Wednesday, April 28, 2010

మన కవులు వర్ణించిన "ప్రభంధ కన్య" ప్రత్యక్షమైతే ! !




కవులు వర్ణించిన ఆ నాటి ప్రభంధ కన్యలు నిజంగా అలానే ఉంటే ? !
ఎలా వుంటుందో ఊహించండి. మన తెలుగులో మొట్టమొదటి కార్టూనిస్ట్
శ్రీ తలిశెట్టి రామారావు 1931 లో ఆంధ్రపత్రిక ఉగాది వార్షిక సంచికలో
కవులు వర్ణించిన స్త్రీ రూపాన్ని ఊహించి చిత్రంగా గీసారు. ఈ చిత్రాన్ని
నాకు మితృలు, "రచన" శాయిగారు పంపిచారు. అలానే మరో చిత్రం 1950
లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ పత్రిక " The Illustrated Weekly of India"
లో The Indian Look పేరుతో శ్రీ యస్.యమ్.రాస్ గీసినది. ఈ బొమ్మళ్ళొ
తుమ్మెద రెక్కలలాంటి కురులు, సంపంగి మొగ్గలాంటి ముక్కు, ధనస్సు లాంటి
కనుబొమ్మలు, చేపల్లాంటి కళ్ళు, తూనీగ నడుము (అతి సన్నని), అరటి దూటల
లాంటి కాళ్ళు, కమల ఫూవు రేకల లాంటి పాదాలు నిజంగా ఊంటే ఆ వనిత రూపు
ఎలా వుంటుందో చూపించారు.


!

Tuesday, April 27, 2010

ఈ టీవీ 2 లో నేను !



గత మార్చి లో ఈటీవీ -2 వారు నా పుస్తకాలు,రికార్డులు, స్టాంపు,నాణేల సేకరణ
గురించి చిత్రీకరించి ప్రసారం చేసారు.. ఆ ప్రసార విశేషాలు ..


Monday, April 26, 2010

మా నవ్వుల మాస్టారు భమిడిపాటి రాధాకృష్ణ !

"హాస్యబ్రహ్మ" భమిడిపాటి కామేశ్వరరావుగారి గురించి ఇదివరలో వ్రాసాను. ఆయన అబ్బాయి
శ్రీ భమిడిపాటి రాధకృష్ణ గారు పండిత పుత్ర శుంఠహ: అనే నానుడి తప్పని రుజువు
చేసారు. ఆయన హాస్యరచయితగా ఎన్నో నాటకాలు వ్రాసారు. అలానే దాదాపు డెభై తెలుగు
సాంఘిక సినిమాలకు కధా మాటలు కూర్చారు. ’బ్రహ్మచారి’, ’భలే కోదళ్ళు’, "వింత
కాపురం", ’గోవుల గోపన్న’, ’నేనంటే నేనే’, ’పెళ్ళి కూతురు’.’సిపాయి చిన్నయ్య’, ’కధా
నాయకుడు’, ’అల్లుడే మేనల్లుడు’అందులోకొన్ని. ఆయన బియస్సీ చదివాక ఇంజనీరింగ్
చదవాలనిపించి తండ్రికి తెలియకుండా రెకమెండేషన్ మీద సీటు సంపాదించాడు. ఈ విషయం
తెలుసుకున్న కామేశ్వరరావుగారు ఆ కాలేజీకి వెళ్ళి వీడు ఈ సీటుకు అర్హుడు కాదు. అర్హత
వున్న కుర్రవాడికి ఇవ్వండి అని చెప్పి నిజాయితీగా రాధాకృష్ణగారిని చేరనివ్వలేదు.తరువాత
ఆయన సిఏ చేసేలోపల ఖాళీగా వుండటం ఎందుకు నాలా కొంతకాలం టీచర్ ఉద్యోగం చెయ్య
మన్న తండ్రి కోరిక మన్నించి రాజమండ్రిలో సిటీ హైస్కూల్లో కొద్దికాలం టీచరుగా పనిచేసారు.
అప్పుడే అయన వద్ద నాకు స్టూడెంటుగా చదువుకునే అదృష్టం కలిగింది. ఆయన
సినిమా రంగం వదలిపెట్టివచ్చి ఇక్కడరాజమండ్రి దానవాయిపేటలోని ఆయన స్వంత ఇంట్లో వుంటుండగా
కలసినప్పుడు నేను చెప్పకుండానే నే నాయన స్టూడెంట్నని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
ఆయన రచించిన అమోఘ పుస్తకం " DAY -TO-DAY CALENDAR FROM 45 B.C. TO
5555 A.D " నాకు కానుకగా ఇస్తూ నా ఇంటిపేరుతో సహా వ్రాసి సంతకం చేసి ఇవ్వడం అయన
జ్ణాపకశక్తి కి నిదర్శనం. ఆపుస్తకానికి ఆయన "భమిడిపాటి కాలెండర్": అని పేరుపెట్టారు. సినిమాల
నుంచి విరమించాక ఆయన జ్యోతిష్యం నేర్చుకున్నారు. తెలుగు అక్షరాలకు, దీర్ఘాలు,గుణింతాలు
సహా ప్రతి అక్షరానికీ ఒక్కో సంఖ్యను కూర్చి కొన్నిలక్షల అంకెలను తెలుగు అక్షరాలకు కూర్చారు !
తెలుగులో వ్రాసిన ఓ వ్యక్తి పేరును బట్టి ఆ అక్షరాలకు వచ్చిన అంకెలను బట్టి పుట్టిన తేదీని ఖచ్చితంగా
చెప్పగలిగే వారు. యన్టీఆర్ అలా తన పేరును బట్టి పుట్టిన రోజు చెప్పమంటే ఆయన పుట్టినరోజు కరెక్ట్ గా
రాలేదట. మీరు నా విషయంలో తప్పారని యన్టీఆర్ అంటే మీ పేరులోనే ఏదో తప్పుంది, మీ అసలు పూర్తి
పేరేమిటొ తెలుసుకోండి అన్నారట.అప్పుడు ఆయన నిమ్మకూరులోని స్కూలు రికార్డులు పరిశీలిస్తే ఆయన
పేరు నందమూరి తారక రామారావు చౌదరి అని వుందట. ఆ అక్షరాలతో అంకెలను కూర్చితే పుట్టిన తేదీ
సరిపోయింది ! అలానే సినీ నటుడు విక్రం విషయంలోను. అతని అసలు పేరు కెన్నేడీ అని వ్రాస్తేనే కరక్టుగా
వచ్చింది. ఈ విషయాలన్నీటినీ ఆయన్ని కలిసినప్పుడల్లా చెప్పేవారు.’భజంత్రీలు’,’మనస్తత్వాలు’,’అంతా
ఇంతే’,’పెళ్ళి పందాలు’, "పేటెంట్ మందు’, నాటికలు, ’ఇదేవిటి”దైవశాసనం’,’కీర్తిశేషులు’లాంటి నాటకాలు
వ్రాసారు. "కీర్తిశేషులు" నాటిక గురించి నవ్వుతూ ఓ విషయం చెప్పేవారు. ఆయన "కీర్తిశేషులు" నాటకానికి
చాలా పరిషత్తులలో బహుమతులొచ్చాయి. బహుమతులు వచ్చిన వారి ఫొటోలను ఒక పత్రిక ప్రచురిస్తూ
’కీర్తిశేషులు భమిడిపాటి’ అనిప్రచురించింది.ఇది చూసిన చాలా మంది వారింటికి సంతాపలేఖలు వ్రాసారట.
ఒక ఊళ్ళో ఏకంగా సంతాప సభ ఏర్పాటు చేసారని నవ్వుతూ చెప్పేవారు.
సెప్టెంబరు 4, 2007 న నిజంగా ఆయన కీర్తిశేషులయ్యారు. విచిత్ర మేమంటే అయన మరణ తేదీని
డైరీలో ముందుగా వ్రాసిపెట్టుకోవడం ! ఆయనను సన్మానించుకోనే అదృష్టం మా "హాసం క్లబ్"కు అంతకు
ముందే జరిగింది.

Sunday, April 25, 2010

శ్రీ శ్రీ శతజయంతి , టొకున శ్రీ శ్రీ జోకులు !!

