Saturday, December 31, 2011

నేనూ-నా కార్టూన్ల పుస్తకం


 నేను కార్టూన్లు గీయటం నా SSLC క్లాసు నుంచే మొదలయినా పత్రికలో
                 మొట్టమొదటిసారి అచ్చయింది ఆంధ్రసచిత్రవార పత్రికలో 1958 లో.అంతకు
                  ముందు పట్టువదలని విక్రమార్కునిలా పంపేవాడినికానీ అంతే వేగంగా
                తిరుగు టపాలో తిరిగి వచ్చేవి. కార్టునిష్టులకు ప్రొత్సాహాన్నిచ్చిన మొదటి
                తెలుగు పత్రిక ఆంధ్రపత్రిక వీక్లీ. ఆ సంస్థ ప్రచురించే భారతి సాహిత్య మాస
                పత్రికలో మొట్టమొదటి తెలుగు కార్టూనిష్టు శ్రీ తలిశెట్టీ రామారావు గారి
                కార్టూన్లు 1931 నుంచే ప్రచురించే వారు . 1954లో ఆంధ్రవారపత్రిక దసరా
                సంచికకోసం పిల్లలకు బొమ్మల పోటీ పెడితే నేనూ, మా చెల్లి (కస్తూరి),
                అప్పుడు దాని వయసు పదేళ్ళు, బొమ్మలు పంపాము. "నేనూ, మాసంగీతం
                మాష్టారు" అన్న అది గీసిన బొమ్మకు ప్రధమ బహుమతి వచ్చింది, నా బొమ్మ
                తిరిగి వచ్చింది. చివరకు 1958 లో " నిశ్శబ్దం" అన్న నా సైలెంట్ కార్టూన్
                అచ్చయి ముచ్చటగా మూడు  రూపాయలు పారితోషికం వచ్చింది.
 అటు తరువాత  ఆంధ్ర వారపత్రికతో బాటు ఆంధ్రప్రభ , స్వాతి,ఆంధ్రజ్యోతి,
                ఆంధ్రభూమి పత్రికలలో నా కార్టూన్లు రావడం మొదలయింది. బాపు రమణ
                గారి రచనలు ఆంధ్రపత్రిక వీక్లీలో ఎక్కువ వచ్చేవి. శ్రీ బాపు అప్పుడప్పుడు
                "రేఖ" అనే పేరుతో కూడా వేసేవారు. ఆపేరుకు నేను "సు" చేర్చి సురేఖ
                కలం పేరుతో వేయడం మొదలెట్టాను. ఆ రోజుల్లో ఇండియన్ ఇంకుతో
                మాత్రమే బొమ్మలు వేయాలని నియమం వుండేది. ఎంతో కష్టపడి బొమ్మ
                వేసి, సన్నని క్రొక్విల్ పాళీ ఇంకులో ముంచి బొమ్మను దిద్దగానే ఇంకు
                ఒక్కసారిగా బొమ్మమీద ముద్దలా పడేది. నిజంగా ఏడుపొచ్చినంత
                పనయేది. నవ్వులు-పువ్వులు అనే హాస్య పత్రికలో నా కార్టూన్లు,
                పజిల్స్ రెగ్యులరుగా అచ్చయేవి. అటుతరువాత  మద్రాసు నుంచి ప్రచురించే
                "కినీమా" అనే సినిమా వార పత్రికలో ప్రతి వారం నేను సినిమా పజిల్
                నిర్వహించే వాడిని.



                2008లో మా ఇద్దరమ్మయిలు, అబ్బాయి నా కార్టూన్లతో ఓ పుస్తకం వేద్దామని
                నన్ను ఒప్పించారు. మా హాసం క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో హాసం పత్రిక
                స్థాపకులు, శాంతా బయో యండీ పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డిగారు నా
                "సురేఖార్టూన్స్" పుస్తకాన్ని అవిష్కరించారు. ఆ పుస్తకానికి ఆభరణం
                శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారు వ్రాసిన "జూబిలీబాయ్" జిందాబాద్ అంటూ
                వ్రాసిన ముందు పలుకులు. నా పుస్తకంలో రమణగారి ముందుమాట చదివిన
                మితృలు, ప్రముఖ కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ ఇలా అన్నారు" ముళ్ళపూడి
                వారి చేత ముందు మాట రాయించారు. ఎంత ముచ్చటగా పొందికగా వ్రాశారో.
                కార్టూన్ పుస్తకాలకి ముందుమాట రాయగలిగిన ఏకైక రచయిత ఆయనే.
                ఆ విధంగా మీరు చాలా అదృష్టవంతులు" ఈనాడు కార్టూన్ ఎడిటర్ శ్రీ శ్రీధర్
                గారు నా పుస్తకం ఆసాంతం శ్రర్ధగా చూశారు.మితృలు కార్టూనిస్ట్ సరసిగారు
                నా కార్టూన్ల పుస్తకం అందుకొని తన ఉత్తరంలో ఇలా అన్నారు"....ఈ సంవత్సరం
                నా రెండో పుస్తకం తెచ్చేప్రయత్నంలో ఉన్నాను. దానికి శ్రీ ముళ్లపూడివారి
                చేత ముందు మాట రాయిద్దాం అనుకున్నా, అయితే మీ పుస్తకం గడపకే
                రమణగారి తోరణాలు కట్టేసున్నాయి. ’ఆరిమీ’ అనుకున్నాను" ఇందరు
                ప్రముఖుల ఆదరాభిమానాలు అందుకున్న ఓ సామాన్యునిగా నేను దన్యుణ్ణి.


రాజమండ్రిలోని మా మితృలు డా"జోగేశ్వరరావుగారు వారి అమ్మాయి దగ్గరకు
                అమెరికా వెళుతూ వెంట నా సురేఖార్టూన్స్ పుస్తకాలు తీసుకొని వెళ్ళి అక్కడి
                స్నేహితులకు నా పుస్తకాలు అందజేశారు. ఏవిటీ వీడి సొంత గోల అనుకోకండి.
                నా అనుభూతులను ఆత్మీయులైన మీ అందరితో పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ
                కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పంచుకుంటున్నాను.

2 comments:

  1. అవును మీ కార్టూన్ చాలా బావుంది సురేఖ.
    కళాసాగర్

    ReplyDelete
  2. కళాసాగర్ గారు, ప్రవీణ్ శర్మ గారు ధన్యవాదాలు.

    ReplyDelete