Thursday, November 12, 2009

కోతి కొమ్మచ్చిలో నేను


నేను ఎంతగానో అభిమానించే, గౌరవించే బాపు రమణల కోతి కొమ్మచ్సిలో చిన్న మాట చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను.


Wednesday, November 11, 2009

తెలుగు తల్లికి వందనం: తెలుగోపనిషత్; సీ.పి.బ్రౌన్



తెలుగువారికి ఒక ప్రత్యేకత వుంది.కొన్ని కొన్ని లక్షణాలనుబట్టి ఎంత మందిలో వున్నా తెలుగువాడిని ఇట్టే పసిగట్టవచ్చు.ఉదాహరణకు :- మీ దోవన మీరు పోతుండగా,ఎవడైనావచ్చి,మీ చెయ్యి మెలిపెట్టి మీ వాచీలో టైము చూసుకొని వెళ్ళిపోతే, వాడు ఖచ్చితంగా తెలుగువాడే అయివుంటాడు. రోడ్డు కడ్డంగా నుంచుని,కార్లు,సైకిళ్ళు,రిక్షాలు,ఆవులు మొదలైన వేటినీ లెక్క చేయకుండా గంటల తరబడి రాజకీయాలు,సినిమాలు చర్చించే వాడు తెలుగువాడనటానికి సందేహం లేదు. మీరు దినపత్రికగాని,మరో పత్రికగాని కొనడంతోటే, "ఒక్క సారి చూసిస్తాను,పేపరిస్తారా?" అని అడిగి పుచ్చుకుని,తిరగేసి,నిర్లక్ష్యంగా మీమీద పడేసి చక్కా పోయేవాడు తెలుగు వాడే. బస్సులో గాని రైల్లో గాని ఆరుగురు కూర్చోవలసిన సీట్లో నలుగురికి కూడా ఇరుకయ్యేట్టు కూర్చో గల నేర్పు ఒక్క తెలుగు వాడికే వుంది.అన్నట్టు అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం : తెలుగు వాళ్ళని తిట్టిపోసి,అరవ్వాళ్ళని,బెంగాలీవాళ్ళని మెచ్చుకునేవాడు కూడా తెలుగు వాడే! ఈ సోదంతా ఇప్పుడెందుకని నన్ను కోప్పడకండి.తెలుగువాడు,కనీసం భారతీయుడు కాకపోయినా సీ.పీ.బ్రౌన్ అనే బ్రిటిష్ దేశీయుడు తెలుగు నేర్చుకుని తెలుగు భాషకు ఎనలేని సేవ చేసాడు. ఆయన జన్మదినం నిన్ననే( నవంబర్ 10 ).ఆయన తెలుగు నిఘంటువును,వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు.అప్పయ్యదీక్షుతులు లాంటి పండితులవద్ద తెలియని విషయాలు నేర్చు కున్నాడు.రాజమండ్రి లో శ్రీ సన్నిధానమ్ నరశింహశర్మ,వారి సోదరులు శాస్త్రి వారి ఇంటికి"బ్రౌన్ మందిరం" అన్న పేరు పెట్టుకొన్నారంటీ వారిని అభినందించాలి.బ్రౌన్ జన్మ దినం రోజున స్తానిక యంయల్.ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు గారి అధ్వర్యంలో సభ నిర్వహించి తెలుగు భాషాభి వృర్ధికి అందరూ కృషి చేయాల్సిన అవసరం గుర్తు చేసారు.వక్తలందరూ ఎన్నోవిషయాలను చెప్పారు కాని మద్రాసీలుగా పిలువబడుతున్న తెలుగు వాళ్ళకి యన్టీఆర్ తెచ్చిన గుర్తింపును ఒక్కరు జ్ఞాపకం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఏమైనా మనం తెలుగు వాళ్ళం కదా!!





చివరగా ఒక మాట: తెలుగోపనిషత్ జ్యోతి బుక్స్ వారు 1964 లో ప్రఛురించిన "రసికజన మనోభిరామము" పుస్తకం లోనిది. ఆ పుస్తకంలో బాపు,రమణ ,రావి కొండలరావు మొ ప్రముఖుల సంపాదకత్వంలో వచ్చిన "జ్యోతి" మాస పత్రికలోని జోకులు,కార్టూన్లతో ఆ పుస్తకం ప్రచురించారు.ఆ పుస్తకం ధర ఎంతో ఊహించండి.దాదాపు 80 పేజీల బుక్ వెల ఒక రూపాయి మాత్రమే! మీరు నమ్మాలి.ఆ పుస్తకం నా దగర వుంది!!