" శ్రీ శ్రీ పుట్టిన తేదీ 15-4-1910 కావచ్చు.లేదా 30-4-1910 కావచ్చు. అతడు మాత్రం
తాను 2-1-1910 నాడు జన్మించానని విశ్వసించాడు.ఇది శ్రీశ్రీగా సుపరిచితుడైన శ్రీరంగం
శ్రీనివాసరావు జన్మ విశేషం. ఒక పరిశోధకుడి ప్రకారం శ్రిణివాసరావు సాధారణ నామ
సంవత్సర చైత్ర శుద్ధ సష్టినాడు- అంటే 1910 ఏప్రియల్ 15వ తేదీన జన్మించాడు .
విశాఖపట్ణం పురపాలక సంఘం వారు ఖరారుచేసిన తేదీ 30-4-1910 అని విరసం వారు
సృష్టీకరిస్తున్నారు. అతడు 1910లో జన్మించాడనేది నిర్వివాదాంశం"--( మహాకవి శ్రీశ్రీ-
బూదరాజు రాధాకృష్ణ-సాహిత్య అకాడమీ ,ఢిల్లీ ప్రచురణ ) ఆయన శత జయంతి ఈ నెలలోనే.
టోకున శ్రీశ్రీ జోకులు
* ఒకసారి మదరాసు సెంట్రల్ స్టేషనులో శ్రీశ్రీ కనబడితే మొక్కపాటి నరసింహశాస్త్రిగారు
" ఊరికేనా ? " అని ప్రశ్నించారు.
" ఊరికే " అని శ్రీ శ్రీ సమాధానం.
** ** ** ** ** ** ** ** ** ** **
* ఈ రెండో జోకులోనూ శ్రీశ్రీ గారే కధానాయకుడు. మదరాసులో పూర్వం ఒక తెలుగు
కాఫీహొటేలు వుండేది. దాని ప్రత్యేకత పెసరట్లు. కొందరం వెళ్ళి కుర్చీలలో కూర్చొని కావలసినివి
ఆర్డరిస్తున్నాం.శ్రీశ్రీ తనకు సహజమైన పరధ్యానంలో వున్నాడు. అందరం అట్లు ఆర్డరుచేసి "శ్రీశ్రీ
గారూ ! మీకూ అట్టు చెప్పేం " అన్నాం.
ఆయన " అట్లే కానిండు" అన్నాడు.
** ** ** ** ** ** ** ** ** **
* ఒకసారి....ఈసారి మదరాసులో కాదు, విశాఖపట్టణంలొ, ఆందులోనూ సముద్రతీరాన శ్రీ శ్రీ
గారు, వేదుల సత్యనారాయణశాస్త్రిగారూ కలసి నడుస్తున్నారు. వేదులవారు అనే రోలు శ్రీ శ్రీ అనే
మద్దెలతో తన కష్టాలు చెప్పుకొని " ఎందుకొచ్చిన బ్రతుకు శ్రీ శ్రీ ! మనిషిగా, పైపెచ్చు తెలుగు కవిగా
పుట్టడం కన్న ఈ సముద్రతీరంలో పీతగా పుట్టినా బాగుండెది, ఈ కష్టాలు లేకపోను " అన్నారట.
శ్రీ శ్రీ " పీత కష్టాలు పీతవి ! " అని ఫిలాసఫించాడు.
** ** ** ** ** ** ** **
"జ్యోతి " ( 1963) సౌజన్యంతో........................

Saturday, April 24, 2010

యాడ్స్ ! యాడ్స్ !! యాడ్స్ !!!




ప్రకటనలు ! ప్రకటనలు !
ఈ రోజు పత్రికలలోను, టీవీ, రేడియోలలో ,రోడ్డు పై పెద్ద పెద్ద హోర్డింగులలోను
మనకు ప్రకటనలు అడుగడుగునా అగుపిస్తున్నాయి. ఇక సినిమాలహాళ్ళలో
సినిమాకు ముందర చూస్తున్నాం. ఇలా వ్యాపార ప్రకటనలు ఓ పత్రికలో మనం
చూసినప్పుడు మేటర్ తక్కువ యాడ్స్ ఎక్కువ అని అనుకుంటుంటాము.
ఎక్కువ మంది చదివే పత్రికలకు ఈ ప్రకటనలు ఎక్కువగా వుండటం సహజమే.
ఆ మాటకు వస్తే పత్రికల మనుగడకు ప్రకటనలే మూలాధారం అన్నది నూరు
పాళ్ళ నిజం. పూర్వానికి ఇప్పటికి పత్రికలలో వచ్చే ప్రకటనలకు మనకు చాలా
తేడా అగుపిస్తుంది. ముద్రణలో వచ్చిన సాంకేతిక మార్పులు ,ప్రజలలో కలిగిన
వివిధ వస్తువులపై వస్తున్న ఆకర్షణ, వ్యాపారంలో పెరిగిన పోటీ దీనికి తప్పని
కారణాలు. ఈ పేజీలో మీరు చూస్తున్న లక్స్ సబ్బు ప్రకటన 1954 ఆంధ్ర సచిత్ర
వార పత్రిక దసరా సంచికలోనిది. అదే లక్స్ సబ్బుకు ఈనాటి ప్రకటన మీరు చూసే
ఉంటారు. ఓ వయలెట్ రంగు కమలంలో వయ్యారంగా పడుకుని కవ్విస్తున్న కత్రినా
కైఫ్ అగుపిస్తుంది.! కానీ విచిత్ర మేమిటంటే కొన్ని ప్రకటనలు మరీ అసంధర్భంగా
సెక్సీగా వుంటున్నాయి. ముఖ్యంగా టీవీల్లొ వచ్చే ప్రకటనలను చూసే చిన్నారులు
"అవి" ఏమిటని అడిగినప్పుడు జవాబు చెప్పటానికి అమ్మలూ నాన్నలూ పడే ఇబ్బంది
కొందరికైనా అనుభవం అయివుంటుంది. అన్ని ప్రకటనలు బాగుండటం లేదనీ చెప్పలేం.
కొన్ని ప్రకటనలు కళాత్మకంగా ఆలోచింపజేసేవిగా కూడా వుంటాయి. ఓ కేబుల్ (వైర్)
కంపెనీ ప్రకటనలో తల్లి కట్టెల పొయ్యి మీద రోటీలు చేస్తూ చేత్తో ఆ వేడి రోటీలను
కదుపుటుండటం చూసిన కొడుకు అక్కడే వున్న వైరును పటకారులా వంచి తల్లికి
ఇస్తాడు.తల్లి ముఖంలో తన పిల్లవాడి తెలివికి, ఆప్యాయతకీ ఓవెలుగు కనిపిస్తుంది.
అలానే మా స్టేట్ బ్యాంక్ ఇటివల తమ ప్రకటనలలో భారతదేశ ప్రముఖుల బొమ్మలు
వేసి ,వీరంతా మా కస్టమర్సు అంటూ ప్రకటనలు ఇచ్చింది. ఇక సెల్ ఫోన్ ప్రకటనలు
బాగుంటున్నా కొన్ని మాత్రం యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయి. ఓ ప్రకటనలో
"టక్ అండ్ వాక్ " అంటూ ప్రచారం చెయ్యడం ఎంతవరకు సమంజసం ! ఈ మధ్య ఏ టీవీ
చానల్ పెట్టినా "దేముడి తాయెత్తులు", "దిష్టి తాయెత్తులు" అంటూ ఊదరగొడుతున్నారు.
అవికూడా ఖరీదు చూస్తే వేలకు వేలు! ఇవన్నీ ప్రజల బలహీనతల మీద సొమ్ము చేసుకొనేవే.
మాయ బాబాలు, తాయెత్తులూ-మంత్రాలూ అంటూ ప్రతి న్యూస్లోనూ చూపించే ఈ చానళ్ళు
ఇలాటి మోసపూరిత ప్రకటనలకు ఎందుకు చోటు కల్పిస్తున్నారో ? ! ఇక ఆడవాళ్ళను ,ఆ
ప్రకటనలో వచ్చే వస్తువుకు సంభంధం లేక పోయినా ప్రముఖంగా చూపిస్తారు. మొగవాళ్ళ
లో దుస్తుల ప్రకటనలలో మనకు ఈ వికృత చేష్టలు కనిపిస్తాయి ! ప్రతి పత్రికకు, టీవీలకు
ప్రకటనలు తమ మనుగడకు తప్పక వుండితీరాలి.. కాని అవి ప్రజలకు చెడు చేసేవిగా వుండ
కుండా చూడాలి. అన్నిటికన్నా ప్రమాదకరమైనవి రోడ్డు కూడలిలో ఉన్న ప్రకటనల హోర్డింగ్స్.
వేగంగా డ్రైవ్ చేస్తూ వాటివేపు చూస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.! నాకు ఇటీవల బాగా
నచ్చిన యాడ్ ’బిగ్ బబూల్". అందులో కాకి అబ్బాయిపై రెట్ట వేసి గర్వంగా చెయ్యి గుప్పిలి
బిగించడం, తరువాత అబ్బాయి పేస్ట్ మీద వేస్తే కాకి తల కొమ్మకు కొట్టుకోవడం చాలా తమాషాగా
వుంది.

Friday, April 23, 2010

గోదారి చెంతన గజ్జెకట్టిన తార వహీదా రెహ్మాన్ !



"రోజులు మారాయి" సినీమాలో ’ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న పాట ఆ రోజుల్లో నే
కాదు, ఈనాటికీ మరచిపోలేము. జిక్కీ పాడిన ఆ పాటలో మొదటిసారిగా తెలుగు తెర
పై అగుపించిన పదహారేళ్ళ అమ్మాయి అందర్నీ ఆకర్షించింది. ఆ అమ్మాయే హిందీ
తెరపై ఓ వెలుగు వెలిగిన వహీదా రెహ్మాన్. వహీదా గోదావరీతీరం (రాజమండ్రి) నుంచే
సినీమాతెరకు పరిచయమైంది. ఆమె తండ్రి జనాబ్ యం.ఏ.రెహ్మాన్ కొంతకాలం ప్రభుత్వ
ఉద్యోగిగా రాజమండ్రిలో పనిచేసారు. అప్పుడు వారి కుటుంబం రాజమండ్రిలోని దానవాయి
పేటలో ఉండేవారు. ఆమెకు రాజమండ్రి అన్నా, ఆమె నృత్య అభినయం చేసిన ’ఏరువాక"
పాటన్నా ఎంతో ఇష్టం. దేవానంద్ హీరోగా ’బొంబాయికా బాబు చిత్రంలో వహీదా నటిస్తూ
ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న యస్.డి.బర్మన్ చేత "ఏరువాకా సాగే" బాణీ ఇచ్చి
"బొంబయిసే ఆయాహై...బాబూ చిన్నన్నా" అనే పాటను ట్యూన్ చేయించుకొన్నదట వహీదా.
రాజమండ్రి నుంచి ఆమెను కలవడానికి వెళ్ళిన వారితో ఆమె స్వచ్చమైన తెలుగులో
మాట్లాడుతుందట. హిందీ చిత్ర సీమలో వహీదా గురుదత్ తీసిన "సీ.ఐ.డీ"తో ఆమె తొలిసారిగా
హిందీ చిత్రాలలోకి అడుగుపెట్టారు. తెలుగువాళ్ళు గర్వించవలసిన విషయం వహీదాకు
యన్టీయార్ జాతీయ పురస్కారం లభించడం.
వహీదా నటించిన "కొహ్రా" సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం రాజమండ్రి కృష్ణా టాకీస్ ( ఇప్పుడు సాయి
కృష్ణా) లొ శతదినోత్సవం జరుపుకొంది. రాజమండ్రి సినీ చరిత్రలో వందరోజులాడిన తొలి హిందీ
చిత్రం వహీదా రెహ్మాన్దే కావడం ఒక విశేషం ! రాజమండ్రిలో వుంటున్నప్పుడే ఆమె కూచిపూడి,
భరతనాట్యం నేర్చుకొంది. ఆ రోజుల్లో కొందరు మత పెద్దలు ఇందుకు అభ్యంతరం చెప్పినా
కుటుంబ సభ్యులు ఆమె అభిలాషకు ఎదురు చెప్పలేదు. పై స్టిల్ల్ అన్నపూర్ణా వారి "బంగారు
కలలు " చిత్రం లో వహీదా, యస్వీ.రంగారావు

