
సారిగా "కళారత్న" అవార్డు అందుకుంటున్నారు. రాగతి పండరిగారు
1972లో ఎనిమిదేళ్ళ వయసులోనే కార్టూన్లు గీయడం మొదలు
పెట్టారు. ఆమె కార్టూన్ కధలు, సింగిల్ పేజీ కార్టూన్లు, రాజకీయ
చెదరంగం, ఇద్దరు అమ్మాయిలు, చెవిలో పువ్వు లాంటి శీర్షికలతో
తెలుగు వార పత్రికలలో అనేక కార్టూన్లు వేశారు.
"నా గురించి నేను...." అన్న పేరుతో కుమారి రాగతి పండరి
ఆత్మ కధ వ్రాసారు. ఆపుస్తకాన్ని ఆమెఎంతో అభిమానంతో నాకు
పంపారు. ఈ పుస్తకంలో శ్రీ జయదేవ్ గారు వ్రాసిన ముందు మాట
ఆయన స్వదస్తూరీతో ప్రచురించడం చాలా బాగుంది. ఆయన ఇలా
అన్నారు. " ఒక గీత, ఒక రాత, ఒక పద్ధతి-వీటికి మారు పేరే రాగతి
పండరి. తెలుగు పత్రికా ప్రపంచంలోనికార్టూన్ సామ్రాజ్యానికి ఆమె
మకుటంలేని మహారాణి. రత్న ఖచితమైన కార్టూన్ సింహాసనాన్ని
అతి చిన్న వయసులోనే అధిష్టించి, తన సృజనాశక్తితో, వాడి తగ్గని
తన్ క్రోక్విల్ పాళీతో హాస్యరసాన్ని పొంగించి, మధించి, ఆ సారంతో
హాస్యపుష్ప వనాల్ని గుబాళింపజేసి తెలుగు పాఠకుడి వదనం మీద
నవ్వుల జల్లులు కురిపిస్తూ వీర విహారం చేస్తున్న తెలుగు జాతి
గర్వించ దగిన ఏకైక కార్టూనిస్టు, కుమారి రాగతిపండరి. ప్రపంచంలోనే
ఆమె వంటివారు మరొకరు లేరు"
మితృలు శ్రీ జయదేవ్ చెప్పిన ఈ మాటలు అక్షరాల నిజమని
నిరూపిస్తూ ఆమెకు కళారత్న పురస్కారం లభించినందుకు కుమారి
రాగతిపండరిని తెలుగు కార్టూనిస్ఠుల,కార్టూన్ ఇష్టుల తరఫున నా
శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
నాగురించి నేను లో ఆమె ఆత్మ కధతో బాటు ప్రతి ముందు పేజీ
లోనికార్టూన్లు అలరిస్తాయి!.

Wednesday, January 26, 2011

ఈరోజు "బుడుగు" పెళ్ళి రోజుర్రోయ్ !!




ఇదిగో నేనేరా! చాలా బోల్డురోజులయింది మిమ్మల్ని చూసి, బ్లాగు బుడుగులూ
సీగానపెసూనాంబలూ ! ఈ రోజు బుడుగు పెళ్ళి రోజంటే నా పెళ్ళిరోజనుకున్నారా!
నాది కాదురా, నా కధను రాసిపెట్టిన వాడి పెళ్ళిరోజన్నమాట. వాడి పేరే ముళ్లపూడి
వెంకటరమణగారు. గారంటే నాకూ తెలియదనుకో, మన కన్నా ఎత్తుగా వున్నవాళ్ళని,
పెద్దవాళ్ళంటారట, ఆ పేద్ద వాళ్ళ పేర్ల ప్రక్కన గారు అని తగిలించి పిలవాలని అమ్మ
చెప్పింది. మా అమ్మ రాద మీకు తెలుసుగా, మా అమ్మ చాలా మంచిది. అసలు ఈ
రమణగారి నిఝం పెళ్ళి రోజు 26-1-1964 అన్నమాట. రమణ గారు తన పెళ్ళికి
నన్నూ, సీగానపెసూనాంబని కూడా పిలవలేదు. తన ఫ్రెండ్స్ ను మాత్రమే పిలిచాడట.
పిలిస్తే ఝామ్మని జట్కాతోలుకుంటూ మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. ఐనా నేనంటే ఆయనకు
కొంచెం బయంలే!
ఆరుద్రగారు రమణగారి పెళ్ళికి ఆయన వ్రాసిన "కూనలమ్మపదాలు" బుక్కును కానుకగా
ఇచ్చాడట. ఈ విషయం మా బాబాయి చెప్పాడులే! హాయిగా ఏ చేగోడీలో ,పకోడీలో ఇవ్వాలి
గాని ప్రయివేటు మాస్టర్లదగ్గరుండే ఈ బుక్కెందుకు చెప్పండి. ఇక్కడ మీరు చూస్తున్న
మొదటి కుఠో ( కుఠో అంటే ఫొటొ అనర్ధం నా బోల్డు మాటలు తెలియాలంటే మీరు నా
బుడుగు పుస్తకం చదవాలి) పెళ్ళప్పటిది. అప్పుడు పదో పదకొండో కుఠోలు కుఠోలవాడు
తీసాడు., కాని నా దగ్గర ఈ కుఠోనె వుంది. రెండో కుఠో తీసిన వాడి పేరు మీతో కబుర్లు
చెప్పే ఫనిబా(బాయ్)బు ట !
రమణగారి సీగానపెసూనాంబ పేరు సీదేవి గారు.వాళ్ళిద్దరికీ బోల్డన్ని చేగోడీలు,
పకోడీలు ఇస్తూ మీ పేర్లుకూడా చెబుతాన్లే!
మీ బుడుగు.
<><><><><><><><><><><><><><><
రమణగారు చెప్పిన పెళ్ళి కబుర్లు
"నండూరి రామ్మోహనరావుగారి చెల్లెలు శ్రీదేవితో నాకు పెళ్ళి నిశ్చయించారు.పిల్లని
బాపు చూసి బాగుందని చెప్పాడు- నేను పాదాలు చూసి బాగున్నాయని అనుకున్నాను.
చిన్నప్పుడు మేమిద్దరం ఏ అమ్మాయేనా ఎదురొస్తే ముందు పాదాలు చూసి బాగుంటేనే
తల పైకెత్తేవాళ్ళం.
నా పెళ్ళికి చుట్టాలెవర్నీ పిలవలేదు. అందరూ స్నేహితులు. చాలామంది రచయితలు-
శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, దాశరధి, రావి కొండలరావు, విఏకె రంగారావు, నిర్మాత డూండీ,
నవోదయ రాంమ్మోహనరావుగారు, జ్యోతి రాఘవయ్యగారు..ఇలా అందరూ స్నేహితులే.
నా పెళ్ళి పెద్ద బాపు అమ్మగారే.
తనకు చెప్పకుండా పెళ్ళి నిశ్చయించినందుకు మా అమ్మ కోప్పడలేదు కాని నాకు
అయిష్టులూ,తనకిష్టులూ అయిన ఒక చుట్టాలింటికి మాత్రం బలవంతాన తీసుకెళ్ళి వాళ్ళని
పెళ్ళికి పిలవనందుకు క్షమాపణలు చెప్పించి కాళ్ళకు దండం పెట్టించింది."
--కోతి కొమ్మచ్చి నుంచి
శ్రీ ముళ్లపూడి వెంకటరమణ, శ్రీమతి దంపతులకు 47 వ వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు.

