Monday, February 28, 2011

బాపుగారు మెచ్చిన బాబుగారి కార్టూన్






మన తెలుగు అక్షరాలలో "ఱ" అనే అక్షరం ఉపయోగం తక్కువే! ఆ మాటకు
వస్తే ఇప్పుడెవరూ " ఱ " ( బండి ర ) ను ఉపయోగించడంలేదు కూడా. ఆ
" ఱ " ని యుపయోగించి ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రీ బాబు ( కొలను వెంకట దుర్గా
ప్రసాద్ ) ఓ కార్టూన్ గీశారు. భాపుగారు ఆ కార్టూన్ చూసి వెంటనే తన స్పందనను
లేఖ ద్వారా ( స్వాతి ) తెలిపారు. నిజంగా ఎంతో అర్ధవంతంగా ఉన్న ఆ కార్టూన్
చాలామంది కార్టూన్ ఇష్టులు చూసేవుంటారు. ఇదివరలో ఆంధ్ర వారపత్రికలో,
అటు తరువాత " స్వాతి " సపరివారపత్రికలో బాబు గారి కార్టూన్లు వచ్చాయి.
శ్రీ బాబు ఇదివరలో కధాచిత్రాలకు కూడా బొమ్మలు వేశారు. ఆంధ్ర వార పత్రికలో
1982-83 లలో " జీవన్ మృతులు " ( బ్రామ్ స్ట్రోకర్ రచన ) సీరియల్ నవల
ఆయన స్వయంగా అనువాదం చేయటమే కాకుండా ఆ కధకు బొమ్మలూ
వేశారు. బాబు కార్టూన్స్ పేరిట 1981లో స్వాతి పబ్లికేషన్స్ ద్వారా పుస్తక
రూపంలో వెలువడింది ఈ పుస్తకం ప్రత్యేకత..ముందు పేజీలో శ్రీ బాపుగారి
"బాబు గీతపై బాపు "గీతా"మృతం !

Sunday, February 27, 2011

రమణగారి చిన్ననాటి జ్ఞాపకాలు



ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రొగ్రాములు గంటసేపు జరిగేవి. కధలు, నాటికలు,
పాటలు ఎన్నో..అవి అయ్యాక బాలన్నయ్యగారు అందరికీ స్వీటు హాటు కూల్ డ్రింకూ,
పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులకు కాఫీ,టీ యిప్పించే వారు-ఆ టిఫిను ప్రొగ్రాంకి నేనూ,
అన్నయ్యగారి అన్నయ్యగారబ్బాయి రాఘవా,తమ్ముడు గోపాల్ ఇన్చార్జిలమి. ప్రొగ్రాం
రిహార్సిలు అవుతుండగా పిల్లలెందరో పెద్దలెందరో లెక్క రాసుకొని కాంటీనుకి వెళ్ళి ఇన్ని
టిఫిన్లు,ఇన్ని కాఫీలు అని ఆర్డరు చెప్పేవాళ్ళం,ఆ రకంగా పిల్లల్లో మొతుబర్లం కాబట్టి
కాంటీనువాడువాడు మా నేస్తం. మేము ఒక వడ,రెండు కూల్ డ్రింకులు,కలర్ షోడా-తాగేసే.
వాళ్ళం.దొంగలెక్కలు అన్నమాట-సాయంత్రం బిల్లులో కలిపేసే వాళ్ళం.ఓసారి కలర్ తాగుతూ
జోకేసుకొని నవ్వాం-నాలుగు చుక్కలు తుళ్ళి చొక్కాలమీద పడ్డాయి-మేమూ చూసు
కోలేదు.ఆ రోజు సాయంత్రం ప్రొగ్రాం అయిపోయి టిఫినులు తినేసి అందరం వాన్
ఎక్కుతుండగా అన్నయ్యగారు రవణా,రాఘవా అని పిల్చారు-కొచెం దూరంలో చెట్టు
కిందే ఒక్కరే నిలబడ్డారు-ఎందుకో అని వెళ్ళాము.
"మీరు ఇవాళ ఒక తప్పు చేశారు-ఇప్పుడు నిజం దాస్తే రెండు తప్పులు-అబద్ధం చెప్పితే
మూడు తప్పులవుతాయి-చెప్పండి" అన్నారు అన్నయ్యగారు-మా రంగుల మచ్చల మీద
మునివేళ్లతో నిమురుతూ.
మేం ఒకళ్లనొకళ్ళను చూసుకున్నాం.కళ్లవెంట నీరు తిరిగింది.దండాలు పెట్టేశాం-
"క్-క్కలర్ సోడాలు తాగాం"అనేశాం
"గుడ్-వెరీ గుడ్"అన్నారు అన్నయ్యగారు మా తలలు నిమురుతూ-మేం ఆశ్చర్య
పడిపోయాం.
"కలర్ సోడాలు తాగినందుకు కాదు-నిజం ఒప్పుకున్నందుకు" అని హహహహ అని
నవ్వేశారు.
"నవ్య" వార పత్రిక సౌజన్యంతో...............
(రేడియో అన్నయ్య గారంటే మొట్టమొదటి పిల్లల పత్రిక "బాల" వ్యవస్ఠాపకులు శ్రీ న్యాయపతి
రాఘవరావు గారు)

Saturday, February 26, 2011

హాయ్! రమణా...నేను బుడుగుని...


ఆదివారం ఈనాడు లో ప్రచురించిన "నాన్నోయ్..." అంటూ
ముళ్లపూడివారిపై ప్రచురించిన ఒక రచన చదివి, మీ
అందరికీ కూడా నచ్చుతుందన్ననమ్మకంతో ఇక్కడ
వుంచుతున్నాను.
( "ఈనాడు" సౌజన్యంతో).

Friday, February 25, 2011

బుడుగు వెంకట రమణగారు






బుడుగు వెంకటరమణ ముళ్లపూడి
అక్షరాలా అక్షరాలతో చేశారు గారడి
అప్పారావు బుడుగు సీగాన పెసూనాంబ రాధాగోపాలం
వీళ్లందరితో మీరు పంచిన నవ్వులు సదా మా గుండెల్లోపదిలం !!
<><><><><><><><><>

రమణగారు పౌరాణిక కధలను , హాస్యకధలను, కరుణగాధలను రమణీయంగా
వ్రాయగలరు. ఆయన వెండితెర నవలలను తన చమత్కారాల మసాలాలను నూరి
పాఠకులకు నవరసాలను అక్షరాలతో ఆడుకుంటూ విందులను పంచారు. "ఇద్దరు
మితృలు" సినిమా నవలను హీరో గురించి ఇలా ప్రారంభిస్తారు.
"పైనున్నవాడు బహు కొంటెవాడు. పెద్దంత్రం,చిన్నంత్రం లేకుండా అందరినీ
ఆడించి, ఆడుకుంటాడు. అరక్క వీడూ, దొరక్క వాడూ అవస్థపడాగా, "వీడి"కి
వజ్రాలూ,"వాడి"కి మరమరాలూ యిస్తాడు. ఉప్పుకి,కప్పురంలా గుబాలించాలన్న
ఉబలాటం కలిగిస్తే, కప్పురానికి ఉప్పులా చవులూరాలన్న సరదా పుట్టించి తమాషా
చూస్తాడు. జీవితం ఉప్పులా కరిగిపోయి, కప్పురంలా హరించిపోయేవరకు ఈ తీరని
కోరికలతో కాలక్షేపం చేయించేస్తాడు. రామదాసుగారు (భద్రాచలం తాలూకా కాదు)
అన్నట్టు,-అంధా "వాడి" లీల."
ఆయన తెలుగు అక్షరాలతో ఆటలాడుకున్న తీరు అన్యులకు రాదు. ఇలాటి
చమక్కుల చమత్కారేలెన్నో రమణగారు చేశారు.
రమణగారూ, మీకు మా జోహార్లు!

Thursday, February 24, 2011

నేనంటే మీకెంత ప్రేమండి ?!




గతనెల జనవరి 26 న ఆయన పెళ్ళిరోజుకు శుభాకాంక్షలు పంపితే
వెంటనే ఫొను చేసి ఆయన అన్న మాట " నేనంటే మీకెంత ప్రేమండి"
అదే ఆయన దగ్గరనుంచి వచ్చే ఆఖరి ఫోనని నేననుకోలేదు. బాపురమణ
లంటె కవలలుకాని కవలలు. ఏ పని చేసినా ఇద్దరూ చేయవలసినదే.
ఓ పెర్సనల్ పని పై రాజమండ్రి వచ్చి మేం ఫలానాచోట వున్నాం అంటూ
ఆప్యాయతగా ఫోను చేసేవారు. ఈ ఉదయాన్నే బి.విజయవర్ధన్ గారి
మెయిల్ చూడగానే పెద్దగా ఏడ్చేశాను. భగవంతుడు ఇలా ఎందుకు
చేశాడా అనిపించింది. ఈ రోజు నేను కోటిఅందాల కోనసీమ గురించి
నా బ్లాగులో వ్రాస్తూ అంతర్వేది అన్న మాట రాగానే ముత్యాలముగ్గులో
కాంట్రాక్టరుకు ఆయన వ్రాసిన డైలాగు గుర్తువచ్చింది.
ఆయన ఇంటికి వెళ్ళితే ఆయన చూపే ఆప్యాయత ఎలా మర్చిపోగలను.
నాకు కానుకగా ఇచ్చే ఏ పుస్తకాన్నైనా బాపుగారు సంతకంచేసి, రమణ
గారిని సంతకం చేయమనేవారు. మొదటిసారి బాపురమణ గార్లను కలసి
నప్పుడు ఆయన సాహితీసర్వస్వం పుస్తకం పై సంతకం చేసి, క్రింద
బాపు సంతకంకూడా ఆయనే చేసి బ్రాకెట్లో ఆధరైజ్డు ఫోర్జరీ అని వ్రాసారు.
తరువాత ఆ పుస్తకాన్ని పోగొట్టుకున్నాను. ఆ విషయం ఆయనకు చెబితే
వెంటనే కోరియర్లో సంతకంచేసి మరోటి పంపిచారు. ఫోను చేయగానే ఆయనే
ముందు నమస్కారమండీ అంటు పలకరిస్తుంటే చాలా ఇబ్బందికరంగా
వుండేది.
.నా కార్టూన్ పుస్తకానికి ముందుమాట వ్రాయమని కోరగానే వ్రాసి పంపి.,
అది అంత తృప్తిగా లేదంటూ మరోటి వ్రాసి పంపిన రమణగారి మంచి మనసును
నాలాటి సామాన్యుడు ఎలా వర్ణించగలడు. భాపుగారికి ఆ శ్రీరాముడు ఈ విషాదాన్ని
తట్టుకొనే శక్తినిచ్చి మాలాటి అభిమానులకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తూ, రమణగారి
కుటుంబానికి నా సానుభూతిని తెలియ జేస్తున్నాను
అవును రమణ గారూ, మేమంటే మీకెంత ప్రేమండీ ? !
.అశృధారలతో, మీ అభిమాన అభిమాని అప్పారావు ( మీరు సృష్టించిన పాత్ర పేరు
కూడా అప్పారావే అవడం నే చేసుకొన్న అదృష్టం!) రమణగారు ఇక మన మధ్యలేరు
అన్నమాటను వ్రాయలేక ఈ రచన మొదలు పెట్టినప్పుడు నా చేతులు వ్రాయలేక
పోయాయి. ఆయన రచనలు చదివినప్పుడు ప్రతిసారి, నవ్వితేనవ్వండిలోని జోకులు
గుర్తొచ్చినప్పుడల్లా ఆయన మన చెంతనే వుంటారు.

కోటి అందాల కోనసీమ



కోనసీమ అందాలను ఎన్నో తెలుగు సినిమాలలో ఆదుర్తి, బాపు, విశ్వనాధ్
మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఓ వైపున సముద్రకెరటాల సవ్వడి,
మూడు వైపుల గోదావరి పాయల గలగలలు, మధ్యన ఆకుపచ్చచీర కట్టినట్లు
చూడచక్కని పంట పొలాలు, ఇరువైపుల బారులు తీరిన కొబ్బరి చెట్లు, ఆహా
ఇంతటి అందాల పకృతిలో జీవించడమంటే అదో చెప్పలేని మధురానుభూతి.
పకృతి అందాలే కాదు ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రాలు, ప్రశిద్ధదేవాలయాలలకు
కొనసీమకు కొదువలేదు.మూడు ప్రక్కల గోదావరి పాయలతో త్రిభుజాకారంలో
కోనసీమ దీవి వుంది. ఇందులో నగరందీవి, ఐ. పోలవరం మండలం దీవి అనే
రెండు దీవులు ఉన్నాయి. కాలక్రమాన గోదావరీ పాయలపై వంతెనలు వచ్చి
రహదారులుగా కోనసీమ దీవులంతా ఒకటిగా మారాయి. వశిష్థ, వైనతేయ,
గౌతమీ నదుల పాయలు కోనసీమలో ప్రవహిస్తున్నాయి. మూడు నదుల
సంగమమైన పవిత్ర జలధారలతో కోనసీమ సస్యశ్యామలమయింది. ఇక
అపారమైన కొబ్బరితోటలకు కొదవే లేదు. కొబ్బరి ఆకుల మధ్య నుండి తన
కిరణాలను పచ్చని చేలపై కురిపిస్తున్న ఆ సూర్యభగవానుని అందాలను
మీరు ఎన్నో సినిమాలలో చూసే వుంటారు. కాలువల వెంబడి చేసే పడవ
ప్రయాణం ఊహించుకొంటేనే ఎంతో మనోహరంగా వుంటుంది. 50 కిలోమీటర్లు
పైగా విస్తరించిన సముద్రతీరం కోనసీమలో పర్యాటకులను విశేషంగా అలరిస్తుంది.
కేశనపల్లి,అంతర్వేది, ఓడలరేవు, కొమరిగిరిపట్నం ( ఇక్కడ స్టేట్ బ్యాంకులో
బ్రాంచి మేనేజరుగా పనిచేసే సదవకాశం నాకు కలిగింది) గ్రామాల్లో సముద్ర
తీరాలు చూడచక్కగా వుంటాయి. వైనతీయనది పై పి.గన్నవరంలో నిర్మించిన
అక్విడెక్టు, వృద్ధగౌతమి మీద ఎదుర్లంక వద్ద నిర్మించిన బాలయోగి ( ఈయన
పార్లమెంట్ స్పీకరుగా పనిచేశారు) వారధి , ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ
దిండి-చించినాడ వద్ద వశిష్ఠ నదిపై నిర్మించిన వంతెనలు ఆ నదీపాయలకు
అమరిన అందాల వడ్డాణాల లాగ వుంటాయి. ఓఎన్జీసీ కోనసీమలో పెద్ద ఎత్తున
చమురు నిక్షేపాల కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. "రవ్వ" చమురు క్షేత్రం
ముంబాయి హై తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగివుంది. కోనసీమలో
అచ్చమైన గ్రామ వాతావరణం అగుపిస్తుంది. వేదపండితులెందరో ఈ నేలను
పావనం చేశారు. అంతర్వేదిలో నున్న లక్ష్మీనర్శింహస్వామి దేవాలయం ఎంతో
ప్రశిద్ధి చెందింది. అంతర్వేది అనగానే బాపు రమణల గార్ల "ముత్యాలముగ్గు"
సినిమాలోని రావు గోపాలరావు డైలాగు " అల్లుడుగారిది అంతర్వేది కాదు,
అమెరికా!" గుర్తోంచ్చిందికదూ! అప్పనపల్లిలోని శ్రీ బాలబాలాజీ ఆలయం, అయినవల్లి
లోని శ్రి సిద్ధివినాయక ఆలయం రాష్ట్రవ్యాప్త ప్రాచూర్యాన్ని పొందాయి. ఆత్రేయపుర
మండలం ర్యాలిలో వేంవేసివున్న జగన్మోహినీ కేశవస్వామి ఆలయం లోని జగన్మోహిని
విగ్రహ శిల్ప సౌందర్యం చూసితీరవలసిందే!

Wednesday, February 23, 2011

ప్రయాణం ప్రమోదానికా ? ప్రమాదానికా ?