Thursday, April 22, 2010

మా గోదారి తల్లి ముద్దుబిడ్డ 'వంశీ'

అందాల గోదావరిని చూడాలంటే మనం రాజమండ్రి వెళ్ళాలి.లేకుంటే కోనసీమ
వెళ్ళాలి. ఎక్కడికీ వెళ్ళకుండా మనం ఎక్కడున్నా,చివరకు ఏ అమెరికాలాటి
విదేశాల్లో వున్నా ప్రముఖ దర్శకులు శ్రీ వంశీ సినిమా చూస్తే చాలు అందాల
గోదావరి బిరాబిరా వచ్చి మన ఎదుట ప్రత్యక్షమవుతుంది. ఆ కమనీయ నదీ తీరంలో
రకరకాల మనుషుల్ని వాళ్ళ మాట తీరును మనం వాళ్ళతో గడిపినంత నిజంగా
ఆయన సినిమాల్లో ఓ రెండున్నర గంటల్లో చూసి ఆనందించవచ్చు. తూర్పు గోదావరి
జిల్లా పసలపూడిలో పుట్టి పెరిగిన శ్రీ వంశీ ఆ గోదావరి అన్నా, అక్కడ పుట్టిపెరిగిన
వాళ్ళన్నా ఎంతో అభిమానిస్తారు.వెన్నెల్లో గోదావరి ఎంత అందంగా వుంటుందో, అ
గోదావరి ఇసుకతిన్నెలకంటే వంశీ కలానికే తెలుసు. ఆయన వ్రాసిన ’మా పసలపూడి
కధలు’, ఇప్పుడు ’స్వాతి’లొ వ్రాస్తున్న’మా దిగువ గోదావరి కధలు’ చదివిన, చదువు
తున్న వాళ్లకి ఆయన గోదావరిని ,ఆ ప్రజలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. గోదావరి
తరచూ తన సినిమాల్లో చూపించే వంశీ ’గోపి గోపిక గోదావరి’లొ ఆ నదికీ పాత్ర హోదా
ఇచ్చారు. ఈ రోజుల్లో పాపికొండలకు టూరిస్ట్ లాంచీలు వచ్చాక ప్రతి వాళ్ళకీ పాపికొండల
అందాలు చూసే అవకాశం వచ్చింది కాని, రాజేంద్రప్రసాద్ ను సోలో హీరోగా పరిచయం చేసిన
’ప్రేమించి పెళ్ళాడు’లో మొట్టమొదటి సారిగా పాపికొండలను చూసే అదృష్టాన్ని ప్రేక్షకులకు
కలిగించారు. ఇప్పుడు వంశీ ’అల్లరి’నరేష్ తో మా రాజమండ్రి పరిసరాల్లో " సరదాగా కాసేపు"
సినేమా తీస్తున్నారు.ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఈ సినిమా ఎక్కడెక్కడో వున్న గోదావరి అభిమానులను
అలరిస్తుందని ఆశిద్దాం ! ఆయన ప్రయత్నం మరో సారి విజయం సాధించాలని ఆశీర్వదిద్దాం !.

Tuesday, April 20, 2010

"హాస్యబ్రహ్మ" శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు



’హాస్యబ్రహ్మ’ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు 1897 ఏప్రియల్ ౩౦వ తేదిన
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు లో జన్మించారు. బి.ఏ గణిత శాస్త్రం చదివి రాజమండ్రి
కందుకూరి వీరేశలింగం హైస్కూల్లో లెక్కల మాస్టారుగా,ప్రధానోపాధ్యాయుడిగా పని
చేసి 1953 లో ఉద్యోగవిరమణ చేశారు. ఎన్నో హాస్య రచనలు, నాటకాలే కాకుండా
ఆంధ్రనాటక పద్య పఠనం,త్యాగరాజు ఆత్మవిచారం మొదలైన పరిశోదాత్మక రచనలు
చేసారు. ఆయన తన రచనల్లో సగటు మనిషిలోని మోతాదుకుమించిన ఈర్ష్య,అవినీతి ,
దురాశ,భోజన ప్రియత్వం వంటి చెడ్డ అలవాట్లను హాస్యాన్ని జోడించి సున్నితంగా
వ్రాసారు. తాము తెలుగువాళ్ళైనా తాము తెలుగు వాళ్ళమే కానట్లు మాట్లాడే కొంతమంది
వింతపోకడలను తన రచనల్లో ఎత్తి చూపి కనువిప్పు కలిగించారు. ఆయన కలం నుంచి
వెలువడిన ’ఎప్పుడూ ఇంతే’, ’కచటతపలు’, ’పెళ్ళి ట్రైనింగు’,’ఘటన’,’బాగు బాగు’,
’అన్నీ తగాదాలే’,’అప్పుడూ ఇప్పుడూ’,’కాలక్షేపం’,’గుసగుసల పెళ్ళి’వంటి హాస్య
రచనలు చేసారు.మాలియర్, మేటర్లింక్ మొదలైనవారి నాటకాలను తెలుగులోనికి
అనువందించారు. ఈసప్ కధలు,టాల్స్టాయ్ కధలు అనువందించారు. ఐదువేల ఏళ్ళ
కాలెండరును సృష్టించిన ,ప్రఖ్యాత సినీ,నాటక రచయిత భమిడిపాటి రాధాకృష్ణ ఈయన
కుమారులు.
కామేశ్వరరావుగారి హస్య చతురతకు మచ్చుతునక ఆయన హాస్య నాటిక’బాగు
బాగు’లోని తమాషా సంఘటన :
’బాగు బాగు’ లో భోగయ్య అనే పాత్రకు ఉత్తరం వస్తుంది.చింతామణి చదివాడు.
" ఈ మధ్య మా పిల్లకి జ్వరము వచ్చిపోయినది........"
శాంతమ్మ గొల్లుమని ఏడిచింది. " మా పిల్లే మా పిల్లే ! మంచివాళ్ళు బతకర్రా !
మంచిగా వుండకే అమ్మా అంటే వింది గాదండోయ్ ! బంగారు బ్బొమ్మ కూరొండితే
ఒక్కతికే సరిపోయేదిగాదు."
చింతామణి : - మీరు పొరబడుతున్నారు.ఇక్కడ పిల్ల -’ కి ’ష స్ఠీ విభక్తి.జ్వరము
ప్రధమా విభక్తి. జ్వరమే కర్త.పోయిందీ జ్వరమే. పిల్ల కాదు..
* * * * * * * * * *
అలానే "ఎప్పుడూ ఇంతే" నాటకంలోని మరో మచ్చుతునక !
పానకాలు సావిట్లో కూచుని ఉండగా పర్వతాలు గొల్లున ఏడుస్తూ పరుగున వచ్చాడు.
పాన :_ అదేమిటిరా - ఏమొచ్చి పడిందిరా?
పర్వ :_ పానకాలూ - ఓ పానకాలూ
పాన : _ చెప్పరా - ఎందుకు శోకాలు
పర్వ :_ మొన్నీ మధ్యనేరా_
పాన : _ ఆ ! ఏవిటేమిటీ ? ఎప్పుడు పోయాడూ_
పర్వ :_ ఒకడు కాదురా -చాలా మందిరా.
పాన : _ ఆ ! ఎలారా ! ఏమయ్యార్రా ? పడవ గల్లంతా? లారీ బోల్తావా? ఎందరు చచ్చార్రా?
పర్వ : _ చావులు కాదురా _ గొప్పవాళ్ళయి పోయార్రా_
పాన్ :_ హూ
పర్వ:_ పైకొచ్చార్రా
పాన : _ ఇంతకీ నీ ఏడుపేమిటి ? మనం కూడా పైకి రాలేదనేగా
పర్వ :- కాదురా
పాన:- మరి ?
aపర్వ :- వాళ్ళు పైకొచ్చేస్తున్నారనేరా-
ఇలా మానవ బలహీనతలను తన నాటకాల్లో సున్నితంగా ఎత్తి చూపారు శ్రీ భమిడిపాటి..
ఆంధ్ర పాఠకుల్ని తన రచనలతో నవ్వించిన ఈ "హాస్యబ్రహ్మ" 28 -8-1958 రాజమండ్రిలో
పరమందించారు. ఆయన రచనలను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ఏడు సంపుటాలుగా
ఈతరం వారికి పరిచయం చేస్తున్నారు.

