Saturday, November 06, 2010

తెలుగు కవితా సాహితీ నిధి, దాశరధి!





చూపులకు పొట్టివాడైనా కవితా రచనలో బహు గట్టివాడు
దాశరధి. చిన్ననాటే నిజాంపాలన నియంతృత్వంపై తిరుగు
బాటు చేసి విప్లవ సమరం చేసిన ధైర్యశాలి.తన జీవితాన్ని
కవితకే అంకితం చేసి కవిగానే 1987 నవంబరు 5 తేదీన
కీర్తిశేషుడైన దాశరధి పూర్తి పేరు దాశరధి కృష్ణమాచార్య.
ఆయన సంస్కృతం,తెలుగు,ఉర్దూ భాషలలో కవితారచన
చేయగల ప్రతిభాశాలి. ఆచార్య ఆత్రేయ సారధ్యంలో నిర్మించిన
"వాగ్దానం": చిత్రంతో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది.
"నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాలు గెలవ నీరా"
అనే పాటతో దాశరధి సినీకవిత మొదలయింది."ఏ దివిలో
విరిసిన పారిజాతమో,ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో",
"నడిరేయి ఏ జాములో" అంటూ ఏడుకొండలస్వామి పై వ్రాసిన
పాట మరువలేనివి.తెరపై కూడా శ్రీ దాశరధి "చదువుకున్న
అమ్మాయిలు,"శభాష్ పాపన్న" చిత్రాలలో అగిపించారు. ఆయన
కలం నుంచి వెలువడిన చిత్రగీతాలలో, "రాము" చిత్రంలోని
"రారా క్రిష్ణయ్యా రారా క్రిష్ణయ్యా,దీనుల కాపాడా రారాక్రిష్ణయ్యా",
"లేతమనసులు" చిత్రంలోని "అందాల ఓ చిలుకా అందుకో నా
లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాల నీ దాకా", "మూగ
నోము" లోని "నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే,పగలైనా
రేయైనా ఎడారిలో ఒకటేలే","మేనకోడలు" లోని "తిరుమల
మందిర సుందరా సుమధుర కరుణా సాగరా","ఒకేకుటుంబం"
లోని "మంచినిమరచీ వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడూ"
సినీసాహిత్యంలో చిరకాలం వాడిపోని అద్భుత కవితాకుసుమాలు
దాశరధి మిర్జాఅసదుల్లాఖాన్ గాలిబ్ ఉరుదూ గీతాలను
గాలిబ్ గీతాలు పేరిట అనువందించారు "గాలిబ్ గీతాలు" శ్రీ బాపు
రెఖాచిత్రాలతో పుస్తకరూపంలో వెలువడింది.
"ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట యెంతో దుష్కరము సుమ్ము"
అని అనువదించారు దాశరధి. ఈ ప్రపంచంలో చాలా సులభంగా
జరగవలసిన పని కూడా చాలా కష్టంమీద జరుగుతుంది.అలానే
మనిషి మనిషిగా మారటం కూడా చాల కష్టమే అన్న గాలిబ్
రచన సులువుగా అర్ధమయేటట్లు చెప్పారు దాశరధి. మరో చోట
ఆయన అంటారు. "అన్ని రోగములకు నౌషధం బుండియు ప్రణయ
రోగమునకు కనము మందు".ఇలా సాగిపోతుంది కవితాప్రవాహం.
తన గాలిబ్ గీతాలను అక్కినేనికి అంకితమిస్తూ ఆయన ఇలా
అంటారు...
"మైత్రి యనెడి దివ్య సూత్రమ్ము బంధించె
నిన్ను నన్ను, మిన్ను మన్ను వోలె.
తారకా పధాల దనరు నీ చేయూత
ధరణి పైని నాకు దొరుక జాలె......ఇలా వ్రాస్తూ

నీ గళాన సమర్పింప నిమ్ము నన్ను
మేలి గాలిబు గీతాల పూలమాల" అంటూ
ముగిస్తారు. ఎమెస్కో బుక్స్ ,విజయవాడ వారు ప్రచురించిన ఈ
పుస్తకంలో కవితతో బాటు బాపుగారి బొమ్మలు అలరిస్తాయి.

3 comments:

  1. నా కంటి పాపలో నిలిచిపోరా
    నీ వెంట లోకాలు గెలవనీరా

    ఈ పాట నంబరు - నాకు నచ్చిన పాటల లిష్టులో మూడోది... పాట చిత్రీకరణ పరమాద్భుతం, పెండ్యాల గారి సంగీతం ఇంకా అద్భుతం, కృష్ణకుమారి, నాగేశ్వర రావు బ్రహ్మాండం...దాశరథీ సర్వంసహా నమోన్నమః

    ReplyDelete
  2. సురేఖప్పారావు గార్కి,
    దాశరథిగారి గాలిబ్ గీతాలు...ఉర్దూ గీతాలను
    తెలుగులో అందునా ఆటవెలది, తేటగీతి
    చందస్సులో అనువదించిడం....చాలా
    కష్టమైన విషయమని అంటారు. అయితే
    బాపుగారి బొమ్మ...దాశరథి పద్యం....
    తెలుగు భాషా పరిచయంలేని పారశీక
    కవులు బాపుగారి బొమ్మ ఆధారంగా
    గాలిబ్ ఉర్దూ గీతాలను చదివేరట. అంటే
    గాలిబ్ హృదయాన్ని కవి యెంత బాగా
    ఆవిష్కరించారు...అది పట్టుకొని చిత్రకారుడు
    యెంత బాగా సృష్టించారు. ఓహ్!
    'ఏల కాలునొచ్చెను బాలామణికి
    రేయి ఎవని స్వప్న సీమలకేగివచ్చె' ఎంత
    అందమైన భావన...ఎంత చక్కటి అనువాదం
    ఎంత చక్కటి బాపు.........అదే బొమ్మ.
    ఆంధ్రదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డలు..

    ReplyDelete
  3. నేను వ్రాయటం మరచిన విషయాలను గుర్తుచేసినందుకు
    చాలా సంతోషం హా(సం)నుమంతరావుమిత్రమా! నిజమే
    బాపూగారి బొమ్మలను చూసి భావాన్ని చెప్పగలిగారంటే
    అదెంతటి అద్భుతం!!

    ReplyDelete