ఉదయాన్నే పేపరు చూడగానే భయంకరమైన వార్తలు ! కీ"శే" భమిడిపాటి
రాధాకృష్ణ గారు ( ప్రఖ్యాత నాటక, సినీ హాస్య రచయిత) మాటలు జ్ఝాపకం
వస్తాయి. "ఏమండీ పదకొండు దాటింది ఇంకా స్నానం అవలేదా మేస్టారూ"
అంటె , " పేపర్లో చదివేవన్నీ చావు కబుర్లే కదా, అన్నీ చదివి, ఒకేసారి
స్నానానికి వెళ్ళేటప్పటికి ఇలా లేటవుతున్నది" అని నవ్వుతూ అనేవారు..
ఈ రోజు హిందూ పేపర్లో పడిన పైన మీరు చూస్తున్న ఫొటో ఛూడగానే
నిజంగా వళ్ళు ఒక్కసారిగా జలదరించింది. పుష్పకవిమానంలా మొత్తం
కుటుంబమంతా అలా ఆ బైక్ పై వెళుతుంటే ఆ బైక్ ను చూసి జాలి వేసింది.
వాళ్ళేమో ఏ మాత్రం జాలిలేకుండా జాలీగావిహరిస్తున్నారు. ఓ వేళ ఏ ప్రమాదమైనా
జరిగితే ? ఆటోలో వెళితే డబ్బులవుతాయని ఇలా బైక్ మీద ప్రయాణం చేస్తే
అనుకోనిది జరిగితే హాస్పటల్ ఖర్చులు ఇంతకంటే ఎక్కువ కావడమే కాదు,
శారీరక, మానసిక బాధకూడా వుంటుంది కదా? అందుకే మన పెద్దలు ఇలాంటి
వాళ్ళని చూసే లోభికి మూడింతల నష్టం అన్న సామెతను చెప్పారు.
వార్తాపత్రికల్లో రోజూ ప్రమాదాల కధలు చదువుతూ, టీవీల్లో వార్తలు చూస్తూ
ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో అర్ధం కాదు. పార్కింగ్ లైనుకు కొంచెం ముందు పార్క్
చేస్తే హడావిడీ చేసే మన పోలీసు శాఖ ఇలాటి విషయాల్లో ఎందుకు శ్రర్ధ వహించదో?
బైకుల మీద వీళ్ళ విన్యాసాలు రోజూ చుస్తూ జనాలకు సర్కస్ మీద మోజు
అందుకే పాపం తగ్గిపోయింది !
ఇక బైకులకు నంబరు ప్లేట్లు ఎవేవో పేర్లతో వుంటాయి. మొదట్లో కాస్త హడావిడి
చేసిన మన ఘనత వహించిన ప్రభుత్వం వారు మళ్ళీ కామ్ అయిపోయారు!
నేనుఈ బైకువిన్యాసాలపై స్థానిక దిన పత్రిక "సమాచారం" లో వ్రాసి గీసిన ఓ కార్ట్యూన్:
ఈనాడు ఫ్యాషన్ బైక్ డ్రైవింగ్ ప్రతి ఒక్కరికి !
దీనిపై స్వారీ మాత్రం ముగ్గురికి !!
దూసుకుపోయే వేగానికి లేదు కదా ఏ మాత్రం సెన్స్ !
జనానికి మాత్రం గుండెలదిరే న్యూసెన్స్ !
ఉన్నా లేకున్నా ఒకటే లైసెన్స్ !!
వింటారా "తల" కోసం వాడమంటే ఓ హెల్మెట్ !
బుర్ర లేని వాళ్ళకెందుకులే , పోయేదేముంది,
ఆ బుర్రంతా కాదా "టులెట్" !!

Tuesday, February 22, 2011

" నా టీవీ" సినిమా వార్తలు


కొత్తగా మొదలెట్టిన " నా టీవీ " లో సినిమా వార్తలు చదువుతున్నది నేను,
వింటున్నది మీరే ! తలగీతలు లేకుండా వెంఠనే మీ కన్నుల్లో గుచ్చుతూ,
చెవుల్లో జోరుగా జోరీగలా రొద పెట్టడమే మా వాతల, సారీ వార్తల ప్రత్యేకత.
ఆహా ఒహో ఫిలింస్ తమ చిత్రం "నీనా" విడుదలయి పోయిన సంధర్భంలో
విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. హీరో తండ్రి, అక్క, తమ్ముడు
మాట్లాడుతూ ఇది మహత్తర కుటుంబ చిత్రమని చెప్పారు. దర్శకులు శ్రీ
అయోమయం ఇది చాలా అర్ధంకాని కధా చిత్రమని దీన్ని మొదటిసారి చూసి
కధను చెప్పగలిగేవారు ఎవరైనా వుంటే తమ స్వంత ఖర్చులతో రాజధానికి
వచ్చి కధ వివరిస్తే నేల టిక్కెట్లు రెండు బహుమతిగా అందజేస్తామని, తిరిగి
వెళ్ళాక చిత్రం ఇంకా ఆడుతుంటే మరోసారి చూసి మరోవిధంగా కధ వివరిస్తే
మరో బహుమతి వుంటుందని తెలియజేసారు. నిర్మాత మాట్లాడుతూ హాల్లళ్ళొ
సగం జనం నిండుతుంటే గిట్టని వాళ్ళు, ధియేటర్లు సగం మాత్రమే నిండుతున్నాయని
దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేశంగా అన్నారు.
ఈ చిత్రం చూసి ప్రభావితుడైన ఓ ఎనభైఏళ్ళ పెద్దమనిషి నవయవ్వన మాత్రలు
ఓ వంద ఆబగా మింగి గుర్రు పెట్టి నిద్ర పోయాడనీ, ఉదయం భార్య లేపితే " ఊ
నేనివాళ బలికిపోనూ" అంటూ గారాలు పోయాడని, ఇది ఈ సినిమా గొప్పతనమనీ
కాలరు ఎగరేయబోయి, తను వేసుకొన్నది లాల్చి కనుక సారీ చెప్పారు. ఇక సినిమా
హీరో మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వాళ్ళే చూస్తున్నారు అని చెప్పగా "కొంటె
కోణంగి" పత్రికా విలేఖరి " ఎవరు? ఆపరేటర్లు, గేటు కీపర్లా" అని అడిగితే, ఏం వాళ్ళు
మాత్రం ప్రేక్షకులు కారా అంటూ కారాలు మిరియాలూ నూరుతూ కోపంతో డాన్సు
చేశారు.
ఛీచా ప్రొడక్షన్సు నిర్మిస్తున్న హర్రర్ చిత్రం ప్రారంభిస్తున్న సంధర్బంగా ప్రెస్ మీట్
ఏర్పాటు చేస్తూ తమ చిత్రానికి "చూస్తే చస్తావ్" గా పేరు పెట్టామని, నాయకిగా ఏదో
దేశం అమ్మాయిని ఎన్నుకున్నామని, ఆవిడ పేరు గుర్తులేదని, ప్రక్కనే ఆమె వున్నా
అడిగి మీకు చెబుదామంటే యూనిట్ లో ఎవరికీ ఆమె భాష రాదని వాపోయారు. ఈ
చిత్రం ఆడియో విడుదల క్రొత్త పంధాలో చేస్తున్నామని, మార్కెట్లోకి మొదట బ్లాంక్
సిడీలు విడుదలచేస్తామని, దీని వల్ల పైరసీని అద్భుతంగా అరికట్టవచ్చనీ తెలిపారు.
చిత్రం విడుదలయాక ఆ సిన్మా చూసిన వాళ్ళుంటే ఆ బ్లాంక్ సిడీని వాళ్ళ ఆఫీసు
ఎడ్రసు తెలుసుకొని తీసుకొని వస్తే తమ సంగీత దర్శకులు కాకాని పిచ్చేశ్వరరావు
(కాపిరావు) గారు సరసమైన రేటుకు కాపీ చేసి ఇస్తారని, ఇదివరలో ఆయనకు దొంగ
సిడీలు రికార్డు చేసే వ్యాపారం వుండటంవల్ల ఇందులో ఎంతో అనుభవం గడించారని
తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు పైరసీ దారులకు ఓ శుభవార్త! పైరసీ పై ముఖ్యమంత్రి
ఢిల్లీకి ఆఖరు సారి వెళ్ళి వచ్చాక ఒక నిర్ణయం హైకమాండుతో చెప్పి తీసుకుంటారని
ఈ రోజు అసెంబ్లీ లో తెలియజేశారు. పైరసీపై మంచి నిర్ణయం తెచ్చేదానికి , ఇచ్చెదానికి
కట్టుబడి వున్నామని ఆయన అన్నదానికి పైరసీదారులు హర్షం తెలియజేశారు.
ఇంతటితో ఈ వాతలు ఇక మీకు చాలు! ఉంఠా! నిద్రొస్తుంది!! ఠా! ఠా!! వీడుకోలు!!
గుడ్ బై ఇంక షెలవు!!
( మా హాసం క్లబ్ కార్యక్రమంలో నే వ్రాసి చదివిన తమాషా వార్తలు)

Monday, February 21, 2011

అమ్మ భాష



నేడు మతృభాషా దినోత్సవం!
ఏదో ఒకనాడు ఈ కాన్వెంట్ చదువుల పిల్లలు మిమ్మల్ని అడగొచ్చు!
"డాడీ , అమ్మంటే ఎవరూ ?" అని !!
మనకేమో మన పిల్లలు తెలుగు మాట్లాడితే నామోషీ !
వాళ్ళ నోటంట మమ్మీ, డాడీ అనొస్తే మనకెంతో ఖుషీ !!
"డాడీ" అన్న మాట తన మనవళ్ల నోట విన్న ఓ తాత
పోనీలే మన చిన్నారి ఇలా ఐనా తెలుగులో "డ" గుణింతం
చెబుతున్నాడని సంబరబడ్దాడట !!