Monday, April 19, 2010

సినీమా ( యా ) వినోదం


పూర్వం సినిమాలు నిర్మించడానికి దాదాపు రెండు మూడేళ్ళు పట్టేది. స్క్రిప్ట్, సంగీతం
విషయాల్లో ప్రత్యేక శ్రర్ధ తీసుకొనేవారు. అలానే నటీనటుల తమ స్వంత గొంతుతోనే
సంభాషణలు చెఫ్ఫెవారు. మొదట్లో పాటలు కూడా పాడగల ప్రావీణ్యం వున్న వారికే
అవకాశం వుండేది. ఆ రోజుల్లో నిర్మించిన చిత్రాల్లోని నటుల స్వరాన్ని బట్టి హాల్లోకి
వెళ్లకుండానే తెర మీద ఏ నటుడు సంభాషణ చెబుతున్నాడో చెప్పగలిగే వారము.
మరి ఈ నాడో ఏ హీరోయినికీ ఆటలాడడమే కాని మాటలాడడం రాదు. ఇప్పుడు
సినిమా విడుదలకాకుండానే ప్రెస్ మీట్లు, పది రోజులు దాటగానే విజయ యాత్రలు,
బ్రహ్మాండంగా పాటల సీడీల విడుదలతో హోరెత్తిస్తున్నారు. అందులో నిజంగా విజయ
వంతమైన సినిమాలు కొన్నే. నేటి ఈ సినిమా ఫంక్షన్ల గురించి నవ్వులాటగా నే మా
హాసం క్లబ్ కోసం ఇదివరలో నే వ్రాసిన ఈ వ్యంగ్య రచన ఇక చదవండి.
సినీమా (యా)వినోదం
ఆహాఓహో ఫిలింస్ తమ చిత్రం ’నీనా’ విడుదలై ’పోయిన’ సంధర్భంలో విలేఖరుల
సమావేశం ఏర్పాటుచేసారు. హీరో తండ్రి ,అక్క, తమ్ముడు మాట్లాడుతూ ఇది తాము తీసిన
మహత్తర కుటుంబ చిత్రమని చెప్పారు. దర్శకుడు శ్రీ అయోమయం ఇది చాలా సులువుగా
అర్ధం కాని కధా చిత్రమని దీన్ని మొదటి ఆట చూసి కధను చెప్పగలిగేవారు తమ స్వంత
ఖర్చులతో రాజధానికి వచ్చి కధ వివరిస్తే నేల టిక్కేట్లు రెండు బహుమతిగా ఇస్తామని,తిరిగి
వెళ్ళాక చిత్రం ఇంకా ఆడుతుంటే మరో సారి చూసి మరో విధంగా కధ వివరిస్తే మరో బహుమతి
వుంటుందని తెలియజేసారు. నిర్మాత మాట్లాడుతూ ధియేటర్లలో సగం జనం నిండుతుంటే తమంటే
గిట్టనివాళ్ళు, సగము ఖాళీ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేశంగా అన్నారు. చిత్రం హీరో మాట్లా
డుతూ ఈ సిన్మా చూసిన వాళ్ళే తిరిగి చూస్తున్నారని చెప్పగా ’కొంటెకోణంగి’ సినిమా పత్రికా
విలేఖరి "ఎవరు ? ఆపరేటర్లు,గేట్ కీపర్లా ?" అని అడిగితే " ఏం వాళ్ళు మాత్రం ప్రేక్షకులు కారా?"
అంటూ కోపంగా డాన్సు చేశారు.
* * * * * * * * * * * *
’చీ చా’ ప్రొడక్షన్స్ చిత్రం ప్రారంభం సంధర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటుచేసారు. తమ చిత్రం పేరును
" చూస్తే చస్తావ్ !" గా నిర్ణయించామని, హీరోయిన్గా ఏదో దేశం అమ్మాయిని ఎన్నుకున్నామని,
ఆవిడ పేరు తెలియదని, ప్రక్కనే ఆ అమ్మడు వున్నా తెలుసుకుందామంటే యూనిట్లో ఎవ్వరికీ
ఆమె భాష తెలియదని వాపోయారు. ఈ చిత్రం ఆడియో విడుదల కొత్త పంధాలో చేస్తున్నామని
మార్కెట్లోకి బ్లాంకు సిడీలు ప్రవేశపెడ్తామనీ,దీనివల్ల పైరసీని అద్భుతంగా అరికట్టవచ్చనీ తెలిపారు.
చిత్రం విడుదలయ్యాక ఆ సిన్మా చూసినవాళ్ళుంటే ఆ బ్లాంక్ సిడీని వాళ్ళ కంపెనీ ఎడ్రస్ కనుక్కొని
తెస్తే తమ సంగీత దర్శకులు కాపి రావు ( కాకాని పిచ్చేశ్వరరావు) గారు సరసమైన ధరకు ఆ సిడీని
కాపీ చేసి ఇస్తారని తెలియజేసారు.
ఇంతటితో ఈ ప్రెస్సు మీట్ సమాప్తం !

Sunday, April 18, 2010

ఈనాడు ఆదివారం

’రేపు శలవు రావాలంటే ఈ రోజు ఏం కావాలో చెప్పగలరా ?
ఏ ముంది, ఈ రోజు ఏ నాయకుడో పరలోకయాత్రయినా చేయాలి, లేకుంటే పనిలేని
ఏ రాజకీయ రాబందో మొన్న మరో రాజకీయపార్టీ జరిపిన బందుకు నిరశనగా
మరో బందు జరపాలి అనుకుంటూన్నారా ! అవేవీ కావండీ ! రేపు శలవు రావాలంటే
ఈ రోజు శని వారం అవ్వాలి.! కాదంటారా ! ఆదివారం వచ్చిందంటే ఆ రోజు చాలా మందికి
ఫన్డే ! వారమంతా పనిచేసే ( ? ) ఉద్యోగులకు రెస్ట్ డే. పిల్లలకు స్కూళ్ళూ ఉండవు. ఈ
కాలం కార్పొరేట్ స్కూళ్ళ లాగే మేం చదువుకొనే రోజుల్లో కూడా మా స్కూళ్ళో ఆదివారం
ఉదయం మా ఇంగ్లీష్ మాస్టారు ప్రవేట్ క్లాసులు పెట్టేవారు. మా రాజమండ్రిలో శ్రీ రామచంద్రా
సిటీ హైస్కూల్ అనే ప్రైవేట్ స్కూల్ లో మేం చదివే వాళ్ళం. అందుచేత అలా ప్రైవేట్ క్లాసులు
మాకు తప్పేవి కావు. నా క్లాస్మేట్ మంగశర్మ, "అంతే, మన స్కూల్ ప్రైవేట్దిగా అందుకే ప్రైవేట్
క్లాసులు పెడుతున్నారు. అదే మున్సిపాలిటీ స్కూలయితే వుండవు " అనే వాడు.
ఇక స్కూలు సంగతులు వదిలేస్తే ఆది వారం నాడే ఈ శెలవు ఎందుకు ? పూర్వం బ్రిటిష్
పాలన వుండేది కాబట్టీ, వాళ్ళు ఆది వారం చర్చికి వెళ్లాలి కనుక ఆది వారం శెలవుగా
నిర్ణయించారు. ఇప్పుడు కొన్ని ఆఫీసులకు ఐదురోజుల పని దినాలే కాబట్టి శనివారం కూడా
శెలవులుంటున్నాయి. మరో మాట. ఆది వారం సూర్య భగవానుని రోజు.అందువల్లే ఆ రోజున
సూర్యుడు రెచ్చిపోతాడట !. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, సూర్యుడు మండే నాడు
మండి పోవాలి గాని శెలవు రోజైన ఆ ఆదివారం హాయిగా రెస్ట్ తీసుకోక జనాల పై ఇలా మండి
పోవటం ఎందుకు చెప్పండి. ఆదివారం శెలవు కదా, సినిమాలకి, షికార్లకు సకుటుంబంగా వెళ్ళొచ్చు.
ఇంతకు ముందయితే షాపింగ్ చేద్దాం, ఈరోజు మీకు శెలవు కదా అని భర్యామణులనే ప్రమాదం
ఊండేదికాదు. కానీ ఈ రోజుల్లో మాల్స్ వచ్చాక ఈ రోజు శెలవు అనే ఒంక పెట్టడం పాపం భర్తలకు
కుదరటంలేదు. ఆది వారానికి ఎప్పటి నుంచో ప్రత్యేకత వుంది. న్యూస్ పేపర్లు ఆ రోజు అనుబంధాలు
ప్రచురిస్తాయి. మా చిన్న తనంలో తెలుగు దిన పత్రికలు ఇంతగా వేయకపోయినా, ’ఆంధ్ర పత్రిక’
లాంటి పత్రికలు శ్రినివాస శిరోమణి వ్రాసిన రామాయణం సీరియల్గా ప్రచురించేవి. ఆ రొజుల్లో
’ఇండియన్ ఎక్స్ప్రెస్స్’ ఆదివారం ’సండే స్టాండర్డ్’ గా ,ఆ ఒక్క రోజు పేరు మార్చుకొని వచ్చేది.
అందులో మజీషియన్ మాండ్రేక్, లిటిల్ కింగ్, బ్రింగింగ్ అప్ ఫాదర్ లాంటి కామిక్స్ రంగుల్లో వచ్చేవి.
మాకు ఆదివారం అంటె ఇష్టమవడానికి మరో కారణం ఆ రోజు మధ్యాహ్నం రేడియోలో "బాలానందం"
ప్రోగ్రాము వచ్చేది. రేడియో అన్నయ్య నాపతి రాఘవరావు గారు,రేడియో అక్కయ్య నాపతి కామేశ్వరి
గారు నిర్వహించేవారు. ఆ ప్రోగ్రాముల్లో శ్రీ ముళ్లపూడి, బాపు, కందా మోహన్ గార్లు పాల్గొనే వాళ్లట.
ఆదివారం పాపం కోళ్ళకి, మేకలకి చాలా చెడ్డ రోజు. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆదివారం మరీ ప్రత్యేకం
కదా ! ఈ ఆదివారం శెలవును మేం హాయిగా గడుపుతుంటె ఈ సోదంతా ఏమిటని కోప్పడకండి. ఈ
ఆదివారం కదా మీరు ఖాళీగా ఉంటారు కదా అని ఇన్ని విషయాలు చెప్పాను.
టా టా, ఇంక శెలవు ! !

