Sunday, June 19, 2011

మా మంచి నాన్న !

ఈ రోజు నాన్నల రోజు ! ఎంత మంచి రోజు !! మమ్మల్ని పెంచి పెద్ద
చేసి మాకెన్నోమంచి అభిరుచులు నేర్పిన మా నాన్నగారు శ్రీ యమ్వీ
సుబ్బారావు పాతికేళ్ళ వయసులో స్టూడెంట్ గా వున్నప్పటిది ఈ ఫొటో.
ఈ ఫొటో మా నాన్నగారు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఇప్పుడు
స్టేట్ బ్యాంక్ ) లొ 1925 లో ఉద్యోగంలో చేరినప్పటిది .
1936లో మా అక్కయ్య వరలక్ష్మి సరోజినితో 36 ఏళ్ళ వయసులో.
ఇప్పుడు అక్కయ్య వైజాగ్ లో వుంది.
1948 లో అమ్మ, నాన్నలతో నేను, అక్కయ్య సరోజిని, చెల్లి కస్తూరి
(హైద్రాబాద్) రాజమండ్రిలో తీయించుకొన్న ఫొటో.
మా నాన్నగారికి పుస్తకాలంటే అమిత ఇష్టం. బ్యాంకు నుంచి రాగానే
(రాత్రి తొమ్మిది గంటలు దాటేది) పెర్రిమాసన్ లాంటి ఇంగ్లీషు నావల్స్
(ఆ రోజుల్లో అమెరికన్ పాకెట్ బుక్స్ వచ్చేవి), రీడర్స్ డైజెస్ట్ కండెన్స్డ్
బుక్స్ చదివేవారు. ఈ నాటి నా లైబ్రరీలో చాలా పుస్తకాలు నాన్నగారు
కొన్నవే. రీడర్స్ డైజెస్ట్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, టిట్ బిట్స్, పంచ్ లాంటి ఎన్నో
మాగజైన్స్ తొ బాటు ఆంద్రవారపత్రిక, చందమామ, బాల , గృహలక్ష్మిమొ"
పత్రికలు తెప్పించేవారు. చందమామలను ఏడాది కాగానే బైండ్ చేయించే
వారు మాకు పత్రికలలోని వీశేషాలు ప్రతి ఆదివారం చెప్పేవారు. గ్రామ
ఫోను పై పాటలు వినిపించే వారు. స్టాంపులు, నాణేలు కలెక్ట్ చేసేవారు.
ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ప్రఖ్యాత ఆర్టిస్టులు వేసిన చిత్రాలు కట్ చేసి ఆల్బమ్
తయారుచేశారు. ఆయన అభిరుచులు, అలవాట్లు నాకూ వచ్చాయి.
మాతో ఓ స్నేహితుడిలా కబుర్లు చెప్పేవారు. ఆదివారం మార్నింగ్ షోలకు
(ఆ రోజుల్లో ఇంగ్లీషు సినిమాలు ఉదయం ఆటలే వేసేవారు) నన్ను తనతో
తీసుకొని వెళ్ళేవారు. ఆయన కు బొమ్మలు గీయటం కూడా వచ్చు.
గుర్రం బొమ్మ చాలా బాగా వేసేవారు. ఇంతటి మంచి నాన్న తన 81వ ఏట
మమ్మల్ని ఒదలి వెళ్ళారు. ఆయన పుస్తకాలు, ఆర్ట్ కలెక్షన్స్ రోజూ చూసినప్పుడు
నాన్న నా ఎదుటే వున్నట్లు వుంటుంది. నాన్నల రోజున నాన్నలందరికీ నా
జేజేలు.

10 comments:

  1. మంచి జ్ఞాపకాలు పంచుకున్నారు అప్పారావుగారు. ధన్యావాదాలు. అందరికీ ఇలా పాత ఫొటోలు ఉండే అదృష్టం ఉండదు. ఫొటోలతో మీ నాన్నగరికి నివాళి అద్భుతంగా ఉన్నది.

    ReplyDelete
  2. శివరామప్రసాద్ గారు, ధన్యవాదాలండి.

    ReplyDelete
  3. ఫొటోలు , మీ నివాళి కూడా బాగుందండి .
    happy fathers day .