మన తెలుగువాళ్ళ దౌర్భాగ్యం మనం మన తెలుగువాళ్ళని మెచ్చుకోం.
తెలుగులో మాట్లాడుకోం. తెలుగు పుస్తకాలు చదవం.పిల్లలకు తెలుగు
ఇంట్లోనైనా నేర్పం. ఇంగ్లీషు చందమామనే కొని పెడతాం. కనీసం వాళ్లకు
తెలుగు చందమామ కధలను మనమేనా చదివి వినిపించం. ఈమధ్యే
ఓ అబ్బాయి మాఇంట్లో చందమామను చూసి ఇదేం మాగ్ అంకుల్
అంటూ అడిగాడు. మీ పిల్లల పత్రిక చందమామ అన్నాను. "వాట్,
ఆ పేరుతో తెలుగులో ఇప్పుడు వస్తుందా?!! "అంటూ ఆశ్చర్య పడ్డాడు.
బాబూ, అసలు ఇది మన తెలుగులోనె పుట్టింది. తరువాత ఇంగ్లీషులో
వచ్చింది అన్నాను. ఒక విషయం లో మాత్రం నేను సంతోషించిన
విషయం , నాగిరెడ్డి, చక్రపాణి తమ చందమామకు ఇంగ్లీష్ లో కూడా
చందమామ అన్న పేరునే ఉంచారు. ఇప్పటి తరం వారైతే " అంకుల్
మూన్" అని పేరు పెట్టేవారేమో !!
బాపు గారు తమ అందాల అక్షరాలతో "అందాల అఆలు" అన్న
పుస్తకాన్ని అందమైన రంగుల బొమ్మల్తో వ్రాస్తే ఆ పుస్తకాన్ని మాకు
తెలుగు రాదుగ అనకుండా, "రాదుగ" ప్రచురణాలయం, మాస్కో వారు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తరఫున ప్రచురించడం కొస మెరుపు.
మనం తెలుగు వాళ్లతో తెలుగులోనే మాట్లాడుదాం! తెలుగు పుస్తకాలూ
(ఇంగ్లీషుతో బాటు) తీసు "కొని" చదువుదాం !! మన తెలుగువాళ్ళమని
గర్వంగా ప్రపంచానికి చాటుదాం !!

Saturday, February 19, 2011

అద్వానీ పీవీ ఐతే !!


ఇప్పుడు అంతా కంప్యూటర్ మాయాజాలమే ! ఎక్కడో ఒకరిద్దరు నాలాంటి వాళ్ళు
తప్ప, ఇందులో నాలుగేళ్ల బుడుగులూ, సీగానాపెసూనాంబలూ ప్రవీణులే!
మద్రాసు నుంచి వేసవి సెలవులకు ఇక్కడికొచ్చిన మామనవడు నృపేష్
( ఐదేళ్ల క్రితం మాట) నా కంప్యూటరుపై ఎన్నెన్నో మాయలు , గేములు చేస్తుంటే
నే ఆశ్చర్యపడుతుంటే , నా వైపు ఓ పిచ్చివాడి వైపు చూసినట్లు ఓ లుక్కేసి,
"అంతా సాఫ్ట్వేర్ తాతా!" అన్నాడు ! ఈ రోజు అది సాంఘిక సినిమా అయినా
సరే కంప్యూటర్ మాయాజాలం వుండాల్సిందే. మా చిన్నతనంలో నాగేశ్వరరావు
కీలుగుర్రం మీద ఆకాశంలో ఎగురుతుంటే చాలా వింతగా వుండేది.కాని, ఇప్పుడు
సామాన్య ప్రేక్షకుడు కూడా ," ఆ! అంతా గ్రాఫిక్స్ మాయ" అనేస్తున్నాడు.
నాలుగేళ్ళ క్రితం The Indian Express పత్రికలో శ్రీ ప్రభుదాద్ దత్తా చేసిన
పై గ్రాఫిక్ ఇమేజ్ ఎందరో పాఠకుల ప్రశంసలను అందుకొంది.
చిత్రం: ఇండియన్ ఎక్సెప్రెస్ సౌజన్యంతో...

Monday, February 14, 2011

అంపైరింగ్ లో హాఫ్ సెంచరీ కొట్టిన మా శాస్త్రి



ఈ రోజు ఉదయాన్నే మా తూగో ఈనాడు చూడగానే మా బ్యాంకు కొలీగ్
బి.వి.యస్.యల్.ఎన్.శాస్త్రి ఫొటో, ఆర్టికల్ చూడగానే, మన
శాస్త్రి బీసీసీఐ అంపైర్ గా పనిచేసిన విషయం గుర్తుకొచ్చింది. ప్రతి సారి
మేము కలుసుకున్నప్పుడు రెటైరయిన మే మిద్దరం ఆ విషయం మాట్లాడు
కోలెదు. ఏ మంటే నాకు క్రికెట్ అంటే ఏ మాత్రం అభిరుచి లేక పోవడం ఒక
కారణం. బ్యాంకులో ట్రాన్సిస్టర్ రేడియోలు చెవిదగ్గర్ పెట్టుకొని,( ఆ రోజుల్లో
ఇంకా టీవీలు బాగా ప్రాచూర్యంలోకి రాలేదు.) ఔట్ అయినప్పుడల్లా పెద్దగా
కేకలు పెడుతుంటే నాకు చాలా చిరాకుగా వుండేది.
శాస్త్రి గారి తో నా మొదటి పరిచయం 1972 లో అమలాపురంలో. 197 2
లో నన్ను ఆఫీసరుగా ప్రమోట్ చేసి అమలాపురం రాజమండ్రి మెయిన్
బ్రాంచినుంచి పోస్ట్ చేశారు. అమలాపురం లో శాస్త్రి రూము లో వుండేవారు.
నేను ఆయనతో బాటు ఆయన రూములో వుండేవాడిని. శాస్త్రి క్రికెట్ బాట్
తోనే కాదు గరిట తిప్పడంలోనూ చాలా ప్రావీణ్యం వుందని అప్పుడే తెలిసింది.
ఉదయాన్నే షడ్రుచులతో వంట చేసేవారు. నాకు ఆయన అలా వండి పెడుతుంటె
కూర్చుని తినడానికి చాలా ఇబ్బందిగా వుండేది. ఆయన బ్యాంకులో కూడా
చాలా బాగా పనిచేసే వారు. శనివారం సాయంత్రం మూడు గంటలకు బయలు
దేరేబస్సులో రాజమండ్రి వచ్చేవాళ్ళం. శాస్త్రి నాన్నగారు కూడా మానాన్నగారికి
అదే స్టేట్ బ్యాంకులో కొలీగ్. అలా మేమిద్దరం రెటైరైన మా తల్లిదండ్రుల దగ్గర
శని ఆదివారాలు గడిపేవాళ్ళం. అప్పటికి ఆయన బ్రహ్మచారి. అటుతరువాత
73 లో తిరిగి రాజమండ్రి ఇన్నీస్పేట బ్రాంచికి ట్రాన్స్ఫరు అయ్యాను.శాస్త్రి హైద్రాబాద్
కు ట్రాన్స్ఫరు అయ్యారు. 1983 లో బిసీసీఐ రంజీ పానల్ కోసం అఖిలభారత
స్థాయిలో నిర్వహించిన పరీక్షలలో శాస్త్రి విజయంసాధించి దేశవ్యాప్తంగా బిసీసీఐ
నిర్వహించిన మ్యాచ్ లలో అంపైర్ గా చేశారు. అలానే బాంబే, బరోడా మాచ్లో
ఆయన ( ఆ మాచ్ లో బాంబే తరఫున సునీల్ గవాస్కర్,వెంగ్ సర్కార్ ఆడారు.
బరోడా వైపు రాజ్ కులకర్ణి ,గైక్వాడ్, కిరణ్మోడే ఆడారు) అంపైర్ గా పనిచేశారు..
ఇలా మన తెలుగు వాడు, మా స్టేట్ బ్యాంక్ ఉద్యోగి, పైగా అతను నా ఆప్త మితృడు
కావడం నాకు ఎంతో సంతోషంగా వుంది. వేలంటైన్ రోజున ( ప్రేమికులంటే ,క్రికెట్,
పుస్తక, సంగీతం లాంటి కళల ప్రేమికులు కూడా కాకూడదా!) మా శాస్త్రి ప్రతిభను
గుర్తు చేసిన "ఈనాడు" ను అభినందిస్తూ శ్రీ శాస్త్రికి మన బ్లాగర్లందరీ తరఫున
శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. అనుకోకుండా ఈ రోజు మాఇంటికి వచ్చిన
శాస్త్రితో గత స్మృతులను నెమరు వేసుకున్నాం.