Saturday, April 17, 2010

'జ్యోతి" తో జ్యోకాభిరామాయణం !!



’జ్యోతి’తో జ్యోకాభిరామాయణం
ఈ రోజు మనం అలనాటి ’జ్యోతి’లోని కొన్ని ’జ్యోకు’లను గుర్తుచేసుకొందాం !
* * * * * * * * *
చి (ట్రి) క్కు ప్రశ్న
"అయిదుగురు కుర్రాళ్ళు ఒకే గొడుగులో దూరి నడుస్తున్నారు, వారిలో ఎవరు తడుస్తారో
చెప్పు"
"తెలియదు ఎవరు ?"
"ఎవరూ తడవరు. వాన లేందే ? "
* * * * * * * * *
పఠాభి ’పన్’ చాంగం : మనకీ, మహమ్మదీయులకీ తేడా ఒకటే ; మనం ఇల్లా అంటే
వాళ్ళు అల్లా అంటారు.
* * * * * * * * *
రోగి : ఈ బాధ మరీ యెక్కువై పోతూందండి, ఇంతకంటే చావటం మేలనిపిస్తోంది.
డక్టర్ : అదంతా నేను చూచుకుంటాగా సార్, నాకు వదిలెయ్యండి.
* * * * * * * * *
"మీ కొచ్చిన జబ్బుంది చూశారూ, సాధారణంగా అది నయం కాదు, మీ అదృష్టంకొద్దీ అది
నయమైంది" అన్నాడు డాక్టర్.
"బిల్లు యిచ్చేటప్పుడు కాస్త ఆముక్క జ్ణాపకం వుంచుకోండి."
* * * * * * * * *
నటీనటులు ఆడేదిఏ నాటకమైనా,అది బాగుండకపోతే,ప్రేక్షకులు ప్రదర్శించేది ’పాదుకా
పట్టాభిషేకమే’!
* * * * * * * * * * *
ఒక సినిమా నటుడు : ’నే నసలు మొదట్లో రాజకీయాల్లోకి పోదామా, నతుణ్ణవుదామా
అని మధన పడ్డాను, చివరికి ఏదైనా ఒకటేకదా అని నటుణ్ణయ్యాను.
* * * * * * * * * * *
కొత్త పాత జోకు
"ఎచటకండీ అంత త్వరగా బోవుచుంటిరి ?"
"జపానికి"
"అమ్మో అంత దూరమే ?"
"జపానికి కాదండీ -జపమునకు:" అని వాని తెలివితక్కువకు నవ్వు కొనుచు జపాన్ కు బోవును.
* * * * * * * * *
మొగాళ్ళతో సమానంగా జీతాలు కావాలని ఆడవాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తారో అర్ధం కావడంలేదు.
మగవాడి జీతమంతా కావాలంటే పెళ్ళి చేసుకుంటే సరిపోదూ ?
* * * * * * * * * *
నలుగురి స్నేహితులు కూర్చుని పేకాట ఆడుతుండగా, ఒకడు ’ఇహ నే నింటికి పోవాలి’ అంటూ లేచాడు.
"కూచోవోయ్, వెడుదువుగాని లే" అన్నాడు, ఒక స్నేహితుడు.
" అదికాదు, మొన్న రాత్రి నిన్న పొద్దున్న ఇంటికెళ్ళాను.నిన్న రాత్రి ఇవ్వాళ పొద్దున్న వెళ్ళాను. ఇహ
ఇవ్వాళరాత్రి కూడా రేప్పొద్దున వెడితే మా ఆవిడ పుట్టింటికి పోతానని వార్నింగిచ్చింది."
* * * * * * * * *
ఒకడు : "సాధారణంగా మాకంపెనీలో పెళ్లయిన వాళ్ళనే గుమాస్తాలుగా వేసుకుంటారు."
మరొకడు : "ఏం, ఎందుకని ?"
మొదటి వాడు : " పెళ్లయిన వాళ్ళయితే ఎంత తిట్టినా అలవాటుకొద్దీ దులిపేసుకు పోతారు."
* * * * * * * * **
ఒక డాక్టరు : ఇంకానయం. టైముకి ఆపరేషను చేశాను. లేపోతే రోగి తనంతట తనే కోలుకొనేవాడు.
****************
చూశారు కదూ,అదేనండి చదివారు కదూ అలనాటి ’జ్యోతి’ జ్యోకులు.. ఆ జ్యోతి కోసం ప్రతినెలా
ఆత్రుతతో ఎదురు చూసే వాళ్ళం. ఇక్కడి బొమ్మలోని ’జ్యొతి’ దీపావళి ప్రత్యెక సంచిక వెల ఒకే
ఒక్క రూపాయంటే ఈ రోజుల్లో అదో జోకులా వుంటూంది కదూ !

Friday, April 16, 2010

ఈరోజు చార్లీ చాప్లీన్ పుట్టిన రోజు




ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ పుట్టిన రోజు ఈరోజు
చార్లీచాప్లిన్ అసలు పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్.ఆయన లండన్లో 1889 ఏప్రియల్
16 న జన్మించాడు. తల్లి తండ్రులిద్దరూ కళాకారులే. చార్లెస్ చిన్న తనంలోనే
తండ్రి మరణించాడు. చిన్న తనంలో చాప్లిన్ బీదరికం తో కష్టాలు పడ్డాడు. 1913 లో
"ఫ్రెడ్కార్నో కంపెనీ" చాప్లిన్ను ఓ ముఖ్య వేషానికి ఎన్నికచేసి అమెరికాకు తీసుకు
వెళ్లారు. అక్కడ బాగా పేరు పొందడంలో ఆ ఏడాదే సినిమా చాన్సులు కూడా వచ్చాయి.
తన జీవితంలో అనుభవించిన కష్టాలను,అనుభవాలను కధగా వ్రాసుకొని,స్వయంగా
దర్శకత్వం వహిస్తూ చిత్రం నిర్మించి ప్రధాన పాత్ర పోషించిన " ది కిడ్" మరువరాని చిత్రంగా
నిలచిపోయింది. అతను నటించిన చిత్రాలలో నేటికి ఆణిముత్యాలుగా నిలచిన చిత్రాలు:
గోల్డ్ రష్,సిటీ లైట్స్, ది కిడ్, ది కింగ్ ఇన్ న్యూయార్క్,ది గ్రేట్ డిక్టేటర్, మోడరన్ టైమ్స్,
సన్నీసైడ్,ది ఐడిల్ క్లాస్,ఎనైట్ ఇన్ ది షో,పోలీస్,పేడే, ది సర్కస్ మొదలైన ఎనభై
చిత్రాలు ఉన్నాయి. చాప్లిన్ పుట్టిన రోజున నవ్వులు పంచిన ఆయనకి మన బ్లాగర్లందరీ
తరఫున జోహార్లు.

అడ్డమైన మంచి రాతలు !

