Monday, June 28, 2010

ఒరేయ్! బురుగూ ! ఇవ్వాళ మన నవ్వుల ముళ్లపూడి వారి పుట్టిన రోజురోయ్!!

ఈ రోజు మన బుడుగు పుట్టిన రోజురోయ్ !!

జూన్ 28, 1931 న రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ లో ఉన్న( ఇప్పుడు అక్కడ గార్డెన్స్ ఏవీ కనిపించవులెండి, ఏమంటే
ఇప్పుడవన్నీ "ఆల్ కట్ గార్డెన్స్") లేడీస్ హాస్పటల్లో ఓ చిన్నారి "బుడుగు" పుట్టాడు. ఆ బుడుగే పెరిగి పెద్దవాడై
మాటల చమత్ ’కారాల’తో నవ్వుల జల్లులు కురిపుస్తున్నారు. ఆయనే శ్రీ ముళ్లపూడి వెంకట రమణ. ఋణాలందహరి,
రాధాగోపాళం, గిరీశం లెక్చర్లు లాంటి అమోఘమైన రచనలతో అశేష పాఠకుల అభిమానాన్ని చూరగొన్నారు. చిన్ననాడే
బాపుగారు తోడై రమణ అంటే బాపు, బాపు అంటె రమణ అని స్నేహం అనె పదానికి స్మతి చిహ్ణం గా నిలచింది. ఆంధ్ర
వారపత్రికలో '56-57లలో వెలువడిన బుడుగు చిచ్చులపిడుగు తో చిన్నారులకు సహితం ప్రేమ పత్రులయ్యారు.
" దాగుడు మూతలు" లాంటి హాస్య చిత్రానికే కాకుండా "ఆలయ మణి" తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో తీసిన
"గుడిగంటలు" చితానికి అద్భుతమైన సంభాషణలు వ్రాసి మాటల రచయితగా కూడా పేరు పొందారు. ఆంధ్ర వార పత్రికలో
ఆయన వ్రాసిన సినిమా సమీక్షలు ఆలోచింపజేసేవిగా ఉండేవి. "సువర్ణసుందరి" చిత్రానికి సమీక్ష వ్రాస్తూ ఒక చోట
ఇలా అంటారు. "ఇ.వీ.సరోజ వేషంలో పార్వతీ దేవి" ఇక్కడి రమణ గారి చమత్కారం చూశారుగా!. నిర్మాతగా మారి,
శ్రీ బాపుతో అందాలరాముడు లాంటి ఆణిముత్యాలను అందించారు. ఆత్రేయతో కలసి మూగ మనసులుకు మాటలు
నేర్పారు. ప్రేమించిచూడు మొ" చిత్రాలకు పాటలు వ్రాశారు. శ్రీ రామోజీరావు నిర్మించిన శ్రీ భాగవతం చిత్రానికి మాటలు,
కొన్ని పాటలు వ్రాశారు. "స్వాతి" వార పత్రికలో ఆయన వ్రాసిన తన ఆత్మీయ కధతో ఈ నాటి పాఠకులకూ దగ్గరయ్యారు.
ఈ నాటి యువలోకం తమకు ఎదురయ్యే కస్టాలను నస్టాలను ధైర్యంగా ఎలా ఎదుర్కో వచ్చో తను వ్రాసిన "కోతికొమ్మచ్చి"
ద్వారా చూపించారు. కోతికొమ్మచ్చి మొదటి భాగం విడుదలైన నెలలోనే 3 ముద్రణలను అందుకోవడం అరుదైన విషయం.
శ్రీ ముళ్లపూడి రచనలన్నిటినీ శ్రీ యమ్బీయస్.ప్రసాద్ గారి సంపాదకత్వంలో 8 సంపుటాలుగా విశాలాంధ్ర ప్రచురణాలయం
ప్రచురించింది. ఈ నాటి పాఠకులకు ఆ నాటి ఆయన రచనలను చదివే అవకాశం ఈ పుస్తక ప్రచురణలవల్ల కలిగింది. మరో
విశేషం ’కోతొకొమ్మచ్చి’ శ్రీ యస్పీ.బాలుగారి మధుర స్వరం తో సీడీల రూపంలో వెలువడ్డాయి!ఆయన చెప్పే కధల్లో జంతు
జాలం కూడా వాటి భాషల్లోనే మాట్లాడతాయి. కాకులు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటాయి. వాటికి పాపం "రెక్కాడితేగాని
దొక్కాడదట.! చీమలేమో "పుట్ట"దీసి (అంటే మన భాషలో "కొంపదీసి"అన్నమాట) అంటాయి. ఇలా ఎన్నెన్నో భాషలు!
ఈ భాషలన్నీ మీరు నేర్చుకోవాలంటే ’ఋణాలందహరి" చదవాల్సిందే ! ఈ 28 తో ఆయన 80 లో ప్రవేశిస్తున్నా నిజానికి
ఆయన 8 ఏళ్ళ "బుడుగే"! ఆయనకు మనందరి తర్ఫున జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన మరిన్ని రచనలతో
పాఠకలోకాన్ని అలరిస్త్తారని ఆశిస్తూ............. యమ్వీ.అప్పారావు(సురేఖ) నవీ ముంబాయి..




Wednesday, June 23, 2010

ఓ మంచి పుస్తకం : వంశీ కి న(మె)చ్చిన కధలు


ఓ మంచి పుస్తకం : వంశీ కి న(మె)చ్చిన కధలు
ఓ మంచి పుస్తకం : వంశీ కి న(మె)చ్చిన కధలు
మంచి కధలు వ్రా(తీ)యటంలో పేరు పొందిన ప్రముఖ దర్శకుడు, రచయిత వంశీ తన కొత్త
పుస్తకం "వంశీకి నచ్చిన కధలు" పేరిట విడుదలచేశారు. రచయితగా ఆయన కధలు,"మా
పసర్లపూడి కధలు","మా దిగువ గోదావరి కధలు" చదివిన పాఠకులు ఇందులో తనతో బాటు
ప్రముఖరచయితల 50 కధలను తప్పక మెచ్చుకుంటారు. ఇందులోని ప్రతి కధా దేనికదే ఆణి
ముత్యమే! దయ్యాల కధలు, దయ్యాల లాంటి మనుషుల కధలు మనల్ని కదలిస్తాయి.శ్రీ వంశీ
తను ఎన్నుకున్న కధలతో మనను పరవిశింప జేస్తారు. "నల్ల సుశీల" అన్న ఆయన స్వంత
కధలో ఓ వర్ణన చదివితే సినిమా తెరపైలా ఆ ద్రుశ్శ్యం మన కళ్ళెదుట అగుపిస్తుంది. ఉదాహరణకు
"ఆ రోజు
పసుపురంగు పిట్ట ఒకటి టిల్లచెట్ల గుబుర్లలోకి దూరి చిగుళ్ళని మాత్రమే రుచిగా తింటోంది.
నేలమీద పడున్న పచ్చి తాటాకు మీదికి చేరిన రెండు ఎర్రతొండలు దెబ్బలాడుకుంటున్నాయి.
కొండ దిగువున మేస్తున్న గేదె వీపు మీద వాలిన కాకి నిశ్శబ్దంగా కూర్చుంది. గాలికి వూగుతున్న
సొలప చెట్టు ఆకు మీదికి జేరిన రామచిలక కిందికి జారిపోకుండా కాళ్ళతో పట్టుకుంది. గంతులేస్తూ
పరిగెత్తుతున్న చిన్న గొర్రెపిల్లని ఎలాగయినా పట్టుకోవాలని వెనకాలే పరిగెడుతున్నాడు కొండ
ముసలాడు."
చదువుతుంటే మనం అక్కడే వున్నట్టుగా అనిపించడంలేదూ!
ఇంత మంచి కధలకు శ్రీ బాపు బొమ్మలు మరింత అందాన్ని అందించాయి. ఈ 50 కధలూ
మనకు రూ.200/-లకే అన్ని పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది.

Monday, June 21, 2010

లంచావతారాలు





లంచమనెడి ఉప్పు
క్లార్కు తింటే తప్పు
ఘనుడు తింటే ఒప్పు
ఓ కూనలమ్మా!
అన్నారు శ్రీ ఆరుద్ర.

అప్పుడప్పుడూ మనం లంచావతారాలను వల వేసి పట్టుకున్నారని పేపర్లలో టీవీల్లో చదువుతుంటాము,చూస్తుంటాము. కళ్ళ ఎదుట నిత్యం అగుపించే దానికి ఇలా వల వేసి పట్టు కోవలసిన అవసరం వుందా అనిపిస్తుంది. లంచగాళ్ళపై ఎన్నో సినిమాలు దాదాపు అన్ని భాషల్లో వచ్చాయి. వాటికి విపరీతమైన ప్రజాదరణ లభించాయి. లంచం తీసుకొనే మహానుభావులు కూడా ఆ సినిమాలను కుటుంబ సమేతంగా చూసి ( సినిమా హాళ్ళలో ఉచితంగానే సుమా) హీరో లంచగొండి విలన్లను చితకబాదినప్పుడు చప్పట్లు కొట్టి కేరింతలు కొడతారు. ఐనా సినిమా అయిపోయాక ఏ మాత్రం మార్పు వస్తుందా? రానే రాదు. మరునాడు షరా మామూలే. మామ్మూల్లు మాములే! మరో విషయం మనం మన పిల్లలకు ఉగ్గుపాలతోనే ఈ లంచాలను నేర్పుతున్నామేమో అనిపిస్తుంటుంది.నువ్వు ఆ పని చేసి పెడితే నీకో బొమ్మ లెకపోతే ఓ చాక్లెట్ కొనిపెడతా అనో మరోటొ ఆశ చూపిస్తాం. ఇంట్లో పనికి సాయం చేయడం ఓ భాధ్యత అని ఎంతమంది తల్లితండ్రులు గుర్తిస్తున్నారు.ఓ సంఘటన ఈ సంధర్భంలోమీతో పంచుకుంటున్నాను. మా మితృడి షాపుకు వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి వచ్చి" మీరు ఠాగూర్ సినిమా చూసారా? చాలా బాగా తీసాడు కదండీ " అంటూమాట్లాడటం మొదలెట్టాడు. వెంటనే నా స్నేహితుడు కౌంటర్ నుంచి ఓ ఐదు వందల నోటు తీసి అతని
చేతిలో పెట్టాడు. ఎలా వచ్చాడో అంతే వేగంగా వెళ్ళిపోయాడు."ఇదేమిటి అలా డబ్బు ఇచ్చావు " అని
ఆశ్చర్యంగా నే నడిగితే "అదంతే, అతనో ఉద్యోగి. నెలనెలా షాపులకు వెళ్లి మామూళ్ళు కలెక్ట్ చేసుకుంటాడు"
అని జవాబివ్వగానే "ఔరా!"అని నే నోరెళ్ళబెట్టా.

Sunday, June 20, 2010

ఈ రోజే కాదు ప్రతి రోజూ గుర్తు వచ్చే మా నాన్నారు !

మీ ఇంట్లో ఎవరంటే నీకు ఇష్టం అని అడిగితే నేను ఈనాటికీ నాన్న అనే చెబుతాను.
మా నాన్నగారు మాతో ఓ స్నేహితుడిగానే మెలిగేవారు. అలానే ఆయన అంటే ఓ
విధమైన భయం కూడా ఉండేది. ఆ రోజుల్లో మా నాన్నగారు బ్యాంకు నుంచి ఇంటికి
వచ్చేటప్పటికి రాత్రి చాలా ఆలశ్యమయేది. ఆయన కోసం నిద్రపోకుండా నేనూ,అక్క
సరోజిని మేలుకొని ఉండేవాళ్ళం.చెల్లి కస్తూరి మాత్రం నిద్రపోయేది. ఎంత రాత్రైనా ఓ
కొత్త పుస్తకం చదివి గాని నిద్రపోయేవారు కాదు. ఆదివారం వచ్చిందంటె మాకు
పండుగ రోజే! నాన్నగారు సండే స్టాండర్డ్ పేపర్ ( ఇందియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజుల్లో
ఆదివారం మాత్రం ఆ పేరుతో వచ్చేది)లోని కామిక్స్ చదివి వినిపించేవారు. అందులో
మజీషియన్ మాండ్రేక్, బ్రింగింఅప్ ఫాదర్, లిటిల్ కింగ్ రంగుల కామిక్స్ వచ్చేవి. టిట్
బిట్స్, శంకర్స్ వీక్లీ, ఫిల్మిండియా, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, ఆంధ్ర పత్రిక వీక్లీ, మడ్రాస్ మైల్,
చందమామ,బాల పత్రికలను కొనే వారు. అలా ఆయన నాకు పుస్తకాలమీద,పత్రికల
మీద అభిరుచిని పెంచారు. సినిమాలు ఎలా తీస్తారు, కార్టూన్ సినిమాలు ఎలా తయా
రవుతాయి లాంటి విషయాలను చెప్పేవారు. ఆదివారం మార్నింగ్ షోలకు ఇంగ్లీష్
సినిమాలకు తీసుకొనివెళ్ళెవారు. మైయిన్ సినిమా ముందు చూపించే మిక్కీ మౌస్
కార్టూన్లకోసం సంబరపడెవాళ్ళం. మా ఇంట్లో పెద్ద హెచ్యమ్వీ గ్రామఫోన్ ఉండేది.
1948లో స్టీవర్ట్వార్నెర్ అనే అమెరికెన్ రేడియో కొన్నారు.అప్పుడు గ్రామఫోన్ అమ్మే
శారు.ఇంట్లో నేనొక్కడినే ఏడ్చాను. రేడియోలో ఐతే పిల్లల ప్రోగ్రాములు వస్తాయి అని
నాన్నగారు నన్ను ఓదార్చడం ఇంకా గుర్తుంది. తరువాత నే ఉద్యోగం లో చేరాక
స్టీరియో రికార్డు ప్లేయర్ కొంటె నాన్న గారు ఎంతో సంతోషించారు. ఆయన చేతిలో
ఎప్పుడూ రీడర్స్ డైజెస్ట్ పత్రిక ఉండేది. 1944 నుంచి ఆ పత్రికను ఆయన కొనే వారు.
ఇప్పుడు నేను అయన అలవాటును కొనసాగిస్తున్నందుకు ఆనందం గా వుంది.
నాన్న గారు నాకు ఎప్పుడూ ఓ మాట చెప్పేవారు. ఏ నాడూ ఏ వస్తువునయినా
అరువుగా తీసుకోవద్దని. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని. అప్పుడే మనకు విలువ
గౌరవం ,మనం ఉద్యోగంలొఉన్నా లేకపోయినా ఉంటుందనే వారు. మా నాన్న గారు తన 81
ఏట దివంగతులైనప్పుడు, ఆయణ్ణి కడసారి చూడాలని వచ్చిన ఓ ప్రముఖుడు శ్మశాన
వాటికకు వచ్చి మమ్మల్ని తన కారు లొ ఇంట్లో దిగపెట్టారు. అప్పుడు మా నాన్నగారు
చెప్పిన మాటలోనిజం తెలిసింది. శెలవు రోజుల్లో నాన్న మమ్మల్ని గోదావరి రైల్వే స్టేషన్కు
తీసుకొని వెళ్ళి ప్లాట్ఫారం చివర గోదావరి బ్రిడ్జ్ వరకు తీసుకొని వెళ్ళేవారు. అక్కడ బ్రిడ్జ్
పై కాపలా ఉండే రిజర్వ్ పోలీసులు నాన్నగారిని చూసి సల్యూట్ చేస్తే మాకు చాలా గర్వంగా
ఆశ్చర్యంగా ఉండేది. వాళ్ళు మీకెలా తెలుసు అని అక్కయ్య అడిగితే మా బాంక్ రిజర్వ్
బాంక్ కి పాత నోట్లు పంపేటప్పుడు సెక్యూరిటీగా వస్తూవుంటారు అని చెబితే అదంతా ఓ
వింతగా ఉండేది. మా నాన్నగారి పేరు మట్టెగుంట వెంకట సుబ్బారావు. ఆయన ఆనాటి
ఇంపీరియల్ బాంకు లో చేరి (1955 లో స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా గా మారింది) 1959లో
రిటైర్ అయ్యారు. నాన్నగారికి క్లబ్బులకువెళ్ళడం, సిగరెట్లు లాంటి అలవాట్లు లేవు. తీరిక
దొరికితే మాతోనే గడిపేవారు. అలాటి మంచినాన్నను ఇచ్చినందుకు భగవానునికి నమో
వాకాలు అర్పిస్తూ నాన్నలందరికీఈ రోజు జేజేలు!

Sunday, June 13, 2010

సైలెంట్ కార్టూన్లను మాటలు లే(రా)ని నవ్వించే చిత్రాలు





సైలెంట్ కార్టూన్ అను మూగ కార్టూనులు
అసలు కార్టూన్లంటే చూడగానే నవ్వొచ్చేవే అసలు సిసలు నవ్వుల బొమ్మలు. మనం ఏ భాష
వాళ్లమైనా ఓ కార్టూనిస్టు వేసిన బొమ్మచూడగానే అర్ధమై పోవాలి. అలాటి కార్టూన్లనే సైలెంట్ కార్టూన్లంటారు.
ప్రఖ్యాత కార్టూనిస్ట్ మితృలు శ్రీ జయదేవ్ బాబు గారు సైలెంట్ కార్టూన్ పేర ఓ సైటె నడుపుతున్నారు.
నాకు సైలేంట్ కార్టూన్లంటే నే ఇష్టం. నేను 1958 లో ఆంధ్ర వార పత్రికలో వేసిన మొదటి కార్టూన్
సైలేంట్ కార్టూనే. ఇలా సైలెంట్ కార్టూన్లే కాకుండా కామిక్స్ కూడా సైలెంట్ వి ఉన్నాయి. అందులో
’లిటిల్ కింగ్’ అనే కామిక్స్ మా చిన్నతనంలో "సండే స్టాండర్డ్" లో ప్రతి ఆదివారం వచ్చేది. ప్రఖ్యాత
మరాఠి కార్టూనిస్ట్ దాదాపు అన్నీ సైలెంట్ కార్టూన్లే గీసారు. ఆయన కార్టూన్లలో కొన్ని మీకు నా బ్లాగులో
ఇంతకముందు పరిచయం చేశాను. మాటలు ఉన్నాకార్టూన్లలో రెండు బొమ్మలు
ఉంటే అందులో ఓ బొమ్మే మాటలాడితే బాగుంటుంది. మిగతా భావం బొమ్మ ద్వారా అగుపించాలి.
" టిఫిన్ చేద్దుగాని రారా, అంటే ఇలా అనుకోలేదు" అన్న నే గీసిన కార్టూన్లో ఇంటికి టిఫిన్ చేద్దామని
వచ్చిన ఫ్రెండ్తో పిండి రుబ్బిస్తున్నతన స్నేహితుడితో అన్న పై మాటల ద్వారా భావం అర్ధమవుతుంది.
ఇలాటి ఒకే వాక్యంతో కార్టూన్లను పండించడంలో శ్రీ బాపు, శ్రీ జయదేవ్, శ్రీ సరసి,బాబు లను ప్రముఖంగా
చెప్పుకోవాలి. రెండు బొమ్మలు ఒకరి ప్రక్క ఒకరిని వేసి ఇద్దరి పైనా మాటలు వ్రాస్తే అది బొమ్మతో
ఉన్న జోకవుతుంది కాని మంచి కార్టూనవదు. ఇల్లాటి కార్టూన్ల ఐడియాలు నాతో బాటు సోదర కార్టూ
నిస్టులందరికీ పుష్కలంగా రావాలని కోరుకుంటూ..........




Sunday, June 06, 2010

అమ్మో జూన్ ! ఆహా జూన్ !!

అమ్మో జూన్ నెల ! ఆహా: జూన్ నెల !!
మొదట అమ్మో జూన్ నెల అనటానికి కారణం చెబుతా. సరిగ్గా 35 ఏళ్ళ క్రితం ,నాకు అంతే
వయస్సు ఉన్న రోజుల్లో శ్రిమతి ఇందిరా గాంధి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఆ చీకటి
రోజుల్లో పత్రికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్రాయకూడదు. వ్యంగ్య చిత్రాలు ప్రచురించ కూడదు.
ఆ రోజుల్లోనే శంకర్శ్ వీక్లీ లాంటి మంచి రాజకీయ కార్టూన్ల పత్రిక నిరశనగా మూసివేయబడింది.
జయప్రకాశ్ నారాయణ లాంటి వ్యక్తులను జైలుపాలు చేసి , ఆ మహానుభావుడి కిడ్నీలు పాడవ
టానికి కారకులయ్యారు. ఈ ఎమర్జెన్సీ విధించడానికి కారణం 1975 జూన్ పన్నెండవ తేదీన
అటుతరువాత జరిగిన కొన్ని సంఘటనలే కారణం. గుజరాత్ రాష్ర్టంలో కాంగ్రెస్ పరాజయం
పొందింది. అదే కాకుండా ఆ రోజే అల్హాబాద్ హైకోర్ట్ శ్రీమతి గాంధి ఎన్నిక చెల్లదనే చరిత్రాత్మక
తీర్పు నిచ్చింది. 1975, జూన్ 25 న ప్రభుత్వం ఎమర్జన్సీ విధించింది. ఆ ఎమర్జన్సీ విషయాలు
ఇప్పటి తరం వాళ్ళకు చాలామందికి తెలియకపోవచ్చు. దినపత్రికలన్నీ తమ సంపాదకీయ
పేజీలను నల్ల రంగులో ఉంచాయి. ఆశోక్ మహదేవన్ అనే ప్రముఖ పాత్రికేయుడు ( ఆయన
కొంతకాలం రీడర్స్ డైజెస్ట్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు) తమ బాధను తన చాతుర్యాన్ని
ఉపయోగించి బాన్ ఉన్నా "టైమ్స్ ఆఫ్ ఇండియా" పత్రిక ప్రకటనను ఇచ్చి తన అక్కసును ప్రజలకు తెలియజేసారు.

O'CRACY, D.E.M., beloved husband of
T.Ruth, loving father of L.I.Bertie, brother
of Faith,Hope and Justicia, died on June 25.

తరువాత 1977 లో ఎన్నికలు జరగి కాంగ్రెస్ చిత్తుగా కేంద్రంలో ఓడిపోయింది.
ఇక ఆహా జూన్ అనడానికి కారణం ఈ నెలలోనె గదా మండే ఎండలు ఎండయిపోయి చిరు
జల్లులు కురిసేది. అంతే కాదండి ఈ నెల పదమూడునే నే ఓ ఇంటివాడినై 47 ఏళ్ళవుతుంది.
ఈ నెల 28 నే తెలుగు పాఠకులకు నవ్వులు పంచిన శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి 80 వ
పుట్టిన రోజు.!.అదండీ సంగతి. చెడ్డ రోజులు మరచిపోదాం. మంచి రొజులు గుర్తుచేసుకొందాం. మరిన్ని
మంచి రోజులకోసం ఎదురు చూద్దాం ! మంచి మనసుకు మంచి రోజులు.

Saturday, June 05, 2010

సుస్వరాల " బాలు " డు !!




సుస్వరాల ’బాలు’డు ! !

ఘంటసాల మాస్టారు లాంటి మధుర గానం
మళ్ళీ మనం ఇక వినలేం, వినం,
అనుకుంటుంటే తెలుగు తెరకు సంగీత సరస్వతి
అందించింది ’పాట’లాడే ఈ చిన్నారి ’బాలు’డిని ! !
పాడేది ఏ పాటైనా, ఏ స్వరమైనా పాటలతో
ఫుట్ ’బాలు’ఆడుతాడు ఈ చిన్నారి పాటల ’బాలు’డు !!
తెలుగేనా అనుకొనే పాటలను ఏదేదో ఎవరెవరో ’పాడు’తున్నారు ! !
వరెవ్వా ! ఎస్పీ బాలుతో వారెవరూ ఏనాటికీ సాటిరారు !
’పాడాలని ఉందంటూ’, ’పాడుతా తీయగా’ అంటూ ముందుకొస్తున్న
కొత్త గొంతులను చేస్తున్నాడు బాలు పరిచయం !!
మా బాలు బహు పాత్రలకు గాత్రధారి !
ఎన్నో చిత్రాల్లో పాత్రధారి !!
చిన్న తెరలో సూత్రధారి !!!
ఆ చిన్నతెర పై బాలు పలికే తుది పలుకుల మంచి మాటలు
విని నడిచే వారుంటే కావా అవి, జీవితానికి పూల బాటలు !!!
****నా సురేఖార్ట్యూ నుల నుంచి
నిన్ననే జన్మదినం జరుపుకున్న శ్రీ పండితారాధ్యుల బాలసుబ్ర్హ్మణ్యం గారికి
శుభాశీస్సులతో...........................................

Friday, June 04, 2010

నేనూ, నా మొదటి కార్టూన్ కధ !




ఈ ఫొటొలొ ఉన్నది చిన్ననాటి మా కుటుంబం. అమ్మ,నాన్నగారితో నేను, అక్క సరోజిని,
చెల్లి కస్తూరి. ఇంకొకటి ఆంధ్ర వారపత్రికలో 1958 లో అచ్చయిన నా మొదటి కార్టూన్..
సంతకం యం.వీ.అప్పారావని ఉంటుంది.
నేను గీసిన మొదటి కార్టూన్ ఆ నాటి ప్రముఖ సచిత్ర వార పత్రిక " ఆంధ్ర వార పత్రికలో
1958 లో అచ్చయింది. తెలుగులో కార్టూనిస్టులకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన మొదటి పత్రిక
ఆంధ్ర పత్రిక అనే చెప్పాలి. బాపూ గారి కార్టూన్లు, జయదేవ్ గారి కార్టూన్లతో బాటు పులిచెర్ల,
బాబు ,సత్యమూర్తి లాంటి కార్టూనిస్టులను పాఠకులకు పరిచయం చేసింది ఆంధ్ర సచిత్ర వార
పత్రికే ! 1954 లొ దసరాకు పిల్లలకు చిత్రలేఖనం పై పోటీలను వయసుల వారీగా ఏర్పాటు
చేసినప్పుడు మా చెల్లితో బాటు నేనూ ఓ బొమ్మ గీసి పంపాను, కానీ మా చెల్లి గీసిన "నేనూ,
మా సంగీతం మాస్టారు" అన్న బొమ్మకు పది సంవత్సరాల వయసు పిల్లల కేటగిరీలో బహుమతి
వచ్చింది. తరువాత నాలుగేళ్ళకు " నిశ్శబ్దం’ అన్ననా బొమ్మ మొదటి సారిగా అచ్చయింది. ఆ
రోజుల్లో ఇప్పటిలా టీవీలు లేవు గదా ! కార్టూన్ల కధలు చదవాలంటే ప్రతి ఆదివారం వచ్చే
"సండే స్టాండర్డ్" ( ఇండియన్ ఎక్స్ ప్రెస్ డైలీ ఆదివారం ఆ పేరుతో వచ్చేది.) లో రంగుల్లో కామిక్స్
చదివే వాళ్ళం. మిక్కీమౌస్ లాంటి కార్టూన్ సినిమాలు చూడాలంటే రెగ్యులర్ ఇంగ్లీషు సినిమాల
ప్రదర్శించే ముందు ఓ పది నిముషాలు చూపించినప్పుడు చూడాల్సిందే. అందుకే ప్రతి ఆదివారం
ఆ కార్టూన్లను చూడటానికి నాన్న గారితో మార్నింగ్ షోలకు వెళ్ళేవాడిని. ఆదివారం "సండే స్టాండర్డ్"
లో ’బ్రింగింగ్ అప్ ఫాదర్’, ’లిటిల్ కింగ్’లాంటి కామిక్స్ వేసేవారు. అలానే ’ఇల్లస్ర్టేటెడ్ వీక్లీలో
"ఫాంటమ్" కోసం ఆతృతతో ఎదురుచూసే వాడిని. నాన్నగారు బ్రిటిష్ వార పత్రిక " టిట్ బిట్స్"
కొనే వారు. అందులో చాలా మంచి కార్టూన్లు , ముఖ్యంగా సైలెంట్ కార్టూన్లు ఉండేవి. ఆ పత్రికలో
అమ్మాయిల పిన్ అప్ బొమ్మలూ ఉండేవి. నాకు కార్టూన్లంటే ఇష్టం కాబట్టి , మా అమ్మగారు కోప్పడుతున్నా
నన్నా పత్రికనునాన్నగారు చూడనిచ్చేవారు. నాకు పుస్తకాలన్నా, పత్రికలన్నా, బొమ్మలు గీయటం అన్నా ఆసక్తి
కలగడానికి మా నాన్న గారే కారకులు. మా చిన్నప్పుడు " బాల" పత్రిక వచ్చేది. అందులో "లటుకు-
చిటుకు" అనే శిర్షిక ఉండెది. చందమామ, యువ పత్రికలో ముఖచిత్రాలు వేసిన శ్రీ వడ్డాది ఆ శీర్షికకు
టైటిల్ బొమ్మ వేసారు. లటుకు,చిటుకులనే ఇద్దరు అబ్బాయిలు తమాషాగా మాట్లాడె మాటలు బలే
గమ్మత్తుగా ఉండేవి. 1956 నవంబరు నుంచి 1957 ఏప్రియల్ వరకు ఆంధ్ర వార పత్రికలో శ్రి ముళ్లపూడి
బాపు గారి బొమ్మల్తో " బుడుగు-చిచ్చుల పిడుగు" వ్రాసేవారు. బుడుగుకు బాపు గారు వేసిన బొమ్మలు,
రమణ గారు బుడుగు అల్లరిని చెప్పిన తీరు నన్ను ఎంతో ఆకర్షించింది. అప్పటి నుంచే బాపు రమణ గార్ల
అబిమానిగా మారిపోయా. మద్రాసు వెళ్ళినప్పుడు తప్పక బాపు రమణ గార్ల దగ్గరకు తీసుకువెల్తాను అనే
వారు మా నాన్నగారు. మద్రాసులో మా నాన్నగారి చిన్ననాటి స్నేహితులు శ్రీ శ్రీనివాస శిరోమణి గారు,
జ్యొతిష్కులు పాతూరి వారు ఉండేవారు. అయినా భాపు రమణ గార్లను కలవడం కుదరనే లేదు. ఆ కోరిక
2005 లో తీరింది. అలానే నా అబిమాన కార్టూనిస్టులు శ్రీ జయదేవ్ బాబుగారిని, ఈనాడు శ్రీధర్ గారిని
కలవాలనే నా చిరకాల వాంచ తీరింది.