Saturday, February 12, 2011

విధి-విచితం !! !


నేను విధిని నమ్ముతాను. నేనాడూ ఇలా బ్లాగును స్వంతంగా నిర్వహిస్తానని,
ఎక్కడో పూనాలో వుండే ఫణిబాబు గారు రాజమండ్రికి వచ్చి కొంతకాలంగడపటం,
ఆయన మా హాసం క్లబ్ కువచ్చి అటు తరువాత మా ఇంటికి వచ్చి నా చేత
బ్లాగును ఓపెన్ చేయించి నా గురించి చి"సౌ"జ్యోతిగారికి చెప్పి నా బ్లాగును
వ్రాయటానికి సహకారం అందించడం , ఇవన్నీ నిజంగా ఊహకు అందని
నిజాలు. నేను బ్లాగుని ప్రారంభించాక ఎందరో బ్లాగరులు ఆప్త మితృలయ్యారు.
శ్రీ కె.శివరామప్రసాద్,శ్రీ బి.విజయవర్ధన్,శ్రీరాధేశ్యాం , శ్రీ కర్లపాలెం హనుమంత
రావు గారు ఇలా ఎందరో, మహానుభావులు. అలానే బాపు రమణగార్లు,
శ్రీ జయదేవ్, శ్రీ సరసి నాలాంటి మామూలు వ్యక్తిపై చూపించే అభిమానం
నాకు దేముడిచ్చిన వరం. అసలు ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, పాత
ఫొటోలు చూస్తుంటే పై ఫొటో అగుపించింది. మూడేళ్ళ వయసున్న నన్ను
ఎత్తుకున్నది ఎ.నరసింహమూర్తి అనే ఆయన. అప్పుడు ఆయన మా నాన్నగారు
పనిచేస్తున్నబ్యాంకులో ( ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)మెసెంజరుగా
పనిచేసే వారు. విధిఅనండి, లేకపోతే మరోటో ఏదైనా అనండి, నేను, ఆయన
కలసి ఒకే చోట ఉద్యోగం చేస్తామని ఆయన, ఊహించి వుండరు. 1972
లో నేను రాజమండ్రి (ఇన్నీసుపేట) స్టేట్ బ్యాంకులో అక్కౌంటెంట్ గా , ఆయన
హెడ్ మెసెంజరుగా పనిచేశాము. నన్ను అపురూపంగా , నాకు బ్యాంకులో ఏ మాత్రం
అసౌకర్యం కలగకుండా , చిన్నప్పుడు ఎంత ప్రేమతో చూసుకొనే వాడో అలానే చూసే
వారు. నన్ను బ్యాంకులో అబ్బాయిగారు అనే పిలచేవారు. ఓ సారి బ్రాంచిమేనేజరు
అలా పిలవటం విని "అలా పిలవకూడదు, నరసింహమూర్తి" అంటే, 30 ఏళ్ళనుంచి
అలానే పిలుస్తున్నాను. ఇప్పుడు ఎక్కౌంటెంట్ గారూ అని పిలవలేనండి అనేవారు.
ఆ రోజుల్లో ఆప్యాయతలు అలా వుండేవి. ఆ ఫొటో చూడగానే నా మదిలో మెదలిన
ఆనాటి ఆలొచనలు మీతో పంచుకుంటున్నాను.
.

హరికధా పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారు (1865-1945 )

ఆదిభట్ల నారాయణదాసుగారు హరికధా పితామహులే కాకుండా ఎన్నెన్నో
రంగాల్లో నిష్టాతులు. ఆయన అనేక భాషలు మాట్లాడగలిగేవారు అష్టావధానాలు
చేశారు. ఆయన దాదాపు 21 హరికధలను స్వరపర్చారు. సంస్కృతాంధ్రాలలో
నూటికి పైగా గ్రంధాలను రచించారు. ఆయన చమత్కారి. ఒకసారి శ్రీదాసుగారు
హరికధ చెప్పడానికి ఉపక్రమించగానే ఆ సభలో వున్న ఓ కోణంగి హరికధ కాదు
గిరికధ చెప్పండి అని వేళాకోళంగా అన్నాడట. వెంటనే దాసుగారు నవ్వుతూ,
"అలానే నాయనా, గిరికధే చెప్పుకుందాం" అని గిరిజాకళ్యాణం" ప్రారంభించారట.
మరో సంధర్భంలో శివుని పై ప్రార్ధనను హాస్యంగా ఇలా చెప్పారట!

హెడ్డున మూను, స్కిన్నుపై అంతను డస్టును ఫైరు నేత్రమున్,
సైడున గ్రేట్ బుల్లు, బహు చక్కని గేంజస్ హెయిర్ లోపలన్,
బాడీకి హాఫెయౌచు నల పార్వతి మౌంటెన్ డాటరుండ,
ష్టుడ్డు డివోటీ దండము, ప్రేయరు చేయుచున్.

ప్రఖ్యాత రచయిత, కార్టూనిస్ట్, కళారత్న శ్రీ బ్నిం తన "మరపురాని మాణిక్యాలు"
లో ఇలా అన్నారు.

కమనీయం ఆ కవనం
రమణీయమతని రాగం
"ఆదిభట్ల"స్వరకధనం
హరికధలకు స్వర్ణయుగం.