శ్రీ ముళ్లపూడి వేంకట రమణ గారు ’స్వాతి’లొ వారం వారం ఆయన వ్రాసే ’కోతి కొమ్మచ్చి’లో
ఆయన భాషలోనే ’అడ్డమైనరాతలు’ వ్రాస్తున్నారు. ఈ వారం అయన వ్రాసిన ’అడ్డమైన రాతలు’
నాకు విపరీతంగా నచ్చేసి, ఇక్కడ నేను గీసిన ఓ ’అల్లరి బుడుగు’కార్టూన్తో బాటు, ముళ్లపూడి
వారి అపురూపమైన ఫొటో ( రచన శాయి గారి సౌజన్యంతో) కూడా చేర్చి ఆ ’రాతలు’ఇక్కడ మీ
కోసం, మరో సారి.
విన్నావా ముళ్లపూడి వెంకట రమణా !
తల్లిని తండ్రినీ ఎవరన్నా తిట్టిపోస్తే-అదీ దేశవాళి భాసలో ఎవ్హడూ సహించడు.
కాని-మనందరికీ తల్లి లోకమాత సీతమ్మతల్లినీ,చదువులతల్లి సరస్వతిని,రామ
భక్త హనుమాన్ జీని నీచాతి నీచంగా బొమ్మలు వేసి ఆ బొమ్మలతో సొమ్ములు
నొల్లుకునే వాళ్ళని మనం ఏమీ అనం.విశాలదృష్టితో వారి భావ ప్రకటనా
స్వాతంత్ర్యాన్ని సహిస్తాం. వారిని ఎవరన్నా ధైర్యంచేసి ఏమన్నా అన్నా-మనం
రొమ్ములు విరుచుకుని- వారి సంకుచిత బుద్ధిని ఖండిస్తాం.’మేధావుల-సంతకాల’
ఉద్యమాలు నడుపుతాం. ఎడిటోరియల్స్ రాస్తాం. కాని
మీ యిష్టదేవుళ్ళ మీదా, ప్రవక్తల మీదా ఒఖ్ఖ బొమ్మన్నా వేసే దమ్ముందా మీకు?
అని అడిగే దమ్ము మనకు లేదు.
మరోటి..
తిరుమల వేసవి కొండమీద-ఎండలో నెత్తిమాడుతున్నా కింద కాళ్ళు కాలి బొబ్బలెక్కుతున్నా
-పసిపిల్లలయినా ముసలివాళ్ళయినా వట్టి కాళ్ళతోనడవాల్సిందే.పందిళ్ళయినా వేయ్యరు-
కనీసం ఆ కాస్త నేలయినా తడపరు.
భక్తులు గోవిందా అని మొరలుపెడుతున్నారు.
కాని- కారుగల వారు మాత్రం-మహాద్వారం వరకూ అసూర్యం పశ్యులుగా ఎండపొడ
పడకుండా వెళ్ళవచ్చు.
అందువల్ల- ఓ పేదలారా-అందరూ కార్లు కొనుక్కోండి-ప్రసాదాలు కూడా పుష్కలంగా
పెడతారు.
నడిచి వెళ్తే ప్రసాదాలు కొనుక్కోవాలి-ట !
విన్నావా ముళ్లపూడి వెంకటరమణా !
నిజంగా ఇవి ’అడ్డమైన రాతలు’ అనుకోవాలని వీటిని మాత్రం పేజీకి అడ్దంగానే వేయించారు
మన రమణ గారు. దటీజ్ ముళ్లపూడి !!

Thursday, April 15, 2010

ముళ్లపూడి చమత్కారాల ముచ్చట్లు


ఈనాడు ’ఈనాడు’ చూడగానే "నవ్వండి..నవ్వించండి.. జీవించండి అన్న శీర్షికతో
ఒక ఆర్టికల్ కనిపించింది. దరహాసంతో మరో ఏడేళ్ళు ఆయుష్షు పెరుగుతుందని
అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసిందట. అందుకే మనకు రాజులకాలం నుంచి
వాళ్ళ ఆస్తానంలో విదూషకులు ఉండే వారు. క్రిష్ణ్దేవరాయల ఆస్తానంలో తెనాలి రామ
క్రిష్ణ కవి, అక్బర్ దగ్గర బీర్బల్ ఉండేవారని మనం చదివాం. ఇక మన తెలుగు సాహిత్యంలో
మొక్కపాటి,చిలకమర్తి,భమిడిపాటి మొదలయిన హాస్య రచయితలెందరో. ఆ కోవలో మనకు
మా చిన్ననాటి నుంచి ఈతరం పాఠకులను తన రచనల మాటల చమత్కారాలతో నవ్విస్తున్న
శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారి గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. నవ్వడం,నవ్వించడం
మరచిపోయిన మన తెలుగు వాళ్ళకి నవ్వడం నేర్పారు మన ముళ్లపూడి. ఆయన పేరు తలచు
కోగానే మనకు జ్ణాపకం వచ్చేది శ్రి బాపు గారి పేరు కూడా. వీళ్ళిద్దరిలో ఒకరు రాత కారుడు ఐతే
మరొకరు గీతకారుడు. ఐతే వీళ్ళిద్దరులోసాహిత్యంలో పైనుండేది ఎవరు అంటే చెప్పడం కష్టమే.
అలాకాకుండా ఉండే ఇంట్లో మాత్రం శ్రీ ముళ్లపూడి పైనుంటే శ్రీ బాపు క్రింద ఇంట్లో ఉంటారు. ఓ సారి
బాపుగారి ఇంటికి వెళితే ముళ్లపూడి వారు అక్కడికి వచ్చారు. మరోసారి రమణ గారి ఇంటికి వెళితే
బాపు గారక్కడకు వచ్చారు. అసలు ఎక్కడవున్నా మాలాంటి అభిమానుల గుండెల్లో మాత్రం కలకాలం
వాల్లిద్దరూ ఉంటారన్నది నిజం. ఆయన ఆంధ్ర పత్రికలో పని చేస్తున్నప్పుడు వ్రాసిన కధలకు శ్రీ బాపు
అందమైన బొమ్మలు వేసేవారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు రమణగారి మాటల్లో చమత్కారాలు
అడుగడుగునా అగుపిస్తాయి. అది ఓ సినిమా రివ్యూ అయినా సరే. ఉదాహరణకు "సువర్ణసుందరి" సిన్మాకు
ఆయన వ్రాసిన సమీక్ష మచ్చుకు....
.... బాక్సాఫీస్ సూత్రాల పెద్ద బాలశిక్ష అనవచ్చు. ఈ సూత్రాల కూర్పులో దర్శక నిర్మాతలు చూపిన
నేర్పును మెచ్చుకోవచ్చు.ఎందుకంటే మూడున్నర మైళ్ళు పొడవున్న ఈ చిత్ర గాధలో నడుస్తున్నప్పుడు
శ్రమ,విసుగు లేకుండా దారిలో బోలెడు మజిలీలున్నాయి. భారతీయ న్రుత్యాలు,బొంబాయి డాన్సులు
తెలుగు పాటలు, హిందీ గీతాలు, హాస్యం,దేశవాళీ రెడిండియన్ కోయవాళ్ళు,కొట్లాటలు,అట్టల బండలు,
వెదురు బుట్టల కొండలూ, ఇ.వి.సరోజ వేషంలో పార్వతీదేవి (చూశరా, ఆ చమత్కారం).......
ఈ రివ్యూ చదువుతుంటే నవ్వు,సుతి మెత్తని విమర్శ పాఠకుడికి ఏక కాలంలో ఆకలింపుకొస్తాయి!
ఇక ఆయన రాసిన ఋణాలందలహరిలో అప్పారావు ( నా పేరు వాడినందుకు ఈ సారి కలసినప్పుడు
ఓ ఫైవ్ అప్పడగాలి),రాధాగోపాలం ,బుడుగు,చిచ్చుల పిడుగు ఇలాఎన్నేన్నో.ఇక సిన్మా డైలాగులు,పాటలు
వాటిలో ఘాటుగా చుర్రుమనిపిస్తూ, నవ్వించి కవ్వించే చమత్కారాలు. ఆయన మితృలకు వ్రాసే ఉత్తరాల్లో
కూడా ఒక్క మాటతో నవ్విస్తారు. నాకు వ్రాసిన ఓ ఉత్తరం చూడండి. ఆయన సంతకంచేసి క్రింద బాపు
సంతకం కూడా అయనే పెట్టేసి బ్రాకెట్లో బాణం గుర్తుతో సహ ఆధరైజ్డ్ ఫోర్జరీ అని వ్రాసిన గడుసరి రమణగారు.
ఆయన వివిధ రచనలలో పలికించిన చనుకులను కొన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆయన పూర్తి
సాహిత్యం (నవ్వితే నవ్వండితొ సహా) సాహితీ సర్వస్వం పేరిట విశలాంధ్ర ఎనిమిది వాల్యూములుగా ప్రచురించింది.
++ ++ ++ ++ ++ ++ ++
"తాతయ్యలకు బోల్డు ఆస్తి వుండును. దానిని వాళ్ళు మనుమలకు ఇచ్చెదరు.అంతవరకు మనము
అమ్మడిని పెళ్ళి చేసుకోరాదు అని అమ్మ చెప్పును" అంటూ పాపాయి(పద్మనాభం) పరిచయం.-దాగుడుమూతలు
** ** ** ** ** ** ** ** **
కంట్రాక్టరు( రావు గోపాలరావు) హలంతో :
’ఏంటి పిల్లా. ఆయన మీద పడ్డావ్. కళ్ళు మసకేశాయేటి.
హలం : కాదు.ఆయనే మన పాసెంజరనుకున్నాను.
కం : ఒళ్ళు కరుసయిపోతుంది జాగర్తమరి.సోమరాజు గాడికీ ఆడి
బావగారికీ నీకు డిఫరెన్సు తెల్డం లేదు.
హ: సోమరాజో కావరాజో, ఎంతమందిని గుర్తుపెట్టుకోను. ఒక్క చోట
నాలుగు రోజులు దూటీ ఎయ్యవు...............ముత్యాలముగ్గు.
** ** ** ** ** ** ** **
సోమరాజు (ముక్కామల) : ఇక్కడి కెందుకొచ్చావయ్యా.ఎవరన్నా జూస్తే కొంప
ములుగుతుంది.
కాంట్రాక్తరు (రావు గోపాలరావు) : కొంప ముంచడమే కదండీ మన కాంట్రాక్టూ !
** ** ** ** ** ** ** ** **
పిక్చరు తియ్యకుండా స్టోరీ ఏమిటండీ ! మీరు మరీ విట్టీగా మాటాడుతారు !
---విక్రమార్కుడి మార్కు సింహాసనం నుండి*
** ** ** ** ** ** ** ** **
"మంచోళ్ళు సెడ్డోళ్ళు అంటూ యిడిగా వుండరు మావా ! మంచీ చెడ్డా కలిస్తేనే మడిసి."
--------సాక్షి*
** ** ** ** ** ** ** ** ** **
రమణగారు వ్రాసిన ఋణాలందలహరి చదివితే ఆయనకు తెలుగు భాషపై ఉన్న పట్టు
తెల్స్తుంది. పదాలలో ఒక్క అక్షరం మార్చి దాఋణం,అఋణకిరణుడు, కఋణ అంటూ
’అప్పును" స్పురణకు తెచ్చారు. జంతువులకు కూడా ఆయన భాషను సృష్టించారు..కాకి
భాషను చూడండి. కావులించి,కావు కేకలు,రెక్కలో బాణం,కావురుబావురుమంటూ ఏడ
వడం,రెక్కాడితేగాని డొక్కాడని వాళ్లం,కాకమ్మ కబుర్లు, అలానే పాములూ వాటి భాషలోనే
ఎలా మాట్లాడతాయో చూడండి. తుసాబుసామంటూ,నాలికలు కొరుక్కొని, కోటికి ’పడగ’
లెత్తి ,దో’బుస్’లాడుకోడం,కడుపార గాలి భోంచేసి బుస్సున తేన్చడం, గాలి పుట్టలు కట్టడం,
చీమల భాషనూ పరికించండి.-చిమచిమ నవ్వు,పుట్టతీసి పుట్టమునగడం (మనం కొంపదీసి,
కొంప మునగడం అన్నట్టు). ఇలా ఆయన శైలి సాగిపోతుంది.
నా "సురేఖార్టూన్స్" పుస్తకానికి అయనతో ముందు మాట వ్రాయించుకొనే అద్రుష్టం కలిగింది.
అందులోని కొన్ని మాటలు---
.....చక్కని కార్టూన్ పుస్తకాలు చూడడం-అల్టిమేట్ జాయ్ ! దీనికి తోడు వెన్కనుంచి-విన-బడే-
గులాం పాట-----. చూసారా,ఇక్కడ ఆయన బడేగులాం పేరుకు వెనుకనుంచి వినబడే అనే మాటకు
ఎలా కలిపారో!
అందులోనే మరో చోట " మామూలు మాటల్లోంచి ఎడా-పెడా-ర్ధాలు తీసి-కుంచెడేసి నవ్వులు
పిండుతారు" అంటూ వ్రాసారు. ఇలా ఆయన రచనా చమత్ర్కుతిని ఎన్ని మాటల్లో నాలాంటి సామాన్యుడు
చెప్పగలడు.

