Wednesday, September 26, 2012

దిష్టి బొమ్మ

         

                       దిష్టిబొమ్మ !
                       నిండుగా గడ్డినింపుకొని
                       ఆపైన ఒంటి నిండుగా బట్టలేసుకొని
                       ఠీవిగా నలబడింది !!
                       కేరింతల మధ్య తగలబడింది !!
                       అభాగ్య జీవులకు గుడ్ద కరవు !!
                       మూగ జీవులకు గడ్డి కరవు !!!

    నేను సురేఖార్ట్యూనులు పేరుతో స్థానిక దినపత్రిక సమాచారంలో
    ప్రతి ఆదివారం  ఇలాటి చిన్న కవితలు (?) వ్రాసే వాడిని. వాటిలో
    దిష్టిబొమ్మ కవిత నాకు బాగా నచ్చింది. "గోదావరి" అనే కవితా
    సంకలనంలో అచ్చయింది కూడా. రాష్టంలో ప్రతి రోజూ ఏదో
    ఉద్యమం జరుగుతూ వుంటుంది, ఎన్నో గడ్డి బొమ్మలకు మంచి
    డిమాండు కుడా. ఎవరైనా, ప్రభుత్వమైనా ఈ గడ్డి బొమ్మల
    తయారీ వ్యాపారం మొదలెడితే మంచి లాభదాయకం కదూ! 

Tuesday, September 25, 2012

30 ఏళ్ల నాటి- "మేఘసందేశం "


                        కాళిదాసు విరచిత "మేఘసందేశం" విరహ ప్రేమికుల సందేశమయితే,
  దాసరి దర్శకత్వంలో అక్కినేని 200వ చిత్రంగా తారకప్రభు పతాకంపై
  శ్రీమతి దాసరి పద్మ ఈ చిత్రాన్ని సంగీత దృశ్యకావంగా నిర్మించారు.
  అక్కినేని 200 చిత్ర వేడుక  మద్రాసు మ్యూజిక్ అకాడామీ లో 12,
  సెప్టెంబరు,1982 న  శివాజీ గణేశన్, ఆశోక్ కుమార్, రాజ్ కుమార్,
  ప్రేమ్ నజీర్ లాటి చిత్ర హీరోల సమక్షంలో జరిగింది. ఇంకా పి.పుల్లయ్య,
  బి.నాగిరెడ్డి, డి.వి.యస్.రాజు, యల్వీ.ప్రసాద్, దుక్కిపాటి మధుసూధన
  రావు,యస్.యస్.రాజేంద్రన్, యమ్మెస్.రెడ్డి,యు.కృష్ణంరాజు,జితేంద్ర,
  రాజేష్ ఖన్నా, రేఖా, రీనారాయ్ కూడా పాల్గొనటం విశేషం.ఇందులో
  చాలా మంది ఇప్పుడు మన మధ్య లేరు.
   అతితక్కువ సంభాషణలున్న మేఘసందేశంలో రమేష్ నాయుడు
  కూర్చిన సంగీతం ఈ చిత్రాన్ని మధుర కావ్యంగా మలిచింది. ఇందులో
  జయదేవుని అష్టపదులతో బాటు దేవుళపల్లి కృష్ణశాస్త్రి రచించిన నాలుగు
  పాటలను ఉపయోగించుకున్నారు. ఈనాటికీ 30 ఏళ్ళుదాటినా జేసుదాసు,
  సుశీల మధురగాత్రాల పాటలు నిత్యనూతనంగా నిలచిపోయాయి. జాతీయ
  అవార్డులలో ఉత్తమ ప్రాంటీయ చిత్రంగా, ఉత్తమ సంగీత దర్శకత్వానికి,
  ఉత్తమ గాయనీ గాయకులుగా సుశీల జేసుదాసులు ఎన్నికయ్యారు.
  ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమనటి(జయసుధ),ఉత్తమ సంగీత
  దర్శకుడు, ఉత్తమ చాయాగ్రాహకుడు,ఉత్తమగేయ రచయిత (ఆకులో
  ఆకునై దేవుళపల్లి) ఉత్తమ ఆడియో గ్రాఫర్ ఇలా ఈ చిత్రానికి తొమ్మిది
  నందుల బహుమతులు వచ్చాయి ! ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ యన్టీ.
  రామారావుగారి చేతులమీదుగా ఈ బహుమతులను చిత్ర బృందం
  అందుకున్నారు. ఒక సంధర్భంలో శ్రీమతి పాలువాయి భానుమతి
  అన్నట్లు "అక్కినేని అదృష్టవంతుడు".