Saturday, January 22, 2011

పారాహుషార్...... కార్టూన్లు..!!



పొలిటికల్ కార్టూనిస్టులలో శేఖర్ ని తెలియని తెలుగు పాఠకులుండరు.
ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఆయన గీసిన
గీస్తున్న వేలాది కార్టూన్లు నిజంగా రాజకీయనాయకులకు, తెలుగు
ప్రజలకు పారాహుషారే ! పారాహుషార్ పేరుతో శ్రీశేఖర్ గీసిన కార్టూన్ల
పుస్తకం ఎనిమిదేళ్ళక్రితమే వెలువడింది. ప్రతి పేజీ పారాహుషార్ అంటూ
మనల్ని హెచ్చరిస్తుంది. "నాలో ప్రవేశించి నాతో బొమ్మలు గీయుస్తున్న
సామాన్యుడికి....." అంటూ శ్రీ శేఖర్ తన పుస్తకాన్ని అంకితమివ్వడం
చాలా సమంజసంగా వుంది. 76 పేజీల ఈ కార్టూన్ సంకలనం లో ఒక
పేజీలో పెద్ద కార్టూన్, ఎదుటి పేజీలో పాకెట్ కార్టూన్, దాని ప్రక్క ప్రముఖ
వ్యక్తుల కేరికేచర్ , వాటికింద వుంచిన శీర్షిక ఆలోచన అద్బుతంగా వుంది.
అట్టవెనుక చిత్రంలో కార్టూన్లు గీస్తున్న తన సెల్ఫ్ బొమ్మతో బాటు,
తలుపు మీద ఇంటి నెంబరు, హైదరాబాదులోని ఏరియా, ఏడి పల్లిలో
స్కూల్కు వెళుతున్నట్లు , ఓయూ, కేయూలలో డిగ్రీ తీసుకొన్నట్లు,
కుటుంబచిత్రం ( సతీమణి, అమ్మాయి, అబ్బాయి)గది గోడ మీద బొమ్మలు,
టెలిఫోన్ రింగవుతుంటే ఆ ఫోన్ నంబరు ( 27532811), ప్రక్కనే ఆయనకు
ఇష్టమైన ఆర్కే లక్ష్మణ్, బాపు, మాక్సిజమ్ పుస్తకాలు, ఎమ్.ఏ.లిట్, ఎల్లెల్బీ
డిగ్రీలు ( చెత్త బుట్టలో) చూపించడం శ్రీ శేఖర్ మేధాశక్తిని చెప్పక చెబుతున్నాయి.
కార్టూన్ ఇష్టులూ అందరూ విశాలాంద్రకు వెళ్ళినప్పుడు ఈ పారాహుషార్ ను
తప్పక తీసు "కొన" వలసిన మంచి పుస్తకం.