Wednesday, April 14, 2010

నవ్వుల సందడి

మన టీవీ చానెల్లకు,న్యూస్ పేపర్లకు ఏదో ఓ విషయం దొరికిందంటే ఇక
ఆ సుబ్జెక్ట్ మీదే ఊదరగొట్టేస్తుంటారు. కొంతకాలం నిత్యానందమ్ గొడవ. టీవీ ఆన్
చేస్తే బెడ్రూమ్ గొడవే!.ఇప్పుడు సానియా, షోయబ్ల పెళ్ళి కబుర్లు! అమ్మయ్య! పెళ్ళయింది
అనుకుంటూంటే ఇప్పుడు మెహందీట.తరువాత మరోటి.హనీమూన్ విశేషాలు! దీనికీ
రహస్య కమేరాలు వాడి, ఎక్స్లూజివ్ ఫలానా చాలన్ అంటారేమోనని భయమేస్తూంది!
క్రికెట్,టెన్నీస్ల పెళ్ళి వార్త విన్నాక నాకో ఐడియా తట్టి పై కార్టూన్ గీయాలనిపించింది.
ఇక ఆనాటి ’జ్యోతి’లోని కొన్ని మంచి జోకులను మీకోసం.
* "నేను మీ ఇంటికి భోజనానికొస్తున్నట్లు మీ ఆవిడకు తెలుసా ?"
"బలే వాడివోయ్, నిన్ను భోజనానికి పిలిచినందుకు మా ఆవిడకి నాకూ
ప్రొద్దున పెద్ద దెబ్బలాటైతేను !"
++ ++ ++ ++ ++ ++ ++
ఒకడు : నా పెళ్ళిరోజున మా అత్తగారు,మామగారు తెగ మురిసి పోయారు. మా ఆవిడ
కాపరానికొచ్చిన తరవాతగాని వాళ్ళ సంతోషానికి కారణం గ్రహించలేక పోయాను.
++ ++ ++ ++ ++ ++ ++ ++ ++
"నువ్విదివరకు మన కాలేజీలో పద్మ అనే అమ్మాయిని ప్రేమించేవాడిననే వాడివి కదూ ?
ఆ తరవాతేమైంది ?"
" ప్రేమించడం మానేశాను."
"అదేం ?"
" ఆ అమ్మాయినేగా నే పెళ్ళిచేసుకుంది."
++ ++ ++ ++ ++ ++ ++ ++
మద్యప్రదేశ్ రాజధానిలో ఇద్దరు తాగుబోతులు తూలుకుంటూ వస్తున్నారు. రోడ్డు ప్రక్కన
వెలుగుతున్న లైటును చూసి అది చంద్రుడని ఒకడు, కాదు సూర్యుడని మరొకడు వాదులాడు
కొంటున్నారు. ఇంతలో ఆ దారిలో ఒక పెద్దమనిషి రావడం చూసి "మీరు చెప్పండి సార్,అది
చందురుడా,సూరీడా ?" అని అడిగారు.
"నాకూ తెలవదయ్యా, నే నీవూరికి కొత్తగా వచ్చాను" అని అతగాడు తూలుకుంటూ వెళ్ళిపోయాడు.
++ ++ ++ ++ ++ ++ ++
కొన్నేళ్ళక్రితం తమిళ చిత్రాలలో "హాస్య జంట"గా పేరుపొందిన ఎన్.ఎస్.క్రిష్ణణ్ ; టి.ఏ. మధురం కలిసి
ఒకసారి ఏదో టీ పార్టీకి వెళ్ళారు. స్వీట్లు,హాట్లూ అయ్యక కాఫీ ఇవ్వబోతుండగా క్రిష్ణన్ "కాఫీ వద్దు,టీ
ఇయ్యండి" అన్నాడు.
"ఏం కాఫీ తాగరా ?" అన్నాడు ప్రక్కన కూర్చున్న తెలుగాయన.
"తాగుతానుగాని, టీ యే మధురం" అన్నాడు క్రిష్ణన్.
++ ++ ++ ++ ++ ++ ++++
రావణుడు,కుంభకర్ణుడు,ఖరుడు,దూషణుడు,విద్యుజ్జిహ్యుడు వాళ్ళ చిన్నతనంలో ఒక సారి
విభీషణుడితో దాగుడుమూతలాడుతున్నారు. విభీషణుడికి వాళ్ళకోసం వెతికి,వెతికి విసుగు
పుట్టింది. చివరికి " దాగుడుమూతలంటే ఎక్కడన్నా దాక్కోవాలిగాని, ఇలా నిజంగా మాయమై
పోతే నేనసలు ఆడను" అన్నాడు.
++ ++ ++ ++ ++ ++
ఇక అలనాటి "జ్యోతి" పత్రికకు ఇంత మంచి జోకులు చెప్పినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇక నేనూ
ఈనాటికి మాయమై పొతున్నా. ఉంటా టా టా టా టా......................


_

Tuesday, April 13, 2010

మా ఊరి కధ





రాజమహేంద్రవరం ఆంగ్లేయుల కాలంలో రాజమండ్రిగా రూపాంతం చెందింది.
ఒక నాడు వేంగి చాళుక్యుల రాజధాని నగరంగా వెలిగి రాజరాజనరేంద్రుని
పాలనలో కళలకు పుట్టినిల్లుగా కీర్తిని పొందింది. కవిసార్వభౌమ్యుడు శ్రీనాధుడు
ఈ నగరంలో కొంతకాలం నివాసముండి తన సారస్వత కార్యక్రమాన్ని కొనసాగించాడు.
వేదశాస్త్రాలకు,కళాకారులకు జన్మస్తానమిది. శ్రీనాధుడు ఈ నగరాన్ని కొనియాడుతూ
పద్యాలు వ్రాసాడు. రాజులూ,వారి రాజ్యాలకే కాకుండా సంఘసంస్కరణలకు ఇది
జన్మభూమి. కందుకూరి వీరేశలింగం సాంఘిక దురాచారలను ఎదురించి కొత్త శకానికి
మార్గాలను చూపించింది ఇక్కడనే. ఆది కవి నన్నయ భారత రచన చేసింది ఈ నగరంలోనే!
సర్ ఆర్ధర్ కాటన్ గోదావరికి ఆనకట్టను ధవళేశ్వరం వద్ద నిర్మించాడు. దామెర్లరామారావు
లాంటి గొప్ప చిత్రకారులు,స్వాతంత్ర సమరంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ పద్యాలు వ్రాసిన
చిలకమర్తి, నిన్న మనం చెప్పుకున్న కాశీమజిలీ కధలను తెలుగుదేశానికి అందించిన
సుబ్బయ్య దీక్శితులు ఇక్కడివారే! ప్రఖ్యాత కధకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి,కవికొండల
వెంకటరావు,’హాస్యబ్రహ్మ’ భమిడిపాటి కామేశ్వరరావు, రాజమండ్రి నగరానికి ఎనలేని
ఖ్యాతిని తెచ్చారు. ప్రఖ్యాత సంగీత విద్వాంశులు యమ్మెస్.సుబ్రహ్మణ్య శర్మ, మ్రుదంగ
విద్వాంసులు కమలాకరరావు ఈ నగరం వారే. మొట్టమొదటి సారిగా గోదావరి అందాలను
తన ’మూగమనసులు’ చిత్రమ్ ద్వారా పూర్తి ఔట్ డోర్లో చూపించిన ఆదుర్తి ఈ ఊరి వాడే.
గత పుష్కరాలకు "ఆనాటి" ప్రభుత్వం రాజమండ్రికి ఎన్నో కొత్త అందాలను కూర్చింది. గౌతమీ
ఘాట్లో దేవాలయ సముదాయానికి అవకాశం కల్పించింది. ఇస్కాన్ అతి పెద్ద శ్రి క్రిష్ణ దేవాలయాన్ని
నిర్మించింది. అంతే కాదు వ్యాపారానికి,ముఖ్యంగా వస్త్రవ్యాపారానికి ప్రసిద్ధి. ఈనాడు రాష్త్ర వ్యాప్తంగా
విస్తరించిన బొమ్మన,చందన వ్యపార సంస్తలు ఇక్కడివే !
ఆరుద్ర ఈ నగరం గురించి ఇలా అనారు--
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంగా శోబిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం

Monday, April 12, 2010

కాశీమజిలీ కధల కధ !


