Tuesday, October 05, 2010

వైణిక శిఖామణి చల్లపల్లి చిట్టిబాబు



ఒక్కో సంగీత వాయిద్యం గుర్తుకు రాగానే ఒక్కో సంగీత
కారుడు గుర్తుకువస్తారు. షెహనాయ్ అనగానే బిస్మిల్లాఖాన్,
ఫ్లూట్ అనగానే హరిప్రాసాద్ చౌరాసియా,సితార్ అనగానే రవి
శంకర్ మన కళ్ళముందు సాక్షాత్కరిస్తారు. ఇక వీణ అనగానే
ఈమని శంకర శాస్త్రి గారితో బాటు వారి శిష్యుడు చిట్టిబాబు
గుర్తుకువస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 13 ,
అక్టోబరు, 1936 న చిట్టిబాబు జన్మించారు. పన్నెండవ యేటనే
కాకినాడ ఇయ్యాని అప్పలాచార్య వద్ద శిష్యునిగా చేరి కచేరి
చేసి సంగీతాభిమానుల ప్రశంసలను పొందాడు. చిట్టిబాబు
తండ్రిగారు, రంగారావు గారు, మద్రాసుకు తీసుకొని వెళ్ళి
ఈమని శంకరశాస్త్రి గారివద్ద చేర్పించారు. శంకరశాస్త్రిగారు
ఏ నాడూ చిట్టిబాబును ఇది నేర్చుకో అని అడగలేదట.గురువు
గారి సాధనను గమనిస్తూ చిట్టిబాబు సాధన చేసేవారట.ఇక
ఆయన అసలు పేరు చిట్టిబాబు కాదట. మద్రాసులో ఈమని
గారి శిష్యరికంలో వుండటంచేత సినిమా వారితో పరిచియాలు
కలిగి ,భరణీ వారు నిర్మిస్తున్న"లైలామజ్ను" లో కుర్రవాని పాత్రకు
ఆయన్ని ఎన్నుకొని అతని అసలు పేరైన హనుమంతు పంతులు
అన్న పేరు టైటిల్స్ లో వేయడం ఇష్టంలేక ఆయన పేరును చిట్టి
బాబుగా మార్చారు.అప్పటి నుంచే ఆయని పేరు చిట్టిబాబుగా
మారిపోయింది. 1950-1960 లలో నిర్మించిన తెలుగు ఇనిమాలలో
వీణ పాటలన్నిటికీ చిట్టీబాబు వీణ వాయించారు.భార్యాభర్తలు చిత్రం
లోని "ఏమని పాడెదనో ఈవేళ", డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని "పాడమని
నన్నడుగవలెనా"మొదలయిన పాటలకు వీణవాదనను చేసింది
చిట్టిబాబు గారే. అరవై దశకంనుంచి చిట్టిబాబు మద్రాసులోని ప్రసిద్ధ
కృష్ణగానసభలో మొట్టమొదటి కచేరీ చేశారు. మైసూరు మహారాజా
చే"వైణికశిఖామణి",టిటిడి వారిచే "సప్తగిరి సంగీత విద్వన్మణి",కేంద్ర
సంగీత నాటక అకడమీ ఎవార్డ్, తమిళనాడు ప్రభుత్వం "కలైమామణి"
లతో గౌరవించారు. విదేశాల్లో అనేక కచేరీలు చేశారు.ఆయన దాదాపు
ఇరవైఐదుకు పైగా ఎల్.పి రికార్డులు విడుదలచేసారు. "మ్యూజింగ్స్
ఆఫ్ మ్యుజీషియన్","రాధామాధవం","శివలీలావిలాసం" "వెడ్డింగ్ బెల్స్"
మొదలైనవి రికార్డులుగా హెచ్యమ్వీ విడుదల చేసింది. తిరువాయూర్
త్యాగరాజ ఆరాధనోత్సవాలలో ప్రతి ఏడాది క్రమం తప్పక
పాల్గొనే అయన ఒక ఏడాది ఎప్పటిలానే పాల్గొని వచ్చి, త్యాగరాజు
తనువు చాలించిన రోజు బహుళ పంచమి నాడే ఈయన 59 ఏళ్ళ
వయసులోనే 1996 ఫిబ్రవరి 9 వతేదీన ఆశేష అభిమానులను
దు:ఖసముద్రంలో ముంచి తనువు చాలించారు. ఆయన ఎల్ఫీలు
ప్లేయర్ పై వింటుంటే ఆ అనుభూతి మరువలేనిది.

4 comments:

  1. నా పదేళ్ళ వయసప్పుడు ,పన్నెండేళ్ళ వయసప్పుడు రెండు సార్లు ఆయన్ను చూడటం అయన కచేరి వినటం జరిగింది. గురువుగారికి తగ్గ శిష్యుడు. ఉదయాన్నే ఒక మంచి విద్వన్మణి గురించి గుర్తుచేసిన మీకు ధన్యవాదములు ..

    ReplyDelete
  2. గురువుగారూ,

    నా దగ్గర ఉన్న శ్రీ చిట్టిబాబు గారి అయిదు ఎల్.పీ లమిదా ఆయన ఆటోగ్రాఫ్ తీసికున్నాను. మొత్తం 8 కచెరీలకి ( పుణె, ముంబై, హైదరాబాద్) వెళ్ళాను.

    ReplyDelete
  3. ఫణిబాబుగారూ ,మీరెంత అదృష్టవంతులండీ! నేను
    నారాయణరెడ్డిగారు గానం చేసిన "కర్పూర వసంత
    రాయలు" ఎల్ఫీ మీద, యస్ఫీ పాడిన ఏల్ఫీ మీద
    బాలు గారి, "శంకరాభరణం" ఎల్పీ మీద కాశీనాధుని
    విశ్వనాధం గారి సంతకాలు తీసుకున్నాను. భాను
    మతి గారి సంతకం తీసుకోలేకపోయాను.అలానే
    చిట్టిబాబు గారి సంతకం కూడా! చిట్టిబాబుగారి
    ఎల్పీ రోజుకోసారయినా తప్పక వింటాను.

    ReplyDelete
  4. గురువుగారూ,

    శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, శ్రిమతి ఎం.ఎల్.వసంతకుమారి, శ్రీ చెంబై, శ్రీ లాల్గుడి జయరామన్, శ్రీ నామగిరిపెట్టై కృష్ణన్, శ్రీ బాలమురళి గార్ల ఎల్.పీ లమీద కూడా ఆటోగ్రాఫ్ లు తీసికున్నాను. ఈ ఒక్క విషయంలోనే అదృష్టవంతుడిని!

    ReplyDelete