Monday, June 28, 2010

ఒరేయ్! బురుగూ ! ఇవ్వాళ మన నవ్వుల ముళ్లపూడి వారి పుట్టిన రోజురోయ్!!

ఈ రోజు మన బుడుగు పుట్టిన రోజురోయ్ !!

జూన్ 28, 1931 న రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ లో ఉన్న( ఇప్పుడు అక్కడ గార్డెన్స్ ఏవీ కనిపించవులెండి, ఏమంటే
ఇప్పుడవన్నీ "ఆల్ కట్ గార్డెన్స్") లేడీస్ హాస్పటల్లో ఓ చిన్నారి "బుడుగు" పుట్టాడు. ఆ బుడుగే పెరిగి పెద్దవాడై
మాటల చమత్ ’కారాల’తో నవ్వుల జల్లులు కురిపుస్తున్నారు. ఆయనే శ్రీ ముళ్లపూడి వెంకట రమణ. ఋణాలందహరి,
రాధాగోపాళం, గిరీశం లెక్చర్లు లాంటి అమోఘమైన రచనలతో అశేష పాఠకుల అభిమానాన్ని చూరగొన్నారు. చిన్ననాడే
బాపుగారు తోడై రమణ అంటే బాపు, బాపు అంటె రమణ అని స్నేహం అనె పదానికి స్మతి చిహ్ణం గా నిలచింది. ఆంధ్ర
వారపత్రికలో '56-57లలో వెలువడిన బుడుగు చిచ్చులపిడుగు తో చిన్నారులకు సహితం ప్రేమ పత్రులయ్యారు.
" దాగుడు మూతలు" లాంటి హాస్య చిత్రానికే కాకుండా "ఆలయ మణి" తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో తీసిన
"గుడిగంటలు" చితానికి అద్భుతమైన సంభాషణలు వ్రాసి మాటల రచయితగా కూడా పేరు పొందారు. ఆంధ్ర వార పత్రికలో
ఆయన వ్రాసిన సినిమా సమీక్షలు ఆలోచింపజేసేవిగా ఉండేవి. "సువర్ణసుందరి" చిత్రానికి సమీక్ష వ్రాస్తూ ఒక చోట
ఇలా అంటారు. "ఇ.వీ.సరోజ వేషంలో పార్వతీ దేవి" ఇక్కడి రమణ గారి చమత్కారం చూశారుగా!. నిర్మాతగా మారి,
శ్రీ బాపుతో అందాలరాముడు లాంటి ఆణిముత్యాలను అందించారు. ఆత్రేయతో కలసి మూగ మనసులుకు మాటలు
నేర్పారు. ప్రేమించిచూడు మొ" చిత్రాలకు పాటలు వ్రాశారు. శ్రీ రామోజీరావు నిర్మించిన శ్రీ భాగవతం చిత్రానికి మాటలు,
కొన్ని పాటలు వ్రాశారు. "స్వాతి" వార పత్రికలో ఆయన వ్రాసిన తన ఆత్మీయ కధతో ఈ నాటి పాఠకులకూ దగ్గరయ్యారు.
ఈ నాటి యువలోకం తమకు ఎదురయ్యే కస్టాలను నస్టాలను ధైర్యంగా ఎలా ఎదుర్కో వచ్చో తను వ్రాసిన "కోతికొమ్మచ్చి"
ద్వారా చూపించారు. కోతికొమ్మచ్చి మొదటి భాగం విడుదలైన నెలలోనే 3 ముద్రణలను అందుకోవడం అరుదైన విషయం.
శ్రీ ముళ్లపూడి రచనలన్నిటినీ శ్రీ యమ్బీయస్.ప్రసాద్ గారి సంపాదకత్వంలో 8 సంపుటాలుగా విశాలాంధ్ర ప్రచురణాలయం
ప్రచురించింది. ఈ నాటి పాఠకులకు ఆ నాటి ఆయన రచనలను చదివే అవకాశం ఈ పుస్తక ప్రచురణలవల్ల కలిగింది. మరో
విశేషం ’కోతొకొమ్మచ్చి’ శ్రీ యస్పీ.బాలుగారి మధుర స్వరం తో సీడీల రూపంలో వెలువడ్డాయి!ఆయన చెప్పే కధల్లో జంతు
జాలం కూడా వాటి భాషల్లోనే మాట్లాడతాయి. కాకులు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటాయి. వాటికి పాపం "రెక్కాడితేగాని
దొక్కాడదట.! చీమలేమో "పుట్ట"దీసి (అంటే మన భాషలో "కొంపదీసి"అన్నమాట) అంటాయి. ఇలా ఎన్నెన్నో భాషలు!
ఈ భాషలన్నీ మీరు నేర్చుకోవాలంటే ’ఋణాలందహరి" చదవాల్సిందే ! ఈ 28 తో ఆయన 80 లో ప్రవేశిస్తున్నా నిజానికి
ఆయన 8 ఏళ్ళ "బుడుగే"! ఆయనకు మనందరి తర్ఫున జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన మరిన్ని రచనలతో
పాఠకలోకాన్ని అలరిస్త్తారని ఆశిస్తూ............. యమ్వీ.అప్పారావు(సురేఖ) నవీ ముంబాయి..




3 comments:

  1. ఓళో !బుడుగోలా . మన బాపుతాతపుట్టిన రోజంట. శుభాకాంక్షలు నాతర్పునకూడా చెప్పవా ! అలాగే గుర్తుచేసిన అప్పారావు గారికి కూడా

    ReplyDelete
  2. బుడుక్కు నా తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. ఆల్లరి పిడుగు బుడుగు సృష్టికర్త ముళ్ళపూడి వారికి నా జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete