Thursday, July 11, 2013

మేధావులు వెలిగించిన జ్యోతి !

 1963 జనవరి 26 ! అప్పుడు మాకు ఎంత ఆనందమో!! రిపబ్లిక్ డే
అని కాదండి ! నండూరి రామమోహనరావు, ఆరుద్ర, బాపు-రమణ,
రావి కొండలరావు, విఏకె రంగారావు వీరంతా ఒకచోట కలసి "జ్యోతి"
ని విజయవాడలో వెలిగించిన మంచి రోజు. అవిష్కరించింది
నటసామ్రాట్ అక్కినేని నాగేశవరరావు గారు. ఆనాటి జ్యోతి నవ్వుల
వెలుగులను నెల నెలా తెలుగు పాఠకులకు మాటల, జోకులు,
కార్టూన్లతో "పంచి"Oది !!

 జ్యోతిలొని జోకులు, బాపు, గోపుల నవ్వుల బొమ్మలు అన్నీ కలిపి
1964  ఆగష్టు   లో జ్యోతి బుక్స్ పేరిట "రసికజన మనోభిరామము"
అను N2O పుస్తకాన్ని అచ్చేసి జనాలపైకి వదిలారు. 84 పేజీల
పైనే వున్న ఈ పుస్తకం వెల తెలుసు కుంటేనే పకపకా నవ్వుతారు.
ఒకే ఒక్క రూపాయి !! ఇప్పుడేమో మన రూపాయి విలువ మరీ మరీ
పడి పోతుంటే అప్పటి రూపాయి ఎంత జ్యోతిలా వెలిగిపోయిందో
చూశారా !!ఇక అసలు చెప్పోచ్చేదేమిటంటే ఈ ప్రత్యేక పుస్తకం
ముందు మాటలు కూడా నవ్విస్తాయి. ఆ పేజీకే రూపాయివ్వొచ్చు!
ఆ మాటలు చదవని వారి కోసం ఇక్కడ ఇస్తున్నాను.

 " ఇది జ్యోతి బుక్స్ వారి రెండవ ప్రచురణ.కొన్ని అనివార్య కారణాల
వల్ల దీన్ని ఆలస్యంగా వెలువరిస్తున్నందుకు మన్నించ మనవి.
"జ్యోతి"మాసపత్రికను మొదటి సంచికనుంచి చూస్తున్నవారు 
"ఇవన్నీ జ్యోతిలోవే" అనేస్తే అది అక్షరాలా రైటే ( ఆ మాటకొస్తే ఈ
పుస్తకం పేరుకూడా మాకంటేముందే కూచిమంచి తిమ్మకవి 
ఉపయోగించాడు. ముఖచిత్రం మీద తారలిద్దరూకూడా సరికొత్త
వారుకాదు,పాతవారే ) జ్యోతిలో వెలువడిన కార్టూన్లు,జోకులే ఇప్పుడు
పుస్తక వేషం ధరించి మిమ్మల్ని మరోసారి నవ్వించలేమా అనే 
ధీమాతో మీఎదట నిలబడుతున్నాయి
   అయినా జోకులకులంలో మంచి చెడ్డల భేదం తప్ప కొత్తపాతల
భేదం అంతగా లేదేమో. ఇదివరకు మీరు వినకపోతే జోక్ కొత్తదే :
ఇదివరకు విన్నా మళ్ళీ నవ్వొస్తే కొత్తదే; మీకు బాగా నచ్చితే కొత్తదే.
ఇక ఏది మంచి జోకు,ఏదికాదు అనేది మానవుడు నవ్వడం నేర్చిన
నాటినుంచి వస్తున్న ప్రశ్న.అసలు ఏది జోకో, కాదో చెప్పడం బ్రహ్మ
పదార్ధాన్ని నిర్వచించడమంత కష్టం- (గులాబీ పువ్వును గెర్ట్రూడ్
స్టీన్ నిర్వచించినట్టు,  A joke is a joke is a joke అని మాత్రం చెప్ప
వచ్చు). అందుచేత దానిజోలికి మేము పోవడంలేదు. అలాగే, నవ్వు
ఎట్లు పుట్టును, తెలుగువారికి హ్యూమరు కలదా లేదా, " పాండురంగ
మాహాత్మ్యము"లో జోకులున్నవా లేవా మొదలైన చిక్కుప్రశ్నలను
కూడా పండిత ప్రకాండులకే వదిలేస్తున్నాము. ఈ పుస్తకానికి మరో
పేరు N2O అనగా నైట్రస్ ఆక్సయిడ్ అనబడు "లాఫింగ్ గ్యాస్".
మీకు ఏమీ తోచనప్పుడు,కాసేపు నవ్వుకోవాలనిపించినప్పుడు,
మనసు అదోలా వున్నప్పుడు దీన్ని వాడిచూడండి. (అన్నినొప్పు
లకు హాస్యాంజనం అన్నారు పెద్దలు). మీ మిత్రులకు కానుకగా
ఇవ్వడానికి,(లేక కానుకగా స్వీకరించడానికి), ఏదైనా ఉత్తరం
వ్రాస్తున్నప్పుడు ఒత్తు పెట్టుకోడానికి ( తలగడగా పనికిరాదు )
కూడా ఇది పనికిరాగలదు."


ముందుమాటే ఇంత ముద్దుగా నవ్విస్తుంటే ఇక లోపలి పేజీలో!
ఈ పుస్తకం అరువిచ్చి చినిగిన అట్టతో నాకు తిరిగొచ్చిన ఈ పుస్తకాన్ని
చూడాలన్నా చదవాలన్నా మా ఇంటికి రండి ! ఎవ్వరికీ అరువు
ఇవ్వబడదు." నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను. అవిమీకిప్పుడు
పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి కాబట్టి ! అలానే నా పాతపుస్తకాల్ని
ఎవ్వరికీ ఇవ్వను. అవిప్పుడు నాకెక్కడా దొరకవు కాబట్టి." అదండీ
సంగతి.
( ఇందులోని బొమ్మలు జ్యోతి, జ్యోతి బుక్స్ ,రచన సాయిగారికి 
కితజ్ఞతలతో)

1 comment:

  1. మాసపత్రికారంగంలో జ్యోతి ఆవిర్భావం ఒక స్వర్ణ యుగానికి ఆరంభం!రమణ ఆదుర్తి వల్ల సినిమా రంగం మీద అలిగి బాపును వెంటబెట్టుకొని జ్యోతిలో చెరీ ఎన్నో కొత్త ప్రయోగాలు చేసి సంచలనం సృష్టించారు!ఆ తర్వాత కూడా సుధ అనే పత్రికను స్వంతంగా తీశారు కాని అదీ నిలదొక్కుకోలేకపోయింది!కాని వారు తొక్కిన కొత్తపుంతలు మాత్రం పత్ర్కల చరిత్రలో నిలిచిపోయాయి!

    ReplyDelete