Friday, January 21, 2011

జగతి ఎన్నార్.చందూర్



గత యాభైయారేళ్లనుంచి ప్రచురితమవుతున్న "జగతి" మాస
పత్రిక సంపాదకులు , ప్రఖ్యాత రచయిత శ్రీ ఎన్నార్.చందూర్
ఈ నెల 11 వతేదీన తన 95 ఏట అస్తమించారన్న వార్త వారి
అభిమానులకు విషాదం కలిగించింది. కొంతకాలం ఆకాశవాణి
లో పని చేసిన ఆయన "మాలి" అనే పత్రికను ప్రారంభించి అటు
తరువాత "జగతి" ని స్థాపించి ఇప్పటివరకూ విజయవంతంగా
నడిపారు. ఆయన అసలు పేరు చందూరి నాగేశ్వరరావు. తన
సోదరి కుమార్తె మాలతిని వివాహం చేసుకున్నారు. శ్రీమతి
మాలతీ చందూర్ తమ రచనలతో తెలుగువారందరికీ అభిమాన
పాత్రులయ్యారు. ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో చాలా కాలం
"ప్రమదావనం" శ్రీర్షిక నిర్వహించారు. ఆమె వ్రాసిన వంటలూ-
పిండివంటలూ పుస్తకం లేని తెలుగు లోగిలి లేదేమో!
జగతి పత్రిక మొదటి పేజీలో ఓ భతృహరి సుభాషితమో,
తిక్కన , పోతన పద్యమో తప్పక వుంటుంది. నిమ్మతొనలు
శిర్షికలో జోకులు, డైరీ లో నగరంలో జరుగుతున్న సభలూ
సమావేశాలగురించి వివరాలు వుంటాయి.పసిడి పలుకులులో
పెద్దలు చెప్పిన మంచి మాటలు వుంటాయి. ఇలా ఆ చిన్న
పత్రికలో ప్రతిదీ అమూల్యమే! శ్రీ చందూర్ కాఫీ మానేయడం,
అన్యాయం, ఎక్కడికి కమలా?,రాధ నవ్వింది, మొదలయిన
కధానికలు, ఏంటినా, భానుమూర్తి భార్య, కలడో లేడో మొ"
నవలలు వ్రాశారు. ఇంగ్లీషునుండి అనువాదలూ చేశారు.
వారి శ్రీమతి మాలతీ చందూర్ "స్వాతి" మాస పత్రికలో "పాత
కెరటాలు" , "స్వాతి" వార పత్రికలో "నన్ను అడగండి" శీర్షికను
దశాబ్దం పైగా నిర్వహిస్తున్నారు.
" జగతి’కి ఏదైనా వ్రాయాలనే కోరిక వుండేదికాని, వేస్తారో
లేదోననే సందేహంతో పంపే సాహసం చేయలేదు. 2009 ,
అక్టోబరులో శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారు నాకు ఫోను
చేసి "మీరు నా పుట్టిన రోజుకు వేసిన బొమ్మ , జగతి సంచికలో
పడింది, మీకు కాపీ పంపుతున్నా"నని చెబితే ఆశ్చర్యపడ్డాను.
నేను స్థానిక దినపత్రిక "సమాచారం" పత్రికకు శ్రీ ముళ్లపూడి
పుట్టిన రోజు సంధర్భంగా వ్రాసిన వ్యాసానికి నే వేసిన బొమ్మను
శ్రీ చందూరు గారు తమ జగతి పత్రికలో వేశారు. అలా నా కోరికను
శ్రీ చందూర్ తీర్చారు. ఈ దు:ఖసమయంలో శ్రీమతి మాలతీ చందూర్
గారికి భగవానుడు తోడుగా వుండి చందూర్ గారి ఆశయాన్ని
మరింత ముందుకు తీసుకొని వెళ్ళే శక్తిని అందించాలని కోరుకుంటూ
ఆయన అశేష అభిమానుల తరఫున శ్రర్ధాంజలి ఘటిస్తున్నాను.

Saturday, January 15, 2011

ఆ రోజుల్లో..............



ఆ నాటి రోజులు గుర్తుకొస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిన్న నా
బ్యాంకు పైలు చూస్తుంటే నేను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శ్రీకాకుళం
లో క్యాషియరుగా చేరినప్పటి అపాయ్ట్మెంట్ లెటరు అగుపించింది.
అప్పుడు బ్యాంకులో క్యాషియరుగా నా జీతం 120/- రూపాయలు.
డిఏ రూ.25-20 పైసలు. ఈ ఉత్తరం నాకు ఇచ్చిన తేదీ 17 జూలై 1963,
అంటే ఇప్పటికి 48 ఏళ్ళయిందన్నమాట. ఇప్పటి జీతాలకు అప్పటి
జీతాలకు ఎంత తేడా?! ఇక ఉద్యోగమిస్తూ వ్రాసిన ఉత్తరం కూడా ఎంతో
కటువుగా ఉంది. ఆ రోజుల్లో ఉత్తరం రూపంలో కాక MEMORANDUM
అని వుండేది. ఆ మెమొ ఆఖరి రెండు లైన్లు చూడండి ఏమని వ్రాశారో.
In case your work and conduct are not satisfactory and upto
the Bank's required standard, your services will be terminated
without notice during the period of probation.

కాని ఆ జీతం ఆ రోజుల్లో మాకు తక్కువనిపించలేదు. ఆ జీతానికి తగ్గట్టే
ధరలూ వుండేవి.న్యూస్ పేపరు 12 పైసలకే వచ్చేది. వారపత్రికలు 25
పైసలు. హోటల్లో భోజనం టిక్కెట్లు 30, 40 రూపాయలకే నెలకు ఇచ్చే
వాళ్ళు ! మా నాన్నగారు బ్యాంకులో క్లర్కుగా చేరినప్పుడు ( 1924 )
ఆయన జీతం రూ.30/- లట! ఇక్కడ మీరు చూస్తున్న రంగూన్ టీక్
వుడ్ అల్మయిరా ఖరీదు ఎంతో తెలుసా! మీరు నమ్మక పోవచ్చు. దాని
ఖరీదు అక్షరాలా పది రూపాయలు! ఆ రోజుల్లో బ్యాంక్ ( అప్పుడు
బ్యాంకు పేరు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , 1955లో స్టేట్
బ్యాంకు గా మారింది) బ్రాంచి మేనేజర్లను ఏజెంట్ అనే వారు. ఆ రోజుల్లో
ఆ పదవిలో అంతా బ్రిటిషర్స్ ఏజెంట్లగా వుండేవారు. అలా మానాన్న
గారు ఏజెంట్ టైపిస్టుగా(గుంటూరు) పనిచేస్తున్నప్పుడు ఏజెంట్ ఇంగ్లాండు
తిరిగి వెడుతూ తన అల్మయిరాని మా నాన్నగారికి పది రూపాయలకు
అమ్మాడట.10 రూపాయలకు కొనడానికి నాన్నగారు చాలా రోజులు
ఆలోచించారట. ఇప్పుడు మా కార్పెంటరును అడిగితే ఆ బీరువా
చేయించడానికి రూ.35,000/- పైగా అవుతుందని చెప్పాడు.!
వైజాగులో వున్న మా బావగారు శ్రీ ఎమ్వీఎల్లెస్ ప్రసాదరావుగారు
(ఆయనా ఎస్బీఐ లోనే రిటైరయ్యారు) నువ్వు ఇంకా రూ.125/- జీతంతో
ఉద్యొగంలో చేరావు, నేను చేరినప్పుడు నా జీతం రూ.91/-రూపాయలే
అంటూ, ఇప్పటి కన్నా అప్పుడే(1956) హాయిగా వుండే వాళ్ళం అన్నారు.
అప్పుడు మంచి సదుపాయాలున్న ఇల్లు నెలకు 20 రూపాయలకే అద్దెకు
దొరికేదట !. పత్రికల పిచ్చి వున్న నాకు డైలీ పేపరు, చందమామ, జ్యోతి
మాసపత్రిక, విజయచిత్ర మొదలైన పత్రికలకు నెల బిల్లు ఇరవై రూపాయల
లోపే అయ్యేది.ఇప్పుడు నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, హిందూ లకే 265రూ.బిల్లు
అవుతున్నది. ఆ రోజుల్లో మనుషుల్లో ఆప్యాయత వుండేది. అప్పటి వరకు
అమ్మానాన్నలను విడిచిపెట్టి ఎప్పూడూ వుండని నేను కొత్త వూర్లో (శ్రీకాకుళం) లో
ఒంటరిగా ఉద్యొగం లో చేరినా తోటి ఉద్యోగులు, మా కాష్ ఆఫీసర్ శ్రి కోట కామేశ్వర
రావు, ఏజెంట్ శ్రి ఎమ్వీయస్ గౌరీనాధ శస్రిగారుఆనాడు చూపిన ప్రేమాభిమానాలు
ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఏమైనా ఇప్పుడు ఆత్మీయత లోపించిదేమో
అనిపిస్తుంది. అదండీ ఆ రోజుల్లో నా ఉద్యోగపర్వం కధ.




Friday, January 14, 2011

సంబరాల సంక్రాంతి



కొత్త సంవత్సరం వచ్చింది. అప్పుడే మొదటి పండుగా వచ్చేసింది!
దేశంలో ఇప్పుడంతా యమస్పీడ్. కళ్ళు తెరచేలోగా రోజులూ నెలలూ
మారిపోతున్నాయి. మునుపటికాలంలో పెద్దపండుగ వస్తున్నదంటే
నెలముందు నుంచే ఎంతో సందడి. చీకటిపడగానే అమ్మాయిలూ,వాళ్ళ
అమ్మలూ ఎంతో సందడిగా ఇంటి ముందు ముగ్గులు తీర్చి దిద్దేవాళ్ళు.
అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక ఇక అందరిదీ ఒకే గుమ్మం! మూకుమ్మడిగా
ఆ బిల్డింగ్ ముందే ఒకే ముగ్గు. ఇక వివిధ పత్రికలు, పెద్ద షాపింగ్ మాల్
వాళ్ళూ నిర్వహించే ముగ్గులపోటీల్లోనే అమ్మాయిలుపగటిపూటే ముగ్గులు
వేసేస్తున్నారు. గంగిరెద్దు దాసరులు, హరిదాసులను ఇక టీవీల్లోనే మన
పిల్లలకు చూపించాలి. అధిస్ఠానం ఎదుట గంగిరెద్దుల్లా తలాడించే
మన రాజకీయ నాయకులే మనకు ఇప్పటి గంగిరెద్దులు!
ఈనాడులో శ్రీ శ్రీధర్ గీసిన కార్టూన్ సమయానుకూలంగా చాలా
బాగుంది. గాలిపటాలలా పైపైకీ ఎగిరిపోతున్న ధరలు గురించి మరచి
పోవడానికి ఈ పండగనాడు కొన్ని జోకులు చెప్పుకొని నవ్వుకుందాం!
:) :) :) :) :) :)(: (: (: (: (:
ఓ అర్ధరాత్రి మొహానికి ముసుగు వేసుకున్న ఓ దొంగ హైద్రాబాద్
టేంక్బండ్ మీద వెళుతున్న ఓ కారుని ఆపి, తుపాకి చూపిస్తూ
చెప్పాడు.
" నీ దగ్గరున్న డబ్బు ఇవ్వు."
ఆ కారుని నడుపుతున్న యజమాని వెంటనే ఇలా అన్నాడు.
"నన్ను వదలిపెట్టు. నేను ఆంధ్రప్రదేశ్ లో ఓ యం.ఎల్.ఏ ని
తెలుసా?"
"అలాగా! అయితే నా డబ్బునాకివ్వు " అన్నాడు తుపాకీ
చూపిస్తూ.
:) :) :) (: (: (:
"మా నాన్నగారికి తను ఏ సంవత్సరంలో మరణిస్తాడో తెలుసు.
అంతేకాదు, నెల, తేదీతో పాటు టైము కూడా తెలుసు "
"అలాగా ? మీ నాన్నకా సంగతి ఎలా తెలుసు ? జ్యితిష్య పండితుడా?"
"అదేంకాదు, ఆయనకు ఉరి శిక్ష పడింది"
;) :) :) :) (: (: (:
ఒకతను రద్దీగా వున్న వీధిలో నడుస్తుంటే ఆకాశవాణి ఇలా అంది.
" ఆగు, రోడ్డు అప్పుడే దాటకు"
అతనాగగానే తాగి కారు నడుపుతున్న దేవదాసు వేగంగా
దూసుకు వచ్చి ఇద్దర్ని గుద్దాడు.
" ఇప్పుడు రోడ్డు దాటు" అంది ఆకాశవాణి.
అతను రోడ్డు దాటి కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆకాశవాణి పలికింది.
అతనుఆగిపోయాడు. పక్కనే నిర్మాణం జరుగుతున్న బిల్డింగునుంచి
ఓ ఇటుకరాయి వచ్చి పడింది. ఇక నడు అంది మళ్ళీ ఆకాశవాణి.
అతను తల పైకి ఎత్తి అన్నాడు.
"నన్ను రెండు సార్లు కాపాడినందుకు ధాంక్స్. కాని నా పెళ్ళి
నాడు నువ్వేమయ్యావు? అప్పుడూ ఇలా కాపాడొచ్చుగా!"
<><><><><><><><><><>
పిచ్చికుక్క కరచిన రంగనాధయ్యకు ఆయన ప్లీడరు ఇలా
సలహా యిచ్చాడు. "మరేమీ అనుకోకండి. ఎటునుంచి ఎటు
వచ్చినా సిద్ధపడి ఉండటం కోసం ఇప్పుడే మీ వీలునామాను
రాయడం మంచిది" సరేనని రంగనాధయ్య కాగితమూ కలము
పుచ్చుకొని ఓ గంటకు పైగా ఏదో రాస్తూ కూర్చున్నాడు.
"చాలా పొడుగాటి వీలునామా రాస్తున్నట్టున్నారే" అన్నాడు.
"వీలునామాకాదు,చట్టుబండలూ కాదు.నాకు పిచ్చి పట్టాక
ఎవరెవరిని కరవాలో వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాను"
అన్నాడు రంగనాధయ్య.
<><><><><><><><><>
కొత్తగా పెళ్ళయిన మన్మధరావు ఇల్లు పుర్తిగా పెళ్ళికానుకలతో
నిండిపోయింది. భర్యాభర్తలిద్దరు వాటిని చూసి మురిసిపోతుండగా
కోరియర్లో సెకండ్ షోకి రెండు సినిమా టికెట్లు వచ్చాయి. అందులో
వున్న చీటీలో "ఇవి పంపిందెవరో కనుక్కోండి" అని వుంది. ఎంత
ఆలోచించినా ఎవరో తెలియలేదు. ఎవరైతేనెమి అనుకుంటూ ఇద్దరూ
సెకండ్ షోకి హుషారుగా వెళ్ళి వచ్చాక ఇల్లంతా గుల్లయి వుంది.
టేబుల్ పై ఓ చీటీ కనిపించింది. అందులో ఇలా రాసి వుంది.
"ఇప్పటికైనా తెలిసిందా నేనెవరో ?"
<><><><><><><><><><><><>
ఈ రోజు, "నవ్వక పోవడం ఓ రోగం, నవ్వడం ఓ భోగం" అన్న జంధ్యాల
జయంతి. ఆయనకు జోహర్లర్పిస్తూ ........
( కార్టూన్ "ఈనాడు" సౌజన్యంతో..జోకులు మల్లాది "హాస్యానందం",
రాజగోపాల్ "నవ్వులకధలు" ఆధారంగా)
సంక్రాంతి సంబరాలను ఒక్క బొమ్మలో చూపించిన బాపూ
బొమ్మ "హరివిల్లు" సౌజన్యంతో
అందరికీ ఈ సంక్రాంతి సకల శుభాలను అందించాలని మనసారా
కోరుకుంటూ.........

Wednesday, January 12, 2011

స్వామి వివేకానంద


ఈ రోజు స్వామి వివేకానందుని జయంతి. ఈ పవిత్ర దినాన ఆయన
ప్రవచించిన కొన్ని సూక్తి వచనాలను గుర్తు చేసుకొందాం.
<><><><><><><><><><>

అజ్ఞానులకు వెలుగుచూపండి. విద్యావంతులకు మరింత వెలుగుచూపండి.
ఆధునిక విద్య పెంచే అహంకారానికి అంతులేకుండా పోతూంది.
<><><><><><><><><><><><><><><><><>

మొదట మీరు పవిత్రులు కండి. అప్పుడు ప్రపంచమంతా పవిత్రంగా
కనబడి తీరుతుంది
VvVvVvVvVvVvVvVvVvVvVvVvVvV

వేదాంత దృక్పధంలో పాపమనేదే లేదు. పొరపాట్లు మాత్రమే ఉన్నాయి.
మీరు పాపాత్ములనీ, ఎందుకూ పనికిరానివారనీ అనడమే వేదాంతం
దృష్టిలో పెద్ద పొరపాటు.
<><><><><><><><><><><><><><><><><>
మీరు విగ్రహాన్ని దేవుడని అనవచ్చు. కానీ దైవం విగ్రహమే అని ఆలోచిస్తే,
అది పొరపాటు
()()()()()()()()()()()()()౦()()()()()()()()()()()()()()()()
మతం సిద్ధాంతాలలో,రాద్ధాంతాలలో లేదు. దాని రహస్యమంతా ఆచరణ్లోనే
వుంది. పవిత్రంగా ఉండటం, పరులకు మేలు చేయడం- మతమంటే ఇదే.
vVvVvVvVvVvVvVvVvVvVvVvVvVvVvVv

సజీవ దైవాలను సేవించండి. అంధుడు,పేదవాడు, వికలాంగుడు,దుర్బలుడు,
కౄరుడు, ఇలా వివిధ రూపాల్లో భగవంతుడు మీ వద్దకు వస్తాడు.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()
స్త్రీలు ఆదరించబడుతూ, ఆనందంగా ఉన్న కుటుంబాలపై పరమేశ్వరుని
కృప ప్రసరిస్తుంది
[][][][][][][][][][][]VVVVVVVVV[][][][][][][][][][][]
భారతదేశంలో ముగ్గురు వ్యక్తులు కలిసికట్టుగా ఐదు నిమిషాలైనా పని
చేయలేరు. ప్రతి ఒక్కరూ అధికారం కోసమే అర్రులు చాస్తారు. చివరికి
మొత్తం వ్యవస్త కుప్పకూలుతుంది
}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{
" నువ్వు దుష్టుడివి " అనవద్దు. " నువ్వు మంచివాడివి ", కానీ
"మరింత మెరుగవ్వాలి" అని మాత్రం అనండి.
********************************************
హనుమంతుణ్ణి, జగజ్జననినీ స్మరించండి.మరుక్షణం మీలోని దౌర్బల్యం
పిరికితనాలు మటుమాయమవుతాయి.
<><><><><><><><><><><><><><><><><><><>
పురాణాలు వర్ణించిన ముప్ఫై మూడు కోట్ల దేవతల్లో విశ్వాసం ఉండీ,
మీపై మీకు విశ్వాసం లేకపొతే విముక్తి లేదు.
<><><><><><>
రామకృష్ణ మఠం వారు ప్రచురించిన THE AWAKENING, inspirational
Quotes of Swami Vivekananda, సౌజన్యంతో

Tuesday, January 11, 2011

మన అనగనగా కధలు-జానపద సినిమాలు





ఒకనాడు మన తెలుగు సినిమా తెరను జానపద సినిమా కధలే ఏలాయి.
అందులోని మాంత్రికులు చెసే మాయలూ, నాయకులు చేసే కత్తి యుద్దాలు
ఆకాశంలో గుర్రాల మీద ఎగిరిపోవడం లాంటి దృశ్యాలు పిల్లల దగ్గరనుంచి
పెద్దల దాకా అలరించాయి. అలనాటి బాలరాజు, కీలుగుర్రం, మాయలమారి,
పాతాళభైరవి, జయసింహ, సువర్ణసుందరి లాంటి చిత్రాలతో ఏఎన్నార్,ఎన్టీయార్
ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆ చిత్రాలలో మంచి సంగీతంతో బాటు
ఉత్తమ అభిరుచులున్న నిర్మాతల నుంచి రావడంతొ అవి జానపదాలైనా
కలకాలం గుర్తుండిపోయాయి. అటు తరువాత జానపద బ్రహ్మ అన్న పేరు
గాంచిన దర్శకనిర్మాత విఠలాచార్య నిర్మించిన చిత్రాలతో కాంతారావు హీరోగా,
రాజనాల ప్రతినాయకుడిగా పేరుపొందారు. విజయవారు బాలకృష్ణ తోనిర్మించిన
భైరవ ద్వీపం సినిమా కూడా విజయం సాధించింది.
ఆ తరువాత తీసిన చిత్రాలు జనాన్ని అంతగా ఆకర్షింపలేక పోయాయి. ఇప్పుడు
ప్రపంచ ప్రఖ్యాత డీస్నీ సంస్థ ద్వారా దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో
ఆయన కుమారుడు కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వంలో "అనగనగా ఓ ధీరుడు"
సంక్రాంతి కానుకగా విడుదలవుతున్నది. డిస్నీ లాంటి సంస్థ బానరు పై ఓ
తెలుగు చిత్రం విడుదలవుతుందంటే ప్రతి తెలుగు వాడూ గర్వించవలసిన
విషయమని నా నమ్మకం.కధ విషయంలోనూ, నటీనటుల ఎన్నికలోనూ
డిస్నీ సంస్ఠ ప్రత్యేక శ్రర్ధ చూపించింది. ఇందులో నాయకిగా కమలహసన్
కుమార్తె శ్రుతిహసన్, మాంత్రికురాలిగా నటుడు మోహన్ బాబు కుమర్తె
లక్ష్మి నటించడం మరో ప్రత్యేకత. లక్ష్మి లక్శ్మిటాక్ షో ద్వారా బుల్లితెర
ప్రేక్షకులకు ఇదివరలోనే పరిచయమయింది నాయకుడిగా బొమ్మరిల్లు హీరో
సిద్ధార్ధ అగుపిస్తాడు. రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ నిర్మించారు. ఈ సినిమా
ప్రచార చిత్రాలు ఈ సరికే మనం టీవీల్లో చూస్తున్నాం.మరొ సంతోషకరమైన
విశేషం ఇందులోని హాస్యసన్నివేశాలకు సంభాషణలు, పాటను వ్రాసింది
శ్రీ తాడినాడ రాజసింహ. ఈ యన చాలా రాఘవేంద్రరావుగారి చిత్రాలకు
పనిచేశారు. సంక్రాంతికి ఈ సినిమా మన కన్నుల పండుగ చేస్తుందనే నమ్మకంతో
మొట్టమొదటి సారిహాలీవుడ్ తో టాలీవుడ్ చేతులు కలిపి మన ముందుకు వస్తున్న
ఈ అనగనగా ఓ ధీరున్ని నిండు మనసుతో ఆహ్వాన్నిద్దాం !

Monday, January 10, 2011

:) ప్రపంచ నవ్వుల దినోత్సవం :)

ఈ రోజు నవ్వుల దినోత్సవం ! ఈ రోజే కాదు ప్రతి రోజూ మనం నవ్వుతూ
నవ్విస్తూ మనం నవ్వులపాలవకుండా ఎదుటవాళ్ళని నవ్వులపాలు
చేయకుండా నవ్వుతూ కలకాలం గడపాలని కోరుకొందాం!
ఈ పైన వున్న కార్టూన్లు చూశారుగా ! మొదటి బొమ్మలో మాటలు
మాత్రమే వున్నాయ్! ఐనా అది కార్టూనే ! అంటే అగుపించని కార్టూన్!
రెండోది మాటలు లేని అంటే సైలెంట్ కార్టూన్ అన్నమాట. ఇంత
చక్కగా భావాన్ని చెప్పగలవరెవ్వరు? మన బాపూ గారే!! అలనాటి
"జ్యోతి" మాస పత్రికలోని ,ఈ రెండుకార్టూన్లు మిమ్మల్ని నవ్వించాయని
తలుస్తాను.
నవ్వుల తోరణం
vVvVvVvVvVvVvVvVvVvVvVvVvVvVvVvVvVvVvVvVvVvV

పంజరం తలుపు తెరచివుండటం చూసిన పిల్లి చిలకని
పట్టుకుందామని మెల్లిగా వచ్చింది,
చిలక "ఏయ్ ! ఎవరు నువ్వు?" అని గద్దించింది
పిల్లి హడలిపోయి " సారీ, తమరు చిలకేమో ననుకున్నానండి.
పొరబాటైపోయింది" అని పారిపోయింది.
OoOoOoOoOoOoOoOoOoOoOoOoOoOoOoO

ఏడేళ్ళ బాబి బడికి టెలిఫోను చేశాడు.
"ఏమిటి ? బాబికి జెరం వచ్చిందా, సెలవుకావాలా... మాట్లాడుతున్నది?"
ఎవరు అంది మేస్టారమ్మ ఫోనులో
" నేను మా నాన్ననండి "
VoVoVoVoVoVoVoVoVoVoVioVoVoVoVoVoVoVoVoVo
కమల: నీకు అద్భుతమైన...అందమైన...ధగధగ మెరిసే
అమ్మాయి కనబడితే ఏం జేస్తావు?
విమల: కొంతసేపు చూస్తాను. ఇంకా కొంతసేపు చూస్తాను.
ఇహ విసుగుపుట్టి అద్దం కింద పెట్టేస్తాను.
oOoOoOoOoOoOoOoOoOoOoOoOoOoOoOoOoOoOoOo
సత్యకాలపు బామ్మల లెక్కవేరు.
"బామ్మా,బామ్మా ఇవాళ పదింటికల్లా వంటచేసి అన్నం పెట్టాలి.
కోర్టు పనుంది " అన్నాడు ఒక లాయరు మనవడు.
"పదెందుకురా నాన్నా, రొండింటికల్లా పెట్టేస్తాను" అందావిడ.