Friday, September 21, 2012

గురజాడ జయంతి


                        దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా
 దేశమంటే మట్టికాదోయ్! దేశమంటే మనుషులోయ్ !! "ఆన్న
 గురజాడ  వేంకట అప్పారావు గేయం ద్వరా ఈతరం జనాలకు
 తెలిసింది. కన్యాశుల్కం నాటకాన్ని 1897లోనే వ్రాసినా రెండవ
 కూర్పు 1909 లో. ఆనాడే గురజాడ డబ్బుకు ఆశపడే లుబ్దావధానుల
 వంటి పాత్రలతొ బాటు గిరీశం ,మధురవాణి లాటి పాత్రలతో రక్తి
 కట్టించారు. కన్యాశుల్కం నాటికగా ఎంతో ప్రాచూర్యం పొందింది.
 వినోదావారు కన్యాశుల్కం చిత్రంగా, డాక్టర్ గోవిందరాజుల
 సుబ్బరావు, సి.యస్సార్, యన్టీ రామారావు, సావిత్రి, షావుకారు
 జానకి లతో అద్భుత చిత్రంగా మలిచారు.

గురజాడ  వ్యవహారిక భాషలో రచనలకు ఎనలేని కృషి చేశారు.
 విచిత్రమేమంటే గురజాడ 150 వ జయంతిని నిర్వహించాలని
 ఘనత వహించిన మన ప్రభుత్వం నిర్ణయించినా,. బాధాకరమైన
 విషయం విశాఖ బస్ కాంప్లెక్స్ సమీపకూడలిలో వున్న గురజాడ
 విగ్రహం తొలగించి దూరంగా పడేసి ఈ నాడు ఆ మహానుభావుని
 150 జయంతి నాటికైనా ప్రతిష్ఠించకబోవటం సిగ్గుపడవలసిన
 విషయం.

Thursday, September 20, 2012

అక్కినేనికి 8 9 ఏళ్ళేనా ?!!


                   

                         చూశావటోయ్ ! నాగేశర్రావ్ కు అప్పుడె 8 9 ఏళ్ళొచ్చాయట !
                         ఏ నాగేశర్రావ్?
                         ఇంకేం నాగేశర్రావ్ ? మన ఏ.నాగేశర్రావ్ ! తెలియదా !
                         మన అక్కినేని అని చెప్పరాదూ!!
                         అవును నిజమే హీరో నాగేశ్వరరావు గారు ఇప్పుడు 89 లోకి
                         అడుగు పెట్టారంటే అభిమానులందరికీ ఆనందమే కదా!
               
                         రాముడిగా అడుగుపెట్టి , "బాలరాజు"తో జానపద హీరోగా
                         ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి ,"సంసారం"
                         సాంఘిక చిత్రంలో బుక్కయినప్పుడు కత్తులుతిప్పే ఇతను
                         సోషల్ పిక్చర్ లో హీరో నా అని సినీపెద్దలుపెదవి విరిస్తే అక్కడా
                         నెగ్గి సాంఘక చిత్రాలలో హీరోగా మెరిశాడు. దేవదాసుగా,
                         విప్రనారాయణగా, తెనాలి రామకృష్ణగా,కాళిదాసుగా, భక్త
                         జయదేవునిగా అలా ఎన్నో పాత్రలకు జీవం పోశాడు..
                        మిస్సమ్మ" చిత్రంతో హాస్యాన్నీ కురిపించగలనని నిరూపించాడు.
                         "కాళిదాసు" పాత్రకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ అవార్డు అందుకున్నాడు.
                         అమెరికా ప్రభుత్వ ఆహ్వనాన్నిఅందుకొని ఆ దేశ అతిధిగా తిరిగి
                         వచ్చాడు. 60 చిత్రాలు పూర్తి చేయగానే తన నిర్మాతలను సన్మానించి
                         తన కృతజ్ఞతను తెలియజేసుకున్నాడు. ఆనాటి సభ కోసం విజయా
                         నాగిరెడ్డి తమ స్టుడియోలోని స్థలాన్ని విజయాగార్డెన్స్ గా అతికొద్ది
                         వ్యవధిలోనే రూపుదిద్దారు!ఆంధ్ర,తమిళ,కేరళ విశ్వవిద్యాలయాలకు
                         విరాళాలు అందజేశాడు.
                 

                          "పాతాళభైరవి" చిత్రం విడుదలై బ్రహ్మాండంగా నడుస్తున్న
                          రోజులు. అప్పటికింకా ఎన్.టి.రామారావుకు నాగేశ్వర్రావు
                          కున్నంత పేరు రాలేదు..నాగేశ్వర్రావు జానపద చిత్రాల
                          హీరోగా పేరు మోశాడు.చిత్రం చూసిన ఇద్దరు ప్రేక్షకులు
                          ఇవతలికి రాగానే " ఆ మొసలితో పోరాటం ఉంది చూశావ్?
                          అబ్బ..ఎంతసేపు పోరాడాడయ్యా ఆ రామారావు?"అన్నాడు
                          ఒకడు.
                          "అంతేలే. రామారావు కొత్తగదా. అంచేత అరగంట పట్టింది.
                           నా-చిటికలో చంపేసి ఉండును"
                          అన్నాడు మిత్రుడు. అలానే నాగేశ్వరరావు, సావిత్రీ చాలా
                          పాప్యులర్ జంట ! దీనిపై శ్రీ బాపు గీసిన ఓ కార్టూన్లో "ఆడ
                          పిల్లో, మగ పిల్లాడో "తెలుసుకోవాలని నర్సును ఆతృతతో
                          ఓ వ్యక్తి అడుగుతున్న తీరు  శ్రీ బాపు అద్భుతంగా ఎలా 
                          గీశారో  చూడండి. 