Thursday, February 10, 2011

మా ఊరి చరిత్ర





మా ఊరి పేరు రాజమహేంద్రవరం! అదే నండి ఆ పేరును పలకలేని ఆంగ్లేయులు
మా ఊరి పేరును రాజమండ్రి అనేశారు. అఖండ గోదావరిమాత తీరంలో వున్న
నగరం మా రాజమండ్రి..ఇప్పుడు ఈ నగరాన్ని తెలుగులో రాజమహేంద్రి అని
పిలుస్తున్నారు. వెయ్యేళ్ళ చరిత్ర గల పట్టణం రాజమండ్రి. గోదావరికి తూర్పున
వెలసింది. . తూర్పు చాణుక్యుల ఆధీనంలో ఈ నగరం వుండేదని చరిత్రకారులు
అంటారు. ప్రఖ్యాత చరిత్రకారుడు మెగస్తనీస్ పేర్కొన్నముఖ్య పట్టణాలలో
రాజమండ్రి కూడా వుంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యులు
దక్షిణ, పశ్చిమ ప్రాంతాలనుంచి శతృవుల దాడులు పెరగటంతో రాజధానిని
మార్చాలని భావించి, వేంగి, కళింగ సీమలకు మధ్య ఉన్న గోదావరి తీరంలోని
ఈ పట్టణం అనువుగా వుంటుందని తలచి విమలాదిత్యుని పెద్ద కొడుకు విష్ణు
వర్ధన రాజరాజు, రాజరాజనరేంద్రుడు ఈ పట్టణాన్నినిర్మించాడని చరిత్రకారులు
చెబుతారు. ఆదికవి నన్నయ మహాభారతాన్ని ఇక్కడే తెనిగించారు. ఆయన
రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. ఆయన పేరిట ఇక్కడ నన్నయ విశ్వవిద్యాలయం
ఈ మధ్యనే స్థాపించారు. రాజరాజనరేంద్రుని తరువాత వచ్చిన తూర్పు చాళుక్య
రాజులు అంత:కలహాలతో సతమతమయ్యారు. ఈ అదును చూసుకొని మహమ్మద్
బీన్ తుగ్లక్ కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రున్ని ఓడించి పట్టణాన్ని తన స్వాధీనం
చేసుకొన్నాడు. అటుతరువాత రెడ్డిరాజుల పాలన వచ్చింది. వీరభద్రారెడ్డి కాలంలో
రాజమహేంద్రవరం అమరధామంగా విల్లసిల్లింది. ఈయన ఆస్థాన కవి కవిశౌర్యభౌమ
శ్రీనాధకవి.దక్షిణాదినుంచి విజయనగర చక్రవర్తులు, ఉత్తరం నుండి గజపతులూ
దండెత్తి రెడ్డిరాజుల పాలనకు చరమ గీతం పాడారు.1447 లో కటక రాజ్యధిపతి
కపిలేశ్వర గణపతి రాజమహేంద్రవ్రం దాని పరిసరాలపై దండెత్తి కళింగ రాజ్యాన్ని
దక్షిణ దిశగా విస్తరించాడు. అటు తరువాత గజపతులకు విజయనగర చక్రవర్తులు
అడ్డుకొన్నారు.పురుషోత్తమ గజపతి విజయనగర రాజులను జయించడానికి
సాకరు బరిగి సుల్తాన్ సహాయాన్ని కోరి అందుకు ప్రతిగా రాజమండ్రి, కొండపల్లి
రాజ్యాలను ఇచ్చాడు.భమనీ రాజ్యపాలన విచ్చిన్నమైన తరువాత పురుషోత్తమ
గజపతి కుమారుడు ప్రతాపరుద్ర గజపతి రాజమండ్రి పై దాడి చేసి మహమ్మదీయులను
తరిమికొట్టాడు.శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతాపరుద్ర గజపతి కుమార్తె చిన్నాదేవిని
వివాహం చేసుకొన్నాడు. శ్రీ కృష్ణదేవరాయలు తన మామగారికి రాజమహేంద్రవరం
వరకుగల రాజ్యాన్ని ఇచ్చి విజయనగరం వెళ్ళాడు. అటు తరువాత గజపతులకు
కుతుబ్షాకు యుద్ధాలు జరిగాయి ఏన్నో యుద్ధాలు తిరుగుబాటులు జరిగాక
ఫ్రెంచి సేనానాయకుడు బుస్సీ రాజమహేంద్రవరాన్ని ముఖ్యపట్ట్ణంగా చేసుకొని
పాలించాడు 1758లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రెంచివారు ఓడారు.
బ్రిటిష్ సేనాపతి కల్నల్ ఫోర్ట్ రాజమండ్రిని స్వాధీనం చేసుకొన్నాడు బరంపురం నుంచి
రామేశ్వరం వరకు విస్తరించిన మద్రాసు ప్రెసిడెన్సీలో రాజమహేంద్రవరం ఒక ముఖ్య
కేంద్రంగా వుండేది.ఆనాటి నుంచి ఈనాటి వరకు సాంస్కృతీ కేంద్రంగా, వాణిజ్య కేంద్రంగా
పేరుపొందింది. ఈనాడు రాజధాని నగరం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పట్టణాలలో
ఉన్న బొమ్మన, చందన వస్త్రనిలయాల పుట్టిల్లు రాజమండ్రే ! ప్రశిద్ధ చిత్రకారుడు
దామెర్ల రామారావు ఈ ఊరి వాడే. ఆయన పేరుతో ఇక్కడ దామెర్ల ఆర్ట్ గేలరీ వుంది.
ఎందరో రీసెర్చ్ స్కాలర్స్ ఉపయొగపడుతున్న గౌతమీ గ్రంధాలయం ఇక్కడ వుంది.
సినీ రంగానికి చెందిన ప్రముఖులలో ఆదుర్తి, రాజబాబు, గరికిపాటి రాజారావు
ఇక్కడి వారే. వహిదారహ్మాన్, షావుకారు జానకి, కృష్ణకుమారి వారి తండ్రుల ఉద్యోగరిత్యా
ఇక్కడే వాళ్ళ బాల్యాన్ని కొంతకాలం గడిపారు. ఆనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు
ఇక్కడ, పరిసర ప్రాంతాలలో షూటింగులు జరుపుకున్నాయి, జరుపుకుంటున్నాయి.
ఆసియాలోనే పొడవైన రోడ్డు కమ్ రైలు వంతెన ఇక్కడ వుంది. విమానయాన సౌకర్యానికి
ఎయిర్పోర్ట్ వుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడి ఆర్ట్స్ కళాశాలలో పనిచేశారు. ఇక్కడికి
దగ్గరలోనే వున్న కడియంలో నర్సరీ గార్డెన్స్ వున్నాయి. రాజమండ్రి దగ్గరలో ఎన్నో
దేవాళయాలున్నాయి. ఇక్కడినుంచి పాపికొండలు విహారానికి ఆధునిక సౌకర్యాలతో
మోటార్ బోట్స్ పై ప్రతి రోజూ వెళ్ళవచ్చు. రాజమండ్రి లోని రాళ్ళబండి మ్యూజియంలో
ఎన్నో చారిత్రాత్మక శిల్పాలను చూడవచ్చు. సమీపంలోనే గల కోనసీమలో బారులుతీరిన
కొబ్బరిచెట్లు, గోదావరి కాలువలు కేరళ తీరాన్ని మరపిస్తాయి, ఆ పకృతి అందాలు .
మురిపిస్తాయి.ఆంధ్రకేశరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజమండ్రి మునిసిపల్
చైర్మన్ గా పనిచేశారు. హాస్య రచయిత భమిడిపాటి కామేశ్వరరావు, ఆయన కుమారులు
హాస్యనాటక, సినీరచయిత భమిడిపాటి రాధాకృష్ణ ఈ నగరానికి చెందినవారు. సంఘసంస్కర్త
కందుకూరి వీరేశలిగం, రచయిత శ్రీపాద ,సుబ్రహ్మణ్య శాస్రి ,కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
(ఆస్థాన కవి) నడయాదిన పవిత్ర ప్రదేశం రాజమండ్రి 1866 మునిసిపాలిటిగా ఏర్పడి
25-3-1995లో కార్పొరేషన్గా ఏర్పడింది. కాశీమజలీ కధలు (రచయిత మధిర సుబ్బన్న
దీక్షితులు) ఇక్కడే పుట్టాయి. ఆంధ్ర కేశరి టంగుటూరి ప్రకాశం (మాజీ ముఖ్యమంత్రి)
రాజమండ్రి మునిసిపల హై స్కూల్లో చదువుకున్నారు. బుడుగు ముళ్లపూడి వెంకట
రమణగారు 1931 జూన్ 28 న ఇక్కడే ఆల్కాట్ గార్డెన్స్ లోని లూధరన్ మిషన్ హాస్పటల్లో
(లేడిస్ హాస్పటల్) పుట్టారు.
వేదంలా ఘోషించే గోదావరి

వేదంలా ఘోషించే గోదావరి- అమర
ధామంగా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం
అన్నారు ఆరుద్ర
నేను అక్కడఅక్కడ, చదివినవి , చెప్పగా విన్నవి ఆధారంగా వ్రాశాను, తప్పులుంటే
మన్నించండి. .

Tuesday, February 08, 2011

కధా చిత్రకారుడిగా శ్రీ ఆర్కే లక్ష్మణ్


రాజకీయ కార్టూనిస్ట్ గా శ్రీ ఆర్కే లక్ష్మణ్ మనకు తెలుసు. ఆయన
టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రికలో ప్రతి రోజూ వేసే పాకేట్
కార్టూన్లు, వాటిలో ఆయన సృష్టించిన కామన్ మాన్ పాత్ర పాఠకులను
విశేషంగా ఆకర్షించడమే కాకుండా, ఆ పాత్రకు శిలావిగ్రహాన్ని తయారు
చేసి ప్రతిస్ఠించారంటే చిత్రమే కదా ?!
టైమ్స్ పత్రిక సంస్థ ప్రచురించే The Illustrated Weekly Of India
లో కధలకు కూడా శ్రీ లక్ష్మణ్ బొమ్మలు వేసేవారు. దురదృష్థవసాత్తూ
ఇప్పుడా మంచి పత్రిక చాలా ఏళ్ళ క్రితమే ప్రచురణ ఆగిపోయింది. ఆ
పత్రిక September,,21, 1980 సంచికలో ఆయన సోదరులు, ప్రఖ్యాత
కధారచయిత శ్రీ ఆర్కే నారాయణ్ వ్రాసిన The Restored Arm ( శిల్పి
జక్కన) కధ కు చిత్రాన్ని గీశారు. బ్రష్ స్ట్రొక్స్ తో ఆయన గీసే చిత్రాలలో
ప్రత్యేకత వుంది. ఆనాటి ఆ బొమ్మ మీకోసం, మీ ముందు వుంచు
తున్నాను.

