Thursday, January 10, 2013

మధురమీ సు(రేష్)ధాగానం !!

            జంధ్యాల రూపొందించిన " హై హై నాయకా " సినిమాలోని " సరిగమలెరుగని
రాగము....." పాట గుర్తుందా! ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా ప్రవేశించిన శ్రీ
మాధవపెద్ది సురేష్, మాధవపెద్ది సత్యం ( ఈయన మాయాబజార్ సినిమాలో
శ్రీ యస్వీ రంగారావుకు పాడిన "వివాహ భోజనంబు" పాట పాడటమే కాకుండా
అందులో అగుపిస్తారు కూడా), కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే, గాయకులు
మాధవపెద్ది రమేష్ వంటి మేటి సినీ సాం కేతవర్గానికి చెందిన కుటుంబం నుంచి
వచ్చారు.  1967 లో విజయవాడలో భావనాకళాసమితి నిర్వహించిన ఒక
కార్యక్రమంలో శ్రీ సురేష్ హార్మోనిస్ట్ గా తనప్రతిభను చూపించారు. ఆ సమయంలో
ఆయన SSLC విద్యార్ధి. శ్రీ సురేష్ అన్నగారు కర్ణాటక, హిందుస్థానీ సంగీతాన్ని
అధ్యయనం చేశారు. ఆయన ఇచ్చిన పోత్సాహంతో సురేష్ సంగీతం మీద అభిమానాన్ని
పెంచుకున్నారు. సురేష్ తల్లిగారు శ్రీమతి వసుంధరాదేవిగారికి వీణలో డిప్లొమో,
కర్ణాటక సంగీతంలో ప్రవేశముంది. సంగీతం ప్రవృత్తే గాని, వృత్తి కాకూడదని ఆమె
అనేవారట.
 శ్రీ సురేష్ నాన్నగారు విజయవాడ ఆంధ్రా సిమెంట్స్ లో ఇంజనీరుగా పనిచేసేవారు.
సురేష్ సంగీతంపై చూపిస్తున్న శ్రర్ధను గమనించి ఆయన అమ్మగారికి తెలియకుండా
ఓ అకార్డియన్ను కొనిచ్చారట. అనుకోకుండా సురేష్ నాన్నగారు 1973 లో కీర్తిశేషు
లయ్యాక కుటుంబం మద్రాసు తరలి వెళ్లారు. ఆనాడు వాళ్ల నాన్నగారు కొనిచ్చిన
ఆ వాయిద్యమే శ్రీ సురేష్ గారికి భుక్తికి దారి చూపించింది. సురేష్ అన్నగారు శ్రీ
మాధవిపెద్ది  రమేష్ నేపధ్యగాయకుడిగా ప్రశిద్ధిపొందారు.అటుతరువాత శ్రీసురేష్
సంగీత దర్శకులు శ్రీ టి.చలపతిరావుగారివద్ద అకార్డియన్ ప్లేయరగా చేరారు.1974
నుంచి ఎస్.రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్,పెండ్యాల, జె.వి.రాఘవులు,రమేష్ నాయుడు,
జి.కె.వెంకటేష్, నౌషద్,లక్ష్మీకాంత్ ప్యారీలాల్,ఆర్.డి.బర్మన్ వంటి సుప్రసిద్ధ సంగీత
దర్శకుల వద్ద పనిచేశారు.
 హై హై నాయకా సినిమా తరువాత రంభ రాంబాబు, భార్గవ్, ప్రేమా జిందాబాద్, బాబాయ్
హోటల్, పర్వతాలు పానకాలు,బృందావనం చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాలన్నిటిలో బృందావనం శ్రీ సురేష్ గారి సినీ సంగీత జీవీతాన్ని మలుపు
తిప్పిందనే చెప్పాలి. అందులో శ్రీ వెన్నెలకంటి కలం నుంచి వెలువడిన " మధురమీ
సుధాగానం" సంగీత కూర్పు గొప్ప సంగీత దర్శకులను గుర్తు చేసింది. భైరవద్వీపం
లోని నరుడా ఓ నరుడా అనే వేటూరి గీతం, నారద తుంబుర గానామృతం లాటి
మధురగీతాలు ఆయనకు ఉత్తమ సంగీతదర్శకుడు అవార్డుతో బాటు డబుల్ ప్లాటినం
డిస్కును సంపాదించి పెట్టింది. దాసరి  125వ చిత్రం మాయాబజార్, రాజేంద్రప్రసాద్
మేడమ్, ఈ.కోదండరామిరెడ్డి "మాతో పెట్టుకోకు" చిత్రాలు శ్రీ సురేష్ ప్రతిభను చాటాయి.
"సాహిత్యం-సంగీతం పూలదండలోని దవనం,మల్లెపూలలాగ కలసి,విడిగా తెలిసి
అలరించాలి" అని రమేష్ అంటారు.


శ్రీమాధవపెద్ది సురేష్ గారిని నేను మొదట ఓ సంధర్భంలో శ్రీ బాపుగారింట్లో కలవడం
జరిగింది. " రాజమండ్రి మా అత్తగారి ఊరే , ఈసారి వచ్చినప్పుడు తప్పక కలుద్దాం"
అన్నారు. అటుతరువాత ఫేసు బుక్ మిత్రులుగా తరచు కలుసుకుంటున్నా ఓనాడు ఫోనులో
"నేను రాజమండ్రి వచ్చాను" అన్నారు.. నేను ఆయన్నికలసి మా ఇంటికి రమ్మని పిలువగానే
వచ్చారు. ఉన్న కొద్ది సేపూ ఆయన నాతో, నా శ్రీమతితో ఎంతోకాలం నుంచి పరిచయం
వున్న వారిలా కలివిడిగా మాట్లాడారు. వారి బాబాయి గారు శ్రీ మాధవపెద్ది గోఖలే
గీసిన చిత్రం ( భారతి మాస పత్రికలోని నా సేకరణ) పైన ఆయన సంతకం చేశారు.
సంగీత దర్శకుడిగా శ్రీ మాధవపెద్ది సురేష్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ..

2 comments:

  1. na abimana sangeetha darsakunigurinchi rasinandulaku sarvada krutajnudanu.melody ki pradhanyata itche etuvanti variki saraina avakasalu raakapovadam mana telugu cine parisrama chesukunna durudrustam.aynaku marinni manchi avakasalu ravalani manaspoorthiga korukuntunnanu.madhuramee sudhaganam madhuramee apparao gari blog.thank you
    vepavrrao

    ReplyDelete