Tuesday, November 10, 2009

అలనాటి ఆంధృల అభిమాన దిన పత్రిక ఆంధ్రపత్రిక




దేశోద్ద్హారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారిచే బొంబాయి లో 1908న వార పత్రిక గా స్ద్హాపించ బడిన ఆంధ్రపత్రిక 1914 లో దినపత్రిక గా మద్రాసు నుంచి వెలువడింది.వార పత్రిక ఈనాటి జిల్లా అనుభంధం సైజులో వెలువడుతూ వుండేది.తరువాత ఇప్పుడు మనం చూస్తున్న వార పత్రికల సైజు లోకి మార్చారు. ఆ రోజుల్లో పత్రిక భాష గ్రాంధికంగా వుండేది. మచ్చుకి 1937 డిసెంబర్ 16వ తేదీ పత్రికలోని అడ్వర్టయిజ్మెంట్ చూడండి: హాయిగా నుండును "మైసూరు చందనము సబ్బు యెంత శ్రేష్టమైనదో: మీగడగా వచ్చు దాని మనోహరమైన నురుగు అంతమనోజ్ఞము గాను హాయిగాను నుండును.పుష్కలముగా వచ్చు ఆ తెల్లని నురుగు శరీరము యొక్క రోమ కూపములందు చొచ్చుకొనిపోయి అచటగల మలినమును మురికిని యావత్తు పార ద్రోలును" భలే బాగుంది కదండి! అలనాటి పత్రికలో పండితారాధ్యుల నాగేశ్వరరావు,దాసు వామనరావు,కొడవటిగంటి కుటుంబరావు,తెన్నేటి సూరి,పిలకా గణపతి శాస్త్రి,వి.డి.ప్రసాదరావు,సూరంపూడి సీతారాం,ముళ్ళపూడి వెంకటరమణ,వేటూరి సుందరరామమూర్తి,తిరుమల రామచంద్ర, మార్కట్వైన్ నవలలను తెలుగులో అనువందించిన నండూరి రామమోహన రావుల వంటి హేమాహేమీలు సంపాదకవర్గంలో పని చేశారు. బాపు గారి పాకెట్ కార్టూన్లు "మనవాళ్ళు",జయదేవ్,శంకు,బాబు, సత్యమూర్తి "చదువుల్రావ్",విశ్వాత్ముల నరసింహమూర్తి గారి పంచతంత్రం బొమ్మలకధ,బాపు గారి "బంగారం-సింగారం" బొమ్మల కధలు, నాలాటి సామన్యుడి మొదటి కార్టూన్ ఆంధ్ర పత్రిక(1958)లో చోటు చేసుకున్నాయి.అలానే ఎలిమెంట్రీ చదువుకున్న మా అమ్మగారు సీతాలక్ష్మి టేల్ ఆఫ్ టు సిటీస్(రెండు మహానగరాలు),కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టొ,రాజు పేదా, కాంచనద్వీపం(ట్రజర్ ఐలెండ్)మొ" నవలలను చదివే అవకాశం ఆంధ్రపత్రిక కలిగించింది. ఉగాది(1954)లో పిల్ల్ల్లలకు చిత్రలేఖనం పోటీలో మా చెల్లి గీసిన "నేను,మా సంగీతం మాస్టారు"బొమ్మకు బహుమతి వచ్చింది.ఇంతటి మంచి పత్రిక నిలచిపోవటం ఎంతో భాధాకరం. ఆంధ్రపత్రిక గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఎపి అకాఅడమి ప్రఛురించిన ఆంధ్రపత్రిక చరిత్ర చదవండి.