Monday, February 07, 2011

ఫొటో పజిల్ ! !


పైనున్న ఈ ఫొటోలో మధ్య నున్న వ్యక్తి ఎవరో చెప్పగలరా ?
ప్రయత్నించి చూడండి. ఓ చిన్న క్లూ. ఈయన ఓ ప్రఖ్యాత
సంగీత విద్వాంసుడు !
జవాబు తెలియకపోతే క్రింద నున్న జవాబు లోని పదాలను
కుడి నుండి ఎడమకు జాగ్రత్తగా చదవండి!
<><><><><><><><><><><><><><><><><><><>

జవాబు
తఖ్యాప్ర తగీసం లుసుoద్వావి షిజో న్ సేమభీ
1950లో ధార్వాడ్ ఆలిండియా రేడియో స్టేషన్ ప్రారంభో సంధర్భంగా తీసిన ఫొటో. ( ది హిందూ సౌజన్యంతోత్సవం
)

Sunday, February 06, 2011

కార్టూన్ పుస్తకాలు






తెలుగు వాళ్ళు హాస్యప్రియులు. మనకు కార్టూనిస్టులకు కొదవలేదు.
శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు నా సురేఖార్టూన్స్ పుస్తకానికి
ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు. "భారతిలో "త.రా (తలిశెట్టి
రామారావుగారి ప్రభంధకన్య ) తరవాత తరతరానికీ ఎదిగే కార్టూన్ లు
లక్షోపలక్షలు ... ఎందరో మహానుభావుకులు ఎన్నోవేసేశారు ; మరి
ఈ తరం వారికేం మిగిల్చారు అని జాలిపడుతూ వీపు నిమరబోయాం -
వీపు బదులు పిక్కలు అందాయి. అంటే - జాలిపడే స్థితికాదు; అసూయ
పడేస్థాయికి ఎదిగారు; ఎదుగుతున్నారు. కొత్త కొత్త గీతలూ రాతలూ
జోకులూ బావిలో నీరులా వూరుతూనే ఉన్నాయి కొత్త వాళ్ళు వస్తూనే
వున్నారు.అది తరగని గని..............."
అంటె మనకు మంచి కార్టూనిస్టులకు లోటే లేదు. కానీ మునపటిలా
కార్టూనిస్టులని ప్రోత్సహిస్తున్న పత్రికలు అంతగా కనిపించడం లేదు.
శ్రీ బాపు, జయదేవ్, శంకు, చంద్ర, బాలి,రాగతి పండరి, సరసి కార్టూన్లు
ఇప్పటికీ అలరిస్తూనే వున్నాయి. ఈ ప్రముఖుల కార్టున్లన్నీ పుస్తక
రూపంలో వచ్చాయి. కానీ ఎందుకో శ్రీ శంకుగారు తమ కార్టూన్లను
పుస్తకంగా ఇంతవరకూ తీసుకు రాలేదు. త్వరలో ఆయన కార్టూన్లూ
పుస్తకంగా వస్తాయని ఆశిద్దాం.
ప్రముఖ తెలుగు కార్టూనిస్టుల కార్టూన్లన్నీ కలిపి రచనశాయి గారు
"రచన కార్టూన్లు " పేర ఓ పుస్తకాన్ని ( వాహిని బుక్ ట్రస్ట్ ) ప్రచురించారు.
ఇందులో 79 కార్టూనిస్టుల 242 కార్టూన్లు వున్నాయి. ఇంగ్లీష్ లో( విదేశీ)
మాత్రం ఇలాటి కార్టూన్ల సంకలనాలు ఎక్కువగా వెలువడుతాయి.
వాటిలో FUNNY BUSINESS, KISS ME YOU FOOL, CARTOON
LAUGHS, LOVER BOY పుస్తకాలు నా దగ్గరవున్నాయి ఆర్కే లక్ష్మణ్,
బాల్ ధాకరే ల కార్టూన్ల పుస్తకం గత ఏడాది శ్రీ విజయవర్ఢన్ నాకు కానుకగా
అందించారు. INDIA TODAY BOOK OF CARTOONS పేరిట అజిత్
నైనాన్. మారియో., ఎమ్వీ శంకర్ , అబూ, జయంతొ, మంజుల, మిక్కీ పటేల్,
పూరి,, పొన్నాప్ప మొదలైన ప్రఖ్యాత కార్టూనిస్టుల కార్టూన్లతో 2000 సం"
లో ప్రచురించారు. FUNNY WORLD ! పేరుతో అజిత్ నైనాన్ కార్టూన్ల
పుస్తకాన్ని TARGET పిల్లల పత్రిక ప్రచురించింది.
గ్లాడ్చ్యూ మీట్ యూ పేరుతో శ్రీ జయదేవ్, నాగురించి నేను పేరిట
కుమారి రాగతి పండరి తమ ఆత్మకధలను వ్రాశారు. బాపు గారి గురించి
శ్రీ ముళ్లపూడి తమ "కోతికొమ్మచ్చి" లొ జతగా వ్రాశారు.

Saturday, February 05, 2011

రచయిత, కార్టూనిస్ట్ శ్రీ బ్నిం -2010 కళారత్న పురస్కారం



బ్నిం పేరుతో అనేక కార్టూన్లు, కధారచనలు చేసిన శ్రీ బియ్యెన్మూర్తి గారికి
2010 సంవత్సరానికి కళారత్న అవార్డు వచ్చిందన్న సంతోష వార్త నాకు
రెండు రోజుల క్రితమే తెలిసింది. ఆయన కధా రచయితగా, కార్టూనిస్టుగా
ఈ పురస్కారానికి ఎన్నికయ్యారు. ఆయన వివిధ పత్రికల్లో పనిచేశారు.
చిన్నతెరకు స్క్రిప్ట్ లు వ్రాశారు. నాలుగు సార్లు నందులను( అవార్డులు )
ఇంట్లో కట్టేసుకున్నారు. ఆయన వ్రాసిన "మిసెస్ అండర్ స్టాండింగ్" పుస్తకం
ఫ్రెండ్షిప్ రోజున (2-8-09)న బాపుగారింటికి వెళ్ళినప్పుడు ,బాపు గారు, రమణ
రమణగారు సంతకం చేసి నాకు కానుకగా ఇచ్చారు. ఆ పుస్తకం గురించి
ఇంతకముందు నా బ్లాగులో పరిచయంచేశాను. బ్నిం చాలా కధలు,వ్యాసాలు
వ్రాశారు. ఆయన కధలన్నీఒక్కొక్కటి నాలుగయిదు పేజీలే వుంటాయి!
కాని ప్రతి కధ గుండెను తాకుతుంది. అక్కడక్కడ కలుక్కుమని పిస్తుంది.
కనుకొనల్నో ఒ కన్నీటి చుక్కను మనకు తెలియకుండానే రాలుస్తుంది.
"మరపురాని మాణిక్యాలు" పేరిట బ్నిం భావ చిత్రాలుగా పుస్తకంలో ఆనాటి
పెద్దలను నేటితరానికి గుర్తుచేస్తూ వారి కేరికేచర్లతో చక్కని కార్ట్యూన్లగా
మన ముందు వుంచిన తీరు ప్రశంశనీయం. ఇప్పుడు తెలుగుకూడా
చదవడం మర్చిపోయిన మన తెలుగువాళ్ళ కోసం ఇంగ్లీషులో కూడా
ఆ పెద్దల గురించి చెప్పానని బ్నిం చెప్పారు. అలా వ్రాసి ఈ పుస్తకానికి
మరింత సార్ధకతను కలిగించారు
గిడుగు రామమూర్తి గారి గురించి శ్రీ బ్నిం చెప్పిన ఓ మచ్చుముక్క!:
ప్రజలందరు చదువగలుగ
తేనెల తేటల తెలుగు
కావాలన్నట్టి గిడుగు
కవనానికి కొత్త వెలుగు

