Friday, April 13, 2012

మా చిన్నప్పుడు , అదేనండి మా చిన్నతనంలో............

మన తెలుగులో వున్న మరో విచిత్రమేమంటే మాటలకూ అర్ధాలు మరోలా ఒక్కోసారి మారిపోతుంటాయి. "చిన్నతనం" అన్న మాట చూడండి. దానికి "అవమానం" అని కూడా అర్ధం చెప్పుకోవచ్చు. మా చిన్నతనానికి, ఇప్పటి కాలానికి ఎన్నెన్నో మార్పులొచ్చాయి. ఆనాటి విషయాలు, ఆనాడు మేము తొడుక్కున్న బట్టలు ఈ కాలం పిల్లలకు వేసుకోడానికే చిన్నతనంగా వుంటాయి. ఇక్కడి మా చిన్నప్పటి ఫొటొ చూడండి. నాపాంటు ఎలా వున్నా వేసుకున్న షర్టు మాత్రం పొడుగ్గా, చొక్కా చేతులేమో మోచేతుల దాకా వుంది. ఇప్పుడు చూస్తుంటే నిజంగా నాకు చిన్నతనంగానే వుంది. మా చెన్నై మనవడు చి"నృపేష్ " తాతా! ఆ షర్టు అంత పొడుగ్గా కుట్టించుకున్నావేం ? " అన్నాడు !ఇక మా చెల్లి కస్తూరి గౌను కన్నా లోపల వేసుకున్న డ్రాయరే పొడుగ్గావుంది!ఇక మా అక్కయ్య సరోజిని లంగా మీద గౌనేసుకుంది !! ఏమో మాచిన్నతనంలో అలా బట్టలేసుకోడానికి మాకేమాత్రం చిన్నతనం అనిపించలేదు.
ఇక్కడ మా ఇంట్లో పెట్టిన బొమ్మల కొలువులో మా అక్కయ్య ఇద్దరు అబ్బాయిలూ,చెల్లి అమ్మాయిలూ, మా ఇద్దరు అమ్మాయిలు మాధురి, మాధవి, అబ్బాయి కృష్ణ సాయి వున్నారు. వాళ్ల డ్రెస్సులు చూశారుగా. ఆ రోజుల్లో పిల్లలందరికీ ఒకేరకం బట్టలు కుట్టించేవారు. ఈ రోజుల్లో అలా కాదు. వాళ్ళకు నచ్చకపొతే అవి ఎంతటి ఖరీదుపెట్టి మనం కొన్నా వేసుకోరు. మా చిన్నతనంలో నిక్కర్లు , అవి జారిపోకుండా క్రాసుగా భుజాలమీదికి గుడ్ద స్ట్రాపులూ. మా రోజుల్లో ఇలా ఇన్నిరకాల షూలూ లేవు, షాపులూ లేవు. రాజమండ్రిలో ఆ రోజుల్లో బాటా , ఫ్లెక్స్ షూ షాపులు మాత్రమే వుండేవి. బ్రౌను కాన్వాస్ లేస్ షూస్ వేసుకుంటే చాలా గొప్పగా ఫీలయ్యే వాళ్లం ! స్కూలు జీవితం కూడా బాగా వుండేది. క్వార్టర్లీ ,హాఫ్ ఇయర్లీ పరీక్షలు అవగానే సెలవులిచ్చేవారు. హాయిగా సెలవులను మామయ్య ఊరికీ, అమ్మా నాన్నల్తో వేళ్ళేవాళ్లం!



ఇప్పటిలా టీవీలు , కార్టూన్ నెట్ వర్కులు లేవు. కాలక్షేపానికి చందమామ, బాలపత్రికలలో నెల నెలా కధలు చదువుకొనే వాళ్లం. ఆదివారం రేడియోలో బాలన్నయ్య, బాలక్కయ్యల బాలానందం ప్రోగ్రాములు ఆసక్తిగా వినే వాళ్ళం. మిక్కీమౌస్ లాటి కార్టూన్లు నాన్నగారితో ఆదివారం ఇంగ్లీషు సినిమాలకు మార్నింగ్ షోలకు వెళ్ళినప్పుడు అసలు సినిమాకు ముందు చూపించినప్పుడు ఓ పదినిముషాలు చూసి ఆనందించేవాళ్లం. ఇప్పటిలా ప్రతి వాళ్లనీ అంకుల్ , ఆంటీ అని పిలవటం మాకు తెలియదు. నాన్న, అమ్మ స్నేహితుల్ని మామయ్యగారూ, అత్తయ్యగారూ అని పిలిచే వాళ్ళం .1950లో మొదటి సారిగా నాన్నగారు STEWART WARNER అనే రేడియో కొన్నారు. ఇంట్లో వున్న హెచ్యమ్వీ గ్రామఫోను అమ్మేస్తుంటే నేను ఏడ్చి గోలపెడుతుంటే, నాకు ఇంకా బాగా గుర్తు అక్కయ్య "రేడియోలో మంచి పాటలు, పిల్లల పోగ్రాములూ వస్తాయిరా " అని చెప్పి ఓదార్చింది.


ఆరోజుల్లో ప్రతి ఆదివారం రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం పేరిట సినిమాలు వచ్చేవి. ఈ ప్రొగ్రాములు తెలుసుకోవడానికి ఆకాశవాణి వారి "వాణి " అనే పక్షపత్రిక వచ్చేది. నేను కాలేజీలో చదివే రోజుల్లోనే మా నాన్నగారితో చెప్పి తిరిగి గ్రామఫోను కొనుక్కున్నాను. ఉద్యోగంలో చేరాక ఫిలిప్స్ స్టీరియో రికార్డు ప్లేయరు కొన్నాను. నాకు ఇప్పటికీ గ్రామఫోన్ రికార్డులు వినటమంటేనే చాలా ఇష్టం. ఎన్నేనా చెప్పండి ! ఇప్పటిలా టీవీలు, కంప్యూటర్లు,డిజిటల్ కమేరాలు మా కాలంలో లేకపోవచ్చు. ఐనా నాకు మాచిన్ననాటి రోజులే బాగున్నాయ్ అని చెప్పటానికి నా కేమాత్రం చిన్నతనంగా లేదు. బాపుగారు "చిన్న.నాటి రోజులు మళ్ళీరావురా" అంటూ ఎంత చక్కటి కార్టూనేశారో చూడండి ( బాపు కార్టూన్లు సంపుటి-1 ,పేజీ 103 సౌజన్యంతో)

2 comments:

  1. బాగుందండి ... ఒక రోజు టీవి చూడకుండా రేడియో వినండి ఇప్పటికీ మంచి కార్యక్రమాలు వస్తున్నాయి

    ReplyDelete
  2. అప్పారావు గారు,
    చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుని హాయిని పొందాను.

    ReplyDelete