    ReplyDelete
  4. తల్లిదండ్రులనుంచి ఎంతో చరిత్రను సేకరించవచ్చు. కాని ఉద్యోగాలవల్ల వారికి దూరమయి ఎంతో కొల్పోతారు పిల్లలు. వీరు రిటైరయేనాటికి వారు వుండరు. చరిత్ర తెలియదు. ఉత్తరాల రాతకూడ లేదు. ఇప్పటి ఫొను మాటలు గాలిలొ కలిసిపోతాయి. చరిత్ర ఎవరికీ అక్కరలెదు. అప్పారావు గారూ,మీ నాన్నగారి ఫొటోలు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  5. బాగుంది...మీ నాన్నగారి అభిరుచులు, ఆసక్తులు కూడా.

    శుభాభినందనలు

    ReplyDelete
  6. మరచిపోలేని తలిదండ్రులను గుర్తు చేసుకోవడానికి ఒక రోజా అని అనిపిస్తుంది నాకు. కాని అందరితోపాటే మనమూనూ. నాకు తెలిసి మీరు మీ నాన్నగారిని తలవని రోజు లేదు. మీ పై ఆయన ప్రభావం చాలాఉంది అన్నది నా నిశ్చితమైన అభిప్రాయము.అది ఈ రోజు మీ బ్లాగు చదివాక మరల ఋజువైంది..
    నాన్నగారితో మీరు ఉన్న ఫోటో మీ ఇంట్లో చూస్తూనేవున్నాను కాని ముందరి ఫోటోలు చూసిన గుర్తులేదు....చివరి ఫోటోలో నేను చూసిన మీ నాన్నగారి పోలికలు గుర్తొచ్చాయి...
    మీరు కంభంవారి సత్రవువీధిలోని రీడింగ్ రూమ్ పైన ఉన్న ఇంటినుంచి ఇప్పుడున్న శ్రీరామనగర్ ఇంటికి వచ్చాక...మన స్నేహం చిక్కబడింది...అప్పటికే శ్రీరామనగర్ లో ఉన్న మేము మీకు పేటలో సుమారు 30ఏళ్ళ సీనియర్లం. ఎప్పుడు చూసినా నాన్నగారు నన్ను చాలా ఆప్యాయంగా పలకరించేవారు. మా నాన్నగారికి బి.పి.వుండేది.. ఎక్కువైనపుడు కళ్ళుతిరగడం, క్రింద పడుకొనిపోవడం... అలాంటపుడు చాలా బాధ పడేవారు..మీ నాన్నగారు చూడ్డానికి వచ్చి వెళ్ళేటప్పుడు నన్నుకూడా తీసుకెళ్ళిపాత రీడర్స్ డైజెస్ట్ లో బి.పి.విషయంలో వచ్చిన మంచి ఆర్టికల్ చూపి, అందులో సూచించిన జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని మా నాన్నగార్కి చెప్పమని... తలచుకుంటే ఆ ప్రేమకు ఇప్పుడు కూడా మనస్సు చెమ్మగిలుతుంది..నేను ట్రాన్సఫర్ పై చీపురుపల్లి వెళ్ళా..ఒకసారి వచ్చినప్పుడు నాన్నగారిని కలిస్తే "మీసం పెంచావు, వళ్ళు చేసావు" అంటూ చిరునవ్వుతో ఆప్యాయత... నవ్వుతారా నవ్వరా అన్నంత చిన్న నవ్వు, నెమ్మదిగా మాట్లాడేవారు.. మళ్ళీ ఆ మధురమూర్తిని గుర్తు చేసారు...
    బాగా వ్రాసారని అనడం కరెక్ట్ కాదు..ఎందుకంటే ఇవి నిజాలు.. తలచుకుంటే ఎప్పుడూ మధురానుభూతులు మిగులుస్తాయి...

    ReplyDelete
  7. అప్పారావు గారూ !
    నాన్నగారికి మీ నివాళి బాగుంది. అభినందనలు.

    ReplyDelete
  8. మీ నాన్న గారి ఫొటోలు, వారి ఙ్ఞాపకాల గురించి మీరు రాసిన విషయాలు కదిలించాయి.

    ReplyDelete
  9. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. మా అగ్రెగేటర్ http://teluguwebmedia.inలో గూగుల్ సెర్చ్ బాక్స్ సౌకర్యం కల్పించబడినది. మీరు అగ్రెగేటర్‌లోని పాత ఆర్కివ్‌లు సెర్చ్ బాక్స్ ద్వారా వెతుక్కోవచ్చు.
    ఇట్లు నిర్వాహకులు - తెలుగు వెబ్ మీడియా

    ReplyDelete