శ్రీ బాపు అందమైన ముఖచిత్రంతో 132 పేజీలతోఅందంగా ముద్రించిన ఈ
పుస్తకాలు నవొదయ, విశాలాంధ్ర దగ్గర దొరుకుతాయి (కొనుక్కోడానికి)
బ్నిం గారికి స్వయంగా అభినందనలు తెలియజేయాలంటే :
12-11-448, వారాసిగూడ,సికింద్రాబాదు-500061
ఉత్తరం వ్రాయండి. మాట్లాడాలంటే:ఇంట్లో: 040-27070169,
జేబులో: 9490745820

Thursday, February 03, 2011

ఆనాడు ఈనాడు శ్రీధర్ కార్టూన్లు





నిన్నటి "ఈనాడు" లో శ్రీధర్ కార్టూన్ చూడగానే ఆయన గురించి నా
భావాలు మీతో మరో సారి పంచుకోవాలనిపించింది. ఈ రోజుల్లో ప్రతి
ఉద్యోగి అతను నిర్వహించే శాఖ ఏదైనా మంచి జీతభత్యాలకోమరోదానికో
తను పని చేసే సంస్ఠలను వదలి మరో సంస్థకు వెళ్ళడం పరిపాటి. కాని
శ్రీధర్ దాదాపు ఆనాటి నుంచి ఈనాటివరకు తన సంస్థను వదలలేదు.
ఉదయాన్నేఏ వార్తాపత్రిక చూసినా రాజకీ(చ)య నాయకుల
వికృత చేష్టలు, మాటలు, ఘోరాలు చదివి వికారం పుట్టిస్తున్న ఈ
రోజుల్లో శ్రీధర్ కార్టూన్ చూడగానే ఎంతో రిలీఫ్ కలుగుతుంది.
"ఈనాడు కార్టూన్లు" పేర 1999 ప్రచురించిన శ్రీధర్ కార్టూన్ల
పుస్తకంలో అయన ఇతర కాంగ్రెస్ నాయకులతొ బాటు ఎన్టీయార్
పై సంధించిన వ్యంగ్య బాణాల కార్టూన్లు కడుపార మనల్ని నవ్విస్తాయి.
ముఖ్యమంత్రి అయిన ఆతరం నటుడి పైన , ముఖ్యమంత్రి
అవాలనుకొంటున్నఈ తరం నటుడి పైన శ్రీధర్ గీసిన నవ్వుల బొమ్మలను
చూడండి. బాగున్నాయి కదూ?!
కార్టూన్లు శ్రీ శ్రీధర్, ఈనాడు సౌజన్యంతో

Tuesday, February 01, 2011

ఆనందం! పరమానందం ! బ్రహ్మానందం !!!


గిన్నెస్ బుక్కు పైకెక్కిన మన బ్రహ్మానందంగారి పుట్టిన రోజు ఈ వేళ!
ఆయనకు జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 2003లో " హాసం"
సంగీత హాస్యపత్రికలో " ప్రముఖాముఖి " పేరిట ప్రముఖ హాస్య నటులు
ఆయనతో చేసిన ముఖాముఖిని "హాసం" సౌజన్యంతో మీకోసం, క్లుప్తంగా. .
<><><><><><><><><><><><>
ఎల్బీ శ్రీరాం :మొన్నా మధ్య ఓ షూటింగులో ఎనభైఏళ్ళ పెద్దాయన "నువ్వు
తెనాలి రామలింగడి వంటివాడవయ్యా" అని అభినందించినప్పుడు మీ అనుభవం
ఏమిటి?
జవాబు: ఎం.ఏ. తెలుగు లిటరేచర్ చదివి లెక్చరర్ గా పనిచేసిన నాకు ఆ మాట
వినగానే గుండెల్లో చక్కిలిగిలి పెట్టినట్టినిపించింది.
ఎమ్.ఎస్.నారాయణ: ఉదయంనుండి రాత్రి వరకు ఎప్పుడు చూసినా మీరు ఏవో
జోకులు వేస్తూ సూక్తులు చెబుతూ, అందర్నీ అలరిస్తూ నాన్ స్టాప్ గా గొంతుకి
విశ్రాంతి లేకుండా మాట్లాడుతూనే వుంటారు.ఇన్నేళ్ళ నా పరిశీలనలో ఒక్క
రోజు కూడా మీకు వాయిస్ ట్రబులిచ్చిందనిగాని, డబ్బింగ్ మీ కారణంగా
పోస్ట్పోన్ అయిందని గానీ నేను వినలేదు. ఈ విజయ రహస్యం ఏమిటి?
జవాబు: ఇది నన్నిడిగితే నేనేం చెప్తాను? గొంతు నాది కానీ, ట్రబులివ్వడం
ఇవ్వకపోవడం నా చేతిలో ఏం వుంది? నన్ను ఏ డాక్టరు దగ్గరకైనా తీసుకెళ్ళి
టెస్ట్ చేయిస్తే ఆయనైనా ఏమైనా చేస్తాడేమో!? సరదాగా..మనలో మాటగా
చెప్పుకోవాలంటే నాకు గొంతెమ్మ కోరికలేవీ లేవుగా...అంచేతైవుండొచ్చు.
భరణి: మళ్ళీ జన్మలో పక్షిగా పుట్టాల్సి వస్తే ఏ పక్షిగా పుడదామనుకుంటున్నారు?
ఎందుకు?
జవాబు: ఏ పక్షైనా గూడు కట్టుకొనే స్వభావం వుంటుంది.జన హృదయంలో శాంతికి
నిర్వచనంగా శాశ్వతమైన గూడును కట్టుకున్న పావురాయి జన్మంటే నాకిష్టం.
(మనలో మన మాట...అక్కుపక్షి, దిక్కుమాలిన పక్షి, శకున పక్షి లాంటి జన్మలు
అసలొద్దు బాబోయ్ )
ఏ.వి.యస్: తెలుగులో వున్నంత మంది కమేడియన్స్ ఇంకెక్కడా లేరంటారు.
ఇది అడ్వాంటేజా? డిస్ అడ్వాంటేజా?
జవాబు : తెలుగు,హిందీ,తమిళం,మలయాళం అనే కాకుండా అన్ని భాషల్లోనూ
ఎంత ఎక్కువమంది కమెడియన్స్ వుంటే అంత మంచిది. దాని రిజల్టు కూడా
అంత బావుంటుంది. ఎవరికి తోచిన రీతిలో వారు నవ్విస్తారు. టోటల్ గా ప్రేక్షకులంతా
నవ్వుతారు. ప్రేక్షకులంతా నవ్వుతూ వుండాలనే ఏ కమెడియనైనా సరే కోరుకోవాలి.
కనుక ఎక్కువమంది ఉండటం అడ్వాంటేజే !
ఆలీ : లైఫ్ లో ఎదురయ్యే అప్స్ అండ్ డౌన్స్ తట్టుకుంటూ ఇంత బాలన్స్ ఆఫ్
మైండ్ తో ఉండటం మీకెలా వచ్చింది?
జవాబు: లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్...జీవితాన్ని జీవిస్తూ "ఈ అప్స్ అండ్ డౌన్స్"
ఏంటి అని అనుకుంటే ఎలా ?! అంచేత సుఖమైనా కష్టమైనా ఒకేలా స్వీకరించగల
సాధనను మనసుకి అలవాటు చేయ్యాలి. ఆ అలవాటు బాలన్స్ ఆఫ్ మైండ్ రావటానికి
తోడ్పడుతుంది. " లైఫ్ ని ఈజీగా తీసుకుంటేనే ఇంత డిఫికల్ట్ గాఉందే...సీరియస్ గా
తీసుకుంటే ఇంకెంత దారుణంగా వుంటుందో " అని దర్శకులు రాఘవేంద్రరావు గారు
ఓసారన్నారు. ఆ మాటల్లో ఎంత డెప్త్ ఉంది !? ఇవన్నీ మెంటల్ బాలెన్స్ రావటానికి
ఉపయోగపడతాయి.
కోట : బ్రహ్మయ్యా !
నీకు నిండు నూరేళ్ళయ్యా...
హాస్యానికే బాసికం కట్టేశావయ్యా !
ఇలాగే కంటిన్యూ అయిపో అయ్యా....
గాడ్ బ్లెస్యూ అయ్యా....
మరి నా గురించేంటయ్యా...
కొంచెం చెప్పయ్యా....
జవాబు: కోటయ్యా...
నీది ఎవరూ అనుసరించలేని రూటయ్యా
నీకు నువ్వే సూటయ్యా
అందుకే నువ్వెప్పుడూ గ్రేటయ్యా..
oOooOooOo