ఆంధ్ర పత్రిక-అమృతాంజనం:....ఆంధ్ర పత్రికతో బాటు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు అమృతాంజనం పైన్ బామ్ను కూడా తయారుచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులతో బాటు లాభాలను కూడా సంపాదించారు.వచ్చిన ధనాన్ని ఆయన దానధర్మాలకు కర్ఛు చేసేవారు.మహత్మా గాంధీ తన "యంగ్ ఇండియా" పత్రికలో ఇలా వ్రాసారట. "నేను శ్రీ నాగేశ్వరరావు తన అమృతాంజనం ద్వారా ప్రజలను బాగా దోచుకోవాలని కోరుకుంటున్నాను.ఏమంటే ఆ డబ్బును తిరిగి ఆయన ఆ ప్రజలకే ఖర్చు చేస్తారు కనుక".ఇక్కడ మీరు గాంధి గారి సంపాదకత్వాన వెలువడిన "యంగ్ ఇండియా" పత్రిక ఫొటో చూడొచ్చు! అమృతాంజనం పై ఒక జోకు: మొదట్లో ఆంధ్రపత్రిక భాష పూర్తిగా గ్రాంధికంగా వుండేది.చదివ లేక తలనొప్పి వచ్చే పాఠకుల కోసమే నాగేశ్వరరావు గారు "అమృతాంజనం" తయారుచేసారు అని ఒకరు చమత్కరించారట! అన్నట్టు చెప్పటం మరిచానండోయ్! మన ముళ్లపూడి వెంకట రమణ గారి "బుడుగు-చిచ్చుల పిడుగు" కూడా ఆంధ్ర వార పత్రికలోనే వచ్చింది.

Monday, November 09, 2009

గోదావరి తల్లికి అందాల ఆభరణాలు



గోదావరి నది పై ఇప్పుడు వున్న రెండు వంతెనలలో ఒకటి ఆసియాలోనే పొడవైన రోడ్డు రైలు వంతెన.పైనున్న రోడ్డు మీదనుంచి వాహనాలు,క్రింద రైళ్ళు,ఆ క్రింద నది పైన నావలు,లాంచీలు వెల్తుంటాయి.వీటన్నిటి కంటే ముందుగా 1900 లో ప్రారంభించిన హావలాక్ బ్రిడ్జి 100 సంవత్సరాలపైన పనిచేసి మూడో వంతెన నిర్మించాక విశ్రాంతి తీసుకొంటున్నది. మూడో బ్రిడ్జి అర్ధచంద్రాకారపు ఆర్చీలతో గొదావరికి కొత్త అందాలు ఇచ్చింది.ప్రతి రోజూ గొదావరి పై పాత బ్రిడ్జి నుండి బయలుదేరి రోడ్డు రైలు బ్రిడ్జి వరకు తీసుకొని వెళ్ళి మళ్ళి కొత్త/పాత బ్రిడ్జి దగ్గరకు మోటార్ బోట్ల పై షికారు వెళ్ళి రావటం ఎంతో ఆహ్లాద కరం గా ఉంటుంది.ఎన్నో ఏళ్ళుగా రాజమండ్రి లో ఉంటున్నా రెండు రోజుల క్రితమే మా అబ్బాయి వచ్చినప్పుడు ఆ బోటు షికారులో వున్న ఆనందం ఏమిటో తెల్సింది.ఈ సారి మీరు మా ఊరొచ్చినప్పుడు బోటు షికారు మరచిపోకండేం!! అన్నట్టు అలనాటి పాత వంతెన శంకుస్తాపన శిలాఫలకం ఆ వంతెనలాగే ఇంకా మనకు దర్శనమిస్తుంది!!

