Saturday, December 24, 2011

బాపూ రమణీయం !!




ఈ బాపూరమణీయం రెండు దశాబ్దాలక్రితం నవో (వ్వో)దయ వారు , ఏప్రియల్
1990 లో అచ్చోసి అభిమానులపైకి వదిలారు. యాభైలనాటి సినిమా రివ్యూలు
కార్టూన్లు, కార్ట్యూన్లు, జోకులు, మకతికలు, వగైరా కలిపి పాఠకులను రంజింప
చేసింది అపురూప పుస్తకం. దీని ఖరీదు మామూలు ఎడిషన్ అరవై రూపాయలు,
మేలు ప్రతి ధర ( గట్టి అట్టతో బైండింగు చేసినది) ఎనభైఐదు రూపాయలు. ఆ నాటి
శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు వ్రాసిన అద్భుత చనత్కారాల సమీక్షలు,జోకులు,
బాపు గారి కార్ట్యూన్లు,కార్టూన్లు ఎన్నెన్నో!

పుస్తకం వెనుక కవరు పై బాపుగారు, రమణగారు ఇలా వ్రాసారు :
నలభై ఏళ్లనాటి రాతలూ గీతలూ
దులిపి బజార్లో ఆరెయ్యడం
కల్తీలేని అహంకారం
-కొందరు
కాదులే పాపం !-మమకారం
-మరి కొందరు
అలా మాట సవిరించడం
అదోరకం చమత్కారం
-ఇంకొందరు
నిజానికిది ఏకారమో నిర్ణయించే
పాఠకులకి (వాళ్లది
యమ టేస్టు లెండి )
మా నమస్కారం
--బాపు
రమణ
(ప్రమోదూత)



ఇక ఈ బాపురమణీయం పుస్తకం మీద తెలుగు మాస్టారు, అదేనండి
హాస్యనటులు శ్రీ రావి కొండలరావు అవిష్కణ సభలో చేసిన అల్లరి ప్రసంగ
పాఠం సంక్షిప్తంగా మీ కోసం :

సైలెన్స్ ! ఎవడక్కడ నీకు తెలుసా?..బాపూరమణీయము అని పుస్తకం చూశాను.
ఏదో బిల్హణీయము,స్వారోచిషమను సంభవము అన్నట్లుగా,బాపూరమణీయము,
అనగా, ఆ కోవకు చెందిన ప్రబంధమో, గ్రంధమో అనుకున్నాను.తీరా చూస్తే
ఎప్పుడో వచ్చిన సినిమాల మీద సమీక్షలు ఇప్పుడెందుకయ్యా బాబ్జీ !దేనికి?
సైలెన్స్! ఇప్పుడా సమీక్షలు చదివి ఆ సినిమాలు ఎవడు చూస్తాడోయ్! అసలు
చూడ్డానికి అవేవి,ఎక్కడున్నాయి గనక? నిన్న వచ్చిన సినిమాయే నేడుంటం
లేదు-అలాటిది ఎప్పుడో 1950 ఆ ప్రాంతాల వచ్చిన స్నిమాలు ఇప్పుడు ఎక్కడ
వుంటాయి ఆ పాతతరం సినిమా సమీక్షలతో ఓ పెద్ద పుస్తకం! దేనికి? ఏమి
ప్రయోజనం ? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. అన్ని పేజీలు,అంత పుస్తకం
పైగా 60 రూపాయలా? " మేలు ప్రతి 85, ఫిమేలు ప్రతి 60?"అని, అతనెవరూ,
శ్రీ రమణా- శ్రీ రమణ అని అతని చమత్కారం ఒకటి !సైలెన్స్! తన పేరు ముందు
ఎవడైనా శ్రీ పెడతాడో పెట్టడో అని, ముందే తగిలించేసుకున్నాడు."శ్రీ రమణ"అని.
ఇందులో ఓ కధ. "రామారావు రోడ్డుమీద నడుస్తున్నాడు" రామారావు రోడ్డు
మీద నడవక, నా బుర్ర మీద నడుస్తాడ్రా రాస్కేల్!.... ఈ పుస్తకంలో "కార్ట్యూన్లు"
అని వున్నాయి.అదేమిటా మాట? నాకు తెలీకడుగుతున్నాను.కార్టూను, ట్యూను
కలిపిన మాటా? అలా కలిపితే "కార్టూన్ల్యూను" అవాలి.. మరి కార్ట్యూన్ ఏమిటయ్యా-
ఎవడివా తెలివితేటలు?ఐనా ఇంగ్లీషు అనబడే ఆంగ్ల భాషలో,సంధులెక్కడ
వున్నాయోయ్ ! సైలెన్స్! అరవై రూపాయలు పెట్టిన ఈ పుస్తకంలో అచ్చుతప్పులు
దిద్దేవాడే లేకుండా పోయాడు! అన్నీ అలా వదిలేశారు ! "దాఋణం"."హెచ్చెరుక",
"నెస్ట్ పిశ్చర్", "తప్పులో కాలేయడం,"జానపధ బాటసారి","కధాశివబ్రహ్మం",
"రేలంగిరిజ", "కధోచితంగా," ఇలా అక్షరాల తప్పులు కోకొల్లలు! మరోసారి ప్రిటింగ్ గా
వున్నప్పుడైనా ఇవన్నీ దిద్దుకోమను! అతనెవరు-బాపు, కార్టూన్లు అని వేశాడు.అన్నీ
వంకరటింకర బొమ్మలే, అలాటివి నేను మాత్రం వెయ్యలేనా-ఎవడైనా వేస్తాడు-
నీకు శక్తి వున్నప్పుడు "శ్రీరామ పట్టాభిషేకము","దమయంతీ స్వయంవరము" లాటివి
వెయ్యి.ఇవెందుకూ-ఈగీతలబొమ్మలు !ఓ బొమ్మలో ఆ పిల్లెవరో మేకప్ తుడుచు
కుందిట-ముక్కూ,కళ్ళూ పోయాయట! అదెలాగది? ముఖంమీద రంగు పోతుంది
గాని,అవెలా పోతాయి వోయ్ ! మరో బొమ్మలో భార్య "ఏ సినిమాకెళ్ళారూ" అని
అడిగింది. "బుడ్డిమంతుడు" అన్నాడు.అలాంటి ఎక్కడుందోయ్? "బుద్ధిమంతుడు"
అనుకుంటాను!.......ఇలా సరదాగా చేసిన ఆయన ప్రసంగం విని నవ్వుల్లో మునిగారు
అభిమానులంతా!!




బాపూగారు గీసిన నటి గిరిజ చిత్రం...

4 comments:

  1. కొండల రావు గారి ప్రసంగం అదరహో. అందించినందుకు మీకో వీరతాడు.

    ReplyDelete
  2. బాపూరమణీయం మెచ్చిన మీ అందరికీ ధన్యవాదాలండీ

    ReplyDelete