ముళ్లపూడి వెంకట రమణ గారి ""నవ్వితే నవ్వండి, మాకభ్యంతరం లేదు"
నుంచి.ఇలాంటి మరిన్నిమంచి మంచి జోకులు చదవాలంటే "ముళ్లపూడి సాహితీ
సర్వస్వం" నాలుగో సంపుటి నేడే స్వంతం చేసుకోండి.

:):):):):):):):):):):):)::):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):)





Sunday, January 09, 2011

భారతి-సాహిత్యమాస పత్రిక






ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వ్యవస్ఠాపకులు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు
పంతులు గారు 1924 లో సాహిత్య మాస పత్రిక "భారతి" ని స్థాపించారు.
శ్రీ నాగేశ్వరరావుగారు "భారతి" ఆవశ్యకతను వివరిస్తూ ఇలా అన్నారు.
"ఆంధ్రహృదయము నందు స్వకీయ స్వరూప స్వభావములను
నిర్ణయించి స్వధర్మము నారాధింపవలయునను సంకల్పము
గలిగినది. ఆ సంకల్పము సఫలము చేయుటకు చరిత్ర కారులు,
పండితులు, పరిశోధకులు,కళాప్రవీణులు ప్రచారకులు చేయుచున్న
పరిశ్రమ దేశవ్యాప్తమై ప్రజాపోషణమును బడయుచున్నది. దేశ
వ్యాప్తములైన ప్రయత్నము లనేక ముఖమునను నాంధ్రసమాజము
నకు వ్యక్తముచేసి, ప్రజా దృష్ఠిని నవపవృత్తియందు లగ్నము చేయవలసిన
యవసరము గలిగినది. ఆ యవసరమును సఫలము చేయుటకు,ఆంధ్ర
ప్రపంచము పూర్వపర సంస్కారములను, సమన్వయమును చేయుటకును
బూనుకొనుచున్నది. ఆంధ్ర భారతియును ఆంధ్ర ప్రవృత్తిని వ్యక్తము
చేయుటకవతరించినది"
శ్రీ నాగేశ్వరరావుగారి అభిలాషను కొనసాగిస్తూ శ్రీ శివలెంక శంభుప్రసాద్ గారు
భారతిని చాలా కాలం కొనసాగించారు. "భారతి" ఉగాది సంచికలు ఎంతో
ప్రాచూర్యం పొందాయి. భారతి ప్రారంభసంచిక లోగో, 1954 జనవరి,ఫిబ్రవరి,
మార్చి,ఏప్రియల్ సంచికలో ప్రచురించబడ్ద వర్ణ చిత్రాలు వరుసగా,:
రోహిణీ చంద్రవిహారము : శ్రీ రాగి వెంకటేశ్వరరావు
నీహార విహారము : శ్రీ రణవీర సక్సేనా
నీటికడవ : శ్రీ వి.సంజీవరావు
పునరాగమనము : శ్రీ రణవీర్ సాక్సేనా, ( ఈ చిత్రాలు
నేను సేకరించినవి. భారతి గురించి ఆంధ్రపత్రిక చరిత్ర పుస్తకం సౌజన్యంతో)

Saturday, January 08, 2011

స్వర్ణయుగంలో అన్నపూర్ణ : వెలుగు నీడలు



1961 జనవరి 6న నందమూరి "సీతారామకళ్యాణం" విడుదలయిన
మరునాడు 7వ తేదీ అక్కినేని చిత్రం "వెలుగునీడలు" విడుదలయింది.
ఈ రెండు చిత్రాలు వారి స్వంత చిత్రాలవడం, రెండూ విజయవంతం
అవటం విశేషం! ఈ చిత్రాన్ని తమిళంలో కూడా ఏక కాలంలో "తూయ
ఉళ్ళం" పేరిట నిర్మించారు. వెలుగు నీడలు చిత్రంతో శ్రీ పెండ్యాల
నాగేశ్వరరావు సంగీతదర్శకుడిగా అన్నపూర్ణా సంస్ఠలో తిరిగి ప్రవేశించడం
జరిగింది. ఆత్రేయ సంభాషణలను రచించారు. హాస్య సన్ని వేశాలకు మాత్రం
మాటలను ఆంధ్రనాటక కళాపరిషత్ లో బహు బహుమానాలు గెలిచిన
శ్రీ కొర్రపాటి గంగాధరరావుగారు కూర్చారు. వెలుగునీడలు కధ మెడికల్
కాలేజీ, విద్యార్ధులు, డాక్టర్ల వృత్తులతో ముడిపడి వుండటం వల్ల ఆ
దృశ్యాల చిత్రీకరణలో సూచనలు, సలహాలు ఇవ్వడానికి డా"శ్యామలారెడ్డి
అనే వైద్యురాలు రాత్రి తన క్లినిక్ పని పూర్తయ్యాక వచ్చి ఇంజెక్షన్ సిరెంజి
పట్టుకోవడం లాంటి సూచనలను నటీనటులకు ఇచ్చేవారట. ఆనాడు
నిర్మాణంలో అన్నపూర్ణా సంస్ఠ అంతటి జాగ్రత్తలు తీసుకొనేవారు. ఈ
చిత్రానికి శతదినోత్సవ వేడుకలను విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి
లలో జరిపారు. విశాఖపట్నం వెళ్ళే మెయిల్ మిస్సయితే నటీనటులంతా
ధర్డు క్లాసులో పాసెంజరు రైళ్ళో ప్రయాణం చేశారట! సంగీత పరంగా,
సాహిత్యపరంగా వెలుగునీడలు సమగ్రమైన సినిమా అని నిర్మాత
దుక్కిపాటి మధుసూధనరావుగారు భావించేవారు. శ్రీశ్రీ ఈ చిత్రానికి
వ్రాసిన పాటలు సాహిత్యపరంగా మరువలేనివి. ముఖ్యంగా ఆయన
వ్రాసిన " పాడవోయి భారతీయుడా" అన్న గీతం యాభై వసంతాలు
గడిచినా అందులోని సాహిత్యం ఈ నాటి పరిస్ఠితులకు వర్తిస్తుంది.
ఘంటసాల కోరస్ పాడిన ఈ పాట :
పాడవోయి భారతీయుడా !
ఆడిపాడవోయి విజయగీతిక
నేడే స్వాతంత్ర్య దినం-వీరుల త్యాగ ఫలం
నేడే నవోదయం నేడే ఆనందం ! II ఫాడవోయిII
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి,
సంబరపడగానే సరి పోదోయి
సాధించిన దానికి సంతృప్తి పొంది
అదే విజయ మనుకుంటే పొరపాటోయి !
ఆగకోయి భారతీయుడా..........
కదలి సాగవోయి ప్రగతిదారుల