Wednesday, November 04, 2009

గ్రీటింగ్ కార్డుల కధ





ఈనాడు ఆ మైల్ పోయి ఈ మైల్ వచ్చాక ఒకరికి ఒకరు ఉత్తరాల ద్వారా పలుకరించుకోవడం తగ్గిపోయింది.ఇక బజారుకు వెళ్ళి మనకు నచ్చిన గ్రీటింగు కార్డులు కొనటం వాటిని పోస్టాఫీసుకువెళ్ళి పోస్టు చేసే ఓపిక,తీరిక ఉండటంలేదు.నెట్ నుంచి 123 అన్నంత తేలికగా 123 గ్రీటింగ్స్ రకరకాలు మితృలకి ,ఆప్తులకి క్క్షణాల్లో పమ్పిస్తున్నాము.ఐనా మొట్టమొదటి గ్రీటింగ్ కార్డుల చరిత్రను మనం ఓ సారి చెప్పుకోడం,జ్ఞాపకం చేసుకుందాం! 1842 డిసెంబర్ 9వ తేదీన విలియం మా ఈగ్లే మొట్టమొదటి క్రిస్మస్ కార్డును తయారుచేసాడట!విలియం తయారుచేసిన కార్డు పై భాగాన టు ... అని,అడుగున ఫ్రం...అని అచ్చువేసి పంపే వాళ్ళు పేర్లు వ్రాసుకో వడానికి వీలుగా వుండేదట.మొదటి అమెరికన్ క్రిస్మస్ కార్డు(1824-1909) లో లిధోగ్రాఫర్ లూయిస్ ప్రాంగ్ తయారిచేసాడు.1873 లో ప్రాంగ్ చార్లెస్ డికెన్స్ ఆటొగ్రాఫ్ తో గ్రీటింగ్ కార్డును దిజైన్ చేసి తన మితృలకు,కుటుంబ సభ్యులకు పంపించాడట.1900 సం" వరకు మత సంభందమైన విషయాలకే శుభాకాంక్క్షల కార్డులను పంపించే అలవాటు తరువాత పుట్టిన రోజులు మొ'' వాటికి కూడా జేర్చటం మొదలయింది.1920 అతి చిన్న కార్డు వడ్ల గింజ పై 22 మాటలతో వ్ర్రాసిన క్రిస్మస్ కార్డు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కి బహుకరించారట!


ఇకనుండైనా కొందరు ఆప్త మితృలకయినా గ్రీటింగ్ కార్డులు కొనైనా లేకపోతే తయారు చేసైనా పంపిస్తారు కదూ!

Monday, November 02, 2009

ఇల్లస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లోని అపురూప చిత్రాలు (1950)



ఫిల్మ్ ఫేర్,ఫెమినా లాంటి పత్రికలను ఎన్నో ఏళ్ళుగా ప్రచురిస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రఛురణల సంస్ద బెనెట్ కోల్మన్ కంపెనీ ఇది వరలో ఇలస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే వార పత్రికను ప్రచురించేది. ఎందుకోగాని ఆ పత్రిక ప్రఛురణ చాలా ఏళ్ళ క్రితం నుంచి మాని వేసింది.ఆ పత్రికలో గొప్ప భారతీయ చిత్రకారుల పెయింటింగ్స్,శిల్పాలు,ఫొటోలు ప్రఛురించేవారు.మా నాన్న గారు ఆ పత్రికలోని అపురూప చిత్రాలను జాగ్రత్త చేసి ఆల్బమ్ గా తయారు చేసారు.అందులోని కొన్ని బొమ్మలు మీ ముందు వుంచుతున్నాను.ఇందులో ఒక బొమ్మలో చిత్రకారుడు కవి స్త్రీ ని వర్ణించే తీరులో వుంటే ఆమె రూపం ఎలా ఉంటుందో చమత్కారం గా చూపించటం మీరు గమనించ గలరు

Sunday, November 01, 2009

అపురూపకథ - తిట్టు మాటలు



అలనాటి చందమామ లోని అపురూప కధ తిట్టు మాటలు




గాడిద,ఎద్దు,దున్నపోతు కలసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి "దేవా! మానవులు మా చేత ఎంతో చాకిరీ చేయించుకుంటూ వాళ్ళ తోటి మనుషులను,"అడ్డగాడిదా అని,ఎద్దులాగున్నావు, బుద్ది లేదా అని, ఒరే దున్నపోతా!! అని మా పేర్ల తో తిడుతుంటే మాకు చాలా బాధ కలుగుతున్నది.మీరు ఆ మానవులకు చెప్పి తిట్లలో మా ప్రస్తావన లేకుండా చూడండి" అని మొరపెట్టుకున్నాయి.


అప్పుడు బ్రహ్మ దేవుడు" మీ నడవిడిని బట్టి మానవులు అలా అంటున్నారు. ముందు మీ నడవడి మార్చుకొని నా దగ్గరకు రండి. అప్పుడు చూద్దాము" అన్నాడు.అప్పుడు గాడిద "ఈ దున్నపోతు దగ్గరకు రావటం నే చేసిన తప్పు"అంది. తరువాత ఎద్దు "ఈ అడ్డగాడిద దగ్గరకు వచ్చి పొరపాటు చేసా" అంది. చివరకు దున్నపోతు"ఈ ఎద్దుగాడు మానవ పక్షపాతి వీడి దగ్గరకు వచ్చి చాలా తప్పు చేశాం"అంది.


అలనాటి చందమామ లోని ఈ ఛిన్న కధ ఎలావుంది?