Thursday, June 07, 2012

గుండక్కకు 50 ఏళ్ళు !!

జూన్ 1962, 7వ తేదీన విడుదలయిన విజయా వారి  గుండమ్మ కధకు నేటితో 50 ఏళ్ళు  ఆనాడు విడుదలయి అఖండ విజయం సాధించిన ఈ సినిమా నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్నదానికి తార్కాణం ఈ రోజు ప్రతి చానల్ ఆ చిత్రం గురించిన విశేషాలు ప్రసారం చేయటమే. ఈటీవీ ఉదయం చిత్రం ప్రసారం చేసి అభిమానులను మరోసారి అలరించింది. అగ్రనటులు నాయకులుగా నటించిన ఈ చిత్రానికి "గుండమ్మకధ" అని  పేరుంచడమే   చిత్రానికి ఒక ప్రత్యేకతను ఇచ్చింది. ఈ సినిమా నిర్మాణసమయంలో చక్రపాణిగారిని మీ గుండమ్మకధ ఎంతవరకూ వచ్చింది అంటూ అడుగుతుంటే చివరకు ఆయన చిత్రానికి "గుండమ్మకధ" పేరునే ఖాయంచేశారు. ఇక గుండమ్మ(క్క)గా సూర్యకాంతం అసమాన నటన ప్రదర్శించారు

విజయాచిత్ర రధసారధులు శ్రీ నాగిరెడ్డి చక్రపాణి మంచి మిత్రులు. బాపురమణలలా దేహాలు వేరయినా మనసులు, భావాలు ఒకటే. తెలుగు చిత్రానికి  శ్రీ కమలాకర కామేశ్వరరావు  దర్శకత్వం వహిస్తే తమిళ చిత్రానికి శ్రీ చక్రపాణి దర్శకత్వం వహించారు.

శ్రీ రామారావుకు "గుండమ్మకధ" వందవ చిత్రం కావడం మరో విశేషం. ఇది చిత్రం వందోరోజు నాటి ఆంధ్రపత్రిక దినపత్రికలో వచ్చిన అప్పటి ప్రకటన !
 "గుండమ్మకధ" నాగేశ్వరరావు గారి 99 చిత్రం కావడం మరో వీశేషం!! ఆనాటి "గుండమ్మకధ" ప్రకటనలో అక్కినేని ఇలా అన్నారు "19 సంవత్సరాల నా చలన చిత్ర యాత్రలో "{గుండమ్మ  కధ" నా 99 వ మజిలీ. తెలుగుచిత్ర చరిత్రలోనే అపూర్వం అనతగ్గ ఘనవిజయం సాధించి ఆబాలగోపాలాన్ని ఆనందపరుస్తున్న ఈ చిత్రం,తెలుగు సినిమా కధలోనూ కూడా ఒక  మైలురాయి కావడం నాకెంతో సంతోషకరమైన విషయం."

మరోవిశేషం "గుండమ్మకధ" తమిళ వర్షన్ "మనిదన్ మారవిల్లై " (మనిషి మారలేదు)అక్కినేనికి వందవ చిత్రం!!. ఇందులో NTR పాత్రను జెమినీగణేశన్ ధరించారు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో ప్రతిపాటా ఈనాటికీ నిత్యనూతనమే.

గుండమ్మ ఇంట్లో ఏఎన్నార్, యమ్టీయార్ కలసుకున్న సంధర్భంలో వాళ్ళిద్దరి మధ్య  సంభాషణలను  విజిల్ రూపంలో చూపించడం కొత్తగా వుండి అభిమానులను విశేషంగా ఆకర్షించింది. "గుండమ్మకధ" ప్రివ్యూ చూసి చక్రపాణిగారితో బాగా పరిచయం ఉన్న ఒకాయన  " ఈ సినిమాలో విజయలక్ష్మి డాన్సు ఎందుకు పెట్టినట్టు ?" అన్నాడు" చూట్టానికి " అన్నారు చక్రపాణి గారు కూల్ గా పేపరు చదువుతూ తలెత్తకుండానే !అడిగినాయన మారు మాట్లాడకుండా వెళ్ళి పోయాడు. మరో చక్రపాణిగారి చురుక్కుమనే చమక్కు. చిత్తగించం "గుండమ్మకధ" సినిమా చూసిన ఒకాయన, " ఈ సినిమాలో మెసేజ్ ఏమీ లేదే ?" అంటే "మెసేజ్ ఇవ్వడానికి సినిమా ఎందుకు ? టెలిగ్రామ్ ( ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవుగా) ఇస్తే పోలా" అన్నారట శ్రీ చక్రపాణి.

2 comments:

  1. తెలుగు భూమిపై ఉన్నంతకాలమూ చిరస్థాయిగా నిలచిపోయే కొద్ది చిత్రాల్లో "గుండమ్మకథ" ఒకటి, ఎన్ని త్రాలకైనా మహొన్నతంగా నిలిచిపోయే చిత్రరాజం...50 యేళ్ళకి ఇలా గుర్తుచేసుకోవటం చాలా బాగుంది.

    ReplyDelete
  2. చాలా థాంక్స్ అప్పారావు గారు ...దీనిని నేను నా ఫేస్బుక్ లో షేర్ చేస్కుంటున్నాను.. ఏమీ అభ్యంతరం లేదూ కదా??

    ReplyDelete