ఇది వరలొ మనకు 'బాల','చందమామ' పత్రికలు లేనప్పుడు
రాజమండ్రికి చెందిన మధిర సుబ్బయ్య దీక్షితులు వ్రాసిన 12 భాగాల
కాశీమజలీ కధలు చదివి, అమ్మమ్మలూ, తాతయ్యలు తమ మనవలకు,
మనవరాళ్లకు చెప్పేవారు.
19 శతాబ్దంలో ఆ నాటి పాఠకులను ఈ కధలు ఉర్రూతలూగించాయి.ఈ
కాశీమజిలీ కధలు దక్షిణ కాశీ అని పిలవబడే రాజమండ్రిలోనే పుట్టాయి.
కాశీకి వెళ్లడం అంటే కాటికి వెళ్లడం అనుకొనే రోజులవి.పూర్వం కాశీ వెళ్ళడం
అంటే అలా అలా అడవుల మధ్య నుంచి ఊళ్ళను దాటుకుంటూ, మధ్యలో
ఆహారం దొరకదని ఆహర పదార్ధాలను మూటలు కట్టుకొని కాలినడకను వెళ్ళే
వారు.ఎప్పటికి చేరేవారో,తిరిగి ఎప్పటికి ఇంటికి చేరేవారో దేముడికెరుక!
మధిర సుబ్బన్న దీక్షితులు 12 భాగాలుగా 1896లో ఈ కధలను రచించారు.
అప్పటి నుంచి ఈ నాటి వరకు ఆ కధలు ప్రచురించబడుతూనే ఉన్నాయి.
శ్రీ సుబ్బన్న దీక్షితులు నివసించిన ఇల్లు ఇప్పటికీ రాజమండ్రి ఉల్లితోట వీధిలో
ఉంది.చాలా కాలం వరకు ఆ ఇంటి పై కశీమజిలీ భవనం అనే అక్షరాలు ఉండేవి.
ఆ కధలన్నీ గొలుసుకట్టుగా,పురాణ కధలు, దైవ మహత్యాలు,నీతులు,నియమాలు,
ధర్మాలు,సాహసాలు ఇలా సాగిపోతుంటాయి.కాశీకి శిష్యులతో ప్రయాణిస్తూ గురువు
ప్రతి మజిలీలోను చెప్పే ఆశక్తికరమైన కధలే ఈ కధలు.అవకాశం దొరికితే ఈ కధలను
తప్పక చదవండి.పిల్లలకు చెప్పండి.వాళ్ళు చదివే, చూసే హారీపాటర్ ,క్లాష్ ఆఫ్ ది
టైటాన్స్ కన్నా అద్భుతంగా ఉంటాయి!

Sunday, April 11, 2010

బాపు-రమణల పురాణాల గీతలు-రాతలు





1963 జనవరి 26వ తేదీన శ్రీ అక్కినేని చేతుల మీదుగా 'జ్యోతి' నవర(మా)స
పత్రిక ప్రారంభమయింది. సర్వశ్రీ బాపు,ముళ్లపూడి, నండూరి రామమోహనరావు,
ఆరుద్ర,వి.ఏ.కె.రంగారావు,రావి కొందలరావు,కీ"శే" యమ్వీయల్ మొ" అతిరధ
మహారధుల సారధ్యంలో వెలువడిన 'జ్యోతి' ప్రతి పేజీ ఒక రస గుళికే!ఆనాటి"జ్యోతి'
శ్రి కృష్ణ జయంతి సంధర్భంగా కృష్ణుడి పై కార్టూనులు, హాశ్య రచనలతో ప్రత్యేక సంచిక
వెలువడింది.
'పురాణ హాస్యము' పేరిట ఆనాడు 'జ్యోతి'లోని కొన్ని రసగుళికలు ఆస్వాదించండి.

శ్రీ కృష్ణుడు : మా యింట్లో రోజూ సత్యాగ్రహమే!

విష్ణుమూర్తి : ఏక పత్నీ వ్రతంమీద మోజు తీరి కృష్ణావతారం ఎత్తాను.

కుంభకర్ణుడితో రాక్షసులు -లేక లక్ష్మణుడితో ఊర్మిళ :-
"ఏమండోయ్, నిదుర లేవండోయ్."

సూర్యుడు బాల హనుమంతుడితో:- "ఏవిటోయ్,మింగే సేట్టు చూస్తున్నావ్?"

శచీదేవి ఇంద్రుడితో:-"అబ్బ; ఒళ్ళంతా కళ్ళుచేసుకొని అలా చూడకండి, సిగ్గేస్తుంది"

రాముడితో బాణం :-"ఒక్క నిముషంలో వచ్చేస్తా స్వామీ!"

విష్ణువు బ్రహ్మతో :- "ఈ రహస్యం మూడో కంటి వాడికి తెలియకూడదు"

ఏకలవ్యుడితో తల్లి:- "తప్పమ్మా,బొటన వేలు అలా నోట్లో పెట్టుకొని చీక్కోకూడదు,ఊడి

పోతుందంతే"

రతీదేవి మన్మధుడితో :-"ఏవండీ ! ఈమధ్య బొత్తిగా కనబట్టం లేదూ ?"

సరస్వతి పిలిస్తే బ్రహ్మ వెనక్కి తిరిగి చూస్తాడా ?

Saturday, April 10, 2010

దర్శకత్వ కీర్తిని ఆర్జించిన మన ఆదుర్తి


'మూగ మనసులు' చిత్రంలో ఆచార్య ఆత్రేయ గీతం 'పోయినోళ్లందరూ మంచోళ్లూ, ఉన్నోళ్లు
పోయినోళ్ల తీపి గురుతులు'అని ఘంటసాల గాత్రం 'పాడుతా తీయగా చల్లగా' ఎంత కమనీయంగా
ఆలపించిందో, అలాటి ఎన్నో పాటలుగల చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావుగారు
రాజమండ్రిలో 1921లో జన్మించారు.ఆయన తొలి చిత్రం 'అమర సందేశం' చూసిన అన్నపూర్ణా
సంస్ధ తాము శరత్బాబు నవల 'నిష్కృతి' ఆధారంగా నిర్మించే 'తోడికోడళ్లు'చిత్రానికి
ఆదుర్తిని దర్శకుడిగా తీసుకున్నారు.అప్పటి నుంచి అన్నపూర్ణ నిర్మించిన చిత్రాలకు దాదాపు ఆస్ధాన
దర్శకులయ్యారు.ఆదుర్తి పూర్తిగా కొత్త నటీనటులతో 'తేనె మనసులు' నిర్మించి క్రిష్ణను 'సూపర్ స్టార్'ని
చేసారు.ఆయన దర్శకత్వం వహించిన 'నమ్మిన బంటు' విదేశాల్లో ప్రశంశలందుకొంది.ఆదుర్తి అక్కినేనితో
చక్రవర్తి చిత్ర సంస్ధ ద్వారా 'సుడిగుండాలు','మరో చరిత్ర' చిత్రాలు నిర్మించారు.డబ్బులు రాక పోయినా
ఆ చిత్రాలు మేధావుల, విమర్శకుల ప్రశంశలను అందుకొన్నాయి.
1954 నుంచి 1975లో అకాల మరణం పొందే వరకు ఆయన ఎన్నో హృద్యమైన చిత్రాలకు దర్శకత్వం
వహించారు.'మూగమనసులు' చిత్రాన్ని హిందీలో 'మిలన్'గా గోదావరీ తీరంలో సునిల్ దత్, నూతన్
మొదలయిన ప్రముఖ నటులతో నిర్మించారు.అలానే తమిళంలో'పెన్మనం','కట్టు రోజా' మొ" చిత్రాలు
నిర్మించారు.ఆదుర్తి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన శ్రీ కె.విశ్వనాధ్ ఆయన దర్శకత్వ ప్రతిభని
కల్పనా చాతుర్యాన్నీ అందుకున్నారు.శ్రీ విశ్వనాధ్ దర్శకత్వంలో 'శంకరాభరణం'లాంటి మంచి చిత్రాలు
రూపు దాల్చుకొన్నాఅయి.
ఆదుర్తి చిత్రాల లాగే ఆయన చిత్రాలలోని పాటలు కూడా చిరస్మరణీయాలే!
ఆదుర్తి రేఖాచిత్రాన్ని ఇక్కడ ఉపయోగించినందుకు శ్రి బాపు గారికి కృతజ్ణతలు.