
"ఏమండీ,సలహాల్రావు గారూ! వార్తలు తెలుసుకోడానికి
టీవీయా, వార్తా పత్రికా ,ఏది మంచిదంటారూ" అంటూ
సందేహరావు అడిగాడు.
"వార్తాపత్రికే నయమండి! ఏమంటే కరెంటు పోతే మీరు
టీవీ చూడలేరు. అదే న్యూస్ పేపరనుకోండీ హాయిగా
విసనకర్రలా విసురుకోవచ్చు" అన్నాడు సలహాల్రావు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఏదుపుకొట్టుడు సీరియల్సు చూడటం మాని చాలా
కాలమయింది.ఇక వార్తలు చూడ్డానికి ఏటీవీ,ఈటీవీ,
నాలుగో టీవీ,ఐదో టీవీ,తొమ్మిదోటీవీ అంటూ ఎన్నెన్నో
టీవీలున్నాయి. ఇక వాటిలో ఎక్కడో ఏ ప్రమాదమో
జరిగితే మన టీవీ వాళ్లకు అది ప్రమోదమే! మావిలేఖరి
నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంటూ
న్యూస్ రీడరమ్మ "హలో నామాట వినబడుతుందా?
లారీ గుద్దుకొని క్రిందబడ్డ ఆయన స్పందన తెలుసు
కోండి" అనగానే ఆ హలో"న్యుస్ రీడరమ్మాయి!ఇప్పూడె
అడిగా, తనకు నరకం కనిపిస్తున్నదని చెప్పాడు!"
అంటాడు. తరువాత "పరీక్షల్లో గోల్ద్ మెడలు సాధించిన
విద్యావతి తల్లిదండ్రుల స్పందన ఏమిటో కనుక్కొని
చెప్పండి" అని రీడరమ్మ అనగానే " ఫెయిలయితే
బాగుండేది.ఇప్పుడు బోల్డు డబ్బుతగలేసి పై చదువులు
చదివించాలని" అంటున్నారని జవాబు! ఈలా వుంటుంటాయి
మన వర్తా చానల్ల తీరుతెన్నులు. అమ్మాయి పరీక్ష పాసయితే
అమ్మానాన్నలు సంతోషిస్తారు, దానికి వాళ్ళ స్పందన ఏమిటో
అడగాలా! ఇక ఏదైనా సంఘటన జరిగితే ఆ రోజంతా అదే
గొడవ,ఇక మరే న్యూస్ లేనట్టు. మరో గమ్మత్తు! ప్రతి చానలు
ఎక్స్క్లూజివ్ అంటూ అదే వార్త కొన్ని నిముషాలతేడాలో
చూపిస్తుంటారు. దేశంలో మోసగాళ్ళు, మోసాలు పెరిగి
పోతున్నాయని సాక్ష్యాలతొ సహా చూపించే వీళ్ళే కొన్ని
మోసాల ప్రకటనలు ప్రతి అరగంటకూ చూపిస్తుంటారు.
ఈ ప్రకటన నిజానిజాలతో మాకు సంబంధంలేదని ముందు
చూపిస్తున్నారనుకోండి.దాన్ని చదివే ఓపిక మనలో ఎందరికి
వుంది. కూరలు తరిగే ఓ సాధనం ఖరీదు 1999/- రూపాయలని
మరో రెండొందలు ప్యాకేజీ చార్జీలని ఓ ప్రకటన తో చానల్లలో
ఊదరగొట్టే వస్తువు మా రాజమండ్రి మార్కెట్లో 380/-లకే
దొరుకుతున్నది! న్యూస్ చానల్ల వల్ల అసలు ఉపయోగం లేనే
లేదనీ అనలేం. రాజకీయనాయకులు, కొందరు లంచగొండి
ఉద్యోగుల గురించి బయటపెడుతుంటూనే ఇన్ని అవినీతి
పనులు జరుగుతుంటే ,ఈ చానల్లే లేకుంటే వీళ్ళ ఆగడాలకు
అడ్డేవుండేది కాదేమో అని ఊక్కోసారి అనిపిస్తుంటుంది!
పైన నే వేసిన కార్టూన్ 1963 లో "నవ్వులు పువ్వులు"
అనే హాస్య పత్రికలో వేసినది. అప్పటికింకా టీవీలు రాలేదు
కాబట్టి రేడియో స్టేషన్లో వార్తలు చదువుతున్నట్లు వేశాను.
మరో విషయం.ఇన్నేసి చానల్లు పుట్టుకోస్తున్నా, మన వార్తా
పత్రికల సర్కులేషను తగ్గక పోవడం, ఓ శుభసూచకమే!
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
గత కొద్దిరోజులనుంచి డిస్కవరీ చానల్ తెలుగులో కూడా ప్రసారం
అవుతున్నది.కాని అనువాదకులు కాస్త శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని
పించింది.మొన్న గుజరాత్ సింహాల గురించి కధనం ప్రసారంచేస్తూ
"సింహాల జనాభా" అన్నపదం వాడారు. మనుషులను లెక్కించేటప్పుడు
ఆ మాటను వాడటం సమంజసం అనుకుంటాను. "సింహాల సంఖ్య"
అంటే బాగుంటుందని నా భావన.ఏ మైనా మన తెలుగులో ప్రసారం
చేయటం వల్ల ఇంగ్లీషు రాని వారికి సౌలభ్యంగా వుంటుంది.