ఆకాశం అందుకొనే ధరలొక వైపు,
అదుపులేని నిరుద్యోగ మింకొక వైపు!
అవినీతి, బంధుప్రీతి- చీకటి బజారు
అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు ?
కాంచ వోయి నేటి దుస్ఠితి--
ఎదిరించవోయి యీ పరిస్ఠితి!--
పదవీ వ్యామోహలు-కులమత భేదాలు,
భాషాద్వేషాలు చెలరేగే నేడు !
ప్రతి మనిషి మరి యొకరిని దోచుకునే వాడే,
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునే వాడే !
స్వార్ధ మీ అనర్ధదాయకం!
అది చంపుకొనుటె క్షేమదాయకం !
సమ సమాజ నిర్మాణమె నీ ధ్యేయం!
సకల జనుల శౌభాగ్యమే నీ లక్ష్యం !II
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే----
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం !II
ఇంకా శ్రీశ్రీవ్రాసిన "కలకానిది, నిజమైనది బ్రతుకు-కన్నీటి
ధారలలోనే బలిచేయకు","ఓ రంగయో-పూలరంగయో
ఓర చూపు చాలించి సాగిపోవయో!" పాటలు అత్యంత
ప్రజాదరణ చూరగొన్నాయి.

Friday, January 07, 2011

వికవికల కవితలు !!


ఆయన -(ఆ) విడా కులు !

ప్రేమించి పెళ్ళాడిన ఆ ఇద్దరికీ ప్రతి రాత్రీ ఒకే పడక !
భోజనానికి పగలూ రాత్రీ ఒకే ఆకు !!
ఇప్పుడా ఇద్దరికీ పగలూ రాత్రీ పడక
"పగలు" పెరిగి కలహాల భోజనాలతో తీసుకున్నారులే విడాకులు!!
>>>>>>>>>>><<<<<<<<<<<<
నీరు-కన్నీరు అను "ఐస్" (EYES) వాటర్

మునిసిపాలిటి అందించే కలరు నీరు జనం పాలిటి కలరా !
ఆ నీళ్ళు త్రాగి రోగాలు రాని జనాలు ఒక్కరైనా కలరా ?
అందుకే సందు సందు ముందు పెట్టారు ఓ "మందు" దుకాణం !!
ఆ "మందు"తో తీర్చుకుంటున్నారు ఓటేసిన జనం ఋణం !!
<<>><<>><<>><<><><<>><<>><>>
బాపూ బొమ్మా (ళీ) నిన్నొదలా!!
బపూ బొమ్మలంటే నాకెంతో కసి !
ఆ బొమ్మల్ని చూసి
చూడగానే చింపేస్తా!!
ఆ పై అంటించేస్తా!!
కలకాలం నా ఆల్బమ్స్ లో దాచేస్తా!!
)<><><><><><><><><><>(
గోడమీద బొమ్మ
అలనాడు ఈ ఇంట వుంటే ఓ వీసీఆర్ !
ఆ ఇంటాయన నిజంగా గొఫ్ఫోడే సార్ !!
ఇప్పుడేమో ప్రతి గదికీ ఓ డివిడీ !!
ఈనాడిక వుంటున్నది గది గోడల మీద వ్రేలాడే ఓ ఎల్సీడీ !!
<:><:><:><:><:<><:><:>
చా ! చా !ఛానళ్ళు !!
దొంగ స్వాములు : మాయ వేషగాళ్ళు !!
అంటూ చూపిస్తాయి మస్తుగా టీవీ న్యూస్ చానళ్ళు !!
వాళ్ళు ప్రసారం చేసే ఖరీదైన తాయెత్తుల ప్రచారాలు !!
కావా అవి జనాల్ని మోసగించే అపచారాలు !!??
తెలుగోడి తెగులు !!
మన తెలుగోడెప్పుడో ఏదో పద్యం రాసాడట: ఏమిటా గొప్ప ?!
అందులో వాడిన అక్షరాలు తెలుగులోనివే కావా? ఇక ఏమిటో వాడి గొప్ప !
మరొ తెలుగోడు ఏదో గోడు చెబుతున్నాడు గొంతు నొక్కేసేయ్ !!
మరో తెలుగోడు పైకొస్తున్నట్లున్నాడు క్రిందికి తోసేసేయ్ !!
‌‍^V^V^V^V^V^V^V^V^ V^V
నేను స్ఠానిక దిన పత్రికలో సురేఖార్ట్యూన్ల పేర వ్రాసిన ఈ కవితలు( ? ) చదివి
పై బాపూ గారి కార్టూన్లో లా బోరు ఫీలయి పారిపోవద్దని కోరుకుంటూ..............................
జ్యోతి బుస్తకములవారిచే బ్రచురించబడిన "రసికజన మనోభిరామము"
గ్రంధము నుండి సత్తిరాజు లక్ష్మీనారాయణ అను నిజ నామము గలిగిన
బాపు అనే వారిచే చిత్రించబడిన వ్యంగ్య చిత్రమునుండి పై చిత్రరాజము
సంగ్రహించబడినది! చదువరులు గమనించ
గలరు! స్వస్తి !!