                          తెలుగు చిత్ర పరిశ్రమ  మన రాజధానిలో స్థిరపడాలని అక్కినేని
                         తన చిత్రాలు హైద్రాబాదులో  నిర్మించాలనే షరతుతో రాజధానికి
                         మకాం మార్చారు. మొదట నవ్విన మిత్రులే తరువాత అతని
                         ముందు చూపుని మెచ్చుకున్నారు. దీనిపై బాపు రమణలు
                        రాత గీతల ద్వారా తమ అభిప్రాయాన్ని చెప్పారు. అక్కినేని ఇంకా
                        ఎన్నో చిత్రాల్లో నటిస్తూ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని
                        కోరుకుందాం.. .
                        (అక్కినేని పొట్రైట్ , కార్టూన్లు శ్రీ బాపూ సౌజన్యంతో)

Wednesday, September 19, 2012

ఓ బొజ్జ గణపయ్య

                    ఈ మధ్య బ్లాగులో రాయటం మానేసావేమిటంటూ చాలా మంది మిత్రులు
అడుగుతున్నారు. నిజమే కొంతకాలం  రోజూ వదలకుండా ఏదో ఒకటి
వ్రాస్తూ వుండేవాడిని. నిన్న రాత్రి గణపయ్య కలలోకొచ్చి ఇదేమాటను
అడిగాడు. కొయ్ కొయ్ దేముడు నీ కలలో కొచ్చేటంత భక్తుడివి కాదు.
రోజూ పూజలూ చేయవు. నీకు సంధ్యావందనం చేయటం రాదు.ఇంత
వయసు వచ్చినా పంచె కట్టుకోలేవు అని నా సన్నిహిత మిత్రులనవచ్చు!
అసలు చిత్ర మేమిటంటే భగవంతుడు నా లాటి చిన్నపాటి భక్తులకే అగు
పిస్తాడు ! సరే మీరు నమ్మినా నమ్మక పోయినా చెప్పాలి కదా !
. స్వామీ మీరు నా బ్లాగు సంగతి అడిగారు. మీకు మా తెలుగు బ్లాగులు
ఎలా తెలుసు. మీరు చూస్తారా అనడిగాను. అదేమీటి , నాదగ్గర మౌసుంది
కదా ,అదే మూషికం అన్నాడు విఘ్నేశరుడు. ఈ  వినాయకచవితి
నుంచి మళ్ళీ బ్లాగు రాయడం మొదలు పెట్టు అంటూ ఆశీర్వదించాడు
  ఐతే స్వామీ మీ మీద మా కార్టూనిస్టులు ఎన్నో బొమ్మలు వేశారు. మా
బాపుగారు కూడా మీరు చంద్రునికి తాడుకట్టి ఉయ్యాల ఊగుతున్నట్లు
భలే బొమ్మ గీశారు చూడండి అంటూ చూపించాను. తరువాత స్వామీ
చూశారా బాపుగారు మీ మీద ,కృష్ణుడిమీదా, చాలా దేవతలమీదా
ఎన్నో కార్టూనులు గీశారు కానీ ఆయన ఇష్ట దైవమైన రాముడి మీద
ఒక్క బొమ్మాగీయలేదు చూశారా స్వామీ అన్నాను. దానికి ఓయీ
నీకు గుర్తులేదా ! బాపూ ఆయన రాముడు మీదా వేశాడు. చూడలేదా
లేక మతిమరపా ! నీ దగ్గర వున్న బాపూరమణ ఏడో నెంబరు ఆల్బమ్లో
15 వ పేజీ లోని పై బొమ్మ చూడు అంటూ తన తొండంతో నెత్తిమీద
ఒకటి వేశాడు.

గణనాధుడు నాకు ఆయన రాముడుపై గీసిన మరో కార్టూన్ గురించి
చెప్పేలోపే నాకు మెలకువ వచ్చింది , లేకపోతే ఈ కార్టూన్ గురించి
తప్పక చెఫ్ఫి వుండేవాడు. అదుగో రాములవారిపై బాపుగారు గీసిన
మరో కార్టూన్.! అదండీ ఈ వినాయకచవితి రోజువిశేషం. మీ అందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పనిలో పనిగా
నేనిక్కడ మీకు చూపించిన కార్టూన్లకు శ్రీ బాపు గారికి, "స్వాతి"
సపరివార పత్రికకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.